- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్ ఉప్పల్‌లోని స్కై వాక్‌ను రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 25 కోట్ల వ్యయంతో HMDA దీన్ని నిర్మించింది. 36 పిల్లర్లు ఉండగా.. 660 మీటర్ల పొడవుతో నిర్మాణం జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు చుట్టూ.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా స్కై వాక్ నిర్మించారు. 6 చోట్ల స్కై వాక్ ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ఎస్కలేటర్స్, మెట్లు, లిఫ్టులు ఉన్నాయి. నేరుగా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లే వీలుంది. ఈ స్కై వాక్ వందేళ్ల పాటు సేవలు అందించనుంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్‌లో పలువురు ప్రముఖులను కలిశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో నడ్డా సమావేశమయ్యారు. టోలిచౌకిలోని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి స్వయంగా వెళ్లిన నడ్డా ప్రత్యేకంగా అరగంటపాటు సమావేశమయ్యారు. నడ్డా వెంట కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులున్నారు. బీజేపీ 9 ఏళ్ల పాలనలో సాధించిన పురోగతి, తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు అందజేశారు నడ్డా.

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంలో దళితులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్న కాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టామా కేర్ సెంటర్ నిర్మాణం పేరుతో తమ భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. స్థలం పరిశీలించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. కొలతలు వేయనీయకుండా ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అధికారులకు అడ్డుపడితే కేసులు పెడతామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్ భారతి, ఎంపీటీసీ నారాయణ స్వామి పాల్గొనకుండా ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి షాక్ ఇచ్చారు. అంతేకాదు.. హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి రాకను నిరసిస్తూ గౌనూరు ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక కాపు రామచంద్రారెడ్డి అయోమయస్థితికి చేరుకున్నారు.

హైదరాబాద్‌లో బిల్డింగ్‌ను పైకి లేపే ప్రయత్నం విఫలమైంది. హైడ్రాలిక్ జాకీతో బిల్డింగ్‌ను పైకి లేపేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ప్రయత్నం ఫెయిల్ కావడంతో భవనం కుంగిపోయి మరో ఇంటిపైకి ఒరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కుత్బుల్లాపూర్ చింతల్‌లో ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ పరిస్థితిని కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు నేలమట్టం చేయాలా లేక జాకీల సహాయంతో సరిదిద్దాలా అని తర్జనభర్జన పడ్డారు. చివరికి రేపు బిల్డింగ్‌ను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.

పల్నాడు జిల్లా టీడీపీ దూకుడు పెంచింది. టీడీపీ మేనిఫెస్టో, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలతో స్పీడు పెంచింది. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము నరసరావుపేటలో కాఫీ విత్ నల్లపాటి, బ్రేక్ ఫాస్ట్ విత్ నల్లపాటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో ఏపీకి జరిగిన నష్టంతో పాటు చంద్రబాబు వస్తే టీడీపీ చేపట్టే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.

బాపట్ల జిల్లా వైసీపీ నేత ఇంట్లో భారీగా ఢిల్లీ మద్యంను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కర్రపాలెం మండల వైసీపీ నేత కప్పల నారాయణ రెడ్డి ఇంట్లో 227 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షా 36 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఢిల్లీలో 130 రూపాయలకు కొని ఏపీలో ఆరు వందల రూపాయలకు అమ్ముతున్న ముఠాను కాపు కాసి పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఢిల్లీలో తక్కువ ధరకు మద్యాన్ని కొని స్థానికంగా ఎక్కువ రేటుకు అమ్ముతూ లాభం పొందుతున్నారు వైసీపీ నేతలు

సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల్లో మరోసారి చురుకుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బండ్ల గణేష్ ఆ పార్టీ ఓటమితో ఢీలా పడ్డారు. ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా సైలెంట్ అయ్యారు. తాజాగా రాజకీయాల్లో స్పీడు పెంచుతున్నారు బండ్ల గణేష్. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెళ్లడించారు. అన్నా సూర్యాపేట వస్తున్నా అటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. మీ అద్భుతమైన పాదయాత్రలో పాలు పంచుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మెస్సీ అన్నా ఆయన పేరు విన్నా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఊగిపోతారు. కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. యువకులు, చిన్నారులు అర్జెంటీనా జట్టు జర్సీ వేసుకుని మెస్సీ కటౌట్ కట్టి కేక్ కట్ చేసి తమ అభిమాన ఆటగాడు మెస్సీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

రష్యాపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు.. అధ్యక్షుడు పుతిన్ స్వయంకృతాపరాథమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఛీప్ ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటనతో పుతిన్ చాలా భయపడ్డాడని ఎద్దేవా చేశారు. వాగ్నర్ ముప్పును పుతినే సృష్టించుకున్నాడన్న జెలెన్‌స్కీ... కిరాయి సైన్యం ముందుకు సాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు ఎక్కడో దాక్కున్నాడని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్ స్కీ.. రష్యా అత్యంత బలహీన పడిందని ఆరోపించారు.

మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ యువనేత నారా లోకేష్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే దమ్ములేక అనిల్ మాటల దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని స్పష్టంచేశారు. అనిల్ కుమార్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్నారు నెల్లూరు టీడీపీ నేతలు.

ఏపీలో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కంతేరు ఘటనపై డీజీపీకి లేఖ రాసిన ఆయన.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కంతేరు దళితులపై దాడికి పాల్పడిన వైసీపీ నేత కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు శామ్యూల్‌పై అత్యంత దారుణంగా దాడి చేయడం అమానుషమన్నారు. దాడి జరిగి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు నేరస్తులపై కేసు నమోదు చేయలేదని ఫైర్ అయ్యారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో వర్లరామయ్య కోరారు.

వెంకటగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విజయవంతంగా జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్. ఈ సందర్భంగా వెంకటగిరిలోని పార్టీ ఆఫీస్‌లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నారా లోకేష్‌కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. టీడీపీ నేతలమంతా కలిసి ముందుకు వెళుతున్నామని చెప్పారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. హుటాహుటిన ఢిల్లీ రావాలంటూ ఆదేశాలు అందాయి. దీంతో హైదరాబాద్‌లో ఇవాళ్టి కార్యక్రమాల్ని రద్దు చేసుకున్న కిషన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే హైకమాండ్ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు. పార్టీ వ్యవహారాలు సెట్ చేసే పనిలో హైకమాండ్ ఉంది.

శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీకి షాక్ తగలింది. తాళభద్రలోని 130 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, కూన రవికుమార్ కు పార్టీ కండువా కప్పి నాయకులను టీడీపీలోకి ఆహ్వానించారు. ఏపీలో రోజురోజుకు టీడీపీ హవా వీస్తోందని గౌతు శిరీష అన్నారు. నిరుద్యోగ భృతిపై మాట మార్చిన వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు.

అనకాపల్లి జిల్లాలో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర ప్రారంభమైంది. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం నుంచి ప్రారంభంకాగా అంతకుముందు రాచపల్లి జంక్షన్‌లో కామేశ్వరమ్మ దేవాలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు యాత్రలో ప్రతిభ భారతి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, కూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ యూనివర్సిటీలో మరో వివాదం మొదలైంది. పాలక మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 27నే రద్దు అయినప్పటికీ పాలకవర్గం గోప్యంగా ఉంచింది. దీంతో ఈసీ సమావేశాలు ఎలా నిర్వహించారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు సమావేశాలు జరిగినట్లు తెలుస్తుంది.

కర్నూలులో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉదయాన్నే రోడ్ల మీద వెళ్తున్న ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసిన స్నాచర్స్..మోటార్ బైక్స్‌పై వచ్చి.. ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో ఎటాక్ చేశారు. బుధవారపేట, కృష్ణానగర్‌లలో మహిళల మెడలోని చైన్లు లాక్కెళ్లారు. బాలాజీ నగర్‌లో మాత్రం మహిళ ప్రతిఘటించడంతో మెడలోని చైన్‌ను లాగేందుకు విఫలయత్నం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారాలతో చైన్ స్నాచర్స్ కోసం గాలిస్తున్నారు.

వర్తమాన రాజకీయాలను తన పేరడీ పాటతో చెడుగుడు ఆడేశారు సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. రాజకీయాల్లో దర్భాషలాడే నేతల్ని అసహ్యించుకున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం జై తెలుగు పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటించారు. నాయకులు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు ఆయన తెలిపారు. వర్తమాన రాజకీయాలపై తనదైన పేరడీ పాటతో విరుచుకుపడ్డారు.

మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్.. పలు అంశాలపై చర్చించారు. ఇవాళ కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్‌తో కేటీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంకా ఇవ్వలేదు. ఒక వేళ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే ఆయనతో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, సూరారం, కొంపల్లి, జీడిమెట్ల, జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. ఇక నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తుకు సిద్ధమవుతోందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతున్న సమయంలోనే.. బీజేపీ మంత్రుల్ని కేటీఆర్ కలవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్నారు. లిక్కర్ కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ఈడీ అరెస్ట్ చేయలేదన్నారు. పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పారు.

తెలంగాణ బీజేపీ చేపట్టిన "ఇంటింటికీ బీజేపీ" కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మోదీ పాలనలో దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందిదని చెప్పారు. ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు.

సీఎం జగన్ పాలన తీరుపై మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా నూతలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా.. మోసం చేయడమే జగన్ నైజమన్నారు. సంపద దోచుకోవడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. 175 సీట్లను దొడ్డి దారిన గెలవాలని చూస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ రన్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఒలింపిక్ చైర్మన్ వేణుగోపాల చారి, స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. స్టూడెంట్స్, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల్లో క్రీడా స్ఫూర్తి నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి.

ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజీ.. బిజీగా గడుపుతున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్‌లో స్కైవేల నిర్మాణంపై చర్చలు జరిపారు. స్కైవేల నిర్మాణానికి మౌలిక వసతులు కల్పించాలని..కేంద్రమంత్రిని కోరారు. మెహదీపట్నంలో నిర్మించబోయే స్కైవే కోసం అర ఎకరం స్థలం కావాల్సి ఉందని,కేంద్రం ఇస్తుందని నమ్మకం లేకపోయినా రాష్ట్రం కోసం మా ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్.

గుంటూరు కార్పొరేషన్ ముందు టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మేయర్ కావటి మనోహర్‌నాయుడు వాహనాన్ని టీడీపీ నేతలు అడ్డగించారు. మంచినీటి సరఫరా చేయడంలో కార్పొరేషన్ విఫలమైందంటూ మేయర్ కారు ఎదుట కుండలను పగలగొట్టి నిరసన తెలిపారు. తాగునీరు ఇవ్వడం చేతకాని కమిషనర్ అంటూ విమర్శలు గుప్పించారు.

గుంటూరు కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై నిలదీస్తున్న టీడీపీ కార్పొరేటర్‌ను.. వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు అసభ్య పదజాలంతో మాటల యుద్ధానికి దిగారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన రాహుల్ దేశంలో పేదల కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పని చేస్తోందన్నారు. బీజేపీ కొద్ది మందికి మాత్రమే లబ్ది చేకూర్చుతోందని రాహుల్ విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించాలంటే ఐక్యత ఒక్కటే మార్గమన్నారు.

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకు ప్రవేశించిన రుతుపవనాలు రాగల మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజులు ఉమ్మడి ఖమ్మం, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తగా చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌బెడ్‌రూమ్ టౌన్ షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 1490 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత టౌన్ షిప్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

మంత్రి కేటీఆర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీకానున్నారు. ఇప్పటికే కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటుంది బీఆర్ఎస్ సర్కార్. ఇక రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

2024 ఎన్నికలే లక్ష్యంగా పాట్నాలో విపక్ష పార్టీల ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన విపక్షాలు భేటీ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, స్టాలిన్, తేజస్వీయాదవ్, సీతారాం ఏచూరి, మెహబూబా ముఫ్తీతో పాటు 18విపక్ష పార్టీల నేతలు పాల్గొనున్నారు.

జాతీయ నాయకత్వం ఇచ్చిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి సామాన్య కార్యకర్త వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మోదీ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.

వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన విందుకు భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పలు బహుళజాతి కంపెనీల అధినేతలు కూడా ఈ విందుకు వచ్చారు. వీరిలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, యాపిట్ సీఈఓ టిమ్ కుక్ ఉన్నారు.

మాయమాటలతో తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మభ్యపెడుతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఏం సాధించారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్‌ఎస్‌కు ప్రజలు, ఉద్యమకారులు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు శంకరమ్మ ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


