- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్)-కొల్లాం, ఈనెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం, 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లారు.వారు వెళ్లేసరికి ఆమె గదిలో శవమై కనిపించారు. వారు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెద్దఎత్తున యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను వీడినట్లు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఎన్నికల తర్వాత రోజు వెబ్‌సైట్‌లో తమ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు. అయితే ఈ మొత్తం సంఖ్య కేవలం వెబ్‌సైట్ యూజర్లది మాత్రమే అని, మొబైల్ యాప్ ద్వారా డీయాక్టివేట్ చేసిన యూజర్ల సంఖ్య కాదన్న వార్తలు ప్రచురితమవుతున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. ఈనేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్ దీన్ని వినియోగిస్తారని పలువురు పేర్కొంటున్నారు. గతంలో నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం, వెరిఫికేషన్ విధానాలను మార్చడం.. వంటి మస్క్ నిర్ణయాలు పెద్దఎత్తున విమర్శలకు దారితీశాయి. స్థాయితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం డబ్బులు చెల్లించేలా తీసుకొచ్చిన మార్పులతో ప్లాట్‌ఫామ్ ప్రకటనల వ్యాపారం దెబ్బతింది.

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. జగన్ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం దిల్లీకే పరిమితమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామ.. ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న కేజ్రీవాల్.. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు కేజ్రీవాల్ దంపతులను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని 17 ప్రదేశాలలో సోదాల నిర్వహించి, ఇద్దరు బంగ్లాదేశ్ చెందిన వారితో సహా నలుగురిని అరెస్టు చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన వారిని రోనీ మోండల్, సమీర్ చౌదరిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు నిందితులు పింటు హల్దార్, పింకీ బసు ముఖర్జీ. వీరిని కోల్‌కతాలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు జార్ఖండ్‌లోని రాంచీకి తరలిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్‌పోర్ట్‌లు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి పత్రాలు, నగదు, ఆభరణాలు, ప్రింటింగ్ పేపర్లు, ప్రింటింగ్ మెషీన్లు, ఆధార్‌ను ఫోర్జరీ చేయడానికి ఉపయోగించిన ఖాళీ ప్రొఫార్మాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. జార్ఖండ్ పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. కొంతమంది బంగ్లాదేశ్ చెందిన వారు “చట్టవిరుద్ధమైన మరియు అనైతిక కార్యకలాపాలు” చేయడానికి కొంతమంది ప్రైవేట్ ఏజెంట్లతో కలిసి అక్రమంగా భారతదేశానికి చేరుకున్నారని కేసులో పేర్కొన్నారు.

తెలుగువారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటని కస్తూరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసు కురావాలని కోరుతూ చెన్నైలో హిందూ మక్కల్ కట్చి సంస్థ ఒక ఆందోళన కా ర్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్లాది మంది తెలుగు వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడారు. దీనిపై తమిళనాడులోని తెలుగు వారు ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కస్తూరికి నోటీసులు జారీ చేసేందుకు పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. తాళం వేసి ఉండటాన్ని గుర్తించి.. ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. నటి కస్తూరిని గుర్తించేందుకు తమిళనాడు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణలో ఆరో గుడిలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిందంటూ అఘోరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు వస్తున్నాననీ.. పోలీసులు చెప్పిన మాటలు తాను విన్నానని.. తనకు ఇచ్చిన హామీని పోలీసులు, ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో లేడీ అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తనపై పెట్టిన నిఘా హిందూ ఆలయాలపై ఎందుకు పెట్టడం లేదని మండిపడింది. రేవంత్ ను సీఎం సీటు నుంచి ఎలా దింపుతానో చూడు అంటూ చిటికెలు వేసి హెచ్చరించడం విశేషం.

