చిట్టి న్యూస్

చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా అడ్డంకులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది అధికార యంత్రాగం. పుంగనూరులో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ నేతల ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మరోవైపు పుంగనూరుకు వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేతల్ని పట్టించుకోని పోలీసులు కేవలం టీడీపీ నేతల్ని పుంగనూరుకు రాకుండా అడ్డుకుంటున్నారు. 

మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి తమ రాష్ట్రానికి బదిలీకి చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. 

మోదీ రాజ్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తా

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత సంజయ్‌ని బీజేపీలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మోదీ రాజ్యం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కీలక బాధ్యతలు అప్పగించిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

గే డేటింగ్ యాప్‌తో మోసం..!

డేటింగ్ యాప్ పేరుతో న్యూడ్ వీడియోలు షూట్‌ చేసి బెదిరింపులకు దిగుతున్నాడు ఓ యువకుడు. గే డేటింగ్ యాప్‌తో యువకులను మోసం చేస్తున్న అఫ్రిది కోసం గాలిస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. గ్రిండర్ డేటింగ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆఫ్రిది..యువకులు తన రూమ్ కి రాగానే వారి న్యూడ్ వీడియోలను షూట్‌ చేస్తున్నాడు. వీడియో ఎందుకు తీస్తున్నావని అడిగిన సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ ను కత్తితో బెదిరించి డబ్బులతో పాటు, ఉంగరం లాకున్నాడు. గతంలో మరో యువకుడిని ఇదే రీతిలో మోసం చేశాడు.అతనిపై పిడి యాక్ట్ పెట్టారు.

ఢిల్లీలో కదం తొక్కుతున్న ఏపీ సర్పంచులు

ఢిల్లీలో ఏపీ సర్పంచ్‌లు కదం తొక్కుతున్నారు. వివిధ పార్టీల నేతల్ని కలుస్తున్నారు. జగన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ వచ్చిన సర్పంచుల్లో టీడీపీ, జనసేన సహా అధికార వైసీపీకి చెందిన వారే అధికంగా ఉన్నారు. ఇక తమ సమస్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని ఏపీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.   

వెంకటేశ్వర వర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు రహదారుల విస్తరణను నిరసిస్తూ వీసీ చాంబర్‌ను ముట్టడించారు విద్యార్థులు. వీసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీసీ వైసీపీ నేతలా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణం కలుషితం చేస్తూ,.. ప్రశాంతతను దెబ్బతీసే రహదారులు తమకొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్ప ష్టత ఇచ్చే వరకు కదలబోమన్నారు.

ఎన్నికల కమిషన్ స్వతంత్రగా పనిచేయలేని దుస్థితి

ఏపీలో ఎన్నికల కమిషన్ స్వతంత్రగా పనిచేయలేని దుస్థితి ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేకుండా చేశారని మండిపడ్డారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దన్న విన్నపానికి ఈసీ సానుకూలంగా స్పందించిందని తెలిపారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ దారి మళ్లిస్తున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని.. ఎన్నికల కమిషన్ చెప్పిందని పయ్యావుల తెలిపారు 

కేసీఆర్‌ చిత్రపటానికి దానం పాలాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాలాభిషేకం చేశారు. 19వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నలు దిశలా మెట్రో విస్తరణ.. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పాలనను అభినందిస్తూ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు ఫ్లకార్డులతో ఘనస్వాగతం పలికారు. 

TS: వరద ప్రాంతాలను సందర్శించిన టీడీపీ నాయకులు

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ పార్టీ రాష్ట్ర నాయకుల బృందం పర్యటించింది. ములుగు నియోజకవర్గంలోని కొండాయి, ప్రాజెక్ట్ నగర్, మల్యాల, పస్రా గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. ఏటురు నాగారంలోని పునరావాస కేంద్రంలోని వరద బాధితులను పరామర్శించి, నిత్యవసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరదల్లో మరణించిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందచేశారు. 

ఫ్యామిలీతో ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌...ప్రధాని మోదీని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లారు సంజయ్‌. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత సంజయ్‌.. ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారని సంజయ్‌ను అభినందించారు ప్రధాని మోదీ. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. ఆ దిశగా మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. సంజయ్‌ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. 

కర్నూలులో కేజీ టమాట రూ.50 మాత్రమే

పెరిగిన టమాట ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ టమాట 120 రూపాయల నుంచి 200 పలుకుతోంది. దీంతో కర్నూలు జిల్లాలో మార్కెటింగ్ శాఖ రాయితీలో కేజీ టమాటను 50 రూపాయలకే అందిస్తోంది. దాంతో ఆదోనిలో టమాటల కోసం ప్రజలు కుస్తీ పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలోమీటర్‌ మేర క్యూలైన్‌ ఉంది. అయితే సంబంధిత అధికారులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Visakhapatnam: లాడ్జ్‌పై నుంచి పడి రౌడీషీటర్‌ మృతి

విశాఖ గోపాలపట్నంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జ్‌పై నుంచి పడి ఓ రౌడీషీటర్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పెందుర్తికి చెందిన షన్ముఖ్‌ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి లాడ్జ్‌లో అర్ధరాత్రి మద్యం సేవించాడు. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో లాడ్జ్‌ బాయ్‌ మధు రూం ఖాళీ చేయమన్నాడు. దీంతో అతనిపై దాడి చేశారు. వెంటనే మధు లాడ్జ్‌ రూంకు తాళం వేశాడు. విషయాన్ని పోలీసులకు చెబుతాననడంతో భయపడిపోయిన షన్ముఖ్‌ మద్యం మత్తులో కిందకు దూకేశాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. 

Telangana: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీని ముట్టడించిన యూత్‌ కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడికి ప్రయత్నించారు యూత్‌ కాంగ్రెస్ నేతలు.వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ,ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందన్న యూత్‌ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన యూత్‌ కాంగ్రెస్‌ నేతలను అడ్డకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Aamaravathi: ఆర్‌5 జోన్‌పై హైకోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు

అమరావతి ఆర్‌5 జోన్‌పై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల భూమిని వేరొకరికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఎవడంటూ ప్రశ్నించారు. రైతుల చేతితోనే వారి కళ్లు పొడుస్తున్నాడంటూ మండిపడ్డారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలు, యాజమాన్యాలను అక్రమ కేసులతో వేధిస్తున్నాడని 6 దశాబ్ధాల చరిత్ర ఉన్న సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో మొట్టికాయలు పడినా మూర్ఖుడికి బుద్ధి రావట్లేదంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

బీఏసీ సమావేశంపై ఈటల అసంతృప్తి

బీఏసీ సమావేశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, ఇప్పుడు ముగ్గురు సభ్యులు ఉన్నా పిలువలేదని అన్నారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా తమకు రూమ్ కేటాయించలేదని, స్పీకర్ కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదన్నారు. మరోవైపు సభ మూడు రోజులే జరుగుతుందని అంటున్నారని అయితే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఈటల.  

Chittoor: టమాట రైతుపై దాడి; నాలుగున్నర లక్షల లూటీ

దేశ వ్యాప్తంగా టమాట ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ధరలు రికార్డు స్ధాయికి చేరుతున్న క్రమంలో టమాట రైతులపై దాడులు, మార్కెట్‌లలో చోరీ కేసులు కూడా అధికమయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నక్కబండాలో టమాట రైతుపై యువకులు దాడికి పాల్పడ్డారు. పలమనేరు మార్కెట్‌లో టమాలు అన్ లోడ్ చేసి వస్తున్న లోకరాజ్ అనే రైతుపై బీర్ బాటిల్స్‌తో దాడిచేశారు. టమాలు అమ్మగా వచ్చిన 4లక్షల 50 వేలు దుండగులు ఎత్తుకెళ్లారు. గాయపడ్డ రైతును పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Tirupathi: విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు

ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల పిలుపు మేరకు తిరుపతిలో నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం జరిపిన చర్చలు సానుకూలంగా లేవని ఉమ్మడి చిత్తూరు జిల్లా జేఏసీ ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం ఫిట్‌మెంట్ 5శాతం ఇచ్చేందుకు అంగీకరించడం శోచనీయమని మండిపడుతున్నారు. తమ సమస్యలను విద్యుత్ మెనేజ్‌మెంట్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. 

అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం; మంత్రి కేటీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ

అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. రాజకీయాల్లో ఉప్పు..నిప్పుగా ఉండే నేతలు అప్యాయంగా పలకరించుకున్నారు. ఈటల రాజేందర్‌ సీటు వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించారు మంత్రి కేటీఆర్‌. ఈటలను ఆలింగంనం చేసుకున్నారు వారిద్దరూ 10 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్‌తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. మంత్రి ఛాంబర్‌లో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పిల్లలతో కలిసి తిరిగితే ఎలా అని కేటీఆర్ అంటే టీషర్ట్‌తో వస్తే తప్పులేదన్న అంటూ జగ్గారెడ్డి సమాధానం ఇచ్చారు. 

పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో హైటెన్షన్‌

కడపజిలా పులివెందుల పూల అంగళ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు విధించారు. సభ కోసం టీడీడీ ఏర్పాటు చేసిన మైకుల్ని పోలీసులు తొలగించారు. దాంతో ఖాకీల తీరుపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సభ, రోడ్‌ షోకు అనుమతిస్తే సరేనని లేకపోయినా నిర్వహించి తీరతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు జమ్మలమడుగు నుంచి గండికోట ప్రాజెక్ట్ సందర్శనకు బయల్దేరారు. జమ్మలమడుగు సర్కిల్‌లో మాట్లాడారు. 

Vijayawada: బాలల సదన్‌లో కలకలం; ఎస్టీ చిన్నారులకు గుండు కొట్టించిన వైనం

విజయవాడలో దారుణం జరిగింది. 9 మంది అనాధ ఎస్టీ పిల్లలకు బాల సదన్‌ సిబ్బంది గుండు కొట్టించింది. దీనిపై బాలల హక్కుల కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల సదన్‌లో పర్యటించిన కమిషన్‌ సభ్యులు బాధిత పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలసదన్‌ సూపరింటెండెంట్‌, ఉమెన్‌ వెల్ఫేర్‌ అండ్‌ చైల్డ్‌ పీడీకి నోటీసులిచ్చారు. ఈనెల 8న బాలల హక్కుల కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే బాలల తలలో కురుపులు ఉన్నాయనే ఉద్దేశంతో గుండు చేయించామని బాలల సదన్‌ సిబ్బంది చెబుతున్నారు. 

Hyderabad: ట్యాంక్‌బండ్‌ వద్ద కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష ఫలితాలు వెల్లడించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జీవో 46కు మద్దతు తెలిపారు. జీవో 46తో అన్ని జిల్లాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నా రు. ఫలితాలు విడుదలయ్యే సమయంలో.. ఉద్యోగాలు రాకుండా కొంత మంది కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణమే స్టేల్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

జగన్‌ ప్రభుత్వంపై జడ శ్రవణ్‌ విమర్శలు

జగన్ పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు జై భీమ్ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌. జగన్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమేనని.. చేతల ప్రభుత్వం కాదన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడినా చంద్రబాబు మనుషులంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ పెళ్లి కానుక, విదేశీ విద్య లాంటి పథకాలను అటకెక్కించారని.. గత మూడేళ్లలో ఎంత మందికి సాయం చేశారో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 

AP: పంచాయతీల నిధుల మళ్లింపుపై కేంద్రం సీరియస్‌

ఏపీలో పంచాయతీల నిధుల మళ్లింపుపై విచారణకు కమిటీని నియమిస్తున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పటేల్‌ చెప్పారు. టీడీపీ ఎంపీలు కనకమేడల, రామ్మోహన్‌తో కలిసి ఏపీ సర్పంచ్‌ల సంఘ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కపిల్‌ మోరేశ్వర్‌ గ్రామపంచాయతీల కోసం ఇచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేయాలన్నారు. నిధుల మళ్లింపుపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు.

Vijayanagaram: సంగం గ్రామంలో ఏనుగుల భీభత్సం

విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వంగర మండలం సంగం గ్రామంలో ఆవులపై దాడి చేశాయి. రైతు రామినాయుడకు చెందిన ఒక ఆవు మృతి చెందింది. ఏనుగుల గుంపు దాడితో గ్రామస్తులు భయాందోళనకులోనవుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. ఊర్లపైకి ఏనుగుల మందను రాకుండా చూడాలని కోరారు. 

పీలేరులో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి పర్యటన

సీఎం జగన్‌ పాలనపై టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. ముస్లిం పథకాలను ఆపేసిన జగన్ పరిపాలనకు అనర్హుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం లోకి వస్తే.. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి మహిళలు, చిరువ్యాపారులను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరూలో పర్యటించిన నల్లారి.. టీడీపీ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తిరుగుతూ వివరించారు.

Hyderabad: అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పిల్లర్‌ నెంబర్‌ 258 దగ్గర వేస్టేజ్‌ కాటన్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది....మంటలను ఆర్పివేశారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అసెంబ్లీ సమావేశాలకు భాజాపా సన్నధం

అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో అమలు చేయని హామీలను ప్రస్తావించాలని నిర్ణయించారు. రైతు రుణమాఫీ, రేషన్‌కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ అంశాలను సభలో ప్రస్తావించనున్నారు. సస్పెన్షన్‌కు గురికాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. సభలో ఉంటే మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై చేసే విమర్శలకు ధీటుగా కౌంటర్‌ ఇచ్చేలా కమలం పార్టీ రెడీ అవుతోంది. 

Bapatla: అమ్మాయి కోసం ఇద్దరు యువకుల గొడవ

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు గొడవ పడిన ఘటన బాపట్ల జిల్లా కేంద్రం లోని సూర్యలంక రోడ్డులో చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురి పించుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తోటి స్నేహి తులతో కలిసి యువకుడిపై స్టూడెంట్ దాడి చేయించినట్లు తెలుస్తోంది. ప్రేమ విషయంలో యువకుల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటన

వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటించారు. హన్మకొండ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్‌ బాధితులను పరామర్శించారు.వారికి రెడ్ క్రాస్ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.మరోసారి వరదలు వస్తే తట్టుకునేలా వరంగల్‌ నగరంలో శాశ్విత నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.నివేదికల ఆధారంగా కేంద్రం స్పందిస్తుంద్న గవర్నర్‌ సాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తానని అన్నారు.

బాచుపల్లిలో స్కూటీని ఢీకొన్న స్కూల్‌ బస్సు; 8ఏళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌ బాచుపల్లి గుంతల రోడ్లు ఓ బాలికను బలిగొన్నాయి. తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తున్న 8ఏళ్ల దీక్షిత రోడ్డుపై గుంత రావడంతో బండి పైనుంచి కింద పడిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కూల్‌ బస్సు చిన్నారిని ఢీకొట్టింది. దీంతో దీక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. దీక్షిత బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతోంది. గుంతల రోడ్లు, బస్సు డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ వాంబే కాలనీ డిస్నీలాండ్ వద్ద సీపీఎం ధర్నా

విజయవాడ వాంబే కాలనీ లో సీపీఎం ధర్నా చేపట్టింది. డిస్నీ లాండ్‌లో కబేళా ఏర్పాటు చేయాలన్న కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టింది. ప్రభుత్వం పేదలను చిన్నచూపు చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. నివాసాల మధ్య కబేళా ఏర్పాటు చేయడమేంటని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిస్నీ లాండ్ లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జగన్ ది పేదల ప్రభుత్వం కాదని పెత్తందార్ల ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: రాష్ట్రంలో వరద బాధితులకు అండగా టీ.టీడీపీ

వరద బాధితులకు తెలంగాణ తెలుగుదేశం బాసటగా నిలబడింది. టీ.టీడీపీ అధ్యక్షులు కాసాని ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించా రు. దుప్పట్లు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్ నుంచి సరుకులతో నిండిన వాహనాలు వరంగల్‌, ఖమ్మం జిల్లాకు బయల్దేరాయి. అదేవిధంగా మృతుల కు టుంబాలను గుర్తించి ఆర్థిక సాయం అందజేయనున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును నిలదీస్తాం- భట్టి

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఢిల్లీలో ప్రసంగించిన ఆయన రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును నిలదీస్తామన్నారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవేవి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను అశాస్త్రీయంగా కట్టడం వల్లే నీరు రాకపోగా.. వరదల తీవ్ర అధికంగా కనిపించిందన్నారు. ఇంజనీర్లు కాకుండా ప్రాజెక్ట్‌లకు సీఎం కేసీఆర్‌ డిజైన్స్ రూపొందించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారంటూ మండిపడ్డారు. 

కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే.. చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ అనుమతిపై సందిగ్ధత కొనసాగుతుంది. పోలీసులు చంద్రబాబు పులివెందుల సభకు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతలు మాత్రం.. పోలీసులు అనుమతులు ఇస్తే సరే.. లేకున్నా రోడ్‌ షో, సభ నిర్వహించి తీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు.

Delhi: కాషాయ తీర్థం పుచ్చుకోనున్న జయసుధ

సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జయసుధ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ మధ్యాహ్నం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఢిల్లీలోనే ఉన్నారు. గతంలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్‌ లేదా సికింద్రాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.

Yuvagalam: పాదయాత్రలో నారాలోకేష్ చేతికి గాయాలు

అశేష జనవాహిని మధ్య నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. లోకేష్‌ కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు జనాలు ఎగబడుతుండటంతో ఆయనకు పలుచోట్ల గాయాలు అవుతున్నాయి. అయినా పట్టు వదలకుండా లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి పాదయాత్రలో నారాలోకేష్ చేతికి గాయాలయ్యాయి. వేళ్లకు బొబ్బలెక్కడంతో ఇబ్బంది పడుతున్నారు.జన తాకిడి ఎక్కువగా ఉండటంతో చేతికి పలుచోట్ల గాయాలయ్యాయి. ఒక గాయం మానే లోపే మరో గాయం అవుతుండటంతో టీడీపీ కేడర్‌ ఆందోళనకు గురవుతోంది.