చిట్టి న్యూస్

రేపు సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

రేపు సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు... చలో విజయవాడను భగ్నం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. సీపీఎస్ ఉద్యోగ నేతల్ని పోలీస్‌ కమిషనరేట్‌ కు పిలిపించుకుని ప్రశ్నిస్తున్నారు. రేపటి నిరసనపై .. ఆరా తీస్తున్నారు. అయితే.. కోర్టు తీర్పుకు లోబడే తమ ఆందోళన ఉంటుందంటున్నారు సీపీఎస్ ఉద్యోగులు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్ ను ఒప్పుకునేది లేదంటున్నారు.  

బీసీ డిక్లరేషన్‌ ప్రకటించేందుకు కాంగ్రెస్‌ సన్నాహాలు

బీసీ మంత్రం జపిస్తుంది టీకాంగ్రెస్‌. పార్టీలో బీసీల ప్రాధాన్యతపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ పెట్టారు. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుంది టీ కాంగ్రెస్‌. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. బీసీ డిక్లరేషన్‌లో చేర్చాల్సిన అంశాలపై సూచనలు,సలహాలు ఇవ్వనుంది పొన్నం కమిటీ. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రధాన్యతపై సిఫార్సులు చేయనుంది. కమిటీలో పార్టీలోని బీసీ నేతలకు చోటు కల్పించారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్‌ ప్రకటించాలని కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తుంది.

Yuvagalam: లోకేష్‌తో పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు


ప్రవాహం నుంచి..సునామీగా మారిన లోకేష్‌ యువగళం పాదయాత్ర మరో కీలక మైలురాయిని చేరింది. పోలవరం నియోజకవర్గంలో 200వ రోజుకు చేరుకున్న పాదయాత్రలో పాల్గొన్నారు లోకేష్ తల్లి నారా భువనేశ్వరి. యువగళం పాదయాత్రకు సంఘీభావంగా నారా,నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 200రోజుల పాదయాత్రలో 77 నియోజకవర్గాలు,185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా లోకేష్‌ పాదయాత్ర కొనసాగింది. 200 రోజుల పాటు కొనసాగిన పాద యాత్రలో 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8రచ్చబండ సభలు నిర్వహించారు.

YSRCP: తన చెప్పుతో తానే కొట్టుకున్న వైసీపీ కార్యకర్త

వైసీపీ ప్రభుత్వంపై ఏకంగా ఆ పార్టీ కార్యకర్తే విసిగిపోయాడు. చిన్న పని కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పని మాత్రం కావడంలేదని తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. వైసీపీ కార్యకర్తను అయినందుకు తనకు ఇలా జరగాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల సంగాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేష్ పొలం పని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం చుట్టు రెండు నెలలుగా తిరుగుతున్నాడు. ఏ అధికారి తన గోడు వినిపించుకోవడంలేదని ఆవేదన చెందాడు. 

Kurnool Mayor: జై జగన్‌ అంటేనే నిధులిస్తామమన్న మేయర్  బీవై రామయ్య


నగరాభివృద్ధికి పాటుపడాల్సిన కర్నూలు మేయర్‌ వైసీపీ అనుచరుడిలా మారారు. తమ డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలని టీడీపీ కార్పొరేటర్లు విన్నవించగా జై జగన్‌ అంటేనే నిధులిస్తామన్నారు మేయర్‌ బి.వై.రామయ్య. కర్నూలులోని నూతన కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం నగరపాలక పాలకవర్గ సమావేశం జరిగింది. టీడీపీ చెందిన పలువురు కార్పొరేటర్లు తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలంటూ సభ దృష్టికి తెచ్చారు. వీధి దీపాల పనులు చేయమంటే టీడీపీ గెలిచిన వార్డుల్లో చేయోద్దని అధికారులే చెబుతున్నారన్నారు.

పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ బాలుడు మురికి నీటి సంపులో పడి చనిపోయాడు. బాలుడు షాద్ నగర్ పరిధిలోని నందిగామకు చెందిన అభిజిత్ రెడ్డిగా గుర్తించారు. బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతికిన కుటుంబ సభ్యులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫంక్షన్ హాల్ ఆవరణలోని మురికి నీటి సంపులో బాలుడి మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Fire Accident: శ్రీశైలంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ L బ్లాక్ లో 14 షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం జరిగింది. సరుకు కళ్ళముందే కాలి దగ్ధం అవ్వుతున్న ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ షాపు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రమాదానికి షాట్ సర్కిటే కారణమని తెలుస్తుంది. ప్రమాదాన్ని నివారించేందుకు దేవస్థానం అధికారులు ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Crime: విశాఖకు వచ్చిన బెంగాల్‌ పోలీసులు

