- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

పశ్చిమగోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలో పర్యటించిన చంద్రబాబు... అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఓట్లు అడిగిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు రోడ్ షోగా వెళ్తు రైతులను పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు కాసేపు హంగామా చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బ్యాడ్జ్ లేకుండా డ్యూటీ ఎలా చేస్తున్నారని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

రైస్‌మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి చేయి చేసుకున్నాడు. కామా రెడ్డి జిల్లా భిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన వెలుగుచూసింది. రైస్‌మిలర్లు తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో నేరుగా రైస్‌మిల్‌కు వెళ్లి ధాన్యం కొనుగోలుపై సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్షపు సమాధానంపై కోపం తెచ్చుకున్న గంప గోవర్ధన్.. సిబ్బందిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఖమ్మంలో రైతు భరోసా ర్యాలీ చేపట్టారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. తడిసిన ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి క్యాంప్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగగా.. ధాన్యం తడిసి ముద్దయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు పేరుతో మిల్లర్లు రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సినీ నటి సమంత నటించిన యాడ్ పై స్పందించింది. “ఈ యాడ్ చూసిన తర్వాత నా చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. 'ఒక టెన్నిస్ క్రీడాకారిణి ఏం సాధిస్తుంది? ఇది మహిళల ఆట కాదు. ఆమె ఎంత దూరం వెళ్ళగలదు?' అనే మాటలు నా కెరీర్‌లో చాలాసార్లు వినాల్సి వచ్చేది. కానీ నేను నా కలను సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించేదానిని. నాపైన నాకు నమ్మకం ఉండేది. సమాజం గురించి పట్టించుకోలేదు. విజయం సాధించాలనే సంకల్పం ముందు అవేవీ నా చెవికి ఎక్కలేదు. సమంత నటించిన ఈ యాడ్ తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే మహిళలకు స్ఫూర్తిదాయకమని సానియా ట్వీట్ చేసింది.

నెల్లూరు జిల్లాలో ఈనెల 12న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఐతే.. ముఖ్యమంత్రి పర్యటనతో కావలి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సీఎం పర్యటనకు వారం రోజుల ముందే తుమ్మలపెంట రోడ్.. జడ్పీ గ్రౌండ్ వద్ద అధికారులు షాపులను మూయించారు. అవసరమైతే షాపులు తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఐతే.. యంత్రాలతో షాపులు తొలగిస్తే ధ్వంసం అవుతాయని.. రోడ్డున పడతామని షాపుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ ఉప్పల్ క్రాస్ రోడ్డులో పాదచారుల కష్టాలు తీరనున్నాయి. 25 కోట్ల రూపాయలతో హెచ్‌ఎమ్‌డీఏ స్కై వాక్‌ను ఏర్పాటు చేసింది. స్కైక్ వాక్ ఎక్కేందుకు దిగేందుకు వీలుగా ఆరు చోట్ల ఎస్కలేటర్స్, లిఫ్టులు ఏర్పాటు చేశారు. నేరుగా ఉప్పల్ మెట్రో స్టేషన్‌లోకి వెళ్లేందుకు వీలుగా స్కై వాక్‌ను నిర్మించారు. ప్రారంభానికి ఉప్పల్ స్కై వాక్ నిర్మాణంపై సిద్ధమవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా బేతోలులో కారు బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో, ఇళ్లు, బార్బర్ షాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయడ పడ్డాడు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు బీజేపీ నేతలు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల సంచలన ఆరోపణలు చేశారు. ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని అంతం చేసేందుకు బీజేపీ నేతలు వ్యూహం పన్నారన్నారు. చిట్టాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠదిగా చెబుతూ ఓ ఆడియో కూడా మీడియా సమావేశంలో విన్పించారు. మణికంఠపై 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై కనుసన్నల్లోనే ఖర్గే హత్యకు వ్యూహ రచన జరిగిందని సూర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేశారు.

