చిట్టి న్యూస్

మోదీని సీఎం కేసీఆర్‌ రిసీవ్ చేసుకుంటారా.. లేదా..?

ఈనెల 8న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో మరోసారి ప్రోటోకాల్‌పై చర్చ మొదలైంది. అధికారిక పర్యటన కాబట్టి ప్రధానిని సీఎం రిసీవ్‌ చేసుకుంటారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. 2022 ఫిబ్రవరి నుంచి ప్రధాని పర్యటనలకు సీఎం దూరంగా ఉన్నారు. కేవలం ప్రోటోకాల్‌ కోసం ఎయిర్‌పోర్ట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను పంపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రోటోకాల్‌ పాటించడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐతే ప్రధానిని సీఎం ఆహ్వానించాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

Tomato: టమోటా పంట లూటీ..

దేశ వ్యాప్తంగా టమోటా ధరలు పెరిగిపోవడంతో దోపిడీ దొంగలు రూటు మార్చారు. విలువనై టమోటా పంటను లూటీ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన సోమశేఖర్ అనే రైతు పంటను దోపిడీ దొంగలు కొల్లగొట్టారు. హాసన్‌ జిల్లా హాలిబీడు సమీపంలోని గోని సోమనహళ్ళి అనే గ్రామానికి చెందిన సోమ శేఖర్‌ రైతు పొలంలో రవాణాకు సిద్ధంగా ఉన్న పంటను ఎత్తుకెళ్లారు. సుమారు 90 బాక్సుల టమోటాలు చోరీ అయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సోమశేఖర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ట్విట్టర్‌కు పోటీగా..మెటా థ్రెడ్స్ యాప్..

సోషల్ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్ తీసుకొచ్చింది.దిగ్గజ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా టెక్ట్స్ ఆధారిత థ్రెడ్స్ పేరుతో మరో యాప్ తో ముందుకు వచ్చింది.దీనిని iOS, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.  మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.మెటా సంస్థ ఈ థ్రెడ్స్ యాప్‌ను ట్విట్టర్‌ తరహా ఫీచర్లతో ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చింది. థ్రెడ్స్ ఒకరకంగా ట్విట్టర్ కు పోటీగా ఉంటనుంది. 

ప్లాస్టిక్‌ వేలిముద్రతో రేషన్‌ బియ్యం హాంఫట్‌

రేషన్‌ దొంగలు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్‌తో రేషన్‌ బియ్యాన్ని యథేచ్చగా దోచేస్తున్నారు. ఈ సారి రేషన్‌ ఆపరేటర్‌ వేలిముద్రకు బదులుగా ఏకంగా ప్లాస్టిక్‌ వేలిముద్రతో రేషన్‌ బియ్యాన్ని తెలివిగా దోచుకుంటున్నారు.ఈ ఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తుబాడులో జరిగింది. ఇలా ప్లాస్టిక్ వేలి ముద్రలు ఉపయోగించి రెండు వాహనాల్లో 170 బస్తాలు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.చాలా రోజులుగా ఇలా నకిలీ వేలి ముద్రతో రేషన్‌ బియ్యాన్ని దోచేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రెండు వాహనాలను సీజ్‌ చేశారు. 

MP: మూత్రవిసర్జన ఘటన.. గిరిజనుడి కాళ్లు కడిగిన ముఖ్యమంత్రి

మూత్ర విసర్జన జరిగిన గిరిజన కార్మికుడి కాళ్లు కడిగారు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. జరిగిన ఘటన బాధాకరమని తాను క్షమాపనకోరుతున్నట్లు చెప్పారు. తన అధికార నివాసంతో దశమేశ్ రావత్ ను కలిశారు చౌహాన్. క్షమాపణలు చెప్పి కాళ్లు కడిగారు. శాలువా కప్పి గౌరవించారు. ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి దశమేష్ రావత్ అనే గిరిజన కార్మికుడిపై మూత్రవిసర్జన చేశాడు.సదరు ఘటనపై చౌహాన్ సీరియస్ అయ్యారు. ఆపై బుధవారం నిందితుడి ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. 

