చిట్టి న్యూస్

కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్‌ షురూ

అన్ని హంగులు సమకూర్చుకున్న తెలంగాణ కొత్త సచివాలయానికి బీఆర్కే భవన్‌ నుంచి షిఫ్టింగ్ ప్రారంభమయ్యింది. ఈనెల 30న నూతన సచివాలయం ప్రారంభం తర్వాత.. అదే రోజు నుంచి కొత్త సచివాలయం నుంచి పాలన షురూ కానుంది. ఇవాళ్టి నుంచి కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ మొదలు పెట్టారు. 28వ తేదీ వరకు షిఫ్టింగ్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖలను కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెవెన్యూ శాఖ.. మొదటి ఫ్లోర్‌లో హోమ్ శాఖ.. రెండో అంతస్తులో ఆర్థిక శాఖ.. మూడో ఫ్లోర్‌లో అగ్రికల్చర్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖలు.. నాలుగో అంతస్తులో ఇరిగేషన్, న్యాయ శాఖలు.. ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ... ఆరో ఫ్లోర్‌లో సీఎం, సీఎస్‌ కార్యాలయాలు ఉండనున్నాయి. ఇప్పటికే శాఖలవారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటాం: మంత్రి హరీష్‌

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అర్బన్ మండలం నాంచార్ పల్లి గ్రామంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. నష్టపోయిన పంట వివరాలను బాధితులను అడిగి మంత్రి హరీష్ రావు తెలుసుకున్నారు. పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు.

మంత్రి ఉషశ్రీ చరణ్‌కు హనుమంతరాయ చౌదరి  సెల్ఫీ ఛాలెంజ్‌

మంత్రి ఉషశ్రీ చరణ్‌కు మాజీ ఎమ్మెల్యేహనుమంతరాయ చౌదరి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. ప్రజాప్రతినిధిగా ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి ఉషశ్రీ చరణ్ అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. మంత్రి ఇంటి ఎదురుగా ఉన్న ఆర్అండ్‌ బీ స్థలాన్ని కూడా కబ్జా చేసి.. ఇంటి నిర్మాణం చేశారని ఆరోపించారు. స్థలాలు కబ్జా చేసి... పేదల ఇంటి నిర్మాణాలను కూల కొడుతున్నారని మండిపడ్డారు. మంత్రిని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

ఆర్కే బీచ్‌లో వివాహిత అనుమానాస్పద మృతి

విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కే బాచ్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గాజువాకకు చెందిన స్వాతి అనే వివాహిత మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకి కోసం గాలిస్తుండగానే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం ఇసుకలో కూరుకుపోయి అర్థనగ్నంగా కనిపించింది. అయితే స్వాతి ఐదు నెలల గర్భవతి అని ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందే తన భర్తతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ

ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారంటూ మంత్రి హరీష్‌రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ కేసులకు భయపడే నాయకుడు కాదని స్పష్టం చేశారు. సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభలో పాల్గొన్న హరీష్‌రావు... మోదీకి తెలంగాణపై ప్రేమ లేదన్నారు. కేసీఆర్‌ను తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని.. ఆయనను తిట్టడం వల్ల పెద్దోళ్లు అయిపోరన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు హరీష్‌రావు.


పులివెందులలో హై టెన్షన్

పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్‌రెడ్డి రాకతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏం జరగబోతోందనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. అటు.. పులివెందుల శివార్లలో సీబీఐ అధికారుల మకాం వేశారు. అవినాష్‌రెడ్డికి నేరుగా నోటీసులిచ్చే అవకాశం కనిపిస్తోంది. పులివెందులలోనే అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక.. అవినాష్‌రెడ్డి ఇంటికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 


కార్పొరేటర్లపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మేయర్ స్రవంతి

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డిని మేయర్‌ స్రవంతి కలిశారు. తనపై కావాలనే ము గ్గురు కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిన్న మున్సిపల్‌ కౌన్సిల్‌ సభలో సీఎం జగన్‌ ఫోటో ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంపై ఎస్పీకి మేయర్‌ వివరించారు. నిండు సభలో తన చీర లాగి అవమానించారని పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. అవసరమైతే జాతీయ ఎస్టీ కమిషన్‌తోపాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చె ప్పారు.


హంద్రీనీవా కాలువను పరిశీలించిన మాజీ మంత్రి

అనంతపురం జిల్లా కసాపురం వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించారు టీడీపీ నేతలు. హంద్రీనీవాను అర్ధాంతరంగా వదిలేసి రైతాంగాన్ని సీఎం జగన్‌ నట్టేట ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ సామర్ధ్యాన్ని 6వేల క్యూసెక్కులకు పెంచుతానని చెప్పి మోసం చేశారంటూ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.జితేంద్ర గౌడ్‌ విమర్శించారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌.. ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వస్తున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు.



నందిగామలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్టు విచారణ

నందిగామలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా నందిగామ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో ఇచ్చిన నోటీసులు వారికి చేరలేదని పిటిషనర్‌ తెలిపారు. దీంతో వ్యక్తిగత నోటీసులు ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. కొన్నిరోజులుగా నందిగామ లో ఇసుక అక్రమ మైనింగ్‌ జోరుగా కొనసాగుతుంది. సంబంధిత అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం తాజాగా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రెండు ష్యూరిటీలు, 30వేల పూచీకత్తుతో బెయిల్‌ ఇచ్చింది. నిన్న విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయిచేసుకోవడంతో పోలీసులు  ఆమెపై కేసుసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

డీఎస్పీపై జేసీ గరమ్ గరమ్...

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య వల్లే శాంతిభద్రతలు లోపిస్తున్నాయని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకి డీఎస్పీ తొత్తుగా మారి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని విమర్శించారు. మహిళలపైనా కేసులు నమోదు చేసిన ఘనుడు డీఎస్పీ అని మండిపడ్డారు. తన ఇంటిలోకి వచ్చి తనను వేధించారని.. ఇకపై తన ఇంట్లోకి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. చేతికి ఏది దొరికితే దాంతోనే తిరగబడతామని తేల్చిచెప్పారు. 

సెగలు రేపుతోన్న మంగళవారం

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' పేరుతో పాన్ సౌత్-ఇండియన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ ఆవిష్కరించింది. టాప్‌లెస్‌గా ఉన్న పాయల్ తన లుక్స్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఆమె శైలజ. “శైలూ... చాలా కాలం పాటు మీ గుండెల్లో నిలిచిపోతుంది అంటూ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

పదహారేళ్ల వయస్సులో....

మరో రెండు రోజుల్లో 36వ పుట్టినరోజు జరుపుకోనున్న సమంత ఫ్యాన్స్ కు ముందే చిన్ని ట్రీట్ ఇచ్చింది. 16వ ఏట దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నవయవ్వనంతో నిగనిగలాడిపోతున్న సామ్ ఈ చిత్రంలో మరింత అందంగా కనిపిస్తోంది చెప్పాల్సిందే. "నాకు అప్పుడు 16 ఏళ్లు'' అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సిటాడెల్ ప్రాజెక్టులో బిజీగా ఉన్న సామ్ ఆరోగ్యం కుదుట పడడంతో సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.  

ఇడుపులపాయకు ఎంపీ అవినాష్‌ పయనం

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడిలో ఓవైపు.. సుప్రీం కోర్టు షాక్‌ మరోవైపు.. ఈ నేపథ్యంలో వైసీపీ కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఇడుపులపాయలో తమ కుటుంబ సభ్యులతో అవినాష్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే వైఎస్‌ కుటుంబంలోని కీలక వ్యక్తులు ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆర్డర్‌తో సీబీఐకి స్వేచ్ఛ వచ్చిందని.. ఇక అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ తథ్యమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్‌ కుటుంబ సభ్యులతో అవినాష్ రెడ్డి భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదు: మంత్రి జగదీష్‌రెడ్డి

రాయల తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ ఇప్పుడు సాధ్యం కాదని తేల్చిచెప్పేసారు మంత్రి జగదీష్‌రెడ్డి. జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఏపీలో ప్రభుత్వాల వైఫల్యాలు, పాలకుల లోపంతోనే రాయల తెలంగాణ అంశంపై తెరమీదకొచ్చిందన్నారు. ఏపీ ప్రజలు పాలకులను మార్చి సువర్ణాంధ్రగా మార్చుకోవాలని తెలిపారు. వెనుకబాటుకు కారణమైన పాలకుల మీద ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అలాగే అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా.. ఏపీ ప్రజలు, మేధావులు, నాయకులు ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్న మంత్రి జగదీష్‌రెడ్డి.. బీఆర్ఎస్‌తోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్‌ సాకారమని స్పష్టంచేశారు.

