- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్ ప్రగతి నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీ కొట్టి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు, బాధితులు పట్టుకుని చితకబాదారు. పలు ద్విచక్ర వాహనాలను, రోడ్డుపై నిలిపి ఉంచిన కారును ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా కారును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనదారులు, కారును వెంబడించి కూకట్‌పల్లి ఎల్లమ్మ చెరువు వద్ద అడ్డుకున్నారు. ఇద్దరు యువకులను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరులో టీడీపీపై వైసీపీ దాడులు చేశారు.చేజర్ల మండలం పాతపాడులో టీడీపీ వార్డు మెంబర్ అభ్యర్థి బైక్ తగలబెట్టారు వైసీపీ కేడర్.నిన్న టీడీపీ తరపున నామినేషన్ వేసిన బాబాసాహెబ్‌పై దాడి చేశారు.నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోకపోవడంతో బౌతిక దాడులకు దిగారు. ఇటీవల ఐదో వార్డు మెంబర్ మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు.తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపించారు.

ప్రభుత్వం బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ 20 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ మొదటి మహాసభ హనుమకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటల ముఖ్యఅతిథిగా హజరయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యూలరైజ్ చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వంతో రైతులకు భరోసా దొరికిందని మంత్రి హరీష్ రావు అన్నారు. బావుల వద్ద మీటర్లు పెడతామని బీజేపీ, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ చెబుతుంటే... నీళ్లకు, కరెంట్‌కు డోకా లేదని, మూడు పంటలు పండించాలని సీఎం కేసీఆర్ రైతులకు చెబుతున్నారని మంత్రి అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారని తెలిపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నందల పాడులో సురేంద్ర అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అదే కాలనీకి చెందిన యువకులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. అర్ధరాత్రి ఈ ఆపరేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపింది. దీంతో బాలికపై దాడి చేసిన ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక రెండ్రోజులుగా ఆరు ప్రాంతాల్లో సంచరిస్తూ అటు అధికారుల్ని, భక్తులను చిరుత భయాందోళనకు గురిచేసింది.

సినీ నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రలతో బిజిబిజీగా ఉన్నారు. ఇటీవలే రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించిన రజనీకాంత్... తాజాగా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభిమానులకు అభివాదం చేసి, వారితో కాసేపు ముచ్చటించారు. రజనీకాంత్ బద్రీనాథ్ టూర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు కేంద్రాల నుంచి రథయాత్రలు చేపట్టనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి యాత్రలు ప్రారంభించే అవకాశం ఉంది. ఒక్కో కేంద్రం నుంచి ప్రారంభమయ్యే రథ యాత్ర ప్రతీ రోజు కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

నేడు మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 53కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జీవధాన్ స్కూల్ ప్రాంగణంలో 35వేల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి రానుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9కి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు కామారెడ్డికి చేరుకుంటారు.

ఈనెల 18న జహీరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ జరగనుంది. ఈనేపథ్యంలో ఇవాళ గాంధీభవన్‌లో జిల్లా నేతలతో మాట్లాడి.. నియోజకవర్గంలోని, ఏ ప్రాంతంలో సభ పెట్టాలన్నది నిర్ణయించనున్నారు. ఖర్గే సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించనుంది. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, స్ర్కీనింగ్ కమిటీలు గాంధీభవన్‌లో తొలి సారిగా భేటీ కానున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సింగపూర్ తరహాలో మూసీ నదిపై బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు బీఆర్‌ఎస్ అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్... హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. కాచిగూడ డివిజన్‌లోని బర్కత్ పుర హౌసింగ్ బోర్డు కాలనీ పార్కును ప్రారంభించారు. 52 కోట్ల నిధులతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జీలను సింగాపూర్ తరహాలో నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఎంపీలు బఫూన్లంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా కమెడియన్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు ...నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరోక్షంగా రఘునందన్‌రావు విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బీజేపీ ఆఫీసులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో రఘునందన్‌రావు పాల్గొన్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సైనికులను సన్మానించారు. దళితుల భూములు లాక్కున్నట్లే .. జవాన్లకు ఇచ్చిన 3ఎకరాల భూములను కాజేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రఘునందన్‌రావు ఆరోపించారు. దేశంలో అతి తక్కువ సమయం పాటు అసెంబ్లీ నడిపిన సీఎంగా కేసీఆర్ రికార్డ్ సాధించారని విమర్శించారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర టీడీపీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర మంగళవారం మంగళగిరి నియోజవర్గంలోకి ప్రవేశించనుంది. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. స్వాగత సన్నాహక కార్యక్రమంలో భాగంగా నియోజవర్గంలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది.. యువగళం స్టిక్కర్లతో ఉన్న కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరిలో ఈ ర్యాలీ కొనసాగింది. ఇప్పటికే నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామికి.... ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు జనం ఆయన్ను అడ్డుకుంటే, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం గుంటిపల్లె గ్రామంలో జరిగింది. మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గీయుల మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పెనుమూరు మండలంలో పర్యటిస్తున్న నారాయణస్వామిని తమ గ్రామానికి రావద్దంటూ.. గుంటిపల్లెకు వెళ్లే మార్గంలో వైసీపీ నేతలు, ముళ్ల కంచె, రాళ్లను అడ్డుగా పెట్టారు. దీంతో అసహనానికి గురైన నారాయణస్వామి.. వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతోనే నారాయణస్వామి పొర్లుదండాలు పెట్టి ఓట్లు అడుక్కునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆయన తమ గ్రామానికి రావాల్సిన అవసరంలేదన్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న యువకులు గ్రామానికి ఇరువైపులా ఉన్న మార్గాల్లో ముళ్లకంపలు, రాళ్లు అడ్డంగా పెట్టారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ నిరసన చేశారు. చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

విశాఖ గోపాలపట్నంలో ఆత్మహత్యకు పాల్పడిన యువతి కేసు మరో మలుపు తిరిగింది.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు,సూర్యప్రకాష్ అనే యువకుడిని ప్రేమిస్తూ,మరో యువకుడు లంకా సాయి కుమార్‌ను పెళ్లిచేసుకుంది షేక్ కరిష్మా.ఇద్దరూ వచ్చి కరిష్మాను నిలదీయడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది. మరోవైపు భయంతో రైలు కిందపడి ప్రియుడు సూర్యప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరిష్మా భర్త సాయికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం గాజువాక నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగుతోంది. పాత గాజువాకలోని వుడా రోడ్డులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గాజువాక శ్రీకన్య థియేటర్ కూడలి నుంచి, బహిరంగ సభ వరకు వారాహి పై పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉంటుంది. కాన్వెంట్ జంక్షన్, సిందియా, మల్కాపురం, శ్రీహరిపురం మీదగా పాత గాజువాక వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు జనసేన నేతలు..

విపక్షాలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. కావాలనే సమస్యలు సృష్టించి వాటి ద్వారా రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ పెనుమార్పులు తీసుకురాబోతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో రెండో రోజు పలెనిద్ర కార్యక్రమలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో... ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ తగిలిగింది. పెద్దమల్లిపురం గ్రామంలో... గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో... ఆయన్ను అడ్డుకున్నారు మహిళలు. నాలుగేళ్లుగా రానిది.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వచ్చారంటూ.... మండిపడ్డారు. తమ ఊరికి డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు, మంచినీటి కొళాయిలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల వచ్చినప్పుడే .. ఓట్ల కోసం ఊళ్లకు వస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళలకు సమాధానం చెప్పలేక.... అక్కడినుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి.

