- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు ఆదివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని పేర్కొన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు వీపు, నడుము, ఛాతీ, చేతులు, గడ్డం ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయని, తీవ్రమైన దురద ఏర్పడిందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఛాతీ, వీపు, పొట్ట, నడుము భాగాల్లో ఎర్రటి దట్టమైన దద్దుర్లు, పొక్కులు, గడ్డంపై ఎర్రటి దద్దుర్లు ఉన్నట్లు గమనించామని తెలిపారు. రెండు అరచేతుల్లో చీము పొక్కులు చితికిపోవడం వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల ఇబ్బంది పడుతున్నారని రాజమండ్రి జీజీహెచ్ చర్మ సంబంధ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత జైలు ఉన్నతాధికారులకు ఇటీవల నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు ఉన్న బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు.

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో వాయువ్య ప్రాంతంలో పడవ బోల్తా పడి 27 మంది మరణించారు. మరో 70 మందికి పైగా కనపడకుండా తప్పిపోయారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. మరోవైపు ప్రాణాలతో బయటపడిన వారి కోసం గజ ఈతగాళ్లు వెతుకులాట ప్రారంభించారు. పడవ ఈక్వేటూర్ ప్రావిన్స్‌లోని బండకా నగరంలో 100 మందికి పైగా ప్రయాణీకులను కాంగో నది వెంబడి బొలోంబా పట్టణానికి తరలిస్తుండగా బోల్తా పడిందని డిప్యూటీ ప్రావిన్షియల్ గవర్నర్ టేలర్ న్గాంజీ తెలిపారు.
ఇప్పటికే 27 మంది బాధితుల మృతదేహాలు నదీ జలాల నుంచి వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామని ఆయన చెప్పారు, ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో దేశంలోని సరస్సులు, నదుల్లో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అలాగే తరచుగా లిమిట్ కి మించి ప్రయాణికులు పడవలు ఎక్కడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలోని వాయువ్య ప్రాంతంలోని జనాభాలో అత్యధికులు మంచి రోడ్లు లేకపోవడం వల్ల తక్కువ ఖర్చుతో కూడుకున్నందున నదుల్లో పడవ ప్రయాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు. పడవ ప్రమాదాలను నివారించడానికి కాంగో ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాత్రి ప్రయాణాలను నిషేధించింది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడింది. నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన TRTని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 5వేల 89 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వరకు టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఆరు రోజులు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో ఎన్నికలున్నందున తర్జనభర్జనపడిన అధికారులు ఎట్టకేలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన YSR సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లు దర్శనమిచ్చాయి. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో మహిళలు మండిపడుతున్నారు. గూడూరు గ్రామంలో మరో ఇద్దరికి పురుగుల ఖర్జూరాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

అప్పుడప్పుడు పాలూ బాగుండటం లేదని తెలిపారు. వేరుసెనగ చిక్కీలూ ప్యాకెట్లలో సగమే ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై సీడీపీవో గ్లోరిని వివరణ కోరగా కేవలం ఒకరిద్దరికి ఇచ్చిన ఖర్జూరే పాడైనట్లు తెలిసిందని, వెంటనే వారికి కొత్తవి ఇచ్చామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌కు నంబరు కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి వద్ద ఇవాళ(శుక్రవారం) విచారణ జరగనుంది. కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, లోతైన దర్యాప్తు జరపాలని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఎన్‌ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ కేసులో లోకేశ్‌ను ఇప్పటివరకూ ముద్దాయిగా చేర్చలేదని C.I.D. తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసులో పేరు లేనందున ఆయనను అరెస్ట్ చేయబోమని న్యాయమూర్తికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో లోకేష్ పేరు చేర్చితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరిస్తామన్నారు. CID వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం అరెస్టు అంశం లేనందున లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈ నెల 4నే విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించిన న్యాయస్థానం.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్‌ను అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నందునే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందన్నారు. మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. ప్రజా జీవితంలో ఉన్నానని చట్టాన్ని గౌరవించే వ్యక్తినన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు.

అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయమే చంద్రబాబు పిటిషన్లు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. అంగళ్లు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సి ఉంటుందని... అసలు ఆ ఘటన జరగడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు తరపు లాయర్లు.. ఆయన విచారణకు సహకరిస్తారని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఆయన్ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. అనంతరం వాదనలు ప్రారంభం అవ్వగా.. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని.. ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్........ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అనంతరం కోర్టు చంద్రబాబుకు స్వల్ప ఊరట అందిస్తూ హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు వెలువరించింది.

తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. నవంబరు 2, 3న జరగాల్సిన గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత జనవరి 6, 7న గ్రూప్ టూ నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం... 5 లక్షల 51 వేల 901 మంది దరఖాస్తు చేశారు. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను.. ఇతర పోటీ, గురుకుల నియామక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని... నవంబరు 2, 3కి వాయిదా వేశారు. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున గ్రూప్ టూ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని... TSPSC సమావేశంలో నిర్ణయించారు. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉంటుంది కాబట్టి.. పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సీట్ల పంపకంపై స్పష్టత రాలేదని నారాయణ స్పష్టత ఇచ్చారు. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని ఇది కూడా 2 రోజుల్లో కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదన తమకు ఇంకా రాలేదని, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయని, ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తామని నారాయణ తెలిపారు. సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయని నారాయణ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని బీఆర్‌ఎస్ వాళ్లకు కావాల్సిన అధికారులను రెండు రోజుల ముందే బదిలీ చేసుకుంటున్నారన్నారు. అప్పటిదాకా పనిచేసిన అధికారులను అవమానపరుస్తూ బదిలీ చేస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అంతకుముందు సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ.... సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్‌లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది సిబ్బంది హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్, ఇండియన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్‌కు చెందిన సైనికులు మౌంట్ కున్ సమీపంలో సాధారణ శిక్షణా కార్యకలాపాలలో నిమగ్నమై ఉండగా హిమపాతం సంభవించిందని ఆర్మీ తెలిపింది. శిక్షణ సమయంలోనే నలుగురు సైనికులు మంచు కింద చిక్కుకుపోయారు. భారీ నిక్షేపాల కింద చిక్కుకున్న సైనికులను వెలికితీయడం కోసం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది. భారత సైనికులు సాధారణ శిక్షణా కార్యకలాపాల సమయంలో హిమపాతం లడఖ్‌లోని మౌంట్ కున్ పర్వతాన్ని తాకింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆకాశవాణి భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు చెప్పారు. అలాగే నవంబర్ 30 న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణాలి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ -నవంబర్ 30, కాగా , నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13,నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - నవంబర్ 13కాగా 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మళ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారా.. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా... కాంగ్రెస్ అధిష్టానం కూడా దానిపై సమాలోచనలు చేస్తుందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. బండ్ల గణేష్ కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం బండ్ల గణేష్ ఈ విషయమై మాట్లాడినట్టు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాతిలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఆయన కుమారుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే వైరల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్‌కు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వివరించారు. సీఎం కేసీఆర్‌కు వైరల్ ఇన్‌ఫెక్షన్ తరువాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ మొదలైందన్న ఆయన. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వీరాభిమానులు, కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

