చిట్టి న్యూస్

వర్షాలు లేక శ్రీరామ్ సాగర్‌..వెలవెల

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశ పరుస్తున్నాయి. తెలంగాణలో తక్కువ వర్షా పాతం నమోదు కావడంతో జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి.నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్ సాగర్‌ ప్రాజెక్టు పరిస్థితి మరీ దారుణంగా మారింది. గతేడాది ఇదే సమయంలో నిండు కుండలా ఉన్న ప్రాజెక్టు ఈ సారి వర్షాలు లేకపోవడంతో వెలవెలబోతుంది.

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఆదిలాబాద్‌లోని రవీంద్రనగర్‌ కాలనీవాసులుగా గుర్తించారు.

JADA SRAVAN: అమరావతిలో పాదయాత్ర..

జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ అమరావతిలో పాదయాత్ర చేస్తున్నారు. తుళ్లూరు నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. రాజధాని కోసం ఎకరం లోపు భూములు ఇచ్చిన వారందరూ బడుగు బలహీన వర్గాల వారేనన్నారు. ఈ వ్యవహారం నేటికి న్యాయస్థానంలో ఉందని,రాజధాని పేదల భూముల్లో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ళు నిర్మించడం వారిని మోసం చేయడమేనన్నారు. బలహీన వర్గాల రైతులకు మద్దతుగా పాదయాత్రకు ఎన్నిసార్లు కోరిన అనుమతి నిరాకరించారని దీంతో న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకున్నామన్నారు. 

KRISHNA: కృష్ణా జిల్లాలో ఏసీబీ సోదాలు..

ఏపీలో పలుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీవో పాయింట్ వద్ద ఏసీబీ దాడులు చేశారు. గన్నవరంలోని లక్ష్మి కాటా దగ్గర ఆర్డీవో అధికారులు చెక్‌పోస్ట్ పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడకు అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్పేహిత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. అటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తంపురంలోనూ ఏసీబీ రైడ్స్‌ జరిగాయి.టోల్‌ ప్లాజాలో పలు రికార్డులు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

INDIAN ARMY: తూర్పు లడఖ్‌లో సైనిక విన్యాసాలు

భారత సైన్యం తూర్పు లడఖ్‌లో సైనిక విన్యాసాలు చేపట్టింది. ఆధునిక T-90, T-72 ట్యాంకులు, BMP వాహనాలతో విన్యాసాలు చేపట్టింది. ప్రపంచంలోని ఎత్తైన నదీ లోయలలో పెద్ద సంఖ్యలో ట్యాంకులు, సాయుధ వాహనాలతో ఈ విన్యాసాలు చేపట్టడం విశేషం.16,000 అడుగుల ఎత్తులో భారీగా యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు చేపట్టిన ప్రపంచంలోని అతికొద్ది సైన్యాలలో ఇండియన్‌ ఆర్మీ ఒకటి.చైనా దళాలకు ధీటుగా భారత సైన్యం సైతం యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట వాహనాల్ని మోహరిస్తోంది.

YUVAGALAM:  లోకేష్ పై అదిరిపోయే పాట..

అలుపెరగకుండా సాగుతున్న నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర జనాల్లో స్ఫూర్తి నింపుతోంది. 150 రోజులుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూల్‌ నుంచి నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఈ యాత్ర 2 వేల కి.మీలకు చేరువయ్యింది. ఈ సందర్భంగా జనం జనం జనంలో రాజకీయ రణంలో అంటూ ఓ పాటను విడుదల చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో పాట విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి కేఎస్‌ జవహర్, పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. 

AMARAVATHI: 1300 రోజులకు చేరిన రైతుల ఉద్యమం

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం ఇవాల్టితో 13 వందల రోజులకు చేరింది. ఇన్ని రోజులుగా చేస్తున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను దేవుడికి చెప్పుకునేందుకు అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి దుర్గగుడి, మంగళగిరిలోని పానకాల స్వామి ఆలయానికి వెళ్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ మొండిగా ఉందన్న మహిళా రైతులు సీఎం జగన్‌ మనసు మారాలంటూ దేవుళ్లను వేడుకుంటున్నామన్నారు.  

WB: హింసాత్మక ఘటనల మధ్య పంచాయితీ పోలింగ్‌

హింసాత్మక ఘటనల మధ్య పశ్చిమబెంగాల్లో పంచాయితీ ఎన్నికలు పోలింగ్‌ ప్రారంభమైంది.22 జిల్లా పరిషత్‌లు, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు ప్రతినిధుల్ని ఎన్నుకోనున్నారు.5 కోట్ల 67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో హింస చెలరేగడంతో ఇప్పటికే 19 మంది చనిపోయారు.

