చిట్టి న్యూస్

ప్రేమకథ విషాదాంతం

హైదరాబాద్‌ KPHBలో విషాదం నెలకొంది. భీమవరానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే గ్రామానికి చెందిన ఆకుల శ్యామ్‌, పోతుల జ్యోతి దగ్గరి బంధువులు. వీరు గత కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. రెండు రోజుల క్రితం ఈ జంట హైదరాబాద్‌ చేరుకొని స్నేహితుడి రూంలో ఉంటున్నారు. అయితే పాయిజన్‌ తీసుకుని యువతి, సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు సూసైడ్‌ చేసుకున్నారు.

మదనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. కుడేరు మండలం ఉదిరిపి కొండకు చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఊరికి చెందిన వీనిషా, వెంకట్‌నాయుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో మనస్థాపం చెంది మదనపల్లి లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు అంటున్నారు.

బ్యాగ్ లో చిన్నారి మృతదేహం; బస్సులో తండ్రి ప్రయాణం...

అంబులెన్స్‌కు రూ.8000 చెల్లించలేని కారణంగా, చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తండ్రి బస్సులో ఇంటికి రావాల్సి వచ్చిన హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. దినాజ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి డబ్బు లేకపోవడంతో అంబులెన్స్‌ని తీసుకోలేకపోయాడు. ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో ఉంచి కాలియాగంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. దీనిపై ప్రతిపక్ష నేత శుభేందు అధికారి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. 

కరెంట్ కోత... కాన్పుల నిలిపివేత

బాపట్ల ఏరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. కరెంటు లేకపోవడంతో కాన్పులు ఆగిపోయాయి. జనరేటర్‌ ఉన్నా పనిచేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కనీసం ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితి. ఇన్ని సమస్యలు ఉన్నా ఇవేవీ పట్టించుకోవడం లేదు వైద్యాధికారులు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామనే ముసుగులో వైసీపీ రంగులపై శ్రద్ధ పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

స్మశానం కబ్జా

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో స్మశానం కబ్జాకు గురైంది. వెదురు పావులూరు రెవెన్యూ పరిధిలోని ఆర్‌ఎస్‌ నెంబర్‌ 468/2లో 12 సెంట్లలో బొబ్బ వంశస్థులు తమ కుటుంబీకుల సమాధుల కోసం స్థలం వదులుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు నకిలీ దస్తావేజులతో ఆ స్థలాన్ని కబ్జా చేశారు. సమాధులకు కూలగొట్టి అందులో అక్రమ వెంచర్ వేస్తున్నారు. స్థానిక కోర్టు నుంచి ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా పనులు ఆపడం లేదని.. హైకోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉందని వంశస్థులు చెబుతున్నారు. ఫిర్యాదు చేయబోతే పీఎస్‌కు పిలిపించి బెదిరించారని వాపోతున్నారు.  

100 రోజుల యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కుమారుడు లోకేష్‌తో కలిసి తల్లి భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొన్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన మహాపాదయాత్ర ఇప్పటివరకు 34 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ రోజుతో 1,268 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటోంది. లోకేశ్‌కు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. ఆయా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నా యకులు తరలివచ్చి సంఘీభావం చెబుతున్నారు.

సైకిల్ పై మంత్రి పువ్వాడ

గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని సీఎం కేసీఆర్‌ సీతాకోక చిలుకలా మార్చారని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కితాబిచ్చారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేందుకు వన్‌ టౌన్‌, టూ టౌన్‌లో సైకిల్‌పై పర్యటించారు. కొత్త బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయిలెట్స్‌ను పరిశీలించారు. బస్టాండ్‌ నిర్వాహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

రాత్రి 8 గంటలకు ఎంసెట్ కీ

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. మూడు రోజులు జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం ప్రకటించింది. విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను కూడా వెబ్ సైట్లో ఉంచుతామని ప్రాథమిక కీపై అభ్యర్థనలను 17వ తేదీ రాత్రి 8 గంటలకు వెబ్ సైట్ లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొంది. 

ప్రజల మధ్యలో లోకేష్‌ వంద రోజులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు 100 రోజులు. 1269 కిలోమీటర్ల మైలురాయిని దాటేసిన ఈ ప్రయాణంలో, తనకు ఎదురైన ప్రతి హృదయంపై తనదైన ముద్రను వేసుకుంటూ... తిరుగులేని జనబలాన్ని పోగుచేసుకుంటున్న లోకేష్‌కు తెలుగుదేశం శుభాకాంక్షలు తెలుపుతోంది.



