చిట్టి న్యూస్

హిందూపురం వైసీపీలో అసమ్మతి సెగ

హిందూపురం వైసీపీలో అసమ్మతి సెగ రేగింది. హిందూపురం కౌన్సిల్‌ సమావేశం గందరగోళంగా మారింది. దీంతో ఒక్క నిమిషంలోనే కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించారు. ఛైర్ పర్సన్‌ ఇంద్రజ అవినీతి పాలన కొనసాగిస్తున్నట్లు ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో వైసీపీకి చెందిన 13 మంది అసమ్మతి కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. కౌన్సిల్‌ హాల్‌లో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అటు.. టీడీపీ కౌన్సిలర్లు ఛైర్‌ పర్సన్‌ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కౌన్సిల్ హాల్ దగ్గరకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్ల భర్తలను పోలీసులు వెళ్లిపోవాలనడంతో.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పార్టీ మారే ప్రసక్తేలేదు: రాజాసింగ్‌

తన మెంటాలిటీకి ఒక్క బీజేపీ మినహా ఏ పార్టీ సరిపోదన్నారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌. పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్‌ నుంచే పోటీ చేస్తానని పేర్కొన్నారు. అయితే.. సస్పెన్షన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదని అన్నారు.

తాడేపల్లి ఫైల్స్‌ అని జగన్‌పై ఐదారు సీక్వెల్స్‌ తీయొచ్చు: సోమిరెడ్డి

తాడేపల్లి ఫైల్స్‌ అనే పేరుతో సినిమా తీస్తే.. ఐదారు సీక్వెల్స్‌ తీయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. జగన్‌ను పొగడటానికి క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ తప్ప మరేం లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

బొట్టు చెరిపేసుకునే వారి పార్టీ అవసరమా..ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బండి

AICC ప్రెసిడెంట్‌ ఖర్గే వ్యాఖ్యలను టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ఖండించారు. కర్ణాటకలో పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్.. ముస్లిం మతపెద్ద ఇంటికి వెళ్లిన ఖర్గే బొట్టు చెరిపేసుకున్నాడు, అలాంటి వాళ్ల పార్టీ అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రధానిని పట్టుకుని విషసర్పం అని అనడం ఎంత వరకు కరెక్ట్‌ అన్నా రు. దేశ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న మహానేత ప్రధాని మోదీ అని కొనియాడారు.

రెజ్లర్లకు ప్రియాంకా గాంధీ మద్దతు

ఢిల్లీలో రెజ్లర్లు చేపట్టిన నిరసనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ప్రియాంక.. రెజ్లర్లతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, ప్రియాంకలు తమ సమస్యలను వివరించారు. బ్రిజేష్‌భూషణ్‌ పై FIR నమోదు చేశామని చెపుతున్న పోలీసులు.. ఎందుకు ఇంత వరకూ ఆ కాపీని బయటకు చూపించట్లేదని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. 

చీతాల మృతిపై అటవీ శాఖ వివరణ

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా మృతి చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని వెల్లడించింది. మాంసాహార జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం, వాటిని అక్కడ పెంచడం చాలా సంక్లిస్టమైన విషయమని అధికారులు అన్నారు. అంతేకాకుండా కొన్ని జంతువులుకొత్త వాతావరణానికిఅలవాటు పడలేవన్నారు. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయని... ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు.

చిన్నారిని మింగేసిన మ్యాన్ హోల్

సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. కళాసిగూడలో 9 ఏళ్ల చిన్నారిని మ్యాన్‌హోల్ మింగేసింది. మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండటంతో చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. ఆ తర్వాత నాలాలో కొట్టుకుపోయింది. పార్క్‌లైన్ వద్ద పాప మృతదేహాన్ని DRF సిబ్బంది గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు.

రెజ్లర్లకు మద్దతుగా కేటీఆర్

లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఒలింపిక్ చాంపియన్లు దేశానికి పతకాలు తెచ్చినప్పుడు మనం సంబరాలు చేసుకున్నామని, ఇప్పుడు వాళ్లు న్యాయం కోసం పోరాడుతున్న తరుణంలో వారికి బాసటగా నిలవాలని పేర్కొన్నారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల పట్ల నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరపాలన్నారు. న్యాయాన్ని కాపాడాలని... రెజ్లర్ల నిరసనకు తన హృదయపూర్వక మద్దతు తెలుపుతున్నాని కేటీఆర్ అన్నారు. 

