- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కింది. అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాడు స్థానిక ఎమ్మెల్యే భీరం హర్షవర్థన్ రెడ్డి. జూపల్లి కృష్ణారావు ఏపార్టీలోకి వెళ్లినా ఎలాంటి ప్రభావం ఉండదని, అభివృద్ధి చూసి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారంటున్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. అమరవీరుల దినోత్సవాన్ని ఖమ్మంలో నిర్వహించారు. మయూరి సెంటర్‌లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఉన్న ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ ముందుకు వెళుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డంపింగ్ యార్డు వివాదాస్పదంగా మారింది. డంపింగ్ యార్డుతో స్థానికులు రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు పక్కనే కాలేజీలు ఉండటంతో విద్యార్థులు సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగతో కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. మున్సిపల్ పరిధిలోని 32 వార్డుల చెత్తను తమ కాలనీల పమీపంలోనే వేస్తున్నారని మండిపడుతున్నారు.

టిడిపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ జోన్1 పరిధిలో, టీడీపీ చైతన్య రథయాత్ర మొదలైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి భవిష్యత్తుకు గ్యారంటీ అనే నినాదంతో యాత్రను ప్రారంభించారు. యాత్రలో అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ప్రజలను మోసం చేసారని, రాబోయేది తెలుగు దేశం ప్రభుత్వమే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

బాపట్ల జిల్లా చీరాల మండలంలో పెను ప్రమాదం తప్పింది. ఈపూరుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది. అదే ట్రాక్‌పై వెళ్తన్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్‌ను స్థానికుడు హేమసుందర్ అలర్ట్ చేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మత్తులు పూర్తి చేశారు.

బీఆర్‌ఎస్-బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ అమరులకు నివాళి అర్పించేందుకు వచ్చిన బీఆర్ఎస్.. బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్పొరేటర్ల వద్ద ఉన్న ప్లకార్డులను బీఆర్‌ఎస్ నేతలు చించేశారు. దీనికి నిరసనగా గన్ పార్క్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు బైఠాయించారు. పోటాపోటీ నినాదాలతో గన్ పార్క్ దద్దరిల్లింది.

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రాతిబావ వంక గ్రామంలో భూకబ్జా చేశారు. సర్వేనంబర్ 61లో ఉన్న స్మశాన వాటిక భూమిని వైసీపీ ఎంపీటీసీతో పాటు పోలీసులు కుమ్మక్కై స్థలాన్ని కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సర్వేయర్... సర్వే చేస్తుండగా వైసీపీనేతలు, పోలీసులు కలిసి సర్వే రాళ్లను తొలగించారు. నేతలతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 70 ఏళ్ల నుంచి ఇది స్మశాన వాటిగా ఉందని, వైసీపీ నేతలు కబ్జా చేయకుండా అరికట్టాంటూ ఎమ్మార్వోకు వినతపత్రం ఇచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా బిల్లులు రాక డైట్ కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. DME, వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న డైట్ కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారు. అప్పులు తెచ్చి కొందరు బంగారం కుదవపెట్టి మరికొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫుడ్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. ఒక్కొక్కరికి 20 నుంచి 40 లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. బిల్లుల కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ఎండలతో అనారోగ్యానికి గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. కేతపల్లి సమీపంలో ఆయన బస చేసిన ప్రాంతానికి వెళ్లి... భట్టి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు పొంగులేటి. నల్గొండ జిల్లా పరిధిలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాత్ర సందర్భంగా రెండ్రోజుల క్రితం అధిక ఎండలతో అనారోగ్యానికి గురయ్యారు భట్టి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు.

విశాఖలో పంచగ్రామల సమస్యను జగన్ సర్కారు ఇప్పటికీ పరిష్కరించలేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పరిష్కరిస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఈ సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు పంచగ్రామాల ప్రజలు. కనీసం ఇంటి మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం లేకుండా దేవాదాయశాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు సైతం రద్దు చేశారంటున్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు మరోసారి రానున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నగరంలో జరుగుతుండగా ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ముర్ము హాజరవ్వనున్నారు. జూలై4న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలో పాల్గొనేందుకు వస్తున్న ద్రౌపతి ముర్ము. ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి ఉత్సవాలు జరగనుకున్నాయి. అయితే.. ఈ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగనున్నాయి .సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. అల్లూరి జయంతి ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించనున్నది.

అబ్కారీ శాఖ కళ్లుగప్పేందుకు గంజాయి ముఠాలు వ్యూహాలు మారుస్తున్నాయి. దీంతో అభ్కారీ అధికారులు సైతం వీరి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా అభ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూలీల అవతారం ఎత్తారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన అధికారులు వ్యవసాయ కూలీల వేషం వేసి గంజాయి ముఠాను పట్టుకున్నారు. తోటి కూలీలులుగా భావించిన కొందరు సమాచారం లీక్ చేయడంతో గంజాయి ముఠాను పట్టుకున్నారు.

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ టౌన్‌షిప్‌కు కేసీఆర్ నగర్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆరుగురు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం పూర్తైంది. ఈ టౌన్‌షిప్‌లో మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్ కి 2 లిఫ్ట్ ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్ ల ఏర్పాటు చేశారు.

పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ,చీఫ్ ఇంజనీర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. పెద్దఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నా కూడా సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది పాలేటి మహేష్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణ వనరుల్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కాలరాశారని ఆరోపించారు. తెలంగాణ పేరే లేకుండా కేసీఆర్ కుట్ర చేశారని మండిపడ్డారు.

ఏపీ ప్రజలకు ఆంధ్రా అనే భావన ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 'తెలంగాణలో ఆంధ్రా కొడుకులు దోచేశారని మనల్ని తిట్టి, తన్ని తరిమేశారు. వాళ్ల నాయకులు మనల్ని తిట్టారు. మన ఎంపీలు, ఎమ్మెల్యేల తప్పులకు మనం మాట పడ్డాం. మనం పౌరుషం తెచ్చుకుని ఆంధ్రులం అనే భావన రాకపోతే మనం నాశనం అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కులాలను గౌరవించుకోవడంతో పాటు ఆంధ్రా అనే భావన ఉండాలి' అని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు సిద్దం చేసుకున్నా రైతులు ఖరీప్ సాగుకు సన్నద్దమయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పనులు ముందుకు సాగట్లేదు. సలహాలు, సూచనలు అందించాల్సిన వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

మంగళగిరి హైవేపై కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంకెంత మంది దళితుల ప్రాణాలు తీస్తావు.. దళిత ద్రోహి జగన్ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఎంఎస్ రాజుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. దుగ్గిరాల పీఎస్‌కు తరలించారు.

ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చకచకా సాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో చేరికలు ఊపందుకున్నాయి. కీలక నేతల ఇళ్లకు రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లడం.. వారితో ఏకాంతంగా చర్చించడం జరుగుతోంది. కోమటిరెడ్డి ఇంటితో మొదలైన రేవంత్ సమావేశాలు.. జూపల్లి, పొంగులేటి ఇంట్లో కూడా కొనసాగాయి. పొంగులేటి నివాసంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు కొనసాగుతున్నాయి. అతి త్వరలో కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈనెల 25న రాహుల్‌గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిన్న నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద అస్వస్థతకు గురైన ఆయన డాక్టర్ల సూచనలతో పాదయాత్ర శిబిరంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నీరసం,జర్వంతో బాధపడుతున్న భట్టికి.. మరోసారి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శిబిరంలో రెస్ట్ తీసుకుంటున్న భట్టికి సపర్యలు చేశారు ఆయన సతీమణి. ప్రస్తుతం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పూజలు పునస్కారాలతో కళకళలాడుతున్నాయన్నారు. అర్చకులకు సైతం ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు జగదీష్ రెడ్డి. యాదాద్రి దేవాలయం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా నల్గొండ శివారులోని పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణలో మెడికల్ కాలేజీలు టార్గెట్‌గా ఈడీ పంజా విసిరింది. ప్రతిమ, అనురాగ్, ఎస్‌వీఎస్, కామినేని సహా పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.మెడికల్ కాలేజీలు,వాటి కార్యాలయాలు యాజమాన్యాల ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కామినేని గ్రూప్స్ యజమానులు శశిధర్, వసుంధర సూర్యనారాయణ ఇళ్లలో సోదాలు చేపట్టారు.ప్రతిమ గ్రూప్స్ ఫిల్మ్ నగర్ కార్పొరేట్ ఆఫీసులోనూ ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

తెలంగాణలో ప్రజాపాలన సాగడం లేదన్నారు ప్రజా గాయకుడు గద్దర్. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసం ప్రజాపార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. అయితే ఎన్నికల్లో తాను ఎవరితో కలిసి వెళ్లాలో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ స్థాపన కోసం ఈసీని కలిసిన గద్దర్,కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ పుచ్చిపోయిందన్నారు.

కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరనుంది. మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యావేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇది. కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.

సిద్ధిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిధిగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు ఓ గంట యోగా, ప్రాణామాయం చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందంచన్నారు మంత్రి హరీష్. యోగ నిత్య జీవితంలో భాగమైందని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు హరీష్. రోగాల బారిన పడినప్పుడు కాకుండా ప్రతిరోజూ చేస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందన్నారు

తెలంగాణ యూనివర్శిటీలో ఏసీపీ విజిలెన్స్ వరుస దాడులు కలకలం రేపుతున్నాయి.ఈ దాడుల నేపథ్యంలో వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ డేటా స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా కూపీ లాగుతున్న ఏసీబీ అధికారులు మిగిలిన వారిపైనా దృష్టి పెట్టారు.

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ప్రమాదవశాత్తు కూలింది.సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న ఫైఓవర్ పిల్లర్ టూ పిల్లర్ స్లాబ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న GHMC,DRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఇంజినీర్ల బృందం..ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలించింది.


మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో సోదరి స్నేహితురాలిపై కన్నేసిన కీచకుడు ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు రమేష్ అనే యువకుడు.బాలిక తల్లిని చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు ఆమె ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో రమేష్‌పై ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు

జ్ఞానానంద ఆశ్రమ భూములు కొట్టేసే కుట్ర జరుగుతుందన్నారు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి తురగ శ్రీరాం.గతంలో వైసీపీకి చెందిన కొందరు ఈ ప్రయత్నాలు చేశారన్నారు. దీనిపై అనేకసార్లు స్వామీజి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా స్వామీజి అత్యాచారం చేశాడని ఆరోపిస్తు కేసు నమోదు చేశారన్నారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు,స్వామీజి తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఆశ్రమ భూముల జోలికి వస్తే మాత్రం ఊరుకోమన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలంటున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. సంఘ వ్యతిరేక శక్తులకు విశాఖ అడ్డాగా మారిందన్నారు. అమిత్ షా వచ్చి వెళ్లిన మూడ్రోజులకే విశాఖలో వైసీపీ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎంపీ ఇంట్లో మూడ్రోజులు తిష్టవేసిన కిడ్నాపర్లు గంజాయి, డ్రగ్స్ వాడారని తెలిపారు. కిడ్నాప్ ఘటనను కప్పిపుచ్చేందుకు వైసీపీ యత్నిస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విశాఖ కిడ్నాప్ ఘటనపై దర్యాప్తు చేయించాలని లేఖలో అమిత్ షాను నారాయణ కోరారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం వెండిపూలతో విజయమాల తయారు చేయించాడు అమలాపురానికి చెందిన దొరబాబు అనే వీరాభిమాని. 511 వెండిపూలతో విజయమాల తయారు చేయించిన దొరబాబు స్థానిక పొలేరమ్మ ఆమ్మవారి ఆలయంలో పూజలు చేయించారు. పవన్‌కు అమ్మవారి అనుగ్రహం కలగాలని మొక్కుకున్నారు. ఈ నెల 22న అమలాపురంలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో పవన్ మెడలో వెండి విజయమాల వేయనున్నారు దొరబాబు.

బాలికను రెండేళ్లుగా అత్యాచారం చేసిన పూర్ణానంద స్వామిజీని పోలీసులు విచారిస్తున్నారు. జ్ఞాననంద ఆశ్రమానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. మరోవైపు పూర్ణనంద స్వామిజీ వివాదాస్పద స్వామీ అంటున్నారు వెంకోజీ పాలెం గ్రామస్థులు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని గతంలోనూ ఓ రేప్ కేసు నమోదైనట్లు తెలిపారు. భూకబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేయడం స్వామీజీకి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా స్వామిజీ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటున్నారు గ్రామస్థులు.

ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని ఏపీ ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్నారు. ఒకే ఇంటి నంబర్‌పై ఎక్కువ ఓట్లు నమోదైన వాటిపై దృష్టి సారించామన్నారు. కొన్ని చోట్ల ఎక్కువ తేడా కనిపిస్తోందన్నారు. విజయవాడ, గుంటూరులో ఇలాంటివి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి తప్పులు జరిగాయన్నారు. ఆరు చోట్ల 500పైగా ఓట్లు ఒకే ఇంటి నంబర్‌పై నమోదనట్లు తెలిపారు. ఇక 21వందకు పైగా ఇంటి నంబర్లపై 50 కంటే ఎక్కువ మంది ఓట్లు నమోదయినట్లు తెలిపారు.

కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్ బ్యాంకు కేసులో ఆదేశాలు పాటించనందుకు ఈ నోటీసులు పంపించింది. పాలన వ్యవహారాలకు అధికారిని నియమించాలని గతంలో ఆర్‌బీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు కాలేదని మహేశ్ బ్యాంకు వాటాదారులు కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు స్పందించిన న్యాయస్థానం కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై జులై 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