వివిధ విచిత్రమైన విషయాలతో బెంగుళూరు నగరం ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లోనే ఉంటుంది. ఇప్పుడు, మరో విచిత్రమైన సంఘటనలో, బెంగళూరులో రద్దీగా ఉండే రహదారి నుండి పాక్షికంగా నిర్మించిన బస్ షెల్టర్ అదృశ్యమైంది. పలు నివేదికల ప్రకారం, అందులో కుర్చీలు, పైకప్పులు, స్తంభాలు ఉన్నాయి. అయినప్పటికీ, దొంగలు ఏమీ వదిలిపెట్టకుండా మొత్తం వస్తువులను తమతో తీసుకెళ్లారు. కన్నింగ్‌హామ్ రోడ్డులో 10 లక్షల రూపాయలతో స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం జరుగుతోంది. దీన్ని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్వహించింది.
ఈమేరకు రవాణాశాఖ ఉపాధ్యక్షుడు ఎన్ రవిరెడ్డి చోరీపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భవనాల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే, అంతకుముందు, బెంగళూరు మహిళకు పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తామని నకిలీ మోసగాళ్లు రూ.60 లక్షలు మోసం చేశారు. నివేదికల ప్రకారం, మహిళ నగరంలోని సర్జాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సెప్టెంబర్ 11-19 వారంలో ఆమె డబ్బు పోగొట్టుకుంది. పార్ట్ టైమ్ జాబ్ గురించి ఆమెకు తెలియజేసే లింక్‌తో కూడిన ఓ టెక్ట్స్ మెసేజ్ ఆమెకు రావడంతో ఇదంతా ప్రారంభమైంది.
ఆమె దాన్ని క్లిక్ చేయడంతో అది టెలిగ్రామ్ గ్రూప్‌కి తీసుకెళ్లింది. అక్కడ, ఆమె హోటల్‌లను సమీక్షించమని, దాని కోసం రూ. 100 సంపాదించమని అడిగారు. ప్రారంభంలో, హోటల్‌లను సమీక్షించినందుకు మహిళకు తక్కువ మొత్తం వచ్చింది. అయితే, తర్వాత, స్కామర్‌లు ఆమెకు మంచి బక్స్ సంపాదించడంలో సహాయపడే పెట్టుబడి అవకాశం గురించి తెలియజేశారు. దాంతో ఆ మహిళ పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. అలా ఆమె రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. అయితే, తనకు ఇచ్చిన ఉద్యోగం రాకపోవడంతో.. తాను మోసపోయానని అర్థమైంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ నంద్యాల జిల్లా చినదేవళా పురం నుంచి రాజమండ్రి వరకు పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం అభిమానిపై పల్నాడు జిల్లాలో కొందరు దుండగులు దాడి చేశారు. వినుకొండ దాటిన తర్వాత బైకులపై వచ్చిన దుండగులు..తెలుగుదేశం అభిమాని నారాయణను దూషించి దాడికి పాల్పడ్డారు. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు తన స్వగ్రామం నుంచి నారాయణ అనే అభిమాని కాలినడకన రాజమండ్రికి బయలుదేరారు. వినుకొండ దాటి 4 కిలోమీటర్లు వెళ్లాక... విఠంరాజుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు నారాయణపై దాడి చేశారు.

విషయం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆయనను వినుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నలుగురు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించి దాడిచేశారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు పరామర్శించి నధైర్యం చెప్పారు. వినుకొండ MLA బొల్లా బ్రహ్మనాయుడే వైసీపీ కార్యకర్తలతో దాడి చేయించారని ఆంజనేయులు ఆరోపించారు.

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫసిఫిక్ మహాసముద్రం వెలుపలి దీవుల సమీపంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్‌ల్యాండ్స్‌లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు తెలిపారు. మరోవైపు సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.
తోరిషిమా సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత జపాన్ ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఒక మీటరు ఎత్తుకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇజు దీవుల్లోని ప్రజల తీరప్రాంతాలు మరియు నదీ ముఖద్వారాలకు దూరంగా ఉండాలని సలహా కోరింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, తోరిషిమా ద్వీపానికి సమీపంలో ఉదయం 11 గంటలకు 6. 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో .. రెండు గంటల అనంతరం ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో మంత్రి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్‌కతాలోని మంత్రి ఇంటితోపాటు 13 ప్రాంతాల్లో ఈడీతనిఖీలు నిర్వహిస్తోంది. గతంలో రతిన్ ఘోష్.. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో పురపాలికలో పెద్దసంఖ్యలో అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఘోష్‌తోపాటు అతని సహచరులు అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఘోష్ నివాసంతోపాటు 13ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఆయన భార్య రుజిరాకు కూడా నోటీసులు పంపింది. ఆమెను ఈ నెల 11న విచారణకు రావాలని కోరింది. ఎంపీ అభిషేక్‌కు ఈ నెల 3నే ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన హాజరుకాని విషయం తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం భువనమ్మ యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటనకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించి, అధిష్ఠానానికి పంపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహిస్తారని తెలుస్తోంది. బస్సు యాత్ర ఏ తేదీ నుంచి ప్రారంభమవుతుందో స్పష్టత లేకపోయినా కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేలుకో తెలుగోడా పేరుతో భువనమ్మ యాత్ర చేపడతారని తెలుస్తోంది.