రైతుల చేతికి పంట వచ్చిన దశలో వర్షాలు విరుచుకుపడ్డాయి. రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. అమ్ముకోవాలన్నా కొనే నాథుడు లేరు. పంట కోసిన తర్వాత సంభవించే నష్టానికి సాయం అందించలేమని, నిబంధనలు వర్తించవని అధికారులు అంటున్నారు. ఇక అకాల వర్షాలతో ఎంత నష్టం ఏర్పడింది అన్న అంచనా కూడా వేయలేకపోయింది జగన్ సర్కార్. రైతులకు భరోసా ఇచ్చేందుకు కనీసం ఒక్క ప్రకటన చేయడం లేదు. రైతులకు ఇలాంటి సమయాల్లో ధైర్యం చెప్పే వారు కావాలి. అలాంటి పరిస్థితే అంతకంతకూ కరువవుతోంది. మొద్దు నిద్ర పోతున్న సర్కార్ నిద్ర లేచేదెప్పుడు.. సాయం చేసేది ఎప్పుడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అకాల వర్షాలతో ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన వెయ్యి కోట్లను కూడా ఏపీ ప్రభుత్వం మళ్లించేసింది. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ వేరు.. విపత్తలు వచ్చినప్పుడు చేసే సాయం వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడనే విపత్తుల సాయం కింద ప్రకటిస్తోంది. సర్కార్ నుంచి ఇప్పటి వరకూ పంట నష్టపరిహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టకపోవడంపై సర్వత్రా మిమర్శలు తలెత్తుతున్నాయి.

బ్రిటన్ యువరాజు ఛార్లెస్ పట్టాభిషేకానికి బకింగ్ హమ్ రాజసౌథం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. బ్రిటన్ చక్రవర్తిగా ప్రిన్స్ ఛార్లెస్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారత్ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ జాబితాలో భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధాన్కర్, నటి సోనమ్ కపూర్ కు పట్టాభిషేకానికి హాజరవ్వాల్సిందిగా ఆహ్వానం అందింది. వీరితో పాటూ ముంబైలోని డబ్బావాలాలకు కూడా ఆహ్వాన పత్రిక అందింది.

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నిందితులకు 33 లక్షలకుపైగా డబ్బులు అందినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు 16 లక్షలు అందాయని స్పష్టం చేసింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలకు నిందితుడు ప్రవీణ్ నుంచి రేణుక రాథోడ్ ఏఈ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసింది. రేణుక భర్త డాక్య, రాజేశ్వర్ కలిసి మరో ఐదుగురికి విక్రయించినట్లు గుర్తించారు. ఆరు లక్షలకు డీఈఓ పేపర్‌ను ఖమ్మానికి చెందిన దంపతులకు విక్రయించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. వెస్ట్ మినిస్టర్ అబేలోని బకింగ్ హమ్ ప్యాలెస్‌లో అత్యంత ఆడంబరంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. పట్టాభిషేకంలో కిరీటంతో పాటు ఇతర ఆభరణాలన్నీ కలిపి సుమారు 100 దాకా ఉంటాయి. వీటి విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్లు ఉంటుందని ఓ అంచనా. అయితే వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటం లోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్ వజ్రాన్ని ఈసారి తొలగించారని తెలుస్తోంది.

మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం దాడులు దిగాయి. దీంతో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రార్థనాస్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తమను ఎస్టీల జాబితాలో చేర్చాలని మైతై సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది. దీన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జీవితం భారమై ఓ వృద్ధుడు తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడబోయిన వెంకటయ్య కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలం క్రితం భార్య చనిపోవడంతో తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. ఈ క్రమంలో వెంకటయ్యను చూసుకునేందుకు కొడుకులు వంతులు వేసుకోవడంతో అతడి మనసు ముక్కలైంది. తాను ఎవరికీ భారం కాకూడదని, సొంత ఊరుని విడిచి వెళ్లేందుకు ఇష్టపడని వెంకటయ్య ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. వెంకటయ్య మరణంలో పొట్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. పాణ్యం నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.. జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో పాణ్యం దద్దరిల్లింది. ఇవాళ 90వ రోజు పాదయాత్ర పెద్ద కొట్టాల నుంచి ప్రారంభం అయింది. లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కే. మార్కాపురంలో కురుబ సామాజిక వర్గీయులతో లోకేష్ భేటీ అయ్యారు .

