చిట్టి న్యూస్

Mulugu : ఆశా వర్కర్ల సహసం...వాగులు, వంకలు దాటుతూ వైద్యం

ములుగు జిల్లాలో ఆశా వర్కర్లు, ANMలు భారీ వర్షాలకు పొంగుతోన్న వాగులు, వంకలు దాటి మరీ వైద్య సాయం అందించారు. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో జ్వరాలు వ్యాపించడంతో అక్కడ మెడికల్‌ క్యాంపు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైద్య అధికారి నేతృత్వంలో ANM, ఆశా వర్కర్లు సహసం చేసి మరీ వైద్య సాయం అందించిన తీరును అందరు ప్రశంసిస్తున్నారు. వారి వైద్య సేవలకు కృతజ్ఞతలు తెలిపారు గిరిజనులు.

Bogata Waterfalls: గలగలపారుతూ కనువిందు చేస్తోన్న బోగత

పాలపొంగులా గలగలపారుతున్న బోగత జలపాతం చూపరులను కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలను అశ్వాదించేందుకు పర్యాటకుల క్యూ కడుతున్నారు. ములుగు జిల్లాలో తెలంగాణ నయాగరాగా పేరొందిన బోగత జలపాతం అందాలను చూసేందుకు రెండు కళ్ళు చాలా ఉన్నట్టు ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. వర్షం వరదల నేపథ్యంలో గత మూడు రోజులుగా జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు వర్షాలు తగ్గడంతో శుక్రవారం నుంచి అనుమతి ఇవ్వడం, అటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో సందర్శకుల తాకిడి పెరుగుతుంది. 

Karimnagar: పర్యాటక శోభ... నిండుకుండల్లా రిజర్వాయర్లు

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పర్యాటక శోభ సంతరించుకుంది. చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయి. జోరువానలోనే జలకాలాడుతూ యువకులు చేపలు పడుతున్నారు. విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు జలకళను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఏపీ సర్కార్‌ పై పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌

ఏపీ సర్కార్‌ పై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. బైజూస్‌కు స్కూళ్ల కాంట్రాక్ట్‌ ఇవ్వడంపై మండిపడ్డారు. మోగా డీఎస్సీ లేదు టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ లేదు..కానీ నష్టాల్లో ఉన్న కంపెనీకి కోట్ల కాంట్రాక్టులా..? అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం సాండర్ట్ ప్రోటోకాల్‌ పాటించదా అన్న పవన్‌ ట్యాబ్స్‌ మంచివే.. కానీ ముందు టాయిలెట్స్‌ కట్టండి అంటూ విమర్శించారు. యాప్స్‌ చాయిస్‌ మాత్రమే కానీ టీచర్లు తప్పనిసరి అంటూ ట్వీట్‌ చేశారు.

కళారంగ్‌లో 7వ రోజ్‌ గార్ మేళా; ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి

అనేక అంతర్జాతీయ, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు ఉన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో జరిగిన 7వ రోజ్‌ గార్ మేళా కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, పోస్టల్ సహా 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. రోజ్‌ గార్ మేళా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 5 లక్షలపైగా ఉద్యోగాలు కల్పించామని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ చరిత్ర ఇంత మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేపట్టడం ఇదే తొలిసారన్నారు.  

UP: బిజనోర్‌ కోటవాలి నదిలో చిక్కుకున్న బస్సు

యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బిజనోర్‌ కోటవాలి నదికి వరద పోటెత్తింది. అయితే వరదలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు చిక్కుకుంది. వెంటనే స్పందించిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. హైడ్రాలిక్‌ క్రేన్‌ సాయంతో బస్సు లోని ప్రయాణికుల తరలించారు. ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

పోలవరానికి శనిలా జగన్‌ -నిమ్మల రామానాయుడు

పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నల బహిరంగ లేఖను సీఎం జగన్‌కి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు జగన్‌ దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరానికి జగన్‌ శనీలా తయారయ్యారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి ముంచేశారని నిప్పులు చెరిగారు. విధ్వంసం, విద్రోహం, చంపడం ఇవన్నీ జగన్‌ బ్లడ్‌లోనే ఉన్నాయన్నారు.

Vishakapatnam: 40 వేల ఓట్లు తీసేశారు: ఎమ్మెల్యే వెలగపూడి

విశాఖలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని కంప్లైంట్‌ చేశారు. విశాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, బీఎల్‌ఓలపైన ఫిర్యాదు చేశారు. బూతు లెవల్‌ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, వీరి తీరుపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. తాత్కాలిక వలసలు పేరుతో ఓట్లు తొలగించడం దారుణమని అన్నారు. అధికార పార్టీ ఇప్పటివరకు BLA లిస్ట్ ఇవ్వలేదని మండిపడ్డారు.

