చిట్టి న్యూస్

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.. రైతుబంధు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి జమ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలన్నారు.. అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకూ రైతుబంధు సాయం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీని బీహార్‌లా మార్చేశారు: భరత్

ఏపీని సీఎం జగన్‌ బీహార్‌లా మార్చేశారని మండిపడ్డారు టీడీపీ విశాఖ నేత భరత్‌. ఏపీలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని..వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతుందని ఫైర్‌ అయ్యారు.విశాఖలో రాజధాని సంగతి ఏమో కానీ.. ఉన్న భూములు దోచేస్తున్నారని అన్నారు. జగన్‌ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. వైసీపీ పాలనలో విశాఖని క్రైమ్‌ సిటీగా మార్చేశారన్నారు.

Hyderabad: ఘనంగా రాహుల్‌ పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు. కాంగ్రెస్‌ అగ్రనేతకు కాంగ్రెస్‌ నేతలతో పాటు పలు పార్టీల నేతలు కూడా శుశాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడిలో టీపీసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

తల్లి కుమారులు మిస్సింగ్‌...

సంగారెడ్డి జిల్లాలో తల్లితో పాటు ఇద్దరు కుమారులు మిస్సింగ్‌ అయ్యారు. నాలుగు రోజుల క్రితం తెల్లాపూర్‌ మున్సిపాలిటి పరిధిలో ఉన్న విద్యుత్‌నగర్‌కు గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య కుటుంబం వచ్చింది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న యేసయ్య తన కుమారులు అభిలేష్‌, పృథ్వీని స్థానిక స్కూల్లో చేర్పించాడు. అయితే శనివారం స్కూల్‌కు వెళ్లిన కుమారులను సాయంత్రం తీసుకొచ్చేందుకు వెళ్లిన భార్య యశోద ఇంటికి రాలేదు. రాత్రైనా భార్యాపిల్లలు రాకపోవడంతో కొల్లూరు పీఎస్‌లో యేసయ్య ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మిస్సైన తల్లీకుమారుల గాలింపు చేపట్టారు.

జగన్‌ సర్కార్‌ పై చింతమనేని ఫైర్‌

జగన్‌ సర్కార్‌ పై టీడీపీ సీనియర్‌ నేత చింతమనేని ఫైర్‌ అయ్యారు.వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. 10వ తరగతిచదువుతున్న 15 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపడం దారుణమన్నారు.ఈ నాలుగేళ్లలో జరిగిన అరాచకాలకు సీఎం బాధ్యత వహించాలి డిమాండ్‌ చేశారు. బీసీలు బ్యాక్‌ అని బోన్‌ అని చెప్పే వైసీపీ నేతలు వారినే పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి అరాచకాలు చూడలేదన్నారు.

ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డ జనసేనాని

వారాహి విజయ యాత్ర సందర్భంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. దీంతో ఇవాళ చంద్రశేఖర్‌రెడ్డి సైతం.. పవన్‌ కల్యాణ్‌పై ఫైర్‌ అయ్యారు. దీంతో చంద్రశేఖర్‌ రెడ్డిపై జనసేన నేతలు, వీర మహిళలు విరుచుకుపడుతున్నారు. కాకినాడను గంజాయి హబ్‌గా మార్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డా తమ నేత గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవర్ స్టార్ పై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కళ్యాణే పెద్ద రౌడీ..పెద్ద గుండా అంటూ వెల్లడించారు. జనసేనలో ఉన్నవాళ్లంతా రౌడీలు, గుండాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌పైనే రౌడీకేసులు ఉండి ఉండొచ్చని మంత్రి బొత్స అన్నారు. అలాగే విశాఖ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్‌పై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్‌ ఎలా జరిగిందో విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో విశాఖలో రౌడీ అనే వాడే లేకుండా చేస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త విశాఖను మీరు చూస్తారని మంత్రి వెల్లడించారు.

పట్టుబడ్డ డ్రగ్స్‌ ముఠా..

రంగారెడ్డి జిల్లా మైలార్‌ దేవ్‌ పల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. 400 మెఫెంటెర్మైమన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లు సీజ్‌ చేశారు డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు. వట్టెపల్లి, దుర్గానగర్‌ చౌరస్తా వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు. జిమ్‌ ట్రైనర్‌ నితీష్‌, రాహుల్‌తో పాటు సోహెల్‌లను అరెస్ట్‌ చేశారు అధికారులు. పట్టుబడ్డ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ప్రధాన సూత్రధారి ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్‌ అధికారులు.


నౌకలో చెలరేగిన మంటలు

ఫిలిప్పీన్స్‌లోని బోహోల్ ద్వీపంలో 120 మంది ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన కోస్టోగార్డు మంటల్ని ఆర్పేసింది. మొత్తం 120 మంది ప్రయాణికులతో పాటు సిబ్బందిని కాపాడారు. మంటలు ఆరిపోయాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు కోస్ట్‌ గార్డు సిబ్బంది. నౌక సిక్విజోర్ మరియు బోహోల్ దీవుల మధ్య ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. కోస్ట్ గార్డ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి రెస్క్యూ షిప్‌లు పాంగ్లావ్, బోహోల్ జలాల్లోనే ఉంటాయని తెలిపారు అధికారులు.

విద్యార్థినిపై లైంగిక దాడి, వైసీపీ కార్యకర్త అరెస్ట్

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అమానుషకరమైన ఘటన జరిగింది. 13వ డివిజన్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఉంటున్న డిగ్రీ ఫస్టియర్ విద్యార్థినిపై SN గొల్లపాలెంకు చెందిన వైసీపీ కార్యకర్త ఆవుల సతీష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో ఆ విద్యార్థినితో ఉన్న పరిచయంతో హాస్టల్ లో ఉంటున్న ఆమెను తన బైక్ పై బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెతో మద్యం తాగించడమే కాకుండా డ్రగ్ ఇంజక్షన్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో విద్యార్థిని హాస్టల్ నుండి తీసుకెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత హాస్టల్ వద్ద వదిలాడు. అనుమానం వచ్చిన వార్డెన్ విద్యార్థిని ప్రశ్నించగా జరిగినదంతా చెప్పింది. దీంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సతీష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

5వ రోజుకి చేరిన వారాహి యాత్ర

జనసేన వారాహి యాత్ర ఐదోరోజు కాకినాడ రూరల్‌లో కొనసాగనుంది.. ఈరోజు సాయంత్రం సర్పవరంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తారు.అయితే, పవన్‌ పర్యటనపై వైసీపీ నేతలు మాటల దాడి చేస్తున్నారు.దీనికి జనసేన నేతలు కూడా కౌంటర్‌ ఇస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని జనసేన నేత పంతం నానాజీ ఆరోపించారు.సభను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  

పీపీల్స్‌ మార్చ్ పాదయాత్రకు అపూర్వ స్పందన

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టినపీపీల్స్‌ మార్చ్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న భట్టి విక్రమార్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా పానగల్లులో భట్టి పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రలో భట్టి విక్రమార్క దగ్గరకు వచ్చిన వృద్దురాలు అంజమ్మ తన బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పెన్షన్ రెండు నెలలకోసారి వస్తుందంటూ వాపోయింది. అయితే వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందని వృద్ధురాలు అంజమ్మకు భట్టి విక్రమార్క భరోసా కల్పించారు.

రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్‌ రేపు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హరితోత్సవంలో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరు అర్బన్‌ పార్కులో మొక్కలు నాటనున్నారు. రేపు జరిగే సభ స్థలానాన్ని పరిశీలించారు సీఎస్ శాంతి కుమారి‌, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎంపీ రంజిత్ రెడ్డి. 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

కొండ చిలువ హల్‌చల్‌...

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లిలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. ఒక్కసారిగా ఊళ్లోకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు,.. గ్రామస్తులు చూస్తుండగానే కుక్కను మింగేసింది కొండచిలువ. దీంతో స్థానికులు పరుగులు తీశారు. ఇక ప్రాణ భయంతో కొండచిలువను కొట్టి చంపారు. దీంతో మహిళలు, చిన్నారులు ఊపిరిపీల్చుకున్నారు.

యాదగిరిగుట్టలో..చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదం

 యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఇకపై చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. అండుకొర్రలు, అరికెలు, సామలు, సామలు, బెల్లంతో చిరుధాన్యాల లడ్డూలను తయారు చేసేందుకు అధికారులు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశారు. వివిధ సైజుల్లో తయారు చేసిన లడ్డూ నమూనాలను నిపుణుల కమిటీ పరిశీలనకు పంపారు దేవాదాయశాఖ అధికారులు. కమిటీ ఆమోదంతో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదాల పంపిణీకి మార్గం సుగమం అయింది. ఒక్కో లడ్డూ ధరను 40 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి చిరుధాన్యాల లడ్డూలు భక్తులకు అందుబాటులోకి రానున్నారు.