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాయి ప్రియ పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలసి క్యాంపస్ వసతి గృహంలోనే ఉంటుంది. సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్లు అల్పాహారం కోసం వెళ్లగా.. గదిలో సాయి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చే చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీయూకేటీకి ఇటీవల నూతన ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ నియామకం తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం తొలిసారి. పోలీసులు మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్ దేశానికి భారత ప్రభుత్వం రెండు ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్(ఎఫ్‌ఐసీ) బోట్లను కానుకగా అందజేసింది. ఈ నెల 8న మొజాంబిక్ ప్రభుత్వానికి అధికారికంగా వాటిని అప్పగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో మొజాంబిక్‌లో భారత రాయబారి రాబర్ట్ షెట్కింటంగ్, భారత్ కొత్తగా నియమించిన రక్షణ సలహాదారుడు కర్నల్ అత్రి, ఐఎన్‌ఎస్ ఘరియల్ కమాండింగ్ అధికారి కమాండర్ రజన్‌చిబ్, జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆగస్టో కశిమిరో పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ఘరియర్ ద్వారా బోట్లను ఆ దేశానికి తరలించారు. ఈ ఫాస్ట్ వాటర్ జెట్ ప్రొపల్షన్ బోట్లు సముద్ర జలాల్లో 45 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతాయని నేవీ వర్గాలు వెల్లడించాయి.

వెస్ట్ బెంగాల్‌లోని నవాల్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో రెండు కోచ్ లు పక్కకు ఓరిగాయి. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియలేదు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ బ్రాంచి లైనులో గూడ్స్ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్‌కు 59 ఖాళీ వ్యాగన్లతో వెళ్తుండగా డోర్నకల్ బ్రాంచి లైనులోకి ప్రవేశించగానే ఇంజిన్ వెనకాల 17,18,19 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రాంచి లైనులో ఈ సంఘటన చోటుచేసుకున్నందున రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. విషయం తెలియగానే వివిధ విభాగాల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఇంజిన్లు అమర్చి ముందున్న వ్యాగన్లను పోచారం వైపునకు, వెనకాలున్న వ్యాగన్లను పాపటపల్లి వైపునకు తీసుకెళ్లారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల పునరుద్ధరణ రాత్రి మొదలైంది.

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో ప్లాట్‌ఫామ్ నుంచి ఓ రైలు కదలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

బ్రిటన్ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బెంగళూరులో మెరిశారు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ కాఫీ షాప్‌లో సందడి చేశారు. స్థానికులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకున్నారు. రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఇటీవలే బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ షాప్‌లో కాఫీ డేట్‌ను ఆస్వాదించారు. ఇద్దరూ టేబుల్ వద్ద కాఫీని ఎంజాయ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆ సమయంలో కాఫీ షాప్‌కు వెళ్లిన స్థానికులు రిషి సునాక్ జంటను చూసి థ్రిల్ అయ్యారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రిషి సునాక్ 2022 నుంచి 2024 వరకు యూకే ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి చవి చూసింది

పుష్ప హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సన్నిహితులతో కలిసి ఆమె వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులు అభిమానులు సెల్ఫీలు దిగారు

డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్‌లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్‌స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్‌కు సంబంధించిన మెసేజ్‌లను సెపరేట్‌గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్‌కూ సెపరేట్ ఫోల్డర్‌ను ఇన్‌స్టా యాడ్ చేసింది.

కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.మొత్తం రెండు నెలల్లో కలిపి 24 మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే నవంబర్ నెలలో అన్ని డేట్లలో ఫంక్షన్ హాల్స్ పూర్తి బుక్ అయ్యయని.. ఈ రెండు నెలల్లో దాదాపు దేశ వ్యాప్తంగా అరకోటి జంటల పెళ్లిళ్లు అవుతాయని.. దీని కారణంగా.. రూ. 6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్నారని, 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు. కాగా క్రిష్ గతంలో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టితో ‘ఘాటీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు.

