AP: జగన్‌ది... దగా ప్రభుత్వం: షర్మిల
కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్‌పై పోలీసుల ఉక్కుపాదం … షర్మిల అరెస్ట్ విడుదల;
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ డిమాండ్‌తో కాంగ్రెస్ చేపట్టిన ఛలో సెక్రటేరియట్"పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. అనేకమందిని గృహనిర్బంధం చేశారు. ఆంధ్రరత్న భవన్‌లో దీక్ష తర్వాత సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలకు... తీవ్ర ఆటంకాలు సృష్టించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 2లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన జగన్.... నిరుద్యోగులను నిండా ముంచారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండగా మెగా డీఎస్సీ అంటూ మభ్యపెట్టి... ఇప్పుడు దగా డీఎస్సీ వేశారని మండిపడ్డారు. మెగా డీఎస్సీ వేయాలంటూ చలో సెక్రటరీయేట్‌కు పిలుపునిస్తే.... విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో తనను నిర్బంధించడం దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను గృహనిర్బంధాలు చేయడం, అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆంధ్రరత్న భవన్‌లోనే షర్మిల నిరసనకు దిగారు.
కొద్దిసేపటి తర్వాత సచివాలయానికి బయలుదేరిన షర్మిలనుఉండవల్లి కరకట్ట సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఈడ్చివేయడంతో షర్మిల చేతికి గాయమైంది. కరకట్ట రోడ్డుపై బైఠాయించిన షర్మిల... శాంతియుత నిరసనలకు ఆటంకాలేంటని ఆగ్రహించారు. తమ నాయకురాలిని అడ్డుకోవడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం షర్మిలతోపాటు కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.... వ్యాన్‌లో ఎక్కించి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. కొంత సమయం తర్వాత 151 నోటీసు ఇచ్చి షర్మిలను విడుదల చేశారు.
అంతకముందు సీనియర్ నేతలు మస్తాన్ వలీ, తులసిరెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన వారిని ఎత్తుకెళ్లి పోలీసు వాహనాల్లో పడేశారు.