చిట్టి న్యూస్

YSRTP ఎన్నికల పోటీ కి దూరంగా ఉంటాం - వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశ్యం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వి వద్దు అని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.

మేము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేదావులు చెప్పారు అందుకే తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది , కాంగ్రెస్ పార్టీ కి YSRTP మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

BUGGANA: ఏపీకి ఆర్థికంగా కష్టకాలమే

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ఆర్థికంగా కష్టకాలమే అని... అందుకే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఆలస్యమవుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామని కూడా బుగ్గన వెల్లడించారు. అప్పుల విషయంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కన్నా తాము తక్కువ అప్పులే చేశామన్నారు. మూలధన వ్యయం ఎంతో పెంచామని గణాంకాలు వెల్లడించారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎంతో సాధించామని ప్రకటించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్నారు. మరి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా యనమల వ్యాఖ్యలపైనే తాను స్పందించినట్లు తెలిపారు. అలా చెప్పానంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పినట్లు కాదు. ఏపీలో కష్టకాలమే ఉందని అందుకే జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతాయని ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు.

ROJA: తిరుమలలో అన్యమత గుర్తులతో రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌

తిరుమలలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ నిబంధనలు ఉల్లంఘించారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. రోజా ఫొటోగ్రాఫర్‌ తీరుపై అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని అదుపులో ఉంచాల్సిన మంత్రి.. ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. తిరుమల కొండపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఫొటోగ్రాఫర్‌ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

YCP: ఈ వైసీపీ కార్పొరేటర్ భర్త.. ఓ జేబు దొంగ

ఆయన వైసీపీ కార్పొరేటర్‌ భర్త. అందరిలా భార్య రాజకీయం జోలికి ఆయన వెళ్లడు. ఎక్కడ బహిరంగ సభలు ర్యాలీలు, ఉత్సవాలు ఉంటే అక్కడికెళ్లి జనాల జేబులు కొట్టేస్తాడు. క్షణాల్లో డబ్బును చేతులు మార్చేస్తాడు. తాజాగా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గుమిగూడిన జనం వద్ద చేతివాటం ప్రదర్శించి దొరికిపోయాడు. విజయవాడ 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్‌ గోదావరి గంగ భర్త గోదావరిబాబు. బుధవారం తెల్లవారుజామున చంద్రబాబును చూసేందుకు వచ్చిన జనాల్లో కలిసిపోయారు. వైసీపీ కార్పొరేటర్‌ భర్తై ఉండి చంద్రబాబును చూడడానికి వెళ్లారు. చంద్రబాబును చూసేందుకు తెలుగుదేశం శ్రేణులంతా గుమిగూడి ఉండగా గోదావరి బాబు ఓ నేత జేబులోని 20 వేలు కాజేశారు. ఆ డబ్బును తన వెంట తెచ్చుకున్న మరో మనిషికి ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఈ విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించేసరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. జనం అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు.


బందోబస్తు విధుల్లో ఉన్న కృష్ణలంక సీఐ దుర్గారావు అక్కడకు చేరుకుని గోదావరి బాబును అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడిని కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. నగదు తనవద్ద లభించకపోవడం, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు వైసీపీ నాయకుడిని బైండోవర్‌ చేసి వదిలేశారు. ఇటీవల నెల్లూరులోని ఓ మంత్రి చరవాణిని తస్కరిస్తూ పట్టుబడడంతో అక్కడి పోలీసులు గోదావరి బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అప్పటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రలోనూ తన హస్తలాఘవాన్ని ప్రదర్శించి దొరికిపోయినట్లు సమాచారం. గోదావరి బాబు 12 ఏళ్ల క్రితమే విజయవాడ వచ్చాడు. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై గతంలో కేడీ షీట్‌ ఉంది. అది ప్రస్తుం గోదావరిబాబు నివసిస్తున్న కొత్త పేట పీఎస్‌కు బదిలీ కాలేదు. రెండు చోట్లా నిఘా లేకపోవడంతో గోదావరిబాబు హస్త లాఘవానికిఅడ్డులేకుండా పోయింది.

Chandrababu: బాబుకు బిగ్ రిలీఫ్..

