చిట్టి న్యూస్

Scindia : లాభాల బాటలో  మైమండీ స్టార్టప్

డబ్బుండటం గొప్పే కావచ్చు.. కానీ సొంత కాళ్ళ మీద నిలబడాలనుకోవడం ఇంకా గొప్ప.. అలా కోరుకొనే ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు మ‌హాన్ఆర్య‌మాన్ సింధియా.. జ్యోతిరాదిత్య త‌న‌యుడు. దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియ‌న్ల‌లో ఒక‌రు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియ‌ర్ సంస్థాన వార‌సుడు అయిన జ్యోతిరాధిత్య ప్రస్తుతం కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి. నిజానికి సింధియాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకొనవసరం లేదు. వీళ్లది నిజంగా రాజ‌వైభోగం. ఈ కుటుంబం ప్ర‌స్తుతం నివాసం ఉండే భ‌వంతి విలువే క‌నీసం నాలుగు వేల కోట్ల రూపాయ‌లు అని అంచ‌నా. అటు రాజ‌కీయాల్లో కూడా వీరికి మంచి పేరు ఉంది.

ఫ్యామిలీ రేంజ్ ఎంత గొప్పగా ఉన్నా జ్యోతిరాదిత్య త‌న‌యుడు మాత్రం త‌న సొంత స‌త్తా నిరూపించుకుందామని డిసైడ్ అయ్యాడు. రెండేళ్ల క్రితం 11 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఇత‌డు ఒక స్టార్టప్ పెట్టాడు. మైమండీ పేరుతో ఒక అప్లికేష‌న్ ను ఈ జూనియ‌ర్ సింధియా ర‌న్ చేస్తూ ఉన్నాడు. ఇది వినియోగ‌దారుల‌కు కూర‌గాయ‌ల‌ను అంద‌జేసే అప్లికేష‌న్. ప్రారంభించిన మొదటి ఏడాదికే మంచి లాభాల బాట‌ప‌ట్టింద‌ట‌. ఏడాదిలో 60 ల‌క్ష‌లకు స్థాయికి చేరింద‌ట దీని ట‌ర్నోవ‌ర్. ఇప్పుడు దానికి అద‌నంగా 4.1 కోట్ల రూపాయ‌ల ఫండింగ్ కూడా చేశార‌ట‌. దీంతో.. దీని మార్కెట్ వ్యాల్యూ ఐదు కోట్ల రూపాయ‌ల‌కు చేరింద‌ట‌.

మనది రాజకుటుంబం.. మనం కూరగాయలు అమ్ముకోవడం ఏంటి అనే ఒక చిన్న ఆలోచన పక్కన పెట్టి పనిలో దిగిన మ‌హాన్ఆర్య‌మాన్ సింధియా ఇప్పుడు యువ వ్యాపారవేత్తగా వహ్వా అనిపించుకుంటున్నాడు .

Yuvaraj Singh : యువీ తల్లిని బెదిరించిన మహిళ అరెస్ట్

టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ తల్లిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని చూసిన ఒక మహిళను పోలీసులు అతి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులకి గతంలో కేర్ టేకర్ గా పని చేసిన ఓ మహిళ యువీ కుటుంబాన్ని బురిడి కొట్టించాలని పథకం వేసి చివరకు దొరికిపోయింది. యువరాత్ ఫ్యామిలీని ఓ తప్పుడు కేసులో ఇరిక్కిస్తానంటూ అతడి తల్లిని, కుటుంబాన్ని బెదిరించి రూ.40 లక్షలు వసూలు చేసిన ప్రయత్నం చేసింది.

యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ సింగ్​ గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నారు. దీంతో యూవీ తల్లి షబ్నామ్​ సింగ్​ 2022లో హేమా కౌషిక్​ అనే మహిళను కేర్​ టేకర్​గా నియమించుకుంది. పనిలో చేరిన హేమా కౌషిక్​ తీరు ఇబ్బందికరంగా ఉండటంతో 20 రోజుల్లోనే ఆమెను తొలగించారు అయితే కొంత కాలం తరువాత ఆమె వాట్సాప్​ మెసేజ్​ల ద్వారా యూవీ కుటుంబాన్ని బ్లాక్​ మెయిల్​ చేయడం ప్రారంభించింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని లేకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ, కుటుంబ పరువును దెబ్బతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. యూవీ ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను అరెస్టు చేశారు.