 




Modi tour: వరంగల్‌ టూర్‌ను సక్సెస్‌ చేసేందుకు బీజేపీ కసరత్తు..

ప్రధాని మోదీ వరంగల్‌ టూర్‌ను సక్సెస్‌ చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు బీజేపీ హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్‌ సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.డివిజన్ అధ్యక్షులకు కిషన్‌ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. సభకు కనీసం 2లక్షల మందిని తరలించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. 

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సూచించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ 2013లో అదే రాష్ట్ర హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయనను మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలీజియం సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. అయితే, మణిపూర్‌ హైకోర్టు సీజేగా నియమించాలన్న సిఫారసును మార్చి, ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 

సూర్య ప్రకాష్‌ రెడ్డి: చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం

చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఇరిగేషన్ పై కనీస అవగాహన లేదన్నారు. రాయలసీమలో కరువు నివారణ కోసం చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టారని.. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందన్నారు. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలో అభివృద్ధే లేదన్నారు. 

Shadnagar: విద్యార్ధినిని బైక్‌తో ఢీకొట్టిన యువకులు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో.. విద్యార్ధిని బైక్‌తో ఢీకొట్టారు యువకులు. బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుల కోసం గాలిస్తున్నారు.

AP: మహిళలను అవమానించిన పోలీసులు

అమరావతిలో తెలుగు మహిళల పట్ల ఎస్‌బీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళా కమిషన్‌ దగ్గర నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించారు. ఎంత డబ్బులిస్తే ఇక్కడకు వచ్చారని మహిళలను ఎస్‌బీ పోలీసులు అవమానించారు. దీంతో మీరు ఎవరంటూ SB పోలీసుల్ని మహిళలు ప్రశ్నించారు.  తాము SB పోలీసులమంటూ సమాధానం ఇవ్వగా.. ఆగ్రహంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళల్ని అవమానిస్తారా అంటూ ఎదురు దాడికి దిగారు. చెప్పులు తీసుకుని పోలీసుల వెంటపడ్డారు.  

పట్టుబడ్డ దొంగ నోట్ల ముఠా..

కర్నూలులో నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను చలామణికి ప్రయత్నించిన 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. కర్నూలుకు చెందిన నలుగురు యువకులతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా క్యాతూరుకు చెందిన మరో నలుగురు నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నించారు. రూ. 90 లక్షల నకిలీ నోట్లకు రూ.30 లక్షల ఒరిజినల్‌ నోట్లు ఇచ్చేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం నకిలీ నోట్ల బ్యాగులు మార్చుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి కోటి 30 లక్షల నకిలీ 500 నోట్లను, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

బీజేపీ అసంతృప్తులపై కాంగ్రెస్ కన్ను..

బీజేపీలో అసంతృప్తులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఇప్పటికే హస్తం పార్టీ టచ్‌లోకి పలువురు కమలం నేతలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి చెందిన ఒక మహిళా ముఖ్యనేతతో కర్ణాటక మంత్రి బోసురాజు సంప్రదింపులు జరుపుతున్నారట. ఇప్పటికే సదరు మహిళా నేత ముఖ్య అనుచరులు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. అటు కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Karimnagr: రైతుల్ని భయపెడుతున్న హైనాలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వాసులను హైనాలు భయపెడుతున్నాయి. రాత్రిళ్లు పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి హైనా వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు కొండ ప్రాంతాలకే పరిమితమైన హైనాలు ఇప్పుడు ఊళ్లపై పడుతున్నాయి. తిమ్మాపూర్ గ్రామంలో ఓ కుక్కపై హైనా దాడి చేసింది. అది బతికుండగానే పీక్కు తినడం చూసి భయబ్రాంతులకు గురయ్యారు. కుక్కపై హైనా దాడి చేసిన దృశ్యాలను కొందరు యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. గతంలో గొర్రెల మందపై దాడి చేసి చంపేసింది. మళ్లీ ఇప్పుడు గ్రామంలో కుక్కపై దాడి చేయడంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. హైనాను బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఈటల రాజేందర్...హామీల వర్షం

బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. బీజేపీ ప్రభుత్వం రాగానే పేద భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. పేదల పిల్లలకు నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించే జిమ్మేదార్ బీజేపీదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ అంతరంగం,సమస్యలు తెలిసినవాణ్ని అని తెలిపారు. కేసీఆర్‌ బలం, బలహీనతలు తెలుసన్నారు. కిషన్‌రెడ్డి అనుభవమున్న నాయకుడని ఆయనతో కలిసి పనిచేస్తామని అన్నారు. 

ఏపీ తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల మార్పు

సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా కమలదళం వ్యూహాలకు పదును పెడుతోంది.పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏపీ, తెలంగాణతో పాటు పంజాబ్‌, జార్ఖండ్‌ అధ్యక్షులను మార్చింది. ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్‌ను తప్పించింది.వారి స్థానంలో పురందేశ్వరి, కిషన్‌రెడ్డిని అధ్యక్షులుగా నియమించింది. ఇవాళ బీజేపీ పెద్దలతో పురందేశ్వరి, కిషన్‌రెడ్డి భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేంద్రంలో హ్యాట్రిక్ విక్టరీ లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది.

Foot ball: శాఫ్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేత భారత్

శాఫ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.బెంగళూరు వేదికగా ఫైనల్ పోరులో కువైట్‌ను మట్టి కరిపించి మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరికి భారత్‌ గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ అద్భుతంగా బంతిని అడ్డుకుని జట్టును విజేతగా నిలిపాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత ఫుట్‌బాల్ జట్టు ఈ గెలుపుతో తొమ్మిదోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లో శాఫ్‌ ఛాంపియన్‌గా భారత్ నిలిచింది .

Cricket: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ అజిత్ అగార్కర్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. అగార్కర్‌ను సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా బీసీసీఐ నియమించింది. సీనియర్ మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ స్థానానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులను ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఇంటర్వూ చేసింది. కమిటీ సభ్యులు అజిత్‌ అగార్కర్‌ను సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు. శివసుందర్‌ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌ శరత్‌ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారని బీసీసీఐ తెలిపింది.


కిషన్‌ రెడ్డికి అర్వింద్‌ శుభాకాంక్షలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డిని నియమించడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పందించారు.. కిషన్‌ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కిషన్‌ రెడ్డి నాయకత్వంలో 2023 ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.. తన నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని గెలిపించుకుంటానని చెప్పారు. సంజయ్‌కి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదన్నారు.. ఇద్దరం సోదరులుగా కలిసి పనిచేశామని ధర్మపురి అర్వింద్‌ చెప్పారు.

బండి సంజయ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

బండి సంజయ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. పార్టీ అంచనాలకు అనుగుణంగా తన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉండగా సహకరించిన బీజేపీ అగ్ర నేతలు.. తెలంగాణ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంగ్రామయాత్రలో సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు బండి సంజయ్‌. తనకు తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మన్నించాలని కోరారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించిన వారికి ధన్యవాదాలని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అరెస్టులకు, దాడులకు భయపడకుండా.. పోరాడిన వారికి హ్యాట్సాఫ్‌ అంటూ బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

కోడికత్తి కేసు... బెయిల్‌ తమ పరిధిలో లేదన్న కోర్టు

కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించారు. బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఎన్‌ఐఏ కోర్టు సూచించింది. గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్‌ తరఫు న్యాయవాదికి ఆదేశాలు ఇచ్చింది. అనంతరం విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది. 

AP: అమ్మ ఒడి కోసం తల్లుల ఎదురుచూపులు

గత నెల 28న సీఎం జగన్ ఏపీలో అమ్మఒడి బటన్ నొక్కారు. కానీ ఇప్పటి వరకు సొమ్ములు తల్లుల అకౌంట్లలో పడలేదు. నిన్నటికి కొంత మంది అకౌంట్లలో పడినా... ఇంకా చాలా మందికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లబ్దిదారులు తమకు ఇంకా అమ్మఒడి పడలేదంటూ.. వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తైన వారికి ఈ నెల 7న పడతాయంటూ సమాధానం వస్తోంది. నిధుల సమస్య కారణంగానే అమ్మ ఒడి పడటం లేదంటున్నారు. నిధులు సర్ధుబాటు కాకపోతే.. మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.  

మాదక ద్రవ్యాల ముఠాపై ఉక్కుపాదం

మాదక ద్రవ్యాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని రాచకొండ సీపీ చౌహాన్‌ తెలిపారు. ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను పంతంగి టోల్‌ప్లాజా వద్ద అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. 40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి, రెండు కార్లు సీజ్‌ చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని సీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెడికల్‌ ఎమర్జెన్సీ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ చౌహాన్‌ వెల్లడించారు. 

Maharastra: ఘోర రోడ్డుప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో10 మంది మృతి చెందగా, 28 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా తేల్చారు. మహారాష్ట్ర లోని ధూలే జిల్లా సిర్పూర్‌లో ఘటన జరిగింది.

విద్యుత్ ఉద్యోగులను కొట్టిన మజ్లిస్ నేత

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో విద్యుత్‌ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. కార్వాన్‌ నియోజకవర్గం మహబూబ్‌ కాలనీలో కరెంట్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు.. ఆ ప్రాంతంలో తనిఖీ చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులపై MIM నేత మహ్మద్‌ ఆజం, అతని కుటుంబ సభ్యులు దారుణంగా దాడి చేశారు. ఈ దాడి విద్యుత్‌ శాఖలో చర్చనీయాంశమైంది. కరెంట్‌ చౌర్యాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన విద్యుత్‌ ఉద్యోగులపై దాడికి దిగడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Sharukh Khan Accident: షూటింగ్ లో ప్రమాదానికి గురైన బాద్షా, స్వల్ప గాయాలు

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడు. లాస్ ఏంజెలెస్ లోని జరుగుతోన్న షూటింగ్ లో బాద్షా ప్రమాదవశాత్తూ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలపాలైన షారుఖ్ ను  చిత్ర బృందం హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ముక్కుకు సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. చిన్నపాటి సర్జినే కావడంతో బాద్షా ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎయిర్ పోర్ట్ దగ్గర షారుఖ్ ముక్కుకు బ్యాండ్ ఎయిడ్ వేసుకుని కనిపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది బాద్షా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


MODI: తెలంగాణలో మోది పర్యటన..షెడ్యూల్ ఫిక్స్..

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 8న ఉదయం 9గం.లకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని అక్కడి నుంచి వరంగల్‌ బయల్దేరనున్నారు. ఉదయం 10.35 నిలకు ఆయన వరంగల్‌ చేరుకోనున్నారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30కి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరంగల్‌ నుంచి బయల్దేరి హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ రాజస్థాన్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. 

Accident: మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌లోని బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఓవర్ స్పీడ్‌తో ఓ కారు మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పోలీసులు మారణాయుధాలు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయినవారిని అనురాధ, మమతగా గుర్తించారు పోలీసులు. 

 

DELHI LIQUOR SCAM: మనీష్ సిసోడియాకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మళ్లీ నిరాశ తప్పలేదు. బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది. సిసోడియాతో పాటు విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్, బినోయ్ బాబుల బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 9న మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన భార్య అస్వస్థతకు గురి కావడంతో పలుమార్లు తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా హైకోర్టులో అప్పీల్ చేశారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టంచేసింది.

KTR: చంద్రబాబు విజన్‌పై కేటీఆర్ ప్రశంసలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు విజన్‌పై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఎఫ్‌టీటీసీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రబాబు హయాంలో పట్టణాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుకొని.. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పత్తి రంగంలో చైనాతో పోటీ పడాలన్న మంత్రి కేటీఆర్.. ప్రతి ఒక్కరు గ్లోబల్‌ థింకింగ్‌, స్మార్ట్‌గా పనిచేయడం అలవర్చుకోవాలని సూచించారు.  

AP: ఉద్రిక్తంగా మారిన సర్పంచ్‌ల ముట్టడి కార్యక్రమం

ఏపీలో సర్పంచ్‌ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సర్పంచ్‌ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్‌ కమిషనరేట్‌ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు.15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చి 40 రోజులు అవుతున్నా నేటికి నిధులు విడుదల చేయకపోవడంపై భగ్గుమన్నారు. నెలల తరబడి గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 691 కోట్లను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. తమ గౌరవ వేతనం 3వేల నుంచి 15వరకు చెల్లించాలన్నారు. 

Bhuvanagiri: ప్రోటోకాల్‌ రగడ..

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రోటోకాల్‌ రగడ నెలకొంది.మంత్రి పర్యటన నేపధ్యంలో తనకు సమాచారం ఇవ్వలేదని జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. జిల్లా అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి జగదీష్‌ రెడ్డి పోడుభూముల పట్టాల పంపిణీ చేశారు, అయితే తనకు సమాచారం లేదని అన్నారు. గతంలో కూడా అధికారులు ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు.

HYD: స్పా సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు

హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్పా సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆయుష్ బ్యూటీస్ స్పా, రుయాన్ స్పా సెంటర్లపై దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో 30 మందిని అదుపులో తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

NCP: శరద్ పవార్‌కు సోనియా ఫోన్‌

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు సోనియా గాంధీ ఫోన్‌ చేశారు. ఎన్సీపీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్‌ పవార్‌తో సోనియా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ తోనే ఉంటుందని సోనియా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మరోవైపు పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటు వ్యవహారంపై ఎన్సీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.  

కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

సీఎం కేసీఆర్ తో సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ భేటీ కానున్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనున్నారు. పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో కేసీఆర్, అఖిలేష్ యాదవ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వీరిద్దరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అఖిలేష్‌ యాదవ్‌కు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు.

KTR: దేశానికి లైఫ్ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌

మంత్రి కేటీఆర్, నాస్కామ్‌ లెక్కల ప్రకారం దేశంలో 1/3 వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే ఉన్నాయన్నారు.దేశానికి లైఫ్ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ ఉందని స్పష్టం చేశారు.భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జోనోమ్ వ్యాలీ హెడ్‌క్వార్టర్స్‌, ప్రపంచంలోనే హైదరాబాద్‌ అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌ అన్నారు.సెమీ కండక్టర్ల రంగంలో హైదరాబాద్‌ అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు.కోకాపేటలోని వన్ గోల్డెన్‌మైల్‌లో మైక్రోచిప్‌ టెక్నాలజీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్‌ డిజైన్, డెవలప్‌మెంట్‌ ఫెసిలిటీని ప్రారంభించారు.

Guntur: కలకలం రేపుతున్న క్షుద్రపూజలు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్షుద్రపూజల కలకలం రేగింది. నల్లకోడిని చంపి నడ్డిరోడు మీద పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. సంఘటనా స్థలంలో కత్తి, నిమ్మకాయలు, ముగ్గుపొడి ఉండటంతో దాచేపల్లి, గుత్తికొండ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దాచేపల్లి బైపాస్‌ రోడ్డులో మోడల్‌ స్కూల్‌ ఉండటంతో పిల్లల్ని పాఠశాలకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.