AP: ప్రధాని రోడ్ షోకు బ్రహ్మరథం
మోదీ నామస్మరణతో మారుమోగిన విజయవాడ... చంద్రబాబు-పవన్‌లతో కలిసి అదిరే ర్యాలీ;
విజయవాడలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మున్సిపల్ మైదానం నుంచి బెంజిసర్కిల్ వరకూ సాగిన రహదారి ప్రదర్శనలో.. పెద్దఎత్తున ముూడుపార్టీల కార్యకర్తలు పాల్గొనగా అధినేతలు వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బెంజిసర్కిల్ వద్దకు రాజధాని రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాజధాని అమరావతికి మోదీ శంకుస్థాపన చేశారని, ఇటీవల రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని రైతులు ధీమా వ్యక్తంచేశారు.
విజయవాడ మోదీ నామస్మరణతో మారుమోగిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడలోని కీలకమైన బందర్‌రోడ్డులోని మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న భారత ప్రధాని ప్రచారం వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్‌షో నిర్వహించారు. ప్రధానితోపాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ సైతం రోడ్‌షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బెజవాడ జనసంద్రంగా మారింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అగ్రనేతలు ముందుకు సాగారు. ఎన్డీయే కూటమికి మద్దతుగా రాజధాని రైతులు, మహిళలు బెంజిసర్కిల్ వద్దకు భారీగా తరలివచ్చారు. రోడ్ షో ముగిసిన తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
విజయం ఖాయం
ఏపీ ప్రజలు కూటమి వైపే ఉన్నారని చెప్పడానికి విజయవాడ రోడ్‌షోకు పోటెత్తిన జనమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌షో మధురానుభూతిని కలిగించిందని ఆయన అన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుoడటం శుభపరిణామమన్నారు. భారీ ప్రజా స్పందన ఎంతో థ్రిల్ కలిగించిందని చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల అధినేతలు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాలు ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైoదన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్పష్టం చేశారు.