చిట్టి న్యూస్

YCP: ఎమ్మెల్యే బాబుకు చేదు అనుభవం..

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తెల్లగుండ్ల పల్లెలో వైసీపీ ఎమ్మెల్యే బాబుకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారు? గ్రామానికి ఎందుకు వస్తున్నారంటూ? తెల్లగుండ్లపల్లెకి చెందిన ప్రజలు బ్యానర్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యానర్‌ తొలగించాలని ప్రజల్ని ఆదేశించారు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ ఎమ్మెల్యే బాబుకి ఇప్పటికే పలు చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. 

KARNATAKA: అన్నభాగ్య పథకం..అమలుకు ఇబ్బందులు

కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు. అయోమయంలో పడ్డ సిద్ధరామయ్య సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్‌ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. 

AP Politics: జగన్‌పై పవన్‌కల్యాణ్‌ ఘాటు విమర్శలు

సీఎం జగన్‌పై జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఘాటు విమర్శలు చేశారు. సీఎంకు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు రావని విమర్శించారు.జగన్‌కు భవిష్యత్‌లో అక్షరాలు నేర్పిస్తానని పవన్‌ పేర్కొన్నారు. తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని బాధపడుతున్నారని.ఇక నుంచి జగన్‌ స్టైల్‌లోనే మాట్లాడతానని అన్నారు.అమ్మ ఒడి పథకం సభలో జగన్‌ అలాంటి మాటలు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.తాను చెప్పు చూపించి మాట్లాడానంటే దాని వెనుక చాలా కథ ఉందని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో క్షుద్రపూజల కలకలం రేపాయి.అర్థరాత్రి మామిడి తోటలో క్షుద్రపూజలు నిర్వహించారు కొందరు నిర్వాహకులు.సినిమా సెట్టింగ్‌ తరహాలో సెట్టింగ్‌ ఏర్పాట్లు చేసి మరీ పూజలు చేశారు.దేవతా విగ్రహాలతో పాటు పసుపు, కుంకుమతో ముగ్గులతో 20 మంది బృందంగా ఏర్పడి క్షుద్రపూజల నిర్వహించారు.తమిళనాడు, తెలంగాణకు చెందిన రిజిస్ట్రేషన్లు కలిగిన..5 కార్లలో పెనుగంచిప్రోలు వచ్చిన 20 మంది పూజలు అనంతరం తమిళనాడుకు వెళ్లిపోయారు.అర్థరాత్రి పూజలు నిర్వహించడంపై స్థానికుల ఆందోళన వ్యక్తం చేశారు. 

విశాఖలో భవిష్యత్తు గ్యారంటీ చైతన్య యాత్ర

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. జగన్‌ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సంక్షేమ పథకాలతో పెరుగుతున్న అప్పుల ముప్పు నుంచి కాపాడేది చంద్రబాబు అంటూ ప్రజలకు వివరిస్తున్నారు. జింక్‌ ఏరియాలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఎమ్మెల్యే గణబాబు బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో యంత్రాలు ప్రారంభం

హైదరాబాద్‌ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో యంత్రాలు ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ వ్యాప్తంగా 12 ఫ్యాకో యంత్రాలు ఏర్పాటు చేశారు.సరోజిని ఆస్పత్రిలో అందుబాటులోకి 2 ఫ్యాకో యంత్రాలు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్చువల్‌గా ఫ్యాకో యంత్రాలు ప్రారంచారు మంత్రి హరీష్‌ రావు.కాటరాక్ట్ శస్త్ర చికిత్సల కోసం ఫ్యాకో యంత్రాలు ఉపయోగపడుతాయని,అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు హరీష్‌రావు. 

AP : ఆందోళనకు టీడీపీ, దళిత సంఘాల పిలుపు

చిత్తూరు జిల్లా రామకుప్పంలో హైటెన్షన్ నెలకొంది. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు టీడీపీ, దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనకు అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. అనుమతులు లేకున్నా నిరసన వ్యక్తం చేసి తీరుతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. 4 మండలాల నుంచి టీడీపీ శ్రేణులు, దళిత నేతలు రామకుప్పం చేరుకుంటున్నారు. గత వారం కుప్పం కోర్టు ఆవరణలో.. టీడీపీ మాజీ సర్పంచ్‌ మహాదేవి జయశంకర్‌ను రామకుప్పం ఎస్‌ఐ కృష్ణయ్య దూషించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