వైఎస్ షర్మిల బెయిల్ పిటిష్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిష్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. జూబ్లీహిల్స్‌ పోలీసులపై దాడి కేసులో అరెస్టైన షర్మిలకు.. నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్‌ దాఖలు చేయనున్నారు పోలీసులు. పోలీసులపై దాడి కేసులో అరెస్ట్‌ అయిన షర్మిల ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. కూతురిని పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్‌గూడ జైలుకు వెళ్లారు.

భలే ఫిట్టింగ్ పెట్టావు సామి.. సర్పంచ్‌ ప్రశ్నకు లోకేష్‌ భరోసా

యువగళం పాదయాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పల్లె ప్రగతి కోసం మీ లోకేష్‌ ముఖాముఖి కార్యక్రమంలో ఓ సర్పంచ్.. టీడీపీ యువనేత నారా లోకేష్‌కు జగన్ సర్కారు దారి మళ్లించిన గ్రామ పంచాయతీ నిధులపై ప్రశ్న అడిగారు. వైసీపీ ప్రభుత్వం వాడుకున్న 8 వేల 660 కోట్ల రూపాయల గ్రామ పంచాయతీ నిధులను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇస్తారా? అని సర్పంచ్ అడిగారు. దానికి నారా లోకేష్ భలే ఫిట్టింగ్ పెట్టావు సామి అంటూ నవ్వుకున్నారు.

ఆ తర్వాత కాసేపటికే సర్పంచ్‌లకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు యువనేత. కేంద్రం ఇచ్చిన గ్రామ పంచాయతీ నిధులను జగన్ సర్కారు దారి మళ్లించడం దారణమన్న నారా లోకేష్.. 8 వేల 660 కోట్ల రూపాయలపై తిరిగి ఇవ్వడంపై కాబోయే ముఖ్యమంత్రితో చర్చిస్తామని సర్పంచ్‌లకు భరోసా ఇచ్చారు. నేరుగా పంచాయతీ ఖాతాలకే నిధులిస్తామని.. సర్పంచుల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు.

ఇదే సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపైనా నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదన్నారు. వాలంటీర్లను పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తామని నారా లోకేష్ చెప్పారు.

వైఎస్‌ సునీత పేరుతో ఫ్లెక్సీలు

కడప జిల్లాలో వైఎస్‌ సునీత పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆమె రాజకీయ ప్రవేశంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కొందరు గుర్తు తెలియనివ్యక్తులు. ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల,ప్రొద్దుటూరు నియోజక వర్గాల్లో ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న డా.సునీత గారికి..స్వాగతం..సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు,వాల్‌ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కడప జిల్లాలో సునీత పొలిటికల్‌ ఎంట్రీ పోస్టర్లు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్‌ ఊరికో ఉద్యోగమైనా ఇచ్చిండా..?: రేవంత్‌రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న సీఎం కేసీఆర్‌ మాట తప్పారని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. 9 ఏళ్లుగా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్‌.. ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము ఒత్తిడి చేయడం వల్లే 80వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేశారని చెప్పారు. పరీక్షలు కూడా ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతుందని విమర్శించారు. TSPSCలో ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేశారని ఆరోపించారు.

న్యూజిల్యాండ్ లో భూకంపం

న్యూజిలాండ్ లోనూ భూమి కంపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. కెర్మాడెక్ దీవుల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా నమోదయింది. ఉదయం 6:11:52 సెకన్లకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. కెర్మాడెక్ దీవుల్లో పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించింది. భూకంపం తర్వాత న్యూజిలాండ్ లో ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది.