VICTIM MEET: మణిపుర్‌ బాధితురాలిని ఓదార్చిన స్వాతి మలివాల్‌

మణిపుర్ లో వివస్త్రకు గురైన మహిళను దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పరామర్శించారు. ఇంఫాల్ లో బాధితురాలిని కలుసుకున్న స్వాతి మలివాల్... దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. శనివారం నుంచి మణిపుర్ లో పర్యటిస్తున్న ఆమె...... లైంగిక దాడికి గురైన మహిళలను కలుసుకునేందుకు బీరెన్ సింగ్ అనుమతించడం లేదని ఆరోపించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతించాలని కోరారు. 

Harish Rao: యోగా చేస్తే ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటాం -హరీష్‌

యోగా చేస్తే రోజంతా ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటామన్నారు మంత్రి హరీష్‌ రావు. జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్య సిద్దిపేట సాధన.. యోగాతో సాధ్యమవుతుందన్నారు. సిద్దిపేటలోని 22వ వార్డులో సాగుతున్న యోగ క్యాంపులో పాల్గొన్న హరీష్ రావు.. వంద మందికి మ్యాట్‌లు పంపిణీ చేశారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలు వివరించారు.

Jeevan Reddy: కేసీఆర్‌, మోదీ ఒక్కటే: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కేసీఆర్‌, మోదీ ఒక్కటేనన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న కేసీఆర్‌.. 2020 వరకు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు బీఆర్ఎస్‌ మద్దతు తెలిపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరన్నారు. దళితులకు మూడెకరాలు, సబ్‌ప్లాన్‌ విషయంలో కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. బీసీ బంధు, దళితబందుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు

రియల్‌ ఎస్టేట్‌ కోసం శ్మశానవాటికనే ధ్వంసం

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో పలువురు రియల్టర్లు రెచ్చిపోయారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం ఏకంగా శ్మశానవాటికనే ధ్వంసం చేశారు. అందుకు అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. 10లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని కూల్చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేశారు.

Polavaram: దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం: కేంద్రం

పోలవరం ప్రాజెక్టుపై పార్లమెంట్‌ సాక్షిగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తి కానట్లే కనిపిస్తోంది. 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం జరగనుంది. మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 17 వేల 144 కోట్లు అవసరమని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు ఖర్చును భరించేందుకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం తెలపలేదు. 10 వేల 911 కోట్లు చెల్లించేందుకు ఆర్థికశాఖ అంగీకరించింది. వరదల కారణంగా జరిగిన నష్టం కింద మరో 2 వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే ఈ ప్రతిపాదనల్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంది. ఇప్పటిదాకా ఉన్న కాలక్రమం ప్రకారం 2024 జూన్‌ కల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. కానీ 2020-2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో పోలవరానికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. 

తిరుపతి జిల్లాలో వాలంటీర్ దౌర్జన్యం

తిరుపతి జిల్లాలో వాలంటీర్ దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి మండలం కల్‌రోడ్‌పల్లి దళితవాడలో స్థలం కబ్జాకు యత్నించాడు. దీంతో అడ్డుకున్న దంపతులపై దాడికి తెగబడ్డాడు. అధికారులతో కుమ్మక్కై వాలంటీర్‌ గౌతమ్‌రావు పొజిషన్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కేటాయించిన స్థలంలో.. రేకుల షెడ్‌ వేస్తుండగా దంపతులు రామకృష్ణ, ఈశ్వరి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాలంటీర్‌ దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్‌ వల్ల తమకు ప్రాణభయం ఉందని కంప్లైంట్‌ చేశారు. వీఆర్వోతో కలిసి వాలంటీర్‌ కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. అయితే.. గ్రామస్తులను విచారించే తాను వాలంటీర్‌కు పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చానని వీఆర్వో వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ స్థలానికి సంబంధించి రామకృష్ణ, ఈశ్వరి దంపతులు తమకు జనవరిలో వినతి పత్రాలు ఇచ్చారని.. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానన్నారు. 

జ్యూట్‌ మిల్‌ కార్మికుల ఆందోళన

వైసీపీ నేతలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో విశాఖలోని చిట్టివలస జ్యూట్‌ మిల్‌ కార్మికులు రోడ్డున పడ్డారు. జ్యూట్‌ మిల్‌ తెరిపిస్తామని నాడు వైసీపీ హామీ ఇచ్చిందని.. తీరా అధికారంలోకి వచ్చాక యాజమాన్యంతో కుమ్మక్కైందని కార్మికులు ఆరోపించారు. తూతూమంత్రంగా సెటిల్‌మెంట్‌ చేసి తమకు ఉపాధి లేకుండా చేశారన్నారు. కోట్లాది రూపాయల విలువైన జ్యూట్‌మిల్‌ సైట్‌లో రియల్‌ ఎస్టేట్‌కు తెరలేపారన్నారు. పీఎఫ్‌, పెన్షన్‌ కోసం ప్రజాప్రతినిధులు, యాజమాన్యం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చారు. 

విజయనగరం జిల్లాలో ఏనుగుల హల్‌ చల్

విజయనగరం జిల్లాలో ఏనుగులు హల్‌ చల్ చేస్తున్నాయి. వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌ సమీపంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు... పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల సంచారంతో గత కొన్ని రోజులుగా వంగర మండల ప్రజలు భయంతో జంకుతున్నారు. మరోవైపు ఏనుగుల సంచారంతో అటవీశాఖ అధికారుల సైతం అప్రమత్తం అయ్యారు. స్థానిక ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఏనుగులను కొండ ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. 

సెంటు భూమి పథకంతో ప్రజలను మోసం చేస్తున్నారు: పోతిన మహేష్‌

రాజధాని అమరావతిలో సీఎం జగన్‌ ఇళ్ల పట్టాలు ఇచ్చింది పేదలకు కాదన్నారు జనసేన నేత పోతిన మహేష్‌. వైసీపీ నాయకులు, వాలంటీర్లకు మాత్రమే రాజధానిలో సెంటు స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మేస్థితిలో విజయవాడ జనం లేరన్నారు. సెంటు భూమి పథకంతో ప్రజలను మోసం చేస్తూ.. జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టించారని విమర్శించారు. 80 శాతం కట్టిన ఇళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. నాలుగు ప్యాలెస్‌లు ఉన్న జగన్‌ పెత్తందారు కాదు.. నిరుపేద అంటూ సెటైర్ వేశారు. 

క్షేత్రస్థాయి పరిశీలన అస్తవ్యస్తంగా జరుగుతోంది- అయ్యన్నపాత్రుడు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన.. అస్తవ్యస్తంగా జరుగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నంలో పరిశీలన మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 262 బూత్‌లకు గాను 90 చోట్ల మాత్రమే పరిశీలన చేశారన్నారు. బీఎల్‌వోలు రోజూ కేవలం 3 నుంచి 20 ఓట్లే పరిశీలిస్తున్నారని ఆరోపించారు. కొందరైతే ట్యాబ్‌లో నమోదు చేయకుండా.. పుస్తకాలపై రాస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్‌ దృష్టి సారించాలని కోరారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని థ్రిల్ సిటీలో బీఆర్ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. రూబిక్ క్యూబ్స్‌తో రూపొందించిన KTR చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద పలువురు వీడియో జర్నలిస్ట్‌లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల అందజేశారు మంత్రులు.  

వారణాసి జ్ఞానవాపి మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు స్టే

వారణాసి జ్ఞానవాపి మసీదులో తవ్వకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.అప్పీల్‌పై రేపు విచారించనుంది ధర్మాసనం.ఎలాంటి జాప్యత లేకుండా విచారణ చేపడుతామని స్పష్టత ఇచ్చింది ధర్మాసనం. గతంలో జ్ఞానవాపి ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చింది.హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించారు మసీదు నిర్వహణ కమిటీ ప్రతినిధి అహ్మదీ.1600 సంవత్సరం నాటి మసీదు అంటూ తన వాదనలు వినిపించారు.

