చిట్టి న్యూస్

తమిళ బిడ్డ.... తెలంగాణా అక్క

ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయితీల సమస్యలు విన్నానన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. ఈ ఐదు గ్రామాల ప్రజల కష్టాలు చాలా బాధ కలిగించాయన్నారు. 5 గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని గిరిజనులు కోరారని.. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. తాను తమిళ బిడ్డనైనా... తెలంగాణ ప్రజలకు అక్కనన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని, ఆదివాసీల సమస్య పరిష్కారానికి  ప్రయత్నిస్తానన్నారు. గిరిజనులతో గవర్నర్‌ తమిళిసై పదం కలిపారు. వారి సాంప్రదాయ నృత్యంలో అడుగులు కలిపారు. 

రోడ్డెక్కిన రైతన్న

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం-వరంగల్ రహదారిపై ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయియి. ప్రభుత్వం, అధికారులపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి గింజను కొంటామని చెప్తున్న ప్రభుత్వం.. ఇపుడెందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

కొనసాగుతోన్న ఎపీజేఏసీ ఉద్యమం

అనంతపురం జిల్లాలో ఏపీ ఉద్యోగుల మూడో దశ ఉద్యమం ప్రారంభమైంది. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. 60 రోజులుగా ఉద్యమం చేస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్కోగులకు జగన్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని బొప్పరాజు హెచ్చరించారు. 

డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్

డ్రైవర్ లేకుండా పొలం దున్నే ట్రాక్టర్‌ను ఎప్పుడైనా చూశారా? వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదూ. కానీ తెలంగాణ యువ ఇంజినీర్లు చేసి చూపించారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు.. ప్రొఫెసర్ల సాయంతో సెల్‌ఫోన్‌ సాయంతో కంట్రోల్ చేస్తూ పొలం దున్నే ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. డ్రైవర్‌ లేకుండానే ట్రాక్టర్‌ నడవటం చూసి తాను ఆశ్చర్యపోయానంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ మేధాశక్తితో తెలంగాణ యువ ఇంజినీర్లు కొత్త ఆవిష్కరణను ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. 

శృంగవరపు కోటలో బాబు పర్యటన

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పర్యటించనున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ కోళ్ల లలితకుమారి ఆధ్వవర్యంలో.. ఈ కార్యక్రమం జరుగనుంది. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి కొత్త వలస రానున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం.. పుణ్యగిరి, వివేకానంద కళాశాల మీదుగా.. ఎస్‌ కోట దేవిగుడి కూడలి వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు.

కరీంనగర్ జిల్లాలో లింగ నిర్ధారణ కేంద్రాలు

కరీంనగర్ జిల్లాలో లింగ నిర్ధారణ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేకుండా వెలుస్తున్న స్కానింగ్ సెంటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. పలుచోట్ల అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని అంటున్న డీఎంహెచ్ఓ.

నిప్పులు కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలు

రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్‌, రాజమండ్రిలో రికార్డుస్థాయిలోఒ 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ పలు జిల్లాల్లోను 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు, ఏలూరులో 48, భీమవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోని మిర్యాలగూడ 47, పాల్వంచలో 46 డిగ్రీలు, వరంగల్‌, నల్గొండలలో 43, జగిత్యాలలో 44, కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

కాసేపట్లో బీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశం

బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సభ్యులు భేటీ కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ,రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 13న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 21 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై ఇవాళ జరిగే సమావేశంలో సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

సిద్ధరామయ్యకే పట్టం

కర్నాటక నూతన సీఎంగా సిద్దరామయ్య పేరు ఖారరైంది. ఈ మేరకు కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. డీకే, సిద్దరామయ్యతో రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనేక చర్చల తరువాత సిద్దరామయ్య పేరును ఫైనల్‌ చేసి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. కంఠీరవ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాజరు కానున్నారు. 

వర్క్ ఫ్రమ్ హోమ్ పరమ చెత్త విషయం

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా చెత్త విషయం అని ఎలోన్ మస్క్ తేల్చేశాడు. అలాంటి ఆలోచనను విరమించుకోవాలని టెక్ ఉద్యోగులకు హితువు పలికాడు. ఇది కొంతమందికి నచ్చకపోయినా, ఆఫీసుకు వచ్చి పని చేయడం వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుందని వెల్లడించాడు. ప్రజలు శారీరకంగా పనిలో ఉన్నప్పుడు ఎక్కువ సాధిస్తారని నొక్కి చెప్పాడు ట్విట్టర్ బాస్. 

విమానంలో బీడీ తాగి... నేరుగా జైలుకి

విమానంలో బీడీ తాగుతూ పట్టుబడిన ఓ వ్యక్తి జైలు పాలైన ఘటన అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోన్న అకాసా విమానంలో చోటుచేసుకుంది. ప్రవీన్ కుమార్ (56) అనే వ్యక్తి టాయ్ లెట్ కు వెళ్లి బీడీ తాగుతున్నట్లు ఎయిర్ లైన్స్ సిబ్బంది గుర్తించారు. దీనిపై డ్యూటీ మేనేజర్ బెంగళూరు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినట్లు వెల్లడించిన ప్రవీణ్ నిబంధనల గురించి తెలియదని వాపోతున్నాడు. 

ఇద్దరినీ ఏకి పారేసిన పోలీసులు

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ బాడీ గార్డ్ చిక్కుల్లో పడ్డాడు. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆమెను బైక్ పై షూటింగ్ కు తీసుకుని వెళ్లగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాడీ గార్డు హెల్మెట్ ధరించలేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ మేరకు పోలీసులు అనుష్క బాడీ గార్డుకు రూ.10,500 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఆతర్వాత అతను జరిమానాను కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విధంగా అమితాబ్ బచ్చన్ కూడా హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని బిగ్ బీ స్పష్టం చేశారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధ వారం తెల్లవారుజామున దాచేపల్లి మండలం పొందుగల దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురుజాల ఆస్పత్రికి తరలించారు. తెలంగాణకు చెందిన 23 మంది కూలీలు ఆటోలో వెళుతుండగా.. లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులు, మృతులంతా నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈటెల, బండి... ఛలో ఢిల్లీ

పార్టీ హైకమాండ్‌ పిలుపు మేరకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ బీజేపీని గాడిన పెట్టే పనిలో ఉన్న అగ్ర నాయకత్వం, కర్నాటక ఎన్నికల ప్రభావం రాష్ట్రంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నాయకుల మధ్య వర్గపోరుపై బీజేపీ అగ్ర నాయకత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకుల వ్యక్తిగత లక్ష్యాలతో పార్టీ నష్టపోతోందన్న భావనలో కమలం పార్టీ నాయకులు ఉన్నారు. పరిస్థితులు చేయి దాటకముందే తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సంజయ్‌, ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. 

రీఛార్జ్ అవుతోన్న షర్మిలక్క...

కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొట్టిపడేశారు. విలీనం చేయటానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. తాను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దని చెప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వ లోపం కాంగ్రెస్ లో ఉందన్నారు. ఇక పొత్తులపై అన్ని పార్టీల నుంచి తమకు మిస్‌డ్ కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతం చార్జింగ్ మోడ్‌లో ఉన్నామన్నారు షర్మిల.

మెదక్‌ జిల్లా అన్నదాతలు రోడ్డెక్కారు

మెదక్‌ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత వల్ల తరలించడం లేదని వెల్దుర్తిలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి ధర్నాకు దిగారు. వరికి తెగులు సోకి తీవ్రంగా నష్టపోయామని.. అకాల వర్షాలకు మరింత నష్టపోయామని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల మోసం.. ఇద్దరు మహిళల అరెస్ట్

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామంటూ వందల మందిని మోసం చేసిన ఇద్దరు మహిళల్ని.. ఖమ్మం టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసే షకీనాబేగం, రిసోర్స్‌ పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధితులు టూటౌన్‌ పీఎస్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నిందితులను కోర్టుకు తరలిస్తుండగా పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు.

ప్రాణం తీసిన రుణ భయం

అప్పుకోసం వచ్చిన రైతు బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి చివరకు అసువులు బాసిన వైనం అంనతపురంలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో పంటరుణం రెన్యువల్‌ నిమిత్తం వెంకట రామిరెడ్డి అనే రైతు తిరిగి తిరిసి వేశారి పోయాడు. పలు కారణాలతో అతడిని తిప్పించుకుంటున్నారు బ్యాంక్‌ అధికారులు. అప్పు రెన్యువల్‌ అవుతుందో లేదో అన్న ఆందోళన చెందిన రైతు రుణభారం ఎక్కువై పోతుందన్న బాధతో గుండెపోటుకు గురై కన్ను మూశాడు. 

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌తో అనుబంధం కలిగిన వారి సమక్షంలో ఈ నెల 20న కూకట్‌పల్లి కైతల్లాపూర్‌ మైదానంలో వేడుకలను నిర్వహించనున్నారు. ఎన్ఠీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్‌సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో శకపురుషుడు సావనీర్, జయహో ఎన్టీఆర్ వైబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, దత్తాత్రేయ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ అతిథులుగా హాజరుకానున్నారు.

NTR 100th Birth Anniversary: ఎన్టీఆర్‌ శతజయంతి.. సిద్ధమవుతోన్న హైదరాబాద్‌

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌తో అనుబంధం కలిగిన వారి సమక్షంలో ఈ నెల 20న కూకట్‌పల్లి కైతల్లాపూర్‌ మైదానంలో వేడుకలను నిర్వహించనున్నారు. ఎన్ఠీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్‌సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో శకపురుషుడు సావనీర్, జయహో ఎన్టీఆర్ వైబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, దత్తాత్రేయ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ అతిథులుగా హాజరుకానున్నారు.

కొవ్వు కరిగించకపోతే... ఇక ఇంటికే!

సిబ్బంది ఫిట్‌నెస్‌పై అస్సోం పోలీస్ శాఖ ఫిట్ నెస్ డ్రైవ్‌ను ప్రారంభించింది. "ఐపిఎస్ & ఎపిఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బందికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ GP సింగ్ ట్వీట్ చేశారు. మూడు నెలల్లో పెరిగిన పొట్టను తగ్గించుకోకపోతే ఇక ఇంటికే అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన కారణాలు ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని సింగ్ తెలియజేశారు.

భగభగమంటోన్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల మార్క్‌కు చేరువ అయ్యాయి. రాజమండ్రిలో అత్యధికంగా 49డిగ్రీల నమోదైంది. మరోవైపు ఏలూరులో 48 డిగ్రీలు, గుంటూరు, చిలకలూరిపేటలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. కొత్తగూడెం, మిర్యాలగూడెలో ఏకంగా 47 డిగ్రీలు నమోదైంది. పాల్వంచ 46, నల్గొండ, ములుగులో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వరంగల్ 43, నిర్మల్, మంచిర్యాలలో 42 డిగ్రీలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.


సీఎం దృష్టిలో పడేందుకు పిల్లాడిని విసిరేసిన తండ్రి

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, ఓ వ్యక్తి తన బిడ్డను డయాస్‌పైకి విసిరేసిన ఘటన కలకలం సృష్టించింది. జనం గుంపుల మధ్య పిల్లాడు వేదికకు ఒక అడుగు దూరంలో పడిపోయాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ చిన్నారిని తల్లికి అప్పగించారు. అయితే గుండెకు రంధ్రం ఉన్న తన చిన్నారిని రక్షించాలనే తపనతోనే తండ్రి ఈ చర్యలు పాల్పడ్డాడని తెలుస్తోంది. అతడు ఆశించినట్లుగానే సీఎం చిన్నారికి సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్  కు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే చిన్నారికి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు.  

టిక్ టాక్ టీచర్ పైత్యం... ఉద్యోగం ఊడిన వైనం

విద్యార్ధులతో కలసి అభ్యంతరపూర్వక డాన్సులు చేస్తున్నందుకు గానూ ఓ టీచర్ ను విధుల నుంచి బహిష్కరించిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. సిబెలీ ఫెరారియా టీచర్ గా పనిచేస్తూనే, టిక్ టాకర్ గానూ పేరుగడించింది. ఈ నేపథ్యంలో ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి దారితీసింది. ఆ వీడియోల్లో విద్యార్థినులతో కలిసి సిబెలీ డ్యాన్స్‌ చేస్తూ బట్టలు విప్పుతున్న వైనంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి బహిష్కరించారు. అయితే సిబెలీ మాత్రం తాను చేసిన దాంట్లో తప్పులేదనే వాదిస్తోంది. 

వాంఖడేకు బిగుస్తోన్న సీబీఐ ఉచ్చు

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. వాంఖడేతోపాటు మరో నలుగురిపైనా సీబీఐ కేసు నమోదు చేయగా కేసు ఎఫ్ఐఆర్ బయటికి వచ్చింది. వాంఖడే విదేశీ పర్యటనలు, విలువైన చేతి గడియారాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. పర్యటనలకు సంబంధించిన వివరాలను చెప్పలేదని ఎఫ్ఐఆర్‌లో తెలిపింది. డిపార్ట్‌మెంట్‌కు చెప్పకుండా చేతిగడియారాలు కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఆ ఖర్చుల వివరాలకు.. వాంఖడే చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉందని సీబీఐ తెలిపింది.

లైకా నిర్మాణ సంస్థపై ఈడీ దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం పొన్నియన్ సెల్వన్ నిర్మాతలైన నిర్మాణ సంస్థ LYCA కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. టి నగర్, అడయార్, కరపాక్కం సహా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ED రైడ్ LYCA మొబైల్‌లతో సహా పలు బ్రాండ్‌లను కలిగి ఉన్న LYCAకి వ్యతిరేకంగా ఫెమా (Foreign Exchange Management Act, 1999) ఛార్జ్‌కి సంబంధించినదిగా చెప్పబడింది. PMLA (Prevention of Money Laundering Act, 2002)ఛార్జ్ కూడా జోడించబడింది.

ఉగాండాలో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు

ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన కాల్పుల ఘటనలో బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్న ఓ భారతీయుడు చనిపోయాడు. తమ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సిందిగా స్థానికంగా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇవాన్ వార్ వెబ్ ను ఉత్తమ్ కోరగా, అతడు కోపోద్రిక్తుడై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఉత్తమ్ ప్రాణాలు విడవగా, ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్రమ కట్టడాల కూల్చివేత్త

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. స్పెషల్ ఛీప్‌ సెక్రటరీ అరవింద్ కుమార్‌ ఆదేశాలతో గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో, వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. దేవేందర్ నగర్‌లోని, ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 342లో వెలిసిన అక్రమ కట్టడాలను, నాలుగు జెసీబీలతో కూల్చివేసింది జిల్లా రెవెన్యూ యంత్రాంగం.

దొంగబంగారాన్ని ఇలా కూడా తరలిస్తారా...!

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎర్‌పోర్టులో సుమారు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. మస్కట్‌ నుండి హైదరాబాద్‌ వచ్చిన మహిళ వద్ద, పేస్టు రూపంలో ఉన్న కిలోన్నర బంగారం పట్టుబడింది. సానిటరీ ప్యాడ్‌లో అమర్చి బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది మహిళ. బంగారం విలువ సుమారు 78లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్‌ అధికారులు.

వైద్యుల నిర్లక్ష్యం, గర్భిణి మృతి

మహబూబాబాద్‌ జల్లా మరిపెడలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందింది. వడ్డూరి భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు ఆపరేషన్‌ చేసి కాన్పు చేశారు. కానీ, తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికే భాగ్యలక్ష్మి చనిపోయిందని నిర్ధారించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే భాగ్యలక్ష్మి మృతి చెందిందని బంధువులు, కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కారకులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

ఇందిరాపర్క్ లో దొంగలు పడ్డారు

హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో గంధం చెట్ల అపహరణ కలకలం సృష్టిస్తోంది. గతంలో 10 గంధపు చెట్లను నరికి అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. మళ్లీ అదే బాటలో చెట్లుకు గాట్లు పెట్టి మరీ వెళ్లారు దుండగులు. దాదాపు 8 చెట్లకు గాట్లు పెట్టడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందిరాపార్క్‌ మేనేజర్‌ భాస్కర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాట్లు పెట్టిన చెట్లు చనిపోకుండా ఉండేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 

అదానీ కేసు విచారణలో మరో ఆరు నెలలు గడువు కోరిన సెబీ

అదానీ కంపెనీలపై కొత్త వివాదం నెలకొంది. 2016 నుంచి అదానీ కంపెనీలపై తాము దర్యాప్తు చేయలేదని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది సెబీ. మరోవైపు అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదికలో పేర్కొన్న అంశాలు చాలా సంక్లిష్టమైనవని.. దీన్ని దర్యాప్తు చేసేందుకు మరో ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరింది. గత విచారణ సమయంలో మూడు నెలల గడువు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా చెప్పారు. తాజా రీజాయిండర్‌ అఫిడవిట్‌ చూశాక.. ఎలాంటి గడువు ఇవ్వకుండా విచారణ వాయిదా వేశారు. 

కాంగ్రెస్ కు టీఎంసీ మద్దతు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపుతున్నాయి. కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తామని, అందులో తప్పేమీ లేదని... అయితే వారు కూడా ఇతర రాజకీయ పార్టీలకు సపోర్ట్‌గా నిలవాలన్నారు. సీట్ల కేటాయింపు ఫార్ములా విషయంలోనూ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

ఎంపీ అవినాష్‌ సీబీఐ విచారణపై సందిగ్దత

అవినాష్ సీబీఐ విచారణపై సందిగ్దత కొనసాగుతోంది. షార్ట్‌నోటీసుతో విచారణకు పిలిచారన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు షెడ్యూల్ నేపద్యంలో హాజరు కాలేనన్నారు. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని, అత్యవసర పనులు ఉన్నాయన్నారు. 4 రోజుల సమయం కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐని కోరారు. ఈమేరకు సీబీఐకి లేఖ రాశారు.

చీకోటిపై ఈడీ ప్రశ్నల వర్షం

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ మరోసారి ఈడీ ముందుకు వచ్చారు. థాయ్‌లాండ్‌ గ్యాంబ్లింగ్‌ కేసుపై లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్..కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి.. చికోటిపై ప్రశ్నలు సంధిస్తోంది. మనీలాండరింగ్, విదేశీ ప్రయాణాలపై ప్రశ్నిస్తోంది. ఇద్దరు న్యాయవాదులతో కలిసి చికోటి ప్రవీణ్‌ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల థాయ్‌లాండ్‌ క్యాసినో ఘటనలో చికోటి ప్రవీణ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటికే చికోటితో పాటు చిట్టి దేవేందర్‌ రెడ్డి, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఆదర్శ గ్రామం

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మోహిత్యాంచే వడ్గావ్ ప్రజలు స్వచ్ఛంధంగా డిజిటల్ డీటాక్స్ కు పూనుకున్నారు. గ్రామంలోని భైరవనాథ్ ఆలయంపై ఏర్పాటు చేసిన సైరన్ మోగగానే గ్రామస్థులంతా ఎక్కడి వారక్కడ టీవీలు, సెల్ ఫోన్ లు పక్కన పెట్టి కుటుంబంలోని వ్యక్తులతో కలసి సమయం గడుపుతారు. పిల్లలు చదువుకుంటున్నారు. తొమ్మిది నెలలుగా ఇదే పద్దతిని ఆచరిస్తున్నారు. ఈ మార్పు తమలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అని గ్రామస్తులు చెబుతున్నారు.