చిట్టి న్యూస్

Cash Seized | హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు భారీగా నగదు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీచేశారు. దీంతో ఓ లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్‌ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నగదును హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

 ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.. హైవేలు, ఇతర రోడ్లు అనే తేడా లేకుండా చెక్‌పోస్టులు పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఇలా ఇప్పటికే కోట్లాది రూపాయలు పోలీసుల తనిఖీల్లో సీజ్‌ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్‌ చేశారు. ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు..

PM Modi: వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. దీనిలో భాగంగా బుధ‌వారం ఉద‌యం క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వ‌రస్వామి ఆల‌యంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేకంగా నిలిచే కోడె మొక్కుల‌ను ప్ర‌ధాని తీర్చుకున్నారు. అనంత‌రం ప్ర‌ధానికి వేద పండితులు ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేశారు. అంత‌కుముందు ఆయ‌న‌ను ఆల‌య అధికారులు, అర్చ‌కులు ప్ర‌త్యేక మెమొంటో, శాలువాతో స‌త్క‌రించ‌డం జరిగింది. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా మోదీ వేముల‌వాడ‌, వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌ల‌లో పాల్గొని బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌సంగించ‌నున్నారు. మొద‌ట వేముల‌వాడ స‌భ‌లో పాల్గొని అక్క‌డి నుంచి వ‌రంగల్ వెళ్ల‌నున్నారు. అక్క‌డి బీజేపీ ఎం‌పీ అభ్య‌ర్థి ఆరూరి ర‌మేష్‌కు మ‌ద్ద‌తుగా బ‌హిరంగ స‌భ‌లో మోదీ మాట్లాడుతారు.

Zelenskyy: రష్యా వాంటెడ్‌ లిస్ట్‌లో జెలెన్‌స్కీ

తమ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్‌ మంగళవారం ప్రకటించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కైరోలో బుడనోవ్‌, ఎస్‌బీయూ చీఫ్‌ వాసిల్‌ మాల్యుక్‌ తదితరులు ఈ హిట్‌ లిస్టులో ఉన్నారని తెలిపింది.  ఈ కుట్రకు సంబంధించి దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్‌ గార్డ్‌ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారిది అనుమానాస్పద పాత్ర ఉన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఆ కర్నల్స్‌ను విధుల్లోకి తీసుకున్నట్లు ఓ ప్రకటన వివరించింది. గతంలో కూడా జెలెన్‌స్కీ అంతానికి రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. దేశాధినేతను పట్టుకుని చంపించాలనుకుందని, దానిలో భాగంగా, జెలెన్‌స్కీ భద్రతకు దగ్గరగా ఉన్న మిలిటరీలోని బలమైన నేరస్థులను కనుగొనడం రష్యా గూఢచారి సంస్థ ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ లక్ష్యంగా పెట్టుకుందని ఉక్రెయిన్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. యుద్ధం ప్రారంభయ్యాక తనపై కనీసం ఐదుసార్లు హత్యా యత్నాలు జరిగాయంటూ జెలెన్‌స్కీ గతంలో వెల్లడించారు.

JAGAN: జగన్‌ నిర్వేదం.. నిస్సహాయత

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లుతోందని ముఖ్యమంత్రి జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె, మచిలీపట్నంలో సిద్దం సభలో పాల్గొన్న జగన్ సాధ్యం కానీ హామీలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చిందన్నారు. తాము ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామన్నారు. రైతుభరోసా కేంద్రాలతో అన్నదాతకు అండగా నిలిచామని తెలిపారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఏనాడు పేదల సమస్యలు పట్టించుకోలేదంటూనే..ఈ ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. 

Ghatkesar: ఆస్తి కోసం భర్తను గొలుసులతో బంధించి..

ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆయనకు విముక్తి లభించింది. ఇందుకు సంబంధించి ఘట్‌కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన సెంట్రింగ్‌ గుత్తేదారు పత్తి నరసింహ (50), భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహ తన పేరు మీద ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భారతమ్మ తెలుసుకుంది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది. ఇంటి‌ స్థలాన్ని తన‌ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని చిత్రహింసలు పెడుతున్నది. అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికున్న పోలీసులు నరసింహను విడిపించి స్టేషన్‌కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేశ్, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.