Himayatsagar: జలాశయం 6 గేట్లు ఎత్తేసిన అధికారులు

నాలుగు రోజుల నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో హిమాయత్‌సాగర్ జలాశయం 6 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదలు చేస్తున్నారు. రోడ్లపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్‌ను మూసివేశారు. రాజేంద్రనగర్ నుండి కాళిమందిర్, గండిపేట వెళ్లే సర్వీస్ రోడ్ నుంచి ప్రజలు, వాహనదారులెవరూ రావొద్దని అధికారులు హెచ్చరించారు.

దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు: బండారు సత్యనారాయణ

జగన్‌ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని అన్నారు మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. రాష్ట్రంలో ఎక్కువ మంది వాలంటీర్లు వైసీపీ వారేనని ఆరోపించారు. సబ్బవరం ఓట్ల సర్వేలో ముగ్గురు వాలంటీర్లు పాల్గొన్నారన్న బండారు. ఈ అంశంపై ఎమ్మార్వోపై విశాఖ ఆర్డీవోకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓట్ల సర్వే అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

కొమురం భీం అడ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

అసిఫాబాద్ జిల్లాలో 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కుమురం భీం అడ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తుగా ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కొమురం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా.. ప్రస్తుతం 237 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 7 వేల 521 క్యూసెక్కుల నీరు ఉండగా.. ఔట్‌ఫ్లో 12 వేల 54 క్యూసెక్కుల నీరు ఉందని అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

భద్రాచలం వద్ద గోదావరికి తగ్గిన వరద ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గింది. ఎగువ నుంచి గోదావరిలోకి క్రమంగా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్న 43 అడుగులకు నీటిమట్టం చేరుకోగా సాయంత్రానికి 42 అడుగులకు దిగువకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తేసారు. ప్రస్తుతం 39.5 అడుగుల వద్ద వరద ప్రవాహం ఉంది. ఈ సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 35 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

Hyderabad: భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ

హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీనది పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చే వాగులు, వంకలు సైతం కలుస్తుండటంతో  దిగువనున్న ప్రాజెక్ట్‌ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 642 అడుగులను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.46 TMC లకుగాను.. ఇపుడు 3.70 TMC లుగా కొనసాగుతుంది. కుడి, ఎడమ కాలువలతోపాటు మూసీ డ్యామ్ ఆరు క్రస్ట్ గేట్లను.. రెండు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీరు వదులుతున్నారు.  

West Godavari: నరసాపురంలో పోలీస్‌ వర్సెస్ రెవెన్యూ

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో స్థలం విషయంలో అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాత టౌన్‌ పీఎస్‌ ప్రదేశంలో బోర్డు పెట్టడాన్ని అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది ఈ స్థలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానిదని తెలిపారు. గతంలో పీఎస్‌ ఇక్కడే ఉండేదని గుర్తు చేసిన పోలీసులు.. బిల్డింగ్‌ పాతబడటంతో తాత్కాలిక భవనంలోకి షిప్ట్‌ అయినట్లు తెలిపారు. దీనికి అంగీకరించని పోలీసులు రెవెన్యూ అధికారులు కట్టిన గోడను జేసీబీతో కూల్చేశారు. విషయం కాస్త సబ్‌ కలెక్టర్‌కు తెలియడంతో ఆయన సీరిస్‌ అయ్యారు. పోలీసులను ల్యాండ్‌ పేపర్లు తీసుకురావాల్సిందిగా కోరారు.  

పల్నాడు కలెక్టర్‌ ఆదేశాలను ధిక్కరించిన బూత్‌ లెవర్‌ ఆఫీసర్లు

పల్నాడు కలెక్టర్‌ ఆదేశాలను దాచేపల్లి బూత్‌ లెవర్‌ ఆఫీసర్లు ధిక్కరించారు. ఓటర్‌ లిస్ట్‌ వెరిఫై చేస్తున్నప్పుడు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవద్దని ఇప్పటికే కలెక్టర్‌ హెచ్చరించారు. అయినా కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ దాచేపల్లి బీఎల్‌ఓలు వాలంటీర్లను వెనకబెట్టుకుని మరీ ఓటర్‌ లిస్ట్‌లు వెరిఫై చేస్తున్నారు. దాచేపల్లి 84వ పోలింగ్‌ బూత్‌లో నలుగురు వాలంటీర్లు, స్థానిక బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఓట్ల సర్వే చేస్తూ మీడియా కంట పడ్డారు. ఇది గమనించిన వాలంటీర్లు అక్కడి నుంచి పరారయ్యారు. 


మావోయిస్టు దివంగత నేత ఆర్కే భార్య అరెస్ట్‌

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో మావోయిస్టు దివంగత నేత ఆర్కే అలియాస్‌ రామకృష్ణ భార్య శిరీషను NIA అధికారులు అరెస్ట్‌ చేశారు. శిరీష అరెస్ట్‌ను విరసం నేత కళ్యాణరావు ఖండించారు. NIA అధికారులు ముందస్తు సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా శిరీషను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లడం అప్రజాస్వామికం అన్నారు. పాత కేసులేమైనా ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడంపై కళ్యాణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జూలూరుపాడు దగ్గర పత్తి మార్కెట్ యార్డ్ రోడ్డుపై ఆగి ఉన్న కారును లారీ ఢీ కొంది.దీంతో గ్యాస్ ట్యాంకర్ క్యాబిన్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి..గ్యాస్‌ ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదంతో జూలూరుపాడు హై వే పై భారీగా ట్రాఫిక్ జాం అయింది.


జగన్‌పై లోకేష్ ట్వీట్..చీప్ మినిస్టర్ అంటూ సెటైర్లు

టీడీపీ యువనేత నారా లోకేష్ మరోసారి సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఎందరో మహానుభావులు.. ఒక్కరే చీప్ మినిస్టర్ అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి మొదలు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ వర్సెస్.. చెత్త సీఎం జగన్ అంటూ ట్విట్టర్‌లో ఫొటోలు పెట్టి మరీ కడిగిపారేశారు. గత ముఖ్యమంత్రుల హయాంలో ఉమ్మడి ఏపీ, విభజన ఆంధ్ర ఎంతో అభివృద్ధి సాధిస్తే.. కేవలం నాలుగేళ్ల జగన్ పాలనలో అభివృద్ధి లేక ఏపీ సర్వనాశనమైందని అర్థం వచ్చేలా నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిపై వైసీపీ దాడి

సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. ఒడిసిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో వైసీపీ నేతల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఆర్థిక నేరాలపై.. పల్లె రఘునాథ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రా నీరవ్‌ మోడీ శ్రీధర్‌రెడ్డి అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అక్రమాస్తులు 15వందల కోట్లకు పైగానే ఉంటాయని ఆరోపించారు. శ్రీధర్‌రెడ్డితో పాటు జగన్‌ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని పల్లె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పల్లె రఘునాథ్‌రెడ్డిపై వైసీపీ నాయకులు దాడికి యత్నించారు. 

పోలవరం పరిస్థితిపై మండిపడ్డ ధూళిపాళ నరేంద్ర

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమీషన్ల కక్కర్తి, స్వార్థం కోసం సీఎం జగన్ పోలవరాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే.. నాలుగున్నరేళ్లుగా తేదీలు మార్చడం తప్ప జగన్, ఆయన మంత్రులు చేసింది శూన్యమన్నారు. అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షనేతగా దుష్ప్రచారం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి కమీషన్ల కోసం పోలవరం పనులు కట్టబెట్టారని మండిపడ్డారు. కమీషన్లు రావనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.  

మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన

మహబూబ్‌నగర్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. మినీ ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉన్న రామయ్యబౌలి, గణేష్‌నగర్‌లోని చెరువు కట్ట తూమును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. తాములు, నాళాల దగ్గర ఉన్న ఇళ్లల్లోకి నీరు చేరితే ...వెంటనే ప్రజలు అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 241165కు ఫోన్‌ చేయాలన్నారు. పట్టణంలో కొత్తగా పెద్ద నాలాను 270 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఇందల్వాయిలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గోదావరి, మంజీరా నదులకు భారీగా వరద పోటెత్తింది. సాలూరా బ్రిడ్జి, కందకుర్తి- త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు మద్నూర్, పిట్లం, జుక్కల్ మండలాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ముంపు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్‌లలో వరద సహాయక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 



ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. జహీరాబాద్ పట్టణం జలదిగ్భందంలో చిక్కుకుంది. వసంత్ విహార్ కాలనీలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వసంత్ నగర్ లో డ్రైనేజీలు, కాలువలు లేకపోవడంతో పూర్తిగా జలదగ్భందంలో చిక్కుకు పోయామని కాలనీ వాసులు వాపోతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జోరుగా వానలు

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులన్నీ వరద నీటితో కలకలలాడుతున్నాయి. ప్రాణహిత, పెన్‌గంగా నదులు భారీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కడెం ప్రాజెక్టుకు భారీ వరద చేరడంతో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. 

Kukatpally: ఐడీఎల్ ట్యాంక్ చెరువులో నురగ

హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐడీఎల్ ట్యాంక్ వద్ద చెరువులోని నురుగు జాతీయ రహదారిపై గాలికి ఎగసిపడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూకట్ పల్లి ఐడీఎల్ ట్యాంక్‌కి వరద నీరు ఫ్లో అవడంతో నురుగు ఏర్పడింది. గాలి వచ్చినప్పుడుల్లా ఎగసి పడి పక్కనే ఉన్న రహదారిపై పడుతోంది. దీంతో రోడ్డు ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జాబ్‌మేళాలో ఉద్రిక్తత

విశాఖపట్నంలో వివాదాస్పద ఐటీ కంపెనీ వి.ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాను AIYF కార్యకర్తలు అడ్డుకున్నారు. గతంలో నిరుద్యోగులను వి.ఇన్ఫోటెక్ కంపెనీ మోసం చేసిందని ఆరోపించారు. మోసపోయిన నిరుద్యోగులు జాబ్‌మేళాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా AIYF కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకుడు మారుతి ప్రసాద్‌కు చెందిన వి.ఇన్ఫోటెక్ కంపెనీ గతంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు మోసం చేసిందని AIYF నేతలు ఆరోపించారు. నిరుద్యోగుల నుంచి వేలాది రూపాయలను కంపెనీ వసూలు చేసిందన్నారు.  

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో గ్రామస్తుల ఆందోళన

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై దుబార్‌ పేట గ్రామస్థులు బైఠాయించి నిరసనకు దిగారు. ప్రతి సంవత్సరం గ్రామంలోకి వర్షపు నీరు చేరుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడుతున్నారు. గ్రామంలోకి వరద నీరు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్థుల ఆందోళనతో జాతీయరహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి

ఓట్ల గల్లంతుపై సీఈసీకి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు

విశాఖలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు చేవారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఢిల్లీ లోని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలోసీఈసీని కలసిన ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని కంప్లైంట్‌ చేశారు. విశాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, బీఎల్‌ఓలపైన ఫిర్యాదు చేశారు. బూతు లెవల్‌ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, వీరి తీరుపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు.

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి వుందని పేర్కొంది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని ఆ ప్రభుత్వమే తీసుకోవాల్సివుంటుందని మంత్రి వెల్లడించారు .

Hyderabad: లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. నీటి మట్టం పెరగడంతో నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం 513.60 మీటర్లకు చేరుకుంది. పూర్తి సామర్ధ్యం 515 మీటర్లు. హుస్సేన్ సాగర్ వద్ద GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

ఎగువ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులు దాటింది. 9 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ-పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయి లంక కాజ్ వే వరదనీటిలో మునిగిపోయింది. దీంతో రెండు జిల్లాల పరధిలోని లంకగ్రామ ప్రజలకు రాకపోకలకు నిలిచిపోయాయి.  

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లోని పలు పంటలు నీట మునిగాయి. మొలక దశలో ఉన్న పత్తి పంట కొట్టుకుపోయింది. ఖమాన, కోమటిగూడ, దుబ్బగూడ, ఎనోలీ, పిప్పర్ గొంది, ఖిరిడి, ఖైరిట్ గ్రామాల్లోని వాగులపై వంతెనలు లేకపోవడంతో రాకపోకలు స్తంభించాయి. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట డ్రైనేజీ లేక పాఠశాలలోకి వరద నీరు వచ్చి చేరింది. పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. 


యాదాద్రి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు మూసి వాగు దాటవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మూసి పరివాహక ప్రాంతాల రైతులను అప్రమత్తం చేశారు.

ప్రమాదంలో కడెం ప్రాజెక్టు.. మొరాయిస్తోన్న 4, 6నెం. గేట్లు,

కడెం ప్రాజెక్టు ప్రమాదపు అంచునకు చేరుకుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడంతో 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రాజెక్టుకు చెందిన నాలుగు, ఆరో నెంబర్ గేటు మొరాయించడంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. మరోవైపు వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులుగా ఉంది. మరమ్మత్తులు చేపట్టిన అధికారులు గేట్లను మాన్యువల్‌గా ఎత్తేందుకు సిద్ధమయ్యారు.  

Karimnagar: జోరువానలో చేపల వేట

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని కొత్తపల్లి చెరువుకు ఎగువన ఉన్న పంట పొలాల నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో యువకులు వర్షంలోనే వరద ప్రవాహంలోకి దిగి చేపలు పడుతున్నారు. స్థానిక యువకులు చేపలను పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. పెద్ద సైజు చేపలను పట్టి అక్కడిక్కడే అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు

వివేకా హత్య వెనుక అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర ఉందని సీబీఐ ఆరోపించింది. హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర,హత్య సాక్ష్యాల చెరిపివేతను వివరించిన సీబీఐ ఫొటోలు, గూగుల్‌ టేక్‌ అవుట్‌, లొకేషన్‌ డేటాలను..కోర్టుకు సమర్పించింది సీబీఐ. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వివరాలు సేకరిస్తున్నామని కోర్టుకు తెలిపిన సీబీఐ వివేకా లేఖపై నిన్‌ హైడ్రిన్‌ నివేదిక రావాల్సి ఉందని తెలిపింది. పలు సెల్‌ఫోన్ల ఫోరెన్సిక్‌ నివేదికలు అందాల్సి ఉందని వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నా ఆధారాలు లభించలేదని తెలిపింది.