చిట్టి న్యూస్

TTD: కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు దీపాలి సుబ్రమణ్యం... ప్రయాగ్‌రాజ్‌కు అక్కడి వెళ్లారు. దీపాలి సుబ్రమణ్యం ఉన్నట్టుండి అదృశ్యమైనట్లుగా తోటి ఉద్యోగులు గుర్తించారు. దాదాపు టీటీడీ నుంచి సుమారు 250 మంది సిబ్బంది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు డిప్యుటేషన్‌పై వెళ్ళినట్లుగా సమాచారం. ఎంతకీ సుబ్రమణ్యం ఆచూకీ లభించకపోవడంతో తోటి ఉద్యోగులు దారాగంజ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్రమణ్యం ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు.

TIRUMALA: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం

తిరుమలలో మళ్లీ చిరుత సంచరించడం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేసింది. చిరుత.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ల సమీపంలోనే సంచరిస్తున్నట్లు టీటీడీ, అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు హితవు పలికారు. తిరుమలలో మరోసారి చిరుత సంచరిస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Employees Prioritize Family : కుటుంబమే ముఖ్యమన్న ఉద్యోగులు.. సర్వేలో వెల్లడి

వారంలో ఎక్కువ గంటలు పని చేయాలన్న దానిపై ఇటీవల కాలంలో చాలా చర్చ జరుగుతోంది. వారానికి 72 గంటల పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి సూచించారు. ఎల్ అండ్ టీ చైర్మన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటల పని గురించి మాట్లాడారు. వీరి అభిప్రాయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇలాంటి పని గంటలపై ఉద్యోగులు అభిప్రాయాలను సేకరించింది ఓ సంస్థ. సర్వేలో 78 శాతం మంది ఉద్యోగులు తమకు కుటుంబమే ముఖ్యమని తేల్చి చెప్పారు. దీని తరువాతే ఏదైనా అని నిక్కచ్చిగా చెప్పేశారు. ప్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్ పేరుతో ఈ సర్వే నివేదికను జాబ్ సైట్ ఇండీడ్ విడుదల చేసింది. 

Adulterated Jaggery : కల్తీ బెల్లాన్ని గుర్తించేందుకు ఈజీ టిప్స్.

మీరు ఏ డెజర్ట్ చేసినా, చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల అది రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. బెల్లాన్ని భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మార్కెట్లో కల్తీ బెల్లం ఎక్కువైంది. కల్తీ బెల్లం తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం, కాబట్టి బెల్లం నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

బెల్లం అంచు డిజైన్‌ను బట్టి అది అసలైనదా లేదా నకిలీదా అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన బెల్లం తేలికగా, మృదువుగా, కొద్దిగా జిగటగా ఉంటుంది. ఈ బెల్లం సులభంగా విరిగిపోతుంది. కానీ కల్తీ బెల్లం గట్టిగా ఉండి రుబ్బుకోవడం కష్టంగా మారుతుంది.

బెల్లం సల్ఫర్ సమ్మేళనాలతో కల్తీ చేయబడిందో లేదో పరీక్షించడం సులభం. కాబట్టి,

ఒక బెల్లం ముక్కను నీటిలో కరిగించాలి. దానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. ఈ సమయంలో బుడగలు కనిపిస్తే, బెల్లం కల్తీ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

స్వచ్ఛమైన బెల్లం రంగు గోధుమ లేదా పసుపు. బెల్లం రంగు చాలా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంటే దానికి కృత్రిమ రంగులు కలిపినట్లు.. కాబట్టి ఒక చిన్న ముక్కను నీటిలో కరిగించాలి. నీటి రంగు మారితే, దానికి

రంగు వేసి కల్తీ చేశారని అర్థం చేసుకోండి.

స్వచ్ఛమైన బెల్లం రుచిలో తియ్యగా ఉండి మట్టి వాసనను కలిగివుంటుంది. కానీ బెల్లం అతి తీపిగా లేదా కారంగా ఉంటే అది కచ్చితంగా కల్తీ బెల్లం.

స్వచ్ఛమైన బెల్లం వేడి చేసినప్పుడు అది కరిగి చిక్కటి ద్రవంగా మారుతుంది. కానీ బెల్లం కల్తీ అయితే వేడి చేసినప్పుడు చక్కెర స్ఫటికాలు లేకుండా ఒక అవశేషాన్ని వదులుంది. అలా ఉంటే బెల్లంలో రసాయనాలు కలిపారని అర్థం. ఇలా రకరకాల పద్ధతుల్లో కల్తీ బెల్లాన్ని గుర్తుపట్టొచ్చు.

Building Collapses: ఢిల్లీలో కూలిన భవనం, ఎంతమందిని రక్షించారంటే?

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కూలింది. బురారీ ప్రాంతంలోని ఆస్కార్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో కౌశీక్‌ ఎన్‌క్లేవ్‌ అనే భవనం సోమవారం రాత్రి 7 గంటలకు కుప్పకూలింది. పోలీసులు, అగ్నిమాపక, ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందా లు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.

శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని రక్షించి ఆసుపత్రికి  తరలించాయి. రక్షించిన వారిలో ఆరు, 14 ఏండ్ల అమ్మాయిలిద్దరు ఉన్నారని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. మరో 10 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని తమ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా, పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్టు తెలిపారు.

Jacqueline Trendy Look : జాక్విలిన్ ట్రెండీ లుక్.. సోషల్ మీడియాలో వైరల్.

శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సు ప్రాక్టీస్ చేస్తోంది. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ కార్యక్రమానికి జాక్వెలిన్ హాజరైంది. తనదైన ప్రదర్శనతో అలరించింది. జాక్వెలిన్తో పాటు, సోను నిగమ్, బి ప్రాక్ వంటి ఇతర తారలు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. జాక్విలిన్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో అద్భుతమైన నృత్యంతో అలరించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. జాక్విలిన్ వేషధారణ, ట్రెడిషనల్ లుక్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. జాక్విలిన్ ధరించిన స్పెషల్ డ్రెస్ క్రిస్టల్స్ ఎంబ్రాయిడరీతో అత్యంత భారీతనంతో డిజైన్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లుక్ లో జాకీ అభినవ నాట్యమయూరన్ని తలపిస్తోందంటున్నారు అభిమానులు. తీహార్ జైలులో ఉన్న కాన్మేన్ సుకేష్ చంద్రశేఖర్ ప్రేమలేఖలు రాస్తూ జాక్విలిన్ పై ప్రేమను కురిపించడంతో అది మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిందీ భామ.

Divorce Impact : తల్లిదండ్రుల విడాకులు.. పిల్లల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం డబుల్

తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే పిల్లల బాధ వర్ణనాతీతం. సరైన ప్రేమ దొరక్క ఎంతో సతమతమవుతారు. అయితే విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల 13,000 మందిని సర్వే చేశారు. శాశ్వత కుటుంబాల్లో పెరిగిన వారి కంటే విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు 60 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారని సర్వేలో తేలింది. ఈ వ్యక్తులలో డిప్రెషన్, మధుమేహానికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని.. ఇవన్నీ స్ట్రోక్ అవకాశాన్ని పెంచుతాయని అధ్యయనం తెలిపింది.

మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళం పగిలిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. రెండు సందర్భాల్లోనూ, మెదడులోని భాగాలు దెబ్బతింటాయి. ఒక స్ట్రోక్ శాశ్వత మెదడు దెబ్బతినడం, దీర్ఘకాలిక వైకల్యం లేదా మరణానికి కారణమవుతుంది. చిన్నతనంలో శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురైన వారికి, విడాకులు తీసుకున్న కుటుంబాలలో మద్దతు లేకుండా పెరిగిన వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ఎస్మే ఫుల్లర్-థామ్సన్ అన్నారు.

తల్లిదండ్రుల విడాకులు, స్ట్రోక్ మధ్య సంబంధం యొక్క పరిమాణం పురుషులు - స్త్రీలలో ఒకేలా ఉండదు. వీటన్నింటికీ విడాకులే కారణమని చెప్పలేము. తల్లిదండ్రుల విడాకులు నిరాశ, మధుమేహం, మాదకద్రవ్య వ్యసనం, ధూమపాన వ్యసనానికి దారితీస్తాయి.

స్ట్రోక్ లక్షణాలు

ముఖం, చేయి లేదా ఒక కాలు అకస్మాత్తుగా తిమ్మిరి లేదా బలహీనత, ఆకస్మిక గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది, ఒకటి లేదా రెండు కళ్ళలో ఆకస్మికంగా దృష్టి లోపం, నడవలేకపోవడం, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి, ఒక చేతిలో బలహీనత లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించాలి.

Republic Day:  భారత ప్రజలకు అమెరికా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్‌, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. భారత రాజ్యంగం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పునదిగా గుర్తింపు పొందాడాన్ని నమ్ముతామని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా ప్రజల మధ్య శాశ్వతమైన స్నేహం, సహకారం మన ఆర్థిక సంబంధాలను ముందుకు నడుపుతుందుని విశ్వసిస్తున్నామని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలతో సహా రానున్న సంవత్సరాల్లో మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

YCP: రాజ్యసభకు మరో వైసీపీ ఎంపీ గుడ్ బై..?

విజయసాయిరెడ్డితో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రాజ్యసభ చైర్మన్ కు అయోధ్య రామిరెడ్డి రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంకీ గ్రూపునకు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొన్ని కీలక జిల్లాల వైసీపీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. ఆయన కూడా రాజీనామా చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారా లేకపోతే పదవికి మాత్రమే రాజీనామా చేసి వైసీపీలోనే ఉంటారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో వీరు ఇలా రాజీనామాల నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. పదవి కాలం ఇంకా ఐదేళ్ల వరకూ ఉన్నా వీరు హఠాత్తుగా ఎందుకు పదవులు వదులుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామిరెడ్డి మాత్రం బీజేపీలో చేరుతారని అంటున్నారు. ఆయన మళ్లీ ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికవుతారన్న ప్రచారం జరుగుతోంది. 

Cricketer Virender Sehwag : విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్ సెహ్వాగ్?

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు తెలిపింది. రెండు వారాల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే వారిలో ఆర్తి ఎక్కడా కనిపించలేదు. 2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు. గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు బలం చేకూరుస్తోంది.

1980 డిసెంబరు 16న జన్మించిన ఆర్తి, లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్ మరియు భారతీయ విద్యాభవన్ నుండి తన విద్యను అభ్యసించింది. ఢిల్లీ యూనివర్సిటీలోని మైత్రేయి కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. సెహ్వాగ్ , ఆమె ప్రేమకథ 2000 సంవత్సరంలో కొనసాగింది. 2004లో, వారిద్దరూ మాజీ ఆర్థిక మంత్రి మరియు ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అంటే DDCA, అరుణ్ జైట్లీ నివాసంలో వివాహం చేసుకున్నారు.

Heroine Colors Swathi : హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకులు?

సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.

తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా తమిళ్‌, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మద్యలో గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నారు. 2018లో వికాస్‌ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్లకే ఆయన నుంచి విడి పోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టి పారేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు, వికాస్‌తో ఉన్న ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరూ విడి పోయారు అంటూ బలంగా ప్రచారం జరిగింది.

Indore: బిచ్చమేశాడని కేసు బుక్ చేసిన పోలీసులు

దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్‌లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్‌లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి కేసు ఇదే కావడం విశేషం. నేరస్థునికి ఒక ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేలు వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. దేశంలోనే మొదటి బిచ్చగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఇండోర్‌ అధికారులు నిర్ణయించారు. కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 10 నగరాలను భిక్షాటన రహిత నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టును ఇండోర్‌లో అమలు చేస్తున్నారు. బిచ్చగాళ్ల సమాచారం చెప్పినవారికి రూ.1,000 బహుమతి ఇస్తున్నారు.