కేరళలోని ఐఏఎస్ అధికారులను మతపరంగా విభజించి, ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కే గోపాలకృష్ణన్ (ఐఏఎస్) ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను హ్యాక్ చేసి, తనను కొత్త వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్‌గా చేర్చారని ఆరోపించారు. ‘మల్లు హిందూ అధికారులు’, ‘మల్లు ముస్లిం అధికారులు’, మరికొన్ని గ్రూపులను క్రియేట్ చేశారని చెప్పారు. అక్టోబరు 30న మల్లు హిందూ అధికారుల గ్రూపును క్రియేట్ చేసి, దానిలో హిందూ ఐఏఎస్ అధికారులను చేర్చారని, దీని ఔచిత్యంపై చాలా మంది అధికారులు ప్రశ్నించడంతో దీనిని కొద్ది గంటల్లోనే డిలీట్ చేశారని తెలుస్తున్నది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్- 29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అప్రమత్తమైన పైలట్ కిందకు సురక్షితంగా బయటపడ్డారు. విన్యాసాల కోసం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయల్దేరిన ఈ ఫైటర్ జెట్ ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన చోట విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మిగ్-29 విమానం ఇలా కుప్పకూలిన ఘటనలు గతంలోనూ జరిగాయి. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మేర్‌లో శిక్షణ నేపథ్యంలో మిగ్- 29 ఫైటర్ జెట్ కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానం కూలడానికి ముందే సురక్షితంగా బయటపడ్డారు.

అక్కినేని నాగ చైతన్య-శోభితల పెళ్లి పనులు మొదలవడంతో వెడ్డింగ్ వేదిక ఎక్కడనే చర్చ మొదలైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు రాగా అందుకు భిన్నంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు ఫ్యామిలీలు పెళ్లి పిలుపులను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్ 4న వీరి వివాహం జరుగుతుందని టాక్.
ఇక సమంతో నాగ చైతన్య విడిపోయిన తరువాత శోభిత మ్యాటర్ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో తిరుగుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలారు. అయితే వీరిద్దరి మీద వచ్చిన వార్తలను, డేటింగ్ టాక్‌ను అంతా నమ్మారు. కానీ చైతూ మాత్రం ఇదంతా రూమర్ అన్నట్టుగా కొట్టి పారేశాడు. వేరే అమ్మాయిని ఎందుకు మధ్యలోకి లాగి ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ ఆ మధ్య మాట్లాడాడు.

ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూతపడ్డాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఆర్నెలల తర్వాతే ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. ఈ ఆర్నెలలు ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబాకి ఆరాధన, దర్శనం నిర్వహిస్తారు.
శీతాకాలం ప్రారంభం కావడంతో చార్ ధామ్ ఆలయాలు మూతపడుతున్నాయి. శనివారం గంగోత్రి ధామ్ తలుపులను మూసివేయగా.. ఆదివారం కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. అలాగే యమునోత్రి ఆలయ తలుపులను మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేశారు. శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేస్తారు. ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర తుదిదశకు చేరుకుంది. నవంబర్ 1 వరకూ 15 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. భక్తులు జ్యోతిర్లింగాలను సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ వేసవికాలంలోనే ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపర్రులో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని సినీ నటుడు సుమన్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గ్రామానికి చెందిన బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు కోమటి అనంరావు తీవ్రంగా పడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా దవాఖానకు తరలించారు.మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సానుభూతి ప్రకటించారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కడవంత గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్. ఒరెగ్యాన్ హ్యాపీవాయలీకి చెందిన గ్యారీ 555.2 కేజీల గుమ్మడికాయలోని గుజ్జును తీసి పడవగా మార్చాడు. దీంతో కొలంబియా నదిలో వాషింగ్టన్‌లోని నార్త్ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్ వరకు ప్రయాణించాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్ రికార్డుగా నమోదు చేశారు. స్వతాహాగా భారీ సైజులో గుమ్మడికాయలు పెంచడం గ్యారీకి అలవాటు. 2013లో అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానిక పోటీలో బహుమతి గెల్చుకున్నాడు.