విశాఖకు వచ్చారు బెంగాల్‌ పోలీసులు. విద్యార్థిని రీతిషాహా అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేపట్టారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ మృతురాలి తండ్రి పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ సీఎం ఆదేశాలతో కోల్‌కతాలోని నేతాజీ నగర్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చి విచారణ చేపట్టారు బెంగాల్‌ పోలీసులు. హత్య కోణంలో విచారణ మొదలుపెట్టారు. రీతిషాహాది ఆత్మహత్యగా భావిస్తున్నారు విశాఖ పోలీసులు. విచారణలో కళాశాల, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు.

ఒంటరి ఏనుగు దాడిలో దంపతులు మృతి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒంటరి ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. ఇద్దరూ పొలాల పక్కన ఉండగా ఒక్కసారిగా దాడిచేసినట్లుగా తెలుస్తోంది. మృతులు వెంకటేష్, సెల్విగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాల వద్దకు వెళ్లేందుకు కూడా జనం జంకుతు న్నారు. గ్రామ శివారులో కూడా ఏనుగు హల్‌చల్‌ చేస్తుండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. 

Yuvagalam: ప్రజల కోసం లోకేష్ పోరాడుతున్నాడు- భువనేశ్వరి


రేపటితో పాదయాత్రకు 200 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో... భగవంతుడు లోకేష్ కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకున్నారు నారా భువనేశ్వరి. లోకేష్‌ ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్‌ను భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రజల తరపున లోకేష్ పాదయాత్ర చేపట్టారన్నారు. రేపు తమ కుటుంబం సభ్యులు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారని.. అందరూ పాదయాత్రను దిగ్విజయం చేయాలన్నారు నారా భువనేశ్వరి. 

నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో వైసీపీ నేత వికృత చేష్టలు

నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో మహిళా భక్తుల పట్ల ఓ వైసీపీ నేత అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలతో ....నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి అనే వైసీపీ నేత....వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆలయంలో... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే.... మహిళల మధ్యలోకి ప్రవేశించిన మదన్ మోహన్ రెడ్డి....మహిళా భక్తులపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు. దీనిపై మండిపడ్డారు మహిళా భక్తులు.   

Mancherial: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. బీరువా, హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

YSRCP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం అంపురాం గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతికి నిరసన సెగ తగిలింది. గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అంపురాం వెళ్లిన ఎమ్మెల్యేను స్ధానిక గిరిజనులు నిలదీశారు. గ్రామానికి సరైన రోడ్లు, మంచినీటి కులాయిలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నాలుగేళ్లుగా గ్రామంలో ఉన్న సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే వచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు చొరవదీసుకుని గిరిజనులను అడ్డుకున్నారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

రాజ్‌భవన్‌లో రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం

భారత దేశం ఎన్నో సంస్కృతుల సమ్మేళనం అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాఖి పండుగ అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. రాజ్‌భవన్‌లో ఘనంగా రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్‌తో పాటు, విద్యార్ధులు పాల్గొన్నారు. వారికి గవర్నర్ తమిళిసై రక్షా బంధన్ కట్టారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం భారత దేశానికి గర్వకారణం అన్న ఆమె.. త్వరలోనే మనం స్యూరుడిపై అడుగుపెట్టబోతున్నామన్నారు.

general elections 2023: నిన్న అసంతృప్తిగా ముగిసిన పీఈసీ సమావేశం


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత కత్తిమీద సాములా మారింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేయడంతో.. పీఈసీ పని కష్టతరంగా మారింది. దీంతో నిన్న పీఈసీ సమావేశం అసంతృప్తిగా ముగిసింది. అభ్యర్థుల వడపోతకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 2న మరోసారి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఆ రోజే దరఖాస్తుల జాబితాను షార్ట్‌ లిస్ట్‌ చేయనున్నారు. సెప్టెంబర్‌ 2 లేదా 3వ వారంలో తుది జాబితా విడుదలకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. 

షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ జరగవచ్చు: సీఎం  నితీష్

ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ జరగవచ్చన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్నికలు ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఒరిజినల్ షెడ్యూల్‌కే ఎన్నికలు జరుగుతాయనే గ్యారెంటీ లేదన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం డిసెంబర్ లేదా జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందస్తుగానే అన్ని హెలికాప్టర్లను ముందుగానే బీజేపీ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మమతా వ్యాఖ్యలపై స్పందించిన నితీష్. ఎన్డీయే ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చాలాకాలంగా తాను చెబుతునే ఉన్నానన్నారు.  

