చిట్టి న్యూస్

సత్యసాయి జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు

సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. గోరంట్ల మండలం వెంకటరమణపల్లెలో టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఎరువులదిబ్బ స్థల వివాదంలో టీడీపీ కార్యకర్తలపై.. వైసీపీ నేత చౌడే రెడ్డి వర్గీయులు దాడికి దిగారు. గత నెలలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా.. వైసీపీ వర్గీయులు వెనక్కి తగ్గలేదు. ఎరువులదిబ్బ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ నేత చౌడి రెడ్డి వర్గీయులు ప్రయత్నించారు. 

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. చిల్లకూరు మండలం కలవకొండ వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ తవ్వకాలను అడ్డుకున్న ఓ వ్యక్తిపై.. గ్రావెల్ మాఫియా దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. దీంతో గ్రావెల్ తవ్వకాల వద్దకు.. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకుని లారీల్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. అధికారుల అండతో మాఫియా బరితెగిస్తోందంటున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భారీ యంత్రాలతో పాటు లారీలను స్వాధీనం చేసుకున్నారు.  

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది.మియాపూర్‌ పీఎస్‌ పరిధిలోని వసంత విల్లాస్‌లో చోరీచేసి బంగారం ఎత్తుకెళ్లారు. తాళం వేసిన విల్లాలపై కన్నేసిన చెడ్డీ గ్యాంగ్‌ పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడింది. రెండు రోజుల క్రితం ఘటనలు జరిగినా విషయాన్ని గోప్యంగా ఉంచారు పోలీసులు. చోరీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు.చెడ్డీ గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు. దాదాపు 30తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.  

కెమెరా, ప్రింటర్ల దిగుమతులపై ఆంక్షలకు ఛాన్స్‌

దేశీయంగా తయారు చేసుకునే వీలు ఉన్న వస్తువుల దిగుమతులను కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్‌ వస్తువులను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తూనే... వీటి దిగుమతిపై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. లాప్‌ట్యాప్‌లతోపాటు పీసీల దిగుమతిపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం...ఇప్పుడు ఇతర వస్తువులపై కూడా దృష్టి పెట్టింది.జనం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

కానిస్టేబుల్ రాధమ్మపై వైసీపీ నేతల ఒత్తిళ్లు

అనంతపురం సెబ్ పోలీసులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. వైసీపీ నేతలు తీవ్ర ఒత్తిళ్లు పెట్టడంతో.. కేసు విత్‌ డ్రాకు కానిస్టేబుల్‌ రాధమ్మ సిద్దమైంది. ఇందుకోసం ఆమెతో పాటు భర్త.....అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ వచ్చారు. అయితే... ఇప్పటికే వైసీపీ నేతల దాడిపై ఎఫ్ఐఆర్‌ నమోదు అయింది. దీంతో.... కేసు విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేదన్నారు టూటౌన్ సీఐ. లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకోవాలని సూచించారు పోలీసులు.

విశాఖలో రెండో రోజు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర

విశాఖలో రెండో రోజు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన నేపధ్యంలో ఆ ప్రాంతాలను సందర్శించునున్నారు. టూరిజం డెవలప్‌మెంట్‌ అంటూ సర్కార్‌ అసత్య ప్రచారం చేసిందని..అయితే అది సీఎం క్యాంపు ఆఫీస్ కోసమేనని ప్రతిపక్షాలు ముందే చెప్పాయి.తాజాగా సీఎం భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలించడంతో సర్కార్ ఇప్పుడేం సమాధానం చెపుతాయని అంటున్నాయి ప్రతిపక్షాలు. విశాఖ స్టీల్ ప్లాంట్‌, రైల్వేజోన్‌ అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తారు. 

181వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టితో... పాదయాత్ర 181వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 2410 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో.. పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు క్రోసూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. క్రోసూరూ నాలుగు రోడ్ల జంక్షన్‌లో స్థానికులతో సమావేశమవుతారు లోకేష్. ఆ తర్వాత.. క్రోసూరు - అందకూరు రోడ్డులో బహిరంగ సభలో... లోకేష్ ప్రసంగిస్తారు. 