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టు అన్యాయమని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తిని అవినీతి జరగని కేసులో అక్రమంగా అరెస్టుచేయడం రాజకీయ కక్షే అని తలసాని అన్నారు. ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయని తలసాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర హస్తం ఉందని, వారికి నచ్చని వారిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేయించి తమాషా చేస్తున్నారని మండిపడ్డారు సనత్‌నగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. విచారణ చేసే పద్ధతి ఇది కాదన్న తలసాని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రభుత్వ భవనంపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు, కలకలం రేపుతున్నాయి. ధర్మశాలలో జలశక్తి డిపార్ట్‌మెంట్ భవనం గోడపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్, షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భవనం గోడలపై వివాదాస్పద వ్యాఖ్యలను కలర్ పెయింట్ చేయడం, ఖలిస్తాన్ జెండాలు స్థానికంగా కలకలం రేపాయన్నారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం అందిందని, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం గోడకు రంగులు వేయించినట్లు తెలిపారు. ఈ ఘటన క్రమంలో అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలను చెక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఐదు మ్యాచ్‌లు అక్టోబర్‌లో ధర్మశాలలో జరగనున్నాయి. ఇప్పటికే పలు జట్లు నగరానికి చేరుకోవడం ప్రారంభించినందున ఈ సంఘటన ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీ రహస్య స్నేహాన్ని మోదీ నిజామాబాద్‌లో బయటపెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ అవినీతిలో బీజేపీని కూడా కేసీఆర్ భాగస్వామిని చేశారని ఆరోపించారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో కొంత మోదీకి చెల్లిస్తున్నారని విమర్శించారు. మోదీ మాటల తర్వాత ఎంఐఎం, బీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌తో దోస్తీపై ఎంఐఎం ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. ఇన్నాళ్లు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారని.. రేవంత్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌కు డబ్బు పంపారని మోదీ అంటున్నారని ఆ సమాచారం ఉంటే కేసీఆర్‌పై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ అవిభక్త కవలలని, వారిది ఫెవికాల్ బంధమని అన్నారు. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్ ఇప్పుడేం చెబుతారని నిలదీశారు.

చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ విదేశాల్లో ప్రవాసాంధ్రులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అట్లాంటాలో తెలుగు వారునిరసన తెలిపారు. చంద్రబాబుతోనే మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టునూ నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో TNSF విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ నిరాహార దీక్షకు రాజధాని రైతులు సంఘీభావం తెలిపారు. YSR జిల్లాలో మైదుకూరు, దువ్వూరు, కాజీపేట బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలకు చెందిన టీడీపీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నల్ల కండువాలతో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.25 వేల పూచీకత్తుతో బండారుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారుపై నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బండారును మొబైల్ కోర్టులో హాజరుపర్చగా పూచీకత్తుతో మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్‌పై విడుదలైన అనంతరం బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ధర్మం గెలుస్తుంది. న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు కూడా త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం పట్ల తనకు గౌరవం ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని.. అరెస్టు చేసే సమయం నుంచి లోకేశ్ అండగా నిలిచారని తెలిపారు.

ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో ప్రజలంతా హడలిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని భూకంపం సంభవించింది. . దాదాపు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లో ఉన్న వారు అంతా కూడా భయంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఢిల్లీతో పాటు..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 10 సెకన్ల పైగా ప్రకంపనలు వచ్చాయని అధికారులు నిర్థారించారు. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు నిరంతరంగా భూకంపం సంభవించింది. నేపాల్లో ఇవాళ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి నేపాల్ వణికింది. దీని ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది. దీంతో ఢిల్లీలోనూ భారీ ప్రకంపనలు వచ్చాయి. కాసేపు ఢిల్లీ వాసులు కంగారు పడ్డారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుసుకుని ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.