కర్ణాటకలోని చిక్కమగళూరులో విషాదం చోటు చేసుకుంది. దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు. నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే వార్షిక క్రతువులో అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. కొండపైకి వచ్చే భక్తుల భద్రత కోసం చిక్కమగళూరు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ భారీగా తరలిరావడంతో ఇబ్బందులుపడ్డారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికి సహాయంగా రష్యాకు ఉత్తర కొరియా సైన్యాలను పంపించిందని నాటో సోమవారం నిర్ధారించింది. కొన్ని సైన్యాలు రష్యా కుర్స్ రీజియన్‌లో దిగాయని, అక్కడ నుంచి ఉక్రెయిన్‌లో చొరబాటుకు రష్యా యుద్ధం సాగిస్తోందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రటిల్ పాత్రికేయులకు వివరించారు. దీనివల్ల రష్యా యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. బ్రసెల్స్‌లో నాటో ప్రధాన కార్యాలయంలో 32 మిత్ర దేశాల రాయబారుల సమావేశంలో దక్షిణ కొరియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమీక్ష నిర్వహించిన సందర్భంగా నాటో ఈమేరకు ప్రకటించింది.
రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. అసలు కిమ్ సైన్యం మద్దతు తీసుకోవడం రష్యా బలహీనతను తెలియజేస్తోందని ఎద్దేవా చేసింది.

ఫిలిప్పీన్స్ లో ట్రామీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. సోమవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య దాదాపుగా 150కి చేరుకుంది. మరో 70 మంది గల్లంతయ్యారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. తుఫానుతో బికోల్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 38 మంది చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. తుపాన్ ట్రామీ ధాటికి ఆ దేశంలో భారీ వినాశనం జరిగింది. అక్టోబర్ 24 నుంచి మొదలైన తుపాను ధాటికి ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 5 లక్షల మందికి పైగా తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన సినిమా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన పెద్దమనసు చాటుకున్నారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తిని దగ్గరుండి 108లో ఆస్పత్రికి తరలించారు. జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలతో పడిఉండటాన్ని గమనించారు. దాంతో జానీ మాస్టర్ తన కారు ఆపి..108కి ఫోన్ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. జానీ చేసిన సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసుల ఒత్తిడిలో ఉండి కూడా ఇలా సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ ప్రమాణం చేశారు.

హైదరాబాద్ అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ టపాసుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపావళి పర్వదినానికి ముందు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు.
జనగామలోనూ..
జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విజయ షాపింగ్ మాల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కాంప్లెక్స్ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి. రూ.15 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 12 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అగ్నిమాపకశాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో బ్యాంక్ లాభం రూ.11,746 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంక్ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం (NII) 9.5శాతం పెరిగి రూ.18,308 కోట్ల నుంచి రూ.20,048 కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97శాతానికి తగ్గాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆస్తులు 2.48శాతంగా ఉండేవి. నికర నిరర్థక ఆస్తులు 0.43శాతం నుంచి 0.42శాతానికి చేరాయని వెల్లడించింది.

భారీ వర్షాలతో తమిళనాడులోని ప్రధాన నగరాలు అతలాకుతలమయ్యాయి. ఏడు జిల్లాలకు వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. కొద్ది రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతుండగా తాజాగా దానా తుపాను ప్రభావం కూడా కనిపిస్తోంది. రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధురైలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మదురైలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలించింది. సహాయక చర్యలను చేపట్టింది. మదురై కలెక్టర్‌తో ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

శంషాబాద్ నుంచి వైజాగ్‌కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్‌లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్‌లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించనున్నారు.
ఏపీ, తెలంగాణలో మొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది. సికింద్రాబాద్ -విశాఖ మధ్య ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఒకటి.. నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గం రెండోది.

తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రాజ్ పార్క్ హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేశ్ అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇంచార్జి రవి మందలపు, ఐటీ సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్ మండవ, సురేశ్ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం పలికిన ఉన్నారు.
ఇక 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గంలో తిరుమల వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తితిదే శుక్రవారం ఓ ప్రకటనలో సూచించింది. ‘60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల, గుండె సంబంధిత వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదు. తిరుమల సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవాలి. కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1,500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్యసహాయం పొందవచ్చు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటలూ వైద్యసాయం అందిస్తారు. కిడ్నీల సమస్య బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం పొందవచ్చు’ అని తితిదే పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com