కొండెక్కిన కోడి ధర..

హైదరాబాద్‌లో చికెన్ ధరలు మండిపోతున్నాయి. రికార్డ్‌ స్థాయికి చేరాయి. మే నెలలో కేజీ చికెన్‌ 200 రూపాయలు ఉండగా,.. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర 300 రూపాయలుగా ఉంది. అదేవిధంగా మటన్‌ కేజీ 800 రూపాయల నుంచి 1,000 రూపాయలు పలుకుతోంది. ఒక్క కోడి గుడ్డు ధర 5రూపాయల 50పైసలుగా ఉంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో కూరగాయలు కొనలేక  నాన్‌వేజ్‌ తినలేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. 

ఢిల్లీలో కాల్పుల కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు.ఇవాళ ఉదయం ఆర్కే పురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు మహిళలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.చనిపోయిన మహిళలు పింకీ,జ్యోతిగా గుర్తించారు. డబ్బు సెటిల్మెంట్‌ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జగన్ సర్కార్‌పై.. ఎంపీ జీవీయల్ ఫైర్‌

జగన్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ జీవీయల్ ఫైర్‌ అయ్యారు. విశాఖ సభలో అమిత్‌షా ప్రసంగాన్ని చూసి వైసీపీ నేతల్లో భయం మొదలైందని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు,అన్యాయాలను అమిత్‌షా వివరించారని తెలిపారు. ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, విశాఖలో క్రైం థ్రిల్లర్ ను మరిపించే ఘటన జరిగిందని అన్నారు. ఓ చిన్న పిల్లాడిని పెట్రోల్ పోసి తగులబెట్టడం దారుణమన్న జీవీఎల్‌ వైసీపీ వారే నిందితులుగా ఉంటే జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు. మేం మనుషులం కాదు రాక్షస సంత అని ఒప్పుకోండని వైసీపీ నేతలను డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇన్ని నేరాలు,ఘోరాలు జరుగుతున్నా సీఎం సైలెంట్‌గా ఉన్నారని మండిపడ్డారు జీవీఎల్‌.

రివాల్వర్‌తో..సర్పంచ్‌ని బెదిరించిన ఎస్సై..

తిరుపతి జిల్లా రామకుప్పం ఎస్సై కృష్ణయ్య దూషించాడంటూ కుప్పం జడ్జికి ఫిర్యాదు చేశారు ఉన్సినానిపల్లి మాజీ సర్పంచ్‌ మహదేవి జయశంకర్‌ దంపతులు. స్టేషన్‌లో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణయ్య తమను కులంతో పేరుతో దూషించడమే కాకుండా రివాల్వర్‌తో బెదిరించినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. మరోవైపు ఎస్సై కృష్ణయ్యతో ప్రాణ హాని ఉందని కుప్పం రూరల్‌ సీఐకి సైతం ఫిర్యాదు చేశారు జయశంకర్‌ దంపతులు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి..

చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి చేసిన 8మందిని నంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్‌ గ్రామానికి చెందిన శ్యామల, యాదయ్యలపై గ్రామస్తులు దాడి చేశారు. చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. చెట్టుకు తలకిందులుగా కట్టేసి చావబాదారు. తప్పించుకుని మరో వ్యక్తి పారిపోయాడు. ఓ మంత్రగాడు చెప్పిన మాటలు విని ఆ దంపతులపై గ్రామస్తులు తమ ప్రతాపం చూపించారు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే వెలేస్తామని బాధితులను బెదిరించారు. విషయం తెలుసుకుని ఆ దంపతులను రక్షించారు పోలీసులు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు.

ముంబయిలో అగ్ని ప్రమాదం

ముంబైలోని ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ముంబై నారిమన్‌ పాయింట్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌ పైఅంతస్తు నుంచి పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హోటల్‌ దగ్గర చేరుకొని మంటలను నియంత్రించారు. హోటల్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఫైర్‌ సిబ్బందికి సహాయం చేశారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు. అయితే తమకు హాటల్‌ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ముంబై మున్సిపాలిటి అధికారులు తెలిపారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొందు దొందే: రేవంత్ రెడ్డి

కర్నాటకలో బీజేపీ... తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా లేదన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. అక్కడ బీజేపీది 40 శాతం కమిషన్ సర్కార్ అయితే.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ది 30 శాతం కమిషన్ సర్కార్ అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు దండుపాళ్యం ముఠా మాదిరిగా రెచ్చిపోతున్నారని అన్నారు. శాండ్, ల్యాండ్‌, మైన్‌ అవినీతిలో ఎక్కడా చూసినా బీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చరిత్ర దేశమంతా తెలిసినా.. కేసీఆర్‌కు తెలియడం లేదా అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరప్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యులను తక్షణమే తొలగించాలన్నారు.

గిరిజనులను విస్మరించిన వైసీపీ సర్కార్: లోకేష్

వైసీపీ సర్కార్‌ గిరిజనులను విస్మరించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఫైరయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కల్లూరులో.. గిరిజనులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని లోకేష్‌ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు తెస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ జలసిరి పథకానికి పేరు మార్చి.. జలకళగా మార్చారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ జగన్‌ అటకెక్కించారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీలకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు వేస్తామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.

దివ్యాంగుడికి పవర్ స్టార్ అండ

దివ్యాంగుల ఫించన్ ను తీసేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశాడు ఓ దివ్యాంగుడు. కాకినాడ రూరల్ స్వామినగర్ కు చెందిన దివ్యాంగుడు పవన్ ముందు కన్నీటి పర్యంతం అయ్యాడు. కరోనా కాలంలో చాలా మంది ఫించన్ దారులు చనిపోయారని చెప్పారు. వాళ్ల ఫించన్ భారం ప్రభుత్వానికి తగ్గిపోయినా కాని... ఉన్నవారి కూడా తీసేసారని తన ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ దివ్యాంగుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

కూలర్లు, ఫ్యాన్లకు పూలహారాలు వేసి..నిరసన

అనంతపురంలో సీపీఐ వినూత్నంగా నిరసన తెలిపారు. టవర్ క్లాక్ వద్ద టీవీ కూలర్లు, ఫ్యాన్లకు పూలహారాలు వేసి, పూజలు చేయించి ధర్నా నిర్వహించారు. జగన్ సర్కారుపై మండిపడిన సీపీఐ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.పేదలు ఉక్కపోతలో ఫ్యాన్ వేసుకోకుండా కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంచి ఫ్యాన్‌, కూలర్లకు పని లేకుండా పోయిందని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ టీవీలకు పూజలు

అనంతపురంలో సీపీఐ వినూత్నంగా నిరసన తెలిపారు. టవర్ క్లాక్ వద్ద టీవీ కూలర్లు, ఫ్యాన్లకు పూలహారాలు వేసి, పూజలు చేయించి ధర్నా నిర్వహించారు. జగన్ సర్కారుపై మండిపడిన సీపీఐ నేతలు.. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేదలు ఉక్కపోతలో ఫ్యాన్ వేసుకోకుండా కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంచి ఫ్యాన్‌, కూలర్లకు పని లేకుండా పోయిందని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ముగిసిన ఐటీ సోదాలు..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి.3 రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీలు,ఆడిటర్లు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టారు.కీలక సమాచారాన్ని సేకరించిన ఐటీ అధికారులు వ్యాపార వ్యవహారాలు, చెల్లిస్తున్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు.పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు గుర్తించిన అధికారులు కీలక డాక్యుమెంట్లు,విలువైన ఆభరణాలు గుర్తించారు.

ఖమ్మంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఖమ్మంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్త బస్టాండ్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, సుమారు 60కేజీల గంజాయి బయటపడింది. కొనిజర్ల మండలం లక్ష్మీపురానికి చెందిన కుర్ర సాయికుమార్‌, రేవతి సెంటర్‌కు చెందిన గంజాయి వ్యాపారి సైదులు వద్ద నుంచి, గంజాయిని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. పట్టుబడిన గంజాయి సుమారు తొమ్మిది లక్షల విలువ ఉంటుందని తెలిపారు ఎస్సై ప్రసాద్.

సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌

వివేకా హత్య కేసులో.. సీబీఐ విచారణకు హాజరయ్యారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. ఆయనకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ నెల చివరి వరకు.. ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ఇవాళ సీబీఐ ముందు హాజరు కానున్నారు. ముందస్తు బెయిల్‌ వచ్చిన తర్వాత.. అవినాష్‌ మూడోసారి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన్ను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు..

ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చేసిన మున్సిపల్ అధికారులు

ఏలూరు లోని పాత బస్టాండ్,34వ డివిజన్ వద్దగల DM&HO ఆఫీస్ వెనుక సుమారు 50 సంవత్సరాల నుండి పేదలు నివాసం ఉంటున్న ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.. ఈరోజు ఉదయం నుండి తొలగిస్తు, తొలగింపు సమాచారాన్ని బయటకు తెలియకుండా JCB లతో ఇళ్లను కులుస్తూ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు..సమాచారం తెలుసుకున్న ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) బాధిత ప్రాంతానికి వెళ్లడంతో మున్సిపల్ అధికారులు పలాయనం చిత్తగించారు,బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని, ఆయన తెలిపారు.

కీచక PET టీచర్‌ను చితకబాదిన గ్రామస్తులు

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని PET టీచర్‌ సంగ్రామ్‌ లైంగికంగా వేధించాడని ఆరోపించారు గ్రామస్తులు. దీంతో సంగ్రామ్‌ను చితకబాది, పోలీసులకు అప్పగించారు విద్యార్ధిని కుటంబ సభ్యులు. అయితే సిర్గాపూర్‌ గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డ్ ను సైతం ఆగ్రహంతో వెంటబడి మరీ కొట్టారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సై భయంతో పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయాడు.

బ్రతికున్న కూతురికి కర్మకాండ

కర్నూలు జిల్లా పెద్దకడబూరులో బ్రతికున్న కూతురికి కర్మకాండ నిర్వహించారు తల్లిదండ్రులు. కూతురు ఫోటోకు పూలమాల వేసి, టెంకాయలు కొట్టి కర్మకాండలు చేసారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురానికి చెందిన పెద్ద నాగన్న, ఉరుకుందమ్మల పెద్ద కూతురు ఇందు ప్రేమ వివాహం చేసుకోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కూతురు తిరిగిరాకపోవడంతో, బాధను వ్యక్తపరుస్తూ బ్రతికి ఉండగానే కూతురికి కర్మకాండను నిర్వహించారు.

గులాబీ మయమైన నాగ్‌పూర్

కేసీఆర్ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్‌ గులాబీ మయమైంది. పట్టణమంతా బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసీఆర్‌ హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. నాగ్‌పూర్ లోని గాంధీబాగ్‌లో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ భవన్‌ను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్త ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో హోరెత్తించారు.

Hyderabad: ఔషధ గోడౌన్‌లో సోదాలు

హైదరాబాద్‌ చైతన్యపురి పీఎస్‌ పరిధిలోని ఓ గోడౌన్‌లో ఔషధ నియంత్రణ అధికారులు సోదాలు నిర్వహించారు. లేబుల్స్‌ లేని మందులు, గడువు ముగిసిన మందులను భారీగా నిల్వ చేసినట్లు గుర్తించారు. 50 లక్షల విలువైన స్టాక్‌ను సీజ్ చేసి ఉమేష్‌ బాబులాల్ అనే వ్యక్తిని ఎల్‌బీ నగర్‌ ఎస్‌వోటి పోలీసులకు అప్పగించారు. ఐదు సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా దందా జరుగుతోంది. గడువు ముగిసిన రా మెటీరియల్‌ను ఎక్కడికి పంపిస్తున్నారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.  

విశాఖలో మండుతున్న కూరగాయల ధరలు

విశాఖలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లు, ఓపెన్ మార్కెట్ అన్న తేడా లేకుండా ధరలు మండిపోతుండటంతో సామాన్యలు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లలో నాలుగైదు రకాల కూరగాయలు తప్ప.. మరేవీ లభించడం లేదు. ఎండల ప్రభావం కూరగాయల పంటలపై పడిందంటున్నారు రైతులు.. దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లలో కొరత ఏర్పడి ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరో వైపు వినియోగదారులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని నిట్టూరుస్తున్నారు.

45 డిగ్రీల ఎండలోనూ లోకేష్‌ పాదయాత్ర: సోమిరెడ్డి

లోకేష్‌ పర్యటన ఎవరూ ఊహంచని విధంగా సక్సెస్‌ అయిందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి. 45 డిగ్రీల ఎండలోనూ లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. రైతులతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహిస్తే వ్యవసాయ మంత్రి ఎనాడైనా సమావేశాలు పెట్టాడా అంటూ ప్రశ్నించారు. రైతులతో సమావేశాలు నిర్వహించే దమ్ము కన్నబాబుకు గాని, కాకాణినికి గానీ లేదన్నారు.