చిట్టి న్యూస్

హైదరాబాద్‌ ఈఎస్ఐ స్కామ్‌లో ఈడీ ఛార్జ్ షీట్

హైదరాబాద్‌ ఈఎస్ఐ స్కామ్‌లో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈఎస్‌ఐలో 211 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్ధారించింది. మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు 11 మందిపై అభియోగాలు మోపింది. మెడికల్ పరికరాల కొనుగోలు పేరుతో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. దేవికారాణి హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని.. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో నగలు, నగదు తీసుకున్నట్లు అభియోగం మోపింది. ఈ స్కాంలో దేవికారాణితో పాటు ఏడుగురు ఉద్యోగుల పాత్రను ఈడీ ప్రస్తావించింది. 

CM Stalin: స్కూల్‌ విద్యార్థుల కోసం అల్పాహార పథకం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి ఈ తరహా పథకాన్ని సీఎం స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 31వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 17లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందుతారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆకలి బాధలు లేకుండా చిన్నారులు పాఠశాలకు వెళ్లడం, పిల్లలు పోషకార లోపంతో బాధపడకుండా చూడటం, రక్త హీనత వంటి సమస్యల్ని విద్యార్థులు అధిగమించడం లక్ష్యాలు పేర్కొన్నారు.

CM Jagan: నాలుగు కిలోమీటర్లకు రెండు హెలిప్యాడ్లు

విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటనలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల దూరానికే రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన కోసం వస్తున్న జగన్ కోసం.. మెంటాడ మండలం చిన మేడపల్లి వద్ద ఒక హెలిప్యాడ్‌ను… 4 కిలో మీటర్ల దూరంలోని దత్తి రాజేరు మండలంలో మరొక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కేవలం 4 కిలో మీటర్ల దూరానికే రెండు హెలీప్యాడ్లతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

కొందరు పోలీసులు ఖాకీ చొక్కాలు తీసి వైసీపీ చొక్కా కప్పుకున్నారు

కొందరు పోలీసులు ఖాకీ చొక్కా తీసి వైసీపీ చొక్కా కప్పుకున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించారని మండిపడ్డారు.మేము వీరవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని,ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన ఫిర్యాదుపై ఆఘమేఘాలపై స్పందించి టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని విమర్శించిరు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీస్ అధికారుల పేర్లు రెడ్ బుక్ లో లోకేష్ రాసుకుంటున్నారని... అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Manyam District: మృతదేహాన్ని బైక్‌పై 35 కి.మీ తరలింపు

పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయ విధారక ఘటన జరిగింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు వైద్య సిబ్బంది నిరాకరించింది. దీంతో కుటుంబసభ్యులు డెడ్‌ బాడీని 35 కి.మీ మేర ఒడిషా సరిహద్దు నుంచి ఏపీలోని సాలూరు వరకు బైక్‌పై తరలించారు. సాలూరు మండలం ఎగువ గంజాయి భద్ర గ్రామానికి చెందిన గమ్మిలి విశ్వనాధ్ ఒడిషాలోని పొట్టంగి తాసిల్దార్ కార్యాలయానికి కుల ధృవీకరణ పత్రం కోసం వెళ్లాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా కుందిలి గ్రామం వద్ద వ్యాన్ ఢీకొనడంతో మృతి చెందాడు.

నిర్మల్‌ జిల్లాలో రోడ్డుపైనే మహిళ ప్రసవం

ఆదివాసీ మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన నిర్మల్‌ జిల్లా తులసిపేట దగ్గర చోటుచేసుకుంది. గర్బిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు గ్రామస్తుల యత్నించారు. వాగు దాటించి అంబులెన్స్‌ కోసం ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్‌లో డీజిల్‌ లేదని సిబ్బంది చెప్పడంతో.. అంబులెన్స్‌ డ్రైవర్‌కు గర్బిణీ భర్త 5,00 రూపాయలు పంపాడు. అయినా అంబులెన్స్‌ రాకపోవడంతో నాలుగు గంటలపాటు గర్బిణీ నరకయాతన అనుభవించింది. చివరికి రోడ్డుపైనే ప్రసవించింది. 

69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగోడి సత్తా

69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌కు బెస్ట్‌ హీరో అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా అలియా భట్‌,  ఉత్తమ స్టంట్‌ కొరియో గ్రాఫర్‌గా కింగ్‌ సాల్మన్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్‌గా శ్రీనివాస మోహన్‌, ఉత్తమ గాయకుడు కాలభైరవ, ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి, ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌, బెస్ట్‌ ఫిల్మ్‌క్రిటిక్‌ అవార్డ్‌ పురుషోత్తమాచార్యులు. 

DSC: 6,500 టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం: మంత్రి సబిత

టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో 6వేల500 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.విధివిధానాలు రెండు రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు.గురుకులాల్లో ఇప్పటికే 12 వేల పోస్టులు భర్తీ జరిగిందని తెలిపారు.  అత్యదికంగా విద్యాశాఖలోనే ఎక్కవమందిని రెగ్యూలరైజ్‌ చేశామని మంత్రి తెలిపారు. 3 వేల149 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మంత్రి టీచర్ల ప్రమోషన్ ప్రాసెస్ మొదలు పెట్టామని తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ 27న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. 

నారా లోకేష్‌తో వంగవీటి రాధ ఏకాంత సమావేశం

నారా లోకేష్‌తో వంగవీటి రాధ ప్రత్యేక సమావేశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో లోకేష్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర విరామ సమయంలో లోకేష్‌ను కలిశారు వంగవీటి రాధ.. దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఇటీవల యువగళం పాదయాత్రలో వరుసగా పాల్గొన్నారు వంగవీటి రాధ.. అయితే లోకేష్‌, వంగవీటి రాధా భేటీపై రాజకీయాల్లో చర్చ మొదలైంది.

Vishaka: చిక్కుముడి వీడని విద్యార్ధిని రీతు మృతి  కేసు

విశాఖలో విద్యార్థి రీతు మృతి కేసును పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. సీసీ ఫుటేజ్‌ను సీపీ త్రివిక్రమ వర్మ విడుదల చేశారు. రీతూ ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్‌కు ప్రిపేర్‌ అవుతుందన్నారు. 14న భవనం పైకి వెళ్లి దూకడంతో గాయపడిందని హాస్టల్‌ సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించారని.. 16న మృతి చెందిందని వెల్లడించారు. హత్య కోణంలో ఆధారాలు లభించలేదన్నారు. తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారని అన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ స్పష్టం చేసింది తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపింది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. ఇక కృష్ణమోహన్ రెడ్డికి 3లక్షల జరిమానా విధిస్తూ ఉతర్వులు జారీ చేసింది.

మంత్రులు, ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి బీజేపీ పిలుపు

నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ఇచ్చిన పిలుపుతో మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల ముట్టడికి కార్యకర్తలు యత్నించారు.. ఇందులో భాగంగా మహమూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసును ముట్టడించి బైఠాయించారు. పోలీసులు చేరుకుని బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

మంత్రి బుగ్గనకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సవాల్‌

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సవాల్‌ విసిరారు..కర్నూలులో హైకోర్టు ఏ రోజు ఏర్పాటు చేస్తారో చెప్పాలన్నారు.. జ్యుడిషల్‌ కేపిటల్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం  ప్రజలను మభ్యపెడుతోందని కోట్ల విమర్శించారు. ఇరిగేషన్‌పై మంత్రి బుగ్గన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటుధర దక్కకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మంత్రులకు కనపడటం లేదా అని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఇసుక, మద్యం, మైనింగ్‌లో దోచుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో డబ్బు పంపణీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా

హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఓ ఆటో బోల్తా పడింది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో అకస్మాత్తుగా పల్టీ కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్‌ చూస్తూ ఆటో నడుపుతూ.. ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించలేదు. దీంతో ద్విచక్ర వాహనానికి సమీపించగానే ఢీ కొడుతుందనే భయంతో ఆటోను కుడివైపుకు తిప్పాడు. దీంతో అదుపు తప్పిన ఆటో పల్టీ కొట్టింది. ఈ నెల 22న జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

భద్రాచలంలో బీసీల ఆర్థికసాయం కార్యక్రమంలో రభస

భద్రాచలంలో బీసీల ఆర్థికసాయం కార్యక్రమంలో రభస చోటుచేసుకుంది. తనను సంప్రదించకుండా లబ్దిదారుల్ని ఎలా ఎంపిక చేశారంటూ బీసీ సంక్షేమ అధికారిని ప్రశించారు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. అంతేకాదు.. వేదికపై రేగా కాంతారావుని మాట్లాడనీయకుండా అడ్డగించారు. కాంతారావు చేతిలోని మైక్‌ను లాక్కున్నారు. దీంతో అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

ఏపీలో ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు

ఏపీలో ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బల్క్‌గా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు రావడంతో.. వెరిఫికేషన్, నిర్ధారణ వంటి అంశాల్లో నిబంధనలను సూచించింది. 2020వ సంవత్సరం.. ఒకటో నెల.. 6వ తేదీ నుంచి ఇప్పటివరకు జరిగిన ఓట్ల తొలగింపును చెక్‌ చేయాలంది. డెత్‌, షిఫ్టింగ్‌ సహా పలు కారణాలతో తొలగించిన ఓట్లపై పునపరిశీలన జరపాలంది. ఓట్ల తొలగింపుపై జిల్లా స్థాయ అధికారుల తోపాటు, కలెక్టర్‌ ద్వారా వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. 

బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో బీసీలకు స్ధానం ఎక్కడ? : కాసాని

బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో బీసీలకు స్ధానం ఎక్కడ ఉందని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. ఆ పార్టీలోని బీసీలు, ముదిరాజులు బయటికి రావాలని పిలుపు నిచ్చారు. టీడీపీ 60 సీట్ల వరకు బీసీలను ప్రకటించబోతుందని తెలిపారు. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అభ్యర్ధుల ప్రకటన అనంతరం బస్సు యాత్ర నిర్వహిస్తామంటున్న కాసాని జ్ఞానేశ్వర్‌. 

విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన

విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మున్సిపల్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యల సాధన కోసం చలో విజయవాడకు వెళ్లే కార్మికులను పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు దిగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు సీఐటీయూ నాయకులు.  

Andhra Pradesh: టీడీపీ పోరాటం ఫలించింది: పయ్యావుల

కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ బీజేపీ శ్రేణులు మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం నుంచి బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. పోలీసుల కళ్లుగప్పి బయటకి వచ్చిన బీజేపీ నేతలు మంత్రి ఇంటి గేటు దూకి లోపలకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

జీహెచ్ఎంసీ ఔట్‌ సోర్సింగ్,కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు

జీహెచ్ఎంసీ ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు గత ఏడు రోజులుగా కొనసాగుతున్నాయి. సర్కిల్స్‌,జోనల్‌ కార్యాలయాల గేట్లకు..తాళం వేయడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. 2014లో తమను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.

TDP: విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు:సుమన్

విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ప్రముఖ సినీనటుడు సుమన్. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబేనన్న ఆయన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని అన్నారు. రజినీకాంత్‌ను టార్గెట్ చేసి మాట్లాడడం బాధ కలిగించిందన్నారు.రాజకీయాలతో సంబంధం లేని రజినీకాంత్ పై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు.సినీ పరిశ్రమలోని వారు పకోడి గాళ్ళు కాదని అలా విమర్శించిన వాళ్ళే బజ్జీగాళ్ళని విమర్శించారు. 

హైదరాబాద్ మియాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ మియాపూర్‌లో కాల్పులు సంచలనం రేపాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్‌ రెస్టారెంట్లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ గాయన్‌ పై రాత్రి రిత్విక్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దేశవాళీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దేవేందర్‌కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని అనుమానిస్తున్నారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పొద్దున ఒక పార్టీ.. మధ్యాహ్నం మరో పార్టీలో ఉండే నాయకుల గురించి మాట్లాడనని అన్నారు. ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి వెళ్దామని చూసే వ్యక్తులు.. ఆ అన్నదమ్ములు అని ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్‌కి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్‌బై

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. తనను చంపేందుకు కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఎన్నో బాధలు భరించానన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై చేసిన వ్యాఖ్యలను తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. నకిరేకల్ అభివృద్ధిపై చిరుమర్తి బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్‌ విసి రారు. తమ పార్టీల్లో చేరమని కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవమేనన్నారు వేముల వీరేశం. అనుచరులు, కార్యకర్తల ఇష్టం మేరకే పార్టీ మార్పు అని వెల్లడించారు.  

మెదక్ జిల్లా బీఆర్ఎస్‌లో ఆగని టికెట్ల పంచాయితీ

మెదక్‌ జిల్లా బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయితీ ఆగడం లేదు. హైదరాబాద్‌లోని మంత్రి హరీష్‌ రావు ఇంటికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్యూ కట్టారు. నర్సాపూర్‌ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. హరీష్ రావు ఇంటి ఎదుట మదన్‌ రెడ్డి బలప్రదర్శనకు దిగారు. ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. 

సర్కారీ స్కూళ్లలో జగన్‌ నామస్మరణ, ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలి నిర్వాకం

జగన్‌ సర్కార్‌ పబ్లిసిటీ గుడిని, బడిని కూడా వదటం లేదన్న విమర్శలు పెద్దెత్తున వస్తున్నాయి. చివరికి సర్కారీ స్కూళ్లలో జగన్‌ నామస్మరణ చేయిస్తున్నారు.స్వామి భక్తి చాటుకుంటున్నారు ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు దేవి.గవర్నమెంట్‌ అంటే ఎవరు అంటే జగన్ మామ అంటూ గుంటూరు జిల్లా తెనాలి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్ధినిలతో వల్లె వేయించారు. పిల్లలు చిన్నగా అంటే తనకు వినిపించలేదని చెప్పి మరీ గట్టిగా చెప్పించారు. అయితే ఈ చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సర్కారీ స్కూళ్లలో డ్రామాలేంటని మండిపడుతున్నారు పేరంట్స్.

లోకేష్‌ పాదయాత్రకు నోటీసుల పేరుతో సర్కార్‌ అడ్డంకులు

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాభిమానం తట్టుకోలేకే ప్రభుత్వం పాదయాత్రకు నోటీసులపేరుతో హడావిడి చేస్తుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. బహిరంగ సభల్లో వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే పోలీసులు వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. నిన్న పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదనిఅన్నారు. రోజురోజుకీ పాదయాత్రకి ప్రజాభిమానం పెరుగుతుంటే తట్టుకోలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు.

Telangana: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ

నేడు తెలంగాణ కేబినెట్‌ విస్తరణ జరగనుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్‌ రాజీనామాతో కేబినెట్‌లో ఖాళీ అయిన స్థానాన్ని పట్నం మహేందర్‌ రెడ్డితో భర్తీ చేయనున్నారు. మహేందర్‌రెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి నష్టం కలగకుండా.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్నం ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణం చేయనున్నారు మహేందర్‌రెడ్డి. 

కేసీఆర్‌ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ కకావికలం అయ్యాయి- జగదీష్‌రెడ్డి

కేసీఆర్‌ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ కకావికలం అయ్యాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు దిక్కుతోచడంలేదన్నారు. తమ అధినేత నిర్ణయంపై అందరికి పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన.. బీఆర్ఎస్‌లో క్రమశిక్షణ గల నేతలు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అందరూ పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తారని చెప్పారు. కేసీఆర్‌ను వదులుకుంటే మళ్లీ కష్టాలు తప్పవని తెలిపారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. పోటీ పడి రాహుల్ గాంధీ, మోదీ అనుచరులు అసంతృప్తుల కోసం కాగడా పట్టి వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. 119 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరన్నారు. 

అతిసూక్ష్మంగా విక్రమ్‌ ల్యాండర్‌ కళాఖండం తయారు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా నల్లమల ప్రాంతం అ్రమాబాద్‌కు చెందిన కపిలవాయి గోపికృష్ణచారి.. అతి సూక్ష్మంగా విక్రమ్‌ ల్యాండర్‌ కళాఖండాన్ని తయారు చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. 450 మిల్లీ గ్రాముల బంగారంతో బియ్యం గింజ సైజులో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లను తయారు చేశాడు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం- తలసాని

సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి తలసాని. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలో BC కులవృత్తిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆర్ధిక సహాయ ప్రక్రియ చేపట్టారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కులవృత్తులను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.

అర్ధాంతరంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. దీంతో మేయర్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు భగ్గుమన్నారు. మేయర్‌ ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. SRDP రెండో దశ, మున్సిపల్‌ కార్మికులను పర్మెంట్‌ చేయాలని.. జీహెచ్‌ఎంసీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన కాంట్రాక్ట్‌ ANMలు

చలో హైదరాబాద్‌కు కాంట్రాక్ట్‌ ANMలు పిలుపునిచ్చారు. 9రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్‌ ANMలు.. ప్రభుత్వం ఇచ్చిన పరీక్ష షెడ్యూల్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. VRA, ఆర్టీసీ కార్మికులను పర్మినెంట్ చేసినట్లుగానే తమను పర్మినెంట్ చేయాలంటుని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tirumala: ఘాట్ రోడ్డులో ప్రమాదం; పిట్టగోడను ఢీకొట్టిన టాటా సుమో వాహనం

తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. పిట్టగోడను టాటా సుమో వాహనం ఢీకొట్టింది. 32వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ బెంగుళూరుకు చెందిన నలుగురు భక్తులను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు

మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన నేపథ్యంలో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలతో మెదక్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించారు. అటు.. సీఎం పర్యటనకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. బైక్‌ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి దిగారు. తోపులాట కూడా చోటు చేసుకుంది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల తంటాలు పడుతున్నారు. 

Mizoram Bridge Collapse: మిజోరామ్ లో  కుప్పకూలిన వంతెన, 17 మంది మృతి

మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉండగా రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. శిథిలాల నుంచి 17 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిజోరంలో రైల్వే వంతెన దుర్ఘటనపై ఆరాష్ట్ర సీఎం దిగ్ర్భాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.