బాపట్ల జిల్లాలో తన తండ్రిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఓ బాలుడు.రోజూ మద్యం సేవించి తల్లిని హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు 9 ఏళ్ల బాలుడు.తన తండ్రి ప్రతిరోజూ తల్లిని కొడుతున్న విషయాన్ని గమనించిన ఆ బాలుడు తన తండ్రిపై కర్లపాలెంలో ఫిర్యాదు చేశాడు.విషయం తెలుసుకున్న ఎస్సై బాలుడి తల్లితల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎట్టకేలకు డేటింగ్ రూమర్లపై స్పందించాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఫైర్ అయ్యారు. రష్మిక, తాను ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించామని దాంతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని వాపోయారు. ఈ వార్తల్లో నిజం లేదని తామిద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేశాడు. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఛత్రపతితో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. అతడికి జోడీగా నుస్రత్ భరుచా నటిస్తోంది.

శరద్ పవార్ స్వస్థలం బారామతి ఆయన రాజీనామాను ఆమోదించలేదు. పవార్ 1967 నుంచి 1990 వరకు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఆయన సుదీర్ఘకాలం ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. శరద్ పవార్ రాజీనామాను ఎప్పటికీ ఆమోదించబోమని బారామతి శ్రేణులు అంటున్నాయి. “పార్టీ అంటే అధికారం. ఆయన లేకుండా మేం ఎలా ముందుకు వెళ్లగలం? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అజిత్ పవార్‌కు, లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆయన కుమార్తె సుప్రియకు అప్పగించిన సంగతి తెలిసిందే.

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. తాటికల్ గ్రామంలో ఐకేపీ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. రోడ్డు పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

భారత దేశంలో మరో చంద్రగ్రహణం సంభవించనుంది. మే5, 2023న ఈ గ్రహణం భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో చంద్రగ్రహణం దాదాపు 4గంటల 17 నిమిషాల 31 సెకన్లు సంభవించనున్నట్లు తెలిపారు. 2023 రాత్రి 08:44 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 10.52 కు ముగుస్తుంది. చంద్రుడు రాత్రి 10:52 గంటలకు గ్రహణం యొక్క గరిష్ట దశకు చేరుకుంటాడు. చంద్రగ్రహణం భారత్ తో పాటు ఆఫ్రికాలోని తూర్పు భాగంలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఆసియాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.

జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా, మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా... ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ముగ్గురు జవాన్లు ఉన్నారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లకు గాయాలవగా.. వారు సురక్షితంగా ఉన్నారు.

మణిపూర్ లో షెడ్యూల్డ్ తెగల కోసం నిర్వహించిన ర్యాలీ హింసకు దారితీసింది. అల్లర్లను నిలువరించడానికి ఆర్మీ, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. బుధవారం గిరిజనుల ఆందోళన సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మొత్తం మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. వివిధ జిల్లాల్లో సెక్షన్ 144 CrPC కింద కర్ఫ్యూను విధించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు.

ప్రముఖ యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహాన్ బుధవారం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సూపర్‌బైక్‌పై గంటకు 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో తీస్తున్న అతను.. తొలిసారిగా తన ZX10R నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా వెళ్ళడంతో డివైడర్‌ను ఢీకొట్టింది, తలకు తీవ్రగాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

సిద్దిపేట జిల్లా చేర్యాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో.. నెమళ్ల మృతి కలకలం రేపింది. వ్యవసాయ పొలాలలో 20కి పైగా నెమళ్లు మృత్యువాత పడ్డాయి. వీటిని గమనించిన స్థానిక రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. మృతి చెందిన నెమళ్లను ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా.. వాటికి పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను ల్యాబ్‌కి పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత నెమళ్ల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విష గుళికలతో నెమళ్లను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది బీజేపీ. ప్రధాని మోదీ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. కర్ణాటకలో ప్రతి గ్రామంలోని ప్రతి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవనున్నట్టు ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ బీజేపీ కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదవబోతున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ చాలీసా చదివేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. భజ్‌రంగ్ దళ్ బ్యాన్ హామీ పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా వాడుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హనుమాన్ చాలీసా అంశం తెరపైకి తీసుకొచ్చింది.

మెదక్ జిల్లాలో ఓ సర్పంచ్ భర్త అదృశ్యం సంచలనం రేపుతోంది. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి భర్త శ్రీనివాస్ సబ్ స్టేషన్‌లో ఉద్యోగి. బుధవారం సబ్ స్టేషన్‌లోనే ఫోన్, బైక్ వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ ఆచూకీ లభించలేదు. మరోవైపు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న రామయంపేట పోలీసులు.. శ్రీనివాస్ కోసం వెతుకుతున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి 40 లక్షలు ఖర్చు చేశామని ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పుల బాధతోనే తన భర్త అదృశ్యమయ్యారని ఆరోపించారు.

క్రైమ్ కథా చిత్రంగా పలు మలుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసులో, ప్రత్యక్ష సాక్షి రంగయ్యకు పటిష్ట భద్రత నడుమ స్వీమ్స్‌లో వైద్యం నిర్వహిస్తున్నారు. వివేకా హత్య కేసులో రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు కీలక వాగ్మూలం ఇచ్చిన రంగయ్యకు1+1 భద్రత కల్పించారు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న రంగయ్యను, పులివెందుల ప్రభుత్వాస్పత్రి నుండి మెరుగైన వైద్యం కోసం స్వీమ్స్ కు తరలించారు.

ప్రజాయుద్ధ నౌక గద్దర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి. తనకు గన్‌మన్‌లు కావాలని.. రి వాల్వర్ లైసెన్స్ కూడా మంజూరు చేయాలని మెదక్ జిల్లా తూప్రాన్ పీఎస్‌లో దరఖాస్తు చేశారు. ది గద్దర్ పార్టీ.. అండర్ ది ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లెటర్ హె డ్‌తో దరఖాస్తు చేశారు. త్వరలోనే తూప్రాన్‌లో నివాసం ఉంటానని తనకు రక్షణ కల్పించాలని తూప్రాన్ పోలీసులను కోరారు గద్దర్.

కాపులకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ. టీడీపీ హయాంలోనే కాపులకు న్యాయం జరిగిందన్నారు. తాను సీఎం అయ్యాక కాపులకు 10వేల కోట్లు ఇస్తానన్న జగన్.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. కాపు ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కులాన్ని జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టొద్దన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు దెబ్బలు తినడం ఖాయమన్నారు.

విజయవాడ దుర్గగుడిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న నగేష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో, భవానీపురం లోటస్‌లోని తన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆడిటర్ బుచ్చిబాబుకు మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బుచ్చిబాబు వచ్చారు. ఇప్పటికే అనేకసార్లు బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ స్కాంలో కొద్దిరోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసులోని పలువురు నిందితులను ఈడీ ప్రశ్నించనుంది. అందుకు ప్రత్యేక కోర్టు అనుమతి కూడా కోరింది. విజయ్ నాయర్, అమిత్ అరోరాలను మరోసారి ప్రశ్నించేందుకు కోర్టు ఈడీకి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబును ఈడీ మరోసారి పిలవడం ఆసక్తి రేపుతోంది.

ఏపీలో వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మద్దిలపాలెం హై వేపై నిరసన చేపట్టారు. ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ప్రధాని మోదీకి జగన్ కొమ్ముకాస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆందోళనకారుల నిరసనలతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. గీత కార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి.. దీన్నో పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించింది. 20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్‌ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న దీనికి శంకుస్థాపన చేశారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను ఇక్కడ అమ్మనున్నారు. ఒకేసారి 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పల్లెల్లో ఉండే వాతావరణం కాన్సెప్ట్ తో నిర్మించారు.

కృష్ణా జిల్లా టీడీపీ మహిళా నాయకురాలు సాయికల్యాణిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేలు వల్లభ నేని వంశీ, కొడాలి నానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకుగాను సాయి కల్యాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చికోటి ప్రవీణ్‌తో వంశీ, కొడాలి నానికి సంబంధాలు ఉన్నాయంటూ పోస్టులు చేసినట్లు తెలుస్తుంది. అయితే నిరాధార పోస్టింగ్‌లు పెట్టిన సాయి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పీఎస్‌లో వైసీపీ నాయకుడు ప్రదీప్ ఫిర్యాదు చేశాడు. దీంతో సాయికల్యాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. నిర్మాత “ #Agent సినిమాను సరిగా తీర్చిదిద్దనందుకు క్షమించండి. ఇది ఒక పెద్ద బాధ్యత అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని జయించాలని అనుకున్నాము. కానీ మేము స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం చేసిన పెద్ద పొరపాటు. దీనికితోడు కోవిడ్ సమస్యలు, ఇంకా మరెన్నో ఈ చిత్రం ఫెయిల్ అయ్యేందుకు కారణమయ్యాయని ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