 స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. నాలుగు వారాల పాటు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటీషన్ వేశారు. దీని పైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబు కు బెయిల్ లభించింది. పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. నాలుగు వారాలు అంటే.. నవంబర్ 24 వరకూ మధ్యంతర బెయిల్ ను చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి నేరుగా అమరావతికి చంద్రబాబు చేరుకుంటారని సమాచారం.

Vande Bharat: వందే భారత్ ఢీకొని ముగ్గురు మృతి

భారత్‌లో రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండగా,  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కసంపూర్ దగ్గర వందే భారత్ రైలు రానుండడంతో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. అయినా కూడా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు 40 ఏళ్ళ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు. కానీ వారు పట్టాలు దాటుతుండగా అత్యంత వేగంగా వచ్చిన వందే భారత్ ట్రైన్ వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మృతి చెందినవారు మీరట్ కు చెందిన మోనా, మనీషా, చారులుగా గుర్తించారు. మోనాకు 40 ఏళ్ళు కాగా, మనీషాకు 14, చారుకు 7 ఏళ్ళు. 

Knife In  Stomach : యువకుడి కడుపులో కత్తి.. ఐదేళ్లుగా నరకం

వైద్యు నిర్లక్ష్యం రోగుల ప్రాణాలు మీదికి తెచ్చిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. కత్తి పోట్లకు గురైన ఓ యువకుడు.. ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడు గాయాలను పరీక్షించకుండా ఏవో మాత్రలు ఇచ్చి పంపేశాడు. అతడి పొట్టలో కత్తి ఉన్న విషయం కూడా వారు  గుర్తించలేదు. అప్పటి నుంచి యువకుడ్ని కడుపునొప్పి వేధించడంతో పలు ఆస్పత్రులు చుట్టూ తిరిగాడు.  ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించారు.  ఈ ఘటన గుజరాత్‌లో భరూచ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అంకలేశ్వర్‌కు చెందిన అతుల్‌ గిరీ అనే యువకుడు ఐదేళ్ల కిందట కత్తిపోట్లకు గురయ్యాడు. స్థానిక సివిల్‌ ఆసుపత్రి వైద్యుడు.. బాధితుడిని సరిగ్గా పరీక్షించకుండానే ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపేశాడు. అప్పటి నుంచి అతుల్‌కు కడుపునొప్పి ప్రారంభమైంది. తీవ్రకావడంతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కానీ, అతడికి ఉపశమనం లభించలేదు. ఐదేళ్ల పాటు నరకయాతన అనుభవించాడు. ఇటీవల అతుల్ ప్రమాదానికి గురికావడంతో అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  దీంతో వైద్యులు అతనికి ఎక్స్‌రే తీయగా, అతని కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా ఆ కత్తిని బయటకు తీశారు. దీంతో అతుల్ ఊపిరిపీల్చుకున్నాడు.

BANDLA: భావోద్వేగంతో ఏడ్చేసిన బండ్ల గణేష్‌

తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన సంఘీభావ సభలో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. నగర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు వేలాదిగా తరలివచ్చిన ‘సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌లో బండ్ల గణేష్‌ కంటతడి పెట్టుకున్నారు. బాబుకు సంఘీభావంగా గళమెత్తిన బండ్ల... నాలుగు వేల ఏళ్లైనా చంద్రబాబు గొప్పతనం గుర్తుంటుందన్నారు. చంద్రబాబు పేరు మాత్రమే కాదని.. ఓ బ్రాండ్‌ అని కొనియాడారు. ఏపీ అభివృద్ధి కోసం కఠోరంగా శ్రమించడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ఆయన్ను జైల్లో పెట్టడం బాధగా ఉందంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.


Bihar: కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో 24 ఏండ్ల యువకుడి మృతదేహం..

కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బిహార్లో  సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్‌ కు చెందిన ఇల్లు అది. ఎమ్మెల్యే మేనల్లుడు గోలు సింగ్ సైతం పట్నా లోనే నివసిస్తున్నాడు. అయితే అక్కడే  మృతుడు పీయూశ్‌ సింగ్‌  కొంతకాలంగా ఉంటున్నాడు.  శనివారం రాత్రి 7 గంటలకు గోలు సింగ్ ఇంటికి వెళ్లిన పియూష్ తిరిగి రాలేదు. ఇవాళ గోలు సింగ్ ఇంట్లో పీయూష్ మృతదేహాన్నిపోలీసులు కనుక్కున్నారు. పీయూష్‌ని ఎమ్మెల్యే మేనల్లుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరని వారు వెల్లడించారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోలు సింగ్‌ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామని.. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నారని వివరించారు. పోస్ట్ మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.