AP: రాజమండ్రిలో బోల్తా పడ్డ బస్సు

ఏపీలోని రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 50 మందితో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు దివాన్‌ చెరువు (Diwan Cheruvu) హైవేపై అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కోమలి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

కాకినాడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లా తాళ్లరేవు పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, బైకు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ GGHకి తరలించారు. బైక్ ని ఢీ కొట్టిన బొలెరో వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Encounter: జమ్మూ కాశ్మీర్‌ బారాముల్లాలో ఎన్‌కౌంటర్..

 జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. బారాముల్లా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. బారాముల్లాలోని సోపోర్ సెక్టార్‌లో భద్రతా దళాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కాల్పుల్లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) యొక్క 179వ బెటాలియన్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

upreme Court: ఇద్ద‌రు సుప్రీంకోర్టు జ‌డ్జీల కాల్చివేత‌

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సాయుధ దాడి జ‌రిగింది. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో ఇద్ద‌రు జ‌డ్జీల‌ను కాల్చిచంపారు. మొహ‌మ్మ‌ద్ మొగిషు, హోజ‌తొలెస్లామ్ అలీ రైజిని అనే జ‌డ్జీలు మృతిచెందారు. దాడిలో గాయ‌ప‌డ్డ మ‌రో జ‌డ్జికి ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నారు. షూటింగ్‌కు పాల్ప‌డిన త‌ర్వాత దుండ‌గుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి చెందిన మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉన్న‌ది.

రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే 25 వేలు

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానలకు తరలించి, ప్రాణాలను కాపాడేవారిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.5,000 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది.

దీనిని ఐదింతలు పెంచి రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. నాగ్‌పూర్‌లో రోడ్డు భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు అనుపమ్‌ ఖేర్‌తో కలిసి గడ్కరీ పాల్గొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి ఏడు రోజులు చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చును రూ.1.5 లక్షల వరకు ప్రభుత్వం భరించనున్నట్టు గడ్కరీ చెప్పారు.

Nara Lokesh: నామినేటెడ్ పోస్టులపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు

నామినేటెడ్ పదవులపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పర్యాయాలు ఒక పదవిలో కొనసాగిన తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలి.. లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, తాను కూడా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలుగా పనిచేయాలని అన్నారు. అందరి ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకుంటామని నారా లోకేశ్ వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు పొలిట్‌బ్యూరో వరకు వచ్చే అవకాశం ఉంటుందని అప్పుడే పార్టీ బలపడుతుందని లోకేశ్ అన్నారు. నెల రోజుల్లో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామన్న నారా లోకేశ్... ఎలాంటి షరతులూ లేకుండా ఎన్డీయేలో టీడీపీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మూడు పార్టీల కలయికతో రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను లోకేశ్ ప్రారంభించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నివాసంలో టీడీపీ నేతలు.. కార్యకర్తలతో లోకేశ్ సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు.

Delhi Drugs : ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్

 ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 21 కోట్ల రూపాయల విలువ చేసే 1400 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచిన లేడి కిలాడితో మరో ప్రయాణీకుడు.. ఇద్దరి వ్యవహార శైలిలో అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్.. తమ దైన స్టైల్ లో ప్రశ్నించిన కస్టమ్స్.. పొట్టలో దాచిన కొకైన్ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. సదరు వ్యక్తిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం లేడి కిలాడి పొట్టలో 58 క్యాప్సూల్స్.. మరో ప్రయాణీకుడు దగ్గర 105 క్యాప్సూల్స్ బయటకు తీసిన వైద్యులు.. బ్రెజిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న బ్రెజిల్ జాతీయులపై NDPS యాక్ట్ ప్రకారం కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP: భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరి మృతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరసింహాపురం గ్రామం సమీపంలో లినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మృతులు అన్నమయ్య జిల్లాకు చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)గా గుర్తించారు. భక్తులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరిశింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. 108 అంబులెన్స్‌ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Encounter:  ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో మరోసారి కాల్పులు..

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పూర్‌-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వావోయిస్టుల కాల్పుల్లో డీఆర్‌జీ కానిస్టేబుల్‌ చనిపోయారు. శనివారం అర్ధరాత్రి అబుబ్‌మడ్‌లోని అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (DRG), సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల కాల్పుల్లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్‌ కానిస్టేబుల్‌ సన్ను కరమ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిళ్లు (SLR) స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.అయితే, ఇంకా భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Imran Khan:  చివరి  వరకు పాక్‌లోనే ఉంటా: ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ‌ఖాన్ కీలక పోస్టు చేశారు. తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం వచ్చినా తాను అంగీకరించలేదని ఇమ్రాన్‌ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు మూడేళ్ల కాలానికి దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం వచ్చిందని.. అందుకు తాను అంగీకరించలేదన్నారు. తాను పాక్‌లోనే ఉంటా. ఇక్కడే కన్నుమూస్తానని ప్రకటించారు. తన మాట ఒక్కటేనని.. పార్టీ నేతలను, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు తర్వాతే తన వ్యక్తిగత పరిస్థితి గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై సుమారు 200 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అడియాలా జైల్లో ఉన్నారు. తోషఖానా, సైఫర్‌.. తదితర కేసులకు సంబంధించి ఏడాది కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Actress Seetha Mother : సినీ నటి సీత తల్లి కన్నుమూత

సీనియర్ నటి సీత తల్లి చంద్రమోహన్ (88) కన్నుమూశారు. చెన్నైలోని సాలిగ్రామంలోని తన స్వగృహంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు చంద్రావతి కాగా, పెళ్లయ్యాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు, తమిళ సినిమాలతో పాటు సీరియళ్లలో నటిస్తూ పాపులర్ అయ్యారు. చెన్నైకి చెందిన పీఎస్‌ మోహన్‌బాబును వివాహం చేసుకుని, ఇక్కడకు వచ్చేశారు. అనంతరం ఆమె తన పేరును చంద్రమోహన్‌గా మార్చుకున్నారు.

Rajagopala Chidambaram:  ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం క‌న్నుమూత‌

ప్ర‌ముఖ అణు శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రాజ‌గోపాల చిదంబ‌రం  క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ముంబై జ‌స్‌లోక్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజగోపాల చిదంబ‌రం మృతి ప‌ట్ల శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తున్నారు.

అణు శాస్త్ర‌వేత్త‌గా త‌న కెరీర్‌ను చిదంబ‌రం ప్రారంభించారు. పొఖ్రాన్‌-1(1975), పొఖ్రాన్‌-2(1998) అణు ప‌రీక్ష‌ల్లో రాజ‌గోపాల చిదంబ‌రం కీల‌క‌పాత్ర పోషించారు. అణుశ‌క్తి క‌మిష‌న్‌కు చైర్మ‌న్‌గా సేవ‌లందించారు. రాజగోపాల‌కు 1999లో ప‌ద్మ‌విభూష‌ణ్‌, 1975లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు వ‌రించాయి. భార‌త ప్ర‌భుత్వానికి శాస్త్రీయ స‌ల‌హాదారుగా ప‌ని చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్(BARC) డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్‌(AEC) చైర్మ‌న్‌గా సేవ‌లందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ(DAE) సెక్ర‌ట‌రీగా విధులు నిర్వ‌ర్తించారు. 1994-95 మ‌ధ్య కాలంలో ఇంట‌ర్నేష‌న‌ల్ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ(IAEA) గ‌వ‌ర్న‌ర్ల బోర్డుకు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Chinmoy Krishna Das: చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాక‌రించిన బంగ్లాదేశ్ కోర్టు

బంగ్లాదేశ్ ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బెయిల్ నిరాక‌రించారు. చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిర‌స్క‌రిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇరు ప‌క్షాల నుంచి సుమారు 30 నిమిషాల పాటు వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆయ‌న తీర్పు వెలువ‌రించారు. బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్న‌ట్లు చిన్మ‌య్ త‌ర‌పు న్యాయ‌వాది అపూర్వ కుమార్ భ‌ట్టాచార్జీ తెలిపారు.

అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయ‌ర్లు.. ఇవాళ మెట్రోపాలిట‌న్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం త‌మ వాద‌న‌ల‌ను బ‌లంగానే వినిపించినా.. కోర్టు మాత్రం చిన్మ‌య్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను హ‌జ్ర‌త్ షాజ‌లాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

Jharkhand: భార్యతో గొడవ, బావిలో దూకిన భర్త, కాపాడబోయి మరో నలుగురు మృతి

భార్యతో గొడవ భర్తతో పాటు మరో నలుగురి ప్రాణాలను తీసింది. బావిలో దూకిన వ్యక్తిని రక్షించేందుకు యత్నించిన మరో నలుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. సుందర్ కర్మాలి అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడిన తర్వాత బావిలో దూకాడు.

కోపంతో తన మోటార్ సైకిల్‌ని బావిలోకి పోనిచ్చాడు. సుందర్ కర్మాలి బావిలో పడిన తర్వాత, అతన్ని రక్షించే ప్రయత్నంలో మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. అయితే, విషాదకరంగా మొత్తం ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ తెలిపారు. మృతులను రాహుల్ కర్మాలి (26), వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి , సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Tragic Accidents : న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం

న్యూ ఇయర్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో చర్చి నుంచి బైక్‌పై ఇంటికెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు, బెజ్జూర్‌లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోని జమ్మలమడుగు(మ) చిటిమిటి చింతల వద్ద డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు.

అలాగే నూతన సంవత్సరం వేళ బాపట్ల జిల్లాలోనూ విషాద ఘటన చోటు చేసుకుంది. అద్దంకి-నాగులపాడు రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వచ్చిన బైక్‌లు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో అద్దంకికి చెందిన బి.అజయ్(39) మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Pawan Kalyan Childrens : ఆటోలో పవన్ కళ్యాణ్ పిల్లల జర్నీ

తండ్రి పవన్ కల్యాణ్ ఒక స్టేట్ కు డిప్యూటీ సీఎం, ఒక సూపర్ స్టార్ అయినా ఆయన పిల్లలు అకీరా నందన్, ఆద్య మాత్రం ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటున్నారు. సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి అకీరా, ఆద్యలు వారణాసికి వెళ్లారు. అక్కడున్న ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అకీరా పూర్తిగా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారణాసిలో అకీరా, ఆద్యలు ఆటోల్లో ప్రయాణిస్తూ ఆలయాలను దర్శించారు. వీరిని కొందరు అభిమానులు గుర్తించి, వీడియోలు తీశారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలను విలాసాలకు దూరంగా, సామాన్య జీవితం అర్థమయ్యేలా పెంచుతున్న రేణుదేశాయ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.

Constable : మాజీ కానిస్టేబుల్‌ ఇంట్లో కోట్లులో ఆస్తులు

మధ్యప్రదేశ్‌ రవాణా శాఖకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్‌ నివాసాలలో సోదాలు జరిపిన వివిధ దర్యాప్తు సంస్థలకు దాదాపు రూ.14 కోట్ల నగదు, రూ.40 కోట్ల విలువైన బంగారం, రూ.2 కోట్ల విలువైన వెండి,రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు లభించాయి. మాజీ కానిస్టేబుల్‌ సౌరభ్‌ శర్మ ఇంటిపై గత వారం లోకాయుక్త మొదటిసారి దాడి జరపగా రూ. 2.87 కోట్ల నగదు, 275 గ్రాముల వెండితోసహా రూ.7.98 కోట్ల చరాస్తులు లభించాయి. ఆదాయ పన్ను శాఖ మరోసారి దాడి జరపగా రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.11 కోట్లకు పైగా నగదు భోపాల్‌లో ఒక నిర్జన ప్రదేశంలో వదిలివేసిన కారులో లభించాయి.

Maharashtra: తల్లి ఫోన్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య..వాడి వయస్సు

తల్లి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలుడు తన పుట్టినరోజు కానుకగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, తల్లి నిరాకరించింది. దీంతో పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. మిరాజ్ నగరంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుడిని విశ్వజీత్ రమేష్ చందన్వాలేగా గుర్తించారు. తల్లి, సోదరి నిద్రిస్తున్న సమయంలో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశ్వజీత్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. తల్లిని మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, ఆర్థిక సమస్యల కారణంగా తల్లి కొనివ్వలేకపోయింది. మరుసటి రోజు బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో కుప్పకూలిన విమానం

 అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను కూడా దెబ్బతీసింది.

విమానంలో ఉన్న ఇద్దరు పైలట్ అగస్టిన్ ఆర్ఫోర్టే (35), కో-పైలట్ మార్టిన్ ఫెర్నాండెజ్ లోజా (44) లు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అఫుపు చేసేందుకు స్థానిక రహదారులను మూసివేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

KESHAV: పెండింగ్ నిధులు విడుదల చేయాలి: పయ్యావుల కేశవ్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. గత ఐదేళ్లలో 93 కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే ప్రత్యేక గ్రాంట్‌ పెండింగ్‌ నిధులు ఇవ్వాలని మంత్రి పయ్యావుల కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు విడుదల చేయాలని మంత్రి పయ్యావుల విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అవసరమని నిర్మల దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. అలాగే గత ఐదేళ్లలో దాదాపు 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయలేదని, ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్‌కు మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 73 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీలో పునరుద్ధరించినట్లు ఆయన చెప్పారు. గత ఐదు నెలల కాలంలో 73 కేంద్ర పథకాలకు ఏపీ ప్రభుత్వ వాటా సమకూర్చినందున.. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేశవ్‌ కోరారు. కేంద్రం నుంచి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్‌ నిధులు సైతం విడుదల చేయాలని, వీటితోపాటు వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంటునూ వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు.

Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌ కథువాలో భారీ అగ్నిప్రమాదం

 జమ్ముకశ్మీర్‌లోని కథువాలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివనగర్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని చికిత్స నిమిత్తం కథువాలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఇంటికి మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Bigg Boss Winner : బిగ్‌బాస్ విన్నర్‌‌కు ఎంత వచ్చాయంటే?

తెలుగు బిగ్ బాస్ 8 విజేతగా నిలిచిన నటుడు నిఖిల్ మలియక్కల్ మైసూర్ లో జన్మించారు. తల్లి నటి, తండ్రి జర్నలిస్టు కావడంతో చిన్నప్పటి నుంచి డాన్స్, సినిమాలపై ఆసక్తి కలిగింది. నటనపై ఇష్టంతో ఉద్యోగం వదిలేశారు. 2016లో ఊటి చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్‌మాలో వచ్చే గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్‌తో తెలుగు వారిని అలరించారు.

బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ కు నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందించారు. దీంతో పాటు మారుతీ సుజుకీ డిజైర్ కారును గిఫ్ట్‌గా అందించారు. వీటితో పాటు ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నందుకు వారానికి రూ.2.25లక్షల చొప్పున 15 వారాలకు రూ.33.75 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా కారుతో పాటు రూ.88 లక్షలు వెనకేశాడు నిఖిల్.

Road Accident: అమెరికా  రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి దుర్మరణం పాలయ్యారు. పట్టణానికి చెందిన వ్యాపారి గణేశ్-రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. పరిమళ మృతి విషయం తెలిసి తెనాలిలోని ఆమె ఇంటి వద్ద విషాదం అలముకుంది. పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపేందుకు ‘తానా’ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

PV Sindhu : ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అని ఓ కోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఇక సింధుకు కాబోయే వరుడు విషయానికి వస్తే.. వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్‌. పొసిడెక్స్‌ టెక్నాలజీస్‌లో అతను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా సింధు, వెంకట సాయి కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లితో అది మరింత పటిష్ఠం కానుంది. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడనున్నది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించారు పీవీ సింధు తండ్రి. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 22న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 20 నుంచి సింధు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలుకానున్నాయి.

upi: భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు... గణాంకాలు ఇవిగో!

భారత్‌లో డిజిటల్ (యూపీఐ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ ఏడాది జరిగిన డిజిటల్ లావాదేవీలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ రూ.15,547 కోట్ల లావాదేవీలు జరగ్గా, రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. భారత్ ఆర్ధిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోందని పేర్కొంది. ఇది భారత్ ఆర్ధిక పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.