చిట్టి న్యూస్

TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, విచారణ రేపటికి వాయిదా

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ ల పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది.

Mumbai Hit-And-Run: తప్పు చేసి, కొడుకుని తప్పించేసి ..

ముంబైలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా చేసిన కారు ప్రమాదంలో అసలు వాస్తవం బయటకు వచ్చింది. ప్రమాదం తర్వాత మిహిర్‌ ఫోన్‌లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్‌, డ్రైవర్‌ బిదావత్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మిహిర్‌ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు. తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు. తర్వాత బిదావత్‌ కారు నడిపాడు. కారును రివర్స్‌ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. మరోవైపు ఈ కేసులో రాజేష్‌ షాకు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మిహిర్‌ షా (24) పరారీలో ఉన్నాడు. బిదావత్‌ను మంగళవారం వరకు పోలీస్‌ కస్టడీకి పంపుతూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.

Haryana bus accident : బోల్తాపడిన బస్సు.. 40మంది విద్యార్థులకు గాయాలు

హర్యానా  రాష్ట్రం పంచకుల  లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాఠశాల విద్యార్థులు గాయాలపాలయ్యారు . పింజోర్‌లోని నౌల్టా గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు నౌల్టా గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ నగరంలోని పింజోర్‌ ఆసుపత్రి, సెక్టార్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ప్రయాణికురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పీజీఐ చండీగఢ్‌కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు బస్సులో ఓవర్‌లోడ్‌, రోడ్ల అధ్వాన స్థితి కూడా ప్రమాదానికి దారితీసిన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

GROUP 1: గ్రూప్‌ 1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కుట్ర

తెలంగాణలో గ్రూప్‌ 1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరు ఎత్తులు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రూప్‌ 1 పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని 1:100కి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. 2022లో అప్పటి ప్రభుత్వం 1:50 అని ఉత్తర్వులు ఇచ్చిందని... ఆ ప్రకారం పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. పేపర్లు లీక్‌ కావడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయని... ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను జతచేసి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించామని రేవంత్‌రెడ్డి వివరించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత అభ్యర్థుల నిష్పత్తిని 1:100 చేస్తూ ఉత్తర్వులిస్తే కోర్టు అయిదు నిమిషాల్లో వాటిని కొట్టేస్తుందన్నారు. తాము గ్రూప్‌ 1 పోస్టులను భర్తీ చేయకుండా అడ్డుకోవడానికే కొందరు ఈ ఎత్తులు వేస్తున్నారని రేవంత్‌ అన్నారు. అన్ని ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ తరహాలో నిర్వహించడానికి నిపుణుల చేత అధ్యయనం చేయిస్తున్నామని... ఒక పరీక్షకు మరోటి అడ్డురాకుండా క్యాలెండర్‌ తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

LK Advani: ఎల్‌కే అద్వానీకి అస్వస్థత..

 బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, భారతరత్న ఎల్‌కే. అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటినా అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇటీవల కూడా ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. రాత్రి 9గంటల నుంచి డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని.. ఆరోగ్యం స్థిరంగా ఉందని అపోలో ఆస్పత్రి పేర్కొంది.

TTD: అన్నప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాదిమంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం తయారీలో సేంద్రీయ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. అన్న ప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది. వీటితో పాటుగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది, కొవిడ్ సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను తగ్గించారు. అయితే ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇటీవల సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టంను పెంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే అన్న ప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.


Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్...

మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లాలో మంగళవారం ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఇండో-టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ బలగాలు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించాయి.అబూజ్‌మడ్‌ ఇలాకాలోని కోహక్‌మేట అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. సుమారు గంటన్నరకు పైగా కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

CM Chandrababu: మూడు శాఖల పనితీరుపై సీఎం సమీక్ష

 వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు.. వివిధ అంశాలపై వరుస రివ్యూలు మొదలు పెట్టారు సీఎం.. ఈ సమీక్షకు మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తదితర మంత్రులు కూడా హాజరయ్యారు.. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై మొదట సమీక్ష ప్రారంభించారు.. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని గతంలోనే టీడీపీ ఆరోపణలు చేసిన విషయం విదితమే.. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాహ్ కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.. దీంతో.. ఇసుక విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ఫోకస్‌ పెట్టారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు ఉన్నాయి.. రోడ్లపై కూడా అప్పట్లో విపక్షాలు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఉద్యమాన్నే చేశాయి.. ఇప్పుడు వర్షాకాలంలో భారీ వర్షాల నేపథ్యంలో.. రోడ్లు మరింత గందరగోళంగా మారే పరిస్థితులు ఉండడంతో.. ముందుగా రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

AP: ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీనే వారి ఖాతాల్లో జమయ్యాయి. ఉద్యోగులకు సోమవారం దాదాపు 90 శాతంపైగా జీతాలు పడిపోగా.. పెన్షనర్లకు పింఛన్లు కూడా 50 శాతం అందాయి. మిగతావారికి కూడా ఇవాళ జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. పోలీస్‌, రెవెన్యూ, హెల్త్‌, పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు జీతాలందాయి. కొన్ని జిల్లాల్లో దాదాపు వంద శాతం జీతాలు జమయ్యాయి. టీచర్ల బిల్లులు చివర్లో పెట్టడం వలన వారిలో ఎక్కువ మందికి జీతాలు పడలేదు. ఇవాళ అందరికీ వంద శాతం అందుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులూ పూర్తిగా క్లియర్‌ అయినట్టు తెలిసింది. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలిచ్చిన చరిత్ర లేదు. జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో పడాలంటే నెలలో మూడోవారం వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తిస్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు రూ.5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు రూ.13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవిగాక వారం వారం అందినకాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఏకకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

Google Translate : గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మరో 110 భాషలు

ఒక భాష నుంచి మరో భాషకు టెక్స్ట్, వాయిస్ ట్రాన్స్ లేట్ చేయాలంటే చాలామంది ఉపయోగించే టూల్ గూగుల్ ట్రాన్సలేట్ ( Google Translate ). ఇప్పటికే సుమారు 243 భాషలకు సపోర్ట్ చేస్తున్న గూగుల్ ట్రాన్సులేట్ ఇప్పుడు మరో 110 భాషలకు సపోర్ట్ చేయడానికి సన్నద్ధమైంది.

ఈ కొత్త భాషలను విస్తరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు గూగుల్ తెలిపింది. 2006లో ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్ లేట్ 2022లో జీరో-షాట్ మెషిన్ అనువాదాన్ని ఉపయోగించి 24 కొత్త భాషలను జోడించింది. కాగా 2024 జూన్ నాటికి 243 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1000 భాషలకు మద్దతు ఇచ్చే ఏఐ మోడల్స్ ను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

తాజాగా గూగుల్ యాడ్ చేసిన కొత్త భాషల జాబితాలో ఫాన్, లువో, గా, కికోంగో, స్వాతి, వెండా, వోల్ఫ్ వంటి మరిన్ని ఆఫ్రికన్ భాషలతో పాటు అవధి, బోడో, ఖాసి, కోక్లోరోక్, మార్వాడీ, సంతాలి, తుళు వంటి ఏడు భారతీయ భాషలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మందికి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని 100 మిలియన్లకుపైగా మాట్లాడే ప్రధాన భాషలు, మరికొన్ని స్థానిక ప్రజల చిన్న భాషలు ఉన్నాయి.

Jaspreet Bumrah: బుమ్రాకు  వెరైటీ  ప్లకార్డును కానుకగా ఇచ్చిన సిరాజ్

 టీ 20 ప్రపంచ కప్ లో భారతీయ ఆటగాళ్ళ అద్భుత ప్రదర్శన మారువలేనిది. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లెట్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లను వణికించాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్, ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ లను బుమ్రా అవుట్ చేసిన తీరు అదరహో అనేలా ఉంది. ఆ ఇద్దరినీ బుమ్రా అద్భుతమైన స్వింగ్ తో బోల్తా కొట్టించాడు. అంతేకాదు, ఓ దశలో దక్షిణాఫ్రికా సింగిల్ రన్ తీయడానికి చాలా కష్టపడిందంటే అందుకు కారణం బుమ్రా కచ్చితత్వంతో కూడిన బౌలింగే.

మొత్తమ్మీద బుమ్రా కూడా టీమిండియా వరల్డ్ కప్ విజయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో, సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ నుంచి బుమ్రాకు సూపర్ కానుక అందింది. అది ఒక ప్లకార్డు. దానిపై ఇలా రాసి ఉంది. "భూమ్మీద మాత్రమే కాదు, గాలిలో, నీటిలో కూడా అత్యుత్తమ బౌలర్ బుమ్రా" అనే అర్థం వచ్చేలా ఆ ప్లకార్డు ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్లకార్డు ఫొటో వైరల్ అవుతోంది.

Family Drown: మహిళతో సహా నలుగురు పిల్లలు జలపాతంలో గల్లంతు..

విహారయాత్ర విషాదయాత్రగా మిగిలింది. జలపాతం చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబం అందులో గల్లంతైంది. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం భుసీ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని జలపాతం వద్ద ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే పోలీసులు, స్థానికుల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జలపాతం దిగువన ఉన్న నాచు బండరాళ్ల వల్ల జారిపడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. 40 ఏళ్ల మహిళతో పాటు 13 ఏళ్ల బాలిక మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, 6 ఏళ్ల ఇద్దరు బాలికలు, నాలుగేళ్ల బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పారు. సంఘటన స్థలం భూసీ డ్యామ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని ఎస్పీ వెల్లడించారు.

Sam Pitroda : ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా మళ్లీ పిట్రోడా

ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా మళ్లీ శాం పిట్రోడాను నియమిస్తూ బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనే ఛైర్మన్‌గా ఉండేవారు. ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  మళ్లీ ఆయననే కాంగ్రెస్‌ పార్టీ నియమించింది.


CI Transfer : డిప్యూటీ సీఎం  కార్యాలయంలో సీఐ దురుసు ప్రవర్తన

తాజాగా ఏపీలో ఓ సీఐ పై బదిలీ వేటు పడింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ సీఐ అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సిఐ లోపలికి వెళ్లే సమయంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రత సిబ్బంది ఆ సిఐ కి లోపలికి వెళ్లేందుకు కొద్దిసేపు ఆగాలని చెప్పారు. అయితే వారి మాటలను లెక్క చేయని సిఐ భద్రత సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.

ఆపై సీఐ లోపల పూజకు కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే షూ తోనే లోపలికి వెళ్ళాడు. ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది పోలీస్ ఉన్నాదికారులకు సీఐ దురుసు ప్రవర్తనను తెలియజేశారు. దీంతో బుధవారం నాడు సీఐ శ్రీనివాసరావుపై బదిలి వేటు వేశారు అధికారులు.

ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సీఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావుడి చేశారు. అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. 

BRAHMANI: పల్లెల రూపురేఖలు మార్చిన లోకేశ్‌

నారా లోకేశ్‌ అమెరికా నుంచి పల్లె గడపకు వచ్చి ఇక్కడి రూపురేఖలు మార్చారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కొనియాడారు. అంతా పల్లెల నుంచి అమెరికా వెళ్తే, అక్కడ చదివిన లోకేశ్‌ పల్లె గడపల వద్దకు వచ్చారని గుర్తు చేశారు. సిమెంట్‌ రోడ్లతో, ఎల్‌ఈడీ వెలుగులతో పల్లెల వాటి రూపురేఖలు మార్చేశారని బ్రాహ్మణి ప్రశంసించారువిద్యా, ఐటీశాఖ మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆమె ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పడి విమర్శల్ని పట్టించుకోకుండా లోకేశ్‌ అవార్డుల పంట పండించారని... తనను వ్యక్తిత్వహననం చేసిన వారికి నువ్వేంటో తెలియజేశావని అన్నారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు. కుటుంబపరంగా నీకు మా సహకారం ఉంటుందింటూ బ్రాహ్మణి పేర్కొన్నారు. బ్రాహ్మణి చేసిన ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సరగసీతో పిల్లలను పొందినా 6 నెలలు సెలవులు

సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనను కేంద్రం సవరించింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళకు 180 రోజుల ప్రసూతి సెలవులు, తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులను తీసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్-1972ను సవరించింది.

కొత్త నిబంధనలు ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి (గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి) కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఇక ఈ సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులకు కూడా ప్రభుత్వం అనుమతించింది. సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసీ విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. తాజాగా ఆ నిబంధనలను సవరించి కొత్త రూల్స్​ను తీసుకొచ్చంది కేంద్ర ప్రభుత్వం. సవరించిన కొత్త రూల్స్ జూన్​ 18నుంచి అమల్లోకి వచ్చాయి.

CM Pinarayi Vijayan: కేరళ కాదు ‘కేరళం’

కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సభలో సోమవారం ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలపడం వల్ల తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్‌, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. అయితే ఈ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని పంపింది కేరళ ప్రభుత్వం.

CHIRU: చిరంజీవిని కలిసిన బండి సంజయ్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌...మెగాస్టార్‌ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్‌.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లగా చిరంజీవి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చారని.... మీరు కేంద్ర మంత్రి కావడం చాలా ఆనందంగా ఉందని సంజయ్‌తో చిరంజీవి అన్నారు. కృషికి తగిన పదవి లభించిందని సంజయ్‌ను ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతి మిగిల్చిందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ స్పందిస్తూ.. తాను విద్యార్థి దశలో చిరంజీవి సినిమాలు అభిమానని సంజయ్‌ మెగాస్టార్‌తో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారిద్దరు జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

Road Accident : నేపాల్‌లో  లోయలో పడిన బస్సు

దక్షిణ నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్ వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. దక్షిణ నేపాల్‌లోని రౌతాహత్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారత నంబర్ ప్లేట్ ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో జీపు డ్రైవర్ సోహైల్ అమీర్ (22) కూడా ఉన్నారని, వారందరూ బిర్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

MP Bishnupada Roy: నాకు ఓటేయలేదు కదా.. ఏం జరుగుతుందో చూడండి ..

‘యాదవులు, ముస్లింలు తనకు ఓటేయలేదు.. వారి కోసం పని చేయను అని జేడీయూ ఎంపీ దేవేశ్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవలి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా కాగా.. తాజాగా అండమాన్‌ నికోబార్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ బిష్ణుపాద రాయ్‌ కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. నికోబార్‌ ప్రజలు తనకు ఓటేయలేదు.. వారికి ఇప్పటి నుంచి గడ్డు రోజులు మొదలైనట్టేనని ఆయన బెదిరింపులకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు జరిగిన మరుస రోజు ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌ అవుతుంది.

ఇక, నికోబార్‌ పేరుతో మీరు ( ప్రజలను ఉద్దేశించి) డబ్బులు తీసుకుంటారు.. మందు తాగుతారు.. కానీ, ఓట్లు మాత్రం వేయరు అంటూ బీజేపీ ఎంపీ బిష్ణుపాద రాయ్ పేర్కొన్నారు. జాగ్రత్త.. ఇక, మీకు గడ్డు రోజులు ప్రారంభమైనట్టే అంటూ హెచ్చరించారు. మీ భవిష్యత్త్ ఎంత మాత్రం ఆశాజనకంగా ఉండదు అంటూ ఓటర్లకు రాయ్ వార్నింగ్ ఇచ్చాడు.

AP: త్వరలోనే పోలీస్‌ వ్యవస్థ ప్రక్షాళన

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎంతో సమావేశమైన డీజీపీ.. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి హత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని సీఎం డీజీపీతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్దేశించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీస్ శాఖలో ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మరిన్ని బదిలీలు జరగొచ్చని తెలుస్తోంది.

Kejriwal:  కేజ్రీవాల్‌కు నిరాశ

 ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే విధించింది. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో గురువారం కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్‌ శుక్రవారం విచారించారు. ఈ విషయంలో పూర్తి రికార్డులను పరిశీలించాల్సి ఉన్నందున 2-3 రోజుల పాటు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించారు.