భద్రాచలంలో అంజన్న భక్తుల సందడి

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని, వేలాది సంఖ్యలో హనుమాన్ భక్తులు, భద్రాచలం రామన్న సన్నిధికి చేరుకున్నారు. వేలాది భక్తులు రావడంతో ఆలయ ప్రాగణం రామనామస్మరణలతో మారుమ్రోగిపోయింది. తెల్లవారుజామునే భక్తులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి గంగానదికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలోని, మూల విరాట్‌ను దర్శించుకున్నారు.

హైదరాబాద్‌లో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతులు పెరిగిపోతున్నాయి. వడగాల్పులతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.

Amaravati : ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు నిరసన

అమరావతి ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమిస్తున్న, రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు మాజీ ఎంపీ సుజనా చౌదరి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సుప్రీం కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. దేశంలోనే పేరు పొందిన న్యాయవాదులు రైతుల పక్షాన వాదనలు వినిపిస్తారన్నారు. అమరావతిని చంపేయాలన్న ప్రభుత్వ కుట్రలు వీగిపోతాయన్నారు సుజనాచౌదరి.

గుడివాడలో మట్టి దందా

టిడ్కో లేఔట్ల ముసుగులో కృష్ణా జిల్లా గుడివాడలో, పెద్ద ఎత్తున అక్రమ మట్టి దందా జరుగుతుంది. గూడూరు మండలం తరకటూరు నుండి గుడివాడ మండలం లింగవరం ఇటుక బట్టీలకు మట్టిన అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ తతంగం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జగడం గమనర్హం. టిప్పర్లకు టిడ్కో స్టిక్కర్లు అతికించి భారీ యెత్తున అక్రమ మట్టి రవాణా చేస్తున్న, రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తున్నారు.

నకిలీ నోట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్ట్

నకిలీ నోట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్ట్ చేశారు శంషాబాద్‌ పోలీసులు. ఆనకాపల్లి జిల్లాకు చెందిన రంజిత్‌సింగ్‌, మోహన్‌రావు లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల 55 వేల విలువైన నకిలీ 500, 200, వంద, యాభై రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నకిలీ నోట్ల తయారీకి వినియోగించే 11 లక్షల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

ద్వారకా తిరుమలపై.. బస్సు క్లీనర్ల వీరంగం

ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శేషాచల కొండపై, ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు క్లీనర్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అట్లూరు, ఎల్వీపి ట్రావెల్స్‌కు చెందిన బస్సు క్లీనర్లు మద్యం మత్తులో బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. అడ్డుకున్న దేవస్థానం సిబ్బందిపైనా దాడి చేసారు. క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బస్సులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పెట్టుబడులే లక్ష్యంగా....

లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ భారత హై కమిషనర్ విక్రం కె. దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమయిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తమ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

కన్నీరు కార్చిన డీకే శివకుమార్..

కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ కన్నీటిపర్యంతం అయ్యారు. బీజేపీ సర్కార్‌ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందన్నారాయన. తాను తీహార్‌ జైలులో ఉన్నప్పుడు సోనియా గాంధీ పరామర్శకు వచ్చారని.. ఆ సమయంలో కన్నడనాట మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పానన్నారు. సమిష్టికృషితో కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించామన్నారు డీకే శివకుమార్.

అనుకున్నదొక్కటి అయిందొక్కటి

కర్ణాటక ఎన్నికల్లో... జేడీఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. 2018 ఎన్నికల్లో 32 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈ సారి కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  దాదాపు పది సీట్లు కోల్పోయింది. హంగ్ పై ఆశలు పెట్టుకున్న కుమారస్వామి ఆశలు అడియాశలు అయ్యాయి. గత రాత్రి హుటహుటిన సింగపూర్ నుంచి బెంగళురూ చేరుకున్న ఆయన ప్రత్యేకంగా పూజులు చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీ స్కోర్‌ చేస్తాయని అన్నారు. చిన్న పార్టీ అని, తనకు అంత డిమాండ్‌ లేదన్నారు కుమారస్వామి. అంతేకాదు హంగ్ వచ్చే పరిస్థితి లేదన్నారు. 