నిఘా నీడలో.. ఓరుగల్లు..

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంతో ఓరుగల్లు నిఘా నీడలో వెళ్లింది.వరంగల్ వ్యాప్తంగా పోలీసులు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు.10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రధాని భద్రత కోసం ఎస్‌పీజీ, ఆక్టోపస్‌, సీఆర్‌పీఎఫ్‌, ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.ప్రధాని వెళ్లే భద్రకాళీ ఆలయంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 20 కిలోమీటర్ల వరకు నోఫ్లైజోన్‌గా ప్రకటించారు.144 సెక్షన్ విధించారు.వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.ప్రధాని మోదీ పర్యటనలో ప్రతి కిలోమీటర్‌కు ఒక అదనపు ఎస్పీ బందోబస్తును పర్యవేక్షిస్తుంటారు.ప్రధాని రాక నేపథ్యంలో వరంగల్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు.

BRS: మోదీ రాకపై మాటల తూటాలు

ఓరుగల్లు వేదికగా తెలంగాణలో రాజకీయ పోరు మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ మాటల తూటాలు పేల్చుతోంది. ప్రధాని టూర్‌లో అధికారిక కార్యక్రమాలు కూడా ఉన్నా హాజరుకాకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది. మోదీ తెలంగాణ పర్యటనను బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రధాని మోదీ అవమానించారని ఇపుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే మోదీ తెలంగాణపై వ్యతిరేకత చూపించారనిఆరోపించారు.మోదీ, బీజేపీని రేవంత్‌రెడ్డి ఎందుకు విమర్శించడం లేదన్నారు. గాంధీ భవన్‌లో గాడ్సే దూరాడంటూ రేవంత్‌పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

మోడీ సభ... వరంగల్‌లో టైట్ సెక్యురిటీ

వరంగల్‌లో కుక్కల వేట చేపట్టారు సిబ్బంది. బీజేపీ బహిరంగ సభ జరగనున్న ప్రాంగణంలోకి కుక్కలు చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో డాగ్‌ క్యాచ్‌ బృందాల్ని రంగంలోకి దిగారు. కుక్కలను పట్టుకొని తరలించారు. టైట్ సెక్యూరిటీ ఉన్న సభా ప్రాంగణంలోకి కుక్కలు రావడంతో అంతా అవాక్కయ్యారు.

శాకంబరీ అలంకరణలో శ్రీ ఒనువులమ్మ అమ్మవారు

ఆషాడమాసం సందర్భంగా రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలోని, తొర్రేడు గ్రామ దేవత శ్రీ ఒనువులమ్మ అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి గర్భాలయం సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయ కమిటీ సభ్యులు. సుదూరు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

లాల్‌ దర్వాజ బోనాలు ప్రారంభం

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో లాల్‌ దర్వాజ బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని, మహాంకాళీ అమ్మవారి శిఖర పూజా, ద్వజారోహనంతో పాతబస్తీలో బోనాల సందడి మొదలైయింది. శిఖరపూజలో సీపీ ఆనంద్‌ పాల్గొన్నారు. ప్రతీ ఏడాది ఆనవాయితీగా శిఖరపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సీపీ ఆనంద్‌. ఓల్డ్‌ సిటీలో బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సీపీ ఆనంద్‌. జూలై 17న భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది.

డ్రగ్‌ ట్రాఫికింగ్‌ ను ఛేదించింది నార్కోటిక్‌  వింగ్‌

అంతర్జాతీయ డ్రగ్‌ ట్రాఫికింగ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించింది నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌. ముగ్గురు నైజీరియన్‌ డ్రగ్‌ సప్లయర్స్‌తో పాటు ఓ పెడ్లర్‌ను అరెస్ట్‌ చేశామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన కొకైన్‌, MDMA సీజ్‌ చేశామని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఓటర్‌ జాబితా  అక్రమాలపై  టీడీపీ సీరియస్


ఓటర్‌ జాబితాలోని అక్రమాలపై టీడీపీ దృష్టి సారించింది. అదేవిధంగా పార్టీ చేపట్టిన ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై వర్క్‌షాపు కొనసాగుతుంది. కాసేపట్లో ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల వ్యవహారం.. ఓట్ల తొలగింపు, ఓటరు జాబితాలోని అవకతవకలపై చర్చించనున్నారు. తర్వాత నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు తొలగించడంపై సమీక్షిస్తారు. ఓటరు జాబితాల్లో వైసీపీ అక్రమాలపై పోరాటానికి.. అవకతవకలను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.  

