- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు.

గ్వాటెమాలా మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచు టుమ్, మెక్సికో రాజకీయ నేత, వ్యాపారవేత్త విక్టర్ గొంజాలెజ్ టొర్రెస్‌లకు గాంధీ-మండేలా పురస్కారం లభించింది. ఆదివాసీల హక్కుల కోసం మెంచు నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు 1992లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. గొంజాలెజ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీరికి ఈ పురస్కారాన్ని గాంధీ-మండేలా ఫౌండేషన్ శుక్రవారం మెక్సికోలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. గాంధీ, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చెప్పిన అహింస విలువలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం కోసం ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది.

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం నిన్న రూ. 10 లక్షల పరిహారం చెక్కును అందించింది. నిన్న గ్రామాన్ని సందర్శించిన మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పరిహారం అందించామని, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తామని తెలిపారు. బాధిత తల్లికి ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలిక ఆచూకీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందని తెలిపారు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడణవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. ఇద్దరూ పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలికి వెళుతుండగా.. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంతో దారి తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఇద్దరూ పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సామంత్‌తో కలిసి నాగ్‌పుర్ నుంచి గడ్చిరోలి బయలుదేరగా.. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ఆందోళన చెందినట్టు అజిత్ పవార్ తెలిపారు. ‘‘రుతుపవన మేఘాలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో మా హెలికాప్టర్ దారి తప్పింది. ఆ సమయంలో నేనెంతో భయపడ్డా. దేవేంద్ర మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. గతంలో ఇలాంటి ఆరు ప్రమాదాల నుంచి బయటపడ్డానని.. ఇప్పుడు కూడా ఏమీకాదని ఆయన ధైర్యం చెప్పారు’’ అని అజిత్ వెల్లడించారు.

వీధి కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 నెలల చిన్నారి మృతి చెందింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్, లక్ష్మి దంపతులు ఉద్యోగం కోసం బాలాజీనగర్ వికలాంగుల కాలనీలోని బంధువుల ఇంటికి నెల కిందట వచ్చారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో భరత్ కుమారుడు నిహాన్ ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ఇంటిబయట నిర్మానుష్యంగా ఉండడంతో అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు బాలుడిని లాక్కెళ్లాయి. పావుగంట తర్వాత కుటుంబ సభ్యులు చిన్నారి కనిపించట్లేదని బయటికివచ్చారు. అప్పటికే కుక్కలు కొద్దిదూరంలోని చెట్ల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. కుటుంబ సభ్యులు కలిసి పరిసర ప్రాంతాల్లో వెదుకుతూ అక్కడికి వచ్చారు. కుక్కలు తీవ్రంగా కరవడంతో బాలుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. తమ కుమారుడిని ఆ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది. స్థానికుల సాయంతో వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు.

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ – వడోదరా ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆనంద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు సూపరిటెండెంట్ గౌరవ్ జసాని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

చిత్తూరు జిల్లా చారిత్రక చంద్రగిరి రాలయవారికోట సమీపంలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. రాయలవారికోటకు పడమర దిశలోని మండపానికి ఎడమ వైపున షేక్ ముజీబ్‌కు సుమారు రెండెకరాల మామిడితోట తమ వంశపారంపర్యగా సంక్రమిస్తోంది. రైతు ముజీబ్ తోటలో ముళ్ల పొదళ్లు, ఎత్తుపళ్లాలను చదును చేసి కొత్తగా మామిడి మొక్కలు, కూరగాయల సాగుకు శనివారం జేసీబీతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో తోటలో చిన్నపాటి గుట్టగా ఉన్న మట్టిదిబ్బను తొలగించి శుభ్రం చేస్తుండగా అతి ప్రాచీనమైన పెద్ద రాతిబండల కట్టడం బయటపడింది. విషయాన్ని రైతు రాయలవారికోట అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పురావస్తుశాఖ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పెద్దపాటి బండలతో వరుస క్రమంలో నిర్మించిన పురాతన కట్టడాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతం మినహాయించి తోటను చదును చేసుకోవాలని రైతుకు సూచించారు. ఈ కట్టడం 11వ శతాబ్దానికి సంబంధించినదిగా అధికారులు భావిస్తున్నారు. కట్టడం బయటపడంతో స్థానికులు, కోట సందర్శకులు, పర్యాటకులు ఫొటోలు తీసుకుంటున్నారు.

