- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి చేశాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది… జ్యోతిరాదిత్య సింధియాను సురక్షితంగా తప్పించారు. మాధవ్ నేషనల్ పార్క్‌లోని చాంద్‌పాతా సరస్సు దగ్గర ఆకస్మిక రెస్క్యూ యాక్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివపురిలో ఓ కార్యక్రమానికి సింధియా హాజరయ్యారు. సభావేదిక మాధవ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా డ్రోన్లను వినియోగించారు. ఈ క్రమంలో తేనెతుట్టె కదిలింది. వెంటనే తెనేటీగలు అక్కడున్న వారిపై దాడి చేశాయి. కేంద్ర మంత్రి భద్రత సిబ్బంది వలయంగా ఏర్పడి.. సింధియాను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

మెగా హీరో రాంచరణ్ తేజ్.. కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. శంకర్ డైరెక్షన్ లో వస్తుండటంతో సినామా బాక్సఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా నుండి మూడో సింగిల్ సాంగ్ గా 'నానా హైరానా' అనే మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం మెలోడీ ట్యూన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాటకు 24 గంటల వ్యవధిలోనే 35 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కినట్లు మేకర్స్ తెలిపారు. 'గేమ్ ఛేంజర్'లోని పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) అనే విద్యార్థి చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే యూఎస్ వెళ్లాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. సాయితేజ మృతితో అతని స్వస్థలం రామన్నపేటలో విషాదం అలకుముంది. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్ధినులు పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళుతుండగా వారి బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందిన బస్సులో విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళుతుండగా, విద్యుదాఘాతంతో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. విద్యార్థినులు దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.

నాగాలాండ్ లో భూకంపం సంభవించింది. కిఫిర్ నగరంలో గురువారం ఉదయం 7:22 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కిఫిర్ ప్రాంతం చుట్టూ భూమికి 65 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, భవనాలు ఊగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొత్త సీఈఓగా ప్రముఖ క్షిపణి రంగ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ రాఘవేంద్ర జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ, ఎండీ అతుల్ దిన్‌కర్ రాణే పదవీకాలం ముగియడంతో ఈ స్థానంలో జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), రష్యాకు చెందిన మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను ఏర్పాటు చేశాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ బ్రహ్మోస్ క్షిపణులను తయారుచేస్తున్నది.

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (ఎస్వీ) జూలో మధు అనే రాయల్ బెంగాల్ టైగర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ టైగర్ రెండు నెలల నుంచి తగిన ఆహారం, నీరు తీసుకోవడం లేదని.. సోమవారం చనిపోగా.. ఎస్వీ వెటర్నరీ కళాశాల పాథాలజీ విభాగం డాక్టర్ల టీమ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. ఈ టైగర్ వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారన్నారు.
ఈ టైగర్‌ను 2018లో 11 ఏళ్ల వయసున్నప్పుడు కర్ణాటకలోని బన్నేరుగట్ట పార్క్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లపాటు జూ సంరక్షణలో ఉందని.. ఈ టైగర్ వృద్ధాప్యం కారణంగా రెండేళ్లుగా సందర్శకుల ప్రదర్శనకు దూరంగా ఉంచినట్లు తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దీంతో సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది.. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. అయితే, శక్తికాంత దాస్ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. కానీ, తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన తమిళనాడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పని చేశారు. కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పని చేసిన శక్తికాంత దాస్.. 2018లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదయింది. ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారని... చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవించిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యా కిరాయి సైన్యాన్ని నియమించుకుంటున్నది. ఓ ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యెమెన్ నుంచి వందలాది మంది యువతను అక్రమ మార్గాల్లో రప్పిస్తున్నది. దీనికోసం హౌతీకి అనుబంధంగా ఉన్న ఓ కంపెనీ సేవలను వినియోగించుకుంటున్నది. భారత్, నేపాల్ యువతను ప్రలోభపెట్టినట్లుగానే వీరిని కూడా అనేక ఆశలు చూపించి తీసుకొస్తున్నది. రష్యన్ పౌరసత్వంతోపాటు అత్యధిక జీతాలు ఇస్తామని చెప్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్, దాని మద్దతుగల ఉగ్రవాద సంస్థలతో రష్యాకు సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది.

