చిట్టి న్యూస్

PAWAN: పవన్‌కు వదినమ్మ బహుమతి

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఆయన వదిన సురేఖ ఓ మంచి బహుమతి అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కల్యాణ్ ... తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సురేఖ పవన్ కు పెన్నును కానుకగా ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆ పెన్నును ఎంతో ఆప్యాయంగా తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ... సురేఖ ఈ కానుక అందించినట్లు చిరంజీవి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు.

TG: వేలం వేస్తున్నట్లు రైతు పొలంలో బ్యాంకు సిబ్బంది ఫ్లెక్సీ

తీసుకున్న రుణం చెల్లించలేదని పొలాన్ని వేలం వేస్తున్నట్లు ఓ రైతు పొలంలో బ్యాంకు అధికారులు ఫ్లెక్సీ పెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ లో చోటుచేసుకుంది. పోల్కంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు 2010లో భూమిని తనఖాపెట్టి డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు నుంచి ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత వాయిదాలు చెల్లించడం ఆపేశారు. కొన్నాళ్లకు రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంక్ అధికారులు రైతుపై ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. ఎటువంటి సమాధానం రాలేదు. ఈ దశలో పొలాన్ని వేలం వేస్తున్నట్లు రైతు పొలంలో బ్యాంకు అధికారులు ప్లెక్సీని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఐదు లక్షలు అప్పు తీసుకుంటే వడ్డీతో ఇప్పుడు పదిహేను లక్షలకు దాటిందని, ఇంత పెద్ద మొత్తం చెల్లించడం భారంగా మారిందని రైతు అన్నారు వడ్డీ తగ్గించాలని బ్యాంక్ అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలంలో ఫ్లెక్సీలు, ఎర్రజెండాలను పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP: మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులంటే..

 సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీలో........ మొత్తం 16 వేల 347 పోస్టులు ఉండగా..స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 7 వేల 725 ఉన్నాయి. SGT పోస్టులు 6 వేల 371, TGT పోస్టులు 17 వందల 81 ఉన్నాయి. PGT పోస్టులు 286, ప్రిన్సిపల్స్ 52, పీఈటీ ఖాళీలు 132 ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సవరించి.......... చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్... జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

NEET-UG 2024: నీట్‌ కౌన్సెలింగ్‌పై స్టే   నిరాకరించిన సుప్రీంకోర్టు

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ 2024ను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్‌ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు పంపింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్‌ బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు వివాదాస్పద గ్రేస్‌ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. ఆ తర్వాతే వాళ్లకు కౌన్సెలింగ్‌ ఉంటుందని ఎన్టీఏ కోర్టుకు నివేదించింది.

Nara Lokesh: ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేశ్

చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వెంటనే నారా లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడు లోకష్ ప్రమాణం సందర్భంలో చంద్రబాబు కళ్ళలో ఆనందం కనిపించింది. 

Army chief : తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

 దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1964 జులై 1న జన్మించిన ఉపేంద్ర డిసెంబరు 15, 1984లో జమ్మూ-కశ్మీర్‌ రైఫిల్స్‌ దళంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం ఆయన్ను వరించాయి.  ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌ మనోజ్‌ సి పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. జనరల్‌ పాండే మే 31నే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్రం ఆయన పదవీకాలాన్ని నెలపాటు పొడిగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్‌ పదవీ కాలం పొడిగించడం అత్యంత అరుదు.

PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు!

భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైల్​పై తొలి సంతకాన్ని చేశానని మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటామని ఆయన చెప్పారు.

RRR: గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు

జగన్ ప్రభుత్వంలో తనను కస్టడీలో హింసించడంపై ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి.. CID చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు,నాటి ముఖ్యమంత్రి జగన్ , సీఐడీ అదనపు ఎస్పీవిజయ్ పాల్ పై రఘరామరాజు ఫిర్యాదు చేశారు. తన గాయాలపై గుంటూరు GGH సూపరింటెండెంట్...... తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. జగన్ ను విమర్శిస్తే చంపేస్తామని సునీల్ కుమార్ బెదిరించారని తన ఫిర్యాదులో ఆరోపించారు. 

PM Mette Frederiksen: ఎన్నికల వేళ డెన్మార్క్‌ ప్రధానిపై దుండగుడి దాడి

డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెటె ప్రెడెరిక్సన్‌పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ‘‘కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని దిగ్భ్రాంతి చెందారు’’ అని ప్రెడెరిక్సన్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దాడిలో ప్రధాని గాయపడ్డారా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రెడెరిక్సన్‌పై దాడిని ఎన్డీయే నేత మోదీ ఖండించారు.  డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి తీవ్ర ఆందోళన కలిగించిందని వెల్లడించారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని మోదీ స్పష్టం చేశారు. మిత్రురాలు మెట్టే ఫ్రెడరిక్సన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

Chandrababu Naidu : ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టంగా ఏర్పాట్లు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్‌ శనివారం సమీక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎ.బాబు, హరి జవహర్‌లాల్, కన్నబాబు, హరికిరణ్, వీరపాండ్యన్‌లకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) సురేష్‌కుమార్‌కు రిపోర్టు చేయాలని ఈ అధికారులను ఆదేశించింది.

AP CS Neerab kumar prasad : ఏపీ సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది.ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 1034 ద్వారా శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.శుక్రవారం ఉదయం 11 గం.లకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం..

జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది . సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నదని జపాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నోటో నగరంలో ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో జనవరి 1న సంభవించిన భూకంపంలో 230 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.

AP: కూటమిదే అధికారం.. తేల్చిచెప్పిన మరో సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని... ఇండియా టుడే- మై యాక్సిస్‌ కూడా తేల్చిచెప్పింది. దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా టుడే- మై యాక్సిస్‌ కూడా చేరింది. తెలుగుదేశం సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని... మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, భాజపా 4 నంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. మొత్తంగా NDAకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించింది. ఇక అధికార వైకాపాకు 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 0 నుంచి 2 సీట్లు వస్తాయని తెలిపింది. 

MP High Court: హిందూ-ముస్లిం వివాహం చెల్లదు

ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ముస్లిం అబ్బాయితో హిందూ అమ్మాయి వివాహం చెల్లుబాటు కాదని మధ్య ప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్ట్రార్‌ వద్ద నమోదు చేయించుకునేందుకు పోలీసు భద్రత కల్పించాలని ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి కోర్టును ఆశ్రయించారు. పెండ్లి తర్వాత దంపతులిద్దరూ మతం మారబోరని యువతీయువకుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముస్లిం పర్సనల్‌ లాలో మతాంతర వివాహం నిషేధమే అయినప్పటికీ, ప్రత్యేక వివాహ చట్టం కింద చెల్లుబాటు అవుతుందని కోర్టుకు తెలిపారు. వీరి వాదనలను విన్న జస్టిస్‌ గుర్పాల్‌ సింగ్‌ అహ్లువాలియా.. హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రత్యేక వివాహ చట్టం కింద పెండ్లి చేసుకున్నప్పటికీ పర్సనల్‌ లా ప్రకారం నిషేధమైన ఈ వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.

Noida Fire Accident : నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..

 ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 100లోని లోటస్ బ్లూబర్డ్ సొసైటీ ఫ్లాట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏసీలో పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం తర్వాత సొసైటీలో గందరగోళ వాతావరణం నెలకొంది. మంటల నుండి తప్పించుకోవడానికి, ప్రజలు తమ ఫ్లాట్లను వదిలి బయటకు వచ్చేశారు. అగ్నిప్రమాదంపై సొసైటీ ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌ కండీషనర్‌లో పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతంలో విపరీతమైన వేడి విధ్వంసం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజురోజుకు అగ్ని ప్రమాదాల వార్తలు వస్తున్నాయి. ఉక్కపోత కారణంగా ఏసీ, కూలర్, ఫ్రీజ్ వంటి కూలర్ల వాడకం బాగా పెరిగింది.

North Korea:  దక్షిణ కొరియాపై  ఉత్తర కొరియా చెత్త బాంబులు

దక్షిణ కొరియా కార్యకర్తలు తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా మంగళవారం రాత్రి నుంచి బెలూన్ల ద్వారా దక్షిణ కొరియాలోకి చెత్త, మురికి మట్టిని పంపింది. బుధవారం మధ్యాహ్నానికి దాదాపు 260 ఉత్తర కొరియా బెలూన్లు తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వ్యర్థాలను జారవిడిచాయని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. బెలూన్లను, అవి విడిచిన వస్తువులనూ, పదార్థాలనూ తాకవద్దనీ, వాటి గురించి పోలీసులకు కానీ, సైన్యానికి కానీ తెలపాలని తమ పౌరులను అధికార వర్గాలు కోరాయి. దేశమంతటా రోడ్ల వెంబడి బెలూన్లు జారవిడచిన చెత్త చెల్లాచెదురుగా పడి ఉంది. రాజధాని సియోల్‌లో పడిన బెలూన్‌లో ఒక టైమర్‌ కనిపించింది. అది బెలూన్‌ను పేల్చడానికి ఉపయోగించిన టైమర్‌ అని దక్షిణకొరియా అధికారులు తెలిపారు. ఈ చెత్తలో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయడానికి నిపుణుల బృందాలను నియమించారు. 2016లో ఉత్తర కొరియా బెలూన్ల వల్ల దక్షిణ కొరియాలో కార్లు, ఇతర ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ సారి ఏమైనా నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.

Pakistan: లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది మృతిచెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బలూచిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్‌ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బ‌య‌ల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వ‌ర‌కు ప్రయాణికుల‌కు గాయాల‌య్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

PVR INOX 99 offer : కేవలం రూ.99కే మూవీ టికెట్లు!

ఈ వారం సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, PVR మరియు INOX థియేటర్లు ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించాయి. వారు ఈ ఫ్రైడే మాత్రమే సినిమా టికెట్లను కేవలం రూ.99కే అందించబోతున్నారు. ఈ ఆఫర్ అన్ని సినిమాలకు మరియు అన్ని షో టైమ్‌లకు వర్తిస్తుంది.

Stone Quarry: మిజోరంలో భారీ వర్షాలతో కూలిన గ్రానైట్‌ క్వారీ.

మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ  కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని కోరిట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లను మూసివేసినట్లు తెలిపారు. ఇక, జాతీయ రహదారి 6పై కొండ చరియలు విరిగిపడటంతో.. ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరో రెండ్రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.


Tornadoes: అమెరికాలో విధ్వసం సృష్టిస్తున్న టోర్నడోలు

అమెరికాను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్‌, ఓక్లహోమా, ఆర్కాన్సాస్‌లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోలు ధాటికి ఇప్పటివరకు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో  ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి.ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.పెద్దసంఖ్యలో చెట్లు నేలకూలాయి.వేలాది సముదాయాలకు విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.చెట్లు, విద్యుత్తు లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని. అధికారులు వెల్లడించారు. డల్లాస్‌, డెంటన్‌ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ టెక్సాస్‌, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఓక్లహామాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే.. హెచ్చరికలు జారీ అయ్యాయి.

AMITH SHAH: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది ఎన్‌డీఏనే

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చేది NDA సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. PTI వార్తాసంస్థతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన అమిత్‌ షా ఏపీలో తాము దాదాపు 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా . 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా, విపక్ష పార్టీల పాలనలోని.... రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని జోస్యం చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి -UCC తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు.UCCని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని.......... షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన మూలసూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే ఐదేళ్లలో UCCని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు. అగ్నిపథ్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు.

Shahjahanpur:  ప్రయాణికుల బస్సుపై డంపర్ బోల్తా, 11 మంది భక్తులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని షాజాహాన్‌పూర్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్‌పూర్‌ జిల్లాలోని ఖుతర్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.

శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో భక్తులతో కూడిన బస్సు రాత్రి భోజనం కోసం ఓ దాబా వద్ద ఆగి ఉంది. బస్సులోని కొందరు భోజనం తింటుండగా, మరికొందరు బస్సులో ఉన్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అధి బస్సుపైకి దూసుకురావడంతో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. బస్సులో మొత్తం 70 మంది ఉన్నారని, వారంతా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ నుంచి ఉత్తరాఖండ్‌లోని పూర్ణగిరికి తీర్థయాత్రకు వెళ్తున్నారని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది సగం నిద్రలో ఉన్నారు. మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగానే  ఉంది. వారంతా డంపర్ కింద సమాధి అయ్యారు.

Kolkata: 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు..

కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసులకు ఓబీసీ కింద జారీ చేసిన సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు... ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది

Indigo Flight: విమానంలో  నిలబడే ప్రయాణం

బస్సు, రైల్లో రద్దీ ఎక్కువైతే  ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం  చూస్తుంటాం. కానీ విచిత్రంగా విమానంలో కూడా ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్‌ టేకాఫ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. 

ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్‌కు ఫ్లైట్‌ సిద్ధమైంది. ఇదే సమయంలో ఓవర్‌ బుక్‌ అయిన అఖిలేశ్‌ చౌబే అనే ప్రయాణికుడు విమానంలో నిలబడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది.. పైలట్‌ను అలర్ట్‌ చేశారు. దీంతో పైలట్‌ విమానాన్ని తిరిగి వెనక్కు మళ్లించాడు. నిలబడ్డ ప్రయాణికుడిని దింపేసిన అనంతరం గంట ఆలస్యంతో విమానం బయలుదేరింది. బుకింగ్‌ విషయంలో చిన్న తప్పిదం జరిగిందని ఇండిగో సంస్థ తెలిపింది.

HYD:  భార్య నుంచి కాపాడండయ్యా..

అదనపు కట్నం కోసమో, మద్యం మత్తులోనో భర్తలు వేధిస్తున్నారని భార్యలు ఫిర్యాదులు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా భార్యనుంచి తనకు ప్రాణహాని ఉంది రక్షించండంటూ ఓ బాధితుడు పోలీసులు వేడుకుంటున్నాడు. APలోని అమలాపురానికి చెందిన టెమూజియన్‌ మల‌్లారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్‌ ఆచార్యునిగా పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఆల్వాల్‌ నివాసం ఉంటున్నాడు. ఏపీలోని రాజోలుకు చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం తనకు వివాహం కాగా ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపాడు. పెళ్లైనప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా హింసిస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నాడు. గతంలో పలుమార్లు దాడి చేయగా పెద్దమనుషులు సర్ది చెప్పారని వివరించారు. అయినా తీరు మార్చుకోకుండా ఇటీవల మళ్లీ కత్తితో దాడి చేసిందంటూ గాయాలు చూపించాడు. స్థానిక ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదంటూ గోడు వెలిబుచ్చాడు.

Naveen Patnaik: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సెటైర్

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ఆయా రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకోవాలని హితవు చెప్పారు. బీజేపీ నేతలను రాజకీయ పర్యాటకులు అని అభివర్ణించారు. ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పెరిగింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్నాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్ గఢ్, హర్యానా, అసోం రాష్ట్రాల సీఎంలు ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీకి అధికారం ఇస్తే ఒడిశాను నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని హామీలు గుప్పించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఒడిశాలో కంటే అసోంలో తలసరి అప్పు రెట్టింపు అని, మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండని సూచించారు. తమ పార్టీ నేతలను పొలిటికల్ టూరిస్టులు అని నవీన్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయ టూరిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

Punjab: అమృత్‌సర్‌లో కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి ప్రచారంలో  కలకలం

పంజాబ్‌లోని అమృత్‌సర్‌‌లో శనివారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో జరిగిన ఘటనలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అమృత్‌సర్ నుంచి గుర్జీత్ సింగ్ వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2017 ఉప ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అమృత్‌సర్ లోక్ సభ స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ తరఫున గుర్జీత్ సింగ్, బీజేపీ తరఫున తరణ్‌జిత్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుల్దీప్ సింగ్ బరిలో నిలిచారు.

IT Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్

లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోట్లాది రూపాయల అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో నాందేడ్‌లోని భండారి ఫైనాన్స్‌, అదినాథ్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లపై దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.170 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.140 కోట్ల నగదుతో పాటు 8 కేజీల బంగారం కూడా ఉన్నది. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కపెట్టడానికి అధికారులకు 14 గంటల సమయం పట్టింది. మే 10న వందలాది మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు ప్రాంతాల్లోని ఈ సంస్థల కార్యాలయాలు, వాటి యజమానుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు.వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్‌ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్‌ టౌన్‌లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి.

Bhojpuri Star: భోజ్‌పురి నటుడిపై తల్లి పోటీ?

బిహార్‌లోని కారాకట్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌సింగ్‌ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా తల్లీకుమారుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ జూన్‌ 1న చివరిదశలో పోలింగ్‌ జరగనుండగా.. నామినేషన్లకు మంగళవారం తుది గడువు. తొలుత పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పవన్‌సింగ్‌ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే.. తన పాటలపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్పి, సొంత రాష్ట్రం బిహార్‌లోని కారాకట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో ఎన్డీయే అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేయడాన్ని భాజపా తీవ్రంగా పరిగణించింది. పోటీ నుంచి వైదొలగాలనీ, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఆయన తల్లి పోటీకి దిగడం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని అసన్‌సోల్‌ బీజేపీ టికెట్‌ను తిరస్కరించిన పవన్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి నామినేషన్‌ వేశారు.


Putin :  చైనా పర్యటనకు  పుతిన్‌

రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ టర్మ్‌లో తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్‌ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్‌ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్‌ చైనాలో పర్యటించారు.

చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ జీ జిన్‌పింగ్‌తో పుతిన్‌ సమావేశం కానున్నారు. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై వారు చర్చించనున్నారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు పుతిన్‌ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గతవారమే ఐరోపాలో అయిదు రోజుల పర్యటన ముగించుకొని వచ్చారు. ఐరోపాలో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగరీలనూ జిన్‌సింగ్‌ సందర్శించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ, యుద్ధానికీ, పౌర ప్రయోజనాలకు రెండింటికీ ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు.

CBN: ఏపీలో క్లీన్‌స్వీప్‌ ఖాయం

దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. వారణాసి బీజేపీ అభ్యర్థిగాప్రధా ని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషించబోతుందని ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారతమే లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీయేదే విజయం అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

AP: ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతలు

ఏపీలో పోలింగ్‌ కొనసాగుతోంది. వైసీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరపడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని వైసీపీ నేతలు అపహరించారు. పోలింగ్‌ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. తమ ఏజెంట్‌ను కిడ్నాప్‌ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్‌ నిలిచిపోయింది.

Lok Sabha Elections: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న  నాల్గో విడత పోలింగ్‌

 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీగా క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 96 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో ఉదయం నుంచే ఓటర్లు భారీగా బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భారీగా ఓటర్లు బారులు తీరడంతో ఈసారి జమ్ముకశ్మీర్‌లో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఓమర్‌ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉజ్జయిన్‌ పోలింగ్‌ స్టేషన్‌లో మధ్యప్రదేశ్‌ CM మోహన్‌యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే భారీ క్యూ ఉండడంతో అల్పహారం అందించారు. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం , ఐస్‌క్రీమ్‌లు అందించారు. 

నాలుగో దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బిహార్​లోని బెగుసరాయ్​ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్​సింగ్​ పోటీ చేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి అర్జున్​ ముండా ఝార్ఖండ్​లోని ఖూంటీ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత అధీర్​రంజన్ చౌధరీ బంగాల్​లోని బహరంపుర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్య వహిస్తున్నారు. బాలీవుడ్​ నటుడు శత్రుఘన్​సిన్హా తృణమూల్​ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం కన్నౌజ్‌ నుంచి బరిలో నిలిచారు.

AP: దాడులకు తెగబడుతున్న వైసీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి పోలింగ్‌ స్టేషన్‌ నుంచి బయటకు లాగేశారు. అనంతపురం జిల్లా చాపాడు మండలంలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి వైసీపీ నాయకులు గుంపులుగా వచ్చారు. వారిని కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కర్నూల్‌ జిల్లా హాలహర్వి 74, బాపురం 22 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. మరోవైపు తెలంగాణలో మాత్రం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

POLLS: ఓటు వేసిన చంద్రబాబు, జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.


అలాగే సీఎం జగన్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురం పోలింగ్‌ కేంద్రంలో జగన్‌-భారతి దంపతులు ఓటు వేశారు.


హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఓటు వేసిన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ వేశారు.



ALLU ARJUN: అల్లు అర్జున్‌పై కేసు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా శనివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా గుమికూడారు. సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అల్లు అర్జున్‌ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.