గెలిపించినందుకు థ్యాంక్స్

కాంగ్రెస్‌ పార్టీ అంతా తన వెంటే ఉందన్నారు సిద్ద రామయ్య. గతంలో కాంగ్రెకు దెబ్బకొట్టిన వారంతా ఓడిపోయారన్నారు. ప్రజలు తగిన గుణపాటం చెప్పారన్నారు సిద్ధ రామయ్య. కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫలితం దక్కిందన్నారు. గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సిద్ధరామయ్య. తమిళనాడు సీఎం స్టాలిన్‌ సిద్ధ రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

కలసి వచ్చిన ఆరు పథకాలు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఇప్పుడు వైరల్ గా మారింది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళల కోసం గృహలక్ష్మి పథకం బాగా కలసి వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళా పెద్దకు ప్రతి నెల రూ. 2 వేలు అందజేయనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా 10 కేజీల బియ్యం, నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల 3వేల భృతి బాగా వర్కౌట్ అయింది. మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కూడా కాంగ్రెస్‌ విజయానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు

కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలైయ్యాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని తరలించేందుకు 15 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. ముందస్తుగా హోటల్స్‌ను బుక్‌ చేశాయి. గెలిచిన ఎమ్మెల్యేలందరిని క్యాంప్‌ తరలించే ఏర్పాట్లు మొదలు పెట్టాయి..బెంగళూరులోనే మకాం వేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సుర్జేవాలా. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీకే, సిద్ధరామయ్య, మేనిఫెస్టోకమిటీ ఛైర్మన్ పరమేశ్వర్‌తో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ నేతలతో రెబల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు టచ్‌లోకి వెళ్లారు. రేపు సీఎల్పీ సమావేశం ఉండే అవకాశం ఉంది.

నా కొడుకు కోసం రూ.20కోట్లు రెడీ చేసుకోండి

వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 34 ఏళ్ల పియూష్ ఈ సీజన్‌లో 19 వికెట్లతో IPL 2023 పర్పుల్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ కోసం రూ. 50 లక్షలు అందుకుంటున్నాడు. ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడిన పీయుష్ "నేను నా కొడుకు కోసం ఆడుతున్నాను. నేను కష్టపడి పనిచేయడానికి నా కొడుకే కారణం అని చావ్లా చెప్పాడు. మరో పదేళ్లలో నా కొడుకు మంచి బ్యాటర్ అవుతాడు.. IPL అతడికి ఇవ్వడానికి రూ.20 కోట్లు రెడీ చేసుకోవాలి అని ముంబై ఇండియన్స్ కు చెప్పా ను అని చావ్లా తెలిపాడు.

పార్టీ అంతా నా వెంటే

కాంగ్రెస్‌ పార్టీ అంతా తన వెంటే ఉందన్నారు సిద్ద రామయ్య. గతంలో కాంగ్రెకు దెబ్బకొట్టిన వారంతా ఓడిపోయారన్నారు. ప్రజలు తగిన గుణపాటం చెప్పారన్నారు సిద్ధ రామయ్య. కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫలితం దక్కిందన్నారు. గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సిద్ధరామయ్య. తమిళనాడు సీఎం స్టాలిన్‌ సిద్ధ రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

కెప్టెన్ ధోనీ స్పారో

జ్యో జాన్ ముల్లూర్ అనే కళాకారుడు క్రికెటర్ల చిత్రాలను మిడ్‌జర్నీని ఉపయోగించి హాలీవుడ్ లోని ప్రముఖ పాత్రలుగా రూపొందించాడు. ఈ చిత్రాలలో MS ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. జ్యో జాన్ ముల్లూర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తనను తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఔత్సాహికుడిగా అభివర్ణించుకున్నాడు. కెప్టెన్ ధోనీని స్పారోగా, విరాట్ ను రాంగ్నర్ గా తయారుచేశారు. వీటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ చేగా ప్రస్తుతం అవి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.  

మంత్రికి పుత్రోత్సాహం

తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి తన్నీరు హరీష్ రావు తనయుడు ఆర్చిష్మాన్ రావు అమెరికాలోనికొలరాడో యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ నుంచి గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సమేతంగా హాజరై తన కుమారుడిని అభినందించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అతడు సాధించిన అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నా. అతడి పట్టుదల, సాధించాలనే తపనకు ఇది నిదర్శనమని అన్నారు. తన నైపుణ్యంతో ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించగలడని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కర్ణాటక ఫలితాల నడుమ కేంద్ర మంత్రి శ్రీవారి దర్శనం

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాలినడకన తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్నారు. నేడు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆయన కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని జోషి సామీ దర్శనం చేసుకున్నారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ గెలిస్తే జోషికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సెక్యులర్ జనతాదళ్ పార్టీ యోచిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కుమారస్వామి అన్నారు. కానీ మంత్రి దీనిని ఖండించారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే పని చేయాలని ఉందని అన్నారు. ప్రజలు, దేవుడు ఆశీర్వదించినంత కాలం కేంద్ర మంత్రివర్గంలో ఉండాలని కోరుకుంటున్నట్లు జోషి తెలిపారు. 

