ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడని, దీన్ని ఎవరూ మార్చలేరని ఆమె స్పష్టం చేశారు. "నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టనే లేదు. అప్పుడే వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా, బెదురా అనేది వారికే తెలియాలి. నా కుమారుడికి రాజారెడ్డి అని నాన్నే స్వయంగా పేరు పెట్టారు. చంద్రబాబు చెప్పడం వల్లే నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకోసం కష్టపడి ఒక వీడియోను మార్ఫింగ్ చేశారు. అది చూసి నాకు నవ్వొచ్చింది. ఇంత కష్టం ఎందుకని? చంద్రబాబు చెబితేనే నా కొడుకు రాజకీయాల్లోకి వస్తే, మరి ఎవరు చెబితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలి," అని షర్మిల డిమాండ్ చేశారు.