MEA advisory: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన

 ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ఆ రెండు దేశాలకు ప్రయాణాలు చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, భారత ఎంబసీతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నది. ఈ రెండు దేశాల గగనతలంలో వాణిజ్య విమానాలకు అనుమతించిన నేపథ్యంలో ఎంఈఏ ఈ సూచన చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. కాగా, కమర్షియల్‌ విమానాల రాకపోకల కోసం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాలు ఇటీవల తమ గగనతలాలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఉద్రిక్తతలు కొనసాగితే, గగనతలం తెరిచే ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గత నెల ఇజ్రాయెల్‌పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వాటన్నింటినీ నిరోధించిన ఇజ్రాయెల్‌.. ఎదురుదాడికి సిద్ధమైంది. దాంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్‌ దళాలు, హెజ్‌బొల్లా మధ్య సరిహద్దులో రోజూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆ రెండు దేశాల్లో ఉన్న/వెళ్లాలనుకునే వారి కోసం గతంలోనే ఎంఈఏ అడ్వైజరీ జారీ చేసింది. తాజాగా వాటికి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చింది.

TG: సూర్యాపేటలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలుప్రాంతాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెం, మంచిర్యాల జిల్లా హాజిపూర్‌, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.5 డిగ్రీలు రికార్డైనట్టు..... హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబాబాద్‌, నారాయణపేట్‌, జయశంకర్‌, వరంగల్‌, ములుగు, జనగామ వనపర్తి, గద్వాల్‌, నాగర్‌కర్నూల్‌, హనుమకొండ, కొత్తగూడెం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి,నిజామాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. కుమరంభీం...., సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి ఆదిలాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 45, హైదరాబాద్‌లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.

usa floods : అమెరికా హూస్టన్ ప్రాంతంలో    వరదలు

అమెరికా హూస్టన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో శాన్ జసింటో నది ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఉత్తర హారిస్ కౌంటీ నది పరిసరాల్లో ఉన్నవారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయిస్తున్నారు. రహదారులు నీటితో నిండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని...పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయని స్థానికులు తెలిపారు. . అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా- అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచింది. మోకాలి లోతుకు పైగా వర్షపు నీరు నిలిచిపోయింది. సబ్‌బేలన్నీ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించాయి.


Germany Floods:  జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు..

జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం  భారీగా కూరవడంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, రెడ్‌క్రాస్ రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తున్నారు.బిసింగర్ మార్కెట్ చౌరస్తాలో మీటరు ఎత్తులో నీరు నిలిచిపోయింది. ఇక గుటెన్‌బర్గ్ కిండర్ గార్డెన్ ఎదుట ఉన్న నిర్మాణ స్థలం కొట్టుకుపోయింది. ఇక పలు ప్రాంతాల్లో అయితే రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాహనాలన్నీ ఒక దగ్గరు పోగుపడ్డాయి. వరదలు కారణంగా పలు రోడ్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే బాడెన్-వుర్టెంబర్గ్‌లో ప్రజలు కార్లలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం జరిగింది అన్న విషయం ఇంకా తెలియలేదు. నీళ్లు తగ్గితేనే గానీ.. అధికారులు అంచనా వేయలేరు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువులు అందక.. చాలా చోట్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


SHARMILA: జగన్‌కు షర్మిల లేఖాస్త్రం

ఐదేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ కు బహిరంగ లేఖ రాసిన షర్మిల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారిమళ్లింపు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం, ఎందుకు నిలిచిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారని స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని ఇది వివక్ష కాదా? అని లేఖలో ప్రస్తావించారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎంఎల్ సీని ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న " నవ సందేహాలకు " సమాధానం చెప్పాలని లేఖలో షర్మిల డిమాండ్ చేశారు.

Bomb Threat : ఢిల్లీలో పాఠశాలకు బాంబు బెదిరింపు..

ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 12 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. బాంబు బెదిరింపులు ఎదుర్కొన్న స్కూళ్లలో మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురి లోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి. స్కూళ్లను ఖాళీ చేయించి తనిఖీలు చేసిన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు విదేశాల నుంచి వీపీఎన్ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్వేషణ కొనసాగుతోంది. అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదు.కాగా, దేశంలో ఎన్నికల వేళ రెండు రోజుల క్రితం భారత్‌లోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఈ-మెయిల్స్ కలకలం రేపాయి. ఇప్పుడు స్కూళ్లకు కూడా అదే రీతిలో బెదిరింపులు రావడం గమనార్హం.

దాదాపు 2 నెలల క్రితం ఆర్‌కే పురంలోని డీపీఎస్‌లో కూడా ఇలాంటి బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్‌లో బెదిరింపు పంపడంతో వెంటనే పాఠశాలను ఖాళీ చేయించారు. 2023లో సెప్టెంబర్ లో లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్‌లో బాంబు బెదిరింపు బూటకమని తేలింది.