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్

రేపటి మోదీ తెలంగాణ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారన్నారు. విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని మోదీ.. ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ ప్రశ్నించారు.

వారం గడిచినా రాయలసీమలో వర్షాలు లేవు

వారం గడిచినా రాయలసీమలో వర్షాలు కురవడం లేదు. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తొలకరికి వేసిన పంటలన్నింటినీ రైతులు దున్నేశారు. వర్షాలు కురిస్తే తప్ప ప్రత్యామ్నాయ పంటలు వేయలేమంటున్నారు. ఎకరాకు 30 నుంచి 40 వేల దాకా నష్టం జరిగిందంటున్న రైతులను ఆందోళన చెందొద్దంటున్నారు బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.ఆగష్టు మొదటి వారం వరకూ పత్తి, ఆముదంతో పాటు కొర్రలు వేసుకోవచ్చని అన్నదాతలకు సూచనలు చేస్తున్నారు. పత్తి మొక్కలను బతికించుకోవాలంటే ఫార్ములా 4, ఫార్ములా 6 పిచికారి చేయాలని శాస్త్ర వేత్తలు సూచించారు. 

గోటి తలంబ్రాల సాగు ప్రారంభం

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాల సాగు ప్రారంభమైంది. ఆ విత్తనాలకు రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 ఏళ్లు గా శ్రీరామనవమికి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలను సమర్పిస్తోంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం. ఎంతో నియమ నిష్టలతో సాగు చేస్తారు. ఈ విత్తనాలను ప్రత్యేక కలశాల్లో ఉంచి ఊరేగింపుగా భద్రాచలం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంట పుట్టిస్తున్న  కూరగాయల ధరలు


దేశంలో కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో టమోటా ధర 150 రూపాయలు క్రాస్‌ అయ్యింది. ఇక ఖమ్మంలో పచ్చి మిర్చి రేట్లు భగభగమంటున్నాయి. బీరకాయ, బీన్స్, వంకాయ, అల్లం, వెల్లులికి సైతం రెక్కలు వచ్చాయి. పెరిగిన ధరల కారణంగా రైతు బజార్‌కు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.

టీడీపీలోకి జగన్ సొంత జిల్లా నేతలు

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరనున్నారు ముస్లిం, ఆర్యవైశ్య నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. అలాగే వైసీపీ మాజీ మున్సిపల్ ఛైర్మన్ పాణ్యం సావిత్రమ్మ కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక వైశ్య సామాజిక వర్గ నేత రవీంద్ర,అతని అనుచరులు కూడ టీడీపీ లో చేరనుండటంతో ప్రొద్దుటూరు నియోజక వర్గ టీడీపీ జోష్‌ నెలకొంది.టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో 150 కార్లలో అమరావతి బయలుదేరారు ముస్లిం నేతలు, కార్యకర్తలు.

సర్వీస్ రివాల్వర్ తో  ప్రాణాలు విడిచిన డీఐజీ విజయ్ కుమార్

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని తమిళనాడుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. డీఐజీ ర్యాంకుకు చెందిన విజయ్‌ కుమార్‌ తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు. కోయంబత్తూర్‌ సర్కిల్‌లో డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. తీవ్ర ఒత్తిడే ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం కోసం కోయంబత్తూర్‌ మెడికల్ కాలేజ్‌ హాస్పిటల్‌కు మృతదేహాన్ని తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి విజయ్‌ కుమార్‌ డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు.

AP: కేతిరెడ్డి పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌

కేతిరెడ్డి పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.గుడ్ మార్నింగ్ పేరుతో..షో చేస్తున్నాడని,గుడ్‌ మార్నింగ్ పేరుతో ధర్మవరం ప్రజల ఆస్తులను..కేతిరెడ్డి దోచుకుంటున్నారని మండిపడ్డారు.క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో..లక్షలు కొల్లగొట్టారని ఆరోపించారు.తాడిపత్రి, ధర్మవరం ప్రజలకు పట్టిన దరిద్రం..కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు అన్న ప్రభాకర్‌ రెడ్డి.. తాడిపత్రి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని...ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే... తాను పోతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

