చిట్టి న్యూస్

AP: విదేశాలకు వెళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ పిటిషన్‌

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌, ఎెంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. బ్రిటన్‌ వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ జగన్‌ సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను నేటికి వాయిదా వేశారు.

యూరప్‌లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతించాలంటూ రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి ఈ కోర్టు అనుమతించిందన్నారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసు విచారణ ముందుకుసాగడంలేదని, అనుమతిని నిరాకరించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.

మరోవైపు వైసీపీ చీఫ్‌ జగన్‌ మళ్లీ తాడేపల్లికి తిరిగొచ్చారు. ఈ నెల 15న ఆయన బెంగళూరు వెళ్లారు. జూన్‌ నుంచి ఇప్పటివరకూ మొత్తం ఆరుసార్లు అక్కడికి వెళ్లొచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో జగన్‌కు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. వచ్చే నెలలో ఆయన యూకే పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న డిప్లమాటిక్‌ పాస్‌పోర్టును.. ఈ నెల 1న కార్యాలయంలో సమర్పించి సాధారణ పాస్‌పోర్టు తీసుకున్నారు.

NIMMAGADDA: ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ డాక్టర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కీలక బాధ్యతలు స్వీకరించారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) డైరెక్టర్‌ జనరల్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని బెల్లవిస్టా క్యాంపస్‌లో బాధ్యతలు చేపట్టారు. 1982వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రమేష్‌కుమార్‌ ఏపీ కేడర్‌కు చెందినవారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ, తెలంగాణ గవర్నర్‌కు ముఖ్యకార్యదర్శిగా, తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హౌసింగ్‌ శాఖల ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కూడా కొనసాగారు. ఆస్కీ కోర్ట్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా కొనసాగిన రమేశ్‌కుమార్‌ తాజాగా అదే సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

AP: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చేసిన బదిలీల్లోనూ చంద్రబాబు సర్కార్‌ మార్పులు చేసింది.

మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎన్‌.తేజ్‌ భరత్‌,

చితూరు జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌.వి

పాడేరు సబ్‌ కలెక్టర్‌గా ప్రఖర్‌ జైన్‌

పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్‌ జైన్‌( అదనపు బాధ్యతలు‌)

కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రాహుల్‌ మీనా

అనంతపురం జిల్లా జేసీగా శివ నారాయణ శర్మ

కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌గా జి.విద్యాధరి

పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాస్తవ‍( ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు)

ఏటిపాక సబ్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌( చిత్తూరు ఐటీడీఏ పీవోగా పూర్తి అదనపు బాధ్యతలు)......వీరందరికీ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


saudi arabia:  చంపేస్తారేమోనని భయమేస్తోంది: సౌదీ యువరాజు

పాలస్తీనా ఆందోళనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొస్తే.. తాను హత్యకు గురయ్యే ప్రమాదముందని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ( ఆందోళన చెందుతున్నట్లు సమాచారం! అమెరికా కాంగ్రెస్‌ సభ్యులతో ఆయన స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గతంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాక ఈజిప్టు మాజీ అధ్యక్షుడు అన్వర్‌ సదాన్‌ హత్యకు గురైన విషయాన్ని ఆయన గుర్తుచేశారని పేర్కొంది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ సుముఖంగా లేకపోవడంపై ఎంబీఎస్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాదత్‌ భద్రత విషయమై ఆనాడు అమెరికా ఏం చర్యలు తీసుకుందని ఆయన ఆరా తీసినట్లు ఆ దేశ డిజిటల్‌ వార్తాపత్రిక ‘పొలిటికో’ పేర్కొంది. అయితే తనకు ప్రాణభయమున్నప్పటికీ ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో తాను ముందుకెళ్లడానికే నిశ్చయించుకున్నట్లు సౌదీ యువరాజు స్పష్టం చేశారు.


Taiwan: తైవాన్‌ను వ‌ణికించిన‌ భూకంపం..