Lok Sabha elections 2024: ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌‌సభ స్థానాలకు మే 25 న పోలింగ్‌ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు. బీహార్‌‌లో 8, హర్యానాలో 10, జార్ఖండ్‌ లో 4, ఒడిశాలో 6, ఉత్తర్‌ ప్రదేశ్‌ లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. సోమవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

 ఇక, ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు కొనసాగనున్నాయి. జూన్ 1వ తేదీన ఈ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది.

Indonesia:  ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో శనివారం రాత్రి 11గంటల 29 నిమిషాలకు  భూకంపం సంభవించింది. గౌత్ రెజెన్సీకి నైరుతి వైపున 151 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు దేశ మెటియోరాలజీ శాఖ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది. రాజధాని జకార్తాతో పాటు బాంటెన్ ప్రావిన్స్, సెంట్రల్ జావా ప్రావిన్స్, యోగ్యకార్తా, తూర్పు జావా ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు కనిపించాయి. అయితే, భూకంపంతో సునామీ ప్రమాదం లేకపోవడంతో వాతావరణ ఏజెన్సీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపాలు తరచూ సంభవించే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉంది. ఫలితంగా అక్కడ నిత్యం భూకంప ప్రమాదం పొంచి ఉంటుంది.

TDP: కురవల మద్దతు టీడీపీకే

కురువ కులస్తులకు రాజకీయంగా పదవులు కేటాయించిన తెలుగు దేశం పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ కురువ సంఘం నాయకులు ప్రకటించారు. కర్నూలులో కురువ సంఘం నేతలతో ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు సమావేశం అయ్యారు.తమ కులానికి ఇచ్చిన హామీ మేరకు 2ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలను తెదేపా అధినేత చంద్రబాబు కేటాయించారన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.రాష్ట్రంలోని బీసీలందరు ఏకమై వైకాపాను గద్దె దించాలని బోరంపల్లి ఆంజినేయులు పిలుపునిచ్చారు.

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌‌లో తెలుగు విద్యార్థి మృతి

వైద్య విద్య కోసం కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కుమారుడైన దాసరి చందు ఎంబీబీఎస్‌ చదివేందుకు ఏడాది కిందట కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లాడు. పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులు ఆదివారం విద్యార్థులను సమీపంలోని మంచు జలపాతం సందర్శనకు తీసుకువెళ్లారు. ఏపీకి చెందిన అయిదుగురు విద్యార్థులు జలపాతంలో దిగారు. వారిలో చందు మంచులో కూరుకుపోయి మృతి చెందాడని సోమవారం మధ్యాహ్నం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు.

Haryana: శ్మశానం గోడ కూలి నలుగురి మృతి..

ప్రమాదాలు ఎప్పుడు.. ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించరు. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు షాక్‌కు గురి చేస్తుంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌లో శనివారం శ్మశానవాటికకు చెందిన గోడ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గోడకు ఆనుకుని కొంత మంది కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో సడన్‌గా ప్రహారీ గోడ కూలి.. అక్కడికక్కడే చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

SSC Results: రేపే ఏపీ పదోతరగతి ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ లో పదో పరగతి పరీక్షల ఫలితాలు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి.ఈనెల 22న ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏపీలో పది పరీక్షలకు దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

DD News: రంగు మారిన డీడీ న్యూస్‌ చిహ్నం

దేశంలో టీవీ చానెల్స్ మొదలైనప్పటి నుండి ఉన్న ఎంతో గొప్ప చరిత్ర గల డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయింది.భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్‌ ఛానల్‌ దూరదర్శన్‌ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించినాట్లు కనపడుతోంది. ప్రపంచ వార్తలను ప్రసారం చేసే జాతీయ దూరదర్శన్‌ న్యూస్‌ ఛానల్‌ లోగో రంగును తాజాగా కాషాయ రంగులోకి మర్చి తన విధేయతను తెలిపింది. ఇక ఈ మార్పులో కేవలం రంగు మాత్రమే కాకుండా లోగోతో పాటు న్యూస్‌ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం వల్ల కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని గతంలో దూరదర్శన్‌ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ విమర్శించారు. దూరదర్శన్‌ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు.

MUSK: ఈ నెలఖారులో భారత్‌లో మస్క్‌ పర్యటన

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్‌ మస్క్‌.... భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని మస్క్‌.. ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే పర్యటన తేదీని మస్క్‌ వెల్లడించలేదు. ఈ నెలాఖరులో టెస్లా సీఈవో భారత్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్‌ తెలిపింది. దేశంలో టెస్లా విద్యుత్‌కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మస్క్‌.. పెట్టుబడుల ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది జూన్‌లో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీతో భేటీ అయిన మస్క్‌.. వీలైనంత త్వరలో టెస్లా పరిశ్రమను భారత్‌లో నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యుత్‌వాహనాల దిగుమతిపై పన్నులను 85 శాతం తగ్గించే కొత్త ఈవీ పాలసీని భారత ప్రభుత్వం ప్రకటించిన నెలలోనే మస్క్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ పాలసీ ప్రకారం.. ప్యాసెంజర్‌ కార్లను తయారు చేసే ఈవీ సంస్థలు.. కనిష్టంగా 29 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలపై 85 శాతం తగ్గించిన దిగుమతి సుంకంతో.. పరిమిత సంఖ్యలో ఐదేళ్ల పాటు యూనిట్లను దిగుమతి చేసుకోవచ్చు.MUSK: ఈ నెలఖారులో భారత్‌లో మస్క్‌ పర్యటన

Maharashtra: మహారాష్ట్రలో కీలక ప్రకటన చేసిన రాజ్ ఠాక్రే

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి షరతుల్లేని మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. గత నెలలో రాజ్ ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.

Chandrayaan-4: అభివృద్ధి దశలో చంద్రయాన్‌ 4 -ఇస్రో ఛైర్మన్‌

చంద్రునిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఉద్దేశించిన 'చంద్రయాన్-4' అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మంగళవారం నాడు పంజాబ్ రాష్ట్రంలో లుధియానాలోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. చంద్రుడిపై తదుపరి మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నారు. చంద్రయాన్-4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి, నీళ్ల నమూనాలను భూమి మీదకు తీసుకు రావాలని ఇస్రో భావిస్తోంది. ఇది దాదాపు 100 రోజులు పని చేసేలా... చంద్రుడిపై కిలో మీటర్ మేర తిరిగేలా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు రెండు వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

PK: జగన్‌ మళ్లీ గెలవడం అసంభవం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తేల్చి చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్‌లా జగన్‌ పాలన కొనసాగిస్తున్నారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఎడిటర్లతో జరిగిన ముఖాముఖిలో ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌లా తాయిలాలివ్వడం తప్ప.. ప్రజల ఆకాంక్షలను జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. నగదు బదిలీ మాత్రమే చేశారని.. ఉద్యోగాల కల్పనపైన, అభివృద్ధిపైన ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో ఓడిపోయిందని...జగన్‌ విషయంలోనూ అదే జరగనుందని అభిప్రాయపడ్డారు.

MK Stalin : కోయంబత్తూరులో ఆధునిక క్రికెట్‌ స్టేడియం

కోయంబ‌త్తూరులో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయ‌డానికి కృషి చేస్తామ‌ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. సోష‌ల్ మీడియా వేదిక `ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌)` వేదిక‌గా రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ విష‌య‌మై సీఎం స్టాలిన్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. క్రీడ‌లు, క్రికెట్ ఔత్సాహికుడిగా డీఎంకే ఎన్నిక‌ల మేనిఫెస్టోలో మ‌రో హామీ జ‌త ప‌రుస్తున్న‌ట్లు స్టాలిన్ తెలిపారు. కోయంబ‌త్తూరులో అత్యాధునిక స్టేడియం ఏర్పాటు కృషి చేస్తామ‌న్నారు.

 మంత్రి రాజా పేర్కొన్నట్లుగా.. ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు కృషిచేస్తామన్నారు. తమ ప్రభుత్వం, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్రంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు, క్రీడారంగంలో మౌలికవసతుల్ని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియం ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం చేపట్టేందుకు కృషిచేస్తామని సీఎం హామీ ఇవ్వడం గమనార్హం.

REVANTH: ఏది పడితే అది మాట్లాడితే జైల్లో వేస్తాం

కేసీఆర్‌ పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని... పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని కేసీఆర్‌ అనుకుంటున్నారని... అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతామని. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టిస్తామన్నారు. ఆయన కాలు విరిగింది. కూతురు జైలుకెళ్లారని జాలి చూపించాం. దిల్లీ నుంచి తెలంగాణకు నిధులు కావాలంటే.. 14 మంది ఎంపీలను గెలిపించండని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. జూన్‌ 9న ఢిల్లీలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని హస్తం శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌ తుక్కుగూడలో నిర్వహించిన ‘ కాంగ్రెస్‌ జనజాతర’ సభలో రేవంత్‌ కేసీఆర్‌, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. కేంద్రంలో బీజేపీని అలాగే ఓడించాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని కోరారు. కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. గుజరాత్‌ మోడల్‌పై ‘వైబ్రెంట్‌ తెలంగాణ’ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. ఈ క్రమంలో 750 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదన్నారు.

The Guardian: పాక్‌ ఉగ్రవాదులు, ఖలిస్థానీల హత్యకు భారత్‌ ఆదేశాలు.

విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్‌ పత్రిక ది గార్డియన్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకున్నదని పేర్కొన్నది. కెనడాలో సిక్కు వేర్పాటువాదుల హత్యలపై ఆ దేశ ప్రధానితో పాటు అమెరికాలో కూడా భారత్‌పై బహిరంగంగానే విమర్శలు వచ్చాయని పేర్కొన్నది. 2020 నుంచి పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని వివరించింది. కాగా, దిగార్డియన్‌ కథనాన్ని భారత్‌ కొట్టివేసింది. ఇవి నిరాధార ఆరోపణలని పేర్కొన్నది.

Iran: ఇరాన్‌లో ఎదురుకాల్పులు.

 ఇరాన్‌లో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. ఇరాన్ మిలిటెంట్లు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య గురువారం పెద్దఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగిన ఈ కాల్పుల్లో 10 మంది భ‌ద్ర‌తా ద‌ళాల స‌భ్యులు, 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. సిస్తాన్, బ‌లూచిస్థాన్, ర‌స్కా, స‌ర్బ‌జ్, చాబ‌హ‌ర్‌లో ముష్క‌రులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. పౌరుల‌ను బందీలుగా చేసుకుని కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపి పౌరుల‌ను కాపాడారు. కాల్పుల‌కు పాల్ప‌డింది జైష్ అల్ అదిల్ ఉగ్ర ముఠా అని స‌మాచారం.

AP: యథేచ్ఛగా బహుమతులు పంపిణీ చేస్తున్న వైసీపీ

వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలోకి తొక్కుతున్నారు. అనంతపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బహుమతుల సంచులను ఆటోలో స్థానిక కార్యకర్తల, నాయకుల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. బహిరంగంగానే బహుమతుల సంచులు తరలిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు, పోలీసులు గాని అటువైపు చూసిన పాపాన పోలేదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. బహుమతుల సంచులు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి తరలించే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Fire Accident: ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం

గుజరాత్‌లోని ద్వారకలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఏడు నెలల పాప, భార్యాభర్తలు, అమ్మమ్మ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు రావడంతో ఇంట్లో ఉన్నవారు ఊపిరాడక మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను పవన్ కమలేష్ ఉపాధ్యాయ్ (30 ఏళ్లు), భావన ఉపాధ్యాయ్ (27 ఏళ్లు), ధ్యాన ఉపాధ్యాయ్ (7 నెలల బాలిక), పవన్ తల్లి భామినీబెన్ ఉపాధ్యాయ్‌గా గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

AP: సీఎం జగన్ సిద్ధం బస్సుపైకి చెప్పు

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సు వైపు గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడం కలకలం రేపింది. బస్టాండు సమీపంలో బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో..నిరసన సెగ తగిలింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా....... తుగ్గలి నుంచి అనంతపురం జిల్లాకు వెళుతుండగా జొన్నగిరి వద్ద మహిళలు...... సీఎం బస్సును అడ్డుకున్నారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని....... పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జొన్నగిరి చెరువును హంద్రీ జలాలతో నింపుతామని చెప్పి..... నింపలేదన్నారు. మహిళలు బిందెలు తీసుకొని రోడ్డు మీదకి వస్తుండగా.... పోలీసులు అడ్డుకున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారిస్తున్నా.... ప్రజలు వినకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ బస్సు దిగి వచ్చి... మహిళలతో మాట్లాడి వెళ్లిపోయారు.

CBN: జగన్‌ను ఇంటికి పంపడమే లక్ష్యం కావాలి

ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పర్యటించారు. తొలుత రాప్తాడులో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన జట్టు కట్టాయన్నారు.ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్‌ నిలువునా ముంచేశారని ఆరోపించారు. కేసులు, బెదిరింపులకు భయపడవద్దని సూచించిన ఆయన.. జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యతను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తర్వాత శింగనమల నియోజకవర్గంలోని.. బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్‌ ఐదేళ్లుగా ఎస్సీలను దగా చేశారని విమర్శించారు. 1997లో నాడు తాను తెచ్చిన ఎస్సీ వర్గీకరణను ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రొద్దుటూరులో వివేకా హత్యపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు..ఘాటుగా బదులిచ్చారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానంటూ జగన్‌ చెప్పిన మాటలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ని శాశ్వతంగా ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

TG: వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ

వైద్య ఆరోగ్య శాఖలో పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్న పోస్టుల భర్తీ కోసం... కసరత్తు చేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఇటీవల ఇన్ ఛార్జి DMEగా వాణిదేవి నియామకంపై స్పందించిన హైకోర్టు.... పూర్తిస్థాయి DMEని నియమించాలని ఆదేశించిన వేళ..త్వరలోనే DME సహా DPH, DCA, కమిషనర్, TVVP పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్య శాఖలోపలు కీలక పోస్టులను భర్తీ చేయకుండా ఇన్ ఛార్జీలతోనే నెట్టుకు వస్తోంది. DME కేటగిరిలో డాక్టర్ రమేష్ రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించగా.... పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 2023లో పూర్తిస్థాయి DMEపోస్టును ప్రభుత్వంఏర్పాటు చేసింది. ఆ స్థానాన్ని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఈ పోస్టు భర్తీ కోసం రేవంత్ సర్కార్ ఫిబ్రవరి 6న డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ-DPCని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సీనియారిటీ జాబితాను తయారు చేసినప్పటికీ.. ఎన్నికల కోడ్ కారణంగా నియామకాన్ని చేపట్టలేదు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వైద్యారోగ్య శాఖలో నియామకాలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 

NDA: పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం: వర్మ

పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం ఇన్ ఛార్జ్ వర్మ పునరుద్ఘాటించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి సుజయ కృష్ణ రంగారావుతో కలిసి పవన్ తో సమావేశమయ్యారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు జనసేనానికి వివరించారు. త్వరలో ప్రచారం ప్రారంభిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. శ్రీ దత్త పీఠాన్ని దర్శించుకున్న అనంతరం వర్మ ఇంటికి వెళ్లి.. తెలుగుదేశం నాయకులను కలుస్తానని పవన్ చెప్పారు. మూడు పార్టీలు సమన్వయంతో పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

HOLI: ఉత్సాహంగా హోలీ సంబరాలు

తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో యువతీ, యువకులు రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తూ హోలీ వేడుకలు సందడిగా సాగాయి.


హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్స్‌లు నిర్వహించారు. విద్యార్థులు, స్నేహితులంతా ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని H.M.D.A ప్లే గ్రౌండ్‌లో.... 'కంట్రీ క్లబ్‌ హోలీ' పేరుతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన 'కంట్రీ క్లబ్ హోలీ' సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు. తొలిసారి ఖమ్మంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా పాండిచ్చేరి నుంచి తెప్పించిన DJ , సంగీత శబ్ధాలకు యువత డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.


హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో గార్డెన్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ పా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాజస్థానీ, మార్వాడీ కుటుంబాలు పాల్గొని ఉత్సాహంగా, సందడిగా ఒకరికొకరు రంగులు పూసుకోని నృత్యాలు చేస్తూ... హొలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ మహిళ మృతి

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఇండియన్ అమ్మాయి చనిపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదం జరిగింది. అర్షియా జోషి (24) అనే భారతీయ యువతి మృతి చెందింది. ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా భారత్ కు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ తెలిపింది. మార్చి 21న పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు, ప్రొఫెషనల్ అర్షియా జోషి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలంటూ స్పందించింది.

ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా ఇండియాకు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులర్, పాస్పోర్ట్, వీసా (సీపీవీ) విభాగాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అర్షియా జోషి గత ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే సంక్షోభ పరిస్థితుల్లో విదేశాల్లో నివసిస్తున్న ప్రజలకు సహాయం చేసే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ టీమ్ ఎయిడ్ జోషి పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆమె కుటుంబానికి పంపడానికి సహాయం చేస్తోంది.

Rajasthan కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

 రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్‌ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఆదివారం ఉదయం మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 9 ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

కాగా, కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు

Notifaction: ఈఏపీసెట్‌, ఐసెట్‌ తేదీల్లో మార్పులు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా, మరికొన్నింటిని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (వెటర్నరీ మొదలైనవి) కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మే 13 నుంచి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పుచేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా.. మే 9, 10, 11 ఇంజనీరింగ్ తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించాల్సి ఉండగా, జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలని కోరింది.