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోనీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని నటుడు అలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఎక్మామిడి గ్రామపంచాయతీ సెక్రటరీ శోభారాణి నటుడు అలీకి నోటీసులు జారీ చేయగా, పనివారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫాం హౌస్‌లో నిర్మాణాలు ఎలా చేపట్టారు, వివరణ ఇవ్వాలని నోటీసులలో అధికారులు పేర్కొన్నారు. ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ నటుడు అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నటుడు అలీకి వ్యవసాయ భూమి ఉంది. వీలు ఉన్నప్పుడు అలీ తన కుటుంబంతో కలిసి సరదాగా అక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అలీ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అలీ ఫాం హౌస్ నిర్మించాడని అధికారుల దృష్టికి రావడంతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి అక్రమ నిర్మాణాల అంశంపై నటుడు అలీకి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 5న తొలిసారి నోటీసు ఇవ్వగా నటుడు అలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో నవంబర్ 22న అధికారులు రెండోసారి నటుడు అలీకి నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఫాం హౌస్‌లో పనిచేసే వారికి నోటీసులు అందించి, అలీకి సమాచారం చెప్పాలని చెప్పినట్లు పంచాయతీ సెక్రటరీ వెల్లడించారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పార్లమెంట్‌కు చేరుకున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరనుంది. కాగా పార్లమెంట్ వింటర్ సెషన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు తదితర అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తన చర్యలతో హల్చల్ చేస్తున్న అఘోరీ... కర్నూలు జిల్లాలో పెట్టుడు గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అఘోరీ గడ్డం, మీసాలతో కనిపించడం చర్చనీయాంశమైంది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి రావడం జరిగిందంటున్న అఘోరీ వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి వచ్చానని అఘోరి ప్రకటించడం కూడా సంచలనంగా మారింది. అఘోరి సనాతన ధర్మ రక్షణకు, లోక కల్యాణం కోసం జనంలోకి వచ్చానంటు చెప్పుకుంది. మంచిర్యాల జిల్లా కుష్నపల్లికి చెందిన అఘోరీ తను మహిళనని చెప్పినప్పటికి తర్వాత అమె తల్లి దండ్రుల కథనం మేరకు ట్రాన్స్‌జెండర్ గా మారిన శ్రీనివాస్ అని తేలింది. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లి అఘోరీ, నాగసాధువుగా మారింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా సంచరిస్తున్న అఘోరీ దేవాలయాలను సందర్శిస్తూ హల్చల్ చేస్తోంది.

వైసీపీ అధినేత జగన్ పై.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి సంచలన విమర్శలు చేశారు. ఆదానీ అక్రమాస్తుల్లో జగన్ లంచాల వాటా ఎంతా అని షర్మిల ప్రశ్నించారు. అదానీ- జగన్ అవినీతి బండారం బయట పడిందన్న ఆమె... లంచం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను తాకట్టు పెట్టేస్తారా అని మండిపడ్డారు. రాజకీయ అవినీతిపరుడిగా జగన్ పేరు బహిర్గతమైందన్న షర్మిల.. ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. పోర్టులను అప్పనంగా అదానీకి జగన్ అప్పగించారని షర్మిల మండిపడ్డారు. జగన్ అవినీతి అమెరికాలో బయటపడిందన్న షర్మిల.. జగన్ హయాంలో జరిగిన అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్య విడాకులపై గతకొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ నో కామెంట్స్ అంటూ సైలెంట్ గా ఉండటం ఇదికాస్త చినికి చినికి గాలి వానగా మారింది. తాజాగా అమితాబ్ తన కుటుంబ వ్యవహారాలపై తన బ్లాగ్ లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
గతకొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై వస్తున్న వార్తలపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన బ్లాగ్‌లో ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తన కుటుంబం గురించి చాలా అరుదుగా మాట్లాడతాడని, వారి గోప్యతను కాపాడుకోవడానికి తాను ఇష్టపడతానని అని రాసుకోచ్చారు అమితాబ్. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలను ఎలా రాస్తారంటూ రూమర్స్ ను స్ప్రెడ్ చేసే వ్యక్తుల మనస్సాక్షిని అమితాబ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తన కుటుంబ వ్యక్తిగత గోప్యతకు తాను భంగం కలిగించకూడదు కాబట్టి.. తను ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడనని తన బ్లాగ్ లో తెలిపారు బిగ్ బీ.
కాగా బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఎక్కడా ఈ విషయమై బహిరంగంగా కామెంట్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. తాజాగా తన కూతురు ఆరాధ్య బచ్చన్ 13వ ఏట అడుగుపెట్టిందని తల్లి,కూతురుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఐశ్వర్య . కానీ ఈ వేడుకల్లో ఐష్-అభిషేక్ కలిసి కనిపించకపోవడం చూస్తుంటే ఇవాళ కాకపోతే రేపైనా విడిపోతారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే తన కూతురు టీనేజ్ పార్టీకి తండ్రైనటువంటి అభిషేక్ బచ్చన్ ని ఆహ్వానించలేదని కామెంట్స్ చేస్తున్నారు.