విశాఖలో 2వేల నోట్ల ముఠా గుట్టురట్టు

విశాఖలో 2వేల నోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టు అయ్యింది. ఏఆర్‌ సీఐ స్వర్ణలత నాయకత్వంలో ముఠా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. 90లక్షల 500 నోట్లు ఇస్తే.. కోటీ రూపాయల 2వేల నోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇద్దరు రిటైర్డ్ నావెల్ ఆఫీసర్లను ఈ ముఠా మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏఆర్‌ సీఐ స్వర్ణలత ఓ హోంగార్డ్‌ కలిసి తో వ్యవహారాన్ని నడిపించినట్లు తెలుస్తోంది. హోంగార్డ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసును రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కదలిక.. దినేష్‌ అరోరా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. లిక్కర్‌ స్కాంలో సీబీఐ నమోదు చేసిన కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేష్‌ అరోరాను.. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అరెస్ట్‌ చేసింది. అరోరా ద్వారానే సౌత్‌ గ్రూప్‌ నుండి.. మనీష్ సిసోడియాకు ముడుపులు అందాయని అభియోగం ఉంది. మనీష్‌ సిసోడియాకు మరిన్ని చిక్కులు తప్పలా లేవు. లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో.. ఇప్పటికే అరెస్టయిన మనీష్ సిసోడియా.. బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

ఎమ్మెల్యే కోన రఘుపతి కోసం పేదల షాపులు తొలగింపు

బాపట్ల జిల్లాలో పేదల షాపులు తొలగింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్లలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద ఎమ్మెల్యే కోన రఘుపతి స్థలానికి దారి కోసం... బాబురావు అనే వ్యక్తికి చెందిన రెండు షాపులు తొలగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్వార్థం కోసం తమ షాపులను అన్యాయంగా తొలిగించారని బాధితులు కన్నీరుమున్నీరువుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న బాధితులు చెప్పారు. తాము 40ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని.. తమకు న్యాయం చేయాలని బాధితుల వేడుకుంటున్నారు. 

Yuvagalam: నెల్లూరు జిల్లా పాదయాత్రలో లోకేష్ సంచనల ఆరోపణలు

వివేకాహత్య కేసు ఎఫ్ఐఆర్‌లో భారతి పేరును సీబీఐ చేర్చిందని.. అందుకే ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ వెళ్లారని లోకేష్ ఆరోపించారు. కుటుంబం సభ్యుల పేర్లు తప్పించేందుకే జగన్ ఢిల్లీ టూర్ అంటూ మండిపడ్డారు. తమ పేర్లను చేర్చకుండా ఉండేందుకే జగన్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి హస్తిన వెళ్లారని లోకేష్ అన్నారు. బాబాయ్ మర్డర్ జగనాసుర రక్త చరిత్రగా పేర్కొన్న లోకేష్.. జగన్ శాశ్వతంగా ఇడుపులపాయ ప్యాలెస్‌కే పరిమతం అవుతారన్నారు.

Hyderabad: రన్నింగ్ బస్సులో మంటలు

హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేట సమీపంలో రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆర్టీసీ బస్సు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముందు భాగం పూర్తిగా దగ్ధం అయ్యింది. వెంటనే అప్రమత్తం అయిన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కీలక తీర్పు

ఇవాళ రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కీలక తీర్పు వెలువరించనుంది గుజరాత్‌ హైకోర్టు. మోదీ ఇంటి పేరు మార్పు వ్యాఖ్యల కేసులో సూరత్‌ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ..గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్‌గాంధీ. ఇవాళ 11 గంటలకు తీర్పు వెలువరించనున్నారు గుజరాత్‌ జస్టిస్‌. శిక్షపై గుజరాత్‌ హైకోర్టు స్టే ఇస్తే రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించుకునే అవకాశం ఉంది.

Guntur: బీభత్సం సృష్టించిన వైసీపీ నేత వాహనం

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో అతి వేగంతో వచ్చిన ఓ వైసీపీ నేత స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయినట్టుగా చెబుతున్నారు. ఈ వాహనం గుంటూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కళ్లెం హరికృష్ణ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. గతంలో పరిటాల శ్రీరామ్‌పై అనంతపురంలో వీడియో చేసిన  కల్లం హరికృష్ణ రెడ్డి. కంతేరులో జరిగిన దళితులపై దాడిలో కూడా ప్రధాన వ్యక్తిగా చెబుతున్నారు.

AP BJP: నడ్డాను కలిసిన పురందేశ్వరి

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిశారు ఏపీ నూతన బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం పట్ల నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై నేతలు చర్చించారు. భవిషత్తులో పార్టీ తరపున చేపట్టబోయే కార్యక్రమాలు తదితర అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన బాధ్యత, నిబద్దత గురించి నడ్డాకు వివరించినట్లు పురందేశ్వరి ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఏపీలో బీజేపీని బోలపేతం చేయడంతోపాటు ఆంధ్రుల ప్రయోజనాలు కాపాండేందుకు కృషి చేస్తానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

AP: అనిల్‌కుమార్‌ యాదవ్‌పై సోమిరెడ్డి ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు అసెంబ్లీలో ప్రమాణం చేస్తారని.. నీ ప్రమాణాలతో నువ్వు సచ్చిసీలుడివి ఐపోతావా అనిల్‌ అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. నువ్వు నిజాయితీపరుడివి అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకోవాలని.. లోకేష్ ఆరోపించిన వాటిపై మీ నిజాయితీ నిరూపించుకోవాలని అనిల్‌కు సవాల్‌ విసిరారు. మంత్రి కాకాణి, అనిల్‌ ఇద్దరూ ముఖ్యమంత్రి దగ్గర సీబీఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్‌ చేశారు.  

ధరణి ముసుగులో భారీ అవినీతి

ధరణి ముసుగులో భారీ అవినీతి జరిగిందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూముల్లో భయంకరమైన దోపిడీ జరుగుతోందన్న ఆయన.. ఏ భూమిని ఎవరి పేరు మీదైనా రిజిస్ట్రేషన్‌ చేయొచ్చన్నారు. ప్రభుత్వ భూములు, మన భూములు, ఆధార్‌, పాన్‌కార్డ్‌ వివరాలు.. విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తిపాస్తుల వివరాలు విదేశీయుల చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరం.. అత్యంత తీవ్రమైన నేరం అని రేవంత్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణిపై విచారణ చేయిస్తామని చెప్పారు.

AP: పరిహారం పరిహాసంగా మారింది

జగన్‌ ప్రభుత్వం వాతావరణ బీమా పథకం కింద రైతులకు అందిస్తున్న పరిహారం పరిహాసంగా మారిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విమర్శించారు.. రైతులకు అరొకర సాయం అందిస్తూ ప్రచార ఆర్భాటానికి పరిమితమైందని మండిపడ్డారు.. అనంతపురం జిల్లాకు కేవలం 213 కోట్లు మాత్రమే పంట బీమా కింద మంజూరు చేశారన్నారు.  రైతులకు అరొకర సాయం అందించేందుకు సీఎం జగన్‌ జిల్లాకు రావడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు..

TS: దళితుల్ని ధనికులుగా చేసేందుకే దళితబంధు

దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల్ని ధనికులుగా చేసేందుకు.. తెలంగాణలో దళితబంధు కార్యక్రమం చేపట్టామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. కుటీర వ్యాపార పథకం లబ్ధిదారులకు డీడీలు పంపిణీ చేశారు. దళితబంధు పథకం కింద మంజూరైన బస్సు, కాంక్రీట్‌ మిక్సర్‌లను కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో పథంలో దూసుకెళుతుందని కేటీఆర్‌ అన్నారు. సంపద సృష్టించేలా సిరిసిల్ల జిల్లాలో దళితబంధు యూనిట్‌ల గ్రౌండింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు దళితులకు ఏం చేశాయని కేటీఆర్‌ ప్రశ్నించారు.

BJP: మోదీ వరంగల్‌ సభ సక్సెస్‌ చేస్తాం

కనీవినీ ఎరుగని రీతిలో మోదీ వరంగల్‌ సభను సక్సెస్‌ చేసి తీరుతామని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మొదటిసారి ఓరుగల్లు గడ్డ మీదకు మోదీ వస్తున్నారన్నారు. ప్రజలకు తానున్నాననే భరోసా ఇవ్వడానికి ఆయన వరంగల్‌ వస్తున్నారని చెప్పారు. ఇక.. అసహనంతో కొంతమంది తమ పార్టీపై విషం కక్కుతున్నారని ఈటల మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ గెలుపునకు వ్యూహ రచన చేయాలని నడ్డాకు.. మోదీ సూచించారని.. కుటుంబ పాలనకు అంతం పలికేది బీజేపీనే అన్నారు.

T PCC: వజ్రేష్ యాదవ్ మంత్రి మల్లారెడ్డిపై ఫైర్..

టీపీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తెల్లవారుఝామున ల్యాండ్‌లోకి ప్రవేశించిన పోలీసులు కంటైనర్‌ను తొలగించడమే కాకుండా ప్రహరీ గోడను కూల్చివేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్న తమను పోలీసులు బలవంతంగా బయటకి పంపారన్నారు. కోర్టు ఉత్తర్వులు కూడా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్‌లో ఉన్న తన మూడు ఎకరాల భూమికి పాస్‌బుక్‌తో పాటు రైతుబంధు కూడా వస్తుందని తోటకూరి వజ్రేష్ యాదవ్ వెల్లడించారు.