తెలంగాణ సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రార్థనా మందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ప్రారంభించనున్నారు.ఆగస్టు 25న ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మూడు మతాలకు సంబంధించిన మత గురువుల సమక్ష్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభించనున్నారు. సచివాలయంలో విధులు నిర్వహించే వివిధ వర్గాలు ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఇక్కడే ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ మూడు నిర్మాణాలను చేపట్టారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా ఇవి నిలువనున్నాయి
ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమావేశమై ఆలయాల ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నెల 25న పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అదే రోజు, కేసీఆర్ మసీదు, చర్చిలను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మత పెద్దలు హాజరుకానున్నారు. సిబ్బందికి మూడు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశం ఉంటుంది.

జగన్ సర్కారు... వర్షాకాలంలోనూ రైతులకు సాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వమంటూ మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మద్దిపాటి వెంకటరాజు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం, ఆనుముని లంక ,సుభద్ర పాలెం తదితర గ్రామాల్లోని పోలాలను టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. తాడిపూడి లిఫ్ట్ పరిధిలో సాగునీరు విడుదల చేయకపోవడంతో 300 ఎకరాల్లో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి నినాదాలు చేశారు. తక్షణమే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 183వ రోజు సిరిపురం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సిరిపురంలో స్థానికులతో సమావేశమయ్యారు యువనేత. కాసేపట్లో వరగానిలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముచ్చటించనున్నారు యువనేత.
సాయంత్రం 4గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది.రావెల శివార్లలో అమరావతి ఆవేదన కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు.జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లింది తాడికొండ.లోకేష్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు. ఆయన కోసం దారిపొడవునా బారులు తీరి ఎదురు చూస్తున్నారు జనం.

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఆటోనగర్‌లోని హ్యుందాయ్ షోరూంలో గుండెపోటుతో మెకానిక్ మృతి చెందాడు.కార్ రిపేర్ చేస్తుండగా కుప్పకూలి..హార్ట్ ఎటాక్‌తో అక్కడిక్కడే మృతి చెందాడు అబ్దుల్లాపూర్ మెట్ కోహెడకు చెందిన జంగారెడ్డి గత కొంత కాలంగా హ్యుందాయ్ షోరూంలో పనిచేస్తున్నాడు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. జంగా రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, హ్యుందాయ్ షోరూం సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు టీడీపీ నేత కేసినేని చిన్ని. లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లాలో అడుగుపెడుతుండటంతో... స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర నిర్విఘ్నంగా జరగాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరోసారి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. చిత్తూరులో ప్రారంభమైన యువగళం పాదయాత్ర.... కృష్ణా జిల్లాలో అడుగుపెడుతోందన్న ఆయన.... జగన్ ప్రభుత్వానికి లోకేష్ రెడ్డి అలర్ట్ జారీ చేశారన్నారు.

ఏలూరు జిల్లా ద్వారాక తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయంలో.... ఆక్టోపస్ బలగాలు హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే.. తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ చేశారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై.. అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్‌లో బలగాలతో పాటు దేవస్థానం అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై.. ఈ డ్రిల్ నిర్వహించారు.

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని ఈవీఎంలతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాద వేగానికి డీసీఎం వాహనం పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుండి బెంగాల్‌కు ఈవీఎంలను తీసుకెళ్తుండగా.. లారీ వెంట నాలుగు ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఎలక్షన్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని హారతిరెడ్డి సూసైడ్ చేసుకుంది.భర్త సంతోష్‌రెడ్డి తోపాటు అత్తమామల వేధింపులతోనే..హారతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు.సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు హారతి భర్త సంతోష్.అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై హత్య కేసు నమోదు చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

పట్టిసీమపై జగన్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది.గోదావరి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా..ఇన్నాళ్లూ చోద్యం చూసిన వైసీపీ సర్కార్ విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణకు తరలించింది.ఈ సీజన్‌లో దాదాపు 1,400 టీఎంసీల గోదావరి జలాలు వృథా అయినా పట్టించుకోకుండా కోట్ల ప్రజాధనం వృథా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పట్టిసీమను వాడటం అనివార్యమంటూ మోటర్లను ఆన్ చేసింది. శనివారం పట్టిసీమ నుంచి రెండు టీఎంసీలకుపైగా నీటిని వదిలింది.

సిద్దిపేట జిల్లాలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. రైస్ పుల్లింగ్ కలశంతో అద్భుతాలు సృష్టిస్తామని నమ్మిస్తూ మోసాలు చేస్తోంది ఓ ముఠా. సుబ్బారెడ్డి అనే వ్యక్తి… రైస్ పుల్లింగ్ కలశాన్ని కొనేందుకు ప్రకాశం జిల్లా నుంచి చేర్యాలకు వచ్చాడు. 10 లక్షల 75 వేలు ఇచ్చి కలశం చూపెట్టాలని అడిగాడు. అయితే... మిగిలిన డబ్బులు ఇస్తేనే చూపిస్తామన్న నిందితులు.. చివరికి ఇన్నోవాలో పారిపోయారు. మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి….. చేర్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు . ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు.బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు.తెలంగాణ సర్కార్ అన్యాయాలను కేంద్ర అడ్డుకోవడంలేదంటూ లేఖలో పేర్కొన్నారు.అయితే అయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.ఈ నెల 18న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారు. వికారాబాద్ నియోజక వర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రశేఖర్.

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది.. ఇందులో భాగంగా ఈనెల 16, 17 తేదీల్లో బస్తీల్లో పర్యటించాలని పార్టీ నేతలకు కిషన్‌రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. ఈనెల 18న పేదలతో కలిసి మండల కేంద్రాల్లో.. 23, 24న కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో విశ్వరూప మహాధర్నాకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే .. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వస్తాయన్నారు కిషన్‌రెడ్డి.

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టలేదని.. రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్లను కేంద్రం ఆపింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిజం కాకపోతే మీటర్లు పెట్టిన పక్క రాష్ట్రాలకు డబ్బులు ఎలా ఇచ్చారని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు ఆపారో కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. ఒకరేమో 3 గంటల కరెంట్ చాలంటారు.. ఇంకొకరేమో మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాత్రం 3 పంటలు పండాలని కోరుకుంటున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ అన్నింటిని అమ్మేసి చేనేతలను ఇబ్బంది పెడుతుంటే.. తమ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్క్‌ని పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పోచంపల్లి నేతన్నలు చేనేతల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేసి చేనేత వారోత్సవ సభలో పాల్గొన్నారు.

తెలంగాణలో 30శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పొదుపు సంఘాల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే... పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు వస్తాయన్నారు. నాలుగునెలల్లోనే ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్‌కు పేదల ఇళ్లపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన మహాధర్నాలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శల చేశారు.

వైసీపీ ప్రభుత్వం తమపై మొండి వైఖరితో ముందుకు వెళుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వాపోయారు.

తెలంగాణ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ గమ్యంను ప్రారంభించారు TSTRC ఎండీ సజ్జనార్. ప్రజల వద్దకు ఆర్టీసీ కొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తుందన్నారు. మహిళల భద్రతకు గమ్యం యాప్ ఉపయోగపడుతుందని..యాప్‌లో ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అద్భుతంగా ఉందని అన్నారు. రాత్రివేళ బస్ స్టాప్‌లు లేని ప్రాంతాల్లో యాప్‌లో సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని అన్నారు. పల్లె వెలుగు తప్ప అన్ని ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందన్నారు సజ్జనార్.

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గర్భాలయం దర్శనం చేయిస్తామంటూ..భక్తులను మోసం చేస్తున్న దళారుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పదిహేను వందలు ఇస్తే గర్భాలయం దర్శనం చేయిస్తాము అంటూ భక్తులను మోసం చేస్తున్నారు కొందరు దళారులు.ఇలా ఆలయానికి వచ్చిన భక్తులు అడుగున దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దళారుల అవతారంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా పాలక వర్గం పట్టించుకొవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