జార్ఖండ్‌లో ఇవాళ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్నది. అయితే ఆ ఎన్నికలకు ముందే.. మావోయిస్టులు అయిదు ట్రక్కులకు నిప్పు పెట్టారు. లతేహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హెరాంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లాత్ అటవీ ప్రాంతంలో రాత్రి 1.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. లతేహర్‌లో బొగ్గు ప్రాజెక్టు వద్ద రవాణా కోసం వాహనాలకు నిప్పు పెట్టారు. బొగ్గును ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రక్కులకు నిషేధిత జార్ఖండ్ ప్రస్తుతి కమిటీ నిప్పు పెట్టినట్లు తెలిసింది. ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. వాహనాలను దగ్దం చేసిన కేసులో తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కరపత్రాలను వదలి వెళ్లారు. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వద్ద పనులు సాగాలంటే తమతో చర్చలు జరపాలని ఆ కరపత్రంలో మావోయిస్టులు పేర్కొన్నట్లు ఎస్పీ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది.. అయితే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు శనివారం కన్నుమూసిన విషయం విదితే.. దీంతో, ఢిల్లీ, మహారాష్ట్రల్లో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. నవంబర్ 20వ తేదీన వెలగపూడిలోని ఏపీ సచివాలయం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్..

అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ శనివారం ప్రారంభించారు. ఈ డిపోలో సుమారు 225 మంది సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను ప్రారంభించడం మంచిదే అయినా.. ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రికి తెలియ చేశారు. స్థిర వేతనం, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్‌లో తప్పులను సవరించే అవకాశం కల్పించింది. గతంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు www.schooledu.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెయ్యొచ్చు. అదనపు సమాచారం కావాలంటే.. అభ్యర్థులు 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ సూచించింది. దరఖాస్తులకు ఈ నెల 20 చివరి తేదీగా నిర్ణయించింది. జనవరి 1 నుంచి 20 వరకూ టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్)-కొల్లాం, ఈనెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం, 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లారు.వారు వెళ్లేసరికి ఆమె గదిలో శవమై కనిపించారు. వారు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెద్దఎత్తున యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను వీడినట్లు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఎన్నికల తర్వాత రోజు వెబ్‌సైట్‌లో తమ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు. అయితే ఈ మొత్తం సంఖ్య కేవలం వెబ్‌సైట్ యూజర్లది మాత్రమే అని, మొబైల్ యాప్ ద్వారా డీయాక్టివేట్ చేసిన యూజర్ల సంఖ్య కాదన్న వార్తలు ప్రచురితమవుతున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. ఈనేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్ దీన్ని వినియోగిస్తారని పలువురు పేర్కొంటున్నారు. గతంలో నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం, వెరిఫికేషన్ విధానాలను మార్చడం.. వంటి మస్క్ నిర్ణయాలు పెద్దఎత్తున విమర్శలకు దారితీశాయి. స్థాయితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం డబ్బులు చెల్లించేలా తీసుకొచ్చిన మార్పులతో ప్లాట్‌ఫామ్ ప్రకటనల వ్యాపారం దెబ్బతింది.

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. జగన్ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం దిల్లీకే పరిమితమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామ.. ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న కేజ్రీవాల్.. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు కేజ్రీవాల్ దంపతులను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని 17 ప్రదేశాలలో సోదాల నిర్వహించి, ఇద్దరు బంగ్లాదేశ్ చెందిన వారితో సహా నలుగురిని అరెస్టు చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన వారిని రోనీ మోండల్, సమీర్ చౌదరిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు నిందితులు పింటు హల్దార్, పింకీ బసు ముఖర్జీ. వీరిని కోల్‌కతాలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు జార్ఖండ్‌లోని రాంచీకి తరలిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్‌పోర్ట్‌లు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి పత్రాలు, నగదు, ఆభరణాలు, ప్రింటింగ్ పేపర్లు, ప్రింటింగ్ మెషీన్లు, ఆధార్‌ను ఫోర్జరీ చేయడానికి ఉపయోగించిన ఖాళీ ప్రొఫార్మాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. జార్ఖండ్ పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. కొంతమంది బంగ్లాదేశ్ చెందిన వారు “చట్టవిరుద్ధమైన మరియు అనైతిక కార్యకలాపాలు” చేయడానికి కొంతమంది ప్రైవేట్ ఏజెంట్లతో కలిసి అక్రమంగా భారతదేశానికి చేరుకున్నారని కేసులో పేర్కొన్నారు.

తెలుగువారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటని కస్తూరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసు కురావాలని కోరుతూ చెన్నైలో హిందూ మక్కల్ కట్చి సంస్థ ఒక ఆందోళన కా ర్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్లాది మంది తెలుగు వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడారు. దీనిపై తమిళనాడులోని తెలుగు వారు ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కస్తూరికి నోటీసులు జారీ చేసేందుకు పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. తాళం వేసి ఉండటాన్ని గుర్తించి.. ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. నటి కస్తూరిని గుర్తించేందుకు తమిళనాడు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణలో ఆరో గుడిలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిందంటూ అఘోరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు వస్తున్నాననీ.. పోలీసులు చెప్పిన మాటలు తాను విన్నానని.. తనకు ఇచ్చిన హామీని పోలీసులు, ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో లేడీ అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తనపై పెట్టిన నిఘా హిందూ ఆలయాలపై ఎందుకు పెట్టడం లేదని మండిపడింది. రేవంత్ ను సీఎం సీటు నుంచి ఎలా దింపుతానో చూడు అంటూ చిటికెలు వేసి హెచ్చరించడం విశేషం.

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాయి ప్రియ పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలసి క్యాంపస్ వసతి గృహంలోనే ఉంటుంది. సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్లు అల్పాహారం కోసం వెళ్లగా.. గదిలో సాయి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చే చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీయూకేటీకి ఇటీవల నూతన ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ నియామకం తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం తొలిసారి. పోలీసులు మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్ దేశానికి భారత ప్రభుత్వం రెండు ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్(ఎఫ్‌ఐసీ) బోట్లను కానుకగా అందజేసింది. ఈ నెల 8న మొజాంబిక్ ప్రభుత్వానికి అధికారికంగా వాటిని అప్పగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో మొజాంబిక్‌లో భారత రాయబారి రాబర్ట్ షెట్కింటంగ్, భారత్ కొత్తగా నియమించిన రక్షణ సలహాదారుడు కర్నల్ అత్రి, ఐఎన్‌ఎస్ ఘరియల్ కమాండింగ్ అధికారి కమాండర్ రజన్‌చిబ్, జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆగస్టో కశిమిరో పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ఘరియర్ ద్వారా బోట్లను ఆ దేశానికి తరలించారు. ఈ ఫాస్ట్ వాటర్ జెట్ ప్రొపల్షన్ బోట్లు సముద్ర జలాల్లో 45 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతాయని నేవీ వర్గాలు వెల్లడించాయి.

వెస్ట్ బెంగాల్‌లోని నవాల్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో రెండు కోచ్ లు పక్కకు ఓరిగాయి. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియలేదు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ బ్రాంచి లైనులో గూడ్స్ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్‌కు 59 ఖాళీ వ్యాగన్లతో వెళ్తుండగా డోర్నకల్ బ్రాంచి లైనులోకి ప్రవేశించగానే ఇంజిన్ వెనకాల 17,18,19 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రాంచి లైనులో ఈ సంఘటన చోటుచేసుకున్నందున రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. విషయం తెలియగానే వివిధ విభాగాల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఇంజిన్లు అమర్చి ముందున్న వ్యాగన్లను పోచారం వైపునకు, వెనకాలున్న వ్యాగన్లను పాపటపల్లి వైపునకు తీసుకెళ్లారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల పునరుద్ధరణ రాత్రి మొదలైంది.

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో ప్లాట్‌ఫామ్ నుంచి ఓ రైలు కదలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

బ్రిటన్ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బెంగళూరులో మెరిశారు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ కాఫీ షాప్‌లో సందడి చేశారు. స్థానికులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకున్నారు. రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఇటీవలే బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ షాప్‌లో కాఫీ డేట్‌ను ఆస్వాదించారు. ఇద్దరూ టేబుల్ వద్ద కాఫీని ఎంజాయ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆ సమయంలో కాఫీ షాప్‌కు వెళ్లిన స్థానికులు రిషి సునాక్ జంటను చూసి థ్రిల్ అయ్యారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రిషి సునాక్ 2022 నుంచి 2024 వరకు యూకే ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి చవి చూసింది

పుష్ప హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సన్నిహితులతో కలిసి ఆమె వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులు అభిమానులు సెల్ఫీలు దిగారు

డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్‌లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్‌స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్‌కు సంబంధించిన మెసేజ్‌లను సెపరేట్‌గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్‌కూ సెపరేట్ ఫోల్డర్‌ను ఇన్‌స్టా యాడ్ చేసింది.

కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.మొత్తం రెండు నెలల్లో కలిపి 24 మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే నవంబర్ నెలలో అన్ని డేట్లలో ఫంక్షన్ హాల్స్ పూర్తి బుక్ అయ్యయని.. ఈ రెండు నెలల్లో దాదాపు దేశ వ్యాప్తంగా అరకోటి జంటల పెళ్లిళ్లు అవుతాయని.. దీని కారణంగా.. రూ. 6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com