కాంగ్రెస్ నిరుద్యోగ సభకు సర్వం సిద్ధం

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నిరుద్యోగ సభకు సర్వం సిద్ధమైంది. భారీ జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలు సమాయత్తమయ్యారు. కార్యక్రమంలో పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డితోపాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్లు జానా రెడ్డి, దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత నల్గొండలో మొదటిసారి అడుగుపెడుతున్నారు. ఉప్పునిప్పుగా ఉండే నల్గొండ జిల్లా సీనియర్ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకుంటున్నారు. దీంతో సొంత పార్టీ శ్రేణులే ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

నూతన సచివాలయం ప్రారంభోత్సవం

ఏప్రిల్ 30, 2023 తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు నుంచి పాలన మొదలు కానుంది.. మొత్తం ఆరు ఫ్లోర్లు ఉండగా.. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖలు కేటాయించారు.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెవెన్యూ శాఖ యంత్రాంగం కొలువుదీరనుంది. ఫస్ట్‌ ఫ్లోర్‌లో హోంశాఖ, సెకండ్‌ ఫ్లోర్‌లో ఆర్థిక శాఖ, థర్డ్‌ ఫ్లోర్‌లో అగ్రికల్చర్‌ అండ్‌ ఎస్సీ డెవలప్‌మెంట్‌, ఫోర్త్‌ ఫ్లోర్‌లో ఇరిగేషన్‌ అండ్‌ లా, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్‌లో ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ చాంబర్లు ఉంటాయి.

తల్లి చంతకు చేరిన చిన్నారి

అఫ్జల్‌గంజ్‌లో కిడ్నాపైన రెండు నెలల చిన్నారి సేఫ్‌గా తల్లి ఒడికి చేరింది. కిడ్నాపైన గంటల వ్యవధిలోనే పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. పసిపాపను తల్లి దగ్గరకు చేర్చారు. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో రెండు నెలల చిన్నారితో కలిసి ఓ మహిళ నిద్రించింది. తెల్లవారు జామున గుర్తు తెలియని మహిళ, యువకుడు చిన్నారిని ఎత్తుకెళ్లారు. నిద్రలేచి చూసే సరికి బిడ్డ కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను ఉప్పుగూడలో పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

కర్నూలు జిల్లాలో యువగళం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం ప్రభంజనం కొనసాగుతుంది. 83వ రోజు మంత్రాలయం విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మిగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, మహిళలు భారీగా తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. టీడీపీ, యువగళం జెండాలు, తోరణాలతో యువగళం హోరెత్తింది. దారి పొడువునా.. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో యువగళం పాదయాత్ర ఉరకలేత్తింది.

మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో బయటపడ్డ అవకతవకలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇన్‌ఛార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ చెలరేగిపోయాడు. ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవుపై వెళ్తూ.. సబార్డినేట్‌కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగిoచాడు. సీన్ కట్ చేస్తే.. గంటల వ్యవధిలో ఊహించని రీతిలో అక్రమాలకు తెరలేపారు. ఏకంగా.. అక్రమ లే అవుట్ లకు సంబంధించిన 66 ప్లాట్ల డాక్యుమెంట్లను... నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశాడు. సెలవుపై వెళ్ళిన రిజిస్ట్రార్ తిరిగి విధుల్లోకి వచ్చి చూడగా బండారం బట్టబయలైంది. ఉన్నతధికారుల ఆదేశాలతో.. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ తనిఖీ చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది.

నిర్దోషిగా విడుదలైన సూరజ్ పంచోలి
నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో  ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సూరజ్ పంచోలిని స్పెషల్ సీబీఐ కోర్టు నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. జియా ఖాన్ ఆత్మహత్యలో సూరజ్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించనందున సూరజ్ కేసు నుంచి మోక్షం కల్పించింది. జియాఖాన్ తల్లి రబియా ఖాన్ తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ అతడు నిర్దోషి అయితే తన కూతురు ఎలా చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.  
ఏకమవుతోన్న విపక్షాలు

2024 ఎన్నికల్లో మోదీని ఢీకొట్టేందుకు ఏకమవుతున్న విపక్షాలు.. మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కర్నాటక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత విపక్ష నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. మే 10తర్వాత పాట్నాలో సమావేశం ఉంటుందని జనతాదళ్‌ యునైటెడ్ వర్గాలు వెల్లడించాయి. సమావేశానికి కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొంటారు. 

రెజ్లర్లకు మద్దతుగా నీరజ్ చోప్రా

ఒలంపిక్ గోల్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పై రెజ్లర్లు సాగిస్తున్న పోరుపై స్పందించాడు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన రెజ్లర్లకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో నీరజ్ చోప్రా సైతం రెజ్లర్లకు సంఘీభావం తెలిపాడు. ఇది చాలా సున్నితమైన వ్యవహారమని, పక్షపాతానికి తావు లేకుండా, పారదర్శకంగా విచారణ జరగాలని తన సోషల్ మీడియా పేజ్ పై స్పందించాడు. అధికారులు త్వరిత గతిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.

మరికాసేపట్లో జియాఖాన్ కేసులో తుది తీర్పు

సుమారు పదేళ్ల సుధీర్ఘ విచారణ తరువాత ముంబైలోని సీబీఐ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో తీర్పు ఇవ్వనుంది. 2013లో జూన్ 3న జియా ఖాన్ జుహూలోని తన స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నటుడు ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. జియా ఖాన్ సూసైడ్ నోట్ లో సూరజ్ తనను ఎన్ని రకాలుగా హింసించాడన్న విషయాలను పేర్కొంది. నేరం ఖరారు అయితే సూరజ్ కు దాదాపు పదేళ్ల జైలు శిక్ష తోపాటూ జరిమానా కూడా విధించే అవకాశం కనిపిస్తోంది. 

చంద్రబాబును కలిసిన మంత్రి అంబటి బాధితులు

మంత్రి అంబటి రాంబాబు బాధితులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. కూతురు చనిపోతే తమకు వ చ్చిన పరిహారంలో మంత్రి అంబటి సగం డబ్బులు అడిగారని చంద్రబాబు వద్ద వాపోయారు. ఘటనపై కలత చెందిన చంద్ర బాబు తురకా గంగమ్మ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్ ద్వారా మంగమ్మ ఇంకో కూతరుకు చదువు చెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

వంగలేని జగన్‌ వృద్ధుడా?..కాలువ తూముపై ఎగిరిదూకిన చంద్రబాబు వృద్ధుడా?

తల్లిదండ్రులు, కుటుంబాన్ని, పెద్దల్ని గౌరవించలేని సీఎం జగన్‌.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏమి గౌరవిస్తారని అన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. వంగి కొబ్బరికాయ కొట్టలేని జగన్‌ వృద్ధుడా..? ఎవరిసాయం లేకుండా కాలువ తూముని ఎగిరిదూకిన చంద్రబాబు వృద్ధుడా? అని ప్రశ్నించారు. ఏమచ్చా లేని చంద్రబాబుని ఎగతాళి చేయడం.. తండ్రి వయసున్న చంద్రబాబుని కించపరచడమేనన్నారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించలేని జగన్‌ ఇతరులను ఎలా గౌరవిస్తారని విమర్శించారు. చంద్రబాబు సింహం లాంటి వారని.. ఆయన గర్జనకు భయపడి ఫ్రస్టేషన్‌లో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ కుటుంబం దోచుకున్న రాష్ట్ర సంపదను బయటకు తీసుకొస్తాం: భట్టి

తెలంగాణ సంపదను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటుందని విమర్శించారు సీల్పీ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ పెద్ద స్కాం అని ఆరో పించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ధీమా వ్యక్తం చే శారు. అప్పుడు కేసీఆర్‌ కుటుంబంపై సమగ్ర విచారణ జరిపించి దోచుకున్న రాష్ట్ర సంపదను బయటకు తీసుకొస్తామని చెప్పారు. రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌ అయింది. ప్రాసిక్యూషన్‌ వాదనలతో విభేదించారు హనుమకొండ మెజిస్ట్రేట్‌. టెన్త్‌ హిందీ పేపర్‌ మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో.. విచారణకు సహకరించడం లేదంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. బండి సంజయ్‌పై నమోదు చేసిన కేసు కుట్రపూరితమంటూ.. డిఫెన్స్‌ లాయర్‌ బలమైన వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు తర్వాత హనుమకొండ మెజిస్ట్రేట్‌ తీర్పు ఇచ్చారు.

పంచాయతీ కార్యదర్శులు ఆందోళన

సూర్యాపేటలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాట పట్టారు. దురాజ్‌ పల్లి క్రాస్‌ రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలం పూర్తయినప్పటికీ.. తమను క్రమబద్ధీకరించలేదని ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా సమ్మె చేపడతామని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టరేట్‌ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

డ్రగ్ రాకెట్ బట్టబయలు

ఏపీలో నరసరావుపేట కేంద్రంగా మాదక ద్రవ్యాల వ్యాపారం ఖండాంతరాలకు పాకింది.. సూడాన్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్న డ్రగ్స్ తయారీకి నరసరావుపేట పట్టణం అడ్డాగా మారింది. సేఫ్ ఫార్మాకు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లుగా ముంబై కస్టమ్స్‌ అధికారుల విచారణలో తేలింది.. డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డిని ముంబై కస్టమ్స్‌ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.. సూడాన్‌కు తరలిస్తున్న 10 లక్షల ట్రామడాల్‌ ట్యాబ్లెట్లను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.


చిన్నారి మరణంలో అంగన్ వాడీ కార్యక్తలదే తప్పు

కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనలోని తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మానవ హక్కుల సంఘం ఇచ్చిన తీర్పును ఏకీభవించింది. వ్యాజ్యం కొట్టివేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు వ్యాజ్యాలు వేయకుండా ఉండాల్సిందని.. దీనివల్ల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జరిగిన ఘటనకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడి టీచర్‌దే బాధ్యతని వెల్లడించింది. 

దళితులపై అణచివేత

శింగనమల నియోజక వర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. దళితులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త దళితులను ఎదగనీయడం లేదని ఆరోపించారు ఎస్సీ నేత. తమను అణిచివేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌. రాజకీయంగా తమను ముందుకు వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఎమ్మెల్యే భర్తకు దళితులంటే గిట్టదని అందుకే తమను ముందుకెళ్లనివ్వడం లేదని విమర్శించారు.

ఏపీ జేఏసీ గరంగరం

ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి. నిన్న సీఎస్‌ను కలిసిన ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు.. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జేఏసీలోని అన్ని సంఘాలతో విస్తృతంగా చర్చించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్‌ బేగంపేటలో CRPF కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. చీకోటి గార్డెన్‌ వద్ద దేవేంద్ర కుమార్ రైఫిల్‌తో కాల్చుకున్నాడు. 2021 బ్యాచ్‌కు చెందిన దేవేంద్ర కుమార్.. CRPF ఐజీ మహేష్ లడ్డా నివాసం వద్ద సెక్యూరిటీగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దేవేంద్ర ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాంధీ మార్చురీకి తరలించారు.

గంగిరెడ్డి బెయిల్ రద్దు

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ఎర్ర గంగిరెడ్డికి ఏపీ హైకోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5 వరకు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగి రెడ్డి లొంగిపోకపోతే సీబీఐ అరెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. 

విశాఖలో కిడ్నీ గ్యాంగ్ కలకలం

విశాఖలోని మధురవాడ కేంద్రంగా సాగిన కిడ్నీ దందా బట్టబయలైంది. వినయ్ కుమార్‌ అనే వ్యక్తికి వల వేసిన కిడ్నీ గ్యాంగ్ డబ్బు ఆశ చూపి బాధితుడి నుంచి కిడ్నీ తస్కరించినట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రుసుము చెల్లించకపోవడంతో ఈ వ్యవహారం బట్టబయలు అయింది. పోలీసులకు ఫిర్యాదు అందేసరికి కిడ్నీ గ్యాంగ్ పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యప్తు ముమ్మరంగా సాగుతోంది. 

రైతులకు భరోసా

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నాంచారుపల్లి, బక్రిచెప్యాల, పొన్నాల, ఏన్సాన్‌పల్లిలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.. అలాగే దుబ్బాక నియోజకవర్గ పరిధిలో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను హరీష్‌రావు పరిశీలించారు.. నష్టపోయిన పంట వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు.

రాష్ట్రంలో ఉంది రైతు ప్రభుత్వం: కేటీఆర్

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కష్ట కాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు.

రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు.. ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్న కేటీఆర్‌.. రైతులు ధైర్యం కోల్పోవద్దని చెప్పారు.. రైతులకు అండగా కేసీఆర్‌ వున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.. రానున్న ఒకట్రెండ్రోజులపాటు భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రాంగానికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

అకాల వర్షాలు కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మజిల్లా ముదిగొండలో పర్యటించిన ఆయన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పర్యటించారు. పంటలు నష్టపోయిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఏమేరకు పంటలు నష్టపోయాయో అంచనా వేసి, అనంతరం నష్టాపరిహారాన్ని అందజేయలని సీఎందృష్టికి తీసుకెళ్లతామన్నారు. అనంతరం ఆయన దీపికల నిరవాదిక సమ్మెకు మద్దతు తెలిపారు.

భారత జనాభాపై జర్మన్ వ్యంగ్యాస్త్రం

భారతదేశం చైనా జనాభాను అధిగమించిన అంశంపై జర్మన్ కార్టూనిస్ట్ చిత్రీకరించిన వ్యంగ్య కార్టూను ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై భారతీయులు మండిపడుతుండగా, రాజకీయంగానూ ఈ కార్టూన్ చర్ఛనీయాంశమైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీన్ని ఆ దేశపు జాత్యహంకారంగా పేర్కొన్నారు. "భారత్‌ను అపహాస్యం చేయడానికి మీరు ప్రయత్నించినప్పటికీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మరికొన్నేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జర్మనీ కంటే పటిష్ఠంగా మారుతుందని  ఉంటుంది'' అని ట్వీట్ చేశారు.

సింగపూర్ లో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష

1 కిలో గంజాయిని అక్రమంగా రవాణా చేసినందుకు సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉరితీశారు. దోషిగా తేలిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తికి ఉరిశిక్షను అమలు చేసింది. రాష్ట్రంలో మరణశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ సంస్థల పిలుపు నేపథ్యంలో ఈ ఉరిశిక్షను అమలు చేయడం చర్చనీయాంశమైంది. సింగపూర్‌లోని చాంగి జైలు కాంప్లెక్స్‌లో బుధవారం ఉరితీసినట్లు అధికారులు తెలిపారు. 

దంతేవాడలో మావోల ఆకస్మిక దాడి

ఛత్తీస్ ఘఢ్ లోని దంతేవాడ మరోసారి బాంబుల మోత మోగిపోయింది. అరణ్ పూర్ లో కూంబింగ్ కు వెళుతోన్న ఆర్మీ వాహనంపై మావోయిస్టులు బాంబులతో విరుచుకుపడ్డారు. యాంటీ మావోయిస్ట్ ల దళం కదలికలపై నిఘా పెట్టిన మావోలు మార్గం మధ్యలో బాంబులు పాతిపెట్టారని తెలుస్తోంది. పేలుడు ధాటికి మినీ బస్సులో ప్రయాణిస్తోన్న పది మంది జవాన్లతో పాటూ డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

మంచీర్యాల హత్యకేసులో ట్విస్ట్

మంచిర్యాల హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతికి, మహేశ్ కు మధ్య గతంలోనే ప్రేమ వ్యవహరం నడిచిందని తెలిసింది. అది నచ్చక యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. కోపంతో మహేష్.. యువతితో కలిసిన తిరిగిన ఫోటోలు, వీడియోలను ఆమె భర్తకు పంపాడు. కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో యువతి, ఆమె భర్తకు మధ్య విభేదాలు తలెత్తాయి. కొద్ది నెలల క్రితం ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ నేపథ్యంలో మహేశ్ వేధింపులు ఎక్కువ అవ్వడంతో అతడిని హత్యచేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణకు సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్ష: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్

తెలంగాణకు సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్ష అన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో.. బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రతినిధుల సభ యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు. ఇందులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేటీఆర్‌ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించి.. విశ్వనగరంగా చేశారని మాగంటి గోపీనాథ్‌ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడడం తగదన్నారు.