PROTEST: గోరంట్ల వ్యాఖ్యలపై భగ్గుమన్న టీడీపీ

చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఆయనకు మద్దతుగా కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీలు చేశారు. చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు అండగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు 50వ రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కృష్ణయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెంలో మహిళలు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు.


CBN అక్షరాలతో ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. నిరాధారమైన కేసులు పెట్టి అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేయించారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే... గోరంట్ల మాధవ్‌కి ఇప్పటి వరకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కల్యాణదుర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

TDP: జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇప్పటికే మోత మోగిద్దాం, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అరాచక, చీకటి పాలన సాగిస్తున్న జగనాసురుడికి 'కళ్లు తెరిపిద్దాం' అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇవాళ రేపు రాత్రి 7 నుంచి 7 గంటల ఐదు నిమిషాల మధ్య ప్రజలు కళ్లకు గంతలు కట్టుకుని బాల్కనీలు, వాకిళ్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా 'నిజం గెలవాలి' అంటూ నినాదాలుచేయాలని సూచించారు. ఈ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేశ్ కోరారు. 

Narra bhuvaneshwari: భువనమ్మ నిజం గెలవాలి యాత్ర

నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర మూడోరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగింది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మొదట రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత.... ఏర్పేడు మండలం మునగాలపాలెం వెళ్తుండగా వికృతమాల గ్రామ సమీపంలో TCL కంపెనీ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోTCL ఏర్పాటైందని భువనేశ్వరికి వివరించియాత్రకు సంఘీభావం తెలిపారు. తర్వాత మునగాలపాలెం వద్ద ఇసుక అక్రమ నియంత్రణ పోరాటంలో అసువులు బాసినవారికి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వసంతమ్మ కుటుంబాన్నిశ్రీకాళహస్తి గ్రామీణ మండలం. పోలిలోని మునిరాజా కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని కుటుంబాలకూ3లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న భువనేశ్వరి...వైకాపా పాలనలో ఏపీ..... రాజధాని కూడా లేని అనాథగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

SUPPORTERS: సినీ పరిశ్రమ చంద్రబాబు గారితో మనం

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ నటుడు మురళీ మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుతో అందరి గుండెల్లో బాధ ఉందని, ఇదే తమిళనాడు, కర్ణాటకలో జరిగితే ప్రజలు భగ్గుమనేవారని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో మరళీమోహన్ అధ్యక్షతన "చంద్రబాబుగారితో మనం" పేరుతో జరిగిన కార్యక్రమంలో పలువురు దర్శకులు , సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన వారు తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఎప్పుడూ మరవలేమని తెలిపారు. ఈ నెల 29న గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించే కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

CASH: వాషింగ్‌ మిషన్‌ లో కోటీ 30 లక్షల నగదు

ఓ వాషింగ్‌ మెషీన్‌లో తరలిస్తున్న 1.30 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపింది. NADజంక్షన్‌లో గతరాత్రి పొద్దుపోయిన తర్వాత విజయవాడకు వెళ్తున్న ఓ మినీ వ్యాన్‌లోని వాషింగ్ మిషన్‌లో కరెన్సీ నోట్ల కట్టలు, 30 సెల్‌ఫోన్‌లను గుర్తించిన పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. ఆ వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సరైన ఆధారాలు లేనందున CRPC41,102 సెక్షన్ల కింద... కేసు నమోదు చేశారు. అయితే ఆ నగదు, సెల్‌ఫోన్‌లు తమవేనని సోనోవిజన్‌ వ్యాపార సంస్థ తెలిపింది. ఇందులో పన్ను ఎగవేత, నల్లదనం, హవాలావంటి అంశాలు లేవని... ఆ సంస్థ ఎండీ భాస్కరమూర్తి స్పష్టంచేశారు. పండగ సెలవుల్లో బ్యాంకులు పరిమితులు విధించినందున నగదును తప్పనిసరి పరిస్థితుల్లో స్టాక్‌తోపాటు విజయవాడ బ్రాంచికి తరలించాల్సి వచ్చిందని భాస్కరమూర్తి వివరించారు.

Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన కారు ,   ఆది కైలాస యాత్రికులు  మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో కారు నదిలో పడి ఆరుగురు ఆది కైలాస యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఆది కైలాస దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు నదిలో పడిపోవడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం కారు లఖన్‌పూర్ సమీపంలో కాళీ నదిలో పడిపోవడంతో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఆది కైలాస దర్శనం తర్వాత బాధితులు తిరిగి వస్తుండగా ధార్చులా-లిపులేఖ్ రహదారిపై మంగళవారం రాత్రి ఆలస్యంగా ఈ ఘటన జరిగిందని పితోర్‌ఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లోకేశ్వర్ సింగ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు బెంగళూరు, ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఉత్తరాఖండ్‌కు చెందిన వారని సమాచారం. మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి సంతాపం తెలిపారు. 

KODIKATTI: కోడికత్తి ఘటనకు అయిదేళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన కోడికత్తి ఘటన జరిగి అయిదేళ్లయింది. విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై కోడికత్తితో దాడి జరిగింది. ఈ దాడిని 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రచార అస్త్రంగా మార్చుకుని లబ్ధిపొందింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీను నేటికీ విచారణ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్‌ విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించినా, ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి విశాఖ ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి చేరింది. కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని జగన్‌ ఈ నెల 17న హైకోర్టును ఆశ్రయించారు. దళిత యువకుడి హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు 6 నెలల్లోపే బయటకొచ్చారు. వైఎస్‌ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టయిన 5 నిమిషాల్లో బెయిల్‌ పొందారు. కానీ కోడికత్తి కేసులో అయిదేళ్లయినా బెయిల్‌ రాకపోవడం విచిత్రంగా ఉందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

FEST: తుది అంకానికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు తుది అంకానికి చేరుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని కూటగుళ్లలో యర్రదొడ్డి గంగమ్మను రకరకాల పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వాసవి కనకపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఉయాలోత్సవం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్‌లో అమ్మవారి ఊరేగింపులో యువకులు వినూత్నరీతిలో విన్యాసాలు చేశారు. నెల్లూరులో అమ్మవార్ల ఊరేగింపు అట్టహాసంగా సాగాయి. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిగా దర్శనమిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కోటదుర్గమ్మ అమ్మవారు సూర్యప్రభ సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో దేవతామూర్తుల వేషాలు,బాణాసంచా కాల్పులు అట్టహాసంగా జరిగాయి. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో జమ్మి వేట మహోత్సవం వైభవంగా జరిగింది.


తెలంగాణలో విజయదశమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఆలయాల్లో జమ్మి చెట్లకు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రావణదహణాలను ఉత్సాహంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రులు ముగింపు వేళ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దసరా పండుగు పురస్కరించుకొని ప్రజలు అనేక సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మి చెట్లకు ప్రత్యేక పూజలు, వివిధ కళా ప్రదర్శనలు, రావణ దహనాలతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని ఆలయ మాడవీధిలో స్వామిని ఊరేగించిన అనంతరం స్వామి ముందు జమ్మికొమ్మను పెట్టి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతి, అవబృత స్మపనము, శమీ పూజ, నదీహారతి, తెప్పోత్సవము, ధ్వజఅవరోహణము వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


భద్రాచలం ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు మహా పట్టాభిషేకం వేడుక నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై శ్రీరాముడిని, అశ్వవాహనంపై లక్ష్మణ స్వామి దసరా మండపం వద్దకు తీసుకెళ్లి షమీ పూజ, స్వామి ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవంలో భాగంగా ఆలయ EO రమాదేవి రావణాసుర దహనం నిర్వహించారు. దసరా వేడుకలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో మహా నవరాత్రి ఉత్సవ్‌ ముగింపు సంబరాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో గర్భా నృత్యాలతో హోరెత్తించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. బాణాసంచాతో స్వాగత తోరణం, స్వస్తిక్‌, సిరిమల్లె చెట్టు, పున్నమినాగు వంటి ఆకారాలు రూపొందిచారు. 

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి భావోద్వేగం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనతో లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర భావోద్వేగాని గురయ్యారు. ఈ ప్రయాణం ఎంతో భారంగా ఉందని నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్‌ చేశారు. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాని.. తన భర్త లేకుండా తొలిసారి తిరుమలకు వెళ్లానని ఆమె అన్నారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వచ్చే ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లెకు వెళ్లానని... ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని భువనేశ్వరి అన్నారు. ప్రతి నిమిషం భారంగా గడిచిందని, ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాని, దానిలో భాగంగా నేడు చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నానని భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. 

Kangana Ranaut : ఢిల్లీలో రావణ దహనం చేయనున్న తొలి మహిళా సెలబ్రిటీ..!

దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే . అయితే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు. ఈ ఏడాది కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు.

అయితే, ఎన్నికల కారణంగా మోదీ చాలా బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చెయ్యలేకపోతున్నారు.. అలాగే ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీ కంగనా రనౌత్ ను రావణ్ దహన్ కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంటుకు ఆమెతో పాటు పలువురు బాలివుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారని సమాచారం..రావణ్ దహన్ కార్యక్రమాన్ని మాత్రం కంగనా చేయనున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రాంలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలవనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్‌ఎస్‌విపి నిర్మించిన తేజస్ టైటిల్ రోల్‌లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు..


MOTHKUPALLY: జగన్‌ జైల్లో అంటే అందరూ జైలుకు పోవాలా?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తన నివాసంలో ఉపవాస దీక్షకు దిగారు. దసరా వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఉపవాస దీక్ష చేశారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని, జైల్లో కిరాతకులుండాలి కాని ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే తల్లడిల్లిపోతున్నారని అన్నారు. జగన్‌ జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా అని నిలదీశారు. చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా కుట్ర చేస్తున్నారని, జగన్‌ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయిందన్నారు. జగన్.. ఇక మీ ఆటలు సాగవని... మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరని స్పష్టం చేశారు. కడుపుమండి మాట్లాడుతున్నానని, ప్రజలు జగన్ ఆటకట్టిస్తారని మోత్కుపల్లి మండిపడ్డారు. 

Online Fraud : ఆన్ లైన్ మోసం..  యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేస్తే ...

యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం ద్వారా బాగా డబ్బులు సంపాదించవచ్చు అని  మభ్యపెట్టి, పలువురి నుంచి రూ.73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్, మోజ్ యూప్ ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్ లైన్ మోసానికి పాల్పడింది. నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్ కుమార్ ను గురుగ్రాంలో అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చని నమ్మించాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు. ఈ విషయంలో మోసం వంటివి ఏవి ఉండవని నమ్మబలికాడు. దీంతో  కుమార్ పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ విధంగా మరికొందరినీ మోసం చేసి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బు చేరవేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కుమార్ నుంచి రికవరీ చేసిన మొబైల్, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Kanpur: ఒకరి పేరుతో మరొకరి  అరెస్టు.. 10 రోజులు జైల్లోనే

ఒక కేసులో నేరస్తుడి కోసం వెతుకున్న పోలీసులు తప్పుగా మరో వ్యక్తిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు పేర్కొన్న వ్యక్తిని తాను కాదంటూ అతడు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో అతడు అకారణంగా పది రోజుల పాటు జైలులో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ప్రమోద్ శంఖావార్‌ అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్‌ 24న కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కాగా, ఘటంపూర్‌ స్టేషన్‌ పోలీసులు ప్రమోద్ శంఖావార్‌కు బదులు వసంత్ విహార్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ సాహుకు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. అతడి మొదటి పేరుతోపాటు తండ్రి పేరు ఒకటిగా ఉండటంతో కోర్టుకు హాజరుకాని నేరస్తుడు అతడేనని భావించారు.

అయితే పోలీసులు చెబుతున్న వ్యక్తిని తాను కాదని, తన తండ్రి జీవించి ఉన్నారని, వారు చెబుతున్నట్లుగా తన భార్య పేరు ఉషా కాదని సాహూ మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయడంతో పది రోజులపాటు జైలులో ఉన్నాడు. చివరకు తన ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో సెప్టెంబర్‌ 22న బెయిల్‌పై విడుదలయ్యాడు.

మరోవైపు ఈ అంశం పబ్లిక్‌ టాక్‌గా మారడంతో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రమోద్ సాహును అరెస్ట్‌ చేసి జైలులో ఉంచిన పోలీస్‌ సిబ్బందిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని తప్పుగా గుర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  వెల్లడించారు.

BOTSA: మద్యం ధర పెంచితే మీకెందుకు?

నవరత్నాల్లో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని, మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుందని, నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బైజూస్‌ కంటెంట్‌ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయటం లేదని, దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే.. తన వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతానని బొత్స ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశగా 12రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

MOTHKUPALLY: చంద్రబాబును చంపే కుట్ర

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఆయన..చంద్రబాబు విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తాను దసరా పండుగ జరుపుకోవడం లేదని, ఉపవాస దీక్ష చేయనున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. తన రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఏనాడూ.. కక్ష్య సాధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు ట్యాంక్‌బండ్‌‌ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పురుగుల మందు డబ్బాతో హల్‌చల్ చేశారు. సీఎం కేసీఆర్‌ను సమర్థించి తప్పుచేశానని మోత్కుపల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దళితబంధు అమలు కావటం లేదని తనను చనిపోమని దళిత యువత తనకు మెసేజ్‌లు చేస్తున్నారని అన్నారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతోంది. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతాను. దళితులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతానని కేసీఆర్ గట్టిగా ఉన్నాడు.‌ ఆయన ఎలాగూ చావడు. నేనైనా చచ్చిపోతానని మోత్కుపల్లి అన్నారు. తన పెద్దన్న కేసీఆర్ మాటకు విలువే లేదన్న మోత్కుపల్లి మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అన్నారు. తమ ఇద్దరకీ మాటలు లేకున్నా.. దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్లానని, దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్‌ను సమర్థించాని అలా సమర్థించి తప్పు చేశానని అన్నారు.


TS POLLS: తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్లకు కోట్లు

తెలంగాణ శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం 300 కోట్లు దాటింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈ నెల 9 నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, కానుకల విలువ 307 కోట్ల రెండు లక్షలకుపైగా ఉన్నట్లుతెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గత 24 గంటల్లో 9.69 కోట్ల నగదు పట్టుబడగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు 105.58 కోట్ల రూపాయలు. గత 24 గంటల్లో కోటీ 35 లక్షల విలువైన మద్యం పట్టుబడగా స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ 13.58 కోట్లు. 24 గంటల్లో 72 లక్షల విలువైన..232 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పటి వరకు మొత్తం 15.23కోట్ల విలువైన..3వేల 672 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం విలువ..145.67 కోట్ల రూపాయలు. 26.93 కోట్లు విలువైన ఇతర కానుకలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

LOKESH: సైకో పాలనలో సైకిల్‌ తొక్కినా నేరామేనా

శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల చొక్కాలు విప్పించి దాడికి పాల్పడటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని లోకేశ్‌ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ACB COURT: ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజుకు రెండు సార్లు లీగల్‌ ములాఖత్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రోజుకు 3సార్లు లీగల్‌ ములాఖత్‌ ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిగింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతున్నందున పిటిషన్లపై ఆయనతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ములాఖత్‌ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుతో రోజుకు రెండు సార్లు లీగల్‌ ములాఖత్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Poland: బొమ్మలా నిలబడి జువెలరీ షాపులో  చోరీ!

పోలాండ్‌లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. వార్సా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇప్పటి వరకు చాలా వెరైటీ దొంగతనాలు చూసాం అందులో ఇది ఒక వింతైన రకం.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు  ఓ షాపింగ్ సెంటర్‌లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకుండా మెదలకుండా ఉండిపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.

షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా  తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత రోజు చక్కగా కస్టమర్స్ అందరితోనూ కలిసి బయటకు వెళ్ళిపోయాడు. దారిలో  ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ అతని లక్ కలిసిరాక  సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు మరో షాపింగ్ సెంటర్‌లో కూడా ఇలాగే చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.

INDRAKEELADRI: సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.


భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే అంచనాతో అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు.


భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా పోలీసులు నిషేధించారు. 

TSLPRB: కానిస్టేబుళ్ల నియామకానికి బ్రేక్‌

తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సాగుతున్న అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షల నిర్వహణను నిలిపివేశారు. ఈ మేరకు పోలీస్‌ కమిషనర్లకు, ఎస్పీలకు పోలీస్‌ నియామక మండలి సూచన చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించి శిక్షణకు పంపించేందుకు మండలి సన్నాహాలు చేస్తోంది.


అయితే తుది ఎంపిక సరిగా లేదని పలువురు అభ్యర్థులు కొద్దిరోజుల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కేసు వేశారు. ఈ క్రమంలో అభ్యర్థులకు నాలుగు మార్కులను కలిపిన అనంతరం మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెలువరించాలని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. అయితే మార్కుల్ని కలిపే ప్రక్రియపై కసరత్తు చేయకుండా పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో మండలి ఈనెల 4న వెలువరించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

SC: చంద్రబాబును అప్పటివరకూ అరెస్ట్‌ చేయొద్దు

ఫైబర్ నెట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

VJA: అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు

విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.


అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు,వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు అమ్మవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SKILL CASE: చంద్రబాబు కేసులో నేడు సుప్రీంలో తుది వాదనలు

తనపై నమోదుచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనలు పూర్తికానందున విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్‌రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్‌ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా చెబుతుందా? అన్నది తేలుతుంది. హైకోర్టులో తాను దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత, ధర్మాసనం ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కేసును విచారించనుంది.


TELANGANA: 17 కిలోల బంగారం, 2 కోట్లు స్వాధీనం

హైదరాబాద్‌ మియాపూర్‌లో భారీగా బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.


ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వనస్థలిపురంలో ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపుర్‌లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. రూ.32 లక్షల నగదు పట్టుబడింది.

MP Assembly Polls :  ఓటర్‌లకు స్వీట్‌ ఆఫర్‌.. ఎక్కడంటే .. ?

సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఓటర్లు మాత్రం ముఖ్యంగా ఆడవాళ్లు  ఇంట్లో పని  చూసుకొని టిఫిన్లు చేసి , వంట కూడా ముగించుకొని తీరిగ్గా 10 గంటలు దాటాక పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతుంటారు. అందుకే ఓటింగ్‌ మొదలు కాగానే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలు వచ్చేలా చేసేందుకు ఓ ఫుడ్‌ హబ్‌ వినూత్న ఆఫర్‌ చేసింది. ఉదయం తొమ్మిది గంటల లోపు ఓటు వేయటానికి వచ్చిన వాళ్లకు పోహా, జిలేబీలు ఫ్రీగా ఇస్తామని ఇండోర్‌లోని ‘56 దుకాణ్‌’ యజమానుల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్‌ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. దాంతో నవంబర్‌ 17న ఉదయం తొమ్మిది గంటలలోపు ఓటువేసి వచ్చిన వాళ్లకు ఫ్రీగా పోహా, జిలేబీలను ఇస్తామని ‘56 దుకాణ్‌’ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుంజన్‌ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి పోహా, జిలేబీలను ఇస్తామని తెలిపారు. ఈ ఆఫర్ నవంబర్ 17 ఉదయం 9గంటల వరకు మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు.

AP Highcourt: అమరావతి అసైన్డ్ భూములపై విచారణ వాయిదా

అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ వచ్చే నెల 1కి వాయిదా పడింది. అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలన్న C.I.D. పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ధర్మాసనం పరిశీలించింది. కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు ఆడియో ఫైల్స్ ను అందించారు. రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని తెలిపారు. సీఐడీ పిటిషన్ విచారణపై మాజీమంత్రి నారాయణ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు. తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్నారు . వేరే కేసులోని ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. కేసు రీఓపెన్ కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న ధర్మాసనం... విచారణను వచ్చేనెల 1కి వాయిదా వేసింది. ఇదే కేసులో మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ పై విచారణను నవంబర్ 1కి ధర్మాసనం వాయిదా వేసింది