ఎవరి ఒత్తిడికీ తలొగ్గలేదు:  ఉపాసన

ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన ఆలస్యంగా గర్భం దాల్చిన విషయాన్ని వివరిస్తూ తాము ఎవరి ఒత్తిడికి తలొగ్గలేదని వివరించింది. “నేను చాలా సంతోషంగా ఉన్నాను, సమాజం కోరుకున్నప్పుడు కాకుండా మనం కోరుకున్నప్పుడు నేను తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నాను. కాబట్టి, మా పెళ్లయిన పదేళ్ల తర్వాత, మేము ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిస్తున్నాము. ఇది పిల్లలను కనేందుకు సరైన సమయం అని భావించామని చెప్పింది.

దేశాన్ని నాశనం చేయాలన్నదే బీజేపీ ఎజెండా: మంత్రి జగదీష్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలన తీరుపై మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశాన్ని నాశనం చేయాలన్నదే బీజేపీ ఎజెండా అని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే గొప్ప చైతన్యం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డపై బీజేపీ నేతల ఆగడాలు సాగవన్నారు. యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్యే సునీత, పలువురు నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీష్ రెడ్డి.. తెలంగాణ గడ్డపై బీజేపీ నేతలు ఆగడాలు సాగవన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టిన భట్టి

చేవెళ్ల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు బాధాకరమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన.. కేంద్రంపై మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. ప్రశాంతంగా ఉన్న దేశాన్ని అల్లకల్లోలం చేసేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

పాడుబడ్డ టిడ్కో ఇళ్లు

పేదలందరికీ ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఆధునాతన హంగులతో నిర్మితమైన టిడ్కో గృహాలు పేదలకు అందకుండా పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో అవి ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందడంలేదు. రాజమహేంద్రవరం రూరల్‌లోని ధవళేశ్వరం ఉప్పెర కాలనీ సమీపంలో కోట్లాది రూపాయల వ్యయంతో టిడ్కో ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ నిర్లక్ష్యంపై వామపక్షాల నేతలు మండిపడుతున్నారు.

పోలీసులపై విరుచుకుపడ్డ విజయమ్మ

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. షర్మిలను కలిసేందుకు జూబ్లీహిల్స్ పీఎస్‌ కు వచ్చిన విజయమ్మను లోపలకు అనుమతించకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయి మహిళా కానిస్టేబుల్‌ పై చేయి చేసుకున్నారు. అంతకు ముందు విధుల్లోఉన్న ఎస్‌ఐ,కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

రౌడీ గ్యాంగ్ @కర్నూల్

కర్నూలు జిల్లాలో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. బి.తాండ్రపాడులో పలువురు యువకులు జులాయిగా తిరుగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఒకే రౌడీ గ్యాంగ్ మూడు చోట్ల దాడులకు తెగబడింది. నగర శివారులో రౌడీ మూక హల్‌చల్‌ చేశారు. జనంపైనా, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారిపైనా పట్టపగలే దాడులకు తెగబడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రౌడీ గ్యాంగ్‌ దాడులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. 

షర్మిలపై పోలీసుల కేసు

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై షర్మిల చేయి చేసుకున్నారంటూ షర్మిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌కు బయల్దేరిన షర్మిలను.. పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. దీంతో షర్మిల తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమెను అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పీఎస్ కు తరలించారు. ఈ క్రమంలో షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు. షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు.

Happy Birthday: మాస్టర్ బ్లాస్టర్ @50

ఇండియన్‌ క్రికెట్‌ ఐకాన్‌ సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌ ఇవాళ 50వ వసంతంలోకి ప్రవేశించారు. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సచిన్‌ పదిహేనేళ్ల వయస్సులోనే 1987-88లో స్నేహితుడు వినోద్‌ కాంబ్లీతో కలసి వరల్డ్‌ రికార్డు భాగస్వామ్యంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. జంటిల్‌మెన్‌ గేమ్‌ తో క్రికెట్‌కు కేరాఫ్‌గా మారాడు. 2012లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పదేళ్లు అవుతున్నా ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.


అక్కడ పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్‌లు: మంత్రి హరీష్‌

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్‌లు ఉన్నాయని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. సిద్ధిపేటలో పర్యటించిన ఆయన.. 50 మంది వికలాంగులకు హోండా స్కూటీలు పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనివిధంగా వికలాంగులకు సీఎం కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో లక్ష రూపాయల విలువైన బైక్‌లను వికలాంగులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు అందరూ తరలిరావాలి: బాలయ్య

విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సర్వంసిద్ధం అవుతోంది. ఈనెల 28న విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్‌స్టార్ రజనీకాంత్, నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతున్నారు. 28న సాయంత్రం జరిగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తెలుగు ప్రజలందరూ తరలిరావాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

విశాఖ విలవిల

విశాఖలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక విశాఖ జూ పార్క్‌లో జంతువులు నీటిలో సేదతీరుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు వాటికి సంరక్షణ చర్యలు చేప డుతున్నారు. వేడిని తట్టుకునేవిధంగా తాటాకుల పందిళ్లు వేశారు. అటు సందర్శకులతో జూ పార్క్‌లో సందడి నెలకొంది.  

కళ్లు తెరవకముందే తల్లితో సహా...

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణి, శిశువు మృతి చెందారు. సిర్గాపూర్‌ మండలం వాసర తండాకు చెందిన రేణుక.. డెలివరీ కోసం రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చింది. నిన్న సాయంత్రం ఆరోగ్యం విషమించింది. వైద్యులు డెలివరీ చేయడంతో మృత శిశువు జన్మించింది. రేణుక పరిస్థితి విషమంగా మారింది. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కార్డియాక్‌ అరెస్ట్‌ వల్లే రేణుక మృతి చెందిందని వైద్యులు అంటున్నారు.

గోల్డెన్ లెగ్ కామెంట్ పై సంయుక్త క్లారిటీ

మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ హిట్ చిత్రాల కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటోంది. విరూపాక్ష హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని పిలుస్తున్నారు. అయితే సంయుక్త మాత్రం దీనిపై చాలా హుందాగా స్పందించింది.  గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అనేవి కాలం చెల్లిన భావనలని సంయుక్త పేర్కొంది. అదృష్టాన్ని బట్టి నటిని ఎంపిక చేయకూడదని ఆమె అభిప్రాయపడింది. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా నటీనటుల ఎంపిక జరగాలని సంయుక్త సూచించింది. 

అందాల మీనా @40 years ఇండస్ట్రీ

బాలనటిగా తెరంగేట్రం చేసిన అందాల మీనా 1980-90లలో అగ్ర నటిగా వెలుగొందింది. డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణించింది. ఈ క్రమంలో మీనా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 40ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్నిహితులతో కలిసి ఒక వేడుకను నిర్వహించారు. రజనీకాంత్, రాధిక శరత్‌కుమార్, రోజా సెల్వమణి, ఖుష్బూ, స్నేహ, శ్రీదేవి, ప్రభుదేవా, బోనీకపూర్, సంఘవి , మరికొందరు నటీనటులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మీనా కూతురు ఇచ్చిన స్పీచ్ అతిథులను కంటతడి పెట్టించింది. వేదిక మీద ఉన్న నైనికను రజనీకాంత్ హత్తుకుని నుదుటన ముద్దు పెట్టుకున్నారు. మేమంతా ఉన్నాం అని భరోసా ఇచ్చారు. 

యర్రగొండపాలెం ఘటనపై NSG సీరియస్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనను NSG హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకుంది. NSG కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. యర్రగొండపాలెం పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. గతంలో నందిగామ, ఇప్పుడు యర్రగొండపాలెం దాడి ఘటనలపై NSG బృందం నివేదిక ఇచ్చింది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై NSG బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.



విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయిన PSLV C-55

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా సంయుక్తంగా... పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి) సి-55 శనివారం లాంచ్ చేసింది. 228 టన్నుల బరువున్న PSLV తన 57వ విమానంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ నుంచి తూర్పు వైపు తక్కువ వంపు ఉన్న కక్ష్యలోకి పంపింది. రెండు ఉపగ్రహాలు సింగపూర్‌కు చెందినవి. వాటి బరువు 757 కిలోగ్రాములు. చంద్రయాన్-3, తొలి సోలార్ మిషన్ ఆదిత్య L-1తో సహా ముందుకు సాగుతున్న పెద్ద మిషన్ల కోసం సిద్ధమవుతున్న భారత అంతరిక్ష సంస్థకు ఇది సంవత్సరంలో మూడవ అతిపెద్ద ప్రయోగం.