తైవాన్‌ను భారీ భూకంపం వణించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతతో శుక్ర‌వారం ప్రకంపనలు వచ్చాయని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. తైవాన్‌ తూర్పు నగరమైన హువాలియన్‌కు 34 కిమీ దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంపం 9.7 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించిన‌ట్లు స‌మాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

CRIME: భార్య అందంగా తయారైందని హత్య

కర్ణాటకలో రామనగర జిల్లా మాగడిలో దారుణం జరిగింది. భార్య అందంగా ఉండటం... బాగా బాగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేని భర్త... ఆమెను హత్య చేశాడు. ఉమేశ్‌ తన భార్య దివ్యను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఇటీవల దివ్య టాటూ వేయించుకుంది. ఇంకా అందంగా కనపడాలని అలంకరించుకునేది. ఈ పద్ధతులు నచ్చని ఉమేశ్‌ ఆమెను గుడికి తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా ఉమేశ్, మరొకరి కోసం గాలిస్తున్నారు. భార్య ఎంతో అందంగా ఉండటం, గ్రామంలో బాగా తయారై బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఇదే విషయమై అనేకసార్లు గొడవ కూడా పడ్డారని తేలింది. ఆఖరికి నమ్మించి బయటకు తీసుకెళ్లి దివ్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అందంగా కనపడాలనే తపనతో దివ్య ఎప్పుడూ లిప్‌స్టిక్‌ వేసుకునేదని... ఈ పద్ధతులు నచ్చని ఉమేశ్‌ ఆమెతో గొడవ పడేవాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్‌ వేశారు. ఇద్దరూ విచారణకు హాజరుకాగా ఇకపై అనుమానించనని దివ్యను ఉమేశ్‌ నమ్మించాడు. భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య స్థానిక ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. అయితే ఆమెను హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేశ్‌.. దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు.

Pawan Kalyan: శ్రీహరికోటకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్‌లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్‌ వచ్చారు. షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. రేణిగుంటకు విమానంలో చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు చేరుకున్నారు. ఎం.ఆర్. కురూప్ ఆడిటోరియంలో జరిగే అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్.. అనంతరం షార్‌లోని వివిధ విభాగాలను సందర్శించనున్నారు.. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Earh Quake : సిరియాలో భూకంపం .

రియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదయిందని అధికారులు చెప్పారు. ఒక్కసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో వస్తువలన్నీ చెల్లా చెదురయి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కానీ ఇంత వరకూ ప్రాణ, ఆస్తి నష్టం పై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. భూకంపం సంభవించడం కొత్తేమీ కాకపోయినా ఇంత భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల బయటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ACB: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ జోగి రమేష్‌ స్పందించలేదు.


Siddhnath Temple: ఆలయంలోతొక్కిసలాట.. ఏడుగురు మృతి

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని మగ్ధుంపూర్‌, జెహనాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటన మమగ్ధుంపూర్‌ బ్లాక్ వానావర్ కొండ వద్ద చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసంలో నాలుగో సోమవారం కావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఎక్కువ మంది భక్తులు రావడంతోనే తొక్కిసలాటకు దారితీసింది. 80,000 మంది బాబా సిద్ధనాథ్‌ ఆలయంకు వచ్చినట్లు తెలుస్తోంది.

Gunfight with terrorists: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఒకరు గాయపడ్డారు. అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్‌లోని అహ్లాన్ అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని శ్రీనగర్‌లోని ‘చినార్ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ’ ఎక్స్ వేదికగా ప్రకటించింది.

ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, గాలింపు చేపడుతున్న బృందాన్ని ట్రాప్‌ చేసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు వివరించారు. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని భావిస్తున్నట్టు తెలిపారు.గాయపడ్డ ముగ్గురు సైనికులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారని, ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు.

కాగా గత కొన్ని నెలలుగా జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఉనికి పెరిగింది. దీంతో ముష్కర మూకలను తుదముట్టించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.

Tamil Nadu:  యువకుల ప్రాణాలు తీసిన బార్బీ క్యూ చికెన్

తమిళనాడులోని కొడైకెనాల్‌లో విషాదం చోటుచేసుకుంది. బార్బీ క్యూ చికెన్ తయారీ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది. దీంతో కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. కొడైకెనాల్‌లో ఎంజాయ్ చేసేందుకు తిరుచికి చెందిన నలుగురు యువకులు వెళ్లారు. శుక్రవారం రాత్రి రూమ్‌లో మద్యం తీసుకుని మందులో మంచింగ్ కోసం బార్బీ క్యూ చికెన్ తయారు చేసుకునేందుకు యువకులు సిద్ధమయ్యారు. చికెన్ తయారీ కోసం బొగ్గులు స్టవ్ తెచ్చుకొని స్వయంగా వండుకున్నారు. అనంతరం యువకులు మత్తుగా మద్యం సేవించారు. అయితే మద్యం మత్తులో స్టవ్ ఆఫ్ చేయకుండానే నిద్రలోకి జారుకున్నారు. అయితే పొగ రావడంతో ఏసీలోకి ప్రవేశించి ఊపిరాడకుండా చేసింది. దీంతో ఇద్దరు యువకులు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు యువకులు మాత్రం వేరే రూమ్‌లో పడుకోవడంతో సేఫ్‌గా ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

SACHIN: వినేశ్‌ కచ్చితంగా పతకానికి అర్హురాలే

విశ్వ క్రీడల్లో రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. దీనిపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ విచారణ జరపనుంది. అయితే దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనన్నారు. అంపైర్‌ తీర్పునకు సమయం ఆసన్నమైందన్న ఆయన.. వినేశ్‌కు రజత పతకం వస్తుందని ఆశిద్దామంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రతి ఆటలోనూ నియమాలుంటాయని... వాటిని సందర్భోచితంగా చూడాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛమైన ఆటతీరుతో వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్‌కు అర్హత సాధించిందని... ఫైనల్స్‌కు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేసి రజత పతకానికి దూరమైందన్నారు. ఇందుకు సహేతుక కారణం కనిపించకపోవడంతోపాటు క్రీడా స్ఫూర్తి లోపించినట్లేనని సచిన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ వంటి అనైతిక చర్యలకు పాల్పడి అనర్హతకు గురయ్యారంటే దాన్ని వేరేలా చూడాలని.. కానీ వినేశ్‌ మాత్రం న్యాయంగా ఆడుతూ.. ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుందని గుర్తు చేశారు. ఆమె కచ్చితంగా రజత పతకానికి అర్హురాలేనని తేల్చి చెప్పారు.


Pune: పుణెలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌.. 17 మందికి అస్వస్థత

 పుణెలోని భాండ్‌గామ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఆహార తయారీ ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీకై 17 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. భాండ్‌గామ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ రెడీ-టు-ఈట్‌ యూనిట్‌లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అందుకోసం అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగిస్తారు. అది ప్రమాదవశాత్తూ లీక్‌ కావడం తాజా ఘటనకు దారితీసిదన్నారు. దీంతో 17 మంది శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.


మహారాష్ట్ర పుణె జిల్లాలో యవత్‌ ప్రాంతంలోని ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్‌ లీకైంది  . ఈ ఘటనలో 17 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భాండ్‌గామ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ రెడీ-టు-ఈట్‌ యూనిట్‌లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అందుకోసం అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగిస్తారు. అది ప్రమాదవశాత్తూ లీక్‌కావడం తాజా ఘటనకు దారితీసింది. ప్రమాద సమయంలో యూనిట్‌లో 25 మంది పనిచేస్తున్నారని సీనియర్‌ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ నారాయణ్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. వీరిలో చాలా మంది మహిళలేనని తెలిపారు.

గ్యాస్‌ లీకవుతున్నట్లు  గుర్తించిన వెంటనే మెయిన్‌ రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేసినట్లు నారాయణ్‌ తెలిపారు. శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 16 మంది ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. గ్యాస్‌ లీక్‌ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆమె ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు.

