చిట్టి న్యూస్

జనగామ బీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి; టెన్షన్ వాతావరణం

జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. పల్లా వద్దు..ముత్తిరెడ్డే ముద్దు అంటు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.ముత్తిరెడ్డి అనుచరులు భారీగా జనగామకు చేరుకుంటున్నారు.బీఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వద్దని..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి ఇవ్వాలని ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో జనగామలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు. 

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాదం

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులకు, ఆలయ ఈవో కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈవో శ్రీనివాసరెడ్డి తమను అవమానించారని అర్చకులు ఆరోపిస్తున్నారు. చైర్మన్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ట్రస్టు బోర్డు సమావేశానికి  వంశపారంపర్య అర్చకుడు పార్థసారధి ఆచార్యులు హాజరుకావాల్సి ఉంది. కానీ శ్రావణమాసం నేపథ్యంలో తన వారసుడు ఏడీ అంజన్ కుమార్ ఆచార్యులను సమావేశానికి పంపించారు. దీనిపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి నీవెందుకు వచ్చావని మండిపడ్డారు. అంజన్ కుమార్ సైతం తాను వంశపారంపర్య అర్చకుడునని వాదించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.  

స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.శ్రీ సత్యసాయి జిల్లా చలివెందులలో వైసీపీ మద్దతుదారుడిని గెలిపించాలని డబ్బులు పంచారు వైసీపీ నేతలు. అయితే పోలీసుల సమక్షంలోనే యధేచ్చగా నగదు పంపిణీ చేస్తున్నా,గుంపులు, గుంపులుగా పోలీంగ్‌ కేంద్రాల్లో తిరుగతున్నా అధికార పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంలేదని మండిపడుతున్నారు స్థానికులు. పోలింగ్‌ బూత్‌ నుంచి ఓటు వేసి బయటకు రాగానే వేయి రూపాయల నగదు పంపిణీ చేశారు మండల వైస్‌ ఎంపీపీ రఘునాథ రెడ్డి. అయితే వైసీపీ నగదు పంపిణీని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

కృష్ణా తీరాన నారా లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ పాదయాత్ర కృష్ణా తీరంలోకి ప్రవేశించబోతోంది. కాసేపట్లో చంద్రబాబు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఉండవల్లి కరకట్టపై నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు కేశినేని చిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా లోకేష్‌ పాదయాత్ర సాగినప్పుడు బోట్స్‌ ద్వారా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 150 పడవలు యువగళం జెండాలు కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.  

ఏలూరు జిల్లా వీరమ్మ గుంట పంచాయతీ ఉప ఎన్నికల్లో ఘర్షణ

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మగుంట గ్రామంలో సర్పంచ్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారం ఉందని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. 

నాయిని స్టీల్‌ బ్రిడ్జ్‌ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

వచ్చే ఎన్నికల తరువాత ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.హైదరాబాద్‌లో నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్‌ బ్రిడ్జ్‌ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 2.6 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ ప్లైఓవర్‌కు 450 కోట్ల రూపాయల వ్యయం అయింది.అతి ఎత్తైన స్టీల్ బ్రిడ్జితో దశాబ్దాల ప్రజల కల నెరవేరిందని అన్నారు మంత్రి కేటీఆర్.తెలంగాణ ఏర్పడ్డాక ప్రారంభించిన 36వ ఫ్లైఓవర్ ఇదని అని,స్టీల్ బ్రిడ్జ్‌తో హైదరాబాద్‌కు కొత్త అందం వచ్చిందని అన్నారు.లోయర్,అప్పర్ ట్యాంక్‌బండ్ కలిపేలా అద్భుత నిర్మాణం జరిగిందని,కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు కేటీఆర్‌. 

Nellore: ఉదయగిరి వైసీపీలో తారాస్థాయికి చేరిన  వర్గ విభేదాలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గడపగడపకు కార్యక్రమంలో.. వైసీపీ నేతలు బహాబాహీకి దిగారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. కారు దిగిన మేకపాటి రెండు వర్గాల నాయకులను తీవ్రస్థాయిలో మందలించారు. ఇలా కొనసాగితే మీ మండలానికో దండం..ఇక మీ మండల కార్యక్రమాలకు రానంటూ రాజగోపాల్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.  

సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ రేపు సూర్యాపేట పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త మార్కెట్ యార్డు వెనకాల 50 ఎకరాల స్ధలంలో దాదాపు లక్ష మందితో సూర్యాపేట ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు దిశానిర్ధేశం చేయనున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.  

