- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

భూపాలపల్లి జిల్లాలోని మొరంచపల్లి గ్రామంలో వరదలో చిక్కుకున్న రెండువందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రెస్యూ చేసిన వారందరినీ కరకపల్లి విలేజ్‌లోని పునరవాస కేంద్రాలకు తరలించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం వాతావరణం అనుకూలించలేదని.. దీంతో హెలికాప్టర్ ద్వారా రక్షణ చర్యలు చేపట్టలేకపోయామన్నారు.

వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు పలు రైళ్లపై ప్రభావం చూపించాయి. కాజీపేట నుంచి వడ్డేపల్లి వరకు ట్రాక్‌పై వరద నీరు నిలవడంతో.. ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దు చేశారు రైల్వే అధికారులు. అటు ఖమ్మం రూట్‌లో వెళ్లే ట్రైన్లు 5గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

వినుకొండ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే వైసీపీ నేతలు వారిని రెచ్చగొట్టడమే కాకుండా దాడులు చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తీరు కారణంగా శాంతి భద్రతల సమస్య వస్తుంటే నివారించాల్సిన పోలీసులు తిరిగి టీడీపీ కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి వినుకొండ ఘటనే నిదర్శనమన్నారు చంద్రబాబు. వైసీపీ చిల్లర వేషాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. ఖాకీ దుస్తులు వేసుకున్న ఏ స్థాయి పోలీసు అధికారులు అయినా వాటి విలువ తగ్గకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల రౌడీయిజం పై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తుంది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు తెగిపోయాయి. రాయగిరి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపైకి వరద వచ్చింది. దీంతో ఆ రోడ్డును పోలీసులు మూసివేశారు. భారీగా నీరు నిల్వ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

పల్నాడు జిల్లా వినుకొండలో 3 రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. వినుకొండలో టీడీపీ ర్యాలీ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో ఉద్రిక్తతను కట్టడి చేసేందుకు 3 రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌కు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక ఇన్ ఫ్లో లక్షా 70వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 50వేల క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఓపెన్ చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వందల ఎకరాలు నీటిలో మునగడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక వేలకు వేలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు పంటలన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. 35 ఏళ్ల వయస్సులోనే విష్ణువర్దన్ రెడ్డి మృతి చెందడంతో.. పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి హరీష్‌రావు.. విష్ణువర్దన్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. హరీష్‌రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కమ్మర్ పల్లి స్టేషన్‌తో పాటు సమీప కాలనీలను వరద ముంచెత్తింది. క్రమంగా నీటిమట్టం పెరగడంతో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో ఆర్మూర్-జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

రాజస్థాన్ షికార్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ కిసాన్ నిధి నగదు విడుదల చేశారు. 14వ విడత కార్యక్రమంలో విడుదల చేసిన నగదుతో రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున జమ కానుంది. దీంతో పాటు యూరియా గోల్డ్ ని కూడా ప్రారంభించారు. దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రంగా మారుస్తామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు వ్యవసాయ ముడి పదార్థాలు, భూసార పరీక్షలు, విత్తనాలు,ఎరువులు అందజేస్తామని మోదీ తెలిపారు.

భారీ వర్షానికి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోకి వరద వచ్చింది. పీజేఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 50, 51 వద్ద ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు వరద నీటిని బయటికి తోడేస్తున్నారు. వర్షపు నీటితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలో రోడ్లపై వరద ప్రవహిస్తుంది. బాలాజీ లేఅవుట్, వొక్షిత ఎన్‌క్లేవ్, ఆదర్శ్‌నగర్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎగువ ఉన్న చెరువు నుంచి భారీగా వరద వస్తుంది. దీంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.

జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పడకేశాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు అని వీటి కింద ఎన్నో నదులు ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామన్నారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చని అయితే జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇక తన వల్లే ప్రాజెక్టులపై సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించడం హాస్యాస్పదమన్నారు. ఇరిగేషన్ మంత్రి అరుపులు తప్పా ఏ పని చేయడని విమర్శించారు. ఇక కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు

భూపాలపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మలహర్‌రావు మండలం మల్లారంలో ఇళ్లలోకి నీరు వచ్చింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న పిల్లలు, గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నతుండ్ల, పెద్దతుండ్ల, రాగులపల్లి గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పెద్దచెరువు ఉప్పొంగింది. తాడిచెర్లలోని తహసీల్దార్ కార్యాలయంలోకి భారీగా వరద వచ్చింది. ఇక.. ఆరెవాగు పైనుండి మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు స్తంభించాయి. బోర్లగూడెం-నర్సింగాపూర్ గ్రామాల మధ్యలో సుంకారపు చెరువు నిండిపోయింది. పెద్దవాగు పొంగడంతో కాటారం-మేడారం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. భారీగా వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.70 మీటర్లకు...513.41 మీటర్ల మేర నీరు చేరింది. తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని మూసీకి వదలుతున్నారు. ఔట్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. వరద ప్రవాహంతో సరస్సులోకి నీరు అధికంగా వచ్చి చేరింది. వరదలు పోటెత్తటంతో తీగల వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మరోవైపు ఫస్ట్ ఫ్లోర్ కాటేజీలలోకి సైతం వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు సరస్సు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తరువాతే టూరిస్టులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ములుగు కలెక్టర్, జిల్లా ఎస్పీ సైతం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో భారీ వర్షాలు.. వరదలు జనాల్ని పరేషాన్ చేస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముల్కపల్లిలో కొందరు వాగును దాటుతుండగా ఓ మహిళ కొట్టుకుపోయింది. దీంతో.. ఆ మహిళ కోసం గాలింపు చేపట్టారు.

పల్నాడు జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతుంది. వినుకొండలో బోల్లా వర్సెస్ జీవీ రగడ కొనసాగుతుంది.నట్లు, బోల్ట్‌లు పోయాయని కేసు నమోదు చేయడంతో జీవీ ఆంజనేయులు,టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు పోలీసులు.పోలీసుల వింత పోకడకు నిరసనగా టీడీపీ శ్రేణుల ర్యాలీ చేపట్టాయి.వినుకొండ శివయ్య స్తూపం సెంటర్‌లో టీడీపీ నిరసనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.ర్యాలీలో చేశారు.ర్యాలీ మధ్యలో కారులో వచ్చి ఎమ్మెల్యే బోల్లా హల్ చల్ చేశారు.దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో గోపాల్ పూర్ ఇసుక క్వారీలో 15 మంది చిక్కుకున్నారు. అయితే ప్రవాహం క్రమక్రమంగా పెరగడంతో వీరిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మరోవైపు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కంటైనర్‌తో పాటు జేసీబీ సైతం వరదల్లోనే చిక్కుకుపోయింది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

గడప గడపకు కార్యక్రమంలో వైసీపీకి నిరసన సెగలు తగులుతున్నాయి. సమస్యలపై అడుగడుగునా వైసీపీ నేతలను స్థానికులు నిలదీస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఇన్‌ఛార్జ్ నేదురుమల్లికి నిరసన సెగ తగిలింది. గ్రామాల్లో పర్యటిస్తున్న నేదురుమల్లిపై స్థానికుల ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యపాన నిషేదంపై మహిళలు నిలదీశారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు నేదురుమల్లి. ఇక 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫించన్లు రావడం లేదని మరో వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని జంటజలాశయాలకు వరద పోటెత్తుతోంది. రెండు జలాశయాల నుంచి మూసీలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్‌లో గరిష్ట నీటిమట్టం 1761.75 అడుగులకు గాను.. 1761.50 అడుగుల మేర నీరు చేరింది. దీంతో 2,750 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. ఇక ఉస్మాన్‌సాగర్ గండిపేటలో రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట - గూబనపల్లి గ్రామాల మధ్య చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

రాయలసీమ ప్రాజెక్టులకు వైసీపీ తీరని అన్యాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు పలువు విషయాలు వెల్లడించిన చంద్రబాబు.. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభమైందన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ప్రకటనల ఖర్చులు.. సలహాదారుల జీతాలతో కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితి ఉండేదన్నారు. రాయలసీమకు.. యువతకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రాంతం.. కులం పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీమలో ప్రశాంతత తెచ్చింది టీడీపీనే అన్నారు. ఏపీలో తుపాను నివారించలేమని.. కానీ కరవును నివారించవచ్చని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జి కొండూరు మండలం సున్నప్పాడ దగ్గర వరద ఉధృతికి రోడ్డు ధ్వంసమైంది. దీంతో మండలకేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరంలో కాకర్లవాగు పొంగిప్రవహిస్తోంది. దీంతో ముందుజాగ్రత్తగా ఆ మార్గంలో వాహనదారులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం-సరకులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. అనంతపురం జిల్లాలోని వెంకటాంపల్లి - ఖాదర్‌పేట సమీపంలో ఓ వ్యక్తి రైల్లో నుంచి జారి పడ్డాడు. తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇది గమనించిన రైల్వే లైన్‌మెన్లు స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. ప్రయాణికుడు పడిపోయిన ప్రాంతానికి వాహనం వెళ్లడానికి వీల్లేకపోవడంతో.. స్ట్రెచర్ మీద పడుకోబెట్టి 3 కిలోమీటర్ల మేర సిబ్బంది నడుచుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం 108లో గుంతకల్ ఆస్పత్రికి తరలించారు.

సీఎం జగన్‌పై రాయలసీమ స్టీరింగ్ కమిటీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. జగన్ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. తాడో పేడో తేల్చుకునేందుకు.. ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చామన్నారు. చిత్తూరు నుంచి కర్నూలు వరకు రాయలసీమ నాయకులంతా ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరారు.