Cji Chandrachud : అసమానతలపై పోరాడే ఆయుధం రాజ్యాంగమే

అసమానతలపై పోరాడే శక్తిమంతమైన ఆయుధం రాజ్యాంగమని, సమాజంలోని తారతమ్యాలకు వ్యతిరేకంగా నిలిచే సంస్థలను అది సృష్టిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. దేశ పౌరులకు వ్యవస్థాగత ప్రాథమ్యాలు, బాధ్యతలను నిర్దేశిస్తుందన్నారు. ఒ.పి.జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవంలో బుధవారం ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని అన్ని కోణాల్లో జరిగే అన్యాయాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ‘‘నేటి మన సమాజానికి ముప్పు అస్తవ్యస్త గళాలే. విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన విషయాలకే పరిమితం కాకుండా, సహేతుక అంశాలకు గొంతుకగా నిలవాలి. సమాజంలో వాతావరణ మార్పులు, సమాచార లోపం, ప్రాథమిక వనరుల అసమాన పంపిణీ వంటి సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు కనిపించవు. అన్వేషణ, సహకారంలోనే వాటికి సమాధానాలు ఉన్నాయి’’ అని సీజేఐ అన్నారు.

KEDARNATH: కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల తరలింపునకు సన్నాహాలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నారు. గత నెల 31న అక్కడికి వెళ్లిన వారు వర్షాలకు రహదారులు తెగిపోవడంతో తిరిగి రాలేకపోయారు. ఏపీకి చెందిన అడప సత్యనారాయణ్‌... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కి ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా మంత్రి స్పందించారు. యాత్రికులను తరలించడానికి చర్యలు చేపట్టాలని రుద్రప్రయాగ్‌ కలెక్టర్‌కు సూచించారు. శనివారం హెలికాప్టర్‌ ద్వారా 12 మంది యాత్రికులను ఉత్తర కాశీకి తరలించారని, తెలంగాణకు చెందిన ముగ్గురు యాత్రికులు అక్కడే ఉన్నారని సత్యనారాయణ్‌ తెలిపారు.

గుండెలను మెలిపెడుతున్న చిన్నారి లేఖ

ప్రకృతి విలయంతో అల్లకల్లోలమైన వయనాడ్‌లో ఇండియన్ ఆర్మీ సహాయ చర్యలు చేపట్టింది. ఆర్మీ ధైర్యసాహసాలను చూసి చలించిపోయిన మూడో తరగతి విద్యార్థి రాసిన లేఖ అందరి హృదయాలను కదిలిస్తోంది. "డియర్ ఇండియన్ ఆర్మీ వయనాడ్‌లో మీరు చేస్తున్న సాహసాలను చూసి చలించిపోయాను. ఏదో ఒక రోజు సైన్యంలో చేరాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది" అని మలయాళంలో విద్యార్థి రేయాన్ లేఖ రాశాడు.

NEET Case: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు

నీట్ పేపర్ లీకేజీ  కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 13 మంది నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా నీట్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కానీ అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి చార్జ్‌షీటును కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 15 మంది బీహార్ వాసులే ఉన్నారు. మొత్తం 48 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది.

PV Sindhu   పీవీ సింధు ఈజీ విన్​ - ప్రీ క్వార్టర్స్​లోకి ఎంట్రీ

ఒలింపిక్స్‌లో మూడో పతకంపై తెలుగు తేజం, స్టార్‌ షట్లర్ పీవీ సింధు కన్నేసింది. గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలిచింది. దీంతో గ్రూప్‌-M నుంచి సింధు ప్రిక్వార్టర్స్‌కు (రౌండ్ -16) దూసుకెళ్లింది. తొలి గేమ్‌లో క్రిస్టినా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే, రెండో గేమ్‌ ఆరంభంలో మాత్రం ఆమె నుంచి సింధుకు ప్రతిఘటన ఎదురైంది. ఎక్కడా ఏకాగ్రతను కోల్పోని సింధు పట్టు బిగించింది. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను పూర్తి చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగియడం విశేషం.

 భారత షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఏడో స్థానంతో స్వప్పిల్ ముందంజ వేశాడు. గురువారం మధ్యాహ్నం 1గంటకు ఫైనల్‌ జరగనుంది. 

Delhi: ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు

ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.ఈ సదసులో ప్రధానంగా నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీలు అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష మాకే నామ్, సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయం వంటి కీలక అంశాలపై రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. గవర్నర్లతో విడివిడిగా బృందాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక అంశాలపై ప్రజెంటేషన్ జరగనుంది.

ఇదిలా ఉంటే ఆగస్టులో ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. 5-10 వరకు మూడు దేశాల్లో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్ లెస్టేలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఇండియా నుంచి దేశాధినేత ఫిజీకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

భారీ అంచనాలు, ఆశలు, పతకం తప్పక గెలుస్తుందన్న నమ్మకాలను నిలబెడుతూ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తొలి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించింది. మాల్దీవుల ప్లేయర్‌ ఫాతిమాల్‌ను వరుస సెట్లలో ఓడించి.. సింధు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. తొలి సెట్‌ను 21-9 సునాయసంగా గెలిచిన తెలుగు తేజం.. రెండో సెట్‌లో చెలరేగిపోయింది. 21-6తో ఏకపక్షంగా గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసింది. సింధు ధాటికి మాల్దీవుల ప్లేయర్‌ అసలు నిలబడలేకపోయింది. రెండో సెట్‌లో అయితే స్మాష్‌లు, క్రాస్‌ షాట్లతో సింధు చెలరేగిపోయింది. మైదానంలో చిరుతలా కదులుతున్న సింధు ఆట ముందు మాల్దీవుల ప్లేయర్‌ తేలిపోయింది. కేవలం 29 నిమిషాల్లో వరుసగా రెండు సెట్లలో గెలిచి సింధు తదుపరి రౌండ్‌కు చేరింది

TG: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

కేంద్ర ప్రభుత్వం నూతనంగా పది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మను రాష్ట్రపతి నియమించారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు.

VIRAL: ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి!

తైవాన్‌లో జరగనున్న ఓ పెళ్లి అందరినీ ఆకర్షిస్తోంది. కారు ప్రమాదంలో చనిపోయిన తన ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు ‘యు’ అనే యువతి సిద్ధమైంది. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురిని కాపాడిన యు దురదృష్టవశాత్తూ తన ప్రియుడిని రక్షించలేకపోయింది. దీంతో అతడి తల్లి ఒంటరి అవుతుందని భావించి ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైంది. ఈ పెళ్లిలో మృతుడి ఫొటో, దుస్తులను ఉంచింది.

Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్‌లో దర్బార్‌ హాల్‌, అశోక్‌ హాల్‌ పేర్లు మార్పు

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌లో రెండు హాల్స్‌ పేర్లు మార్చారు. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్‌, అశోక్‌ హాల్‌ను ఇక నుంచి గణతంత్ర మండపం, అశోక్‌ మండపంగా మార్చారు. ఈ మేరకు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ వెల్లడించింది. జాతీయ అవార్డుల కార్యక్రమాల కోసం ప్రధాన వేడుకలను ఈ దర్బార్ హాల్‌లోనే నిర్వహించేవారు. ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. ఈ పేర్ల మార్పుపై విపక్షాలు విమర్శలు చేశాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. దర్బార్ అనే కాన్సెప్ట్‌ లేదని.. కానీ షెహన్‌షా కాన్సెప్ట్‌ ఉండటం ఆసక్తికరంగా ఉందని వ్యంగ్యంగా స్పందించారు. అయితే పేర్ల మార్పును రాష్ట్రపతి భవన్ సమర్థించింది. రాష్ట్రపతి భవన్‌ వాతావరణాన్ని భారతీయ సాంస్కృతిక విలువలు, తత్వాలను ప్రతిబింబించేలా చేసే ప్రయత్నమే ఇదని వివరించింది. పేర్ల మార్పు సముచితమేనని స్పష్టం చేసింది.

Hottest Day : ప్రపంచంలో హాటెస్ట్‌ డేగా జూలై 22..

గత 84 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదైనట్టు యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కోపర్నికస్‌ ైక్లెమేట్‌ చేంజ్‌ సర్వీస్‌(సీ3ఎస్‌) తెలిపింది. జూలై 21వ తేదీన 17.09 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డు సృష్టించగా, మరునాడే దీనికి మించి నమోదైందని పేర్కొన్నది. తమ ప్రాథమిక డాటా ప్రకారం 1940 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజు జూలై 22 అని సీ3ఎస్‌ తెలిపింది. దీనికి ముందు గత ఏడాది జూలై 6న అత్యధికంగా 17.08 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది జూన్‌ నెల నుంచి వరుసగా 13 నెలలుగా ప్రతి నెలా ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయని సీ3ఎస్‌ డైరెక్టర్‌ కార్లో బౌన్‌టెంపో తెలిపారు.

ATTACK: టీడీపీ నేతపై గన్‌తో బెదిరించి దాడి

అన్నమయ్య జిల్లాలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో హల్ చల్ చేశారు. పీలేరు మండలం ఓంటిల్లులో టీడీపీ నాయకుడు గిరి నాయుడు ఇంట్లోకి 10 మంది దుండగులు చొరబడి గన్‌తో ఆయనను బెదిరించి దాడి చేశారు. వారిని ప్రతిఘటించిన గిరి తుపాకీ లాక్కోగా నిందితులు బైకుపై పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరో ఘటనలో....

హైదరాబాద్‌లో అక్కా తమ్ముడు అదృశ్యమయ్యారు. కొండాపూర్‌ మసీద్‌ బండ ప్రభుపాధ కాలనీలో ఉంటున్న నరేష్‌ 2022లో తన మేనకోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఆమెతోపాటు ఆమె తమ్ముడు 19 ఉండేవారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అక్కా తమ్ముడు అదృశ్యమయ్యారు. తమ కోసం వెతికితే చనిపోతామని లేఖ రాసి పెట్టారు. నరేష్‌ వారి గురించి గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

AP: పోలీసుల అదుపులోకి వైసీపీ నేత నాగార్జున యాదవ్‌

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని 41ఏ నోటీసు జారీ చేశారు. నాగార్జున యాదవ్‌ ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబును అలిపిరి ఘాట్‌ వద్ద వెంకన్న కాపాడారని.. ఈసారి ఎవరూ రక్షించలేరని బెదిరించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారు. దీనిపై తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి వరుణ్‌ ఫిర్యాదు చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు నాగార్జున యాదవ్‌పై కేసుకు సంబంధించి గతవారం హైకోర్టులో కూడా విచారణ జరిగింది. నాగార్జునపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని కుప్పం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఓ టీవీ డిబేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్‌కుమార్‌ నాగార్జున యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునయాదవ్‌పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.. వెంటనే నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.

Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం..

కేదార్ నాథ్ యాత్రలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు యాత్రీకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఎనిమిది మంది యాత్రీకులు గాయపడ్డారు. గౌరీకుండ్, ఛిర్ బాసా మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, చనిపోయిన యాత్రీకులలో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ విచారం వ్యక్తంచేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

REVANTH: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు.

Gandhi Mandela Award: మెంచు, గొంజాలెజ్‌కు గాంధీ-మండేలా అవార్డు

 గ్వాటెమాలా మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచు టుమ్‌, మెక్సికో రాజకీయ నేత, వ్యాపారవేత్త విక్టర్‌ గొంజాలెజ్‌ టొర్రెస్‌లకు గాంధీ-మండేలా పురస్కారం లభించింది. ఆదివాసీల హక్కుల కోసం మెంచు నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు 1992లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. గొంజాలెజ్‌ ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీరికి ఈ పురస్కారాన్ని గాంధీ-మండేలా ఫౌండేషన్‌ శుక్రవారం మెక్సికోలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. గాంధీ, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా చెప్పిన అహింస విలువలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం కోసం ఈ ఫౌండేషన్‌ ఏర్పాటైంది.

Muchumarri: ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి రూ. 10 లక్షల చెక్

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం నిన్న రూ. 10 లక్షల పరిహారం చెక్కును అందించింది. నిన్న గ్రామాన్ని సందర్శించిన మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పరిహారం అందించామని, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తామని తెలిపారు. బాధిత తల్లికి ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలిక ఆచూకీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందని తెలిపారు


Maharashtra: మహారాష్ట్ర డిప్యూటీ  సీఎంలకు తప్పిన ప్రమాదం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్‌ పవార్, దేవేంద్ర ఫడణవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారి తప్పింది. ఇద్దరూ పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలికి వెళుతుండగా.. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణంతో దారి తప్పింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో చివరకు సురక్షితంగా ల్యాండ్‌ అయింది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఇద్దరూ పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌తో కలిసి నాగ్‌పుర్‌ నుంచి గడ్చిరోలి బయలుదేరగా.. టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ఆందోళన చెందినట్టు అజిత్‌ పవార్‌ తెలిపారు. ‘‘రుతుపవన మేఘాలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో మా హెలికాప్టర్‌ దారి తప్పింది. ఆ సమయంలో నేనెంతో భయపడ్డా. దేవేంద్ర మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. గతంలో ఇలాంటి ఆరు ప్రమాదాల నుంచి బయటపడ్డానని.. ఇప్పుడు కూడా ఏమీకాదని ఆయన ధైర్యం చెప్పారు’’ అని అజిత్‌ వెల్లడించారు.

DEAD: వీధికుక్కుల దాడిలో గాయపడిన చిన్నారి మృతి

వీధి కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 నెలల చిన్నారి మృతి చెందింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్, లక్ష్మి దంపతులు ఉద్యోగం కోసం బాలాజీనగర్‌ వికలాంగుల కాలనీలోని బంధువుల ఇంటికి నెల కిందట వచ్చారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో భరత్‌ కుమారుడు నిహాన్‌ ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ఇంటిబయట నిర్మానుష్యంగా ఉండడంతో అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు బాలుడిని లాక్కెళ్లాయి. పావుగంట తర్వాత కుటుంబ సభ్యులు చిన్నారి కనిపించట్లేదని బయటికివచ్చారు. అప్పటికే కుక్కలు కొద్దిదూరంలోని చెట్ల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. కుటుంబ సభ్యులు కలిసి పరిసర ప్రాంతాల్లో వెదుకుతూ అక్కడికి వచ్చారు. కుక్కలు తీవ్రంగా కరవడంతో బాలుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. తమ కుమారుడిని ఆ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది. స్థానికుల సాయంతో వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Chandrababu: నాణ్యమైన విద్యుత్తుకు కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు.

Gujarat : ట్రక్కును ఢీ కొట్టిన బస్సు..

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌ – వడోదరా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆనంద్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు సూపరిటెండెంట్‌ గౌరవ్‌ జసాని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

AP: బయటపడ్డ పురాతన కట్టడం

చిత్తూరు జిల్లా చారిత్రక చంద్రగిరి రాలయవారికోట సమీపంలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. రాయలవారికోటకు పడమర దిశలోని మండపానికి ఎడమ వైపున షేక్‌ ముజీబ్‌కు సుమారు రెండెకరాల మామిడితోట తమ వంశపారంపర్యగా సంక్రమిస్తోంది. రైతు ముజీబ్‌ తోటలో ముళ్ల పొదళ్లు, ఎత్తుపళ్లాలను చదును చేసి కొత్తగా మామిడి మొక్కలు, కూరగాయల సాగుకు శనివారం జేసీబీతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో తోటలో చిన్నపాటి గుట్టగా ఉన్న మట్టిదిబ్బను తొలగించి శుభ్రం చేస్తుండగా అతి ప్రాచీనమైన పెద్ద రాతిబండల కట్టడం బయటపడింది. విషయాన్ని రైతు రాయలవారికోట అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పురావస్తుశాఖ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌కుమార్‌ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పెద్దపాటి బండలతో వరుస క్రమంలో నిర్మించిన పురాతన కట్టడాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతం మినహాయించి తోటను చదును చేసుకోవాలని రైతుకు సూచించారు. ఈ కట్టడం 11వ శతాబ్దానికి సంబంధించినదిగా అధికారులు భావిస్తున్నారు. కట్టడం బయటపడంతో స్థానికులు, కోట సందర్శకులు, పర్యాటకులు ఫొటోలు తీసుకుంటున్నారు.

CBN: కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దు

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని... దానిని వీడాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు మీడియాతో సరదాగా సంభాషించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు తాను కూడా దండం పెడతానని చంద్రబాబు అన్నారు. ఇవాళ్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా అని చంద్రబాబు తెలిపారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని... నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నా అని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.