నేను ఎప్పుడూ సీఎం కావాలని అనుకోలేదు

తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి ఆశించలేదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి. తనపై కొందరు కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ వైపు మళ్లారని, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎదురుతిరిగారని జానా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

అదే కేసీఆర్‌ ఓటమికి కారణం:లక్ష్మణ్‌

హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితోనైనా కేసీఆర్‌కు కనువిప్పు కలగాలన్నారు. బీజేపీ కార్యకర్తలను హింసిస్తే బెంగాల్‌లో జరిగిన ఘటనలే పునరావృతమవుతాయన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.

కేసీఆర్ చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే..

ఈసారి కేంద్రంలో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీల కూటమేనని మరోమారు పునరుద్ఘాటిస్తున్నారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్‌లోకి రావాలంటూ డీఎంకేను ఆహ్వానించారు. చెన్నై వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమైన KCR.. గంటపాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కలిసి పనిచేసే విషయంలో ఇద్దరి మధ్య ఇప్పటికైతే స్పష్టమైన అవగాహన కుదరకపోయినా.. ఫలితాల తర్వాత కూడా మరోమారు సమావేశం కావాలని నిర్ణయించినందున.. సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఢిల్లీ స్థాయిలో విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించాలన్న తన ప్రతిపాదనను KCR స్టాలిన్‌కు వివరించారు. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం తగ్గాలంటే.. ప్రాంతీయ కూటమి అవసరమని చెప్పారు. ఈ నెల 23న ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు పూర్తిస్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదన్న వార్తల నేపథ్యంలో.. ఫెడరల్ ఫ్రంట్‌లోకి కలిసొచ్చే మిత్రులందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. యూపీ మాజీ సీఎం అఖిలేష్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోపాటు, కర్నాటక సీఎం కుమారస్వామి, బెంగాల్ సీఎం మమత సహా మరికొందరిని కలుపుకుని కనీసం 120 నుంచి 150 సీట్లతో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

నిన్న స్టాలిన్‌తో జరిగిన భేటీలో.. DMK కోశాధికారి దురైమురుగన్‌, సీనియర్‌ నేత టీఆర్‌ బాలు కూడా ఉన్నారు. ఐతే.. మీటింగ్ తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. డీఎంకే విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా కేసీఆర్‌తో చర్చలు ఫలప్రదంగా ముగిసాయా లేక ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. తమిళనాడులో DMK ఈసారి సత్తా చాటుతుందని KCRకి స్టాలిన్ వివరించినట్టు సమాచారం. 30కిపైగా సీట్లు తమ కూటమికి వస్తాయని అభిప్రాయపడ్డారు. KCR కూడా తెలంగాణలో తమ కూటమి 17 చోట్లా క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నంబర్ గేమ్‌లో రెండు పార్టీలు కలిస్తే దాదాపు 50 సీట్ల వరకూ ఉంటాయని, మిగతా మిత్రుల్ని కూడా కలుపుకుంటే.. ఢిల్లీలో ప్రధానిగా ఎవరు ఉండాలో డిసైడ్ చేసేది ఫెడరల్‌ ఫ్రంటే అవుతుందని కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ఉప ప్రధాని పదవి అంశాన్ని కూడా KCR ప్రస్తావించారంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కేవలం కేబినెట్ పదవులు కాదు.. అంతకు మించి డిమాండ్ చేసే స్థాయి కూడా ఉండాలంటూ తెలంగాణ సీఎం ప్రతిపాదించినట్టు కొన్ని ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఐతే.. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంది. పైగా రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ కూడా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో తాను ఇప్పటికిప్పుడు కూటమిలో చేరడంపై హామీ ఇవ్వలేనని స్టాలిన్ చెప్పినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచించాలని ఆయన స్టాలిన్‌ను కోరారంటున్నారు.

కేసీఆర్ చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే.. తమిళనాడులో 39 ఎంపీ సీట్లున్నాయి. వీటిల్లో 30కిపైగా DMK గెలుస్తుంది. తెలంగాణలో 17 చోట్లా తమ కూటమే గెలుస్తుందని ఎలాగూ అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి. కేరళలోనూ 20 సీట్లున్నాయి. ఇవన్నీ కలిపితే 129 అవుతాయి. ఈ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించే పార్టీలు కూటమి కడితే బాగుంటుందన్నది కేసీఆర్ ప్రతిపాదన. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో ఈసారి ఎస్పీ-బీఎస్పీ కూటమి మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని, 42 సీట్లున్న బెంగాల్‌లో మమత హవా ఉంటుందని, 21 ఎంపీలున్న ఒడిశాలోనూ నవీన్ పట్నాకయ్‌ ఆధిపత్యం ఉంటుందని లెక్కలేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే 150 స్థానాల వరకూ ఫ్రంట్ చేతిలో ఉంటాయని.. ఢిల్లీని శాంసించే ఛాన్స్ ఉంటుందని వివరిస్తున్నారు. ఐతే.. కేసీఆర్ చెప్తున్న పార్టీలో కొన్ని కాంగ్రెస్‌తోనే జట్టుకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు ఎలా ఉంటాయి.. చివరికి ఇందులో నిలిచేదెవరు అనే దానిపై స్పష్టత రావడం లేదు.

ప్రస్తుతానికైతే.. కేసీఆర్-స్టాలిన్ చర్చలు అసంపూర్తిగానే ముగిసాయి. కేసీఆర్ ఫ్రంట్‌లోకి స్టాలిన్ వస్తారా.. లేక కేసీఆరే కాంగ్రెస్ కూటమికి మద్దతిస్తారా అనే దానిపై ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నా.. TRS నేతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ఫలితాల తర్వాత జరగబోయేది మీరే చూస్తారంటూ.. జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 23 తర్వాత మరోమారు జాతీయ స్థాయిలో అందరితోనూ కేసీఆర్ చర్చలు జరుపుతారని చెప్తున్నారు.

కొత్త చట్టంపై సీఎం కేసీఆర్ సమీక్ష

*కొత్త మున్సిపల్ చట్టంపై సీఎం కేసీఆర్ సమీక్ష
*ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమావేశం
*ప్రజలకు మెరుగైన సేవలు అందించటం..
*అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం

ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం..కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంతో పాటు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని సీఎం సూచించారు. ఫేస్ బుక్ లో ఓ రైతు ఆవేదనను విని.. స్వయంగా కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఎం.. భూవివాదలు లేకుండా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు పలుమార్లు ప్రకటించారు. పోలింగ్ ముగియటంతో మున్సిపల్ చట్టంపై కసరత్తు ప్రారంభించారు.

దేశమే ఆశ్చర్యపోయేలా చట్టం తెస్తా.. – కేసీఆర్

జూన్ తర్వాత దేశమే అశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు సీఎం కేసీఆర్. రెవెన్యూ భూముల సమస్య పరిష్కారం అయ్యేలా చట్టం ఉటుందని అన్నారాయన. రైతులు ఎమ్మార్వోల చుట్టు తిరిగే పని లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్మల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్..త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనూ గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు కేసీఆర్. స్థానిక అవసరాల దృష్ట్యా నిర్ణయాలు ఉండాలని అన్నారు. పసుపు బోర్డు కావాలని కోరిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. దేశంలో కావాల్సినంత వనరులు ఉన్నా వాడుకునే తెలివి లేదన్నారు కేసీఆర్.

అటు బీజేపీ తీరుపైనా కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలోని దేవాలయ్యాలన్ని బీజేపీవాళ్లే కట్టించారా? అని ప్రశ్నించారు. సమాజాన్ని విభజించాలనే ఆలోచన బీజేపీదని విమర్శించారు. ఎన్నికలు రాగానే హిందువులు, ముస్లింలు, పాకిస్తాన్ గుర్తు వస్తాయని ఆరోపించారాయన.

చంద్రబాబుపై కేసీఆర్ ప్రశంసలు

గులాబీ బాస్ కేసీఆర్ రూట్‌ మార్చారు. జాతీయ పార్టీలపై నిప్పులు చెరుగుతూ ప్రచారం నిర్వహిస్తూనే, అసంతృప్తులకు, వారి అనుచరులకు బుజ్జగించారు. టిక్కెట్‌ ఇవ్వని నేతలకు మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్‌ లో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తామన్న కేసీఆర్.. ఖమ్మంలో చంద్రబాబును పరోక్షంగా ప్రశంసించి, అందరినీ ఆశ్చర్య పరిచారు.

మిషన్ 16 లక్ష్యంగా దూసుకెళ్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ … బీజేపీ, కాంగ్రెస్‌లపై మాటల తూటాలు పేల్చారు. తుమ్ చోర్ హై అంటే తుమ్ చోర్ హై అని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఒకరిని మరొకరు తిట్టుకుంటున్నారని మండిపడ్డారు. మోదీకి మాటలు మాట్లాడడం తప్ప, చేతలు చేతగావని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ నాయినమ్మ నుంచి ఇప్పటి వరకు అంతా గరీబీ హటావో అంటున్నారు తప్పితే… పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. 16 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పొచ్చన్నారు కేసీఆర్.

ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామన్న కేసీఆర్… ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. పట్టిసీమ నిర్మాణం చేపట్టి చంద్రబాబు డెల్టాకు ప్రాణం పోశారని చెప్పారు. ఏపీ పట్టిసీమతో డెల్టాను కాపాడుకుందని తెలిపారు. పట్టిసీమ తరహాలో సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తిచేసి, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామనన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కచ్చితంగా సాధించుకుంటామని స్పష్టం చేశారు.

నామా నాగేశ్వర్‌రావు సమర్థమైన నాయకుడని.. భవిష్యత్తులో ఆయన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు కేసీఆర్. తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కూడా మంచి భవిష్యత్‌ ఉంటుందని హామీ ఇచ్చారు.

మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. భూ సంస్కరణలపై కూడా మాట్లాడిన ఆయన.. ఒక్క ఎకరం భూమికి కూడా కిరికిరి లేకుండా చేస్తానన్నారు. అధునాతనమైన టెక్నాలజీతో భూసంబంధమైన పంచాయతీలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక రెవెన్యూశాఖపై మరోసారి నిప్పులు చెరిగారు. ఈ శాఖకు పేరే బేఖార్‌గా ఉందని విమర్శించారు. బ్రిటిష్‌ కాలంలో రైతుల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేసేవాడిని కలెక్టర్‌ అనేవారని, అసలు కలెక్షనే లేని చోట కలెక్టర్‌ పేరు సరికాదన్నారు. ప్రభుత్వమే ఉల్టా పైసలు ఇస్తుంటే కలెక్షన్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. కలెక్టర్‌ పేరును జిల్లా పాలనాధికారిగా మర్చాలని చూస్తున్నామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి కన్‌క్లూజివ్‌ టైటిల్‌ తెచ్చెందుకు యత్నిస్తున్నామని వివరించారు.

ప్రస్తుత ఎంపీ సీతారాం నాయక్ ఏ తప్పు చేయలేదని, వేరే కారణాల వల్లే అభ్యర్థిని మార్చామని స్పష్టం చేశారు కేసీఆర్‌. ఆయన అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. తాగునీరు సమస్య మిషన్‌ భగీరథతో తీరనుందని.. ఏప్రిల్‌ తర్వాత ఇంటింటికీ నల్లా ద్వారా నీరందిస్తామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు కొనసాగిస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే పొలాలను పంటకాలనీలుగా విభజించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూమి, వాతావరణం బట్టి ఏయే పంటలు వేయాలో అధికారులు చెబుతారని.. దాన్ని రైతులు అనుసరించాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని, ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని కోరారు.

ఆరునూరైనా దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శం కావాలన్నారు కేసీఆర్. ఎన్నికల తర్వాత ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజుల పాటు పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.

తెలంగాణలో అరాచకాలు సృష్టించే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు: చంద్రబాబు

  • తెలంగాణలో అరాచకాలు సృష్టించే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు: చంద్రబాబు
  • ఏపీలో కూడా వైసీపీతో కలిసి ఇలాంటి కుట్రలకే తెర లేపారన్నారు.
  • ఎంత మంది అధికారులను బదిలీ చేస్తుకున్నా ఇబ్బంది లేదు
  • టీఆర్ఎస్ డైరెక్షన్‌లో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారు
  • రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలి

తెలంగాణలో అరాచకాలు సృష్టించే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో కూడా వైసీపీతో కలిసి ఇలాంటి కుట్రలకే తెర లేపారన్నారు. ఎంత మంది అధికారులను బదిలీ చేస్తుకున్నా ఇబ్బంది లేదని.. పోరాటమే ఊపిరిగా వచ్చిన పార్టీ తెలుగుదేశమని గుర్తు చేశారు. టీఆర్ఎస్ డైరెక్షన్‌లో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు అరాచకం సృష్టిస్తుంటే.. అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని అన్నారు. రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని క్యాడర్‌కు పిలుపిచ్చారు చంద్రబాబు

ఆ విషయంలో కేసీఆర్‌ చాలా బాధ పడ్డారు: తుమ్మల

రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు. వైరా MLA రాములు నాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నామా నాగేశ్వర్‌రావుతో కలిసి తమ్ముల పాల్గొన్నారు. ఖమ్మం టీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు గెలుపునకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కారు స్పీడు తగ్గడంపై కేసీఆర్‌ చాలా బాధ పడ్డారని.. ఆ పొరపాటును సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారాయన. ఖమ్మం జిల్లాపై కేసీఆర్‌కు సమగ్ర అవగాహన ఉందని.. శాశ్వత అభివృద్ధి జరగాలంటే నామాను గెలిపించాలని పిలుపునిచ్చారు.

దమ్ము ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఎంపీగా బరిలోకి దిగు: మంత్రి జగదీష్

  • పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు మంత్రి జగదీష్ సవాల్
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా బరిలోకి దిగాలని డిమాండ్
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్, కోమటిబ్రదర్స్ గుణపాఠం చెబుతాం
  • ఉత్తమ్ మాటలన్ని ఉత్తర ప్రగల్భాలే – మంత్రి జగదీష్

ఉత్తమ్ కు దమ్ము ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే..ఎంపీగా బరిలోకి దిగాలని సవాల్ విసిరారు మంత్రి జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ తో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ఉత్తమ్ మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని జగదీష్ రెడ్డి టీవీ5కి ఇచ్చిన ముఖముఖిలో తెలిపారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటుంది. పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండడంతో కాంగ్రెస్ ఆందోళన మెుదలైంది. దీంతో
టీఆర్‌ఎస్‌ అనైతికతకు పాల్పడుతుందాని ,పార్టీ ఫిరాంయిపులను ప్రోత్సహిస్తుందని కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు విరుచుకపడ్డారు. దీనికి కౌంటర్‌గా టీఆర్‌ఎస్ నాయకులు
కూడా హస్తం నేతలపై విరుచుకపడుతున్నారు.

 

సీఎం కేసీఆర్ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న..

సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై లోక్ పాల్ లో ఫిర్యాదు చేస్తామని అన్నారు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలకు అధికార పార్టీ ఒకే తరహా ప్రెస్ నోట్ లను తయారు చేసి ఇస్తోందని గుర్తు చేసిన మొయిలీ…ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అనేందుకు ప్రెస్ నోట్లే సాక్ష్యమని అంటున్నారు.

సీఎం కేసీఆర్ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారిందన్నారు పీసీసీ నేతలు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదుతో తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు పీసీసీ నేతలు.