చిట్టి న్యూస్

భక్తుల భద్రత.. సెక్యూరిటీకి ఊతకర్రలు ఇచ్చిన టీటీడీ

శ్రీవారి భక్తుల భద్రత విషయంలో టీటీడీ చర్యలు తీసుకుంది. చిన్నారులపై చిరుత పులుల దాడిల తర్వాత అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలర్టైంది. కాలిబాట మార్గంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఊతకర్రలను అందజేశారు. 250 మెట్లకు ఒక సెక్యూరిటీ సిబ్బంది ఉండగా ప్రతి ఒక్కరికి ఊతకర్రలను టిటిడి అందజేసింది. మొత్తం 70మంది సెక్యూరిటీ సిబ్బందికి ఊతకర్రలను అందజేశారు. అలాగే ఊతకర్రలతోనే భక్తులతో పాటు నడుచుకుంటూ వెళుతున్నారు సెక్యూరిటీ గార్డులు. భక్తులందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

వాజ్‌పేయికి రాష్ట్రపతి ముర్ము నివాళి

భారత రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదో వర్ధంతి కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. స్మారక స్థలం సదైవ్ అటల్ పార్క్ వద్ద వాజ్‌పేయికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నివాళులుర్పించారు. తొలుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రొటోకాల్‌ ప్రకారం స్పీకర్, రక్షణశాఖ మంది రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. 

విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ వాయిదా

విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ పిలుపునిచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. అనుమతులు లేవని, ఎవరైనా కార్యక్రమంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్‌లపై కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వంతో ఉద్యోగ జేఏసీ చర్చలు జరిపింది. జేఏసీ చేసుకున్న ఒప్పందాన్ని స్ట్రగుల్ కమిటీ వ్యతిరేకిస్తోంది. ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్‌ను దాఖలు చేయనుంది. 

Jangaon: దొంగతనం నెపంతో మైనర్ బాలికపై చిత్రహింసలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో దారుణం జరిగింది. దొంగతనం నెపంతో.. మైనర్ బాలికను చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న మధుకర్ రావు కుటుంబసభ్యులు.. ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలిక కళ్లలో కారం పోసి దారుణంగా చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలికను పంచాయితీ కార్యాలయం వద్ద కట్టేసి కళ్లలో కారం వేసి తీవ్రంగా కొట్టినట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. 

తిరుమల నడక మార్గాల్లో ఆపరేషన్ చిరుత

తిరుమల నడక మార్గాల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. చిరుత కదలికలను గుర్తించేందుకు అదనంగా మరో 300 కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. మొత్తం 400లకు పైగా కెమెరా ట్రాప్స్‌తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పట్టుబడ్డ చిరుత రక్తం, డీఎన్‌ఏ, సెలైవా పరీక్షా ఫలితాలు.. మరో మూడ్రోజుల్లో రానున్నాయి. అటు.. నడక మార్గాల్లో.. భక్తులు గుంపులు గుంపులుగా రావాలంటూ సూచిస్తున్నారు టీటీడీ అటవీ అధికారులు. ఇక త్వరలో భక్తుల ఆత్మరక్షణ కోసం.. ఊత కర్రలు ఇస్తామని వెల్లడించారు.  

Apple: హైదరాబాద్‌లో యాపిల్‌ ఇయర్‌ బడ్స్‌ తయారీ

మొబైల్‌ తయారీ దిగ్గజ సంస్ధ యాపిల్ హైదరాబాద్ వేదికగా తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ ఎయిర్‌పాడ్స్‌ను హైదరాబాద్‌లోని తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్‌లో తమ ప్లాంటు కోసం ఫాక్స్‌కాన్‌ సంస్థ 500 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులిచ్చింది. ఈ ప్లాంటు ద్వారా వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మనదేశంలో ఐఫోన్‌ తర్వాత యాపిల్‌ సంస్థ నుంచి రెండో ఉత్పత్తి ఎయిర్‌పాడ్స్‌ కావడం విశేషం. 

Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద.. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ముగ్గురు ప్రయాణికులు ఆటోలో ఇరుక్కుపోయారు. ఇందులో ఓ బాలుడు కూడా ఉన్నాడు. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Vikarabad: చీమలదరి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సర్పంచ్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో ఏమి వస్తుందన్న నాయకులకు బుద్ధి చెప్పే విధంగా తన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు ఆ గ్రామ సర్పంచ్. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం చీమలదరి గ్రామానికి చెందిన సర్పంచ్ నరసింహ రెడ్డి తన గ్రామంలో చేపట్టిన ప్రతి పని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆ గ్రామానికి వెళ్లి చూస్తే పల్లెటూర్లో ఉన్నామా పట్నంలో ఉన్నామా అనే విధంగా అండర్ డ్రైనేజ్ సిస్టం, సోలార్ పవర్ సిస్టం, పెద్ద పెద్ద సీసీ రోడ్లు, ప్రతి చిన్న గల్లీలో సైతం అందమైన సీసీ రోడ్లు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు జిల్లాలోని ఏ గ్రామంలో నిర్మించని విధంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని అన్ని అంగులతో నిర్మించారు.

ఈ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీ గా గుర్తించి సర్పంచ్ నరసింహారెడ్డికి అవార్డును సైతం అందించారు. అంతటితో ఆగని నరసింహారెడ్డి గ్రామంలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఏదైనా పని చేయాలనే ఉద్దేశంతో BSNL అధికారులను సంప్రదించి తమ గ్రామంలోని ప్రతి ఇంటికి అన్‌ లిమిటెడ్ వైఫై అందించే విధంగా కృషి చేశారు.

అదేవిధంగా BSNL, చీమలదరి గ్రామపంచాయతీ అనుబంధంగా ఒక టవర్ ని ఏర్పాటు చేశారు. BSNL ఫైబర్ కేబుల్ ద్వారా ప్రతి ఇంటికి టీవీ కనెక్షన్, ఒక టెలిఫోన్ కనెక్షన్, BSNL నిర్ణయించిన రేటు కంటే సగం ధరకు మాత్రమే ఈ సదుపాయాలన్నీ సమకూరుస్తున్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పది కిలోమీటర్ల లోపు గ్రామాలకు ఈ సదుపాయాలన్నీ అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు. వాటితో వచ్చే డబ్బులను గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టనున్నారు.


Krishna District: ఇంటివెనుక నాటుసారా కాస్తున్న వైసీపీ నేత

ఎక్కడో కృష్ణానది లంకల్లో గుట్టుగా సాగే నాటు సారా తయారీని.. ఓ వైసీపీ నేత ఏకంగా ఊరి మధ్యకు తెచ్చాడు. అడ్డుకునే వారు లేరన్న ధైర్యంతో తన ఇంటి వెనుకే సారా బట్టీ పెట్టాడు. నాటు సారా కాస్తూ చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తున్నాడు. అవనిగడ్డ మండలం మోదుమూడిలో వైసీపీ నేత బచ్చు హనుమాన్ ఏకంగా ఊరిలోనే నాటుసారా తయారు చేస్తూ పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో... SEB సీఐ నూకరాజు తమ సిబ్బందితో దాడులు చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 

కాచిగూడ తిలక్‌నగర్‌లో  మైనర్‌ బాలిక అదృశ్యం

హైదరాబాద్‌ కాచిగూడ తిలక్‌నగర్‌లో....రమ్య అనే మైనర్‌ బాలిక అదృశ్యమైంది. రెండురోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక... తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిలక్‌నగర్‌ ఫివర్‌ఆస్పతి మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్‌ లభ్యమైంది.ఇక బాలిక తండ్రి తిలక్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రమ్య అంబర్‌పేట పోలీస్‌లైన్లోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు. 

పరోక్షంగా ప్రధాని మోదీపై ఖర్గే విమర్శలు

ఢిల్లీ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.. దేశ అభివృద్ధిలో గత ప్రధానుల భాగస్వామ్యాన్ని చెరిపివేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. తమ హయం నుంచే ప్రగతి సాగుతోందన్నట్టుగా కొందరు చెప్పుకుంటున్నారని పరోక్షంగా మోదీపై ఖర్గే విమర్శలు చేశారు. దేశ నవ నిర్మాణం కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు మాజీ ప్రధానులంతా ఎంతో కృషి చేశారని ఖర్గే తెలిపారు. అయితే స్వాతంత్ర దినోత్సవం నాడే ప్రధానిని విమర్శించడం చరిత్రలో ఇదే తొలిసారి. 

