- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలివిడత వారాహి యాత్ర ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర చేపడతారని ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ విడత.. వారాహి యాత్ర సాగనుండటంతో స్థానిక నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డలో వారాహి యాత్ర సభ జరుగుతుందని..మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజక వర్గాల మీదుగా యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో వేతనాల పెంపు, మినీ అంగన్‌వాడీ వ్యవస్థ రద్దు సహా పలు డిమాండ్లతో ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఛలో విజయవాడకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మారు వేషాల్లో విజయవాడకు చేరుకున్న అంగన్వాడీలను విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద అరెస్టు చేసి ప్రైవేట్ కల్యాణ మండపాలకు పోలీసులు తరలిస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని స్పష్టం చేస్తున్న అంగన్వాడి కార్మికులు.. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చేపట్టిన ఛలో విజయవాడను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని విమమర్శించారు. అంగన్వాడీల అరెస్టును వామపక్షాలు ఖండించాయి. అంగన్వాడీ మహిళల పట్ల జగన్ ప్రభుత్వ నిర్బంధ విధానానికి ఇదో నిదర్శనమని వామపక్ష నేతలు మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకే నాని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వేంకన్నను నాని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి, శేష వస్త్రం కప్పుతుండగా నాని అభ్యంతరం తెలిపారు. ఆలయ సంప్రదాయాన్ని కాదని తానే స్వయంగా శేష వస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు. దీంతో ఆలయ అధికారులు, అర్చకులు అవాక్కయారు. అభిమానంతో ఆయన్ని కలవడానికి ఆలయం వద్దకు వచ్చిన వైసీపీ నేతలతో కూడా పేర్ని నాని వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రశాంతంగా స్వామి వారి దర్శనానికి వస్తే.. విహారయాత్ర, వివాహానికి వచ్చినట్లు ఇంత మంది ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పుట్టిన రోజుకి మాజీ ఎమ్మెల్యే హోదాలో తన ఆశీర్వాదం పంపుతానని నాని చెప్పడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా నిలిపివేసిన యువగళం పాదయాత్రను వచ్చే వారం నుంచి ప్రారంభించే యోచనలో నారా లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే లోకేశ్ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. న్యాయపోరాటం కొనసాగిస్తూనే యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణియించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తెలుగుదేశం, జనసేన కలిసి పని చేస్తాయని జనసేన నేత కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణిని జనసేన నేతలు కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్, మాజీ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా పనిచేస్తామని నేతలు వెల్లడించారు.

పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో హెరాయిన్ మోసుకొని వెళుతున్న ఓ డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హెరాయిన్ డ్రోన్ దొరికింది. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీదని, అది క్వాడ్‌కాప్టర్ (డీజేఐ మావిక్ 3 క్లాసిక్ మోడల్) అని పోలీసు అధికారులు తెలిపారు.
వరి పొలంలో 500 గ్రాముల హెరాయిన్, డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం మహావా సమీపంలో డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. మరోవైపు గుజరాత్‌లోని భుజ్ సరిహద్దులోకి చొరబడిన పాకిస్థానీ జాతీయుడిని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాడిన్ జిల్లాకు చెందిన మెహబూబ్ అలీ (30)ని అరెస్టు చేశారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ బృందం భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికను గమనించింది. ఒక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పాకిస్థాన్ జాతీయుడైన మెహబూబ్ అలీని అరెస్టు చేసిందని బీఎస్ఎఫ్ పేర్కొంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) సెప్టెంబర్ 24 ఆదివారం వరుసగా రెండో రోజూ ప్రశ్నించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. 12 మంది సీఐడీ అధికారుల బృందం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.
రెండో రోజు విచారణ ప్రారంభానికి ముందు చంద్రబాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన తరపు న్యాయవాది డి. శ్రీనివాస్ సమక్షంలో సమావేశ మందిరంలో ఈ విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 22న సీఐడీకి రెండు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భోజన విరామంతో గంటపాటు చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీకి అనుమతి లభించింది. ఈ క్రమంలో ప్రశ్నించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టరాదని కోర్టు ఆదేశించింది.
తొలిరోజు దాదాపు ఆరు గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు. విచారణకు ముందు, తర్వాత అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చీఫ్‌ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా, కోర్టు రెండు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతించింది. రెండు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఆ తర్వాత తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, జ్యుడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఏసీబీ కోర్టు శుక్రవారం ఆయన జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 24 వరకు పొడిగించింది. ఈ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేయగా.. మరుసటి రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అంచనా ప్రాజెక్ట్ విలువ రూ.3,300 కోట్లతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ల క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన కేసులో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ మోసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.371 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేసిన మొత్తం 10 శాతం నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూ. 371 కోట్ల అడ్వాన్స్‌ను ప్రైవేట్ సంస్థల ద్వారా ఏదైనా ఖర్చు చేయకముందే విడుదల చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.
సీఐడీ ప్రకారం, ప్రభుత్వం అడ్వాన్స్‌గా విడుదల చేసిన డబ్బులో ఎక్కువ భాగం నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీలకు మళ్లించబడిందని, ఇన్‌వాయిస్‌లలో పేర్కొన్న వస్తువుల అసలు డెలివరీ లేదా అమ్మకం జరగలేదని అధికారులు తెలిపారు. ఆరు స్కిల్ డెవలప్‌మెంట్ క్లస్టర్‌ల కోసం ప్రైవేట్ సంస్థలు ఖర్చు చేసిన మొత్తం మొత్తం రూ. 371 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అడ్వాన్స్‌డ్ చేసిన నిధుల నుండి సేకరించినట్లు సీఐడీ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది.

సెప్టెంబర్ 27న నగరంలో లులూ గ్రూప్ తన మాల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్ మరో షాపింగ్ డెస్టినేషన్‌కు స్వాగతం పలుకనుంది. కూకట్‌పల్లిలో లులు గ్రూప్ లాంఛ్ చేయబోయే ఈ మాల్ భారతదేశంలో తొలి వెంచరేం కాదు. లులు మాల్స్ ఇప్పటికే వివిధ భారతీయ నగరాల్లో స్థాపించింది.
హైదరాబాద్‌లోని లులు మాల్‌లో సౌకర్యాలు
నగరంలోని లులు మాల్ విస్తృతమైన సౌకర్యాలు అందించడానికి సిద్ధంగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టోర్‌లతో పాటు, మాల్‌లో సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ మరెన్నో సౌకర్యాలను కల్పించనుంది. ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానాలలో ఇది ఒకటి. ఈ మాల్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అంతకుముందు ఓ ప్రకటనలో పేర్కొంది.
భారతదేశంలోని ఇతర లులు మాల్స్ కింది నగరాల్లో ఉన్నాయి:
- కొచ్చి, కేరళ
- తిరువనంతపురం, కేరళ
- బెంగళూరు, కర్ణాటక
- లక్నో, ఉత్తరప్రదేశ్
- కోయంబత్తూరు, తమిళనాడు
భవిష్యత్తులో లులు గ్రూప్ అహ్మదాబాద్, చెన్నైలలో కొత్త షాపింగ్ మాల్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. తద్వారా స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.
హైదరాబాద్‌లోని ఇతర షాపింగ్ మాల్స్
లులు మాల్ హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటి అయినప్పటికీ, నగరం ఇప్పటికే అనేక ప్రసిద్ధి చెందిన మాల్స్ ను కలిగి ఉంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రసిద్ధ షాపింగ్ స్పాట్స్:
- సిటీ సెంటర్ షాపింగ్ మాల్
- ఇనార్బిట్ మాల్
- సుజనా మాల్ ఫోరం
- హైదరాబాద్ సెంట్రల్ మాల్
- బాబుఖాన్ మాల్
- FMG మాల్
- మంజీరా ట్రినిటీ మాల్
- గల్లెరియా మాల్
- GVK వన్ మాల్
- సనాలీ మాల్
హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక షాపింగ్ స్పాట్స్ ఏర్పాటు చేయడంతో, లులు గ్రూప్ ప్రవేశం నగరానికి అధిక పోటీని తెస్తుందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 23న జైపూర్‌లో విద్యార్థి స్కూటర్‌పై పిలియన్ రైడర్‌గా ప్రయాణించారు. రాహుల్ జైపూర్‌లోని మహారాణి కాలేజీకి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు, బాలికలకు స్కూటర్లు పంపిణీ చేసి, వారితో కాసేపు సంభాషించారు. అనంతరం విద్యార్థినితో కలిసి స్కూటర్‌పై వెళ్లాడు. పిలియన్ రైడర్‌గా ఆయన చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాజస్థాన్ మే జన్ నాయక్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.
జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ భవనానికి రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శంకుస్థాపన చేశారు. వేడుకల అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
#WATCH | Rajasthan: Congress MP Rahul Gandhi distributed two-wheelers to meritorious girl students at Maharani College and rides pillion on a girl's scooter in Jaipur pic.twitter.com/nsQ17rT1u3
— ANI (@ANI) September 23, 2023

హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో డ్రగ్స్ కేసులో తీగలాగుతుంటే డొంక కదలుతోంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్‌ను యాంటీ నారొటిక్స్ బ్యూరో విచారించిందివిచారణకు . శనివారం ఉదయం 11 గంటల నుంచి నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. ఈ కేసులో పట్టుబడిన వైజాగ్‌కు చెందిన రాంచంద్ ద్వారా మత్తుపదార్ధాలను నవదీప్ కోనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుల జాబితాలో చేర్చారు.

నవదీప్ తన సెల్‌ఫోన్‌ను తీసుకురాకపోవడంతో టీన్యాబ్ అధికారులు ఫోన్‌ను తెప్పించారు. మొబైల్‌ను ఫార్మాట్ చేసి సోషల్ మీడియా, గ్యాలరీసహా డాటా మొత్తం డిలీట్ చేసినట్టు గుర్తించారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, డాటా రిట్రీవ్ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌ను ఆదేశించారు. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’లోని డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లుగా ఉన్న 81 మందితో నవదీప్ కాంటాక్ట్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈనెల14న మాదకద్రవ్యాల రవాణా కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా మరో 8 మందిని అరెస్ట్ చేశారు. నటుడు నవదీప్ వారి వద్ద డ్రగ్స్ కోనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాన్‌ఇండియా తరహాలో TSన్యాబ్ డ్రగ్స్‌పై లోతుగా దర్యాప్తు చేస్తోందని నటుడు నవదీప్ అన్నారు. మత్తుపదార్ధాల కేసులో పారిపోయానంటూ మాధ్యమాల ద్వారా వచ్చినవి పుకార్లు మాత్రమేనని సృష్టం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చినట్లు తెలిపారు. కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, నోటీసులిస్తే వచ్చానని వివరించారు. గతంలో పబ్ నిర్వహించినపుడు సిట్, ED దర్యాప్తునకు హాజరయ్యానని, అప్పుడు ఇచ్చిన జవాబులే ఇప్పుడు నార్కొటిక్ పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

మాదాపూర్ డ్రగ్స్‌కేసులో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించినట్లు టీఎస్‌న్యాబ్ SPసునీతారెడ్డి తెలిపారు. కేసులో 81 లింకులను గుర్తించామని, వాటిలో నవదీప్ 41 లింకుల వివరాలు అందించినట్లు వెల్లడించారు. సిట్, ఈడీ విచారణ ఎదుట డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఫోన్లలోని డేటాను నవదీప్ పూర్తిగా తొలగించాడని ఆ సమాచారం తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తామని సునీతారెడ్డి వివరించారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్ వినియోగదారుడు కొల్లి రామ్‌చంద్‌తో 15 ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు నవదీప్ అంగీకరించినట్టు చెప్పారు. అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడ లభించే గమ్మీస్ తీసుకునేవాడినని నవదీప్ తెలిపాడని, ఇందులో స్థానిక చట్టాలకు అనుగుణంగా డ్రగ్స్ మోతాదు ఉంటుందని తెలిపారు.

ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బౌగ్చా రాజా గణేశోత్సవ పండుగ జరిగిన రెండు రోజుల్లోనే రూ. 1.02 కోట్ల (రూ. 1,02,62,00) మొత్తాన్ని విరాళంగా అందుకున్నారు. మండలంలో రెండోరోజు ఉత్సవాల సందర్భంగా రూ.60 లక్షలకు పైగా (రూ.60,62,000) విరాళాలు అందాయి. గణపతి విగ్రహానికి 183.480 గ్రాముల బంగారం, 622 గ్రాముల వెండి విరాళంగా లభించింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నగదు రూపంలో ఎక్కువ విరాళాలు వచ్చాయి.
లాల్‌బాగ్చా రాజా
లాల్‌బాగ్చా రాజా ముంబైలోని పురాతన, అత్యంత ప్రసిద్ధ మండలాల్లో ఒకటి. ఇది ప్రముఖులు, రాజకీయ నాయకులతో సహా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. లాల్‌బాగ్చా రాజా చరిత్ర చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది లాల్‌బౌగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్‌లోని ప్రసిద్ధ గణేష్ విగ్రహం. ఇది పుత్‌లబాయి చాల్‌లో ఉంది. ఇది ఎనిమిది దశాబ్దాల క్రితం 1934లో స్థాపించబడింది. దివంగత ఆర్ట్ డైరెక్టర్ నితిన్ సి దేశాయ్ చివరి సృష్టి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన 350వ వార్షికోత్సవానికి ప్రతీకగా సింహాసనంపై గంభీరంగా కూర్చున్న 'లాల్‌బాగ్చా రాజా' కనిపిస్తుంది.
గణేశోత్సవం మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధ పండుగ. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ముంబయితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వివిధ మండలాలు ఏర్పాటు చేసిన పండల్స్ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి. పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్సవాల కోసం, ప్రజలు తమ ఇళ్లకు గణేష్ విగ్రహాలను తీసుకువస్తారు, ఉపవాసాలు పాటిస్తారు, నోరూరించే రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా పండల్‌లను సందర్శిస్తారు. ఈ పవిత్రమైన పదిరోజుల పండుగ చతుర్థి తిథితో ప్రారంభమై అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది.
చాలా మంది మొబైల్ వినియోగదారులు ఈరోజు బిగ్గరగా బీప్‌తో పాటు ‘Emergency alert: Severe’ అనే సందేశాన్ని అందుకున్నారు. కొద్దిసేపటికే, ప్రజలు తమ ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్స్ కు ఇలాంటి సందేశాలు వచ్చాయి.
మొబైల్ ఫోన్‌లలో కనిపించిన 'అత్యవసర హెచ్చరిక' సందేశంలో.., 'ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అమలు చేస్తున్న పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించడానికి ఈ సందేశం పంపబడింది. ఇది ప్రజా భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని ఉంది. ఇది నిజానికి చాలా మంది మొబైల్ ఫోన్ వినియోగదారులను ఆందోళనకు గురి చేసింది. కొందరు తమ సెల్‌ఫోన్‌లు హ్యాక్‌కు గురైనట్లు భావించారు. ఈ ఫ్లాష్ హెచ్చరిక సందేశం గురించి పోస్ట్‌లు చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Anyone else getting this emergency alert on mobile??
— Anirudh J 🇮🇳 (@Anirudhj12) September 21, 2023
Repeatedly came today...looks scary.#emergencyalert from telecom department pic.twitter.com/Z9u3i3ouwV
Why is suddenly this alert to every mobile? Emergency? pic.twitter.com/LSU2QGTUek
— ghouseuddin (@ghouseuddin786) September 21, 2023
మొబైల్‌లో పంపిన 'అత్యవసర హెచ్చరిక' సందేశం ఏమిటి?
ఈ హెచ్చరిక బీప్ సౌండ్‌తో మెరుస్తుంది. అది యూజర్ ఓకే అని నొక్కినంత వరకు కొనసాగుతుంది, అయితే ఇది కేవలం ప్రభుత్వం నుండి వచ్చిన టెస్టింగ్ మెసేజ్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర పోలీసులు దాని X హ్యాండిల్‌లో, 'భయపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే పంపాల్సిన నమూనా సందేశాన్ని సెంట్రల్ టెలికమ్యూనికేషన్ పంపింది' అని తెలిపారు.
మొబైల్ ఆపరేటర్లు, సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాలను పరీక్షించడానికి వివిధ ప్రాంతాలలో ఎప్పటికప్పుడు ఇటువంటి పరీక్షలు నిర్వహించబడతాయని టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ అంతకుముందు పేర్కొంది. భూకంపాలు, సునామీలు మొదలైన విపత్తులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు తమ మొబైల్ కి ఇలాంటి మెసేజ్ రావటం చూసే ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా, దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల సందర్భంలో పంపించే మెసేజ్ సిస్టమ్ ను కేంద్ర టెలీ కమ్యునికేషన్ వారు శాంపిల్ గా పంపించారు. pic.twitter.com/6wz785gr8t
— Telangana State Police (@TelanganaCOPs) September 21, 2023

తెలుగుదేశం అధినేత చంద్రబాబును అంతం చేసేందుకే అక్రమ అరెస్టు చేయించారని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని లోకేశ్ అన్నారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. ఆధారాల్లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడన్నారు. చంద్రబాబుకు ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారన్న లోకేశ్... చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యతన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన చేపట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం 15 మందిని సస్పెండ్ చేయాలంటూ స్పీకర్‌ను ఆయన కోరారు. 14 మంది టీడీపీ సభ్యులు, వైసీపీకు చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు:
నందమూరి బాలకృష్ణ, కింజరాపు అచ్చెన్నాయుడు బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్, ఐఎస్‌బిటిని సందర్శించారు. అంతే కాదు వారి యూనిఫాం, బ్యాడ్జ్ ధరించి కూలీలతో సంభాషించారు. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ కూలీ దుస్తులు ధరించి, రైల్వే స్టేషన్‌లో బరువులు మోస్తూ వారితో సంభాషించడాన్ని చూడవచ్చు. ఆయన వారి ట్రేడ్‌మార్క్ ఎరుపు చొక్కా ధరించి, తన తలపై సామాను ఎత్తడం ఈ వీడియోలో కనిపించింది.
ఈ సందర్భంగా రాహుల్ కూలీలతో కలిసి కూర్చుని వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.ఢిల్లీలోని ఆనంద్‌విహార్ రైల్వే స్టేషన్‌లో ప్రజానాయకుడు రాహుల్ గాంధీజీ తన కూలీ స్నేహితులను ఈరోజు కలిశారని, ఇటీవల రైల్వే స్టేషన్‌లోని పోర్టర్ స్నేహితులు ఆయన్ను కలవాలనే కోరికను వ్యక్తం చేసిన వీడియో వైరల్‌గా మారింది.
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi visits Anand Vihar ISBT, speaks with the porters and also wears their uniform and carries the load pic.twitter.com/6rtpMnUmVc
— ANI (@ANI) September 21, 2023
"ఈరోజు, రాహుల్‌జీ వారి మధ్యకు చేరుకుని, వారి మాటలు విన్నారు... భారత్ జోడో ప్రయాణం కొనసాగుతుంది" అని పార్టీ ఈ సందర్భంగా పేర్కొంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ పరస్పర చర్యలతో కొనసాగుతుందని ఈ వీడియో చూపిస్తోంది.
VIDEO | Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar Railway Station in Delhi, wears porter dress and badge. pic.twitter.com/wYqOGOmB2v
— Press Trust of India (@PTI_News) September 21, 2023

డీఎంకే యువజన విభాగం నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆమెను వితంతువని, గిరిజన సమాజానికి చెందిన కారణంతో ఆమెను ఆహ్వానించలేదని ఆరోపించారు. దీన్నే మనం సనాతన ధర్మం అని పిలుస్తాం అని మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి ఉదయనిధి అంతకుముందు తన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు, ముఖ్యంగా ఈ అంశంపై బీజేపీ అతన్ని లక్ష్యంగా చేసుకుంది. అక్కడ జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని నెలల క్రితం కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడిన ఐదు రోజుల ప్రత్యేక సమావేశానికి ఇది మొదటి సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ముర్ముని ఆహ్వానించలేదని అన్నారు.
"మన ప్రథమ పౌరుడు ఎవరు - రాష్ట్రపతి. ఆమె పేరు ఏమిటి? ద్రౌపది ముర్ము. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదు. దీనినే మనం సనాతనం అంటాము” అంటూ ఉదయనిధి ఎదురుదాడికి దిగారు. “నిన్న ఒక బాలీవుడ్ మహిళా నటిని కొత్త పార్లమెంటు భవనానికి తీసుకెళ్లారు, కానీ రాష్ట్రపతికి అనుమతి లేదు. ఎందుకు? ఎందుకంటే ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి. ఎందుకంటే ఆమె తన భర్తను కోల్పోయింది. దీన్నే మనం సనాతన ధర్మం అంటాం” అన్నారాయన.

కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ప్రధాన కార్యాలయం కలిగిన అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ యాపిల్. కొన్ని రోజుల క్రితం ఐఫోన్ 15 ధరలను విడుదల చేసింది. ఇది పన్నులు, దిగుమతి సుంకాల కారణంగా దేశం నుండి దేశానికి మారుతూ ఉంటుంది. కంపేర్‌డయల్, ఫోన్, సిమ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ను పోల్చి చూసే అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఐఫోన్ 15 చైనాలో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బేస్ మోడల్ iPhone 15 128GB ధర 825.22 డాలర్లు కాగా, అత్యంత ఖరీదైన మోడల్, iPhone 15 Pro Max 1TB ధర 1651.47 డాలర్లు.
ఐఫోన్ 15 అర్జెంటీనాలో అత్యంత ఖరీదైనది, iPhone 15 128GB ధర 2048.27 డాలర్లు కాగా.. iPhone 15 Pro Max 1TB ధర 4099.10డాలర్లుగా ఉంది.
ఐఫోన్ 15 తక్కువ ధర కలిగిన టాప్ 10 దేశాల జాబితా
Apple iPhone 15 తక్కువ ధర కలిగిన టాప్ 10 దేశాల జాబితా క్రింది విధంగా ఉంది:
చైనా (USD 825.22)
జపాన్ (USD 846.4)
USA (USD 849.73)
కెనడా (USD 917.88)
థాయిలాండ్ (USD 921.57)
UAE (USD 925.39)
ఖతార్ (USD 933.54)
తైవాన్ (USD 936.43)
మలేషియా (USD 939.96)
దక్షిణ కొరియా (USD 942.56)
వీటిలో చాలా దేశాలు ఆసియాలో ఉన్నాయి. ఈ జాబితాలో యూరోపియన్ దేశాలు లేవు.
భారతదేశంలో Apple iPhone 15 ధర..
భారతీయ కరెన్సీ పరంగా, 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల డిస్ప్లే సైజులలో లభించే iPhone 15, iPhone 15 Plus వరుసగా రూ. 79,900, రూ. 89,900 నుండి ప్రారంభమవుతాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max, 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల డిస్ప్లే సైజులలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వరుసగా రూ. 1,34,900, రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతాయి.
ఐఫోన్ 15 బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి, ఒక ఇండియన్ దేశ పౌరుల సగటు వార్షిక జీతంలో 38.6 శాతం ఖర్చు చేయాలి. అయితే, ధర పరంగా, ఐఫోన్ 15 ను కొనుగోలు చేసే ప్రపంచంలో అత్యంత తక్కువ ధర కలిగిన దేశాల్లో భారతదేశం 17వ స్థానంలో ఉంది.

ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ పోలింగ్ బూత్‌ను తలపించే గణేష్ పండల్‌ను రూపొందించింది. ఈ పండల్‌లో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కటౌట్‌ను కూడా ఉంచారు. గణేష్ విగ్రహం చేతిలో సెంగోల్ ఉంది.
లాల్డ్‌వాజాలోని ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ అధ్యక్షుడు సచిన్ చందన్ మాట్లాడుతూ, “మేము ఈసారి కొత్త థీమ్‌తో ముందుకు వచ్చాము. గతేడాది రైతు థీమ్ ను తీసుకున్నాం. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని మనందరికీ తెలుసు, అందుకే పోలింగ్ బూత్‌ను పోలిన గణేష్ పండల్‌ను మేము రూపొందించాం అని చెప్పారు. దీనికి గల కారణం ప్రతి ఎన్నికల్లో హైదరాబాద్‌లో కేవలం 50 శాతం పోలింగ్ శాతమే నమోదవుతోందని, గ్రామీణ ప్రాంతాలకు వచ్చే సరికి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాబట్టి హైదరాబాద్ పౌరులను మేల్కొల్పడానికి ఇదే మంచి సమయమన్న ఆయన.. తాము పోలింగ్ బూత్ గణేష్‌తో ముందుకు వచ్చామని స్పష్టం చేశారు.
18 ఏళ్ల యువతకు పోలింగ్ బూత్ విధానాలు తెలియవని సచిన్ చందన్ అన్నారు. ఆధార్, ఓటర్ ఐడీ లేదా ఇతర కార్డుల వంటి పత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లడం తప్పనిసరి కాబట్టి తాము ఇక్కడ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. “మేము డమ్మీ ఈవీఎం మెషిన్, బ్యాలెట్ బాక్స్‌ను కూడా తయారు చేశాము. కాబట్టి గత సంవత్సరాల నుండి మేము ప్రతిష్టించిన గణేష్ విగ్రహాల జాబితాతో కూడిన బ్యాలెట్ పేపర్లు మా వద్ద ఉన్నాయి. ఓటర్లు ఉత్తమ గణేష్ విగ్రహానికి ఓటు వేయాలి, బ్యాలెట్ పేపర్‌ను బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. కాబట్టి ఆచరణాత్మకంగా భక్తులకు ఈ అనుభవాన్ని అందిస్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మేము గత 12 సంవత్సరాలుగా కొత్త కాన్సెప్ట్‌లతో వస్తున్నాము”అన్నారాయన.
హిందూ ధర్మానికి గుర్తుగా గణేష్ విగ్రహం చేతిలో సెంగోల్ కూడా ఉందని సచిన్ అన్నారు. "దీని గురించి ఎవరికీ తెలియదు, అందుకే మేము దానిని ప్రదర్శించాము" అన్నారాయన. 13 ఏళ్ల నుంచి తాను ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీకి వస్తున్నానని, ప్రతిసారీ విభిన్నమైన థీమ్‌లను చూసేవాడినని స్మిత అనే భక్తురాలు తెలిపింది. “ఈ సంవత్సరం థీమ్ రాబోయే ఎన్నికల గురించి, యువ తరానికి మేల్కొలుపు పిలుపు. సెంగోల్ చోళ యుగానికి చెందినది, ఇది బ్రిటిష్ ప్రభుత్వం నుండి అధికార బదిలీని సూచిస్తుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడానికి సెంగోల్ ప్రదర్శించబడుతుంది”అన్నారు.
2019: Chandrayaan Ganesh
— Krishnamurthy (@krishna0302) September 12, 2021
2020: #Covid19 Ganesh
2021: #Vaccine Ganesh
Shoutout to Sachin Chandan, president of Future Foundation Society, who has been installing eco-friendly Ganeshas in #Hyderabad for the last 12 years at Lal Darwaza. #GaneshChaturthi #Ganesha pic.twitter.com/67enieHUCR

ప్రపంచ స్థాయి విద్యను అందించడంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఐఐటీలు, ఐఐఎమ్‌లు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు మొదలైన ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లు అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాయి. భారతదేశం నుండి అలాగే బోర్డింగ్ నుండి అనేక పెద్ద కంపెనీలు విద్యార్థులను నియమించుకోవడానికి ఈ ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శిస్తాయి. చాలా సార్లు ఈ విద్యార్థులు అధిక ప్యాకేజీలను పొందడం చూస్తేనే ఉంటాం. అలాంటి విద్యార్థి రుత్విక్ మన్యం అమెరికాకు చెందిన ఒక సంస్థ నుండి రూ. 1.35 కోట్ల విలువైన జాబ్ ఆఫర్‌ను పొంది రికార్డు సృష్టించాడు.
రుత్విక్ మన్యం మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-అలహాబాద్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ పూర్తి చేశారు. రుత్విక్ మన్యం ద్వారా లభించిన జాబ్ ఆఫర్ MNNIT విద్యార్థికి అమెరికన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం నుండి లభించిన అత్యధిక అంతర్జాతీయ ఆఫర్. రుత్విక్ మన్యం US సంస్థ A10 నెట్‌వర్క్‌ల ద్వారా లాభదాయకమైన ఉద్యోగాన్ని అందించింది. రుత్విక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను ప్రస్తుతం A10 నెట్‌వర్క్‌ల కాలిఫోర్నియా కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రుత్విక్ గతంలో మే-జూలై 2022 మధ్యకాలంలో A10 నెట్‌వర్క్స్‌లో ఇంటర్న్ అయ్యాడు. అక్కడ అతను సిస్టమ్స్ టీమ్‌లో భాగమయ్యాడు. ఇంటర్న్‌షిప్ USలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగింది.
రుత్విక్ మన్యన్ తన పాఠశాల విద్యను బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేశాడు. అక్కడ అతను గ్రేడ్ 10లో 10.0 CGPA, గ్రేడ్ 12లో 86.4% ఉత్తీర్ణత సాధించాడు. రుత్విక్ తన పాఠశాల రోజుల్లో ఆటల్లోనూ మంచి నేర్పరి. అతను స్పోర్ట్స్ కెప్టెన్. పాఠశాల వాలీబాల్, బాస్కెట్‌బాల్ జట్లలో భాగమయ్యాడు. కాగా, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్‌పూర్ (ఐఐఐటీ-ఎన్‌ఆర్) బీటెక్ విద్యార్థిని రాశి బగ్గా ఏడాదికి రూ.85 లక్షల ఉద్యోగ ప్యాకేజీని సాధించి చరిత్ర సృష్టించింది. 2023లో IIIT-NRకి చెందిన ఏ విద్యార్థికైనా అందించిన అత్యధిక ప్యాకేజీని అందుకున్నందున రాశి బగ్గా వార్షిక వేతనం రికార్డుగా ఉంది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనిమిచ్చారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. యోగ నరసింహ స్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి తిరు వీధుల్లో విహరించారు.
అధికసంఖ్యలో తరలి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరగనుంది.

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్‌లో మిథున్‌రెడ్డి అభ్యంతరకర ధోరణి కలకలం రేపింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడిపై మిథున్‌రెడ్డి అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఏయ్ కూర్చోరా అంటూ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ గురించి సోమవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడాక వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడటం ప్రారంభించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ సీమెన్స్‌తో ఒప్పందం కుదురిందని మిథున్‌రెడ్డి చెబుతుండగా వెనుక నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు దానిని ఖండిస్తూ మాట్లాడారు. అసహనానికి గురైన మిథున్‌రెడ్డి ఏయ్ కూర్చోరా బాబు.. నువ్వు మాట్లాడినావ్ చాల్లే కూర్చో అంటే ఏకవచనంతో సంబోధించారు.
ప్యానెల్ స్పీకర్ ఎన్‌కే ప్రేమచంద్రన్ జోక్యం చేసుకుంటూ కోర్టు పరిశీలనలో ఉన్న కేసు గురించి మాట్లాడటం మంచిది కాదన్నారు. టీడీపీ వారు ఈ అంశాన్ని లేవనెత్తడం వల్లే తాను మాట్లాడుతున్నానని మిథున్‌రెడ్డి చెప్పారు. ఆ వాదనతో ప్యానెల్ స్పీకర్ విభేదించారు. ప్రేమచంద్రన్ జోక్యం చేసుకుని ఈ కేసులో కోర్టును నిర్ణయం తీసుకోనివ్వండని అన్నారు. మిథున్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ రికార్డుల నుంచి తొలగించారు.

రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో జియో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముకేష్ అంబానీ ప్రణాళికలను ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది భారతదేశంలో ప్రారంభమైంది. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో అనుబంధ సంస్థను చూసుకుంటున్నారు. ఈ కొత్త జియో ఎయిర్‌ఫైబర్ సంస్థ నుండి వచ్చిన తాజా ఆఫర్. ఫిజికల్ కనెక్టివిటీ ద్వారా చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని వేగవంతం చేయడంలో Jio AirFiber సహాయపడుతుంది. జియో ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం అంతటా 1.5 మిలియన్ కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది, అయినప్పటికీ ఫిజికల్ లాస్ట్-మైల్ కనెక్టివిటీని అందించడం వల్ల మన దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా సమయం పడుతుంది.
ప్రారంభంలో ఈ కొత్త జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో అందుబాటులో ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ ఫిజికల్ కనెక్షన్ లేని జియో ఫైబర్ లాంటిది. ఈ సేవకు సబ్‌స్క్రైబర్‌లు మీ ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో సర్వత్రా కవరేజ్ కోసం WiFi రూటర్, 4K స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్-యాక్టివ్ రిమోట్‌ను పొందుతారు.
Jio AirFiber యూజర్లు ప్రముఖ OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్ వంటి వారికి నచ్చిన ఏదైనా పరికరంలో యాప్‌లను ఉపయోగించవచ్చు. భారతదేశంలో జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 599 నుండి ప్రారంభమవుతుంది. 1000 ఎంబిపిఎస్ స్పీడ్‌తో లైన్ ప్లాన్‌లో టాప్ ధర రూ. 3999. చాలా ప్లాన్‌ల ధర జియో ఎయిర్‌ఫైబర్ మాదిరిగానే ఉంటుంది.
జియోఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించిన సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, “మా విస్తృతమైన ఫైబర్-టు-ది-హోమ్ సర్వీస్ జియోఫైబర్ ఇప్పటికే 10 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రతి నెలా వందల వేల మంది కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇప్పటికీ మిలియన్ల కొద్దీ గృహాలు, చిన్న వ్యాపారాలు వేగంగా అనుసంధానించబడి ఉన్నాయి అని చెప్పారు.
“JioAirFiberతో, మేము మా దేశంలోని ప్రతి ఇంటిని ఒకే విధమైన సేవ నాణ్యతతో వేగంగా కవర్ చేయడానికి మా చిరునామా మార్కెట్‌ను విస్తరిస్తున్నాము. JioAirFiber విద్య, ఆరోగ్యం, నిఘా, స్మార్ట్ హోమ్‌లో దాని పరిష్కారాల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ వినోదం, స్మార్ట్ హోమ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్‌తో మిలియన్ల గృహాలను ఎనేబుల్ చేస్తుందని ఆకాష్ అంబానీ చెప్పారు

జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిందనే వార్తలకు చెక్ పడింది. గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలని జనసేన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది.
రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరఫున పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద రద్దు చేసింది. ఇక పార్టీకి గుర్తు ఉండబోదంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అదే గుర్తును కేటాయించి ఈ ప్రచారానికి చెక్ పెట్టింది

బెంగుళూరు.. ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి చెందిన నగరం. అతి తక్కువ దూరం వెళ్లాలన్నా నగర వాసులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. లొకేషన్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన డచ్ బహుళజాతి సంస్థ టామ్‌టామ్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, డ్రైవింగ్‌లో బెంగళూరు ప్రపంచంలోనే రెండవ అతి తక్కువ నగరంగా నిలిచింది. నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసేందుకు 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. గత సంవత్సరం, బెంగళూరు సిటీ సెంటర్‌లో అదే దూరం ప్రయాణించే సమయం 29 నిమిషాల 9 సెకన్ల కన్నా కొంచెం తక్కువ. ఈ రద్దీ మధ్య, బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వివిధ కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఓ మహిళా ప్రయాణీకురాలి కథ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది.
Xలో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో, ప్రియా అనే ఓ యూజర్ కారు సీటుపై ఉంచిన ఒలిచిన బఠానీలు, పచ్చి బఠానీల ప్యాకెట్ల ఫొటోను అప్‌లోడ్ చేశారు. ట్రాఫిక్ సమయాన్ని ఇలా వినియోగించుకున్నానని అని ఆమె పోస్ట్‌లో రాసింది. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఇప్పటివరకు దీనికి దాదాపు 1లక్షా 6 వేల వ్యూస్ వచ్చాయి. దీనికి అనేక కామెంట్స్ కూడా వచ్చాయి. “దీన్ని నా బాస్ కు పంపుతున్నాను” అని ఓ యూజర్ హాస్యాస్పదంగా రాసుకువచ్చారు.
Being productive during peak traffic hours 😑 pic.twitter.com/HxNJoveHwS
— Priya (@malllige) September 16, 2023

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడు. ప్రపంచంలోని 11వ ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు కూడా. అతను మార్కెట్ వాటా ప్రకారం భారతదేశపు అత్యంత విలువైన కంపెనీకి నాయకత్వం వహిస్తున్నాడు. ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ పారిశ్రామికవేత్త అయినప్పటికీ, అంత ధనవంతుడు కావడం అంత సులభం కాదు. అత్యంత సంపన్నుడైన ఇండియన్ సెక్యూరిటీ విషయానికి వస్తే దానికి ఆయన భారీ మొత్తంలో ఖర్చు చేస్తాడు. నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, శ్లోకా మెహతా అంబానీ, మనవరాళ్లతో కూడిన ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ. 15000 కోట్ల యాంటిలియా నుండి బయటకు వచ్చినప్పుడల్లా, భారీ SUVలు, భద్రతా కార్ల భారీ కాన్వాయ్ లే వారిని కాపాడుతూ ఉంటాయి. ముకేశ్ అంబానీ ఎప్పటికప్పుడు తన కాన్వాయ్‌ని అప్‌గ్రేడ్ చేస్తుంటాడు. తాజా నివేదికల ప్రకారం, బిలియనీర్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్-బెంజ్ కారుకు భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు.
ఈ సంవత్సరం బిలియనీర్ కొనుగోలు చేసిన రెండవ Mercedes-Benz S680 గార్డ్ లగ్జరీ సెడాన్. ఆటోమొబిలియార్డెంట్ ద్వారా వచ్చిన చిత్రాలలో, కొత్త కారు దాని పూర్తి వైభవాన్ని చూడవచ్చు. రూ. 10 కోట్ల సెడాన్‌ను మహీంద్రా స్కార్పియో, రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-వ్యాగన్‌లతో కూడిన పెద్ద కాన్వాయ్‌తో చూడవచ్చు.
ముఖేష్ అంబానీకి చెందిన Mercedes-Benz S680 గార్డ్ బయటి నుండి ఇతర Mercedes-Benz S-క్లాస్ లాగా కనిపిస్తుంది, అయితే ఇది సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువగా ఉంటుంది. సూపర్-ఖరీదైన కారు రీన్‌ఫోర్స్డ్ టైర్‌లతో వస్తుంది. ఇది గంటకు 80 కిమీ వేగంతో నడుస్తుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 Ps, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్‌ను కలిగి ఉంది. ఈ కారులో బుల్లెట్ అండ్ బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి.
ముఖేష్ అంబానీ లగ్జరీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-AMG G63, టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ కూడా ఉన్నాయి. ఈ కాన్వాయ్ కు సులభంగా రూ.30 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో ఈనెల 18 వరకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం నేడు తదుపరి విచారణ చేపట్టనుంది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది.

ఎయిర్ రేసింగ్ సందర్భంగా రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో జరిగిందీ ఘటన. ఇక్కడి రెనో ఎయిర్ రేసింగ్‌లో విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్టు ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఢీకొన్నట్టు పేర్కొంది. ప్రమాదంలో మరణించిన పైలట్ల వివరాలు తెలియాల్సి ఉంది. రెనోలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్ ఎయిర్ రేస్ చివరి రోజు ఈ ఘటన సంభవించింది. విమానాలు ల్యాండవుతున్న సమయంలో ఢీకొన్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మరణించిన పైలెట్లు వివరాలు తెలియాల్సివుంది.

వైసీపీ నేతలు పాలనలో అసమర్థులు మాత్రమే కాదనీ, నిజాన్ని చూడలేని కబోదులంటూ నారా బ్రాహ్మణి ధ్వజమెత్తారు. బ్యూరోక్రసీ, ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలను, యువత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం వైసీపీకి తగదని బ్రాహ్మణి హితవు పలికారు.

వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సీమెన్స్ మాజీ ఎండీ అనుమానాలు నివృత్తి చేశారని ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. ఉపాధి అవకాశాల రక్షణకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని బ్రాహ్మణి స్పష్టం చేశారు.

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలన్నారు.

సీఎం జగన్ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్న ఎంపీలు …చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలూ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. పార్లమెంట్ లోనూ తమ నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ టీడీపీ నేతలు గణపతి మాలధారణ చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో తొలిసారిగా 50 మంది తెలుగుదేశం పార్టీ నేతలు గణపతి మాలాధారణ చేపట్టి లక్ష్మీ గణపతి ఆలయంలోప్రత్యేక పూజలు చేశారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నినదించారు. 2024 లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాలని గణనాథుడ్ని ప్రార్థించారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయీ హయాంలో ఛత్తీస్ గఢ్ , ఉత్తరాఖండ్ , ఝార్ఖండ్ రాష్ర్టాల ఏర్పాటును పార్లమెంట్ అందరి ఆమోదంతో జరిపిందని నూతన రాష్ర్టాలతో పాటు విభజన రాష్ర్టాలు సైతం సంతోషంగా సంబరాలు జరుపుకున్నాయని మోడీ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు సమయంలో మాత్రం తెలుగు రాష్ర్టాలు సంబరాలు చేసుకోలేకపోయాయని లోక్ సభలో గుర్తు చేశారు.

ఏకాభిప్రాయంతో ఎంతటి కఠిన సమస్యలైనా పార్లమెంట్ ద్వారా పరిష్కరమయ్యాయని అన్నారు. 2000 సంవత్సరంలో అటల్ సర్కారు అందర్నీ సంతృప్తి పరిచేలా మూడు రాష్ట్రాల్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదన్న మోడీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రెండు తెలుగు రాష్ట్రాలు అసంతృప్తికి గురయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులను అణచివేయడానికి భారీ ప్రయత్నాలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఉన్న ఉత్సాహంతో జరిపి ఉంటేఈరోజు సరికొత్త ఎత్తులకు వెళ్లి ఉండేదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అరెస్ట్‌కు నిరసనగా ఖండాతరాల్లోనూ నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో ఐటీ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించగా... తాజాగా డల్లాస్‌లో తెలుగు ప్రజలు ఆందోళనలతో కదం తొక్కారు. దార్శనికుడు చంద్రబాబంటూ డల్లాస్‌లోని తెలుగు ప్రజలు నినదించారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శరించారు.
చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. న్యాయం కావాలి - చంద్రబాబు విడుదల కావాలనే నినాదాలతో డల్లాస్ వీధుల్లో నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలు భారీగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. బాబు అరెస్టు అక్రమమన్న నినాదాలతో పరిసర ప్రాంతాలను హోరెత్తించారు. వాషింగ్టన్ లోనూ తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా ఆందోళన చేశారు. బాబును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా జరిగిన ఆందోళనలతో బెంగళూరు దద్దరిల్లింది. వరుసగా రెండోరోజూ బెంగళూరులో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు బెంగళూరు నగర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
బెంగళూరు విధాన సౌధ సమీపంలో ప్రజలు ఆందోళనలు చేశారు. తెలుగు సంఘాలకు ఐటీ ఉద్యోగులు, నిపుణులు మద్దతు ప్రకటించారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ నేతలు నాలుగో రోజు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన దీక్ష కొనసాగించారు. తాడేపల్లికి చెందిన నాయకులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలో తెలుగు ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యూజెర్సీలో తెలుగుదేశం-జనసేన జెండాలతో భారీ ర్యాలీ తీశారు. చంద్రబాబు వల్లే తామంతా విదేశాల్లో స్థిరపడ్డామని ప్రవాసాంధ్రులు గుర్తు చేసుకున్నారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ధ్వజమెత్తారు.

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నేడు కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా తిరస్కరించారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ పైనా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా కాదనడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమహేంద్రవరంలోనే నారా భుననేశ్వరి ఉంటున్నారు.

వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలు పెట్టాలని చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, తాను కలిసి నిర్ణయించినట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఏపీ ప్రజల భవిష్యత్ కోసమే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రజావేదిక కూల్చడం నుంచి చంద్రబాబుని రిమాండ్‌కు పంపే వరకూ జగన్ సైకో చర్యలకే పాల్పడ్డారని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని ఆరోపించారు.
తాము ఏమీ షెల్ కంపెనీలు పెట్టి, క్విడ్ ప్రోకో వంటి మోసాలు చేయలేదని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు భద్రతపై లోకేశ్ మరోసారి ఆందోళ వ్యక్తంచేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదని, ఇక భద్రతపై నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


