- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

పాతబస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా షా నవాజ్ నివాసంలో సోదాలు జరిగాయి. ఆ సమయంలో షా నవాజ్ దుబాయ్‌కి వెళ్లిపోయారు. గతంలోనూ ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుతున్నారన్న సమాచారం అందడంతో ఫలక్‌నామలోనీ కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. షా నవాజ్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఫంక్షన్ హాల్, ఆఫీస్,హోటల్స్‌లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రెండు సార్లు షానవాజ్‌పై ఐటీ దాడులు జరిగాయి.

బీఆర్ఎస్ ఒత్తిడితోనే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్లగొండలో బీఆర్‌ఎస్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ వల్లే కాంగ్రెస్‌లో చలనం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌కు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు.కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం అయ్యింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పద్దుకు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపుల గురించి సమావేశంలో చర్చించనున్నారు. దీంతోపాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారాసకు ధీటుగా సమాధానం చెప్పడం, నల్గొండలో ఆ పార్టీ సభ తలపెట్టిన నేపథ్యంలో అధికార పక్షంగా ఎదుర్కోవడం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ ఆనకట్టపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక, సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి పిల్లల విభాగంలో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లల విభాగంలో వైద్యం పొందుతున్న చిన్నారులకు...శుక్రవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంటకు చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండటంతో వారిని ఇంటెన్సివ్ కేర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల విభాగంలోని మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ జోసఫ్ రాజారావు సమష్టి దివ్య పూజాబలితో ప్రారంభించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామని బిషప్ రాజారావు తెలిపారు. ఈ వేడుకలలో వాటికన్ రాయబారి లియోపోల్డో జిరెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. 1924 ఏడాదిలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసఫ్స్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. అక్కడ గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్ సర్వే వెల్లడించడంపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీకి అంతిమయాత్ర పక్కా... సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందని ఇండియా టుడే- సి ఓటర్ సర్వే చెప్పిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌తో ఇండియా టుడే ఫొటోను ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం ఓటర్లు టీడీపీ-జనసేనతోనే ఉన్నారని... ఈ రెండు పార్టీలు 17 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటాయి. 41 శాతం ఓట్లతో వైసీపీ 8 స్థానాలకు పరిమితం కానుందని ఆజ్‌తక్ ఛానల్ సర్వేలో పేర్కొన్న విషయాలను లోకేశ్ ప్రస్తావించారు.

జార్ఖండ్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది బుధవారం ఒక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా, చత్ర జిల్లాలోని బైరియో అడవుల్లో వారిపై తృత్య సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ (టీపీఎస్‌సీ)కి చెందిన నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు ఐజీ అమోల్ వీ హొమాకర్ నిర్ధారించారు. గాయపడిన జవాన్‌ను వాయుమార్గంలో రాజధాని రాంచీకి తరలించినట్టు చెప్పారు. జార్ఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన తర్వాత సమీపంలోని పోలీసు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్‌లో జార్ఖండ్‌లోని గర్వాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారిని కూడా కాల్చిచంపారు.

అన్నమయ్య జిల్లాలో (Annamayya District) ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావటంతో.....సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్ల దాడిలో పోలీసు గణేష్ చనిపోవడం తెలుగుదేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు (Chandra Babu) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన తీవ్ర బాధాకరమన్న చంద్రబాబు స్మగ్లర్లకు టిక్కెట్లిచ్చే జగన్ (Jagan) ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమిస్తుంటే పోలీసులను లెక్కచేస్తారా అని ప్రశ్నించిన ఆయన...టాస్క్ ఫోర్స్ ను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎర్రచందనం స్మగ్లర్లపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గుంటూరు, కృష్ణా, NTR జిల్లాల్లో నాలుగురోజుల పాటు పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో... మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి... ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నెల 6న మంగళగిరి, 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, 8న తాడికొండ నియోజకవర్గాల్లో ఆమె పర్యటన సాగనుంది. 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు.
పర్యటన వివరాలు...
6న మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన.
7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన.
8న తాడికొండ నియోజకవర్గంలో పర్యటన.
9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటన.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే మొదటగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయింది. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేసారూ టీడీపీ సభ్యులు. ఈ తరుణంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్..అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీఛార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
కాగా.. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి (మంగళవారం) వాయిదా పడనున్నాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. బుధవారం (ఫిబ్రవరి 7) ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.సమావేశం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది.

విద్వేషతపూరిత ప్రసంగం కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని (Mufti Salman Azhari) గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ ప్రసంగించారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ ప్రసంగాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్‌చేశారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో జునాగఢ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేశారు.
అయితే ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్లాం బోధకుడు అజారీని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు.. ముంబై అర్బన్ జిల్లాలోని ఘట్కోపర్ పీఎస్‌లో ఉంచారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ముఫ్తీ మద్దతుదారులు గుమికూడారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.
విద్వేశపూరిత ప్రసంగం చేసినందుకుగాను ఐపీసీ 153B (మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 505 (2) (ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం) సెక్షన్ల కింద అజారీతోపాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మహ్మద్ యూసుఫ్ మాలెక్, అజీమ్ హబీబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.

మెగా డీఎస్సీ అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఉద్యోగార్థులు మండిపడ్డారు. వేల ఉపాధ్యాయ ఖాళీలుంటే తక్కువ పోస్టులు వేసి జగన్ ప్రభుత్వం నాటకాలాడుతోందని నిరుద్యోగులు అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలో నాలుగున్నరేళ్లుగా 4వేల మంది డీఎస్సీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం 4 ఎస్జీటీ పోస్టులు వేశారన్నారు. తొలుత నగరంలో ర్యాలీ తీశారు. ప్రధాన రహదారిపై అరగంట బైఠాయించారు. ఆ తర్వాత కలెక్టరేట్ గేట్లను తోసుకొని, లోనికి చొచ్చుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కలెక్టర్ ఛాంబర్ దాకా వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు నిరుద్యోగులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. వెయ్యి కోట్ల రూపాయల చొప్పున మూడు లాట్లు, 500 కోట్ల రూపాయల చొప్పున రెండు లాట్లలో సెక్యూరిటీల వేలం వేసి ఈ రుణాన్ని తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి 19 ఏళ్ల పాటు చెల్లింపు కాలవ్యవధిలో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర 5 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4 వేల కోట్ల రుణాన్నీ తీసుకున్నాయి. ప్రస్తుత నాలుగు వేల కోట్ల రుణంతో ఏపీ ఈ ఏడాదిలో తెచ్చిన అప్పు 1.02 వేల కోట్ల రూపాయలకు చేరింది. అనుమతించిన స్థాయి కంటే అప్పులు చేసి ఎఫ్ఆర్ బీఎం నిర్దేశించిన పరిధిని ఇప్పటికి 22 సార్లు ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. శుక్రవారం బెదిరింపులు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు బెదిరింపుల వెనకున్నది ఎవరో తేల్చేందుకు రంగంలోకి దిగారు. నగరంలో ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు సందేశాలు అందాయి.
గత నెల 6న కూడా నిందితులు బెదిరింపు ఈ-మెయిళ్లు పంపించారు. కొలాబా ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రయాల, వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌లో బాంబులు అమర్చినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన ముంబై పోలీసులు.. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను ఆయా ప్రాంతాలకు పంపించారు. అయితే, అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ-మెయిల్స్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కెన్యా రాజధాని నైరోబీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 165 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. కంపెనీలో ఉన్న భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

పంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే బహుమతి నోబెల్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది నాలుగోసారి.
మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారిగా శాంతి ఒప్పందాలు కుదరడంలో డొనాల్డ్ ట్రంప్ కీలకపాత్ర పోషించారని టెన్నీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపకుండా, మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం అసాధ్యమని ప్రభుత్వ యంత్రాంగాలు, విదేశాంగ విధాన నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చినా, ఆ వాదన తప్పు అని ట్రంప్ నిరూపించారని టెన్నీ వివరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్రహం అకార్డ్స్ ఒప్పందంతో పాటు ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ మధ్య సంబంధాలను మెరుగుపరిచినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కోరారు. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని, అయితే ఆయన కృషి నోబెల్ శాంతి బహుమతి కమిటీ గుర్తింపునకు నోచుకోవడంలేదని ఆమె వివరించారు. అందుకే ఇవాళ ట్రంప్ పేరును నామినేట్ చేసినట్టు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నిర్ణయాలపై తెలుగుదేశం విమర్శలు గుప్పించింది. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరని తెలుగుదేశం నేత నారా లోకేశ్ విమర్శించారు. త్వరలో డ్రామాల వైసీపీ ప్రభుత్వం పోతుందన్న ఆయన యువతకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్న తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. సౌర విద్యుత్ పేరిట జగన్ రెడ్డి 2వేల 350 కోట్లు దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. గత ప్రభుత్వాలు మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి మూడెకరాల కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 6 ఎకరాలకు పెంచిందని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి అదనంగా జరిపిన భూ కేటాయింపులపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఐడీ అధికారులమంటూ హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో సోదాలు చేసి ఆ సంస్థ డైరెక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నాడు. గచ్చీబౌలిలోని అజయాడ్ ఐటీ కంపెనీలో ఈనెల 27న తొమ్మిది మంది ఏపీ సీఐడీ అధికారులమని తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో కంపెనీపై కేసు నమోదైందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నామని కార్యాలయంలోని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సంస్థ డైరెక్టర్ , మరో ఉద్యోగిని.. ఓ హోటల్ కు తీసుకుని వెళ్లారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి 2.3కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. 10లక్షలు రూపాయలు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో కర్నూలుకు చెందిన ఎస్ ఐ సుజన్ ..... కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు.

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపివేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై ఫిబ్రవరి 8 వరకు స్టేటస్ కో విధించింది. కొత్త MLCలతో..ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.... జారీచేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తమను గవర్నర్ ఆమోదించకపోవడంపై..... గతంలోనే దాసోజు శ్రావణ్, సత్యనారాయణ వేసిన పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రేపు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఉందని... కేసు తేలేవరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం..కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పాడ-3 సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురామ్‌పై వాకతిప్ప గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపల్లి మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట పైపులైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు.

సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోనే వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు. అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆయనను కొట్టవద్దని, వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ వారిస్తూ.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళుతుంటే.. అనుచరులు పిడిగుద్దులు కురిపించారు.

వైఎస్ కుటుంబం నుంచి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా మరో గళం వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ చెల్లెలు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల... జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను తొలిసారి కలవనున్నారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా.. అవినాష్‌రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణను కోరడంతోనే సీఎం జగన్, సునీత మధ్య కుటుంబపరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై సునీత షర్మిలతో చర్చించనున్నారు. తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు ఆమె అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని సైతం ఇచ్చారు. ఇప్పుడు జరగనున్న భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఒడిశాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ భర్త.. తన భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లడం సభ్య సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహాయంతో ఆమె భర్త 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. మూడు నెలల క్రితం తన భార్య కరుణ ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. అప్పటినుంచి కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీ పురుణగూడలోని తన పుట్టింట్లో ఉంటోందని మృతురాలి భర్త అమానత్య తెలిపాడు. కరుణ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతిచెందిందని.. అంత్యక్రియలు తన ఇంటివద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్ జిల్లా నందహండి సమితి జగన్నాథ్‌పూర్ పంచాయతీ ఫుపుగావ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్, మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదని అందుకే తన భార్య మృతదేహాన్ని మోసుకెళ్లినట్లు తెలిపాడు. వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో శనివారం ఉదయం కరుణ మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లానని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామంలో మహిళపై స్థానిక వైసీపీ నేత అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఆమె గట్టిగా నిలదీయడంతో మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పాల వెంకటాపురం గ్రామానికి చెందిన నటరాజు అనే వ్యక్తి మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో నిలదీయడంతో లక్ష్మీపై అతను దాడి చేశాడు. బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన వివాహిత పాలవెంకటాపురంలో దుస్తుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం దుకాణం మూసేసి చెరువు కట్ట మీదుగా గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక వైసీపీ నాయకుడు, గ్రామ సచివాలయం కన్వీనర్ నటరాజ్ ఆమెను అడ్డుకుని అత్యాచారం చేయబోయాడు. తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. జుట్టు పట్టుకుని ఈడ్చి.. కాలితో తన్ని క్రూరంగా ప్రవర్తించాడు. పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు అక్కడికి చేరుకుని ఆమెను విడిపించడానికి ప్రయత్నించాడు. అతనిపైనా నటరాజ్ దాడి చేశాడు. కొద్దిసేపటికి మరి కొంతమంది అక్కడికి చేరుకోవడంతో పరారయ్యాడు.

ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వ్యక్తి చిత్రీకరించాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగినట్లు పోలీసుల దృష్టికి రావడంతో బ్రహ్మసముద్రం ఎస్సై పరశురాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దాడి జరిగిందని నిర్దారించకున్నారు. లక్ష్మీపై దాడి చేసిన నటరాజుపై బ్రహ్మసముద్రం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పరశురాముడు తెలిపారు. గాయపడిన మహిళను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడు నటరాజ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

75వ గణతంత్ర వేడుకల సందర్భంగా.... దేశ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు... తెలిపారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ ... బలమైన.... మరింత సంపన్నమైన భారత్ ను నిర్మించేందుకు కలిసి పని చేద్దామని..... పిలుపునిచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విరాజిల్లే దేశం భారత్ అని ఉపరాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ సూత్రాలను మరోసారి మననం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..... జాతీయ నాయకుల స్ఫూర్తితో ముందుకుసాగాలని.... సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర సైనికులందరినీ........... కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మరించుకున్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామంటూ అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ..ఈ చారిత్రాత్మక రోజు సందర్భంగా భారత్ ను మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కడపలో సమస్యలు పరిష్కరించలేదని ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమయ్యారు.దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధం, 41 నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ U.T.F. ఆధ్వర్యంలో.. మహావీర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో C.P.S. రద్దు చేస్తానన్న హామీ.. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడుస్తున్న ఆ ఊసే ఎత్తకపోవడం దారణమన్నారు. గత రెండేళ్ల నుంచి పెండింగ్ లో ఉంచిన 18 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సీఎం జగన్ స్పందించకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్ ... అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టపెట్టారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గట్టిగా మాట్లాడారన్న షర్మిల... అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాడలేదన్నారు. విశాఖకు ఏంచేశారు... రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి.. కాంగ్రెస్ రావాలని నినదించారు.

నిధులు రాక అభివృద్ధి విషయంలో ఏమీ చేయలేకపోతున్నామని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. బతిమలాడి పనులు చేయించినా బిల్లులు రాక తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జి.కొండూరు మండలం వెలగలేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాదర్... గుత్తేదారులు బిల్లులు రాక తన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. మైలవరంలో ఒక నాయకుడు రూ.కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో మామిడితోటను కూడా అమ్మేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్లుగా ఉండాల్సిన అభివృద్ధి, సంక్షేమంలో ఒంటి కంటి చూపు ఇబ్బందికరమని ఆయనమ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇవ్వడంతో, అభివృద్ధికి నిధులు తేవడానికి నానా తిప్పలూ పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేయాలంటూ జైల్లో నిరాహార దీక్ష చేపట్టిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది. జైల్లో దళిత సంఘ నేతలు శ్రీనును కలిశారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘ నేతలు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ, జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. దీక్ష విరమింపజేయడానికి జైల్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, విశాఖ జైల్లో ఏదైనా ప్రాణహాని జరగొచ్చని, వెంటనే శ్రీనును తరలించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్ వేశారు.

గుజరాత్‌లో 11 వేల 111 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వానరసేనను రంగవల్లుల రూపంలో చిత్రించి సూరత్ మహిళలు రామునిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక కతర్గాం కమ్యునిటీ హాల్‌లో కనులవిందు చేసే ఈ ముగ్గును వేశారు. ఈ కార్యక్రమంలో కలర్పన్ ఆర్ట్ సమూహానికి చెందిన సుమారు 40 మంది మహిళలు పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ముగ్గు వేయడానికి 14 వందల కిలోల రంగులను వినియోగించినట్లు చెప్పారు. 40 మంది మహిళల 15 గంటల నిరంతర శ్రమ ఫలితమే ఈ అద్భుతమైన ముగ్గని వారు తెలిపారు.

చూపరులను మంత్రముగ్ధుల్ని చేసే ఈ రంగవల్లిని రూపొందించడంలో ఎటువంటి పరికరాలను ఉపయోగించలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే, జౌళిశాఖ సహాయక మంత్రి దర్శన జర్దోష్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆమె కూడా రంగులను అద్దారు. ప్రస్తుతం సూరత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. కళారంగంలో సైతం సూరత్ అగ్రగామిగా నిలిచినట్లు సందేశం పంపినట్లైందని వెల్లడించారు.

అయోధ్య రామ మందిరం ప్రారంభంకానున్న వేళ ప్రపంచవ్యాప్తంగాను సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలో భారతీయులు ఇప్పటికే భారీ కార్ల ర్యాలీ నిర్వహించగా, యూకే, ఆస్ట్రేలియాల్లోనూ జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. యూకేలో భక్తులకు పంచేందుకు పెద్ద ఎత్తున లడ్డూలు తయారు చేశారు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని మేరీల్యాండ్‌లో 150 కార్లతో రామ భక్తులు ర్యాలీ నిర్వహించగా తాజాగా యూకే, ఆస్ట్రేలియాల్లోనూ వైభవంగా వేడకులు జరుపుకున్నారు. లండన్‌లో 300లకుపైగా కార్లతో చేపట్టిన ర్యాలీ ఆకట్టుకుంది. పలువురు యువతీ, యువకులు డోలు వాయిస్తూ..రామనామం జపించారు. తొలుత గణపతి పూజ చేసిన నిర్వాహకులు అనంతరం రాముడి జెండాలను చేతపట్టి దేవుడి చిత్రపటాలతో కార్ల ప్రదర్శన చేశారు.

అయోధ్య నుంచి యూకేలోని ప్రవాస భారతీయుల కోసం అక్షింతలు, కలశాలు వచ్చాయని ఓ పూజారి తెలిపారు.ఆ అక్షింతలను భక్తులను పంచిపెడుతున్నట్టు చెప్పారు. ప్రాణప్రతిష్ఠ వేళ యూకేలో ప్రత్యేకంగా లడ్డూలు తయారు చేయించారు. వాటిని భక్తులకు ప్రసాదంగా ఇవ్వనున్నారు. రాముడిపై భక్తిని చాటి చెప్పుతూ ఓ మహిళ పాడిన పాట ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనూ రామ భక్తులు 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

చంద్రబాబు "రా...కదలిరా" సభ కోసం అరకు వెళ్లాల్సిన హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్య, రూట్ సమస్య ఏర్పడడం కొంతసేపు కలవరం కలిగించింది. 12 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్యతో అరగంట సేపు రన్ వే పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ATC నుంచి అందుకున్న సిగ్నల్‌ను పైలెట్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల గాల్లోకి వెళ్లిన తర్వాత అరకు రూట్ కాకుండా వేరే రూట్లో పయనం సాగించింది. దీనిని గుర్తించిన ATC సిబ్బంది తిరిగి విమానాశ్రయానికి రావాల్సిందిగా సిగ్నల్స్ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాటు గాల్లోనే హెలీకాప్టర్ ఉండిపోవాల్సి వచ్చింది.

తర్వాత విశాఖ విమానాశ్రయంలో ఇంధనాన్ని నింపుకుని ఒంటి గంట 20నిమిషాలకు తిరిగి అరకు బయలు దేరింది. వాస్తవంగా 12గంటల 5 నిమిషాలకు బయలుదేరాల్సిన హెలీకాప్టర్..... దాదాపు గంటా 15 నిమిషాలకు పైగా అలస్యంగా బయలుదేరింది. వీఐపీ హెలీకాప్టర్ ఈ రకంగా సమస్య ఎదురుకావడంతో D.G.C.A. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విశాఖ నుంచి అరకు ఆ తర్వాత మండపేట వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ హెలీకాప్టర్‌లో తొలుత సాంకేతిక సమస్య, తర్వాత రాంగ్ రూట్ పట్టడం, అపై ఇంధన సమస్య ఎదురు కావడంతో అధికార్లు, పార్టీ శ్రేణులు కలవరపాటునకు గురయ్యాయి.

సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్‌లోని రామా ఫంక్షన్‌హాలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం రాత్రి బలవంతంగా భగ్నం చేశారు. శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజుతో పాటు కుటుంబసభ్యులను తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్దసంఖ్యలో శిబిరం దగ్గరకు వచ్చారు. దీక్ష విరమించాలని ఆమెను కోరారు.

జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితేనే తాను దీక్ష విరమిస్తానని సావిత్రమ్మ తేల్చిచెప్పారు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు భారీగా శిబిరం వద్ద మోహరించారు. దీక్ష చేస్తున్నవారిని తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా సమతా సైనిక్‌దళ్ సభ్యులు, ఇతర మద్దతుదారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల నడుమ వారిని అత్యవసర వాహనంలో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సమతా సైనిక్‌దళ్ నాయకులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక కార్యకర్త పెట్రోల్ సీసా తీసుకుని, ఆత్మాహుతికి యత్నించగా.. పోలీసులు అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు.

కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని చిన్న పేటకు చెందిన అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం 39 రోజులుగా నిరసన చేస్తున్నారు. చిన్న పేటకు చెందిన పి.శాంతికుమారి అంగన్వాడీ టీచర్..... కొత్తపేట నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే శాంతికుమారి ఛాతినొప్పితో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ప్రభుత్వం ఉద్యోగాలు తీసివేస్తామని చెప్పటంతో... టెన్షన్ పట్టుకుని శాంతి కుమారి గుండెపోటుతో మృతి చెందిందని తోటి అంగన్వాడి కార్యకర్తలు వాపోయారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం వేదికగా వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల తన అన్న వైఎస్ జగన్, వదిన భారతీలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరూ జగన్‌ను పట్టించుకోలేదు. ఫోటో దిగేందుకు రావాలని జగన్ పిలిచినా షర్మిల, అనిల్ రాలేదుదాంతో బొకే ఇచ్చి నిమిషంలోనే ముఖ్యమంత్రి దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. వరుడు వైఎస్ రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియలకు సీఎం జగన్ దంపతులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. సీఎం జగన్ దంపతుల వెంట వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు రావాలంటూ నిందితుడు శ్రీనివాస్ ఆమరణ దీక్షకు దిగారు. విశాఖ జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి, సోదరుడు కూడా వాళ్ల ఇంట్లో నిరశనకు దిగారు. దళిత సంఘాల నేతలు, మాజీ ఎంపీ హర్షకుమార్ సైతం శ్రీనుకు సంఘీభావం తెలిపారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి సావిత్రి, సోదరడు సుబ్బరాజు విజయవాడలోని వారి నివాసంలో దీక్షకు పూనుకున్నారు. విజయవాడలో దీక్షకు పోలీసులను అనుమతి కోరగా... ఇవ్వలేదని …. అందుకే ఇంట్లోనే దీక్ష చేపట్టామన్నారు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ... తన కొడుకుకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని శ్రీను తల్లి సావిత్రి స్పష్టం చేశారు.

శ్రీను దీక్షకు విశాఖ దళిత సంఘం నేతలు ప్రకటించారు. శ్రీనుతో దళిత సంఘాల ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు వెంకట్రావు జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం దళిత సంఘం నేతలు జైలు బయట ఆందోళన నిర్వహించారు. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్ శ్రీనుకు సంఘీభావం తెలుపుతూ రాజమహేంద్రవరంలోని తన ఇంట్లో దీక్ష చేపట్టారు. శ్రీనుని ఐదేళ్ల పాటు జైల్లో పెట్టడం దుర్మర్గమని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం వద్ద కేసు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్.. ఈరోజు బెంచ్ కూర్చోవడం లేదని తెలిపారు. విచారణకు మరో తేదీ ఇస్తామని వెల్లడించారు. ఫైబర్ నెట్ కేసులోని అంశాలు 17-ఏ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం సెక్షన్ 17-ఏపై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


