చిట్టి న్యూస్

Viveka Murder Case: డ్రైవర్‌ దస్తగిరికి ప్రత్యేక భద్రత

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరికి ప్రభుత్వం భద్రతను పెంచింది. పులివెందులలోని దస్తగిరి ఇంటి వద్ద కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటు చేశారు. ఎనిమిది మందితో దస్తగిరికి ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు. ఇటీవల ప్రెస్‌ మీట్‌ పెట్టిన దస్తగిరి.. వివేకా హత్య కేసులో వివరాలన్నీ వెల్లడించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పదేపదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి భద్రతను పెంచారు.

భాజాపా యువ నేత దారుణ హత్య

కర్ణాటకలోని ధార్వాడ్‌లో మంగళవారం రాత్రి బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ కమ్మర్ హత్యకు గురయ్యారు. భాజాపా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ హత్యకు రాజకీయ వైరుధ్యమే కారణమని, తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు. ఈ హత్య సంబంధం ఉన్నవారెవరినీ విడిచిపెట్టబోమని, దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

రైలు కింద పడి నిండు గర్భిణి....

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కడపలో చోటు చేసుకుంది. విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమామాలినీలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. సాయి కుమార్ చిరు వ్యాపారి కాగా, కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దీనికితోడు హేమ 8 నెలల గర్భవతి. బిడ్డ పుడితే పరిస్థితులు మరింత దిగజారతాయని భావించి మంగళవారం రాత్రి కడప శివారులోని కనుమలోపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఆశా భోస్లేకు లతామంగేష్కర్ పురస్కారం

ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు లతా మంగేష్కర్‌ పురస్కార ప్రదానం చేయాలని జ్యూరీ నిర్ణయించింది. ఇటీవలే కాలం చేసిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పేరిట కుటుంబ సభ్యులు ట్రస్టు, అవార్డును ఏర్పాటు చేశారు. జాతి నిర్మాణంలో మార్గదర్శక పాత్ర పోషించిన ప్రముఖులకు ఈ అవార్డు ఇవ్వనున్నారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఏడాది లతాకు స్వయానా సోదరి అయిన ఆశాభోంస్లేకు ఏప్రిల్‌ 24న ఈ పురస్కారం అందజేయనున్నారు. 

ఆతిక్ అహ్మద్ హత్య కేసులో ఐదుగులు పోలీసుల సస్పెన్షన్

గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలో అప్రమత్తంగా లేరన్న కారణంగా ఐదుగురు పోలీసులను సస్పెషన్ కు గురయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. MLN పోలీస్టేషన్ పరిధిలో హత్య జరిగినట్లు తెలిపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ లను ఏప్రిల్ 16న ప్రయాగ్ రాజ్ లో కాల్చిచంపారు. 

ఓజీకి జోడీ కుదిరింది

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో పవర్ స్టార్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో ఒక భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓజీకి జోడీని రంగంలోకి దించారు. ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో పవన్‌ సరసన మెరవబోతున్నట్లు ప్రకటించారు. దీంతో పవర్‌స్టార్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నాడు. 

టాలీవుడ్ పై తాప్సీ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను మరోసారి దక్షిణాది ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాలతో నటిగా తెరంగేట్రం చేసినా, అక్కడ నటిగా సంతృప్తిని పొందలేకపోయానని చెప్పింది. ఈ కారణంగానే తాను బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యానని తెలిపింది. పింక్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, బాలీవుడ్‌లో తాను చేసిన పాత్రల పట్ల సంతృప్తిగా ఉన్నానని తాప్సీ చెప్పింది. ఎవరూ సాధించలేని స్థితికి చేరుకోవడమే తన ధ్యేయమని చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్‌లో మళ్లీ దుమారం రేపుతున్నాయి.

దుక్కి దున్నిన నారా లోకేశ్...

కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్న యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నాగలి పట్టి దుక్కి దున్నారు. కొంత దూరం వరకు ఉత్సాహంగా యువనేత పొలం దున్నారు. అనంతరం రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

అట్టర్ ఫ్లాప్ నేపథ్యంలో సమంత ట్వీట్ వైరల్

సమంత నటించిన శాకుంతలం అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని సమంత చెప్పకనే చెప్పింది. భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని పోస్ట్ చేస్తూ ఆ విషయాన్నే పేర్కొంది. "కర్మణ్యే వాధికా రాస్తే... మా ఫలేషు కదాచన... మా కర్మ ఫల హే తుర్ భూః... మా తే సంఘోత్స్వ కర్మణి" అనే శ్లోకం ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మీకు పని చేయడం మీదే అధికారం ఉంది తప్ప.. దాని ఫలితం మీద కాదు.. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చేయడం మానకూడదు.. ప్రతిఫలం ఆశించకుండా పని చేయి అని ఆ వాఖ్యలకు అర్థం.

