చిట్టి న్యూస్

Tragic Accidents : న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం

న్యూ ఇయర్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో చర్చి నుంచి బైక్‌పై ఇంటికెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు, బెజ్జూర్‌లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోని జమ్మలమడుగు(మ) చిటిమిటి చింతల వద్ద డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు.

అలాగే నూతన సంవత్సరం వేళ బాపట్ల జిల్లాలోనూ విషాద ఘటన చోటు చేసుకుంది. అద్దంకి-నాగులపాడు రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వచ్చిన బైక్‌లు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో అద్దంకికి చెందిన బి.అజయ్(39) మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Pawan Kalyan Childrens : ఆటోలో పవన్ కళ్యాణ్ పిల్లల జర్నీ

తండ్రి పవన్ కల్యాణ్ ఒక స్టేట్ కు డిప్యూటీ సీఎం, ఒక సూపర్ స్టార్ అయినా ఆయన పిల్లలు అకీరా నందన్, ఆద్య మాత్రం ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటున్నారు. సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి అకీరా, ఆద్యలు వారణాసికి వెళ్లారు. అక్కడున్న ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అకీరా పూర్తిగా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారణాసిలో అకీరా, ఆద్యలు ఆటోల్లో ప్రయాణిస్తూ ఆలయాలను దర్శించారు. వీరిని కొందరు అభిమానులు గుర్తించి, వీడియోలు తీశారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలను విలాసాలకు దూరంగా, సామాన్య జీవితం అర్థమయ్యేలా పెంచుతున్న రేణుదేశాయ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.

Constable : మాజీ కానిస్టేబుల్‌ ఇంట్లో కోట్లులో ఆస్తులు

మధ్యప్రదేశ్‌ రవాణా శాఖకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్‌ నివాసాలలో సోదాలు జరిపిన వివిధ దర్యాప్తు సంస్థలకు దాదాపు రూ.14 కోట్ల నగదు, రూ.40 కోట్ల విలువైన బంగారం, రూ.2 కోట్ల విలువైన వెండి,రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు లభించాయి. మాజీ కానిస్టేబుల్‌ సౌరభ్‌ శర్మ ఇంటిపై గత వారం లోకాయుక్త మొదటిసారి దాడి జరపగా రూ. 2.87 కోట్ల నగదు, 275 గ్రాముల వెండితోసహా రూ.7.98 కోట్ల చరాస్తులు లభించాయి. ఆదాయ పన్ను శాఖ మరోసారి దాడి జరపగా రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.11 కోట్లకు పైగా నగదు భోపాల్‌లో ఒక నిర్జన ప్రదేశంలో వదిలివేసిన కారులో లభించాయి.

Maharashtra: తల్లి ఫోన్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య..వాడి వయస్సు

తల్లి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలుడు తన పుట్టినరోజు కానుకగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, తల్లి నిరాకరించింది. దీంతో పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. మిరాజ్ నగరంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుడిని విశ్వజీత్ రమేష్ చందన్వాలేగా గుర్తించారు. తల్లి, సోదరి నిద్రిస్తున్న సమయంలో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశ్వజీత్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. తల్లిని మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, ఆర్థిక సమస్యల కారణంగా తల్లి కొనివ్వలేకపోయింది. మరుసటి రోజు బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో కుప్పకూలిన విమానం

 అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను కూడా దెబ్బతీసింది.

విమానంలో ఉన్న ఇద్దరు పైలట్ అగస్టిన్ ఆర్ఫోర్టే (35), కో-పైలట్ మార్టిన్ ఫెర్నాండెజ్ లోజా (44) లు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అఫుపు చేసేందుకు స్థానిక రహదారులను మూసివేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

KESHAV: పెండింగ్ నిధులు విడుదల చేయాలి: పయ్యావుల కేశవ్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. గత ఐదేళ్లలో 93 కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే ప్రత్యేక గ్రాంట్‌ పెండింగ్‌ నిధులు ఇవ్వాలని మంత్రి పయ్యావుల కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు విడుదల చేయాలని మంత్రి పయ్యావుల విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అవసరమని నిర్మల దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. అలాగే గత ఐదేళ్లలో దాదాపు 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయలేదని, ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్‌కు మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 73 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీలో పునరుద్ధరించినట్లు ఆయన చెప్పారు. గత ఐదు నెలల కాలంలో 73 కేంద్ర పథకాలకు ఏపీ ప్రభుత్వ వాటా సమకూర్చినందున.. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేశవ్‌ కోరారు. కేంద్రం నుంచి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్‌ నిధులు సైతం విడుదల చేయాలని, వీటితోపాటు వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంటునూ వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు.

Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌ కథువాలో భారీ అగ్నిప్రమాదం

 జమ్ముకశ్మీర్‌లోని కథువాలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివనగర్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని చికిత్స నిమిత్తం కథువాలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఇంటికి మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Bigg Boss Winner : బిగ్‌బాస్ విన్నర్‌‌కు ఎంత వచ్చాయంటే?

తెలుగు బిగ్ బాస్ 8 విజేతగా నిలిచిన నటుడు నిఖిల్ మలియక్కల్ మైసూర్ లో జన్మించారు. తల్లి నటి, తండ్రి జర్నలిస్టు కావడంతో చిన్నప్పటి నుంచి డాన్స్, సినిమాలపై ఆసక్తి కలిగింది. నటనపై ఇష్టంతో ఉద్యోగం వదిలేశారు. 2016లో ఊటి చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్‌మాలో వచ్చే గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్‌తో తెలుగు వారిని అలరించారు.

బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ కు నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందించారు. దీంతో పాటు మారుతీ సుజుకీ డిజైర్ కారును గిఫ్ట్‌గా అందించారు. వీటితో పాటు ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నందుకు వారానికి రూ.2.25లక్షల చొప్పున 15 వారాలకు రూ.33.75 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా కారుతో పాటు రూ.88 లక్షలు వెనకేశాడు నిఖిల్.

Road Accident: అమెరికా  రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి దుర్మరణం పాలయ్యారు. పట్టణానికి చెందిన వ్యాపారి గణేశ్-రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. పరిమళ మృతి విషయం తెలిసి తెనాలిలోని ఆమె ఇంటి వద్ద విషాదం అలముకుంది. పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపేందుకు ‘తానా’ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

PV Sindhu : ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అని ఓ కోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఇక సింధుకు కాబోయే వరుడు విషయానికి వస్తే.. వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్‌. పొసిడెక్స్‌ టెక్నాలజీస్‌లో అతను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా సింధు, వెంకట సాయి కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లితో అది మరింత పటిష్ఠం కానుంది. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడనున్నది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించారు పీవీ సింధు తండ్రి. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 22న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 20 నుంచి సింధు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలుకానున్నాయి.

upi: భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు... గణాంకాలు ఇవిగో!

భారత్‌లో డిజిటల్ (యూపీఐ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ ఏడాది జరిగిన డిజిటల్ లావాదేవీలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ రూ.15,547 కోట్ల లావాదేవీలు జరగ్గా, రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. భారత్ ఆర్ధిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోందని పేర్కొంది. ఇది భారత్ ఆర్ధిక పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.  

Russia: పుతిన్ సన్నిహిత మిస్సైల్ డెవలపర్ హత్య..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి సన్నిహితుడిగా భావించే మిఖాయిల్ షాట్స్కీ హత్య చేయబడ్డాడు. ఇతను రష్యన్ మిస్సైల్ డెవలపర్‌గా ఉన్న ఇతడిని మృతదేహాన్ని మాస్కోలో కనుగొన్నారు. కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన క్షిపణులను డెవలప్ చేసిన రష్యన్ కంపెనీ మార్స్ డిజైన్ బ్యూరో డిప్యూటీ జనరల్ డిజైనర్‌గా, సాఫ్ట్‌వేర్ అధిపతిగా షాట్స్కీ ఉన్నారు. రష్యన్, ఉక్రెయిన్ సోర్సెస్ ప్రకారం.. మాస్కో రీజియన్‌లోని క్రెమ్లిన్‌కి ఆగ్నేయంగా 8 మైళ్ల దూరంలో ఉన్న కోటెల్నిలోని కుజ్మిన్స్కీ ఫారెస్ట్ పార్కులో గుర్తుతెలియని వ్యక్తి షాట్స్కీని కాల్చి చంపాడు. రష్యన్ స్పేస్, మిలిటరీ పరిశ్రమ కోసం ఆన్‌బోర్డ్ నావిగేషన్ వ్యవస్థని రూపొందించే, ఉత్పత్తి చేసే కంపెనీలో కీలకంగా ఉన్నారు. డిసెంబర్ 2017 నుంచి స్టేట్ కార్పొరేషన్ రోసాటమ్ విభాగంలో భాగంగా ఉంది. రష్యాలో Kh-59 క్రూయిజ్ క్షిపణిని Kh-69 స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంలో కీలకంగా ఉన్నాడు. ఉక్రెయిన్‌పై వీటితోనే రష్యా దాడి చేస్తోంది.

Drug seizure : సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత

సంగారెడ్డి జిల్లా లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. మొగుడంపల్లి మండలం మాడిగి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద డీఆర్ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో అధికారుల తనిఖీలు చేపట్టగా..లారీలో తరలిస్తున్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన డ్రగ్స్ ను ఏపీలోని కాకినాడ ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను చిరాగ పల్లి పోలీస్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్

హీరోయిన్ కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్ ఇన్స్టాలో సందడి చేస్తోంది. రేపు తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్ తో గోవాలో పెళ్లి పీటలు ఎక్కబోతోందీ మహానటి. వీళ్ల వివాహానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు డిసెంబర్ 20న హిందీలో కీర్తి సురేష్ డెబ్యూ మూవీ ‘బేబీ జాన్' రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్లామరస్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ఆమె ఫేస్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేక ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోలని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫోటోషూట్లో ఎంబ్రాయిడరీ లెహంగాలో కీర్తి లుక్స్ స్టన్నింగ్గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ లుక్స్ లో కీర్తి చాలా గ్లామరస్ గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

School Holidays: ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు..సెలవు ప్రకటన..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. ఈ రోజు ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య , నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. కొన్ని చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుసే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. రైతులను అలర్ట్ జారీ చేశారు.. పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.. ఇంకోవైపు.. అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో.. ముఖ్యంగా రైల్వే కోడూరులో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుండి.. తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండగా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..


Canada: కెనడాలో మరో భారతీయుడి హత్య

కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. చదువుకుంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న హర్షన్‌దీప్‌సింగ్‌ను ఎడ్మాంటన్‌లోని అతడి అపార్ట్‌మెంట్‌లోనే దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గిరిలో ఇవాన్‌ రెయిన్‌,జుడిత్‌ సాల్టియాక్స్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగులు తొలుత హర్షన్‌దీప్‌సింగ్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. అతన్ని ఫ్లాట్‌లో నుంచి లాగి మెట్ల మీదకు నెట్టేస్తూ వెనుక నుంచి కాల్పులు జరిపారు.

కాల్పుల సమాచారం అందుకుని తాము అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికే హర్షన్‌దీప్‌సింగ్‌ స్పందించడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడి మృతిని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలే అల్పాహారం విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో భారతీయ విద్యార్థి ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే.

TG: యాదాద్రిలో తీవ్ర విషాదం.. అయిదుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వంశీగౌడ్, దినేష్, హర్షగా గుర్తించగా.. మరొకరిని గుర్తించాల్సి ఉంది. భూదాన్ పోచంపల్లి వైపు వెళ్తున్న కారు జలాల్‌పురం శివారులో అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతులంతా హైదరాబాద్‌ కు చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ సాయంతో మృతదేహాలను చెరవులోంచి బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Big Tiger : ఆదిలాబాద్ లో పెద్దపులి కలకలం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్‌ శివారులోని ఓ పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయి. దీంతో రైతులు, కూలీలు బెంబేలెత్తిపోయారు. గ్రామ శివారులోని చేనులోకి పులి రావడంతో పత్తి ఏరుతున్న కూలీలు పరుగులు పెట్టారు. పులిని చూసిన ఇద్దరు కూలీలు చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. చెట్టు పైనుంచే కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి పెద్ద శబ్దాలు చేశారని, తరువాత పులి తెనుగుపల్లి వైపు వెళ్లిందని చెప్పారు. పెద్దపులి సంచార విషయం తెలుసుకున్న కుశ్నపల్లి, తాండూరు అటవీ అధికారులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పత్తి సేకరణ పనులు జోరుగా నడుస్తుండగా చేలల్లోకి పెద్దపులి రావడంతో రైతులు, కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. 

Vamsi: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు: మాజీ ఎమ్మెల్యే వంశీ పీఏ సహా 11 మంది అరెస్టు

వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ రాజా సహా 11 మంది నిందితులను అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 11 మంది వంశీ అనుచరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. విజయవాడ రూరల్, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నేతలు దాడి చేసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపర్చి వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యాలయ ఆపరేటర్ సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ కెమేరాలు, వీడియోల ద్వారా 71 మంది దాడికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగం పెంచడంతో నిందితులుగా ఉన్న చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ కేసులో నిందితులను దఫదఫాలుగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు.


Congo: కాంగోను వణికిస్తున్న వింత వ్యాధి

: కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో అంతుచిక్కని ఓ వింత వ్యాధి దాదాపు 150 మందిని బలిగొంది. ఫ్లూ వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నవంబర్‌ 10 నుంచి 25 మధ్య పాంజీ హెల్త్‌ జోన్‌లో దాదాపు 150 మంది ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడి మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాధికి గురైన చాలా మంది రోగులు తమ ఇళ్లలోనే మరణిస్తున్నారన్నారు. రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్‌ జోన్‌ చేరుకుంది. తీవ్ర జ్వరం, భరించరాని తలనొప్పి, దగ్గు, నీరసం వంటివి ఈ గుర్తు తెలియని వ్యాధి లక్షణాలని ప్రొవిన్షియల్‌ ఆరోగ్య మంత్రి అపొల్లిరేర్‌ యుంబా తెలిపారు.

High Court: హైకోర్టులో హరీష్ రావుకు ఊరట

మాజీ మంత్రి, BRS నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేయద్దని ఆదేశించింది. అయితే పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీష్ రావు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాగా, తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్, హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ప్రశ్నిస్తే కేసులు.. అరెస్టులు: కేటీఆర్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలనలో లోపాలను గుర్తు చేసినా, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించినా.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించినా కేసులు పెడుతున్నారు. సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకా" అంటూ ఎద్దేవా చేశారు.

Proba-3 Mission: నేడు నింగిలోకి ప్రోబా-3 ఉపగ్రహాలు

 ఖగోళ పరిశోధనల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపనున్నది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం సాయంత్రం 4.06 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నది.

ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌, ఆక్యుల్టర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌) ఉంటాయి. మొత్తం దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.

Bigg Boss Fame Shweta Varma : బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఇంట్లో విషాదం

బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ శ్వేతావర్మ తన తల్లి మరణించింది అంటూ ఓ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'డిసెంబర్ 2, తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలకు నా తల్లిని పోగొట్టుకున్నాను. ‘జీవితం నువ్వు లేకుండా ఇదివరకటిలా ఉండదు అమ్మా. నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందరూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో 'నో మెసేజెస్ జస్ట్ ప్రే(ప్రార్ధించండి)' అన్నట్టు మరో పోస్ట్ పెట్టింది. వాస్తవానికి శ్వేతా వర్మ తల్లి చనిపోయింది 2017 డిసెంబర్ 2న అని తెలుస్తుంది. కానీ ఈరోజు డిసెంబర్ 2 కావడంతో.. ఆమె తల్లిని గుర్తుచేసుకుంటూ పెట్టిన పోస్ట్.

Fengal Cyclone : ఉత్తరాంధ్రకు కన్నీళ్లు మిగిల్చిన తుఫాను.. పంట నష్టం తీవ్రం

ఫెంగాల్‌(ఫెయింజాల్) తూఫాన్ శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పడిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. కోత దశలో ఉన్న వరిపంట నేల వాలడంతో అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిక్కోలు జిల్లాలో దాదాపు మూడు వేల హెక్టార్లలో వరి పంట నీటి ముంపునకు గురైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చినట్టే వచ్చి నీటి పాలయ్యిందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ పంట నష్టపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలోనే చాలామంది వరి పంట కోతలు నిలుపుదల చేసినప్పటికీ వందలాది మంది రైతులు ముందుగానే కోతలు చేయడంతో పొలాల్లో ఉన్న పంట పూర్తిగా నీటిపాలైంది. పొలాల్లో నీటి ముంపు కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 53వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. గడిచిన మూడు రోజులుగా పడిన వర్షాలకు పొలాల్లో ఉన్న పంటతో పాటు ఆరుబయట ఆరవేసిన ధాన్యం రంగు మారి తడిచి ముద్దైంది. విక్రయానికి వీలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా 10 మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Fengal Cyclone : వణికిస్తున్న ఫెయింజాల్ తుఫాను

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్(ఫెయింజాల్) తుఫాన్ దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణ, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలలో అయ్యప్పస్వామి కొలువైన పతనంతిట్ట జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు.

పంబ, సన్నిధానంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, రాపిడ్ యాక్షన్ టీం, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని..పతనంతిట్ట కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో, నదులు, అడవులు ఉన్న ప్రాంతాల్లో భక్తులను అనుమతించరాదని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

PV Sindhu : పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు

ఇండియన్ స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తా సాయిని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ నెల 22న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. ఈ నెల 20 నుంచి మ్యారేజ్ ఈవెంట్స్ ప్రారంభంకానున్నాయి. 22న ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనుండగా.. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెల 22న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే సీజన్ సింధుకు చాలా ముఖ్యమైనది. త్వరలోనే ఆమె శిక్షణ మొదలుపెట్టనుందని ఆమె తండ్రి తెలిపారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సింధు బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ నిరీక్షణకు తెరదించారు. ఆదివారం సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా నిలిచింది. మరుసటి రోజే సింధు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తా సాయిని పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన పని చేస్తున్నారు. 

Cricket stadium: అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కర్ణాటక సీఎం శంకుస్థాపన

కర్ణాటక  రాష్ట్రంలోని తుమకూరు  జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ( నుంచి కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోషియేషన్‌  కు భూకేటాయింపు జరిగింది. స్టేడియం నిర్మాణానికి మొత్తం 41 ఎకరాల భూమిని కేటాయించారు.ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇవాళ ఉదయం తుమకూరులో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం 41 ఎకరాల్లో నిర్మించనున్న ఈ స్టేడియాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మొత్తం రూ.150 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. స్టేడియం పూర్తయితే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Gruha Jyothi: గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్

పేదలపై కరెంట్ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది. ఈ పథకంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

MP: తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి చేశాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది… జ్యోతిరాదిత్య సింధియాను సురక్షితంగా తప్పించారు. మాధవ్ నేషనల్ పార్క్‌లోని చాంద్‌పాతా సరస్సు దగ్గర ఆకస్మిక రెస్క్యూ యాక్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివపురిలో ఓ కార్యక్రమానికి సింధియా హాజరయ్యారు. సభావేదిక మాధవ్‌ నేషనల్ పార్క్‌ సమీపంలో ఉంది. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా డ్రోన్లను వినియోగించారు. ఈ క్రమంలో తేనెతుట్టె కదిలింది. వెంటనే తెనేటీగలు అక్కడున్న వారిపై దాడి చేశాయి. కేంద్ర మంత్రి భద్రత సిబ్బంది వలయంగా ఏర్పడి.. సింధియాను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

Game Changer : యూట్యూబ్లో నానా హైరానాకు ట్రెమండస్ రెస్పాన్స్

మెగా హీరో రాంచరణ్ తేజ్.. కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. శంకర్ డైరెక్షన్ లో వస్తుండటంతో సినామా బాక్సఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా నుండి మూడో సింగిల్ సాంగ్ గా 'నానా హైరానా' అనే మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం మెలోడీ ట్యూన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాటకు 24 గంటల వ్యవధిలోనే 35 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కినట్లు మేకర్స్ తెలిపారు. 'గేమ్ ఛేంజర్'లోని పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Telugu Student: అమెరికాలో దుండ‌గుల‌ కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి!

అమెరికాలో తుపాకీ తూటాకు మ‌రో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. షికాగోలో దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో ఖ‌మ్మం జిల్లా రామ‌న్న‌పేట‌కు చెందిన నూక‌ర‌పు సాయితేజ (26) అనే విద్యార్థి చ‌నిపోయాడు. సాయితేజ ఎంఎస్ చ‌ద‌వ‌డానికి నాలుగు నెల‌ల క్రిత‌మే యూఎస్ వెళ్లాడు. ఇంత‌లోనే ఈ ఘోరం జ‌రిగిపోయింది. సాయితేజ మృతితో అత‌ని స్వ‌స్థ‌లం రామ‌న్న‌పేట‌లో విషాదం అలకుముంది. అత‌ని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. కుమారుడి మృత‌దేహాన్ని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చొర‌వ తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు.


Fire Accident: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన  ప్రమాదం , బస్సు దగ్ధం

నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్ధినులు పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళుతుండగా వారి బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందిన బస్సులో విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళుతుండగా, విద్యుదాఘాతంతో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. విద్యార్థినులు దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.   

Earthquake: నాగాలాండ్‌లో భూకంపం

 నాగాలాండ్‌ లో భూకంపం  సంభవించింది. కిఫిర్‌   నగరంలో గురువారం ఉదయం 7:22 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. కిఫిర్‌ ప్రాంతం చుట్టూ భూమికి 65 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, భవనాలు ఊగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Brahmos Aerospace: ‘బ్రహ్మోస్‌’ సీఈఓగా జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి

 బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ కొత్త సీఈఓగా ప్రముఖ క్షిపణి రంగ శాస్త్రవేత్త డాక్టర్‌ జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ, ఎండీ అతుల్‌ దిన్‌కర్‌ రాణే పదవీకాలం ముగియడంతో ఈ స్థానంలో జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన డిసెంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్డీవో), రష్యాకు చెందిన మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ను ఏర్పాటు చేశాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ బ్రహ్మోస్‌ క్షిపణులను తయారుచేస్తున్నది.

Royal Bengal Tiger : తిరుపతిలోని ఎస్వీ జూలో మధు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (ఎస్వీ) జూలో మధు అనే రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ప్రాణాలు కోల్పోయింది. ఈ టైగర్ రెండు నెలల నుంచి తగిన ఆహారం, నీరు తీసుకోవడం లేదని.. సోమవారం చనిపోగా.. ఎస్వీ వెటర్నరీ కళాశాల పాథాలజీ విభాగం డాక్టర్ల టీమ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు క్యూరేటర్‌ సెల్వం తెలిపారు. ఈ టైగర్ వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారన్నారు.

ఈ టైగర్‌ను 2018లో 11 ఏళ్ల వయసున్నప్పుడు కర్ణాటకలోని బన్నేరుగట్ట పార్క్‌ నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లపాటు జూ సంరక్షణలో ఉందని.. ఈ టైగర్‌ వృద్ధాప్యం కారణంగా రెండేళ్లుగా సందర్శకుల ప్రదర్శనకు దూరంగా ఉంచినట్లు తెలిపారు.

RBI Governor:గుండె నొప్పితో   చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  ..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దీంతో సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది.. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. అయితే, శక్తికాంత దాస్ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. కానీ, తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన తమిళనాడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పని చేశారు. కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పని చేసిన శక్తికాంత దాస్.. 2018లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు.