Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదు- చంద్రబాబు
Chandrababu: జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.;
Chandrababu: జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో జీరో అయ్యారని ఎద్దేవా చేశారు. ఏం సాధించారని జగన్ మళ్లీ గెలుస్తారని అనుకుంటున్నారని ప్రశ్నించారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. నెత్తిన పెట్టుకున్న వైసీపీ కుంపటిని ఎప్పుడు దింపెయ్యాలా అని ప్రజలు చూస్తున్నారన్నారు. రంగం ఏదైనా సరే.. నాడు-నేడుపై చర్చకు తెలుగుదేశం సిద్ధమని సవాల్ విసిరారు చంద్రబాబు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జగన్ ఉలిక్కి పడ్డారన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌కు అర్థం అయిందని.. దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. . పన్నుల భారంతో ప్రజలను బాధపెడుతున్నారంటూ ఫైర్ అయిన చంద్రబాబు.. నీటిపారుదల, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకు జగన్ ను మళ్లీ గెలిపించాలా? అని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలిచేసినందుకు జగన్‌కు అధికారం తిరిగి కట్టబెట్టాలా?'' అని ప్రశ్నించారు చంద్రబాబు.
పన్నుల భారంపై ప్రజల ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. జగన్‌కు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా.. ఇదేం బాదుడు, ఇదేం పాలన అంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఒకప్పుడు ఇంటిపన్ను 3వేల రూపాయలు కట్టే జనం.. జగన్ పాలనలో ఏకంగా 5700 కట్టాల్సి వస్తోందని కామెంట్ చేశారు చంద్రబాబు. ప్రభుత్వ పన్ను పోటుపై సగటు మనిషి ఆవేదన పేరుతో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ట్వీట్ చేసిన వాయిస్ రికార్డు మెసేజ్‌ను జత చేస్తూ రీట్వీట్ చేశారు.
మరోవైపు.. నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థలు నడిపితే కుదరదని టీడీపీ నేతలను హెచ్చరించారు చంద్రబాబు. ఒక నియోజకవర్గ ఇంఛార్జి... ఇంకో నియోజకవర్గం వ్యవహారాల్లో వేలు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లో ఇంఛార్జికి వ్యతిరేకంగా గ్రూపులు కడితే సహించేది లేదని.. ఇంఛార్జి కూడా అందరినీ కలుపుకొని పని చేయాలని సూచించారు. ఈ మూడేళ్లు బయటకు రాని కొంత మంది నేతలు.. ఇప్పుడు తెలుగుదేశం గెలుపు ఖాయమని తెలిసి ఉత్సాహంగా పని చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు.