చిట్టి న్యూస్

NOTICE: నటుడు అలీకి అధికారుల నోటీసులు

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోనీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని నటుడు అలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఎక్మామిడి గ్రామపంచాయతీ సెక్రటరీ శోభారాణి నటుడు అలీకి నోటీసులు జారీ చేయగా, పనివారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫాం హౌస్‌లో నిర్మాణాలు ఎలా చేపట్టారు, వివరణ ఇవ్వాలని నోటీసులలో అధికారులు పేర్కొన్నారు. ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ నటుడు అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నటుడు అలీకి వ్యవసాయ భూమి ఉంది. వీలు ఉన్నప్పుడు అలీ తన కుటుంబంతో కలిసి సరదాగా అక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అలీ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అలీ ఫాం హౌస్ నిర్మించాడని అధికారుల దృష్టికి రావడంతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి అక్రమ నిర్మాణాల అంశంపై నటుడు అలీకి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 5న తొలిసారి నోటీసు ఇవ్వగా నటుడు అలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో నవంబర్ 22న అధికారులు రెండోసారి నటుడు అలీకి నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఫాం హౌస్‌లో పనిచేసే వారికి నోటీసులు అందించి, అలీకి సమాచారం చెప్పాలని చెప్పినట్లు పంచాయతీ సెక్రటరీ వెల్లడించారు.

Parliament:  రేపట్నుంచే పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ షురూ.

పార్లమెంట్‌   శీతాకాల సమావేశాలు  రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పార్లమెంట్‌కు చేరుకున్నారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరనుంది. కాగా పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు తదితర అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

AP: గడ్డం, మీసాలతో అఘోరీ హల్ చల్

తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తన చర్యలతో హల్చల్ చేస్తున్న అఘోరీ... కర్నూలు జిల్లాలో పెట్టుడు గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అఘోరీ గడ్డం, మీసాలతో కనిపించడం చర్చనీయాంశమైంది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి రావడం జరిగిందంటున్న అఘోరీ వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి వచ్చానని అఘోరి ప్రకటించడం కూడా సంచలనంగా మారింది. అఘోరి సనాతన ధర్మ రక్షణకు, లోక కల్యాణం కోసం జనంలోకి వచ్చానంటు చెప్పుకుంది. మంచిర్యాల జిల్లా కుష్నపల్లికి చెందిన అఘోరీ తను మహిళనని చెప్పినప్పటికి తర్వాత అమె తల్లి దండ్రుల కథనం మేరకు ట్రాన్స్‌జెండర్ గా మారిన శ్రీనివాస్ అని తేలింది. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లి అఘోరీ, నాగసాధువుగా మారింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా సంచరిస్తున్న అఘోరీ దేవాలయాలను సందర్శిస్తూ హల్చల్ చేస్తోంది. 

SHARMILA: అదానీ అక్రమాస్తుల్లో జగన్ వాటా ఎంత

వైసీపీ అధినేత జగన్ పై.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి సంచలన విమర్శలు చేశారు. ఆదానీ అక్రమాస్తుల్లో జగన్ లంచాల వాటా ఎంతా అని షర్మిల ప్రశ్నించారు. అదానీ- జగన్ అవినీతి బండారం బయట పడిందన్న ఆమె... లంచం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను తాకట్టు పెట్టేస్తారా అని మండిపడ్డారు. రాజకీయ అవినీతిపరుడిగా జగన్ పేరు బహిర్గతమైందన్న షర్మిల.. ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. పోర్టులను అప్పనంగా అదానీకి జగన్ అప్పగించారని షర్మిల మండిపడ్డారు. జగన్ అవినీతి అమెరికాలో బయటపడిందన్న షర్మిల.. జగన్ హయాంలో జరిగిన అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Amitabh Bachchan : కుటుంబ వార్తలపై ఎట్టకేలకు స్పందించిన అమితాబ్‌

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్, ఐశ్వర్య విడాకులపై గతకొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ నో కామెంట్స్ అంటూ సైలెంట్ గా ఉండటం ఇదికాస్త చినికి చినికి గాలి వానగా మారింది. తాజాగా అమితాబ్ తన కుటుంబ వ్యవహారాలపై తన బ్లాగ్ లో సుదీర్ఘమైన పోస్ట్‌ చేశారు.

గతకొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై వస్తున్న వార్తలపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన బ్లాగ్‌లో ఆయన సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు. తన కుటుంబం గురించి చాలా అరుదుగా మాట్లాడతాడని, వారి గోప్యతను కాపాడుకోవడానికి తాను ఇష్టపడతానని అని రాసుకోచ్చారు అమితాబ్. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలను ఎలా రాస్తారంటూ రూమర్స్ ను స్ప్రెడ్ చేసే వ్యక్తుల మనస్సాక్షిని అమితాబ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తన కుటుంబ వ్యక్తిగత గోప్యతకు తాను భంగం కలిగించకూడదు కాబట్టి.. తను ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడనని తన బ్లాగ్ లో తెలిపారు బిగ్ బీ.

కాగా బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఎక్కడా ఈ విషయమై బహిరంగంగా కామెంట్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. తాజాగా తన కూతురు ఆరాధ్య బచ్చన్ 13వ ఏట అడుగుపెట్టిందని తల్లి,కూతురుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఐశ్వర్య . కానీ ఈ వేడుకల్లో ఐష్-అభిషేక్ కలిసి కనిపించకపోవడం చూస్తుంటే ఇవాళ కాకపోతే రేపైనా విడిపోతారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే తన కూతురు టీనేజ్ పార్టీకి తండ్రైనటువంటి అభిషేక్ బచ్చన్ ని ఆహ్వానించలేదని కామెంట్స్ చేస్తున్నారు.

Maoists: జార్ఖండ్‌లో 5 ట్ర‌క్కుల‌కు నిప్పుపెట్టిన మావోయిస్టులు

జార్ఖండ్‌లో ఇవాళ రెండో ద‌శ అసెంబ్లీ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. అయితే ఆ ఎన్నిక‌ల‌కు ముందే.. మావోయిస్టులు అయిదు ట్ర‌క్కుల‌కు నిప్పు పెట్టారు. ల‌తేహ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెరాంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న లాత్ అట‌వీ ప్రాంతంలో రాత్రి 1.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు చెప్పారు. ల‌తేహ‌ర్‌లో బొగ్గు ప్రాజెక్టు వ‌ద్ద ర‌వాణా కోసం వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు. బొగ్గును ఖాళీ చేసి తిరిగి వ‌స్తున్న ట్ర‌క్కుల‌కు నిషేధిత జార్ఖండ్ ప్ర‌స్తుతి క‌మిటీ నిప్పు పెట్టిన‌ట్లు తెలిసింది. ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించారు. వాహ‌నాల‌ను ద‌గ్దం చేసిన కేసులో త‌నిఖీలు చేప‌డుతున్న‌ట్లు ఎస్పీ కుమార్ గౌర‌వ్ తెలిపారు. సంఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద క‌ర‌ప‌త్రాల‌ను వ‌ద‌లి వెళ్లారు. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు సాగాలంటే త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆ క‌ర‌ప‌త్రంలో మావోయిస్టులు పేర్కొన్న‌ట్లు ఎస్పీ తెలిపారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగాల్సి ఉంది.. అయితే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు శనివారం కన్నుమూసిన విషయం విదితే.. దీంతో, ఢిల్లీ, మహారాష్ట్రల్లో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకున్నారు.. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. నవంబర్‌ 20వ తేదీన వెలగపూడిలోని ఏపీ సచివాలయం బిల్డింగ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్..

Delhi: దేశంలోనే తొలి మహిళా డిపో ఢిల్లీలో ప్రారంభం

అందరూ మహిళలే పనిచేసే బస్‌ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్‌ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ శనివారం ప్రారంభించారు. ఈ డిపోలో సుమారు 225 మంది సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా దేశంలోనే తొలి ‘మహిళా’ బస్‌ డిపోను ప్రారంభించడం మంచిదే అయినా.. ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రికి తెలియ చేశారు. స్థిర వేతనం, ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

TG TET: టెట్ అభ్యర్థులకు అలర్ట్

తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్‌లో తప్పులను సవరించే అవకాశం కల్పించింది. గతంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు www.schooledu.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెయ్యొచ్చు. అదనపు సమాచారం కావాలంటే.. అభ్యర్థులు 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ సూచించింది. దరఖాస్తులకు ఈ నెల 20 చివరి తేదీగా నిర్ణయించింది. జనవరి 1 నుంచి 20 వరకూ టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 8 ప్రత్యేక రైళ్లు..

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్‌)-కొల్లాం, ఈనెల 24, డిసెంబర్‌ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం, 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Telangana: ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లారు.వారు వెళ్లేసరికి ఆమె గదిలో శవమై కనిపించారు. వారు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Elon Musk X : ఎలాన్‌ మస్క్‌కు బిగ్ షాక్ .. ‘ఎక్స్‌’ను వీడుతున్న యూజర్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెద్దఎత్తున యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ను వీడినట్లు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఎన్నికల తర్వాత రోజు వెబ్‌సైట్‌లో తమ ఖాతాలను డీయాక్టివేట్‌ చేశారు. అయితే ఈ మొత్తం సంఖ్య కేవలం వెబ్‌సైట్‌ యూజర్లది మాత్రమే అని, మొబైల్ యాప్‌ ద్వారా డీయాక్టివేట్‌ చేసిన యూజర్ల సంఖ్య కాదన్న వార్తలు ప్రచురితమవుతున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో ‘ఎక్స్‌’ అధిపతి ఎలాన్‌ మస్క్‌ కీలకపాత్ర పోషించారు. ఈనేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్‌ దీన్ని వినియోగిస్తారని పలువురు పేర్కొంటున్నారు. గతంలో నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం, వెరిఫికేషన్‌ విధానాలను మార్చడం.. వంటి మస్క్‌ నిర్ణయాలు పెద్దఎత్తున విమర్శలకు దారితీశాయి. స్థాయితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ కోసం డబ్బులు చెల్లించేలా తీసుకొచ్చిన మార్పులతో ప్లాట్‌ఫామ్‌ ప్రకటనల వ్యాపారం దెబ్బతింది.

Raghurama: ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ ఏకగ్రీవ ఎన్నిక

 ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు  ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. జగన్‌ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం దిల్లీకే పరిమితమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామ.. ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. 

Arvind Kejriwal: | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్‌

 ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ ఆధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న కేజ్రీవాల్‌.. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు కేజ్రీవాల్‌ దంపతులను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Human trafficking: మానవ అక్రమ రవాణా కేసులో ఈడీ సోదాలు

మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని 17 ప్రదేశాలలో సోదాల నిర్వహించి, ఇద్దరు బంగ్లాదేశ్ చెందిన వారితో సహా నలుగురిని అరెస్టు చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన వారిని రోనీ మోండల్, సమీర్ చౌదరిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు నిందితులు పింటు హల్దార్, పింకీ బసు ముఖర్జీ. వీరిని కోల్‌కతాలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు జార్ఖండ్‌లోని రాంచీకి తరలిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్‌పోర్ట్‌లు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి పత్రాలు, నగదు, ఆభరణాలు, ప్రింటింగ్ పేపర్లు, ప్రింటింగ్ మెషీన్లు, ఆధార్‌ను ఫోర్జరీ చేయడానికి ఉపయోగించిన ఖాళీ ప్రొఫార్మాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. జార్ఖండ్ పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. కొంతమంది బంగ్లాదేశ్ చెందిన వారు “చట్టవిరుద్ధమైన మరియు అనైతిక కార్యకలాపాలు” చేయడానికి కొంతమంది ప్రైవేట్ ఏజెంట్లతో కలిసి అక్రమంగా భారతదేశానికి చేరుకున్నారని కేసులో పేర్కొన్నారు.

Actre Kasturi : కస్తూరి ఎక్కడ?.. పోలీసులు గాలింపు

తెలుగువారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటని కస్తూరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసు కురావాలని కోరుతూ చెన్నైలో హిందూ మక్కల్ కట్చి సంస్థ ఒక ఆందోళన కా ర్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్లాది మంది తెలుగు వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడారు. దీనిపై తమిళనాడులోని తెలుగు వారు ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కస్తూరికి నోటీసులు జారీ చేసేందుకు పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. తాళం వేసి ఉండటాన్ని గుర్తించి.. ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. నటి కస్తూరిని గుర్తించేందుకు తమిళనాడు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Aghori : తెలంగాణకు వస్తున్నా.. పోలీసులు ఆపలేరన్న అఘోరీ

తెలంగాణలో ఆరో గుడిలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిందంటూ అఘోరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు వస్తున్నాననీ.. పోలీసులు చెప్పిన మాటలు తాను విన్నానని.. తనకు ఇచ్చిన హామీని పోలీసులు, ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో లేడీ అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తనపై పెట్టిన నిఘా హిందూ ఆలయాలపై ఎందుకు పెట్టడం లేదని మండిపడింది. రేవంత్ ను సీఎం సీటు నుంచి ఎలా దింపుతానో చూడు అంటూ చిటికెలు వేసి హెచ్చరించడం విశేషం. 

Basara RGUKT: ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాయి ప్రియ పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలసి క్యాంపస్‌ వసతి గృహంలోనే ఉంటుంది. సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్లు అల్పాహారం కోసం వెళ్లగా.. గదిలో సాయి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చే చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్‌ నోట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీయూకేటీకి ఇటీవల నూతన ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ నియామకం తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం తొలిసారి. పోలీసులు మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. 

Mozambique: మొజాంబిక్‌ దేశానికి భారత ఎఫ్‌ఐసీ బోట్లు

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్‌ దేశానికి భారత ప్రభుత్వం రెండు ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్రాఫ్ట్‌(ఎఫ్‌ఐసీ) బోట్లను కానుకగా అందజేసింది. ఈ నెల 8న మొజాంబిక్‌ ప్రభుత్వానికి అధికారికంగా వాటిని అప్పగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో మొజాంబిక్‌లో భారత రాయబారి రాబర్ట్‌ షెట్కింటంగ్, భారత్‌ కొత్తగా నియమించిన రక్షణ సలహాదారుడు కర్నల్‌ అత్రి, ఐఎన్‌ఎస్‌ ఘరియల్‌ కమాండింగ్‌ అధికారి కమాండర్‌ రజన్‌చిబ్, జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆగస్టో కశిమిరో పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ఘరియర్‌ ద్వారా బోట్లను ఆ దేశానికి తరలించారు. ఈ ఫాస్ట్‌ వాటర్‌ జెట్‌ ప్రొపల్షన్‌ బోట్లు సముద్ర జలాల్లో 45 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోతాయని నేవీ వర్గాలు వెల్లడించాయి.

Shalimar Express : పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలీమార్ ఎక్స్ ప్రెస్

వెస్ట్ బెంగాల్‌లోని నవాల్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో రెండు కోచ్ లు పక్కకు ఓరిగాయి. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియలేదు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Train Accident : పట్టాలు తప్పిన డోర్నకల్ గూడ్స్ రైలు

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ జంక్షన్‌ బ్రాంచి లైనులో గూడ్స్‌ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్‌కు 59 ఖాళీ వ్యాగన్లతో వెళ్తుండగా డోర్నకల్‌ బ్రాంచి లైనులోకి ప్రవేశించగానే ఇంజిన్‌ వెనకాల 17,18,19 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రాంచి లైనులో ఈ సంఘటన చోటుచేసుకున్నందున రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. విషయం తెలియగానే వివిధ విభాగాల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఇంజిన్లు అమర్చి ముందున్న వ్యాగన్లను పోచారం వైపునకు, వెనకాలున్న వ్యాగన్లను పాపటపల్లి వైపునకు తీసుకెళ్లారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల పునరుద్ధరణ రాత్రి మొదలైంది. 

Pakistan: పాక్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు - 20 మంది మృతి

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో ప్లాట్‌ఫామ్‌ నుంచి ఓ రైలు కదలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

UK PM Rishi Sunak : బెంగళూరులో పర్యటించిన రిషి సునాక్​

బ్రిటన్‌ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బెంగళూరులో మెరిశారు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ కాఫీ షాప్‌లో సందడి చేశారు. స్థానికులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకున్నారు. రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి ఇటీవలే బెంగళూరులోని థర్డ్‌ వేవ్‌ కాఫీ షాప్‌లో కాఫీ డేట్‌ను ఆస్వాదించారు. ఇద్దరూ టేబుల్‌ వద్ద కాఫీని ఎంజాయ్‌ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆ సమయంలో కాఫీ షాప్‌కు వెళ్లిన స్థానికులు రిషి సునాక్‌ జంటను చూసి థ్రిల్‌ అయ్యారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రిషి సునాక్ 2022 నుంచి 2024 వరకు యూకే ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీ ఓటమి చవి చూసింది

Allu Arjun Wife Sneha Reddy : తిరుమలలో అల్లు అర్జున్ భార్య సందడి

పుష్ప హీరో, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సన్నిహితులతో కలిసి ఆమె వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులు అభిమానులు సెల్ఫీలు దిగారు

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్‌లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్‌స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్‌కు సంబంధించిన మెసేజ్‌లను సెపరేట్‌గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్‌కూ సెపరేట్ ఫోల్డర్‌ను ఇన్‌స్టా యాడ్ చేసింది.

Wedding Season : ఈ రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే

కార్తీక, మార్గశిర మాసాల కారణంగా ఈ రెండు నెలలు భారీగా వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 17, 18, 20, 21, 23, 25, 27, డిసెంబర్ 4, 5, 6, 7, 8, 9, 11, 20, 23, 25, 26 తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.మొత్తం రెండు నెలల్లో కలిపి 24 మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే నవంబర్ నెలలో అన్ని డేట్లలో ఫంక్షన్ హాల్స్ పూర్తి బుక్ అయ్యయని.. ఈ రెండు నెలల్లో దాదాపు దేశ వ్యాప్తంగా అరకోటి జంటల పెళ్లిళ్లు అవుతాయని.. దీని కారణంగా.. రూ. 6 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Director Krish : డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్నారని, 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే క్రిష్ రెండో వివాహానికి సంబంధించి అధికారికంగా సమాచారం లేదు. కాగా క్రిష్ గతంలో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టితో ‘ఘాటీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు. 

Kerala : మత ప్రాతిపదికన కేరళ ఐఏఎస్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులు

కేరళలోని ఐఏఎస్‌ అధికారులను మతపరంగా విభజించి, ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కే గోపాలకృష్ణన్‌ (ఐఏఎస్‌) ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి, తనను కొత్త వాట్సాప్‌ గ్రూపులకు అడ్మిన్‌గా చేర్చారని ఆరోపించారు. ‘మల్లు హిందూ అధికారులు’, ‘మల్లు ముస్లిం అధికారులు’, మరికొన్ని గ్రూపులను క్రియేట్‌ చేశారని చెప్పారు. అక్టోబరు 30న మల్లు హిందూ అధికారుల గ్రూపును క్రియేట్‌ చేసి, దానిలో హిందూ ఐఏఎస్‌ అధికారులను చేర్చారని, దీని ఔచిత్యంపై చాలా మంది అధికారులు ప్రశ్నించడంతో దీనిని కొద్ది గంటల్లోనే డిలీట్‌ చేశారని తెలుస్తున్నది.


MiG 29 fighter jet: ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్‌-29 విమానం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్‌- 29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అప్రమత్తమైన పైలట్‌ కిందకు సురక్షితంగా బయటపడ్డారు. విన్యాసాల కోసం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయల్దేరిన ఈ ఫైటర్‌ జెట్‌ ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన చోట విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మిగ్‌-29 విమానం ఇలా కుప్పకూలిన ఘటనలు గతంలోనూ జరిగాయి. సెప్టెంబర్‌ 2న రాజస్థాన్‌లోని బార్మేర్‌లో శిక్షణ నేపథ్యంలో మిగ్‌- 29 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్‌ ఆ విమానం కూలడానికి ముందే సురక్షితంగా బయటపడ్డారు.

Annapurna Studio : అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ-శోభిత పెళ్లి

అక్కినేని నాగ చైతన్య-శోభితల పెళ్లి పనులు మొదలవడంతో వెడ్డింగ్ వేదిక ఎక్కడనే చర్చ మొదలైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు రాగా అందుకు భిన్నంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు ఫ్యామిలీలు పెళ్లి పిలుపులను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్ 4న వీరి వివాహం జరుగుతుందని టాక్.

ఇక సమంతో నాగ చైతన్య విడిపోయిన తరువాత శోభిత మ్యాటర్ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో తిరుగుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలారు. అయితే వీరిద్దరి మీద వచ్చిన వార్తలను, డేటింగ్ టాక్‌ను అంతా నమ్మారు. కానీ చైతూ మాత్రం ఇదంతా రూమర్ అన్నట్టుగా కొట్టి పారేశాడు. వేరే అమ్మాయిని ఎందుకు మధ్యలోకి లాగి ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ ఆ మధ్య మాట్లాడాడు.

Kedarnath Temple : కేదారినాథ్ ఆలయం మళ్లీ తెరుచుకునేది ఎప్పుడో తెలుసా?

ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూతపడ్డాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఆర్నెలల తర్వాతే ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. ఈ ఆర్నెలలు ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబాకి ఆరాధన, దర్శనం నిర్వహిస్తారు.

శీతాకాలం ప్రారంభం కావడంతో చార్ ధామ్ ఆలయాలు మూతపడుతున్నాయి. శనివారం గంగోత్రి ధామ్ తలుపులను మూసివేయగా.. ఆదివారం కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. అలాగే యమునోత్రి ఆలయ తలుపులను మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేశారు. శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేస్తారు. ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర తుదిదశకు చేరుకుంది. నవంబర్ 1 వరకూ 15 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. భక్తులు జ్యోతిర్లింగాలను సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ వేసవికాలంలోనే ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి.  

Crime News: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ షాక్‌..

 ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపర్రులో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని సినీ నటుడు సుమన్‌ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గ్రామానికి చెందిన బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు కోమటి అనంరావు తీవ్రంగా పడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా దవాఖానకు తరలించారు.మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సానుభూతి ప్రకటించారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Guinness World Record:   గుమ్మడికాయ పడవతో.. గిన్నిస్‌ రికార్డు

కడవంత గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్‌ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్‌. ఒరెగ్యాన్‌ హ్యాపీవాయలీకి చెందిన గ్యారీ 555.2 కేజీల గుమ్మడికాయలోని గుజ్జును తీసి పడవగా మార్చాడు. దీంతో కొలంబియా నదిలో వాషింగ్టన్‌లోని నార్త్‌ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్‌ వరకు ప్రయాణించాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్‌ రికార్డుగా నమోదు చేశారు. స్వతాహాగా భారీ సైజులో గుమ్మడికాయలు పెంచడం గ్యారీకి అలవాటు. 2013లో అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానిక పోటీలో బహుమతి గెల్చుకున్నాడు.


Karnataka : చిక్ మగళూరులో తొక్కిసలాట.. పెద్దసంఖ్యలో భక్తులకు గాయాలు

కర్ణాటకలోని చిక్కమగళూరులో విషాదం చోటు చేసుకుంది. దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు. నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే వార్షిక క్రతువులో అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. కొండపైకి వచ్చే భక్తుల భద్రత కోసం చిక్కమగళూరు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ భారీగా తరలిరావడంతో ఇబ్బందులుపడ్డారు.

Ukraine-Russia:  రష్యాకు సైన్యాలు పంపిన ఉత్తర కొరియా

ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికి సహాయంగా రష్యాకు ఉత్తర కొరియా సైన్యాలను పంపించిందని నాటో సోమవారం నిర్ధారించింది. కొన్ని సైన్యాలు రష్యా కుర్స్ రీజియన్‌లో దిగాయని, అక్కడ నుంచి ఉక్రెయిన్‌లో చొరబాటుకు రష్యా యుద్ధం సాగిస్తోందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రటిల్ పాత్రికేయులకు వివరించారు. దీనివల్ల రష్యా యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. బ్రసెల్స్‌లో నాటో ప్రధాన కార్యాలయంలో 32 మిత్ర దేశాల రాయబారుల సమావేశంలో దక్షిణ కొరియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమీక్ష నిర్వహించిన సందర్భంగా నాటో ఈమేరకు ప్రకటించింది.

రష్యాలోకి కిమ్‌ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. అసలు కిమ్‌ సైన్యం మద్దతు తీసుకోవడం రష్యా బలహీనతను తెలియజేస్తోందని ఎద్దేవా చేసింది.



Philippines : ఫిలిప్పీన్స్ ను ముంచిన ట్రామీ తుపాను.. 150 మంది మృతి

ఫిలిప్పీన్స్​ లో ట్రామీ తుఫాన్​ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. సోమవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య దాదాపుగా 150కి చేరుకుంది. మరో 70 మంది గల్లంతయ్యారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. తుఫానుతో బికోల్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 38 మంది చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. తుపాన్ ట్రామీ ధాటికి ఆ దేశంలో భారీ వినాశనం జరిగింది. అక్టోబర్ 24 నుంచి మొదలైన తుపాను ధాటికి ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 5 లక్షల మందికి పైగా తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.