జగన్‌ సర్కార్ పై  బోండ ఉమ ఫైర్‌


జగన్‌ సర్కార్ పై టీడీపీ నేత బోండ ఉమ ఫైర్‌ అయ్యారు.సమగ్ర సర్వే పేరుతో లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు.కొత్త విధానాలతో జగన్ ప్రభుత్వం దోచేస్తోందని,దాదాపు రెండు లక్షల ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో పెట్టి..అధికారులతో బెదిరింపులకు చేయిస్తున్నారని అన్నారు.భూముల్ని 22ఏ చట్టం నుంచి తొలగించటం కోసం..సెటైల్మెంట్ ల పేరుతో కోట్లు కొట్టేశారని విమర్శించారు.22ఏ పరిధిలో ఉన్న భూములు అమ్ముకోవడం సాధ్యం కాదని అధికారులు బెదిరిస్తూ కారుచౌకగా వాటిని దోచేస్తున్నారని అన్నారు. అసలు 22ఏ లో 2లక్షల ఎకరాలు ఎందుకు పెట్టారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సూర్యపేటలో భట్టి పాదయాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యపేట జిల్లా మోతే మండలంలో కొనసాగుతుంది. హుస్సేన్‌బాద్‌, మామిళ్ళగూడెం మీదుగా సాగుతుంది. ఈ సందర్భంగా భట్టి పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో సూర్యపేట జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. 

train accident: త్రుటిలో తప్పిన భారీ రైలు ప్రమాదం

మహబూబాబాద్ జిల్లాలో భారీ రైలు త్రుటిలో ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది. గూడ్స్ రైలు బోగీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ శివారులో విడిపోయాయని అధికారులు తెలిపారు. రెండు బోగీలు గూడ్స్‌ నుంచి విడిపోయినట్లు గార్డ్‌ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన గార్డ్... లోకో పైలెట్ కు సమాచారం అందించారు. కిలోమీటర్‌పైగా ముందుకు వెళ్లి మళ్ళీ ట్రైన్ వెనక్కి వచ్చి భోగి తగిలించుకొని వెళ్ళింది. గార్డు అప్రమత్తంగా ఉండటం... విడిపోయిన బోగీలు పట్టాలు తప్పకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. విడిపోయిన బోగీలు పట్టాలు తప్పకపోవడంతో రైల్వే అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Theift: రిటైర్డ్ కమిషనర్ కు మత్తు మందిచ్చి చోరీ

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్‌కు మత్తు మందిచ్చి చోరీ చేశారు. భూమి కొనుగోలు చేస్తామంటూ పరిచయమైన నిందితుడు సురేందర్.. గత నెల 30న శామ్యూల్‌కు ఇడ్లీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆయన సృహ తప్పిన తరువాత భూమి పత్రాలు, రూ. 5లక్షల నగదు, ఐదు తులాల బంగారం, కేజీ వెండితో ఉడాయించాడు. శామ్యూల్‌ ఫిర్యాదు మేరకు నిందితుడు సురేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వెనుక దుండిగల్ ఎస్‌ఐ కృష్ణ హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ఇదే..!

వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ నిర్వాహించనున్నారు. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే వరల్డ్‌కప్‌ జనగనుంది. ఇక హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో 3 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఢిల్లీలో అక్టోబర్‌ 11న భారత్‌-అప్గనిస్థాన్‌ మ్యాచ్‌, అహ్మదాబాద్‌లో అక్టోబర్‌ 15న భారత్‌-పాక్‌ మ్యాచ్‌, పుణెలో అక్టోబర్‌ 19న భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ధర్మశాలలో అక్టోబర్‌ 22 భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.లీగ్‌ దశలో 8 మ్యాచ్‌లు భారత్‌ ఆడనుంది. 

VSP: విశాఖలో ముగ్గురు మైనర్లు మిస్

విశాఖజిల్లాలో ముగ్గురు మైనర్లు మిస్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. గాజువాకకు చెందిన గుండ్రెడ్డి ఉమేష్ పవన్, దంతేశ్వర్ అలియాస్ బాబి, పిల్లల దిలీప్‌లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ముగ్గురు గాజువాకలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విద్యార్థులు ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.  