కేరళలోని కోజికోడ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు అంటే దాదాపు 50 అడుగులు. స్థానిక జాలర్ల ద్వారా సమాచారం అందుకున్న ఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగలం కళేబరాన్ని పరిశీలించారు. అది చనిపోయి రెండు రోజులు అవుతోందని గుర్తించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తామని..ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని చెప్పారు.
తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అయితే ఓ యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..తిమింగలం కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

దేశ రాజధాని దిల్లీ జాతీయ దర్యాప్తు సంస్థ ని ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక విజయం సాధించింది. ఐసిస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్టు చేసింది. అతడ్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అతడి పై రూ.3 లక్షల రివార్డు కూడా ఉంది. పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడి కోసం ఎప్పటి నుంచో వేట కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం దిల్లీ మాడ్యుల్ ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్‌ను బంధించారు. దిల్లీలో ఇతడు ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన షానవాజ్ పుణే ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడని పోలీసులు తెలిపారు. ఇతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకొన్నారు. విదేశాల్లోని వారి ఆదేశాలకు అనుగుణంగా ఉత్తరాదిన ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు పోలీసులు తెలుసుకున్నారు. షఫీ ఉజామా, మరో ఇద్దరిని పుణె మాడ్యూల్ కేసులో కొత్రూడ్ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. పోలీసు వాహనం నుంచి షఫీ కిందకు దూకేసి తప్పించుకోగా, ఇన్నాళ్లకు మళ్లీ చిక్కాడు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాజమండ్రి క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భువనేశ్వరి అంజలి ఘటించిన అనంతరం దీక్ష చేపట్టారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ నేతల దీక్ష కొనసాగనుంది.

రాజమండ్రి జైల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు, భువనేశ్వరీల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న లోకేశ్... అరాచకాలను నిరసిస్తూ దీక్ష చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నానని తెలిపారు. సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాలరాశారని, సత్యాన్ని వధించారని మండిపడ్డారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సుయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టుల్లో వెలువడే ఉత్తర్వుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ యాత్రను రాయలసీమ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టైన నాటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో వివిద రూపాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలుగుదేశం కార్యకర్తలకు నైతిక స్థైర్యం అందిస్తున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. సిద్ధిపేటలోని నంగునూరు మండలం నర్మెట్టలో పర్యటించిన హరీశ్ రావు.పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తర్వాత.. ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రి ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు. కేసీఆర్ పాలన మంచిగుంది కాబట్టే చంద్రబాబు అలా మెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం లేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచారని తెలిపారు. మరోవైపు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Harishrao, ts minister, Chandrababu Arrest, CID serves, TDP 'noisy protest,' evokes, no sound, IT Employees Protest, in Bengaluru, Against Chandrababu's Arrest, second day., Chandrababu Naidu Arrest, Chandrababu, supporters, protest in america, usa, Andhra, Protests continue, arrest of TDP Chief Chandrababu Naidu, Chandrababu. family members, Pawan kalyan, clarity, 2024 elections, Balayya, meet, bhuvaneshwari, brahmani, Protest, Hyderabad, IT Employees, Protests, Support Of Chandrababu, AP HIGH COURT, HEARING, CHANDRABABU, cid CASE, nara lokesh, comments, chandrababu arrest, cbn, tdp, chandrababu naidu, tdp, jremand, tv5, tv5news
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. వారికి మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూా మద్దతు తెలిపారు.మంత్రి మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే షకీల్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. దెబ్బకు దెబ్బ, కోతకు కోత ఉంటుందని హెచ్చరించారు. కేసులకు, కోర్టులు, జైలు శిక్షకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అవినీతి చేయని వాడు దేవుడికి కూడా భయపడడని... సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నాన్న నందమూరి తారక రామారావు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసిస్తామని బాలకృష్ణ అన్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. వైకాపా అక్రమ కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా.... చంద్రబాబును అరెస్టు చేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలకృష్ణ మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో స్పందన చూసి ఓర్వలేకపోయారని, అందుకోసమే చంద్రబాబుపై స్కిల్ కేసులో.. రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ వెల్లడించారు.


ముఖ్యమంత్రి, హోం మంత్రి, మహిళా కమిషన్‌కు ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా అని పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లాలోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా... కలచి వేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే ఏపీలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రెండేళ్ల క్రితమే నమోదైన స్కిల్ కేసును మళ్లీ ఓపెన్ చేశారని... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణ స్వామి అన్నారు. గతంలో చంద్రబాబు పేరు F.I.Rలో లేకపోయినా.. కొత్తగా చేర్చినట్లు విన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష సాధింపు చర్యలు లేవని తాను చెప్పలేనని... అయితే వివాదం కోర్టులో ఉన్న కారణంగా రాజకీయంగా మాట్లాడలేని నారాయణ స్వామి బదులిచ్చారు. చార్జ్ షీట్ ఎలా వేశారో... ఎందుకు అరెస్ట్ చేశారో.. ఆయన పేరు ఎలా వచ్చిందో తనకు తెలీదన్నారు. ఏపీలో కక్ష సాధింపు లేదని తాను చెప్పలేను అంటూ పరోక్షంగా జగన్‌కు చురకలంటించారు. వివాదం కోర్టులో ఉన్న కారణంగా తాను రాజకీయంగా మాట్లాడలేనని నారాయణ స్వామి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఈనెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YSషర్మిల వెల్లడించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించిన షర్మిళ పార్టీ విలీనం, ఎన్నికల వ్యుహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 119నియోజకవర్గాల్లో తమ పార్టీ..పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘ఒకరు దొంగ, మరొకరు దోపిడీదారు’ అన్నట్లుగా రెండు పార్టీలు కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. బీజేపీతో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
“ఏఐఎడీఎంకే-బిజెపి పొత్తు ముగిసిందని కేపీ మునుసామి ప్రకటించారు. మీరు (ఎఐఎడిఎంకె) బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా, డీఎంకే గెలవబోతోంది. మీరు ప్రజలను మోసం చేయలేరు. మీ స్వంత అన్నాడీఎంకే కార్యకర్తలు మీ మాజీ ముఖ్యమంత్రి, మంత్రులపై ఈడీ కేసులు పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం’’ అని కృష్ణగిరి జిల్లాలో జరిగిన డీఎంకే యువజన విభాగం బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ అన్నారు. "ఇది మొదటిసారి జరగడం లేదు, వారు (AIADMK, BJP) పోరాడినట్లు నటిస్తారు, కానీ ఎన్నికల సమయంలో, వారు మళ్లీ కలిసి ఉంటారు ఎందుకంటే ఒకరు దోపిడీదారుడు, మరొకరు దొంగ" అని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 25న తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది, “ఏఐఏడీఎంకే మాజీ నేతలపై బీజేపీ అనవసర వ్యాఖ్యలు చేస్తోందని” పేర్కొంది. బీజేపీకి చెందిన తమిళనాడు చీఫ్ కె అన్నామలై దూకుడు రాజకీయాల కారణంగా తలెత్తిన రాష్ట్రంలోని పరిస్థితి గురించి సీనియర్ ఎఐఎడిఎంకె నాయకులు డిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను పిలిచి, ఆయనకు తెలియజేసిన కొద్ది రోజుల తర్వాత పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయం వచ్చింది.
ద్రావిడ ఐకాన్ సీఎన్ అన్నాదురైపై వ్యాఖ్యలు చేసినందుకు వారు అన్నామలై నుండి క్షమాపణలు చెప్పాలని కోరారు. అతను క్షమాపణ చెప్పకపోతే అతనిని తీసివేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తుందని తెలిపింది. అన్నామలై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. తన పార్టీకి, అన్నాడీఎంకేకు మధ్య ఎటువంటి సమస్య లేదని సమర్థించారు. తాను అన్నాదురై గురించి చెడుగా మాట్లాడలేదని, 1956 నాటి సంఘటనను మాత్రమే చెప్పానని ఆయన పేర్కొన్నారు.
ఎన్డీయే నుంచి వైదొలగే నిర్ణయాన్ని పునరాలోచించుకోమని అన్నామలై అన్నామలైకి గట్టి మద్దతు ఇస్తున్నట్లు అన్నాడీఎంకేను పార్టీ కోరబోదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐఎడిఎంకె 2019 లోక్‌సభ ఎన్నికలు - 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో మిత్రపక్షంగా భాగస్వామిగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