పరిణీతి పరిణయం

పరిణితి చోప్రా, ఆప్‌ యువ ఎంపీ రాఘవ్‌ చడ్డా నిశ్చితార్థానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఢిల్లోలో ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు పరిణితి సోదరి ప్రియాంక చోప్రా కూడా హాజరు కాబోతోంది. ఈ కార్యక్రమం మెత్తం పక్కాపంజాబీ పద్దతిలో జరగనుంది. ఆప్‌ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ ఈ వేడుకకు హాజరు కానున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు తెలిపిన మాజీ భార్య

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన మాజీ భార్య జెమీమా స్పందించింది. చివరకు కనువిప్పు కలిగింది అన్న భావం స్ఫురించే విధంగా "Finally sense has prevailed" అని పాకిస్థాన్‌ జెండా,నమస్కరిస్తున్నట్లు ఎమోజీనీ పోస్ట్‌ చేసింది. జెమీమా, ఇమ్రాన్‌ ఖాన్‌ 1995లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 లో ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయ జీవితంలో ఇమడలేక అతనికి విడాకులు ఇచ్చిన జెమీమా తన కుమారులైన సులేమాన్‌, కాసింతో కలిసి బ్రిటన్ కు వలసపోయింది. 

మరో ట్విస్ట్!

రెండేళ్ల క్రితం డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారూఖ్‌ తో ర‌హ‌స్య ఒప్పందం కుదిరింద‌ని.. అప్పటి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే 25 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై, కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. అప్పట్లో వాంఖడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ కు చీఫ్‌గా ఉన్నారు. 22 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్‌కు తగిన సాక్ష్యాలు లేనందున ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది.

వారిని చర్చలకు పిలిచేది లేదు: సీఎస్ శాంతకుమారి

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్‌లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి తెలిపారు. విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. లేకుంటే సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారి స్థానంలో తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు.


టీడీపీ-జనసేన-బీజేపీ ఒక జట్టే...

ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చిచెప్పారు. వైసీపీని కచ్చితంగా గద్దె దింపడం ఖాయమని స్పష్టంచేశారు. పొత్తులు అనేవి పార్టీ ఎదుగుదలకు దోహదపడుతుందని.. తక్కువ అంచనా వేయొద్దని జనసేన క్యాకర్తలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మన బలమేంటో ముందుగా బేరీజు వేసుకోవాలన్నారు.


98వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ 98వ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు కే స్టార్ గోడౌన్ నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం 3 గంటల 50 నిమిషాలకు కరివేనలో స్థానికులతో సమావేశం అవుతారు. నాలుగున్నర గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో లోకేష్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాదయాత్రలో భాగంగా స్వచ్ఛభారత్ అంబాసిడర్లు, స్థానిక వ్యాపారులు, డ్వాక్ర మహిళలు, ముస్లీంలు, రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి 9 గంటల 55 నిమిషాలకు చెంచుకాలని శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.

ఇటలీలో భారీ పేలుడు

ఇటలీలో భారీ పేలుడు జరిగింది. మిలన్‌ సిటీ మధ్యలో రహదారిపై పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వ్యాన్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అనేక కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఘటనాస్థలిలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. పార్క్‌ చేసిన వాహనంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ట్రెండింగ్‌లో #FarmersSufferingInAP యాష్‌ టాగ్‌

ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా 5 వ స్థానంలో #FarmersSufferingInAP అనే యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నల కన్నీటి బాధలు పట్టించుకోని జగన్ రెడ్డికి కనువిప్పు కొరకు ట్విట్టర్ వేదికగా #FarmersSufferingInAP అనే యాష్ టాగ్ తో వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. నష్టపోయిన రైతన్నల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి తీరును నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

అబుదాబిలో బోనం సంబురాలు

అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక సంక్షేమ కేంద్రం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏటా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. 2022 - 23 ఏడాది గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయాన్ని చెందిన డీసీఎం సతీమణి జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన Unity in Diversity Conceptతో చేసిన 29 రాష్ట్రాల ఫ్యాషన్‌ డ్రెస్‌ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్‌ చేసిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బతుకమ్మలు విశేష ఆకర్షణగా నిలిచాయి.

ఒక్కసారిగా ఊపందుకున్న పోలింగ్

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మందకోడిగా సాగిన పోలింగ్‌.. ఆ తరువాత ఒక్కసారిగా పెరిగింది. ఓటర్లంతా పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో పోలింగ్‌ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఓటు వేసేందుకు జనం పోలింగ్‌ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 52.12శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మైసూరులో మధ్నాహ్నం 3గంటల వరకు 52.4 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఇక బెంగళూరు సిటీ 41.3శాతం, బెంగళూరు గ్రామీణం 60.1శాతం పోలింగ్ నమోదైంది.