TSRTC: రిజర్వేషన్‌ ఛార్జీలు తగ్గింపు

బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ ఛార్జీల్ని తగ్గించింది తెలంగాణ ఆర్టీసీ.ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 350 కి.మీ.లోపు ప్రయాణానికి రూ.20 ఆపై దూరానికి రూ.30గా నిర్ణయించింది. సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.30గా ఖరారు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రోజూ సగటున 15 వేల మంది టికెట్లు ముందస్తుగా రిజర్వు చేసుకుంటున్నారు. కొద్దివారాలుగా ఆదాయం పెరుగుతూ నష్టాలు తగ్గుతుండడంతో రిజర్వేషన్‌ ఛార్జీలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

అవినాష్‌ అనుచరులు బెదిరిస్తున్నారు: డ్రైవర్‌ దస్తగిరి

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అయిన డ్రైవర్‌ దస్తగిరి ఎంపీ అవినాష్‌ అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. పిల్లాడిని హింసించాననే ఆరోపణలతో పులివెందుల పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపాడు. తన భార్య షబానాతో కలిసి దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసుపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ కేసు గురించి సీబీఐ ఎస్పీకి కూడా సమాచారం అందించినట్లు చెప్పాడు.

Ponguleti: ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్‌లోకి పొంగులేటి

మాయమాటలతో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని..ఆ కోరికను నెరవేరనీయబోమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఇబ్బందులుంటాయని తెలిసినా తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నామన్నరు. ఆరు నెలలుగా ప్రముఖ సంస్థలతో సర్వేలు చేయించామన్నారు. కాంగ్రెస్‌లో చేరాలనే అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఖమ్మంలో జులై 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్‌ సమక్షంలో చేరనున్నట్లు ప్రకటించారు. 

Sheshachalam: పట్టుబడ్డ ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి

శేషాచలం అటవీ ప్రాంతంలో పట్టుబడిన 5400 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి లభించిందని అటవీశాఖ అధికారి మధుసూధన్‌రెడ్డి తెలిపారు.తొలి దశ టెండర్లలో 310 టన్నుల అమ్మకాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక అత్యధికంగా 178 కోట్ల ఆదాయం వచ్చందన్నారు. అయితే రెండో దశలో టెండర్లు పిలుస్తన్నా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. ఇక శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డ పరిటాల సునీత

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డారు మాజీ మంత్రి పరిటాల సునీత.భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభించిన సునీత జాకీ పరిశ్రమ ఎక్కడ జగన్‌ రెడ్డి అంటూ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.టీడీపీ అధికారంలోకి రాగానే ప్రకాష్‌ రెడ్డి అక్రమాలపై..సిట్‌ వేసి విచారణ చేయిస్తామన్నారు.మట్టి మాఫియాను ప్రకాష్‌ రెడ్డి నడిపిస్తున్న తీరును టీడీపీ నేతలకు వివరించారు. ఎమ్మెల్యే అక్కమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలుసన్నారు. 

ఉద్రిక్తతల నడుమ విద్యార్థి సంఘాల ఆందోళన

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తత దారి తీసింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. 

కేంద్రంపై నిప్పులు చెరిగిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను జైల్లో ఎందుకు పెడతారో చెప్పాలంటూ క్వశ్చన్ చేశారు. జేపీ నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు ఆదరించరని తెలంగాణను మరింత ప్రేమిస్తే ప్రజలు ఆదిరిస్తారని గుర్తించుకోవాలన్నారు. అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ ఏమైందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన


విశాఖ కలెక్టరేట్‌ ఎదుట 'డీఎస్సీ-98' క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. 25 ఏళ్లుగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న తమకు పోస్టింగ్‌లు కొండకోనల్లోని గ్రామాలకు ఇవ్వడమేంటంటూ నిరసన చేపట్టారు. 55ఏళ్ల వయస్సు పైబడిన వారికి ఎలా బదిలిచేయాలో తెలియకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.

ఏసీ సిలిండర్‌ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి

నల్గొండలోని బర్కత్‌ పూరా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రూట్‌ స్టోరేజ్‌లో ఏసీ సిలిండర్‌ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పండ్ల కోల్డ్‌ స్టోరేజీలో ఏసీ గ్యాస్ సిలిండర్‌ మారుస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు దాడికి శరీర భాగాలు చింద్రమైపోయాయి. మృతులు కోల్డ్ స్టోరేజ్‌ ఓనర్ షేక్ కలీమ్‌, అందులో పని చేసే సాజిద్‌గా గుర్తించారు.

భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు విశేష స్పందన

టీడీపీ చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు అనకాపల్లి జిల్లాలో విశేష స్పందన వస్తోంది. తొలుత మాడుగుల సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన టీడీపీ నేతలు.. ఆ తర్వాత భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య రథాన్ని ప్రారంభించారు. నాడు జగన్ ఒక్క ఛాన్స్ అని వస్తే ఇపుడు ప్రజలు వైసీపీకి ఇదే చివరి ఛాన్స్ అని అంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ సర్కారు పూర్తిగా కమీషన్ ప్రభుత్వంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నాగాలాండ్ కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి కిందకు దిగజారిందని విమర్శించారు. 

Guntur: కృష్ణా నదిలో బయటపడ్డ నాగ ప్రతిమలు

గుంటూరు జిల్లాలోని సీతానగరం కృష్ణా నది ఎగువ భాగంలో నాగ ప్రతిమలు బయటపడ్డాయి. విగ్రహాలు ఏ కాలానికి చెందినవో తెలుసుకునేందుకు పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే శిల్పులు డ్యామేజ్‌ అయిన విగ్రహాలను ఇక్కడ వదిలి వెళ్లారా.. లేదా కూల్చేసిన ఆలయాల్లోని విగ్రహాలు నదిలో వదిలిపెట్టారా అంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ దోషాలు చుట్టుముడుతాయంటున్న భక్తులు, అందుకే నాగ ప్రతిమలను నదిలలో వదిలి వెళ్లారంటూ చెబుతున్నారు. కృష్ణానదిలో మరిన్ని విగ్రహాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

సూర్యపేట జిల్లాలో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర సూర్యపేట జిల్లాలో కొనసాగుతోంది. చివ్వేంల మండలం కొండలరాయుని గూడెం, మున్యూ నాయక్‌ తండాల మీదుగా సాగింది. మహిళలు భట్టికి ఎదురెళ్లి మరీ హారతులిచ్చారు. సంప్రదాయ రీతితో స్వాగతం పలికారు గిరిజనులు గిరిజనులతో మమేకమైన భట్టి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయనకు తలపాగ చుట్టి జొన్న రొట్టెలు తినిపించారు తండావాసులు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందన్నారు భట్టి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

Chittur: అమాంతంగా పెరిగిన టమాటా రేటు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాట రేటు అమాంతంగా పెరిగింది. ఊహించని రీతిలో పంటకు ధర పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కొన్ని నెలలుగా గిట్టుబాటు రేటు లేక విలవిల్లాడుతున్న రైతులు, వారం క్రితం వరకు కిలో టమాట ధర 10రూపాయలు కూడా పలకకపోవడంతో ఆవేదన చెందారు. అయితే అన్యూహ్యంగా రేటు 70 నుంచి 80 రూపాయల వరకు పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాక్‌పట్ విధానం రద్దుతో రైతులకు అదనపు ఆదాయం కూడా రావడంతో వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది. 

కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్: మల్లు రవి

కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. ఖమ్మంలో నిర్వహించే సభలో పొంగులేటి, నాగర్‌కర్నూల్‌లో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు పార్టీ కండువా కప్పుకుంటారని తెలియజేశారు. ప్రియాంక గాంధీని మహబూబ్‌ నగర్‌ నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. త్వరలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నట్లు మల్లు రవి వెల్లడించారు.

Manipur: మిలిటెంట్లకు అండగా నిలిచిన మహిళలు

మణిపూర్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక మహిళలు మిలిటెంట్లకు అండగా నిలిచారు. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నరన్న సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం గ్రామాన్ని చుట్టుముట్టి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకొని మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్మీ వాహనాలను మహిళలు చుట్టుముట్టడంతో కొన్ని గంటల పాటు ఇథమ్‌ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చేసేదేమి లేక  12 మంది మిలిటెంట్లను సైన్యం విడిచిపెట్టాల్సి వచ్చింది. 

Siriya: బాంబుల మోతతో దద్దరిల్లిన సిరియా

సిరియా మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. సిరియాలో రష్యా వైమానిక దాడులు నిర్వహించింది. ఇద్లిబ్‌ ప్రాంతంలోని తిరుగుబాటు వర్గాలపై అధ్యక్షుడు బషర్‌ అసాద్‌కు మద్దతిస్తున్న రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. తుర్కియే సరిహద్దుల్లోని జిస్ర్‌ అల్‌-షుగూర్‌ నగరంలోని కూరగాయల మార్కెట్‌పై జరిగిన రష్యా దాడిలో సాధారణ పౌరులు మృతి చెందినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.

BMW కారు.. మంటలకు బుగ్గిపాలు..

పంజాబ్‌ లుథియానాలో BMW కారు అగ్నికి ఆహుతైంది. రోడ్డుపై వెళ్తున్న కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారులో మంటలు ఒక్కసారిగా పెరిగాయి. స్థానికులు హుటాహుటినా పరిగెత్తుకుంటూ వచ్చి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినా దట్టమైన పొగలు అలుముకుని మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే కారు డ్రైవర్ అప్రమత్తతో ప్రాణాపాయం తప్పింది. కోట్ల విలువైన BMW కారు మంటలకు బుగ్గిపాలైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

collapses: వివాహం వేళ విషాదం

 వివాహ సంబరాల్లో మునిగిపోయిన వేళ విషాదం సంభవించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెళ్లి మండపం కూలి ఎనిమిది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో వివాహం జరుగుతుండగా భారీ వర్షం కురిసింది. దీనికితోడు భీకరంగా గాలులు వీచాయి. దీంతో పెళ్లి మండపం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది గాయపడగా... వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరికి తీవ్ర గాయలయ్యాయని... ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతడిని హుటాహుటిన జబల్‌పూర్‌లోని వేరే ఆస్పత్రికి తరలించారు.

Indian Army: చొరబాటుదారులే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్‌

భారత సరిహద్దులో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. చొరబాటుదారులే లక్ష్యంగా సైన్యం సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టింది. పాకిస్తాన్ నుంచి సాధారణ పౌరుల వేషాల్లో ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌లో చొరబడుతున్నారన్న పక్కా సమాచారంతో పూంచ్ సెక్టార్‌లో భారీగా బలగాలు మోహరించాయి. చక్కన్ దా భాగ్‌ సెక్టార్‌లో స్థానిక పోలీసులతో కలిసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ముష్కరుల ఏరివేతే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఘటన తర్వాత భారత సరిహద్దుల్లో సైన్యం నిఘా పెంచింది. 

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మెడికో సూసైడ్‌

కర్నూలు జిల్లాలో ఓ మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న లోకేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేశ్ ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థి తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం ఇచ్చిన పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రి తరలించారు.

రెడ్డిగూడంలో రంగా విగ్రహావిష్కరణ


ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడం గ్రామంలోవంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీతో వంగవీటి రాధాకు స్వాగతం పలికారు రెడ్డిగూడెం గ్రామయువకులు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన వంగవీటి రాధా భావోద్వేగానికి గురయ్యారు. రంగా ప్రజల పక్షాల నిలిచిన నాయకుడన్నారు. మరణించిన 34 ఏళ్లైనా ఇప్పటికీ జనం గుండెల్లోనే ఉన్నారన్నారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని.. ఎందరిని ప్రభావితం చేశామన్నదే ముఖ్యమన్నారు. ఎన్నిసార్లు గెలిచామా, ఓడామా అని కాకుండా... ప్రజల పక్షాన నిలబడ్డామా లేదా అన్నదే ముఖ్యమన్నారు రాధా. ఇంత అభిమానం చూపిస్తున్న ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు.


Rythu Bandhu: అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు నిధులు

వానాకాలం సాగుకు పెట్టుబడి సాయంగా 70 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులు ఇవాల్టి నుంచి వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం కేసీఆర్‌ ప్రభుత్వం 7 వేల 720 కోట్లు విడుదల చేసింది. సీఎం నిర్ణయం మేరకు నేరుగా రైతుల ఖాతాల్లోకి వ్యవసాయశాఖ నగదు జమ చేయనుంది. ఈ సీజన్‌లో కొత్తగా 5 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేసింది. దీంతో 300 కోట్ల అదనపు భారం పడనుంది. తాజాగా విడుదల చేసిన 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు అందిన రైతుబంధు మొత్తం సాయం 72 వేల 910 కోట్లకు చేరనుంది. ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకు పంట సాయం అందుతుంది. కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు.. తమ బ్యాంకు ఖాతాల వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

TDP Bus Yatra: రేపటి నుంచి టీడీపీ నేతల బస్సు యాత్ర

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి జిల్లాలో యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. జగన్‌ పాలనలో రాష్ట్రం వెనక్కిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ గాడినపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు.