- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

అవినీతి సొమ్ముతో జగన్ ఇంకెంతో కాలం వ్యవస్థలను మేనేజ్ చేయలేరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టిందని హెచ్చరించారు. 10 ఏళ్లుగా జగన్ వ్యవస్థలను మేనేజ్ చేశాడని సుప్రీంకోర్టు నోటీసులతో జగన్, అతని ముఠా పనైపోయిందని లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ ఇక తన ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలన్నారు.

ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బుల్లెట్‌ట్రైన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు వంద కి.మీ.వయాడక్ట్, 230 కిలోమీటర్ల పీర్ వర్క్ పనులు పూర్తి చేసినట్లు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్-N.H.S.R.C.L. ప్రకటించింది. 40మీటర్ల పొడవైన ఫుల్‌స్పాన్ బాక్స్ గిర్డర్లు, సెగ్మెంటల్ గిర్డర్ల ద్వారా 100 కి.మీ. వయాడక్ట్‌ల నిర్మాణం పూర్తి చేసినట్లు NHSRCL వెల్లడించింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్....ఈ పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్‌లో షేర్ చేస్తూ ఓ వీడియాను కూడా ట్యాగ్ చేశారు. గుజరాత్‌లోని వల్సాద్, నవసారి జిల్లాల్లోని పార్, ఔరంగ, పూర్ణ, మింధోలా, అంబికా, వెంగానియా 6నదులపై వయాడక్ట్‌లు పనులు చేపట్టినట్లు NHSRCL ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి గిర్డర్‌ను నవంబర్ 25, 2021 ప్రారంభించిన NHSRCL....వయాడక్ట్ తొలి కి.మీ.ను 6నెలల్లో జూన్ 30 2022న పూర్తి చేసినట్లు పేర్కొంది. 50కి.మీ. వయాడక్ట్‌ల నిర్మాణం ఈ ఏడాది ఏప్రిల్ 22న పూర్తి కాగా....ఆ తర్వాత 6నెలల్లో వంద కి.మీ. మైలురాయిని చేరినట్లు NHSRCL వెల్లడించింది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి పురందేశ్వరి హాజరయ్యారు. దేశాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేస్తోందన్న పురంధేశ్వరి... ఏపీకి సంపూర్ణమైన సహకారాన్ని మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేందుకు అన్నిరకాల సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో అభివృద్ధి... కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని పురందేశ్వరి వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అభివృద్ధికి తిలోతకాలు ఇస్తూ... ప్రజా ధనాన్ని దండుకునే ఆలోచన చేస్తోందని ఆమె విమర్శించారు. రోడ్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తుంటే... గుంతల రోడ్లు ఉన్నాయన్నారు. గుంతల రోడ్లలో ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవట్లేదని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతుల ఖాతాల్లో పడుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మద్యానికి బానిసైన వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే... వైసీపీ పాలనలో అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై . పర్యవేక్షణ ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సహా ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, విడిది అవసరాలకు 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా విభాగాలకు క్యాంపు కార్యాలయాల స్థలాలు అందుబాటులో లేకపోతే విశాఖలోని మిలీనియం టవర్లు, సమీపంలోని A, B బ్లాక్ భవనాలు కేటాయిస్తున్నట్లు. ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, గ్రామ వార్డు సచివాలయశాఖ, ఇంధనశాఖలు మినహా మిగతా 35 శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం, రుషికొండ, చినగదిలి, ఎండాడ, హనుమంత్వాక తదితర ప్రాంతాల్లో భవనాల కేటాయింపు పూర్తి చేసింది. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం..ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశాన్ని ప్రభుత్వం... ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BSP అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రెండు రోజులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న మాయావతి సూర్యాపేటలో జరగనున్న ర్యాలీ, బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ అనంతరం హైదరాబాద్ చేరుకోని హోటల్లో బస చేస్తారనిముఖ్య నేతలతో ఆమె ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 107 స్థానాల్లో BSP అభ్యర్థులు బరిలో నిలిచిన దృష్ట్యా సింగిల్ డిజిట్ సీట్ల గెలుపు లక్ష్యంగా నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇందిరమ్మ రాజ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ పాలన సాగిందని వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కావాలో దొరల రాజ్యం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్, పరకాల సభల్లో రేవంత్ పాల్గొన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం వచ్చిందన్న ఆయన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వంద కిలోమీటర్ల లోపల పాతిపెట్టాలని పిలునిచ్చారు. పదేళ్లలో ఏమి చేశారో చెప్పకుండా బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ను తిడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ నమూనా అంటే కుంగే బ్యారేజీలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీలు సహా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తామని వివరించారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ....ఇంటింటి ప్రచారాలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధానంగా ఆరుగ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా....భాజపా అభ్యర్థులు కేంద్రప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు కొండలు కరిగిపోతున్నాయి. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ....అధికారపార్టీ నేతలు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో పల్నాడు జిల్లా త్రిపురాపురం కొండ గుండుకొట్టిన చందంగా మారింది. గతంలో పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే కొండ నేడు బోసిపోయింది. ఇదేవిధంగా అక్రమరవాణా కొనసాగితే కొండ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.
నకరికల్లు మండలంలోని త్రిపురాపురం పరిధిలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి సమీపంలో త్రిపురాపురం కొండ ఉంది. ఇక్కడ నాణ్యమైన ఎర్రగ్రావెల్ లభిస్తోంది. మొదట అనుమతులు తీసుకుని కొండ కిందిభాగంలో కొంత విస్తీర్ణంలో తవ్వకాలు చేశారు. అనంతరం అనుమతులే లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. భారీ పొక్లయిన్లు పెట్టి టిప్పర్లతో నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. మట్టి మాఫియా వెనుక వైకాపా ముఖ్యనేత అండ ఉండటంతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.

తవ్వకాల వల్ల భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రైవేటు సంస్థ రాయల్టీ వసూలుచేస్తోంది. ఈక్రమంలో ప్రైవేటు సంస్థ తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి లారీకి సొమ్ము వసూలు చేస్తోంది. మూడేళ్ల కిందటి కొండ చిత్రాన్ని తాజా చిత్రాన్ని పోల్చి చూస్తే కొండను ఎలా కొల్లగొట్టారో స్పష్టమవుతుంది. అడ్డఅదువులేని తవ్వకాలతో కొండ కరిగిపోతోంది

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని.. బెయిల్‌పై విచారణ జరుగుతున్న సందర్భంలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని లూథ్రా వాదించారు. ఈ కేసుకు సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని వాదించారు. సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ అంతా వెరిఫై చేయలేదని రాశారని.. ఈ ఫోరెన్సిక్ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారని లూథ్రా బలంగా వాదనలు వినిపించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వారే రిపోర్టులో చెప్పారని లూథ్రా వాదించారు.

తమిళనాడు సిపిఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య (102) బుధవారం కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) నాయకుడు ఎన్ శంకరయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో శంకరయ్యను ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు రాజధాని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శంకరయ్య జ్వరంతోపాటు జలుబు సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన ఎన్ శంకరయ్య దేశ స్వాతంత్య్రపోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. కాగా, శంకరయ్య భౌతికకాయాన్ని చెన్నైలోని సీపీఐ (ఎం) కార్యాలయానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంతసేపు ఉంచి, అనతరం ఆయన నివాసానికి తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదిరేందుకు, వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు నేతలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎలమంచిలి నియోజవర్గ నేతలు, అనంతపురంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేతలు, విశాఖ భీమునిపట్నం తెలుగుదేశం కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

మరోవైపు తెలుగుదేశం, జనసేన నేతలు ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోను పలు నియోజకవర్గాల్లోని నేతలు ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నేతలతో కలిసి అత్తిలిలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వరరావు కార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారిలోని చిరువ్యాపారులకు కరపత్రాలను అందజేసి మేనిఫెస్టోను వివరించారు.

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలోకేంద్రం నుంచి వచ్చిన 71వేల4వందల49 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర నిధులకు Y.S.R, జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవటంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్న యనమల పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. 75 పథకాలకు జగన్, Y.S.R పేర్లు పెట్టడం...రాచరిక పోకడ కాదా..? అని నిలదీశారు. 94 కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల...B.C వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయని ఆరోపించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, స్ఖానిక సంస్థలకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 3వేల84 కోట్లని దారి మళ్లించారని యనమల ఆక్షేపించారు. రైతులకివ్వాలని కేంద్రం ఇచ్చిన కరవు సాయం 900 వందల కోట్లు...రైతులకు చేరలేదన్నారు. 8వేల 6వందల 60 కోట్ల మేర స్థానిక సంస్థల నిధులు రాష్ట్ర ప్రభుత్వం...పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలకు చెందాల్సిన 7వేల 8వందల 79 కోట్లను దారి మళ్లించి, వలసలకు జగన్ ప్రభుత్వం కారణమవుతోందని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారి -58పై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఈ ఆరుగురు ప్రయాణిస్తున్న కారు పడింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
కారు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా చాపర్ ప్రాంతంలోని రాంపూర్ క్రాసింగ్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. మృతులు ఢిల్లీలోని షహదారా నివాసితులని ముజఫర్‌నగర్ జిల్లా పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేశాయి. ఆరు నెలలుగా రూ.వెయ్యి కోట్లు బకాయి పడినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. బకాయిలు రాక తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లేఖలో వెల్లడించింది. అలాగే నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే 3,200 చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచాలని కోరింది. ఈ లేఖపై జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లా కానూరులో ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు.

నేపాల్‌కు చెందిన రుత్వికులు హోమం చేశారు. చంద్రబాబుపై CID నమోదుచేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


పోలీసుల వేధింపులు తాళలేక బాపట్ల జిల్లా కోళ్లపాలెంకు చెందిన మేరుగ కిరణ్ కుమార్ అనే దివ్యాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. పరారీలో ఉన్న తండ్రి కిశోర్ ఆచూకీ చెప్పాలని కొల్లూరు SI రాజ్యలక్ష్మి వేధించారని కిరణ్ ఆరోపించాడు. చంద్రబాబు బెయిలుపై విడుదలైన సమయంలో రామకృష్ణ, యశ్వంత్ అనే వ్యక్తుల మధ్య సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదం జరిగిందని ఆ సమయంలో తన తండ్రి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని కిరణ్ తెలిపాడు. తర్వాత యశ్వంత్ ఫిర్యాదుపై రామకృష్ణ, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి నుంచి తన తండ్రి ఇంటికి రావడంలేదని కిరణ్ వివరించాడు. తర్వాత తనను స్టేషన్ కు పిలిపించిన S.I రాజ్యలక్ష్మి కొట్టడమే కాకుండా కేసు పెడతానని బెదిరించినట్టు కిరణ్ వాపోయాడు. ఈ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి కిరణ్ ఆత్మహత్యకు యత్నించినట్లు తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అక్రమంగా నిర్బంధించడం మానవహక్కుల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. వేదాయపాలెం పోలీసుల అక్రమ నిర్బంధంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సీఐ, ఎస్ ఐలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు జైల్లో ఉన్నప్పటి ఫొటోతో నిందితుడి భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అక్టోబర్ 25న తన భర్తను తీసుకెళ్లి నవంబర్ 8న కేసు నమోదు చేశారని నిందితుడి భార్య ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మోసం కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రోజులపాటు ఎందుకు నిర్బంధించారని.. హైకోర్టుప్రశ్నించింది. భార్యాపిల్లలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు తగిన వేదికకు వెళ్లేందుకు.... పిటిషనర్ కు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ప్రధాన బెయిలు పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేస్ హైకోర్టు విచారణ జరపనుంది. నిందితులందరూ ఇప్పటికే రెగ్యులర్, ముందస్తు బెయిలు పొందడం.. ఇదే కేసులో 37వ నిందితుడైన చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై న్యాయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితులు బెయిలు పొందాక మిగిలిన నిందితులకు బెయిలు దక్కడం సర్వసాధారణమని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. స్కిల్ సంస్థ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలని, ఇదే కేసులో ఆయన 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో గడిపారని, మిగిలిన నిందితులెవరూ లేనంత కాలం చంద్రబాబు జైల్లో ఉన్నారు.
తన బెయిలు పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. శుక్రవారం ప్రధాన బెయిలు పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో న్యాయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ముంబయిలోఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన వరుస కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీ లింక్‌లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని స్థానిక డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. ఈ ఘటనలో మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం 6 కార్లు ప్రమాదానికి గురయ్యాయని వివరించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. గాయపడిన వారిలో ఇన్నోవా కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.
అలాగే ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. 'వైసిపి పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై నేను, ఇతర ప్రతిపక్ష నేతలు గళమెత్తుతున్నాం. మా నోళ్లు మూయించాలనే కేసు పెట్టారు. మేం ప్రభుత్వ అక్రమాలపై గొంతెత్తుతున్న అంశాలను ముడిపెట్టి మాపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రతీకారానికి పాల్పడుతోంది' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జగన్ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్‌కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ చేశారు. పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించింది. పిల్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ప్రతివాదులు జగన్, సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తలైవా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా సీన్ త్వరలో కనిపించవచ్చని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలర్ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..ఏపీలోనూ అలాంటి ఘటన పునరావృతం కావచ్చన్నారు. ఇప్పటికే సీఎం జగన్ నిజ స్వరూపం తండ్రి లాంటి మోడీకి తెలిసి ఉండొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు జగన్ తన పేరునో లేదా తన తండ్రి పేరునో పెట్టుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఎం కిసాన్ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా అని ఏపీ ప్రభుత్వం నామకరణం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మారుస్తున్నట్లు తెలుసుకొని 5 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రచారం కల్పించే ప్రకటనల్లో ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో, మరో వైపు ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవచ్చన్నారు. అలా కాకుండా జగన్ తన జేబులో నుంచి నిధులు ఖర్చు చేస్తున్నట్లు తన తండ్రి ఫొటో, తన ఫొటో ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దగ్గుబాటి పురందేశ్వరిపై తమ పార్టీ నాయకులు కూస్తున్న కారు కూతలు వింటే బాధనిపిస్తోందని తెలిపారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ కేసులో C.I.D అధికారులు గతంలో ACB కోర్టులో P.T. వారెంట్ దాఖలు చేశారు. P.T.వారెంట్ పై దిగువ కోర్టులో విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నాయని... 17A రింగ్ రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉచిత ఇసుక పథకంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయటం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లిందని A.P.M.D.C డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. రేపు హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

BABU: చంద్రబాబుకు విజయవంతంగా ఆపరేషన్

ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా చెట్లు నరకడం, ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం పర్యటన ప్రభావం విద్యావ్యవస్థపై కూడా పడింది. జగన్ పర్యటన సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి జగన్ వస్తుండగా ఆ సభకు జనసమీకరణ కోసం ప్రైవేట్ పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకుని సెలవు ఇచ్చారు. DEO సెలవు ప్రకటించడంపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు సత్యసాయి బాబా ఫ్లెక్సీలపైకి ఎక్కి పార్టీ జెండాలు కట్టారు. పట్టణంలో సీఎం పర్యటన లేనప్పటికీ సత్యసాయి బాబా ఫ్లెక్సీలు తీసివేసి వైసీపీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలు కట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో పార్టీ జెండాలపై నిషేధం ఉన్నా..అధికారి పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా జెండాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో తాను కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంపై.. విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ మండిపడ్డారు.తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు ఏం సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు ముందు సమాధానం ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో భారాసను దింపే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, అందుకే ఆ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించినట్టు.. షర్మిల స్పష్టంచేశారు. తెలంగాణలో... కాంగ్రెస్ కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆమె గుర్తు చేశారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని..... ఆ దొంగలు సీఎంలు కాకూడదని వ్యాఖ్యానించారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని షర్మిల అన్నారు.

కొవిడ్, క్యాన్సర్‌ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే అత్యంత చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కొవిడ్ టెస్ట్’గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ బాత్ ఇంజినీర్లు అభివర్ణించారు. ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్‌ను ‘ల్యాబ్ ఆన్ ఏ చిప్’ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరం ద్వారా పరీక్షించి కొవిడ్ ఉందో లేదో నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఫలితాన్ని స్మార్ట్ ఫోన్ యాప్‌లో చూడవచ్చు. మురికి నీటిని ఈ పరికరంలో పరీక్షించి అందులో కొవిడ్ తదితర వ్యాధులను, ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే వైరస్‌లను గుర్తించవచ్చు.
LoCKAmpను UKలో రెండవ కోవిడ్ వేవ్ సమయంలో ను పరిశోధించడం, అభివృద్ధి చేయడం ప్రారంభించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. LAMP డిటెక్షన్ అనేది PCR టెస్టింగ్ కంటే ఎక్కువ సెన్సిటివిటీని కలిగి ఉండటం, వేగవంతమైనది మరియు మరింత నిర్దిష్టమైనది కాబట్టి ఇది ఉత్తమమని ఈ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ముఖ్యంగా, PCR పరీక్షకు అవసరమైన మూడు థర్మల్ సైకిల్స్ కాకుండా, 65° ఒకే స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద దీనిలో ప్రాసెసింగ్ జరుగుతుంది.అలాగే ఈ పరికరాన్ని పోర్టబుల్ పరిమాణంలో మరియు తక్కువ విద్యుత్ వినియోగంతో సులభతరం చేయవచ్చు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ... ముగ్గురికి మాత్రం బీఫాంలను తాత్కాలికంగా నిలుపుదలచేసినట్లు తెలుస్తోంది. ఆ3 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల మార్చే అవకాశమున్నట్లు పార్టీలో చర్చసాగుతోంది. మూడో జాబితా సైతం కొలిక్కి వచ్చినందున నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులకు ఆపార్టీ నాయకత్వం బీఫాంలు పంపిణీ చేస్తోంది. రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా బీఫాంతీసుకెళ్లాలని 97 స్థానాలకుచెందిన అభ్యర్థులకు గాంధీభవన్ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. వనపర్తి, బోథ్, చేవెళ్ల స్థానానికి ప్రకటించిన అభ్యర్ధులకు మాత్రం బీఫాంల సమాచారం ఇవ్వలేదని పార్టీలో చర్చసాగుతోంది. బోథ్ నుంచి వెన్నెలఅశోక్, వనపర్తి నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, చేవెళ్ల నుంచి భరత్‌కి టికెట్లు దక్కాయి. ఆ ముగ్గురికి బీఫాం తీసుకెళ్లాల్సిందిగా గాంధీభవన్ నుంచి సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. అభ్యర్థులకు చెందిన బీఫాంలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఇన్‌ఛార్జి కార్యదర్శులు, పరిశీలకులు పంపిణీ చేయగా తొలిరోజు 65మందికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రెండోజాబితా ప్రకటన తర్వాత టికెట్ దక్కని ఆశావహులు తీవ్రఅసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఖరారైన వారికిసహకరించకుండా సహాయనిరాకరణ చేస్తుండగా మరికొందరు పార్టీనే వీడారు. ఇంకొందరు నిరసనబాట పట్టారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు జానారెడ్డి కమిటీతో పాటు పార్టీనేతలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, కోదండరెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దిగిరాగా మరికొందరు వినేందుకు సిద్ధంగా లేకపోవటం, ముగ్గురి వరకు అసంతృప్తులు ఉన్నచోట సర్దిచెప్పటం తలకుమించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులుచేయాలని పార్టీనాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఖరారైన అభ్యర్ధులపై సైతం సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రెండో జాబితా ప్రకటన అనంతరం, తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల సామర్థాల అంచనాకు జరిపిన సర్వేల్లో 9మందిపై ఆశించినస్థాయిలో సానుకూలతలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులకు నచ్చజెప్పిన తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు సమాచారం. మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ ప్రకటనతో ఇక్కడ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి భాజపాలో చేరారు. ఎల్బీనగర్‌లో ముగ్గురు నాయకులను బుజ్జగించి. ప్రచారకమిటీ ఛైర్మన్ మధుయాస్కీతో కలిసి పనిచేసేట్లుగా చేయడంలో పార్టీ నాయకత్వం సఫలమైంది. కాంగ్రెస్ మూడోజాబితా ఇప్పటికే కొలిక్కివచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. రెండో జాబితాలో కొందరిని మార్చటంతో పాటు రెండు, మూడు మినహా మిగతా స్థానాలన్నింటికి ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బాలింతలకు ఇచ్చే పాలల్లో పురుగులు రావడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలని ప్రేమ ఒలకబోసే నేతలు.. పౌషకాహారం ఇంత అధ్వానంగా ఉంటే ఏం పర్యవేక్షిస్తున్నారని మహిళలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పోలినాయుడుకండ్రిగలోని అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకులు గర్భిణులు, బాలింతలకు ఇటీవల పంపిణీ చేసిన పాలు గడ్డకట్టుకుపోయి.. పురుగులు పట్టాయి. జనవరి 14 వరకూ వాడుకోవచ్చని ఆ టెట్రా ప్యాకెట్లపై ఉంది. దీంతో శనివారం ఓ లబ్ధిదారు ప్యాకెట్లు తెరవగా అందులోని పాలు పూర్తిగా గడ్డకట్టి ఉన్నాయి. వాటిలో తెల్ల పురుగులు కనిపించాయి. దీనిపై అంగన్‌వాడీ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు వచ్చిన వాటిని పంపిణీ చేశామని.. అంతకు మించి ఏమీ తెలియదని చేతులెత్తేశారు.

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 24 మంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు ఈ బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. బస్సు ప్రమాద స్థలాన్ని దౌసా అదనపు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కస్వా పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా సింగపూర్ లోని తెలుగుదేశం ఫోరం సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ఆయన అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలంటూ... సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని తిరుమల్ శ్రీనివాసం దేవాలయం వరకు 13కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.... 3వందల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఫోరం సభ్యులంతా పాల్గొని చంద్రబాబుకు అంతా మంచి జరగాలని వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నారు.

గినియా మాజీ నియంత మౌస్సా డాడిస్ కమరా జైలు నుంచి తప్పించుకున్నారు. ఆయుధాలు ధరించిన కొందరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున దేశ రాజధాని కొనాక్రిలోని జైలుపై దాడి చేసి మౌస్సాను విడిపించుకోపోయారని గినియా న్యాయ శాఖ మంత్రి చార్లెస్ అల్ఫోన్స్ పేర్కొన్నారు. మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ మంగళవారం నిర్వహించే అవకాశం ఉంది. ముందస్తు పరీక్షల కోసం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే డాక్టర్లు సూచించారు. రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు కుడి కంటికి చేయించుకోవాల్సి ఉంది. వైద్య పరీక్షల కోసం చంద్రబాబు గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం చంద్రబాబుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, అలర్జీ స్క్రీనింగ్, కాలేయ, మూత్రపిండాల పనితీరు, ఇతర టెస్టులు చేశారు. వాటి ఫలితాల ఆదారంగా వైద్యులు చికిత్స చేయనున్నారు.

ఆరోగ్యసమస్యలతో మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబును హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లిన పవన్, నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వారు ఆరా తీశారు. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో ఇరువురు చర్చించినట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. దాదాపు రెండున్నర గంటల సమావేశంలో షణ్ముఖ వ్యూహం పేరిట జనసేన తరపున ఆరు అంశాలను పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళిక రూపకల్పనకు సూచించినట్లు తెలిసింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా లేక ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలన్నా ఉచితంగా ఇసుక పంపిణీ చేయటం సహా 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూతనిచ్చే ప్రత్యేక కార్యాచరణపై చర్చించిన్నట్లు సమాచారం. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా 10లక్షల చొప్పున సాయం అందించాలని తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా చూడాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం - బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు 5వేల కోట్ల రూపాయలతో.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటంతోపాటు ఆ పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు
సమాచారం. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడలని ప్రతిపాదించారు.మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట.. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేయటం ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ ప్రతిపాదించారు. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించినట్లు తెలుస్తోంది. పవన్ చేసిన ప్రతిపాదనలకు సానుకులంగా స్పందించిన చంద్రబాబు..త్వరలోనే మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. దాదాపు 2గంటల పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్వీపీఈఐలో నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీకుమార్ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నెల ఒకటిన రాసిన ఈ లేఖ ప్రతి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, ఆరుగురు సబ్ ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ మొత్తం 69 మంది భద్రతను హైకోర్టు ఆదేశాల మేరకు తనకు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున..జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని వివరించారు. అధికార పార్టీ సానుభూతిపరులు హాని తలపెట్టి, తన ప్రచారానికి ఆటంకం కలిగించే అవకాశం ఉందనిలేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కనీసం ఆరుగురు+ఆరుగురు లెక్కన అయినా..భద్రత కల్పించాలని కోరారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తగిన భద్రత కల్పించకపోతే..కోర్టు ధిక్కరణ కింద తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

మాచర్లలో వైసీపీ సామాజిక సాధికారయాత్రలో మహిళలు మందేసి చిందేశారు. ఓ పక్క సామాజిక సాధికార యాత్ర సభ జరుగుతుంటే చివరలో కొందరు మహిళలు మందు సీసాలతో డ్యాన్స్ చేశారు. మద్యం సీసాలు చేతిలో పట్టుకుని తాగుతూ డ్యాన్స్ చేస్తూ హల్‌చల్ చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్న సభలో ఇలా చేయడం విశేషం. ఈ సభ కోసం ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి, బస్సులను కార్యకర్తలు, ప్రజలను తరలించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం సొంతానికి వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటే కేంద్ర పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సు నిర్వహించారు. తాము ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిందని తేల్చిందన్నారు. అయినా నేటికీ వైసీపీ ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు సైతం సీఎం జగన్ తీరును వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