కేటీఆర్‌ బర్త్‌ డే; టమాటాలు పంపిణీ

మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.అయితే వరంగల్‌లో మాత్రం కాస్త వినూత్నంగా జరిపాడు బీఆర్‌ఎస్‌ నేత రాజనాల శ్రీహరి.2వందల మందికి టమాట బుట్టలను పంచాడు. వరంగల్ చౌరస్తాలో గులాబీ రంగు బుట్టల్లో టయాటలను పంచాడు. గతంలోనూ లిక్కర్‌, చికెన్‌ పంపిణీ చేసిన శ్రీహరి.. ఈసారి డిఫరెంట్‌గా టమాటలను పంచాడు. దీంతో కేటీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి.

రంగారెడ్డి జిల్లా నర్సారెడ్డిలో యువకుడు హల్‌చల్‌

మద్యంమత్తులో ఓ యువకుడు హల్‌చల్‌ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నర్సారెడ్డిలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో యువకుడు శ్రీకాంత్ ఓ కుటుంబంపై దాడి చేశాడు. దంపతుల ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అడ్డుకోబోయిన బాలికను తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కులం పేరుతో పాటు తమపై యువకుడు శ్రీకాంత్‌ దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి జారిపడ్డ యువకుడు

మహారాష్ట్రలోని అజంతా గుహల వద్ద సెల్ఫీ కోసం పోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. సోయగావ్‌ కి చెందిన గోపాల్ తన స్నేహితులతో కలిసి అజంతా గుహలకు వెళ్లాడు. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి 2వేల అడుగుల లోతైన గొయ్యిలో పడిపోయాడు.వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈత రావడంతో అతడు ఓ రాయిని పట్టుకుని ఉండగా.. పోలీసులు, అధికారులు కలిసి అతడిని కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఏపీలో సర్పంచ్‌ల పోరుబాట

ఏపీలో సర్పంచ్‌లు పోరుబాట పట్టారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కృష్ణాజిల్లా కలెక్టరేట్ వద్ద వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్‌ల ధర్నాకు దిగారు. ప్రభుత్వ తీరు ఖండిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.  

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో బండి సంజయ్‌ భేటీ

మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని హోంమంత్రి కార్యాలయంలో వీరిద్దరు సమావేశం అయ్యారు. బీజేపీ తెలంగాణ చీఫ్‌గా వైదొలిగిన తర్వాత తొలిసారిగా అమిత్‌షాతో భేటీ అయ్యారు బండి. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్‌ను తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు అధిష్టానంకు ఫిర్యాదులు మానుకోవాలని,రాష్ట్ర అధ్యక్షుడిని స్వేచ్చగా పనిచేసుకోనివ్వాలని బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఐదేళ్లైనా పూర్తి కాని ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్

హైదరాబాద్ ఉప్పల్‌ రింగు రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం ఆరు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తుంది. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏళ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సరైన రోడ్లు వేయకపోవడంతో రహదారి మొత్తం గుంతలమయమైంది. దీంతో ఉప్పల్- నారపల్లి మధ్య వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.  

ఐప్యాక్‌పై టీడీపీ నేత విజయ్ కుమార్‌ ఫైర్

ఐప్యాక్‌పై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైరయ్యారు. రాష్ట్ర ప్రజల డేటా అంతా ఐప్యాక్ గుప్పిట్లో ఉందని ఆరోపించారు. ఐప్యాక్ సంస్థ వైసీపీ కోసం పనిచేస్తూ, ప్రజల సమాచారాన్ని వైసీపీ ప్రయోజనాలకు తగినట్టు దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమన్నారు. ఐప్యాక్ ఆదేశాలతోనే వైసీపీ వాలంటీర్ల ద్వారా ఇతర పార్టీవారి ఓట్లను తొలగిస్తోందన్నారు. ఓటర్ పరిశీలనకు వెళ్లిన బీఎల్ఓల వెంట వాలంటీర్లు వెళ్లడం అధికారపార్టీ కుట్రలో భాగమేనన్నారు. 

అమరావతి కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత

అమరావతి కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్‌ భూమి పూజ చేసిన స్థలం వద్ద జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సెంటు భూమి గృహాల ప థకం వద్ద ఆందోళన చేపట్టారు. కోర్టు తీర్పు రాకముందే భూములను పంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసు లు స్థానిక పీఎస్‌కు తరలించారు.

MANIPUR: మణిపూర్‌ ఘటనలో మైనర్‌ అరెస్ట్‌

మణిపుర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన‍(Manipur viral video case)లో మరో మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య ఆరు(6th accused) కు చేరింది. ఇప్పటికే ప్రధాన నిందితుడుసహా నలుగుర్ని మణిపుర్ పోలీసులు(police caught) అరెస్టు చేశారు. కాంగ్ పోక్పి జిల్లాలో మే నాల్గో తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 26సెకన్ల నిడివి కలిగిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇవ్వటంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను యావత్ దేశం తీవ్రంగా ఖండించింది.

జగన్‌పై ఫైర్‌ అయిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జగన్‌పై ఫైర్‌ అయ్యారు. ప్రజల డబ్బులు దొంగతనం చేసి, జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. హాఫ్ టికెట్ సీఎం చాలాకాలం తర్వాత బయటికి వచ్చారంటూ ఎద్దేవా చేసారు. బాలకృష్ణ తల్లి క్యాన్సర్‌తో చనిపోతే, తల్లుల కోసం క్యాన్సర్‌ ఆస్పత్రి పెట్టిన ఘనత బాలకృష్ణది అన్నారు. మీ తల్లి, చెల్లి ప్రాణ భయంతో హైదరాబాద్‌లో, దాక్కొన్నారని విమర్శించారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. నీచాతినీచంగా మాట్లాడిన అంబటి గురించి, అనీల్‌ గురించి మాట్లాడమన్నారు. 

ఘనంగా శ్రీవెంకటేశ్వర వెటర్నటీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నటీ యూనివర్సిటీ, 12వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యారు. ఛాన్సిలర్‌ హోదాలో విద్యార్ధులకు పట్టాలను ప్రధానం చేసారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. 366 మంది విద్యార్ధులకు డిగ్రీ పట్టాలు,37 మంది విద్యార్ధులకు గోల్డ్‌ మెడల్స్‌, ఇద్దరికి సిల్వల్‌ మెడల్స్‌ ప్రదానం చేసారు. వృత్తిని గౌరవించాలని, పశువైద్య నీతి సూత్రాకలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్. దేశీయ ఆవులను సంరక్షించేందుకు టీటీడీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్. 

Vizag: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మార్చ్‌ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. గాజువాకలోని జింక్‌ గేట్‌ నుంచి స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ భూములతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకుంటున్నాయని రుద్రరాజు మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వెంటనే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని చెప్పారు. 

విజయనగరం బట్టల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోల్‌సేల్ బట్టల మార్కెట్‌లోని శాంతి విజయ ఎంటర్‌ప్రైజెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో నాలుగు షాపులకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా షాపుల్ని ఆనుకొని ఉన్న గోడౌన్లలో ఉన్న సరుకును ఖాళీ చేశారు

సీఎం జగన్‌పై కన్నా లక్ష్మినారాయణ విమర్శలు

సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. అధికారం కోసం కుటుంబ సభ్యులను వాడుకొని వదిలేశారన్నారు. ఇప్పుడు జగన్ పక్కన ఉన్న వారే.. గతంలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వైసీపీ పేరుతో వైఎస్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని చెప్పారు. ప్రజలు కూడా ఆయన్ను సాగనంపడానికి అంతకంటే ఎక్కువగా వేచి చూస్తున్నారన్నారు. 

వివేకా హత్య జగన్‌కు ముందే తెలుసు: సోమిరెడ్డి

ఏపీ సీఎం జగన్‌ దిగజారి మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరుకుతున్నారని, జగన్‌కు ముందే తెలుసన్నారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలే అని షర్మిల స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబను, పవన్‌ను తిట్టడానికే వెంకటరిగిలో జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేసారని ఆరోపించారు. సభలో పిల్లలు, మహిళలు, పెద్దలున్నారని జగన్‌ మరిచిపోయి మాట్లాడరన్నారు. నాటి గాంధీ నుండి నేటి మోదీ వరకూ జనాల్లో తిరుగుతున్నారని, జగన్‌ ప్రాణ భయంతో తిరుగుతున్నారని విమర్శించారు.  

Hyderabad: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో రూ.712 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్‌ ద్వారా 712 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ తెలిపారు. ఆన్‌లైన్‌లో టాస్క్‌ల పేరుతో మొదట డబ్బులిచ్చి తర్వాత ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేశాక మోసం చేస్తున్నారని వెల్లడించారు. చైనా, దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న ఈ స్కామ్‌లో.. అమాయకులే కాకుండా ఐటీ ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని సీవీ ఆనంద్ చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వంలో కూలీలుగా మారుతోన్న రైతులు

వైసీపీ ప్రభుత్వంలో రైతులు రైతు కూలీలుగా మారిపోతున్నారు.. పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారు.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు... ఖరీఫ్‌ సీజన్‌ కొనసాగుతున్నా వర్షాలు పడక రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.. పంటలు వేసినా ఆ పంట చేతికందక అప్పుల పాలై లబోదిబోమంటున్నారు. కనీసం ప్రభుత్వం విద్యుత్‌ సరఫరాను కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తిరుపతి జిల్లాలోని రైతులు ప్రాధేయపడుతున్నారు. 

కాళేశ్వరం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడి నుంచి గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అటు కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 11.550 మీటర్ల ఎత్తుకు ప్రాణహిత నీరు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరగడంతో 75 గేట్లు ఎత్తి 6 లక్షల 10 వేల 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజ్ ఔట్‌ఫ్లో 2 లక్షల 32 వేల 526 క్యూసెక్కులుగా ఉంది. దీంతో సరస్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తి 2 లక్షల 15 వేల 859 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

Medak: ఏడుపాయల అమ్మవారి దర్శనం నిలిపివేత

మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఇటు భారీ వర్షాలు.. అటు వరద ప్రవాహం కారణంగా ఏడుపాయల అమ్మవారి దర్శనాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. అటు రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి మాత్రం పూజలు కొనసాగుతున్నాయి.

Shamshabad: పర్యాటకులను ఆకట్టుకుంటున్న నానాజీపూర్‌ వాటర్ ఫాల్స్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు మండలంలోని జలపాతాలు కనువిందు చేస్తుండగా.. ఎన్టేరు వాగు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. నానాజీపూర్ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నురుగులతో మెలికలు తిరుగుతూ జలజల పారుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సందర్శకుల తాకిడి పెరగడంతో నానాజీపూర్‌ వాటర్ ఫాల్స్ వద్ద అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

Hussain Sagar: డేంజర్ బెల్స్ మోగిస్తున్న హుస్సేన్‌సాగర్

విశ్వనగరిగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరం సీజన్‌లో తొలి వర్షాలకే అతలాకుతలమవుతోంది. మరో రెండు నెలలు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పరిస్థితి ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తోంది.వరుణుడి ప్రతాపంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దైపోయింది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. పలు కాలనీల్లో ఇళ్లలోకే వరద నీరు చేరడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో ఎటూ చూసిన వరద నీరే దర్శనమిస్తుంది. బయట అడుగు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. ఎక్కడ ఏ నాలా ఓపెన్‌లో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.

మరోవైపు హుస్సేన్‌ సాగర్‌ను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని,నాలాల దగ్గర ఆక్రమ నిర్మాణాలతోనే ఇబ్బందులు వస్తున్నాయిని అన్నారు. ఆక్రమ నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు తలసాని.

ఇక ఈ వర్షాకాలం సీజన్‌లో ఈ నెల మొత్తం మీద పడాల్సిన సగటు వర్షం గడిచిన 24 గంటల్లో దంచికొట్టడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు ఎగువ నుంచి భారీగా వచ్చిన వరద నీటితో జలాశయాలు నిండి కుండగా తయారు కాగా, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వాటి గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని వదలడంతో పరీవాహక, లోతట్టు ప్రాంతాలు జలమయమై అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలోనే భారీ వర్షాలు కురుస్తాయి. ఎగువ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి జలాశయా ల్లో చేరుతోంది. వర్షకాలం తొలి రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత పడే వర్షాలతో పరిస్థితేంటి అని నగర వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం

హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఈ సమావేశనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షువు డు కిషన్ రెడ్డితో పాటు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ లు, మాజీ ఎంపీలు, మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు హాజరయ్యారు. పార్టీ బలోపేతనికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై నేతల నుంచి ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.