- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ట్విట్టర్ లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు "త్వరలో మీ హ్యాండిల్ నుంచి ట్విట్టర్ లో ఎవరికైనా వాయిస్, వీడియో చాట్ చేయవచ్చు, కాబట్టి మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తులతో మాట్లాడవచ్చు." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ వినియోగదారుల కోసం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ లో ఆడియో, వీడియో కాల్‌లను అలాగే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను అనుమతించనున్నట్లు మస్క్ వెల్లడించారు.

వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంత గ్రామంలో రైతులు ఆందోళనబాట పట్టారు. సీఎం కేసీఆర్ చెప్పినా తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. తరుగు పేరుతో మిల్లర్లు దోచుకు తింటున్నారంటూ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. రైతుల ధర్నాకు అఖిలపక్షం నేతలు కూడా మద్దతు తెలిపారు. రైతుల నిరసనలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పి ధర్నా కార్యక్రమాన్ని విరంపజేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజసమంద్ జిల్లా నాథ్‌ద్వారాలో 5 వేల 5 వందల కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శిలాఫలకం వేశారు. రాజస్థాన్-ఉదయ్‌పూర్ రెండు లేన్ల రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీశ్రీనాథ్‌జీ మందిరానికి వచ్చారు. దేవుడి దర్శనం చేసుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరంలో పూజారులతో కలిసి కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు చర్చించారు. శ్రీనాథ్ జీ మందిరానికి వచ్చే సమయంలో మోదీ వాహనంపై ప్రజలు పూలవర్షం కురిపించారు. భారీగా తరలివచ్చిన ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను పరామర్శించి.. వారికి భరోసా ఇవ్వనున్నారు. పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తపేట మండలంలోని రైతులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎంతమేర పంటనష్టం జరిగిందనే వివరాలు తెలుసుకోనున్నారు. ఆ తరవాత రెండోరోజు పవన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన పలు నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది.

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం, తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. సాయంత్రానికి ఉత్తర వాయువ్య దిశగా కదిలి, తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించారు. మే 14న అగ్నేయ బంగ్లాదేశ్ మరియు, ఉత్తర మయన్మార్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో ఎండల తీవ్రతతో పాటు, వడగాల్పులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకూ నమోదవుతాయంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద.

ఓ విమానయాన సంస్థలో పనిచేసే మహిళను మోసం చేసి ఆమె నగలను, ధనాన్ని, డెబిట్ కార్డులను ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. బెంగళూరుకు చెందిన బాధితురాలు వివాహం కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో తన ప్రొఫైల్ ను ఉంచింది. అందులోనే ఢిల్లీకి చెందిన అన్షుల్ జైన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మూడు రోజుల క్రితం అన్షుల్ తన కుటుంబానికి పరిచయం చేస్తానని ఆమెను ఢిల్లీకి పిలిచాడు. తల్లిదండ్రుల ముందు గ్రాండ్ గా కనిపించేందుకు నగలను తీసుకురావాలని చెప్పాడు. ఇదే విధంగా కొన్ని నగలు, నగదుతో ఢిల్లీ వెళ్లిన బాధితురాలిని ఎయర్ పోర్ట్ లో రీసీవ్ చేసుకున్న అన్షుల్ మార్గం మధ్యలో కారులో టైరులో ఏదో లోపం ఉందని, దిగి చూడాల్సిందిగా ఆమెకు సూచించాడు. ఆ ప్రకారమే కారు దిగిన బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోడు. దీంతో తాను మోసపోయానని నిర్ధారించుకున్న ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జగనన్న విదేశీ విద్య పథకానికి వైసీపీ ప్రభుత్వం కత్తెరేసింది. ఇప్పటికే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ పథకానికి దూరమయ్యారు. ఇప్పుడు వీరి సంఖ్య మరింత తగ్గిపోయేలా మార్గదర్శకాల్లో సవరణలు చేశారు. పథకం ఇస్తున్నట్లు చూపిస్తూనే.. పేదలకు పూర్తి స్థాయిలో అందకుండా నిబంధనల్లో మార్పులు తెచ్చింది. గతేడాది క్యూఎస్ ర్యాకింగ్‌లో టాప్ 200లో ఉన్న యూనివర్శిటిల్లో సీట్లు పొందిన వారికి సాయాన్ని అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సబ్జెక్టులవారీగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న వాటికే సాయం ఇస్తామంటూ సవరణ చేసింది.ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వాటిని గోప్యంగా ఉంచింది.

తిరుపతిలో గంగమ్మ జాతర సందడి మిన్నంటింది. చాటింపుతో ప్రారంభమైన ఈ జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. జాతర నేపథ్యంలో గ్రామస్థులు ఊరును విడిచి వెళ్లరాదని చాటింపు వేశారు. బైరాగి వేషంలో భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు. వారం రోజుల పాటు రోజుకో వేషధారణలో భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆడవారు మగవారి వేషంలో.. మగవారు ఆడవారి వేషంలో ఆలయానికి చేరుకుంటున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలిగా గంగమ్మ తల్లి ప్రసిద్ధి. ఈ జాతరను రాష్ట్ర పండుగగా మొదటిసారి ప్రభుత్వం ప్రకటించింది.

ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా కావలి పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, అధికారులు హడావుడి చేస్తున్నారు. కావలిలో హెలిప్యాడ్‌కు దూరంగా ఉన్న పచ్చని చెట్లను నరికి.. ఎప్పటికప్పుడు తరలించేస్తున్నారు. 25 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. విద్యుత్ స్తంభాలు కూడా తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరుపై కావలి అంబేద్కర్ నగర్ దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతో మంది హెలికాఫ్టర్లలో వచ్చారని, అప్పుడు అడ్డంలేని చెట్లు, విద్యుత్ స్తంభాలు ఇప్పుడెందుకు అడ్డమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.

జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిట్‌ఫండ్ కేసులో ఏపీ సీఐడీ వీరిద్దరినీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ తరపున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు. చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. డిపాజిట్ దారుల ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

వాంఖడే స్టేడియంలో ముంబై బ్యాట్టర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిన సూర్య.. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. దాంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. ఈ విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. బెంగళూరును చిత్తు చేసిన రోహిత్ సేన.. ఐపీఎల్ పోరులో ప్లేఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంది.

ఏపీ దివాలా అంచుల్లో ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణులు జి.వి.రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏ రాష్ట్రమూ ఇలా అప్పు చేయలేదని.. జగన్ సర్కారు రుణాలతో రోజులు నెట్టుకు వస్తోందన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్న జి.వి.రావు.. ఏపీ అప్పులపై చర్చ జరగాలని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ వస్తే మహాప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలు అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించడం, పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించే పనులు చేస్తుంటే.. ఏపీ మాత్రం రోజు వారీ ఖర్చుల కోసమే అప్పులు చేస్తోందన్నారు.

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మే 10 నుంచి 14వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 137 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో 104, ఏపీలో 33, మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3. 20 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచే అత్యధికంగా లక్షా 71వేల, 706 మంది పరీక్షలు రాయనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 10, 11 తేదీల్లో మెడిసిన్, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమలు..ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయల్దేరారు. ఇవాళ ఉదయం లండన్ బయల్దేరిన కేటీఆర్.. 13వ తేదీ వరకు తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు.. వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్న కేటీఆర్.. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు.

కోడుమూరు: యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 94వరోజు (మంగళవారం) కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా కోడుమూరు ప్రజలు యువనేతకు ఘనస్వాగతం పలికారు.కోడుమూరు నియోజకవర్గం పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర గార్గేయపురం శివారు విడిది కేంద్రానికి చేరుకుంది.

కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కర్నాటకలో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ హనుమాన్ చాలీసా పఠనంపై . తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి నిరసనగా బెంగళూరులో బీజేపీ నేతలు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు.. దీంతో ఎన్నికల సంఘం దీనిపై నిషేధం విధించింది. 144 సెక్షన్ అమలులో ఉన్నందున వీహెచ్‌పీ సభ్యులు హనుమాన్ చాలీసా పఠించకుండా ఈసీ నిలుపుదల చేసింది. వీహెచ్‌పీ సభ్యులు తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు.. గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కు అయిన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయిన లేదన్నారు.. ఎంత సేపూ రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయితీ కార్యదర్శుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు దగ్గర ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ సమయంలో ఇమ్రాన్ లాయర్లు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దాదాపు వంద కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ ను కొన్ని రోజులగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అరెస్ట్‌పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను అంతం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల మమత చేసిన ప్రకటనలలో.. 'ది కాశ్మీర్ ఫైల్స్' , 'ది కేరళ స్టోరీ' సినిమాలను సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా తీశారని ఆరోపించారు. ఇందుకుగాను వివేక్ ఆమెకు నోటీసులు పంపినట్లు తెలిపారు. “నేను @AbhishekOfficl, పల్లవి జోషి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు లీగల్ నోటీసు పంపాము, మా మర్యాదకు భంగం కలిగించే విధంగా ఆమె తప్పుడు ఆరోపణలు చేశారు. అవి మా ప్రతిష్ఠకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి." అని వివేక్ ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇండోర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి పడిపోయింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించింది.

'ఆదిపురుష్' ట్రైలర్ విడుదల అయింది. ఆంజనేయుడి వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ లో ఈసారి విజువల్ ఎఫెక్ట్స్, క్యారక్టరైజేషన్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు తెలుస్తోంది. ఆంజనేయుడి శక్తి యుక్తులు, లంకా ప్రవేశం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రభాస్ లుక్ తో పాటు ఆహార్యం చక్కగా కుదిరింది. సీతాదేవిగా క్రితి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ తమదైన పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారనే చెప్పాలి. ఈ సినిమా జూన్ 16న థియోటర్లలో విడుదల కానుంది.

జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై స్వయంగా ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి పోలీసు కేసు నమోదు చేశారు. తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేర్యాల చౌరస్తాలో చేరువుని ఆనుకుని తనకు ఉన్న 1 ఎకరం 20 గుంటల భూమిని కాజేసేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సెక్షన్ 406,420,463,464,468,471 కింద కేసు నమోదు చేశారు. గతంలో ఇదే భూమి కబ్జా విషయంలో యాదగిరి రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న వారిని పట్టుకోవడానికి దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్, అనంత్‌నాగ్, కుప్వారా, పూంచ్, రాజౌరి, కిష్త్వార్ జిల్లాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న POKలోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

థాయ్‌లాండ్ ఘటన తర్వాత చికోటి ప్రవీణ్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించారని చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో ముగ్గురికి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రవీణ్ మే12న థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. వచ్చేవారంఈడీ ముందు హాజరైయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ కు ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో తుఫాన్ ప్రారంభమైంది. దీని వల్ల రాజస్థాన్ నుంచి వేడిగాలులు దక్షిణాది వైపునకు వీయడం మొదలయ్యాయి. దీని వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 11 నుంచి వేడిగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకుందన్నారు. ఆంధ్రా, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని సూచించారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. ఇది ప్రస్తుతం తమిళనాడుకు ఆనుకుని దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.. రానున్న 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది.. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా మారుతుందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.. ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిసే ప్రభావం ఉందని అధికారులు చెప్పారు. అయితే, తుఫాన్ కోస్తాకు దూరంగా ప్రయాణించే నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం లేదని అంటున్నారు.. రానున్న ఐదారు రోజుల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.

రైతులను జగన్ సర్కార్ తీవ్రంగా అవమానిస్తుందన్నారు టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. జగనన్నే మా దరిద్రమని రైతులంతా గొంతెత్తి చెపుతున్నారని,రైతు కన్నీరు పెడుతుంటే అభినవ నీరో చక్రవర్తి తాడేపల్లి ప్యాలెస్‌లో సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులను జగన్ సర్కార్ తీవ్రంగా అవమానిస్తుందని విమర్శించారు. చంద్రబాబుని, టీడీపీని నిందించడం తప్ప వ్యవసాయ మంత్రికి వేరే పని లేదన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులో BMTC బస్సులో ప్రయాణించారు. సామాన్యుడిలా ప్రజలతో కలసి పోయారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, గృహలక్ష్మి కింద 2వేలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ హామీలపై బస్సులోని ప్రయాణీకులతో మాట్లాడారు రాహుల్. మహిళల రవాణా సమస్యలు, వారి బడ్జెట్‌లను ప్రభావితం చేసే ధరలపైనా మాట్లాడారు.

ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాలూరులో ఉన్న సెటిలర్లపై మండిపడ్డారు. సెటిలర్ల వల్ల సాలూరు నష్టపోతుందన్నారు. రెడ్లు, చౌదరిలు ఇక్కడఎక్కువగా ఉన్నారని వారి వల్ల సాలూరు ఆభివృద్ధి చెందడం లేదన్నారు. వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.సెటిలర్ల వ్యవహారం సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. బబ్లూ అనే వ్యక్తి పేరును సంబోదిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజన్న దొర.

ఢిల్లి లిక్కర్ స్కామ్‌లో ఇద్దరు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలపై వచ్చిన అభియోగాల్లో మనీ లాండరింగ్ సంబంధించిన మెటీరియల్ ఆధారాలు లేవని ప్రత్యేక జడ్జి నాగపాల్ కామెంట్ చేశారు. ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని న్యాయమూర్తి తెలిపారు. రాజేష్ జోషి 30 కోట్ల మేర క్విక్ బ్యాక్ కు పాల్పడ్డాడన్న ఈడీ అభియోగాలు మోపింది. అలాగే గౌతమ్ మల్హోత్రా నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి మనీ లాండరింగ్ చేశారని ఈడీ ఆభియోగం మోపింది అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని ప్రత్యేక కోర్టు వెల్లడించింది.

అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. తాటికొండ ఐశ్వర్య అనే తెలంగాణ అమ్మాయి చనిపోయింది. టెక్సాస్‌లోని షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోగా అందులో తాటికొండ ఐశ్వర్య ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె తాటికొండ ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఐశ్వర్య మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కేరళలోని చోటుచేసుకున్న బోట్ హౌస్ ప్రమాదంలో సుమారు 20 మంది మరణించారు. మాలాప్పురం జిల్లాలోని తూవల్తీర్ధం బీచ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హౌస్ బోట్ లో 30 మందితో ప్రయాణిస్తున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి అద్బురహిమాన్ వెల్లడించారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయగా అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 20 మరణాలు నమోదైనట్లు ధృవీకరించారు. ఇందులో 15మందిని గుర్తించినట్లు వెల్లడించారు.

వివాహేతర సంబంధానిక అడ్డుగా ఉన్నాడన్న నేపంతో, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో జరిగిందీ దారుణం. భార్య ఊర్మిళ, ప్రియుడు రవిశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో, డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. గొంతులో ఏర్పడిన గడ్డకు ఆపరేషన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మహేశ్వరి మృత్యువాత పడింది. మహేశ్వరి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ దాడికి దిగారు కుటుంబ సభ్యులు.

కస్టడీ ప్రమోషన్స్‌లో పాల్గొంటోన్న నాగచైతన్య సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. "అవును. మేం విడిపోయి రెండేళ్లు దాటింది, అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది దాటింది. కోర్టు మాకు విడాకులు మంజూరు చేసింది. మేమిద్దరం మా జీవితాలను కొనసాగిస్తున్నాం. నా జీవితంలో ఆ దశ పట్ల నాకు విపరీతమైన గౌరవం ఉంది అని చైతూ చాలా హూందాగా స్పందించాడు. అయితే మీడియా తనకు, సమంతకు మధ్య విషయాలను చాలా ఇబ్బందికరంగా మార్చిందని తెలిపాడు. మీడియా ఊహాగానాలతో మా మధ్య విషయాలు ఇబ్బందికరంగా మారాయి. ప్రజల దృష్టిలో, పరస్పర గౌరవం తొలగిపోతుంది. దాని గురించి నేను బాధపడ్డాను" అని చైతన్య వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