కాణిపాకం వరసిద్ది వినాయకుడికి వెండి కిరీటం బహుకరణ

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారికి యూకే, యూరప్ టీడీపీ ఫోరం అధ్యక్షుడు శ్యామసుందర్ నాయుడు సుమారు మూడు కిలోల వెండి కిరీటాన్ని బహుకరించారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలు అందించి.. పండితులు వేదాశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో, స్ధానిక తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అభివృద్ధి జరగలేదనే వారికి ఆదాయ పన్ను వేయాలి: బుగ్గన

కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి బుగ్గన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ ప్రశ్నించే వారికి ఆదాయ పన్ను వేయాలన్నారు. ఇలా పన్ను వేస్తే అలా మాట్లాడరంటూ వ్యాఖ్యానించారు. కొందరు ఊరికే రావడం మైక్ పట్టుకొని అభివృద్ధిపై మాట్లాడడం... ఇదే సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం ధనికం కాదని.. అయినా ఇతర రాష్ట్రాల కన్నా... పేదవాడిని చక్కగా కాపాడుకుంటున్నామని చెప్పు కొచ్చారు.

crime: హత్యకు ముందు ఐదు లీటర్ల డీజిల్ తీసుకున్న నిందితులు

శంషాబాద్‌ మహిళ దారుణ హత్య కేసులో.... కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు... నిందితులు.. ఐదు లీటర్ల డీజీల్ కొన్నట్లు తెలుస్తోంది. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులు బైక్‌ పై వచ్చి... డీజిల్‌ కొన్నట్లు పెట్రోలు బంక్ సిబ్బంది తెలిపారు. కారు ఆగిపోయిందని, అందులో మహిళలు ఉన్నారంటూ డీజిల్ ఇవ్వాలంటూ అడగడంతో.. ఐదు లీటర్ల క్యాన్‌లో డీజిల్ పోసినట్లు పెట్రోలు సిబ్బంది తెలిపారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడెక్కిన విద్యార్ధినులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్ధినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కాటారం మండలం దామరకుంటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తమను ప్రిన్సిపాల్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

వైసీపీ నేతలు ఇసుక తవ్వి తరలిస్తున్న లారీల వద్ద లోకేష్‌ సెల్ఫీ

బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియా ఆగడాలు ఉన్నాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. రాష్ట్రంలో వైసిపి ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసిపి నేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీల వద్ద లోకేష్‌ సెల్ఫీ దిగారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ఆదేశాలను బేఖాతరు చేస్తూ... వైసిపి మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయని ఆరోపించారు. జగన్‌ పాలనలో రాజ్యంగం, చట్టాలకు విలువలేదు.. తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, టార్గెట్ పూర్తిచేయడమే అంటూ ధ్వజమెత్తారు. 

ఉత్తరాంధ్రపై జగన్‌ కపట ప్రేమ

ఉత్తరాంధ్రపై జగన్‌ కపట ప్రేమ చూపుతున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు. తారక రామ తీర సాగరం ప్రాజెక్టు 41 శాతం పనులు పూర్తయితే... పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో హరికథలు చెప్పే మంత్రులు ఉన్నారు కానీ... తోటపల్లి ప్రాజెక్టును పట్టించుకోరని విమర్శించారు. నాగావళి వంశధార నదుల అనుసంధానం పనులకు నిధులు కేటాయించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు.   

మెదక్‌ నుంచే BRSపై యుద్ధం : ఈటల

కేసీఆర్‌ జూటా మాటలు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణలో సంపదకు కొదలేదన్నారు... అయితే సంపద ఎటుపోయిందో కేసీఆర్‌ చెప్పాలన్నారు.  మెదక్‌ రాందాస్‌ చౌరస్తాలో...డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం చేసిన ధర్నా, ర్యాలీలో....ఆయన పాల్గొన్నారు. మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలు పెడుతున్నట్టు ఈటల ప్రకటించారు. మూడు లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసి.... కేవలం లక్ష మాత్రమే నిర్మించారని అన్నారు. నిజాంపేట్‌ జెడ్పీటీసీ విజయ్‌కుమార్‌ ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. 

వంశధార ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా హీర మండలంలోని వంశధార ప్రాజెక్ట్‌ను చంద్రబాబు పరిశీలించారు. జిల్లా టీడీపీ నాయకులతో కలిసి వంశాధార- నాగావళి హైలెవల్‌ కాలువను పరిశీలించారు. టీడీపీ హయాంలో చేపట్టి పనులు.... వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపడుతున్న పనుల తీరును పరిశీలించారు. కొత్తూరు మండలం గూనభద్రలో ప్రాజెక్ట్‌ నిర్వాసితులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.  

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌పై దాడి

ఏపీ వైసీపీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిడిగల్లు సబ్ స్టేషన్ ఆపరేటర్ బెల్లంకొండ శ్రీనివాసులు పై నిడిగల్లు వైసీపీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు రెడ్డి దాడికి పాల్పడ్డాడు. పై అధికారుల ఆదేశాలతో ఆపరేటర్ శ్రీనివాసులు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. నా గ్రామంలో కరెంటు ఆపుతావా అంటూ మద్యం మత్తులో ఆపరేటర్ శ్రీనివాసులపై దాడి చేశాడు. అనంతరం సబ్ స్టేషన్‌కు తాళాలు వేశాడు.

గృహలక్ష్మి పథకం.. మరింత సమయం ఇవ్వాలంటున్న ప్రజలు

సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రజలకు సూచించింది. అయితే... ఈ పథకం దరఖాస్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇవాళే చివరి రోజు కావడంతో.. మరింత సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.   

హైదరాబాద్‌లో టికెట్ల కోసం కాంగ్రెస్‌ నేతల సిగపట్లు

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ టికెట్‌పై కన్నేసిన అజారుద్దీన్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా..ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయన్ని అడ్డుకున్నారు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు. మరోవైపు ముషీరాబాద్‌లో అంజన్‌కుమార్‌ వర్సెస్‌ సంగిశెట్టి జగదీశ్వరరావు అన్నట్లు ఉంది పరిస్ధితి. ఈసారి టికెట్‌ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు సంగిశెట్టి. అటు సనత్‌నగర్‌ టికెట్‌ రేసులో మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఉండగా సనత్‌నగర్‌ టికెట్‌ తనకే అంటున్నారు కోటా నీలిమ. గోషామహల్‌ టికెట్‌పైనా నేతల హోరాహోరీ ప్రచారాలు చేసుకుంటున్నారు.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై సర్కార్ మొండి వైఖరి

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఏపీ విద్యుత్తు ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆగస్టు 17వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్ట్రగుల్ కమిటీ నాయకులు హెచ్చరించారు.

గృహలక్ష్మి దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో

గృహలక్ష్మి దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియక ప్రజల అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గృహలక్ష్మి దరఖాస్తులు GHMC ఇవ్వాలని సర్కారు చెప్పింది. అయితే.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మాత్రం.... MRO ఆఫీస్ కు వెళ్ళాలంటు సలహాలు ఇస్తున్నారు. అక్కడనుంచి ఎమ్మార్వో ఆఫీసుకు వెళితే... అక్కడి రెవెన్యూ అధికారులు మాత్రం... జీహెచ్ఎంసీలో ఇవ్వాలంటూ చెబుతున్నారు. దీంతో... దరఖాస్తు పత్రాలు పట్టుకొని అటు GHMC, ఇటు MRO ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.

వైసీపీ అండతో పట్టపగలే కబేళాలకు గోవులు

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి సమీపంలో మూడు లారీల్లో కబేలాలకు తరలిస్తున్న ఆవులను ఏపీ హిందూ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతో పట్టపగలే విచ్చలవిడిగా కబేళాలకు తరలిస్తున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పారంటూ నోటీసులు

లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అపద్దాలు చెప్పారంటూ స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్‌ఎస్‌. దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారన్నారు. రూల్ 222 కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. నిన్న లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని ప్రకటించారు నిషికాంత్ దూబే. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని.. సభను తప్పుదోవ పట్టించడమేనంటూ నోటీసులో పేర్కొన్నారు నామా

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో పెరిగిన అసంతృప్తులు

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా హైకమాండ్‌కు డెడ్‌లైన్‌ పెడుతున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పార్టీ మారుతామంటూ సంకేతాలు పంపుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గులాబీబాస్‌ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల జాబితా సిద్ధం చేస్తున్నారు. పార్టీ వీడే నేతల ప్రభావం ఎంత ఉంటుందన్న అంశంపై సర్వేలు కూడా చేయిస్తున్నారట. మరోవైపు ఎంతమంది పార్టీ వీడితే.. అంతమందిని వేరే పార్టీల నుంచి చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను మంత్రులు, సీనియర్లకు అప్పగించారు. 

Hyderabad: ఛాయ్ విత్ అజర్ భాయ్ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్‌లో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ చిచ్చు కాక రేపుతోంది. బుధవారం చేపట్టిన ఛాయ్ విత్ అజర్ భాయ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు దాదాపు రెండు గంటల పాటు అజరద్దీన్‌ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేత భవానీశంకర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసేదాక వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చివరికి కార్యక్రమంలో పాల్గొనకుండానే అజరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్‌ మీద విష్ణువర్ధన్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. దీంతో అజరుద్దీన్‌ తీరుపై విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జూబ్లీహిల్స్‌లో అజరుద్దీన్ ఎలా పర్యటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై అజరుద్దీన్ కన్ను వేస్తే ఖబర్దార్ అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు హెచ్చరించారు.

టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌

టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌ నెలకొంది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వార్నింగ్‌ ఇచ్చారు. ఆందోళన ఆపేయకుంటే అరెస్ట్‌ చేస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అందర్నీ అరెస్ట్‌ చేస్తామని.. మిమ్మల్ని అరెస్ట్‌ చేయడం తమకు పెద్ద పనేం కాదన్నారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని కోదండరాం కోరితే గంట పర్మిషన్‌ ఇచ్చామని డీసీపీ తెలిపారు. మూడు గంటలుగా అభ్యర్ధులు ఆందోళన చేస్తున్నారు.

అయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఒకేసారి టీఎస్‌పీఎస్సీ ముట్టడికి వందల మంది అభ్యర్థులు వచ్చారు. టీఎస్‌పీఎస్సీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బైఠాయించారు. గ్రూప్‌ 2 పరీక్ష రెండు నెలలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేసేంతవరకు అక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్‌ 2 అభ్యర్థులకు మద్దతుగా అక్కడికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ అక్కడికి వచ్చారు. విద్యార్ధుల్ని అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్ కు తరలించారు పోలీసులు

అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతల ఆందోళన

అనంత సెబ్ సిబ్బందిపై వైసీపీ దాడి చేయడం సంచలనంగా మారింది. వైసీపీ దాడులను నిరసిస్తూ.. అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. సెబ్ సిబ్బందిపై దాడి చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు జనసేన, వామపక్షనేతలు. అనంతపురంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న విపక్షాలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తుంటే జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.  

కర్నూలు ఓల్డ్ సిటీలో ఎన్‌ఐఏ దాడులు

కర్నూలు ఓల్డ్ సిటీలో NIA దాడులు జరిగాయి. తెల్లవారుజామున అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిషేధిత PFI సంస్థతో లింకులు ఉన్న అనుమానితుల ఇళ్లపై దాడులు జరిపారు. అబ్దుల్ మావియా, అబ్దుల్లా ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్‌లో విచారిస్తున్నారు. గతంలో ఓల్డ్ సిటీలోనే PFI తో లింకులున్న అబ్దుల్ వారిష్‌ను NIA అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Vishakha: పవన్‌ వారాహియాత్రకు అడుగడుగునా ఆంక్షలు

విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ వారాహియాత్రకు అడుగడుగునా ఆంక్షలు విధించారు పోలీసులు.ఎయిర్‌పోర్టులోకి జనసేన నేతలకు అనుమతి నిరాకరించారు.స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.విశాఖ నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా..ఎయిర్‌పోర్ట్ నుంచి పోర్ట్‌ రోడ్‌లో వెళ్లాలని సూచించారు. అయితే పోలీసుల నిర్ణయంపై జనసైనికులు మండిపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ తాటి చెట్ల పాలెం మీదుగా..సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం తాము చెప్పిన రూట్ లోనే వెళ్ళాలని పట్టు పడుతుంటే కుదరదంటున్నారు జనసేన నాయకులు.  

నిజామాబాద్‌ ప్రజల్ని కేటీఆర్‌ మరోసారి మోసం చేశారు- ఎంపీ అర్వింద్

బీఆర్ఎస్‌ సర్కారుపై మండిపడ్డారు ఎంపీ అర్వింద్. మద్యం టెండర్లకు 15 రోజులు కేటాయించిన ప్రభుత్వం గృహలక్ష్మికి కేవలం 3 రోజుల కేటాయిస్తారా అంటూ మండిపడ్డారు. నిజామాబాద్‌ ప్రజల్ని కేటీఆర్‌ మరోసారి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. నిన్న కేటీఆర్‌ మోసపూరిత వాగ్దానాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకొడుకుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు అర్వింద్‌

Nizamabad: చదువుకున్న కళాశాలకు పునర్వైభవం; ప్రత్యేక భవన నిర్మాణం

పుట్టిన ఊరికి.. చదివిన బడికి ఏదో ఒక ఉపకారం చేయాలంటారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమకు తోచిన సహాయం చేస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు అందె ప్రతాప్ రెడ్డి. తాను చదువుకున్న కళాశాల కోసం రెండున్నర కోట్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు.

అందె ప్రతాప్ రెడ్డి... బాలాజీ ఏమైన్స్ లిమిటెడ్ అధినేత. ఒకప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చిన్న తనంలో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ పాఠశాల కళాశాలలో విద్యాబ్యాసం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీ లో 1969 లో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. 1989లో కెమికల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు. చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగిన ప్రతాప్ రెడ్డి సమాజానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించేవాడు. ఓ వైపు వ్యాపారంలో రాణిస్తూనే మరో వైపు సమాజ హితం కోసం దృష్టిసారించసాగారు. 2018 లో ప్రొడక్ట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు.

నిజామాబాద్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులతో ఏర్పడిన ఆలూమిని అసోసియేషన్ లోనూ అందె ప్రతాప్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. బాలాజీ ఏమైన్స్ CSR ఫండ్స్ ద్వారా ప్రత్యేక భవన నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. రెండున్నర కోట్ల వ్యయంతో కేవలం 6 నెలల్లోనే నార్త్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశారు. కేవలం బిల్డింగ్ మాత్రమే కాకుండా అందులో ఫర్నిచర్ కూడా సమకూర్చడం విశేషం. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేని సమయంలో సుమారు 2 వందల మంది విద్యార్థులకు ఈ భవనం ఎంతగానో ఉపయోగకరంగా మారింది. నార్త్ బ్లాక్ దాత ప్రతాప్ రెడ్డి ని పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అభినందిస్తు న్నారు. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించారు. తాను చదివిన ఈ కాలేజి కొత్త భవనం నిర్మించి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతాప్ రెడ్డి.

కాలేజి కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతాప్ రెడ్డి సహకారం మారువలేనిదని తోటి పూర్వ విద్యార్థులు, కాలేజి నిర్వాహకులు చెప్తున్నారు. పేద విద్యార్థుల చదువు ప్రతాప్ రెడ్డి తోడ్పాటు ఇస్తున్నారని వారు తెలిపారు.

AP: జగన్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు దిగింది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారంటూ మండిపడుతున్న బీజేపీ నేతలు... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అటు విజయవాడ ధర్నా చౌక్‌కు భారీగా పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు చేరుకున్నారు. బీజేపీ నేతలతో పాటు సర్పంచ్ సైతం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ ల వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధర్నా చేస్తున్నారు. 

శిలాఫలకం నిర్మించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం


మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని 9వ వార్డులో రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న దోబీ ఘాట్ పనుల శంకుస్థాపనకు వచ్చారు. అక్కడి సీన్ చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు. శిలాఫలకం నిర్మించకపోవడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం లేకుండా శంకుస్ధాపన ఏంటి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీమంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో శిరివెళ్ల మండలంలోని 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అఖిలప్రియ.. జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబుపై నీచ రాజకీయాలు చేస్తూ కేసులు పెట్టే దుస్థితికి వైసీపీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు.  

పోలీస్ సిబ్బందిపై దాడి.. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

అనంతపురం సెబ్ పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో... కేవలం బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో.. బెయిలబుల్ కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసును వీక్ చేసేందుకు డిప్యూటీ మేయర్, వైసీపీ నేతలు మంత్రాగం నడిపినట్లు తెలుస్తోది. కానిస్టేబుల్ రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేశారు. అయితే.. ఈ దాడి కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా... కేవలం బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

కరెంట్ ఆఫీసుల వద్ద స్ధానికులు ఆందోళన

సత్య సాయి జిల్లా ధర్మవరంలోని మార్కెట్ స్ట్రీట్ వద్ద కరెంటు లేక కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో దోమలు కుట్టి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి అంటూ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. తమకు గతంలో వంద రూపాయలు వస్తున్న కరెంట్ బిల్లు ఇప్పుడు దాదాపు 360 రూపాయలు వస్తున్న చెల్లిస్తున్నాం.. మాకెందుకు విద్యుత్ సరఫరా చేయలేదని ఆఫీస్ బయట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు మాకు కరెంట్ ఇవ్వాలని ఆఫీస్ ముందు బైఠాయించారు.

L&T కే విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు!?

విమానశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్ ఎల్ అండ్ టీ సంస్థకే ఖరారైనట్లు తెలుస్తోంది. రెండో దశకు గ్లోబల్‌ టెండర్లు పిలవగా ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌, ఎన్‌సీసీ లిమిటెడ్‌ మాత్రమే పోటీపడ్డాయి. గత నెల రోజులుగా మెట్రో అధికారులు, జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ కలిసి ప్రాజెక్టు అమలులో ఆ రెండు కంపెనీల అనుభవం, సాంకేతిక, ఆర్థిక నివేదికలు, పత్రాలను అధ్యయనం చేశారు. మెట్రో నిబంధనల్లో తొలిసారిగా పొందుపర్చిన ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌లో అనుభవం, అర్హత ఉన్న ఎల్‌ అండ్‌ టీకే టెండర్‌ ఖరారైనట్లు సమాచారం.