తెలంగాణలో హోం గార్డులు ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంట సభ్యులతో కలిసి చలో ధర్నా చౌక్ కు పిలుపు నిచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్దకు వెళ్తున్న హోంగార్డులను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

మరోసారి తడబాటుకు గురైయ్యారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తానని నోరు జారారు మంత్రి. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అవాక్కైయ్యారు వైసీపీ కేడర్. దీంతో తమాయించుకున్న మంత్రి తిరిగి తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు. మంత్రికి,ముఖ్యమంత్రి తేడా లేదా అంటూ నెటిజన్ల ట్రోల్స్ చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వద్ద ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్ధిపేట జిల్లా కూడలి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగుల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఎగువ మానేరు నిండుకుండలా మారింది. జలకళ సంతరించుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతుండటంతో పర్యాటకులు, స్ధానికులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్నాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి సైతం వరద నీరు భారీగా వస్తుండటంతో హోస్పెట్ టీబీ డ్యాంకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. క్రమక్రమంగా టీబీ డ్యామ్‌కు వరద నీరు పెరుగుతుంది. టీబీ డ్యాం గరిష్ట నీటి మట్టం 16వందల 33 అడుగులు కాగా.. ప్రస్తుతం 16వందల 11 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. వరద ఉధృతి నేపథ్యంలో సాగునీటి కాలువలకు 198 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

భారీ వర్షాలకు గన్నవరం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు చెరువులను తలపిస్తున్నాయి. చినుకు పడితే చాలు పాఠశాలల్లో మోకాళ్లలోతు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. తేలపోలు ప్రభుత్వ స్కూల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. వరద నీటిలోనే నడుచుకుంటూ విద్యార్థులు స్కూల్‌కు వెళ్తున్నారు. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నాడు నేడు పేరుతో ఆర్భాటాలు తప్పా చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ గాలి మాటలకే పరిమితం అయ్యిందని... విద్యార్థులు నరకయాతన పడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని ఆదివాసీ ఆటవీ ప్రాంత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు సామర్ధ్యం మించి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం 23 గేట్లు ఎత్తి లక్షా నాలుగు వేల ఇరవై మూడు వేల క్యూసెక్యుల నీరు దిగువనున్న గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రాజెక్టు సిబ్బంది అలెర్టుగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇక జంట జలాశయాల నుంచి మూసికి భారీగా వరద నీరు పొటెత్తుంది. లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉస్మాన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద నీరు బాపు ఘాట్ వద్ద కలుస్తుండటంతో వరద ప్రవాహం అధికంగా ఉంది.

కార్గిల్ దివస్ వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు. దేశ గౌరవప్రతిష్ఠల కోసం నియంత్రణ రేఖ దాటడానికైనా సైన్యం సిద్ధమని ప్రకటించారు. కుట్రలకు తెగబడితే బదులిచ్చేందుకు వెనుకాడబోమన్నారు. 24వ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో సైన్యం చూపిన పరాక్రమాన్ని ప్రస్తావించారు.

భారతీయ విలువలు, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నప్పటికీ దేశ ప్రతిష్ట కంటే ఏదీ ముఖ్యం కాదని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కేవలం కార్గిల్ యుద్ధంలోనే కాదు స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి పలుమార్లు సైన్యం తమ ధైర్య సాహసాలతో దేశం గర్వించేటట్లు చేసిందన్నారు. కార్గిల్ విజయ్‌దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లో నాలుగు మిగ్ 29 యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు నిర్వహించాయి. తద్వారా కార్గిల్ యుద్ధంలో మరణించిన భారత జవాన్లకు నివాళులు ఆర్పించాయి.

హైదరాబాద్‌లో కుండపోతవ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో అల్వాల్ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో ఇళ్లలోకి పాములు చేరుతున్నాయి. అయితే అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో స్థానికులు వినూత్న నిరసనకు దిగారు. సంపత్ కుమార్ అనే వ్యక్తి ఓ పామును తీసుకెళ్లి అల్వాల్ GHMC వార్డు ఆఫీసులో వేసి నిరసన తెలిపాడు. టేబుల్ పై పాము వేయడంతో అధికారులు పరుగులు తీశారు.

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి బస్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైర్ పేలడంతో అదుపుతప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. కాకాని వ్యవసాయ శాఖ మంత్రిగా అనర్హుడు అని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో కరోనా ప్యాలెస్ కట్టిన ఘనుడు అంటూ మండిపడ్డారు. వ్యవసాయం గురించి ఏం తెలుసని నోరు పారేసుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. రైతులకు అందే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను కూడా నిలుపుదల చేసినందుకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. అగ్రోస్ చైర్మన్ సీఎంకు రాసిన లేఖపై మంత్రి ఏం సమాధానం చెప్తాడని సోమిరెడ్డి నిలదీశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