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని... దానిని వీడాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు మీడియాతో సరదాగా సంభాషించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు తాను కూడా దండం పెడతానని చంద్రబాబు అన్నారు. ఇవాళ్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా అని చంద్రబాబు తెలిపారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని... నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నా అని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ ల పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది.

ముంబైలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా చేసిన కారు ప్రమాదంలో అసలు వాస్తవం బయటకు వచ్చింది. ప్రమాదం తర్వాత మిహిర్ ఫోన్‌లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్, డ్రైవర్ బిదావత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు. తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు. తర్వాత బిదావత్ కారు నడిపాడు. కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. మరోవైపు ఈ కేసులో రాజేష్ షాకు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మిహిర్ షా (24) పరారీలో ఉన్నాడు. బిదావత్‌ను మంగళవారం వరకు పోలీస్ కస్టడీకి పంపుతూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

హర్యానా రాష్ట్రం పంచకుల లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాఠశాల విద్యార్థులు గాయాలపాలయ్యారు . పింజోర్‌లోని నౌల్టా గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు నౌల్టా గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ నగరంలోని పింజోర్ ఆసుపత్రి, సెక్టార్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ప్రయాణికురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పీజీఐ చండీగఢ్‌కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు బస్సులో ఓవర్‌లోడ్, రోడ్ల అధ్వాన స్థితి కూడా ప్రమాదానికి దారితీసిన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరు ఎత్తులు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని 1:100కి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. 2022లో అప్పటి ప్రభుత్వం 1:50 అని ఉత్తర్వులు ఇచ్చిందని... ఆ ప్రకారం పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. పేపర్లు లీక్ కావడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయని... ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను జతచేసి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించామని రేవంత్‌రెడ్డి వివరించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత అభ్యర్థుల నిష్పత్తిని 1:100 చేస్తూ ఉత్తర్వులిస్తే కోర్టు అయిదు నిమిషాల్లో వాటిని కొట్టేస్తుందన్నారు. తాము గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయకుండా అడ్డుకోవడానికే కొందరు ఈ ఎత్తులు వేస్తున్నారని రేవంత్ అన్నారు. అన్ని ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ తరహాలో నిర్వహించడానికి నిపుణుల చేత అధ్యయనం చేయిస్తున్నామని... ఒక పరీక్షకు మరోటి అడ్డురాకుండా క్యాలెండర్ తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, భారతరత్న ఎల్‌కే. అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటినా అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇటీవల కూడా ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. రాత్రి 9గంటల నుంచి డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని.. ఆరోగ్యం స్థిరంగా ఉందని అపోలో ఆస్పత్రి పేర్కొంది.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాదిమంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం తయారీలో సేంద్రీయ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. అన్న ప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది. వీటితో పాటుగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది, కొవిడ్ సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను తగ్గించారు. అయితే ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇటీవల సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టంను పెంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే అన్న ప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి.అబూజ్‌మడ్ ఇలాకాలోని కోహక్‌మేట అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. సుమారు గంటన్నరకు పైగా కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు.. వివిధ అంశాలపై వరుస రివ్యూలు మొదలు పెట్టారు సీఎం.. ఈ సమీక్షకు మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తదితర మంత్రులు కూడా హాజరయ్యారు.. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై మొదట సమీక్ష ప్రారంభించారు.. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని గతంలోనే టీడీపీ ఆరోపణలు చేసిన విషయం విదితమే.. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాహ్ కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.. దీంతో.. ఇసుక విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు ఉన్నాయి.. రోడ్లపై కూడా అప్పట్లో విపక్షాలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమాన్నే చేశాయి.. ఇప్పుడు వర్షాకాలంలో భారీ వర్షాల నేపథ్యంలో.. రోడ్లు మరింత గందరగోళంగా మారే పరిస్థితులు ఉండడంతో.. ముందుగా రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీనే వారి ఖాతాల్లో జమయ్యాయి. ఉద్యోగులకు సోమవారం దాదాపు 90 శాతంపైగా జీతాలు పడిపోగా.. పెన్షనర్లకు పింఛన్లు కూడా 50 శాతం అందాయి. మిగతావారికి కూడా ఇవాళ జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్ ఉద్యోగులకు జీతాలందాయి. కొన్ని జిల్లాల్లో దాదాపు వంద శాతం జీతాలు జమయ్యాయి. టీచర్ల బిల్లులు చివర్లో పెట్టడం వలన వారిలో ఎక్కువ మందికి జీతాలు పడలేదు. ఇవాళ అందరికీ వంద శాతం అందుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులూ పూర్తిగా క్లియర్ అయినట్టు తెలిసింది. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలిచ్చిన చరిత్ర లేదు. జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో పడాలంటే నెలలో మూడోవారం వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తిస్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు రూ.5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు రూ.13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవిగాక వారం వారం అందినకాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఏకకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

ఒక భాష నుంచి మరో భాషకు టెక్స్ట్, వాయిస్ ట్రాన్స్ లేట్ చేయాలంటే చాలామంది ఉపయోగించే టూల్ గూగుల్ ట్రాన్సలేట్ ( Google Translate ). ఇప్పటికే సుమారు 243 భాషలకు సపోర్ట్ చేస్తున్న గూగుల్ ట్రాన్సులేట్ ఇప్పుడు మరో 110 భాషలకు సపోర్ట్ చేయడానికి సన్నద్ధమైంది.
ఈ కొత్త భాషలను విస్తరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు గూగుల్ తెలిపింది. 2006లో ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్ లేట్ 2022లో జీరో-షాట్ మెషిన్ అనువాదాన్ని ఉపయోగించి 24 కొత్త భాషలను జోడించింది. కాగా 2024 జూన్ నాటికి 243 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1000 భాషలకు మద్దతు ఇచ్చే ఏఐ మోడల్స్ ను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజాగా గూగుల్ యాడ్ చేసిన కొత్త భాషల జాబితాలో ఫాన్, లువో, గా, కికోంగో, స్వాతి, వెండా, వోల్ఫ్ వంటి మరిన్ని ఆఫ్రికన్ భాషలతో పాటు అవధి, బోడో, ఖాసి, కోక్లోరోక్, మార్వాడీ, సంతాలి, తుళు వంటి ఏడు భారతీయ భాషలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మందికి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని 100 మిలియన్లకుపైగా మాట్లాడే ప్రధాన భాషలు, మరికొన్ని స్థానిక ప్రజల చిన్న భాషలు ఉన్నాయి.

టీ 20 ప్రపంచ కప్ లో భారతీయ ఆటగాళ్ళ అద్భుత ప్రదర్శన మారువలేనిది. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లెట్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లను వణికించాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్, ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ లను బుమ్రా అవుట్ చేసిన తీరు అదరహో అనేలా ఉంది. ఆ ఇద్దరినీ బుమ్రా అద్భుతమైన స్వింగ్ తో బోల్తా కొట్టించాడు. అంతేకాదు, ఓ దశలో దక్షిణాఫ్రికా సింగిల్ రన్ తీయడానికి చాలా కష్టపడిందంటే అందుకు కారణం బుమ్రా కచ్చితత్వంతో కూడిన బౌలింగే.
మొత్తమ్మీద బుమ్రా కూడా టీమిండియా వరల్డ్ కప్ విజయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో, సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ నుంచి బుమ్రాకు సూపర్ కానుక అందింది. అది ఒక ప్లకార్డు. దానిపై ఇలా రాసి ఉంది. "భూమ్మీద మాత్రమే కాదు, గాలిలో, నీటిలో కూడా అత్యుత్తమ బౌలర్ బుమ్రా" అనే అర్థం వచ్చేలా ఆ ప్లకార్డు ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్లకార్డు ఫొటో వైరల్ అవుతోంది.

విహారయాత్ర విషాదయాత్రగా మిగిలింది. జలపాతం చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబం అందులో గల్లంతైంది. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం భుసీ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని జలపాతం వద్ద ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే పోలీసులు, స్థానికుల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జలపాతం దిగువన ఉన్న నాచు బండరాళ్ల వల్ల జారిపడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. 40 ఏళ్ల మహిళతో పాటు 13 ఏళ్ల బాలిక మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, 6 ఏళ్ల ఇద్దరు బాలికలు, నాలుగేళ్ల బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పారు. సంఘటన స్థలం భూసీ డ్యామ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని ఎస్పీ వెల్లడించారు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ శాం పిట్రోడాను నియమిస్తూ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనే ఛైర్మన్‌గా ఉండేవారు. ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మళ్లీ ఆయననే కాంగ్రెస్ పార్టీ నియమించింది.

తాజాగా ఏపీలో ఓ సీఐ పై బదిలీ వేటు పడింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ సీఐ అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సిఐ లోపలికి వెళ్లే సమయంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రత సిబ్బంది ఆ సిఐ కి లోపలికి వెళ్లేందుకు కొద్దిసేపు ఆగాలని చెప్పారు. అయితే వారి మాటలను లెక్క చేయని సిఐ భద్రత సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
ఆపై సీఐ లోపల పూజకు కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే షూ తోనే లోపలికి వెళ్ళాడు. ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది పోలీస్ ఉన్నాదికారులకు సీఐ దురుసు ప్రవర్తనను తెలియజేశారు. దీంతో బుధవారం నాడు సీఐ శ్రీనివాసరావుపై బదిలి వేటు వేశారు అధికారులు.
ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సీఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావుడి చేశారు. అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి.

నారా లోకేశ్ అమెరికా నుంచి పల్లె గడపకు వచ్చి ఇక్కడి రూపురేఖలు మార్చారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కొనియాడారు. అంతా పల్లెల నుంచి అమెరికా వెళ్తే, అక్కడ చదివిన లోకేశ్ పల్లె గడపల వద్దకు వచ్చారని గుర్తు చేశారు. సిమెంట్ రోడ్లతో, ఎల్‌ఈడీ వెలుగులతో పల్లెల వాటి రూపురేఖలు మార్చేశారని బ్రాహ్మణి ప్రశంసించారువిద్యా, ఐటీశాఖ మంత్రిగా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పడి విమర్శల్ని పట్టించుకోకుండా లోకేశ్ అవార్డుల పంట పండించారని... తనను వ్యక్తిత్వహననం చేసిన వారికి నువ్వేంటో తెలియజేశావని అన్నారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు. కుటుంబపరంగా నీకు మా సహకారం ఉంటుందింటూ బ్రాహ్మణి పేర్కొన్నారు. బ్రాహ్మణి చేసిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనను కేంద్రం సవరించింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళకు 180 రోజుల ప్రసూతి సెలవులు, తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులను తీసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్-1972ను సవరించింది.
కొత్త నిబంధనలు ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి (గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి) కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఇక ఈ సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులకు కూడా ప్రభుత్వం అనుమతించింది. సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసీ విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. తాజాగా ఆ నిబంధనలను సవరించి కొత్త రూల్స్‌ను తీసుకొచ్చంది కేంద్ర ప్రభుత్వం. సవరించిన కొత్త రూల్స్ జూన్ 18నుంచి అమల్లోకి వచ్చాయి.

కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సభలో సోమవారం ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలపడం వల్ల తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. అయితే ఈ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని పంపింది కేరళ ప్రభుత్వం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లగా చిరంజీవి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చారని.... మీరు కేంద్ర మంత్రి కావడం చాలా ఆనందంగా ఉందని సంజయ్‌తో చిరంజీవి అన్నారు. కృషికి తగిన పదవి లభించిందని సంజయ్‌ను ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతి మిగిల్చిందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ.. తాను విద్యార్థి దశలో చిరంజీవి సినిమాలు అభిమానని సంజయ్ మెగాస్టార్‌తో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారిద్దరు జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

దక్షిణ నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్ వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. దక్షిణ నేపాల్‌లోని రౌతాహత్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారత నంబర్ ప్లేట్ ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో జీపు డ్రైవర్ సోహైల్ అమీర్ (22) కూడా ఉన్నారని, వారందరూ బిర్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

‘యాదవులు, ముస్లింలు తనకు ఓటేయలేదు.. వారి కోసం పని చేయను అని జేడీయూ ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్ ఇటీవలి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా కాగా.. తాజాగా అండమాన్ నికోబార్ భారతీయ జనతా పార్టీ ఎంపీ బిష్ణుపాద రాయ్ కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. నికోబార్ ప్రజలు తనకు ఓటేయలేదు.. వారికి ఇప్పటి నుంచి గడ్డు రోజులు మొదలైనట్టేనని ఆయన బెదిరింపులకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు జరిగిన మరుస రోజు ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుంది.
ఇక, నికోబార్ పేరుతో మీరు ( ప్రజలను ఉద్దేశించి) డబ్బులు తీసుకుంటారు.. మందు తాగుతారు.. కానీ, ఓట్లు మాత్రం వేయరు అంటూ బీజేపీ ఎంపీ బిష్ణుపాద రాయ్ పేర్కొన్నారు. జాగ్రత్త.. ఇక, మీకు గడ్డు రోజులు ప్రారంభమైనట్టే అంటూ హెచ్చరించారు. మీ భవిష్యత్త్ ఎంత మాత్రం ఆశాజనకంగా ఉండదు అంటూ ఓటర్లకు రాయ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎంతో సమావేశమైన డీజీపీ.. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి హత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని సీఎం డీజీపీతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్దేశించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీస్ శాఖలో ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మరిన్ని బదిలీలు జరగొచ్చని తెలుస్తోంది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే విధించింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో గురువారం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ శుక్రవారం విచారించారు. ఈ విషయంలో పూర్తి రికార్డులను పరిశీలించాల్సి ఉన్నందున 2-3 రోజుల పాటు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించారు.
మరికొన్ని గంటల్లో తీహార్ జైలు నుంచి విడుదలవుతారన్న సమయంలో హైకోర్టు రూపంలో మరో షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో ఢిల్లీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ పరిణామంతో ఆప్ షాక్‌కు గురైంది. ఇక తీర్పును రిజర్వ్ చేసే వరకు కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ తరపున హైకోర్టును కోరారు. కానీ కేజ్రీవాల్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. మొత్తం రికార్డులను పరిశీలించాలని కోరుతున్నందున 2-3 రోజుల పాటు ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో తుది తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
ఇదిలా ఉంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసిన ఈడీ.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు.. 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. మొత్తానికి ఇంత కాలానికి గురువారం ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నేడు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. రైతుబంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తోసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్... లోక్‌సభ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించారు. మూడు లేదా నాలుగు విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చేసినట్లు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీని వడగాడ్పులు వణికిస్తున్నాయి. గత 48 గంటల వ్యవధిలో రాజధాని పరిధిలో 50 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా రాజధానిలో 35 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పౌరులు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడుతున్నారు. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడటం లేదని వారు వాపోతున్నారు. గత 14 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో పచ్చదనం అంతరించిపోయి, విచ్చలవిడిగా నిర్మాణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వడగాల్పులు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద ఆరోగ్య శాఖ బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. వడదెబ్బ రోగులకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటుచేయాలని దవాఖానలను ఆదేశించింది.

బీఆర్ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి ఈడీ తనిఖీలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు ఏమైన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారమో తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైంది. సీనియర్ నేత అయిన ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. ఉపసభాపతి పదవిని జనసేనకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు లోకం మాధవి, పంతం నానాజీ రేసులో ఉన్నట్టు సమాచారం. చీఫ్‌విప్‌గా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది.
ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేస్తారు. అలాగే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎన్నుకుంటారు. టీడీపీ మరో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు అంటే 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఉంటుంది.

అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో భారత్, చైనా, పాకిస్థాన్ దేశాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్-170, భారత్-172 అణ్వాయుధాల్ని కలిగివున్నాయని, క్రితం ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్‌హెడ్స్ 410 నుంచి 500కు పెరిగాయని స్వీడన్‌కు చెందిన మేధో సంస్థ 'సిప్రి' (స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) తాజా నివేదిక వెల్లడించింది. ఇక సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువార్ హెడ్లపై భారత్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉందని నివేదిక తెలిపింది. భారత్, పాక్, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణు వార్‌హెడ్లకు సంబంధించి కీలక విషయాల్ని నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాగారం పెంచుకుంటున్న దేశం చైనా. 2023 జనవరిలో ఆ దేశం వద్ద 410 అస్త్రాలు ఉండేవి. ఈ ఏడాది జనవరికి వాటి సంఖ్య 500కు పెరిగింది. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