తగ్గినట్లే తగ్గి విజృంభిస్తోన్న కరోనా

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవర పెడుతుంది. ఆదివారానికి 24 గంటల్లో 7వేల 633 మంది వైరస్ బారిన పడగా.. సోమవారం 9వేల 111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తగ్గుతోందని అధికారులు భావించారు. అయితే, ఇవాళ మరోసారి కేసులు 10 వేలు దాటడంపై అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు తెలంగాణలో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. 

మరోసారి నోరు జారిన తాప్సి.. నెటిజన్స్ ట్రోలింగ్

ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం అంటే ఇదేనేమో.. తనని నటిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సౌత్ ఇండస్ట్రీపై పలు సార్లు కామెంట్లు చేసి నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతోంది తాప్సీ పన్ను. అయినా మళ్లీ అవే కామెంట్లు.. ఈ సారి ఘాటుగానే ఇచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇక్కడ నటిగా ప్రూవ్ చేసుకున్నాకే అక్కడ ఆఫర్లు వచ్చాయి ఆవిషయం మర్చిపోయావా అని ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానేసి చేసే సినిమాలపై దృష్టి పెడితే బావుంటుందేమో. లేకపోతే నార్త్ వాళ్లు కూడా గెంటేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరి టైమ్ ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. అవకాశాలు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది.

కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ సినిమాతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాప్సీ మంచు మనోజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ సమయంలో పలు తెలుగు సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ మహిళా సెంట్రిక్ పాత్రలు చేయడం ప్రారంభించి తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. అప్పుడు ఆమె సౌత్ సినిమాల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడం గురించి వివరిస్తూ ఆమె తన మొదటి చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావును కూడా తక్కువ చేసి మాట్లాడింది. దీంతో అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.

తాజాగా మరోసారి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాలతో తొలిసారిగా నటిగా తెరంగేట్రం చేసినా, దక్షిణాది చిత్రాలతో నటిగా సంతృప్తిని పొందలేకపోయానని చెప్పింది. ఈ కారణంగానే తాను బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యానని చెప్పింది. తన హిందీ చిత్రం పింక్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, బాలీవుడ్‌లో తాను చేసిన పాత్రల పట్ల సంతృప్తిగా ఉన్నానని తాప్సీ అన్నారు. ఎవరూ సాధించలేని స్థితికి చేరుకోవడమే తన ధ్యేయమని చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్‌లో మళ్లీ దుమారం రేపుతున్నాయి.

పిల్లల జోలికి వస్తే పొడిచి పారేస్తా....

నెమలి గుడ్లను దొంగలిద్దామనుకున్న ఇద్దరు మహిళలపై సదరు నెమలి దాడి చేసిన వైనం ప్రస్తుతంత సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఓ మహిళ నెమలి గుడ్లను దొంగిలించడానికి చెట్టుపైకి ఎక్కింది. మరొక మహిళ కింద ఉండి ఆ గుడ్లను జాగ్రత్తగా పట్టుకుంటోంది. ఇంతలోనే ఈ విషయాన్ని కనిపెట్టేసిన నెమలి పరుగున వచ్చి చెట్టెక్కిన మహిళను కుళ్ల బొడిచింది. అంతే వేగంతో కింద ఉండి గుడ్లు అందుకున్న మహిళపై కూడా విరుచుకుపడింది. పశుపక్షాదుల్లోనూ తల్లి ప్రేమకు ఎల్లలు లేవని ఈ ఘటనే నిరూపిస్తోంది. 

విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల జేఏసీ ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల జేఏసీ ఆందోళన చేపట్టింది.. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు.. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, సీపీఎస్‌, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు.. పాదయాత్రలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని వారు ప్రశ్నించారు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బోర్డు తిప్పేసిన  INFOSE  స్టాప్‌వేర్‌ కంపెనీ

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని స్టాప్‌వేర్‌ కంపెనీ INFOSE బోర్డు తిప్పేసింది. ఉద్యోగులను తీసివేస్తున్నట్లు మెయిల్‌  చేసింది. INFOSE కంపెనీ ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దాదాపు కంపెనీలో 700 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. 650 మంది పేరుతో 4లక్షల రూపాయలు, 50 మంది పేరుతో 10లక్షల చొప్పున కంపెనీ లోన్‌ తీసుకున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని నిరసనకు దిగారు.

టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను బోర్డులో కొనసాగించబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఉద్యోగులకు 12-15 శాతం జీతాలు పెంచేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. క్యాంపస్ రిక్రూట్‌ల మూల వేతనాల పెంపును కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధానాన్ని ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌లోనే మాజీ మంత్రి రఘువీరా రెడ్డి

కాంగ్రెస్‌లో కొనసాగేందుకు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రఘువీరా రెడ్డిని బెంగళూరు కాంగ్రెస్‌ ఇంఛార్జీగా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘు వీరా రెడ్డి.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. రాహుల్‌ పార్లమెంట్‌ సభ్యత్వం తొలగించడం బాధాకరమన్నారు.

మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు పూర్తి

ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం సొంత గ్రామం తేర్నకల్‌లో అంత్యక్రియలను నిర్వహించారు. నీరజా రెడ్డి అంత్యక్రియలకు నాయకులు, అభిమానులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

పారిశ్రామిక వేత్తలను ఎవరూ బెదిరించలేదు: యోగీ ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ లో ఏ క్రిమినల్ కూడా పారిశ్రామిక వేత్తను బెదిరించే పరిస్థితి లేదని అన్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్. "ప్రొఫెషనల్ క్రిమినల్స్ గాని, మాఫియాగాని ఏ పారిశ్రామికవేత్తను ఫోన్‌లో బెదిరించలేరు. 2012, 2017 మధ్య ఉత్తర ప్రదేశ్ లో 700 కంటే ఎక్కువ అల్లర్లు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ( 2017, 2023 మధ్య) యుపిలో అల్లర్లు చెలరేగలేదు, కర్ఫ్యూ విధించలేదు. పెట్టుబడి పెట్టడానికి, పరిశ్రమల స్థాపనకు ఇది అత్యంత అనుకూలమైన అవకాశం" అని యోగీ చెప్పారు. అతిక్ అహ్మద్ హత్య నేపథ్యంలో యోగీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

మెల్లగా పడగవిప్పుతోన్న కరోనా...

గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 7వేల 633 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 61వేల 233 కేసులు యాక్టీవ్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 11మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5 లక్షల 31వేల 152కు పెరిగింది. ఢిల్లీలో నాలుగు మరణాలు నమోదవగా, హర్యానా, కర్నాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,48,34,859)గా ఉంది. క్రియాశీల కేసులు 0.14 శాతంగా ఉన్నాయి, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.68 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య 4,42,42,474కి చేరుకోగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.

తెలంగాణాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు

తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యాహ్నం ఎండలు తీవ్రంగా ఉంటే.. సాయంత్రం వర్షం కురుస్తోంది. రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతకొన్ని రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న గరిష్ఠంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. నాంపల్లిలో గరిష్ఠంగా 1.8 సెం.మీటర్లు, బహదూర్‌పురలో 1.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ వర్షం కురిసింది.

Chiranjeevi: బలగం మొగిలయ్యకు మెగా సాయం

Chiranjeevi: సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తారు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ వారి హృదయాల్లో చోటు సంపాదించుకుంటారు మెగా స్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరికంటే ముందుగా స్పందించేది, ఆదుకునేది చిరంజీవి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. తాజాగా బలగం మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు ఆయన్ను వేధిస్తుండడంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కళ్లు కూడా సరిగా కనిపించని మొగిలయ్యకు కంటికి శస్త్ర చికిత్స చేయిస్తానని భరోసా ఇచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని బలగం దర్శకుడు వేణుకు తెలియజేయగా అతడు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్ చేసిన సాయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మొగిలయ్యకు ఉచిత వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చింది. 

వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఏపీ

ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. విజయవాడ, విశాఖ సహా పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చీరాలలో ఎన్నడూ లేనంత అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు బుచ్చిరెడ్డిపాలెం, బల్లికురువలోను 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీచాయి. విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, కడప, మన్యం, కాకినాడ, అల్లూరి జిల్లా, గుంటూరు, కృష్ణా, పల్నాడు, తూర్పుగోదావరి, నంద్యాల, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని 117 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది.

Telangana: 23న చేవెళ్లకు అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23న చేవెళ్లలో జరిగే బీజేపీ పార్లమెంట్ ప్రభాస్ యోజన సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇక తెలంగాణకు పలువురు బీజేపీ జాతీయ నేతలు ఇప్పటికే క్యూ కడుతున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై బండి సంజయ్ సహా రాష్ట్ర ముఖ్య నాయకులతో బన్సల్ చర్చించనున్నారు. పార్లమెంట్ ప్రభాస్ యోజన, పోలింగ్ బూత్ స్వశక్తికరణపై సమీక్షించనున్నారు. కేంద్రమంత్రుల పర్యటనలు, ప్రభాస్ యోజన సభా ఏర్పాట్లపై బన్సల్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం: మంత్రి హరీష్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశామని మంత్రి హరీష్‌రావు అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో వంద పడకల ఆస్పత్రికి మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని హరీష్‌రావు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని డయాలసిస్ సేవలు మరింత పెంచామన్నారు. రాష్ట్రంలో 7 వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచుకున్నామని తెలిపారు. గతంలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ వచ్చేదన్న హరీష్‌రావు.. ఇప్పుడు ఏడాదిలో 7 నుంచి 8 కాలేజీలు వస్తున్నాయని స్పష్టంచేశారు.

కేసీఆర్‌ పీఎం అయితే.. హరీష్‌రావు సీఎం అవుతాడు.. చిన్నారి జోతిష్యం

మంత్రి హరీష్‌రావుపై ప్రశంసల వర్షం కురిపించిందో చిన్నారి. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జరగబోయే దాని గురించి ఓ చిన్నారి సోది చెప్పింది. హరీష్‌రావుకి రాజయోగం ఉందని, దేశానికి సీఎం కేసీఆర్‌ పీఎం అయితే.. హరీష్‌రావు సీఎం కావాలని ఆకాంక్షించింది. సిద్దిపేట గడ్డపై ఎవరూ చేయలేని అభివృద్ధి పనులు చేసి చూపించారని కొనియాడింది. అయితే.. ఇన్ని చేసినా హరీష్‌రావుకి నరదిష్టి ఉందని చిన్నారి వెలిబుచ్చింది..

Uttar Pradesh: భార్యను పాము కరిచిందని.. భర్త చేసిన పనికి వైద్యులు షాక్

Uttar Pradesh: ఎవరికైనా పాము కరిసిందని తెలిస్తే ఆ విషం ఎక్కడ శరీరం అంతా పాకుతుందో అని హుటాహుటిన ఆస్పత్రికి పరిగెడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కరిచిన పామును గోనె సంచిలో బంధించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పామును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఉన్నావ్ జిల్లా సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఉమర్ అత్వా గ్రామంలో నివాసం ఉంటున్న నరేంద్ర భార్య కుస్మా తన ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము ఆమెను కాటువేసింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసి స్పృహతప్పి పడిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇరుగు పొరుగు వాళ్లు మహిళను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఈ విషయం మహిళ భర్త నరేంద్రకు తెలియడంతో ఆయన ఇంటికి వెళ్లి పామును పట్టుకుని గోనె సంచిలో బంధించాడు. దానిని చూసి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఖంగుతిన్నారు. పాముని ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించగా.. తన భార్యకు ఏ పాము కరిచిందో వైద్యుడికి చూపుతానని, తదనుగుణంగా ఆమెకు చికిత్స అందించగలుగుతారని చెప్పాడు. ప్రస్తుతం ప్రాణాపాయం నుండి బయటపడిన భార్యను నరేంద్ర ఇంటికి తీసుకుని వెళ్లారు. అటవీ శాఖ అధికారులకు వైద్యులు సమాచారం అందించడంతో వారు వచ్చి పామును అడవిలో వదిలేశారు. 

ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వెళ్లిన మంత్రికి యాదవ కులస్తులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. ముందుగా దుమాల గ్రామంలో యాదవులు తలపెట్టిన బీరప్ప కళ్యాణ వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Vishaka: కాంట్రాక్టర్‌ వేధింపులతో రోడ్డెక్కిన డ్రైవర్లు

విశాఖలో క్యాబ్‌ డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. ఏడాదిన్నర క్రితం క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా క్యాబ్‌ వెహికల్స్‌ని వైసీపీ సర్కార్‌ అట్టహాసంగా ప్రారంభించింది. అయితే అప్పటి నుంచే క్యాబ్‌ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, పని గంటలు పెంపు, కాంట్రాక్టర్‌ వేధింపులతో డ్రైవర్లు రోడ్డెక్కారు. విశాఖలో ఉన్న ఎనిమిది జోన్లలో సుమారు వెయ్యి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మెలో సుమారు 11వందల మంది డ్రైవర్లు పాల్గొన్నారు. అన్ని జోన్‌ ఆఫీస్‌ల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ప్రైవేట్‌ డ్రైవర్‌లతో వాహనాలు తీయించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని డ్రైవర్లు అడ్డుకున్నారు. లేబర్‌ కోర్ట్‌ ఆదేశాల ప్రకారం జీతాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

కేసీఆర్‌పై రైతు అభిమానం..వినూత్న రీతిలో ప్రదర్శన

సీఎం కేసీఆర్‌పై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నాడు ఓ ఆదర్శ రైతు. తన వ్యవసాయక్షేత్రంలో మూడు రకాల వరి వంగడంతో కేసీఆర్ చిత్ర పటాన్ని రూపొందించాడు. మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఆవిష్కరించిన ఈ అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ చిత్రం ఏర్పాటు చేసానని గంగారెడ్డి అన్నారు. 

టీటీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌గా టీ ప్రకాష్‌రెడ్డి

టీటీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌గా టీ ప్రకాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ,తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి,తెలంగాణ రాష్ట్ర పార్టీ సమన్వయ కర్త కంభంపాటి రాంమోహన్‌లకు ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Andhrapradesh: నేడు కోడికత్తి కేసు విచారణ

విజయవాడ NIA కోర్టులో ఇవాళ కోడికత్తి కేసు విచారణ జరుగనుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ తరుపు లాయర్ సలీం కౌంటర్ దాఖలు వేశారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వరావు వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కుట్రలేదంటూ ఇప్పటికే కోర్టులో NIA కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ కోర్టు ఆదేశాలపై సర్వాత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.

తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పవన్‌కళ్యాణ్‌

తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అన్నారు. విమర్శలు చేసే వాళ్ళు పాలకులు, ప్రజలు వేరన్న విషాయన్ని నాయకులు గుర్తించాలని అన్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. నాయకులు చేసే వ్యాఖ్యలను ప్రజలకు ఆపాదించడం సరికాదని అన్నారు.

Prakasham: యర్రగొండపాలెంలో హైటెన్షన్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హైటెన్షన్ నెలకొంది. రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇజ్రాయిల్‌పేటలో ఒక అర్చీ నిర్మాణంపై ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. చివరికి అదికాస్త కొట్టుకునేవరకు వెళ్లింది. యువకులు, మహిళలు పరస్పరం గొడవకు దిగారు. ఇరువర్గాల ఘర్షణతో యర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. మారుతీకృష్ణ, కానిస్టేబుల్ హిదాయతుల్లాతో సహా పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. సబ్ కలెక్టర్ నేతృత్వంలోని ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యర్రగొండపాలెంలో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత 144 సెక్షన్ విధించారు పోలీసులు. అటు స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్‌పై గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడి ఉంటే పరిస్థితి దాడుల వరకు వెళ్లేది కాదని స్థానికులు అంటున్నారు

మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో రసాభాస

మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా ముగిసింది.. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన తనను, తన కుమారుడు జెడ్పీ ఛైర్మన్‌ను కించపరుస్తున్నారని సుధీర్‌ రెడ్డి ఆరోపించారు.. పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు పిలవడం లేదంటూ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.. మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనూ జరిగిందని, అయితే దాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరినీ పిలవలేదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని సుధీర్‌ రెడ్డి మాట్లాడారు.. అయితే, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మాట్లాడుతుండగానే మైక్‌ లాక్కునే ప్రయత్నం చేశారు మంత్రి మల్లారెడ్డి.. దీంతో గొడవ పెద్దది కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వారిని సముదాయించారు.

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కన్నుమూత

కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ నీరజారెడ్డి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదంలో నీరజారెడ్డి కన్నుమూశారు. ఆమె హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా బీచుపల్లి దగ్గర టైర్‌ పగిలి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నీరజారెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి నీరజారెడ్డి ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది.

భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై.. ఎంపీ అవినాష్‌రెడ్డి రియాక్ట్‌

తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై.. ఎంపీ అవినాష్‌రెడ్డి రియాక్ట్‌ అయ్యారు. భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా సీబీఐ అరెస్ట్‌ చేసిందని పేర్కొన్నారు. కీలక విషయాలను సీబీఐ విస్మరిస్తోందని ఆరోపించారు. సమాచారం దాచిన వివేకా అల్లుడు రాజశేఖర్‌ను విచారించట్లేదని.. దస్తగిరి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. వాచ్‌మెన్‌ రంగన్న చెప్పింది కూడా పట్టించుకోలేదన్న ఆయన.. హత్య విషయం తనకన్నా గంట ముందే వివేకా అల్లుడికి తెలుసని పేర్కొన్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పింది తానేనని.. సమాచారం ఇచ్చిన తనను దోషి అంటున్నారన్నారు. నిజాయితీ నిరూపించుకుంటామని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు.