- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విజయవాడ చిట్టినగర్‌లో కేశినేని చిన్ని ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. భారీ ఎత్తున పేద ప్రజలు తరలివచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని కేశినేని చిన్ని ఆరోపించారు. పేదవాడికి కూడు, గూడు, విద్య, వైద్యం అన్న ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడమే తన లక్ష్యమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. కుక్కునూరు మండలం రాచకుంట వద్ద వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై మహిళలు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన బాధితులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. పునరావస కేంద్రంలో సౌకర్యాలు లేవని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని అవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే బాలరాజుతో వాగ్వావాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది

బీజేపీ జాతీయ కార్యవర సభ్యుల జాబితా విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన లిస్ట్ లో బండి సంజయ్‌కి ప్రమోషన్ ఇస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులతో కొత్త జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి డీకే అరుణ ఉపాధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. అటు ఏపీ నుంచి కూడా సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతారు.

ఖమ్మంలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్‌తో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా మున్నేరు వాగుకు వరద వచ్చిందన్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇక్కడ నిర్మించాల్సింది కరకట్ట కాదని.. ఆర్‌సీసీ వాల్ నిర్మించాలన్నారు. 146 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో అది తామే నిర్మిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

నల్గొండకు చెందిన రాజకీయ నేత రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభ్ రెడ్డిపై హత్య కేసు నమోదు అయ్యింది. భార్యను హత్య చేసినందుకు గానూ నిందితుడిపై సెక్షన్ 201, 302 కింద నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో నివాసం ఉంటోన్న వల్లబ్ రెడ్డి పెళ్లైన ఏడాదికి భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకుబడితో హత్య కేసు నుంచి తప్పించుకునేదుకు గుండెపోటుగా చిత్రీకరించాడు. అయితే పోస్టు మార్టం రిపోర్టులో వాస్తవాలు బయటకు రావడంతో నిందితుడిని కటకటాల్లోకి పంపారు.

నెల్లూరు బారాషాహీద్ రొట్టేల పండుగ ఘనంగా ప్రారంభమైంది. జిల్లాకే విశిష్టతను తెచ్చిన వైవిధ్య ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్ర నలుమూలల నుంచేకాదు దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాకు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల రొట్టెల పండుగ ప్రతి ఏటా మొహర్రం నెల ప్రారంభమైన తర్వాత వచ్చే పదకొండో రోజు నుంచి మూడ్రోజులపాటు జరుగుతుంది. అయితే భక్తులు విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం రొట్టెల పండుగను మూడు నుండి ఐదు రోజులకు పెంచింది.

ఖమ్మం జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.వైరా నుంచి భద్రాచలం వరకు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యం వల్లే పలువురు మరణించారని అన్నారు.పాలనను గాలికి వదిలేశారని,ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ అవసరాలకు వాడుకోవడం వల్లే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. వర్షం ప్రభావంతో గతుకులతో పాటు, కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. నాలాల కోసం జీహెచ్‌ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగు నీటి పైపులైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. నాగోల్, సరూర్‌నగర్, యూసఫ్‌గూడ, బోరబండ, కృష్ణానగర్, గాజుల రామారం, కూకట్‌పల్లి సహా శివారు మున్సిపాలిటీల్లోని రోడ్లు మురికి కుంటలను తలపిస్తున్నాయి. నాసిరకం రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ సర్కార్‌పై టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫైరయ్యారు. జగన్ సర్కార్ పేదలకు విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను అమ్మకానికి పెట్టారని విమర్శలు గుప్పించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ సర్కార్ స్కామ్‌ల మయంగా మారిందన్నారు. వైసీపీ నేతలు జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ నుంచి భారీగా వరదనీరు ఉమ్మడి కృష్ణా జిల్లాను ముంచెత్తుతుంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా లో భారీగా పంటనష్టం ఏర్పడింది.నందిగామ మండలంలో దాదాపు 700 ఎకరాల్లో పంట దెబ్బతింది.మున్నేరు పరివాహక ప్రాంతంలో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో మోటార్లు,పైపులు దెబ్బతిన్నాయి. పూర్తిగా మట్టి మేటవేసింది. ఎకరాకు 25 వేల రూపాయల ఖర్చు పెట్టిన రైతులు.. మళ్లీ తమ చేలను బాగుచేసుకునేందుకు అదనపు ఖర్చు చేయాలని ఆందోళనలో ఉన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోని, సాయం చేయాలని కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా రూరల్ మండలం మున్నేరు వరద ముంపుకు గురైన కాలనీల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. జలగం నగర్, ఆర్టీసీ కాలనీ, కేబీఆర్ నగర్ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అధికారులు ఆ ప్రాంత వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్లకు చేరుకున్న వారు పరిస్ధితిని చూసి కంటతడి పెట్టారు. ఇళ్లలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి తడిచిపోయి నిరుపయోగంగా మారాయి. వరదకు కాలనీల్లోని రోడ్లు కూడా ధ్వంసమయ్యారు. వరదలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కృష్ణా జిల్లా పామర్రులో పంటపొలాలు నీట మునిగాయి. దాదాపు 3వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్త లేకపోవడంతోనే పంటపొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి 10వేల నుంచి 15 వేల రైపాయల వరకు నష్టం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లలో పంటపొలాలు మునగడం ఇదే ప్రథమం అని వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని,సబ్సిడితో విత్తనాలు అందించి,వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.

వరంగల్ వరద ముప్పులోనే ఉంది. భద్రకాళి చెరువుకు గండి పడడంతో లోతట్టు ప్రాంతాల వాసులు భయాందోళనలో ఉన్నారు. పోతన నగర్ వైపు కట్ట కోతకు గురవడంతో.. భద్రకాళి చెరువులోని వరద నీరు ఉధృతంగా బయటి వెళ్తోంది. దీంతో పోతన నగర్, సరస్వతి నగర్ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. వర్షం లేకపోయినప్పటికీ.. భద్రకాళి చెరువుగా భారీగా వరద నీరు వస్తోంది. చెరువుకు వరద పోటెత్తడంతో కట్ట కోతకు గురైంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడీ ఆఫీస్‌కు పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. కవిత పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్ వేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రీ జాయిండర్ దాఖలు చేయాలంటూ కవితకు ఆదేశాలు జారీ చేసింది. తనను ఈడీ ఆఫీస్‌కు పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఆగస్ట్ 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాల సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. సోమవారం కేబినెట్ భేటీ జరగనుంది. వర్షాలు, వరదలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రధానంగా ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం కానునున్నాయి. పలు బిల్లుల ఆమోదంతోపాటు విధానపరమైన నిర్ణయాలను శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఆగస్ట్ 3న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. విశాఖలో ఉవ్వెత్తున నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. జోగి రమేష్ బీసీల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఊహించని స్థాయిలో వరదలొచ్చినా ప్రాణనష్టాన్ని నివారించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. భద్రాచలంలో 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. మున్నేరు చరిత్రలో ఇంతటి వరద ఉధృతిని ఎన్నడూ చూడలేదన్నారు. వరద ఎంత వేగాంగా వచ్చిందో...అంతే వేగంగా వెళ్లిందని మంత్రి తెలిపారు. వరదల సమయంలో జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బాగా పనిచేశాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న చివరి వ్యక్తికి వరకు రక్షించినట్టు పువ్వాడ అజయ్ వివరించారు.

గుడివాడ నియోజకవర్గంలో వరద బాధితుల్ని పరామర్శించారు టీడీపీ నేత వెనిగండ్ల రాము. నందివాడ మండలం వెన్ననపూడి ఎస్సీ కాలనీలో పర్యటించారు. మోకాళ్ల లోతు నీటిలో జీవనం సాగిస్తున్న గ్రామస్తులను చూసి ఆయన చలించిపోయారు. గ్రామస్తులు దుస్థితిని ఎమ్మార్వోకు వివరించారు. వెనిగండ్ల రాము, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎమ్మార్వో భావన్నారాయణ పర్యటించి పరిశీలించారు. కాలనీ వాసులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు.

కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు అధికార పార్టీ నేతలు టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మర్రిపాక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారిని జ్యోతుల నెహ్రూ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీని గెలిపించుకుని తప్పు చేశామని వారు తెలిపారు. చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఇంటికి వెళ్లినా నాలుగేళ్లలో ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

నిజామాబాద్ జిల్లాలో వేణు మాల్‌లో షోరూమ్ ఓపెనింగ్ కు సినీతార హిమజ హజరయ్యారు. అధునాతన హంగులతో ఏర్పాటైన స్టోర్ లో వస్తువుల్ని ఆమె పరిశీలించారు. మినీ సో స్టోర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని హిమజ తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 60 రకాల వెరైటీలు ఉన్నాయని నిర్వాహకులు భాస్కర్ తెలిపారు. త్వరలోనే పూణె, నాగ్‌పూర్ నగరాల్లో కూడా ఈ స్టోర్లు ప్రారంభిస్తామన్నారు.

మున్నేరు వరద ఉధృతి కొంత తగ్గడంతో ఖమ్మం వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పలు కాలనీల్లో వరదలో మునిగిన ఇళ్లు బురదమయంగా మారాయి. ఇంట్లో ఉన్న సామాన్లు నీటిలో తడిసి పనికిరాకుండాపోయాయి. ప్రధానంగా మంచికంటి నగర్‌ను వరద అతలాకుతలం చేసింది. బురదమయంగా మారిన ఇళ్లను శుభ్రం చేసుకోలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు. వరదపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదని దీంతో కట్టుబట్టలతో మిగిలామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో ఆస్తినష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

ములుగు జిల్లాలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. కనీవినీ ఎరుగని వరదలు 15 మంది ప్రాణాలు తీశాయి.. జిల్లావ్యాప్తంగా 15 మంది వరదల్లో గల్లంతు కాగా.. ఇప్పటిదాకా 9 మృతదేహాలు లభ్యమయ్యాయి.. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

కర్నూలు జిల్లా ఆదోనిలోని జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది. కాలనీలో మొత్తం పది వేల మందికి ప్రభుత్వం స్థలాలను మంజూరుచేసింది. లోతట్టు ప్రాంతం కావడంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి ముందుకురాలేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్మితమవుతోన్న ప్రభుత్వ వాటా లక్షా 50 వేలు, లబ్ధిదారుని వాటా 35 వేలు, ఉపాధి హామీ కింద 30 వేలు కలిపి మొత్తం 2 లక్షల 15 వేలు ఖర్చుచేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు లేఅవుట్‌లోని నిర్మాణాల్లోకి మోకాళ్ల లోతుకు నీరు చేరింది.

బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ శివారు లష్కర్‌గూడలో బూరను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో తమగ్రామాన్ని ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. దీంతో గ్రామంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ముంపు గ్రామాల్లో బూర నర్సయ్యగౌడ్ పర్యటించారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం నుంచే వాహనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. నందిగామ మండలం ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదు. తాగడానికి మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని వాహనదారులు వాపోతున్నారు.

హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో రాకపోకలు నిలిచిపోవడంతో.. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఆ మార్గాన్ని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, కోదాడ వద్ద మళ్లిస్తున్నారు. నార్కెట్‌పల్లి నుంచి అద్దంకి హైవే మీదుగా గుంటూరుకు పంపుతున్నారు. అలాగే కోదాడ నుంచి హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా అద్దంకి హైవే మీదకు పంపుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి రణరంగమైంది. గన్ పార్క్ నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ నేతలు గ్రేటర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వరదల్లో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హైదరాబాద్ వరద బాధిత కుటుంబహాలకు 10 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్లెంపల్లి ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువనున్న కడెం ప్రాజెక్ట్ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1.5 అడుగుల మేర 48 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు అధికారులు. బ్యాక్ వాటర్ వచ్చే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతుంది.ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 1.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రాజెక్ట్ లోకి ఇన్‌ఫ్లో 4500 క్యూసెక్కులు కాగా..అవుట్ ఫ్లో 4500 క్యూసెక్కులగా ఉంది. ఒక్క గేటు ఎత్తి తుంగ భద్ర నదిలోకి నీరు వదులుతున్నారు అధికారులు.

హైదరాబాద్ వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరి సర్కిల్‌లో పొంగిపొర్లుతున్న నాలాల్ని పరిశీలించారు. పొంగుతున్న నాలాలతో బస్తీల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సమస్యను పరిష్కరించాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. సమస్య తీవ్రతను వివరించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు.

హన్మకొండ 56వ డివిజన్ జవహర్ కాలనీ ప్రాంతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించారు. వరద ప్రవాహానికి కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరద బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాయలసీమ పర్యటన ఖరారైంది.ఆగస్టు 1 నుంచి సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈనేపధ్యంలో చంద్రబాబు పర్యటన వివరాలు తెలిపారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు.3న గండికోట రిజర్వాయర్ పరిశీలన,ఆగస్టు 4న కళ్యాణదుర్గంలో బైరవాని తిప్ప ప్రాజెక్ట్,పేరూర్‌లోని ఇతర ప్రాజెక్టులను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు.రాయలసీమ భవిష్యత్‌తో జగన్ ఆటలాడుకుంటున్నారని,కరువు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్ట్‌లను.ఆపేశారని మండిపడ్డారు కాల్వ శ్రీనివాసులు.

తమ జేబులు నింపుకోడానికి ఏపి పాలకులు పాకులాడుతున్నారని బిజేపి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. చేసిన అప్పులు, కట్టిన ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం అనధికారికంగా రూ. 4 లక్షల 74 వేల కోట్లు అప్పులు చేసిందని ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆమె ఆరోపించారు. విశాఖకు కేంద్ర ప్రభుత్వం లక్షా 57 వేల ఇళ్లు ఇచ్చిందని, ఏపిలో జగన్ ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
ఏపికి బీజేపీ ఏమీ చేయలేదనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వైజాగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ పెట్టిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆమె అన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేస్తే ఇక సామాన్యుల గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కరోనా సమయంలో శ్లాబులు మార్చి ప్రజలపై వెయ్యి 500 కోట్ల రూపాయల భారం వేసినట్లు ఆమె ఆరోపించారు.

తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరసన రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని VTPS గేటు ముందు విద్యుత్ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు పెండింగ్ డీఏ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంచెలంచెలుగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చెప్పారు. సమస్యలు పరిష్కారమవకపోతే ఆగష్టు 10నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఫిలిప్పీన్స్(Philippines )లో ఘోర పడవ(Boat Capsizes ) ప్రమాదం సంభవించింది. భీకర గాలుల వల్ల పడవ బోల్తా పడి 30 మంది(Nearly 30 Feared Dead) మరణించారు. మరో 40 మంది(40 passengers have been rescued )ని కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు. రైజాల్ ప్రావిన్సులో ఈ ఘోర ప్రమాదం( small boat capsized) జరిగింది. తెల్లవారుజాము ఒంటి గంటకు రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలోని లాగునా సరస్సులో పడవ ప్రయాణిస్తున్న సమయంలో భీకరమైన గాలులు వచ్చాయి. గాలులకు భయపడిన ప్రయాణికులు అందరూ బోటుకు ఒక వైపునకు చేరుకోవడంతో అది ఒక్కసారిగా బోల్తా పడింది.

పడవలో 70 మంది ప్రయాణిస్తుండగా అందులో 30 మంది మరణించారు. మరో 40 మందిని కోస్ట్‌గార్డ్ కాపాడింది. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై భిన్న స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ శివాలయంలో వింత చోటుచేసుకుంది. శివాలయంలో నందీశ్వరుడు నీళ్ళు తాగుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వింతను చూసేందుకు జనాలు ఆలయానికి క్యూ కట్టారు. తండోపతండాలుగా ఆలయానికి చేరుకుంటున్నారు. అత్తాపూర్ లోని చిన్న అనంతగిరిగా పిలుచుకునే శివాలయంలో నందీశ్వరుడు నీళ్ళు తాగడాన్ని గమనించిన కొందరు భక్తులు వింతను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో నందీశ్వరుడు నీళ్ళు తాగడం చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు అలయం వద్దకు క్యూ కట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