తిరుమల కాలినడక బాటలో తగ్గిన భక్తులు

తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతుంది.మొదటి ఘాట్‌లో ఎలిఫెంట్ ఆర్చ్‌ దగ్గర చిరుత కనిపించింది.ట్రాప్‌ కెమెరాలకు చిరుత దృశ్యాలు చిక్కాయి.అటు స్పెషల్‌ టైప్‌ కాటేజీల దగ్గర ఎలుగుబంటి సంచారం భక్తులను కలవరపెడుతుంది.ఎలుగుబంటిని బంధించేందుకు బోన్లు ఏర్పాట్లు చేశారకు టీటీడీ అధికారులు. మరోవైపు వన్య ప్రాణుల సంచారంతో తిరుమల కాలినడక బాటలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతపు సెలవులు ఉన్నా రోజు రోజుకు జనం తగ్గుతున్నారు.చిరుతల సంచారంలో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్న నేపధ్యంలో 7 వేల సర్వదర్శనం టోకన్లు మిగిలిపోయాయి.  

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులను ఇసుక లారీ ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో జరిగింది. మృతులు కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో ఓ శుభకార్యానికి హజరై తిరిగి వెళతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

విజయవాడలో యువగళం ప్రభంజనం

ఇక యువగళం ఏర్పాట్లను పర్యవేక్షించారు టీడీపీ నేత కేశినేని చిన్ని.విజయవాడలో నారా లోకేష్‌ యువగళం ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు కేశినేని చిన్ని.యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. లోకేష్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. అయితే వైసీపీ సర్కార్‌ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.రేపటి భవిష్యత్ కు లోకేష్ మాత్రమే భరోసా అని అన్నారు.  

బుర్రా మధుసూదన్‌ను అడ్డుకున్న మెట్లవారిపల్లె గ్రామస్తులు

ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు చుక్కలు చూపించారు జనం.ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తమతో ఓట్లు వేయించుకున్నారని... నాలుగేళ్ళ తర్వాత తాము గుర్తొచ్చామా అంటూ ఎమ్మెల్యేని నిలదీశారు మెట్లవారిపల్లె గ్రామస్తులు. తాము ఉన్నామో.. పోయామో చూడటానికి వచ్చారా అంటూ  నిలదీశారు, రోడ్లు వేస్తామని,తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చారని..కానీ గత నాలుగేళ్ళలో ఇవేమీ చేయలేదని ఆరోపించారు.ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తమ గ్రామానికి వచ్చావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో అప్పటికప్పుడే గడపగడప కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు.  

మామ  ఫంక్షన్‌హాల్‌ ను ప్రారంభించనున్న అల్లూ అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లనున్నారు. తన మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్‌ పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌తోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన ఆహ్వానించారు. 

Tiger at Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం

శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కొత్తూరు మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గురువారం వరకు పార్వతీపురం మన్యం జిల్లా కాట్రగడ్డ పరిసర ప్రాంతాల్లో తిరిగిన పులి.. శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తూరు మండలంలోని ఈతమనుగూడ, కారిగూడ, దొండమామిడి గూడ, బాండ్రుగూడ ప్రాంతాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. 

డ్రైవింగ్‌ లైసెన్సులు,ఆర్‌సీలు ఇక ఉండవు

రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు,ఆర్‌సీలు ఇక కార్డు ఉండవు. వాహన్‌ పరివార్‌తో సేవలన్నీ ఆన్‌లైన్‌ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి,డిజిటల్‌ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. ఏపీఆర్‌టీఏసిటిజన్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.వాహనాల్ని తనిఖీలు చేసే పోలీసు, రవాణాశాఖ అధికారులకు డౌన్‌లోడ్‌ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

ఉదయగిరి వైసీపీలో తారాస్థాయికి చేరిన  వర్గ విభేదాలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గడపగడపకు కార్యక్రమంలో.. వైసీపీ నేతలు బహాబాహీకి దిగారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. కారు దిగిన మేకపాటి రెండు వర్గాల నాయకులను తీవ్రస్థాయిలో మందలించారు. ఇలా కొనసాగితే మీ మండలానికో దండం.. ఇక మీ మండల కార్యక్రమాలకు రానంటూ రాజగోపాల్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.   

రెండో రోజు కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్, పారిశుధ్య, ఎంటమాలజీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. నేటి నుంచి జీహెచ్ఎంసీకి చెందిన అన్ని కార్యాలయాల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు విధులకు రాకుండా పనులు స్తంభింపచేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, రెగ్యూలర్ ఉద్యోగులకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు.కేఎస్సార్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.ఇటీవలే ఫలకనుమా ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితి సమీక్షీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. 

వైసీపీకి అనుకూలంగా ఓటర్‌ స్లిప్‌లు రాస్తున్న వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలు భయపడినట్లే జరుగుతోంది. కర్నూలు జిల్లాలో ఇవాళ జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలోని కోట కందుకూరు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు స్లిప్‌లు రాస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద స్లిప్‌లు రాస్తున్నవారి వీడియోలను విడుదల చేశారు. ఇదే వీడియోను అధికారులకు పంపినట్లు ఆమె తెలిపారు.

పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మ గుంట పంచాయతీ ఉప ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్ర వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులపై డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ లాఠీ చార్జ్ చేశారు. అధికారం ఉందని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి దర్జాగా వెళ్ళి వస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sathya Sai District: వైసీపీ నేతలకు, గ్రామస్తులకు వాగ్వాదం

ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో వాలంటీర్ల అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లు వైసీపీకి అనుకకూలంగా వ్యవహరిస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చలివెందుల గ్రామంలో సర్పంచ్‌ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న వాలంటీర్‌ను అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో అధికార పార్టీ నేతలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.

వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి- మంత్రి తలసాని

 హైదరాబాద్‌లోని స్టీల్ బ్రిడ్జి ని రేపు ప్రారంభవించనున్నారు మంత్రి కేటీఆర్.ఈ నేపధ్యంలోఎమ్మెల్యే ముఠా గోపాల్‌,జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ స్టీల్ బ్రిడ్జితో ఇందిరా పార్క్,ఆర్టీసీ క్రాస్ రోడ్డు,వీఎస్టీ జంక్షన్ లలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర నున్నాయని తెలిపారు.ఈ బ్రిడ్జికి మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టామన్న తలసాని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుంటుందని అన్నారు. 

ఏపీలో భూముల ధరలు తగ్గడానికి జగన్‌ అసమర్థ పాలనే కారణం

ఏపీలో భూముల ధరలు తగ్గడానికి జగన్‌ అసమర్థ పాలనే కారణమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అమలాపురంలో ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు . ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందన్న ఆయన మేధావులు కూడా మాట్లాడేందుకు భయ పడుతున్నారని అన్నారు., తెలంగాణలో భూములు ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లు పలుకుతోందని,అప్పట్లో కోకాపేటకు ఫార్ములా వన్ రేసింగ్ తీసుకురావాలనుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌కు బ్రాండింగ్ తేవాలను కునుకుంటే..ఫార్ములా వన్ రేసింగ్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడ్డాడని అన్నారు.

గ్రేటర్‌లో బస్సు యాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం

పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌ఛార్జులతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ భేటీ అయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభంకానున్న బస్సుయాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. బస్సు యాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాల్గొంటారని, గ్రేటర్‌లో బస్సు యాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధమైందని తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడిని బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, యాత్ర తేదీని రేపు చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. గ్రేటర్‌లో టీటీడీపీ బస్సు యాత్ర సక్సెస్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు కాసాని జ్ఞానేశ్వర్‌.

బొత్స కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపు

మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి కారు చౌకగా భూముల కేటాయింపుపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.బొబ్బిలిలో డిస్టలరీ కోసం 30 ఎకరాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున.ఎకరానికి 80 లక్షలు పలికే భూమిని..10 లక్షలకే ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలని..లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

BRS: బీఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి జాబితా సిద్ధం

బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటనకు సిద్ధం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌లో అసమ్మతి, ఆశావాహుల పోరు ఎక్కువైంది. కొందరు హైదరాబాద్‌ బాట పడుతుంటే.. మరికొందరు ఆందోళనలు చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏకంగా రాజశ్యామల యాగం చేస్తున్నారు. టికెట్ల వ్యవహారంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.  

గెలుపు ప్రాతిపదికన అభ్యర్ధుల జాబితా  - రేవంత్‌

గాంధీభవన్‌లో అభ్యర్థుల దరఖాస్తు ప్రతులను పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈనెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 25వేలు.. సాధారణ అభ్యర్ధులకు 50వేలుగా దరఖాస్తు రుసుము ఉంది. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల కార్యక్రమం మొదలు పెట్టామన్న రేవంత్‌రెడ్డి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించాకే అభ్యర్థుల ఖరారు ఉంటుందన్నారు. అప్పటి వరకు తామే అభ్యర్ధులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయన్నారు. 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం: చంద్రబాబు

అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన మహిళా ప్రగతి-ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో మహిళే ఆర్థికమంత్రిగా వ్యవహరించి....ఇల్లును చక్కదిద్దుతుందన్నారు. టీడీపీకి సంపద సృష్టించడం తెలుసన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తమ హయాంలో మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశామన్నారు. ఆక్వా రంగాన్ని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆరు నెలలు ఓపిక పడితే అధికారంలోకి వచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. 

తిరుమలకు చేరుకున్న కొత్త బోనులు

తిరుమలలో చిరుతలను బంధించేందుకు తయారు చేయించిన కొత్త బోనులు తిరుమల చేరుకున్నాయి. సరికొత్త టెక్నాలజీ తో తయారు చేసిన ఈ బోనులను మహారాష్ట్ర నుంచి తెప్పించింది అటవీశాఖ. చిరుత కదలికలను బట్టి ఈ బోన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి కెమెరా ట్రాప్స్‌తో నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నారు. 

మార్గదర్శిపై సీఐడి దాడులను ఖండించిన సీపీఐ

అనంతపురంలో మార్గదర్శిపై సీఐడీ దాడులకు వ్యతిరేకంగా...సీపీఐ వినూత్నంగా నిరసన తెలిపింది. గాంధీ విగ్రహం దగ్గర మోకాళ్లపై కూర్చొని సీపీఐ కార్యకర్తలు...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజావ్యతిరేకత చూసి ఓర్వలేకపోతున్న జగన్‌....మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మార్గదర్శిపై హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా....సోదాలు నిర్వహించడం ఏంటని సీపీఐ నేతలు ప్రశ్నించారు. కక్షపూరిత చర్యలను సీఎం జగన్‌ మానుకోవాలన్నారు. 

Yuvagalam: విధి పగబడితే లోకేష్‌ అన్న దారిచూపాడు

తాడేపల్లిలో నివాసముండే షేక్ రెహానా ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. చంటిబిడ్డతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయింది. స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తమ కష్టాలను యువనేత లోకేష్‌కు విన్నవించుకుంది. పాదయాత్రకు బయలుదేరే నెలముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు 30వేలు సంపాదిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ యువనేతకు అల్పాహారాన్ని అందజేసింది.  

Andhra Pradesh: క్రీడా రంగానికి జగన్‌ సర్కార్‌ అన్యాయం

ఉత్తరాంధ్ర పై వైసీపీ సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తోంది. క్రీడా రంగానికి జగన్‌ సర్కార్‌ అన్యాయం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం స్పోర్ట్స్ స్కూల్‌ని కడపకు తరలించిన సర్కార్‌. ఉత్తరాంధ్రలోని క్రీడా మైదానాల్లో కాసుల వేట ప్రారంభించింది జీవీఎంసీ.ఇప్పటికే MVP స్పోర్ట్స్ ఏరినా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసిన జగన్‌ ప్రభుత్వం ఇతర గ్రౌండ్లు,ఇండోర్ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు.. కట్టపెట్టేందుకు సిద్ధమైంది.స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం,బీచ్ రోడ్ లోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రైవేట్ పరం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. 

గుజరాత్.. శ్రీకాకుళం మత్స్యకారులకు తప్పిన ప్రాణాపాయం

గుజరాత్ తీరంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు ప్రాణాపాయం తప్పింది. విరావల్ సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటలో ఉండగా.. బోటు అకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో.. మత్స్యకారులు ఈదుకుంటూ పక్కనున్న బోట్లలోకి చేరుకున్నారు. రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్.. మత్స్యకారులను రక్షించింది. మునిగిపోయిన బోటులో రణస్థలం మండలానికి చెందిన 8 మంది మత్స్యకారులు ఉన్నారు. అందరూ సేఫ్‌గా బయటపడడంతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

హైదరాబాద్‌ మార్కెట్‌లో  మెర్సిడెస్‌ బెంజ్‌  హవా

మెర్సిడెస్‌ బెంజ్‌ పై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ హవా కొనసాగుతుండగా అందులో 30 శాతం మహిళా కొనుగోలుదారులే ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ మోడళ్ల అమ్మకాలపై లగ్జరీ కార్ల ఉత్పత్తిదారులు మెర్సిడెస్‌ బెంజ్‌ ఆసక్తిగా ఉందని, వచ్చే ఏడాదిలో 3,4 ఈవీ కార్లను తీసుకు వస్తామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ తెలిపారు. మూడేళ్లలో తాము విక్రయించే కార్లలో నాలుగో వంతు ఎలక్ట్రానిక్‌ కార్లే ఉంటాయని అన్నారు.  

Begging Mafia: హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా

హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా బరితెగించింది. సిటీలో చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో భిక్షాటన చేయిస్తున్నారు. ఇలా బెగ్గింగ్‌ చేస్తున్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అనిల్‌ పవార్‌.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనిల్‌ పవార్‌ను అరెస్ట్‌ చేశారు.  ప్రతి రోజూ ఒక్కొక్కరి నుంచి.. 5 వేల నుంచి 6 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. భిక్షాటన చేస్తున్న 23మందిని అదుపులోకి తీసుకొని విచారించి ఎన్జీవో హోమ్‌కు తరలించారు.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య యాత్రలో భాగంగా ఈ పర్యటన చేస్తున్నారు. ఈ చైతన్య యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.ఇవాళ అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో వైద్యులు, న్యాయవాదులు, రైతులు, బ్రాహ్మణ సమైక్య, పాస్టర్‌లతో పాటు ఆయా వర్గాల నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.