మంచు మోహన్‌ బాబు యూనిర్శిటిలో పంద్రాగస్టు వేడుకలు

మంచు మోహన్‌ బాబు యూనివర్శిటిలో.. స్వాతంత్ర్యం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్వగ్రామం మోదుగులపాళం నుంచి వచ్చారు గ్రామస్థులు. వారితో కలిసి మొక్కలు నాటారు మోహన్‌బాబు, విష్ణు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్‌బాబు... స్వగ్రామాన్ని, తల్లిదండ్రుల్ని గౌరవించాలన్నారు. తనకు కులాలంటే అసహ్యమన్న ఆయన.... ఒకప్పుడు గ్రామంలో అంతా కలిసిమెలిసి ఉండేవాళ్లమన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు 

నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌.. నాలుగేళ్ల చిన్నారి మృతి

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో విషాదం చోటు చేసుకుంది. తోటల్లో అడవి పందులు వేటాడేందుకు లోడ్‌ చేసి ఉన్న నాటు తుపాకీ మిస్‌ ఫైర్ అయింది. దీంతో నాలుగేళ్ల ధన్యశ్రీ అనే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులో తీసుకున్నారు. 

భారత పౌరసత్వాన్ని పొందిన అక్షయ్ కుమార్

బాలీవుడ్​స్టార్​ హీరో అక్షయ్​కుమార్‌కు కేంద్రం ​భారత పౌరసత్వాన్ని అందించింది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్​వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ ఓ పోస్ట్​పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌లో కత్తులతో యువకుల వీరంగం

ఆదిలాబాద్‌లోకత్తులతో యువకుల వీరంగం చేశారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశారు.మద్యం మత్తులో స్థానికులపై కత్తులతో దాడి దిగారు. యువకుల దాడిలో పలువురికి గాయాలు కాగా.. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కత్తులతో దాడి చేసిన యువకులను పట్టుకొని పొలీసులకు అప్పగించారు స్థానికులు. అయితే నడిరోడ్డుపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదంటూ..ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు.

సైబరాబాద్ కమిషనరేట్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సైబరాబాద్ కమిషనరేట్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బంది వందన స్వీకారం స్వీకరించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనులు చేసిన ప్రాణ త్యాగంతోనే మనం స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నామని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి కమిషనర్ ప్రతిభ పురస్కారాలు అందించారు.

అనకాపల్లి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల అవస్థలు

అనకాపల్లి జిల్లా చోడవరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల తీవ్ర అవస్థలకు గురయ్యారు. కొంతమంది స్థానిక నాయకుల మెప్పు పొందేందుకు చోడవరం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు మండుటెండలో అవస్థలకు గురి చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకు వేడుకలను ప్రారంభించలేదు. అత్యుత్సాహంతో విద్యార్ధులను మండుటెండలో నిలబెట్టారు. ఎండతాపం తట్టుకోలేక అవస్ధలు పడ్డారు. అంతకు ముందు జూనియర్ కాలేజీ వద్ద నుంచి స్ధానిక శివాలయం వరకు 600 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు- భట్టి

తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో రాష్ట్రం సాధించింది ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను చెపట్టిన పీపుల్స్ మార్చ్‌ పాదయాత్ర వల్లే రాష్ట్రంలో ఇళ్లు, పెన్షన్లు, దళిత బంధు ఇస్తున్నారని తెలిపారు. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను ఎత్తివేయడం జరిగిందని భట్టి విమర్శించారు.

ప్రజల కోసమే గద్దర్‌, నేను  పోరాటం చేశాం: చంద్రబాబు

అనేకసార్లు గద్దర్‌తో కలిసి పనిచేశానని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. కొందరు కావాలనే లేనిపోని అపోహలు సృష్టించారని అన్నారు.. గద్దర్‌ ప్రజలకోసం పోరాడని.. తాను కూడా ప్రజల కోసమే పోరాటం చేశామని అన్నారు.తన గురించి గద్దర్‌కు తెలుసని.. అలాగే గద్దర్‌ గురించి తనకు బాగా తెలుసని,తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని అన్నారు.గద్దర్‌ స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గద్దర్‌ ఆశయాలను కొనసాగించేలా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు చంద్రబాబు. 

తెలంగాణ తల్లి కేసీఆర్‌ చేతిలో బందీ అయింది - కిషన్‌ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసగించిన కిషన్‌ రెడ్డి... రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ సర్కారుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ తల్లి కేసీఆర్‌ చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణ భవిష్యత్‌ కేసీఆర్‌ డైనింగ్ టేబుల్‌పై నిర్ణయిస్తున్నారంటూ విమర్శించారు. 

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో పంద్రాగస్టు వేడుకలు

దేశంలో నెలకొన్న అవినీతి, యువతలో పెరుగుతున్న అలసత్వం, మాదక ద్రవ్యాల వినియోగంపై పోరాడాలని సినీనటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఎందరో మహానుభావులు, విప్లవకారులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని బాలకృష్ణ తెలిపారు. 

జెండా ఆవిష్కరించిన ఎంపీపీ చంద్రశేఖర్

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో అధికార పార్టీ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తనను అవమానించారంటూ జడ్పీటీసీ పద్మ జాతీయ జెండా స్థంభం వద్ద కింద కూర్చొని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అధికార పార్టీ జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ రూపలను ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారం జడ్పీటీసీ పద్మ జెండా ఎగురవేయాలి. ఎంపీపీ చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు. ఎంపీపీతో ఎలా ఆవిష్కరిస్తారంటూ జెండా దిమ్మె వద్ద నిరసన వ్యక్తం చేశారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అయ్యన్న పాత్రుడు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని తెలిపారు. మనం ఎంత మేర అభివృద్ధి చెందామో పాలకలు, మేధావులు ఆలోచన చేయాలన్నారు. రుషికొండను గుండు కొట్టిన ఘటనలో ప్రభుత్వ పెద్దలు సమర్దించుకోవడం సిగ్గుచేటు అన్నారు. హూదూద్ తుఫానులో విశాఖను కాపాడింది రుషికొండ అన్న విషయాన్ని మర్చిపోవద్దని అయ్యన్న తెలిపారు. 

జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో స్వాతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి హరీష్‌ రావు... మువెన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు హరీష్. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ప్రసగించిన హరీష్..... సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు ...తెలంగాణ వ్యవసాయాన్ని చిన్న చూపు చూశారన్నారు. రైతు బాధలను అవహేళను చేశారన్న ఆయన... వ్యవసాయం దండగ అంటూ చిత్రీకరించారన్నారు. ఆంధ్ర పాలకుల హయంలో తెలంగాణ పల్లెలు కన్నీళ్లు పెట్టాయన్న హరీష్... ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో ఇవే పల్లెలు కళకళలాడుతున్నాయన్నారు. 

గద్దర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

ఇటీవల కన్నుమూసిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అల్వాల్‌లోని భూదేవి నగర్‌లో ఉన్న గద్దర్‌ నివాసానికి వెళ్లిన ఆయన.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన గద్దర్ మృతితో..ప్రశ్నించే స్వరం మూగబోయిందని చంద్రబాబు ఇటీవలే ట్వీట్ చేశారు. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువ లేనిదని అన్నారు.

ఇవాళ విశాఖకు టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తారు. విజన్ - 2047 డాక్యుమెంట్‌ను ఉడా పార్క్‌లోని ఎంజీఎం మైదానంలో ఆవిష్కరించనున్నారు. ఇండియా, ఇండియన్, తెలుగు- విజన్ 2047 అని ఈ డాక్యుమెంట్‌కు నామకరణం చేశారు. భారతదేశం గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగేందుకు అనుసరించాల్సిన ఐదు వ్యూహాలతో గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ సంస్థ.. ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది. దీనిపై పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు చంద్రబాబు.

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలు

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలకుఅంతా సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల్లో సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. దేశ విభజన తర్వాత జరిగిన హింసాకాండపై ఫోటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు జోనల్ మేనేజర్ శ్యాంసుందర్.. వారి త్యాగాలను భారతీయులంతా స్మరించుకోవాలని చెప్పారు.. 

గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం

ప్రజా వేదిక కూల్చివేసిన సీఎం జగన్‌ స్ఫూర్తితో గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులను ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శించారు. అధికారులు మానవత్వం లేకుండా ఇష్టానుసారం ఇళ్లను కూల్చివేశారని ధూళిపాళ్ల మండిపడ్డారు. రోడ్డు విస్తరణను వైసీపీ కార్యక్రమంలా మార్చివేశారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసానికి పాల్పడిన వారందరినీ టీడీపీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతామని ధూళిపాళ్ల హెచ్చరించారు. 

తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ సమావేశం

తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ సమావేశం జరిగింది. అడిషనల్‌ PCCFO శాంతిప్రియ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జంతుల సమాచారం కోసం కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. నడకదారికి 100మీటర్ల దూరంలో కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేశామని..15ఏళ్లలోపు పిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారి లక్షితను చంపి తిన్న చిరుత.. ఇవాళ పట్టుబడిన చిరుత ఒక్కటేనా కాదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. ఒక వేళ పట్టుబడిన చిరుతే పాపను చంపి ఉంటే జూలోనే ఉంచుతామని తెలిపారు శాంతి ప్రియ. 

Tirupathi : మెట్ల మార్గంలో మరో ఐదు చిరుతల సంచారం

తిరుమల కాలినడక మెట్ల మార్గంలోని పరిసరాల్లో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని వెల్లడించారు. ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఓ చిరుత చిక్కింది. ఈక్రమంలో చిరుత స్వల్పంగా గాయపడటంతో.. ఎస్వీ జూ పార్కులో చికిత్స అందిస్తున్నారు.  

Himachal Pradesh: ఘోర విషాదం; విరిగిపడ్డ కొండచరియలు, 15 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శిమ్లా లోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతిచెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయంలో 50 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.   

బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్‌ . ప్రగతి భవన్‌ జరిగిన కార్యక్రమంలో బీజేపీ వంద అబద్దాలు పేరుతో బుక్‌లెట్‌, సీడీ విడుదల చేశారు.ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.9 ఏళ్లలో మోదీ సర్కార్‌ వంద లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు.2023లో జీడీపీలో కేంద్ర ప్రభుత్వం అప్పు 58 శాతమన్న కేటీఆర్‌..కేంద్రం కంటే తెలంగాణ ఎంతో ఉత్తమంగా ఆర్ధిక సమతూల్యం పాటిస్తుందని అన్నారు. 

Nellore:  పాతపాడులో వైసీపీ శ్రేణుల దాష్టీకం

నెల్లూరులో టీడీపీపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. చేజర్ల మండలం పాతపాడులో టీడీపీ వార్డు మెంబర్‌ అభ్యర్థి బైక్‌ తగలబెట్టారు. నిన్న టీడీపీ తరపున నామినేషన్ వేసిన బాబాసాహెబ్‌పై దాడి చేశారు. నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవాలని టీడీపీ అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోకపోవడంతో భౌతిక దాడులకు దిగారు. ఇటీవల ఐదో వార్డు మెంబర్ మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ఆరోపించారు. 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ముట్టడి భగ్నం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. సమస్యలపై ధర్నా చేస్తామంటే అరెస్ట్ ఏంటని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. విడతల వారిగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు తరలిస్తున్నారు. 

లారీ ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన కారు

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామం దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో కారును వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ప్రమాదానికి గురైంది నల్గొండ జిల్లా గుండ్లపల్లి వాసులుగా గుర్తించారు. 

3 నెలల పాటు జూ క్వారంటైన్లో  చిరుత

తిరుమల అడవిలో..చిక్కిన ఆడ చిరుతను జూకు తరలించారు. 3 నెలల పాటు చిరుతను జూ క్యారంటైన్లో ఉంచుతామన్నారు సీసీఎఫ్ నాగేశ్వరరావు. చిరుత రక్త నమూనాలు సేకరించి బాలిక రక్తం శాంపుల్స్ తో మ్యాచ్ చేస్తామన్నారు. చిరుత‌ సెలైవా పరీక్షలు కూడా చేస్తామన్నారు. భక్తుల్లో భయాందోళలను తగ్గించేందుకు క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. మళ్లీ అడవుల్లో విడిచిపెడితే భక్తులపై దాడిచేసే ప్రమాదం ఉందని అందుకే.. జూకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. బాలికపై దాడి చేసింది ఈ చిరుతే‌నా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ పరీక్షలంటున్నారు సీసీఎఫ్‌ నాగేశ్వరరావు.