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొద్దినెలల్లో ఉండగా.. ఒడిశా సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్‌ వరకు అసెంబ్లీ గడువున్నప్పటికి... ఒడిశాలో ఈ ఏడాదే ఎన్నికలుంటాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లే వచ్చే నెల 13న కేంద్ర ఎన్నికల బృందం ఒడిశాలో పర్యటించనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. అక్టోబరు నాటికి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పరిశీలనను పూర్తి చేసి నవంబరు 15కు ఎన్నికలకు అన్నీ సిద్ధంగా ఉంచుతామన్నారు ఒడిశా ముఖ్య ఎన్నికల అధికారి నికుంజ బిహారీ. 

శ్రీకాకుళం పాతపట్నంలో అగ్నిప్రమాదం

శ్రీకాకుళం పాతపట్నం ప్రధాన రహదారిపై ఉన్న స్నేహ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మాల్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. స్ధానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఉత్సాహంగా సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్రకు మాజీ జడ్పీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు ముళ్ళపూడి బాపిరాజు సంఘీభావం తెలిపారు. యువగళం పాదయాత్ర మధ్యలోనే నిలిపివేస్తారంటూ వైసీపీ నేతలు కారుకూతలు కూశారు.. ఇప్పుడు వస్తున్న ప్రజాదరణ చూసి నోరెళ్ల పెడుతున్నారని మండిపడ్డారు. కారు కూతలు కూసే ప్రతి ఒక్కరికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు టీడీపీ మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు.

ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలన్న దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు

టీడీపీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావుకి భారతరత్న ఇవ్వాలన డిమాండ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. ఇటీవలే జరిగిన ఎన్టీఆర్‌ శత శయంతి నేపధ్యంలో డిమాండ్‌ మరింత పెరిగింది. ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక వంద రూపాయిల నాణెం విడుదల చేశారు.ఎన్టీఆర్‌ తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనమని,రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనమని ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవమని దర్శకేంద్రుడు ప్రసంశించారు. 

NTR 100 Rupees Coin: ఎన్టీఆర్‌ స్మారక  రూ.వంద నాణెం అమ్మకం ప్రారంభం

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ స్మారక వంద రూపాయిల నాణెల అమ్మకం ప్రారంభమైంది. ఈ నాణెనికి మూడు ధరలునిర్ణయించారు. అధికారులు.4 వేల850,4వేల380,4 వేల50 రూపాయిలుగా ధరలు నిర్ఱయించారు అధికారులు. మింట్ కాంపౌండ్‌లోనాణెం కోసం బారులు తీరారుఅభిమానులు. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉన్న నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, శతజయంతి అని హిందీలో ముద్రించారు. ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన

విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌ కంటైనర్‌ టెర్మినల్ సమీపంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్‌కు భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ టెర్మినల్‌ వద్ద ధర్నాకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 2002లో విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఏర్పాటు సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని.. వాటిని అధికారులు నెరవేర్చాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. ఆందోళనకారుల ధర్నా దృష్ట్యా కంటైనర్‌ టెర్మినల్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు.   

Crime: రేప్‌ చేసి బండరాయితో హత్య

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. నానక్‌రామ్‌గూడలోని ఓ నిర్మాణ సంస్థలో మహిళను రేప్‌ అండ్‌ మర్డర్‌ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. మృతురాలు గౌలిదొడ్డి కేశవనగర్‌కు చెందిన కాశమ్మగా పోలీసులు గుర్తించారు. వేస్ట్ మెటీరియల్‌ తీసుకునేందుకు వచ్చిన మహిళను రేప్‌ చేసిన అనంతరం నిందితులు బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే శుక్రవారం మిస్సింగ్‌ కేసు కూడా నమోదైనట్లు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

BJP: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లనని స్పష్టం చేశారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యమన్న రాజాసింగ్… బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయలను పక్కనపెట్టి.. హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానని తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ.. వేరే పార్టీల నుంచి కానీ పోటీ చేయనని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఆశాభావం వ్కక్తం చేశారు.

కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి

ఎన్టీఆర్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్నారు. పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఎన్టీఆర్‌ సంజీవని ఉచిత వైద్యశాల, ఎన్టీఆర్‌ ట్రస్టు ఉచిత వైద్య మొబైల్‌ వ్యాన్‌ను ప్రారంభించారు. అంతకుముందు ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతిపురం మండలం కడపల్లె సమీపంలోని శివపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలిస్తారు. అక్కడ్నంచి బెంగళూరుకు చేరుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణమవుతారు.

AP: టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తూరు మండలం నివగాం ఇసుక ర్యాంపు పరిశీలనకు పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదేమీ రాజ్యం.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

టీడీపీ బోర్డులో అన్యమతస్థులు.. బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ


టీడీపీ బోర్డులో అన్యమతస్థులు, లిక్కర్‌ మాఫియాను పెట్టొదంటూ..ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టింది.కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరించారు. టీటీడీలో దొంగలు పడ్డారని.. హైందవ దేవాలయాల్లోఅన్యమతస్థులు ఉండటం సిగ్గుచేటంటూ నిరసన చేపట్టారు. టీటీడీని నిర్వీర్యం చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలుస్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ మద్దతు తెలిపారు స్ధానికులు.

దళితుడిని పక్కా స్కెచ్‌ వేసి హత్య చేసిన వైసీపీ నేత

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. రాజకీయ కారణాలతో దళితులపై వైసీపీ నేత ప్రతాపం చూపిస్తున్నారు. ఏర్పేడు మండలం చెన్నంపల్లిలో స్థానిక టీడీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా హత్యచేశారు. కల్లూరుకు చెందిన టీడీపీ దళిత కార్యకర్త..మోహన్‌బాబును వైసీపీ నేత మునిరెడ్డి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మునిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ NIA కోర్టులో కోడి కత్తి కేసు విచారణ

కోడికత్తి కేసులో తమ బిడ్డకు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీను కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఏడుసార్లు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి కోర్టులు. ఇప్పటి వరకు విజయవాడలో జరిగిన కేసు విచారణ.. ఇక నుండి విశాఖలో జరగనుంది. మరోవైపు శ్రీనివాస్‌ని కావాలనే సర్కార్‌ వేధిస్తోందిని ఆరోపిస్తున్నారు. జగన్ చేతిలో శ్రీనివాస్ భవిష్యత్ ఉందని.. తమకు మద్దతిచ్చిన దళిత సంఘాల నేతలను అరెస్ట్ చెయ్యడం దారుణమని శ్రీనివాస్ తల్లి,సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. రెండు మసాజ్‌ సెంటర్లపై దాడులు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో.. ది వెల్వెట్ స్పాలో మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న 9 మంది సెక్స్ వర్క ర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు నీలిమ, కార్తీక్, జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాపై కేసు నమోదు చేశారు. 

అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయే- పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించటం ఖాయమని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఖమ్మం జిల్లా మధిర మండలంలో పొంగులేటి పర్యటించారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒకటేనని, కేంద్రంలోని బీజేపీ నేతల కనుసన్నల్లో బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: రోజర్ బిన్ని

ఎకో వైజాగ్ క్యాంపెయిన్‌లో భాగంగా విశాఖలో జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధర్యంలో బీచ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని హాజరయ్యారు. ఎకో వైజాగ్ బీచ్ వాక్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో కంటే వైజాగ్‌లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. తాను ఇప్పటి వరకు కుటుంబసభ్యులతో కలిసి ఐదు వేల మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రోజర్ బిన్ని అన్నారు.

Nandamuri Harikrishna: దివంగత టీడీపీ నేత హరికృష్ణ వర్ధంతి

ఇవాళ రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ వర్ధంతి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు.


బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి ఫైర్‌

ఖమ్మం కార్పొరేషన్‌లో అక్రమంగా దోచుకుని దాచుకున్న సొమ్మును, అక్రమంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్కిస్తామని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంత్రి తన బినామీ కాంట్రాక్టర్‌లను పెంచి పోషిస్తు.. రానున్న ఎన్నికల్లో మూడోసారి గెలవాలనే తపనతో ఉన్నారని మండిపడ్డారు. త్వరలో ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడతుందని పొంగులేటి అన్నారు.

Yuvagalam: 198వ రోజుకు చేరుకున్న యువనేత లోకేష్ యువగళం

యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. ఉదయం చింతలపూడి నియోజకవర్గం తీగలవంచ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. టీ. నరసాపురంలో రైతులతో, స్ధానికులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం శ్రీరామవరం భోజన విడిది కేంద్రం వద్ద పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొననున్నారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముట్టడికి పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబాలతో సహా బల్దియా ముట్టడికి వచ్చారు కాంట్రాక్టర్లు. రంగంలోకి దిగిన పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటున్నారు.