మరికొన్ని గంటల్లో తీహార్ జైలు నుంచి విడుదలవుతారన్న సమయంలో హైకోర్టు రూపంలో మరో షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో ఢిల్లీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ పరిణామంతో ఆప్ షాక్‌కు గురైంది. ఇక తీర్పును రిజర్వ్ చేసే వరకు కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ తరపున హైకోర్టును కోరారు. కానీ కేజ్రీవాల్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. మొత్తం రికార్డులను పరిశీలించాలని కోరుతున్నందున 2-3 రోజుల పాటు ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో తుది తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్‌ తీహార్‌ జైల్లోనే ఉండనున్నారు.

ఇదిలా ఉంటే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్‌ చేసిన ఈడీ.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు.. 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. మొత్తానికి ఇంత కాలానికి గురువారం ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

TG: నేడే తెలంగాణ కేబినేట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నేడు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. రైతుబంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తోసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్... లోక్‌సభ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించారు. మూడు లేదా నాలుగు విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చేసినట్లు సమాచారం.

Delhi : ఢిల్లీలో వడగాడ్పులకు 50 మంది బలి!

దేశ రాజధాని ఢిల్లీని వడగాడ్పులు వణికిస్తున్నాయి. గత 48 గంటల వ్యవధిలో రాజధాని పరిధిలో 50 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా రాజధానిలో 35 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పౌరులు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడుతున్నారు. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడటం లేదని వారు వాపోతున్నారు. గత 14 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో పచ్చదనం అంతరించిపోయి, విచ్చలవిడిగా నిర్మాణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వడగాల్పులు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద ఆరోగ్య శాఖ బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. వడదెబ్బ రోగులకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటుచేయాలని దవాఖానలను ఆదేశించింది.

ED: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

బీఆర్ఎస్‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి ఈడీ తనిఖీలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు ఏమైన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారమో తెలియాల్సి ఉంది.

Ayyannapatrudu: ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైంది. సీనియర్ నేత అయిన ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. ఉపసభాపతి పదవిని జనసేనకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు లోకం మాధవి, పంతం నానాజీ రేసులో ఉన్నట్టు సమాచారం. చీఫ్‌విప్‌గా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది.

ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేస్తారు. అలాగే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎన్నుకుంటారు. టీడీపీ మరో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు అంటే 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఉంటుంది.

Nuclear Weapons : తగ్గేదే లే ....పాక్‌ కంటే భారత్‌ వద్దే ఎక్కువ  అణ్వాయుధాలు

అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో భారత్‌, చైనా, పాకిస్థాన్‌ దేశాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్‌-170, భారత్‌-172 అణ్వాయుధాల్ని కలిగివున్నాయని, క్రితం ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్‌హెడ్స్‌ 410 నుంచి 500కు పెరిగాయని స్వీడన్‌కు చెందిన మేధో సంస్థ 'సిప్రి' (స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తాజా నివేదిక వెల్ల‌డించింది. ఇక సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువార్‌ హెడ్లపై భారత్‌ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉంద‌ని నివేదిక తెలిపింది. భారత్‌, పాక్‌, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ దేశాల అణు వార్‌హెడ్లకు సంబంధించి కీలక విషయాల్ని నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంగా  అణ్వాయుధాగారం  పెంచుకుంటున్న దేశం చైనా. 2023 జనవరిలో ఆ దేశం వద్ద 410 అస్త్రాలు ఉండేవి. ఈ ఏడాది జనవరికి వాటి సంఖ్య 500కు పెరిగింది. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకోవచ్చు.

 

PAWAN: పవన్‌కు వదినమ్మ బహుమతి

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఆయన వదిన సురేఖ ఓ మంచి బహుమతి అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కల్యాణ్ ... తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సురేఖ పవన్ కు పెన్నును కానుకగా ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆ పెన్నును ఎంతో ఆప్యాయంగా తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ... సురేఖ ఈ కానుక అందించినట్లు చిరంజీవి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు.

TG: వేలం వేస్తున్నట్లు రైతు పొలంలో బ్యాంకు సిబ్బంది ఫ్లెక్సీ

తీసుకున్న రుణం చెల్లించలేదని పొలాన్ని వేలం వేస్తున్నట్లు ఓ రైతు పొలంలో బ్యాంకు అధికారులు ఫ్లెక్సీ పెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ లో చోటుచేసుకుంది. పోల్కంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు 2010లో భూమిని తనఖాపెట్టి డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు నుంచి ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత వాయిదాలు చెల్లించడం ఆపేశారు. కొన్నాళ్లకు రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంక్ అధికారులు రైతుపై ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. ఎటువంటి సమాధానం రాలేదు. ఈ దశలో పొలాన్ని వేలం వేస్తున్నట్లు రైతు పొలంలో బ్యాంకు అధికారులు ప్లెక్సీని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఐదు లక్షలు అప్పు తీసుకుంటే వడ్డీతో ఇప్పుడు పదిహేను లక్షలకు దాటిందని, ఇంత పెద్ద మొత్తం చెల్లించడం భారంగా మారిందని రైతు అన్నారు వడ్డీ తగ్గించాలని బ్యాంక్ అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలంలో ఫ్లెక్సీలు, ఎర్రజెండాలను పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP: మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులంటే..

 సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీలో........ మొత్తం 16 వేల 347 పోస్టులు ఉండగా..స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 7 వేల 725 ఉన్నాయి. SGT పోస్టులు 6 వేల 371, TGT పోస్టులు 17 వందల 81 ఉన్నాయి. PGT పోస్టులు 286, ప్రిన్సిపల్స్ 52, పీఈటీ ఖాళీలు 132 ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సవరించి.......... చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్... జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

NEET-UG 2024: నీట్‌ కౌన్సెలింగ్‌పై స్టే   నిరాకరించిన సుప్రీంకోర్టు

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ 2024ను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్‌ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు పంపింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్‌ బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు వివాదాస్పద గ్రేస్‌ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. ఆ తర్వాతే వాళ్లకు కౌన్సెలింగ్‌ ఉంటుందని ఎన్టీఏ కోర్టుకు నివేదించింది.

Nara Lokesh: ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేశ్

చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వెంటనే నారా లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడు లోకష్ ప్రమాణం సందర్భంలో చంద్రబాబు కళ్ళలో ఆనందం కనిపించింది. 

Army chief : తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

 దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1964 జులై 1న జన్మించిన ఉపేంద్ర డిసెంబరు 15, 1984లో జమ్మూ-కశ్మీర్‌ రైఫిల్స్‌ దళంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం ఆయన్ను వరించాయి.  ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌ మనోజ్‌ సి పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. జనరల్‌ పాండే మే 31నే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్రం ఆయన పదవీకాలాన్ని నెలపాటు పొడిగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్‌ పదవీ కాలం పొడిగించడం అత్యంత అరుదు.

PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు!

భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైల్​పై తొలి సంతకాన్ని చేశానని మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటామని ఆయన చెప్పారు.

RRR: గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు

జగన్ ప్రభుత్వంలో తనను కస్టడీలో హింసించడంపై ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి.. CID చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు,నాటి ముఖ్యమంత్రి జగన్ , సీఐడీ అదనపు ఎస్పీవిజయ్ పాల్ పై రఘరామరాజు ఫిర్యాదు చేశారు. తన గాయాలపై గుంటూరు GGH సూపరింటెండెంట్...... తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. జగన్ ను విమర్శిస్తే చంపేస్తామని సునీల్ కుమార్ బెదిరించారని తన ఫిర్యాదులో ఆరోపించారు. 

PM Mette Frederiksen: ఎన్నికల వేళ డెన్మార్క్‌ ప్రధానిపై దుండగుడి దాడి

డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెటె ప్రెడెరిక్సన్‌పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ‘‘కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని దిగ్భ్రాంతి చెందారు’’ అని ప్రెడెరిక్సన్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దాడిలో ప్రధాని గాయపడ్డారా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రెడెరిక్సన్‌పై దాడిని ఎన్డీయే నేత మోదీ ఖండించారు.  డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి తీవ్ర ఆందోళన కలిగించిందని వెల్లడించారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని మోదీ స్పష్టం చేశారు. మిత్రురాలు మెట్టే ఫ్రెడరిక్సన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.