చిట్టి న్యూస్

AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జై భారత్‌ నేషనల్‌’ (JBNP) పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. జాతీయ జెండా రంగులతో జేడీ ఫొటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించారు. సమస్య పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేడ్కర్ చెప్పారన్న లక్ష్మీనారాయణ ...ఆ దిశగానే అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే పార్టీ స్థాపించానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్‌ నేషనల్‌ పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. వరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని... అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు.. బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎన్‌పీ అని లక్ష్మీనారాయణ తెలిపారు.

Congress : నేడే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ

లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమిలోని భావసారూప్యమున్న పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు మిగిలిన CWC సభ్యులు హాజరుకానున్నారు. 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా  ఇవాళ మ‌ధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది.

కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిలూ సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకున్నారు. ఢిల్లీకి వెళ్తున్నందున దానిని వాయిదా వేశారు.

YUVAGALAM SABHA: జన ప్రభంజనం

యువగళం - నవశకం విజయోత్సవ సభకు జనం పోటెత్తడంతో పోలిపల్లి సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి నలుదిక్కులా, కనుచూపుమేర ఎటుచూసినా జనమే కనిపించారు.


తెలుగుదేశం, జనసేనకు చెందిన వందలాది మంది నాయకులు...., లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు... సమరోత్సాహంతో సభకు తరలివచ్చారు.


చంద్రబాబు, పవన్ తో పాటు... నందమూరి బాలకృష్ణ, ఇతర ముఖ్యనేతలు సభా వేదికపై రాగానే.. ఇరుపార్టీల కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.


అటు విశాఖ నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారి మొత్తం పసుపుమయంగా మారింది. తమ అభిమాన నేతల రాకను స్వాగతిస్తూ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కటౌట్లు కనిపించాయి. 



TS: తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతండీజీపీగా ఉన్న రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం...అంజనీ కుమార్ నురోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్ గా నియమించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరరీ కమిషనర్ గా అంజనీకుమార్ కు... అదనపు బాధ్యతలు అప్పగించింది. మహేశ్ భగవత్ ను రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా రాజీవ్ రతన్ ను నియమించిన ప్రభుత్వం ఏసీబీ డీజీ బాధ్యతలను సీవీ ఆనంద్ కుఅప్పగించింది. ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ ను నియమించింది. పోలీసు అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ ను నియమించిన ప్రభుత్వం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించిన ప్రభుత్వం అదనంగా వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ విభాగం బాధ్యతలు అప్పగించింది. అబ్కారీ శాఖ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. 

Joe Biden :  బైడెన్‌ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌  కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఆదివారం రాత్రి 8.09 గంటలకు వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటన జరిగినప్పుడు జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా.. ప్రెసిడెంట్‌ బైడెన్‌ 130 అడుగుల దూరంలో ఉన్నారు. డెలావేర్‌లోని తన ప్రచార ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరిన బైడెన్ ఆశ్చర్యపోయారు. బైడెన్ నుండి 130 అడుగుల సమీపంలోని కూడలిలో ఉన్న సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని సెడాన్ కారు ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. భద్రతా సిబ్బంది బైడెన్ ను వెయిటింగ్ వాహనంలో డౌన్‌టౌన్ విల్మింగ్టన్‌లోని భవనం నుండి దూరంగా తరలించారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు తరలించారు. దంపతులిద్దరు క్షేమంగా ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించారు. కాగా, ఘటనకు పాల్పడిన డ్రైవర్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.


VIVEKA: వివేకా హత్య కేసులో కొత్త మలుపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనే పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నేతల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ఎస్పీ రాంసింగ్‌ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో కృష్ణారెడ్డి పిటిషన్‌లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది.

AP: వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వర్గానికి చెందిన N.D.C.C.B ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. వ్యతిరేక వర్గానికి చెందిన దువ్వూరు రాకేష్ రెడ్డిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. N.D.C.C.B ఛైర్మన్ ను విమర్శించాడని తనని స్తంభానికి కట్టేసి కొట్టారని బాధితుడు వాపోయాడు. పోలీసుల ఎదుటే నిర్భందించి కొడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ నూతన సమన్వయకర్త నియామకం పై అసమ్మతి సెగలు ఎదరవుతున్నాయి. ఇంఛార్జ్ గా ఈవూరు గణేష్ ని నియమించటంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. వైసీపీ సమన్వయ కర్తగా నియామకంపై అధిష్టానం పునరాలోచన చెయ్యాలని వైసీపీ జెడ్పీటీసీ బొర్రా లక్ష్మి భర్త శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ పున పరిశీలన చేసి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని సూచించారు.

SOMIREDDY: సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష

తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మద్ధతు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు భారత్ మైకా మైన్స్ లో జరగుతున్న అక్రమమైనింగ్ ను నిలిపివేయాలంటూ శనివారం నుంచి సోమిరెడ్డి నిరసన చేపట్టారు. శనివారం భారత్ మైకా గనులను పరిశీలించిన సోమిరెడ్డి రాత్రి గనుల వద్దే బస చేశారు. సోమిరెడ్డి చెపట్టిన దీక్షలో టీడీపీ నాయకులు తాడిపర్తి, వరదాయపాలెం, పొదలకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.


మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు బందిపోట్ల కన్నా ప్రమాదకరంగా మారారని, ప్రకృతి సంపదను బరితెగించి దోచుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన వెయ్యి టన్నుల క్వార్ట్జ్‌ను యంత్రాలతో తవ్వి అక్రమంగా తరలి స్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తాటిపర్తి పంచాయతీ పరిధిలోని రుస్తుం, భారత్‌ మైకా గనుల్లో క్వార్ట్జ్‌ తవ్వకాలను ఆయన పరిశీలించారు. గనులకు సమీపంలోనే 50 గిరిజన కుటుంబాలు ఉన్నాయని పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరి వారి ఇళ్లపై పడుతున్నా... అక్రమార్కులు పట్టించుకోవడం లేదన్నారు. భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ, గనులశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలను నిలిపేయాలని ఈ నెల 7న హైకోర్టు ఆదేశాలిచ్చినా.. కలెక్టర్‌, గనులశాఖ అధికారులు స్పందించలేదన్నారు. 12 యంత్రాలు, 30 టిప్పర్లతో సుమారు వంద అడుగుల మేర తవ్వేశారని మండిపడ్డారు.


మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంత గ్రామానికి సమీపంలోనే ఇంత దారుణం జరుగుతున్నా.. ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ తవ్వకాల్లో A1, A 2లుగా మంత్రి కాకాణి, వైసీపీ నాయకుడు శ్యాంప్రసాద్‌రెడ్డిని చేర్చాలని డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం మైన్‌ వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడే బైఠాయించారు. అధికారులు వచ్చి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని, వాహనాలను సీజ్‌ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. రాత్రి అక్కడే బస చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్రమంగా జరుగుతున్న రుస్తుం, భారత్ మైకా మైన్స్ దోపిడీ ఆపాలంటూ చిమ్మ చీకట్లోనూ సోమిరెడ్డి ఆందోళన కొనసాగించారు. అధికారులు రావాలని వచ్చేంత వరకు వాహనాలను బయటకు వదలబోమని... సోమిరెడ్డి క్వారీల వద్దే కూర్చున్నారు. అక్కడకు భారీగా చేరుకున్న స్థానికులు సోమిరెడ్డికి మద్దతుగా ఆందోళన చేపట్టారు. వైకాపా నేతలు 3 వారాలుగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని.. రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను దోపిడీ చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ మైనింగ్ ఆపాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

UP: దాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి

ఉత్తప్రదేశ్‌లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్‌పూర్‌ క్రాసింగ్‌ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి  దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు  తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. జార్ఖండ్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన ట్రక్కు కాన్పూర్‌ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్నదని ఎస్‌ఎస్పీ సంజయ్‌ వర్మా చెప్పారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామని, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామన్నారు. జేసీబీ, క్రేన్‌ సహాయంతో ట్రక్కును అక్కడి నుంచి తొలగించామని తెలిపారు. గాయపడిన వారిపరిస్థితి విషమంగా ఉందన్నారు.

KCR:  య‌శోద ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్‌..

భారాస అధినేత KCR యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను  బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి కేటీఆర్, హరీశ్ రావు తీసుకెళ్లారు. 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జారీపడిన కేసీఆర్.... వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పట్నుంచి ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్... కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రతి రోజు యశోదా నుంచి వైద్యులు... కేసీఆర్ కు ఫిజియోథెరపీ చేయడానికి నందినగర్ లోని తమ నివాసానికి వెళ్లనున్నారు. . వారం రోజుల తరువాత మరో మారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని రివ్యూ చేస్తారు. 

ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో కాలు జారి కింద ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేసీఆర్‌ను కుటుంబ స‌భ్యులు సోమాజిగూడలోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌ను వాక‌ర్ సాయంతో వైద్యులు న‌డిపించారు. ఇక ఆస్ప‌త్రిలో ఉన్న కేసీఆర్‌ను రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు పరామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. 

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం.

ఆఫ్ఘనిస్తాన్‌  మరోసారి  భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని  తీవ్రత 5.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది. అయితే  ఈ సందర్భంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది అన్న విషయం   ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శక్తివంతమైన భూ ప్రకంపనల వల్ల వందలాది మంది మరణించారు. భవనాలు కూలిపోయాయి. తీవ్ర ఆస్తి నష్టం వాటిళ్లింది. గత కొన్ని సంవత్సరాలుగా భూకంపాలకు నిలయమైన ఈ ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ ప్రకంపనల ల్ల 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించింది. ఈ ఘటనలో తొమ్మిది వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.

GUNTUR : గుంటూరు మునిసిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

గుంటూరు ( Guntur ) కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్‌లకు 25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే, ఆదేశాలు అమలు చేయకపోవడంతో గుంటూరు మునిసిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించింది హైకోర్టు.

CBN: గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన... రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. అంతర్గతంగా చేయించిన సర్వేల్లో ఎవరి పనితీరు బాగాలేకపోయినా ఉపేక్షించేది లేదన్నారు. పనితీరు బాగాలేని వారిని ప్రత్యామ్నాయo చూపించి పక్కన పెడతానని, పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఓట్ల అవకతవకల విషయాన్ని నియోజకవర్గ ఇంఛార్జిలు బాధ్యతగా తీసుకుని పోరాడాలని... అన్నీ అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దని స్పష్టంచేశారు. 

Nirmala Sitharaman: ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కు అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది.భారత్‌ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా వారిలో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్‌ తర్వాత భారత్‌ నుంచి HCL కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా 60వ స్థానంలోనూ,  సెయిల్ ఛైర్‌పర్సన్ సోమా మోండల్‌ 70వ స్థానంలో నిలిచారు. బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా.. 76వ స్థానంలో ఉన్నారు. శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్‌ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 32వ స్థానంలో ఐదోసారి చోటు దక్కించుకోవడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ తొలి స్థానంలో నిలిచారు.రెండో స్థానంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతి క్రిస్టినా లగార్డ్‌,  మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఉన్నారు. 

Rapido: క్యాబ్‌ సేవల విభాగంలోకి ర్యాపిడో

ఇప్పటి వరకు బైక్‌, ఆటో రైడ్‌ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్‌ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్‌ లాంటి సంస్థలతో ఇకపై ర్యాపిడో పోటీపడనుంది. ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ , హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్‌లతో ఈ సేవలను ర్యాపిడో ప్రారంభించింది. 2024 సెప్టెంబర్‌ నాటికి క్యాబ్‌ సేవలను 35 నగరాలకు విస్తరిస్తామని ర్యాపిడో సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్‌ ఆధారిత సేవలు అందించి, మార్కెట్‌ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమీషన్‌ మోడల్‌తో చోదకుల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామన్నారు.

Congress High Command: ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం..

లంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వ్యవహారం ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు. సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. మరికాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు. అధిష్టానం నిర్ణయించిన సీఎం అభ్యర్థి పేరును డీకే హైదరాబాద్‌లో ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు. మిగిలిన పదవుల కేటాయింపుపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఖర్గేతో భేటీకి ముందు ఉత్తమ్‌ కుమార్, భట్టి విక్రమార్కతో డీకే, ఠాక్రేలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.

Revanth Reddy :  ఆత్మగౌరవజెండాను  ఎగరేసామన్న రేవంత్ రెడ్డి

దేశానికి ఆదర్శంగా కొండగల్ ని తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొండగల్ నుంచి భారాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించిన ఆయన  కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవజెండాను కొడంగల్ ఆకాశమంత ఎత్తున ఎగరేసిందని ట్విట్టర్ లో పేర్కొన్న ఆయన  కొనఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తానని పునరుద్ఘాటించారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోశారు: రేవంత్ ..కష్టపడిన ప్రతిఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకుంటానని వివరించారు. ఈగడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2018 ఎన్నిక‌ల్లో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చేతిలో రేవంత్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే.


KTR: ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘భారాసకు వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందాను. మేము దీన్ని ఒక పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు.

TS RESULT: రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ.. ఇంటి బయట జనసంద్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పలువురు అధికారులు తరలివెళ్తున్నారు. డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ , అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన్ను మద్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

TS RESULT: ఎదురీదుతున్న మంత్రులు వీరే

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో పలువురు మంత్రులు ఎదురీదుతున్నారు. మరికొందరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

వెనుకంజలోని మంత్రులు

నిరంజన్‌రెడ్డి (వనపర్తి)

ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ)

ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి)

కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి)

ఇంద్రకరణ్‌ రెడ్డి (నిర్మల్‌)

పువ్వాడ అజయ్‌ (ఖమ్మం)

ముందంజలో ఉన్న మంత్రులు

మంత్రులు జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట)

చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌)

సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)

హరీశ్‌రావు (సిద్దిపేట)

కేటీఆర్‌ (సిరిసిల్ల)

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (సనత్‌నగర్‌)

శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌)

TS RESULT: అంబరాన్నంటిన కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నాయి. గాంధీభవన్ కి పెద్దసంఖ్యలో వచ్చినకార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబురాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించారన్న నేతలు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారం చేపడతామన్ని స్పష్టం చేస్తున్నారు. రెండుసార్లు అధికారం ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటివద్దకు పెద్దసంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహిస్తున్నారు.

TS RESULT: హస్తం పార్టీ రెండో విజయం.. ఎంఐఎం బోణీ

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ రెండో విజయం నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్‌పై 25వేలకు పైగా మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించారు. 2014లో హరిప్రియనాయక్‌పైనే గెలిచిన కోరం కనకయ్య.. 2018లో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు హరిప్రియపైనే కనకయ్య జయకేతనం ఎగురవేశారు. ఇటు.. రామగుండంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ గెలిచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై రాజ్‌ఠాకూర్‌ గెలిచారు. మరోవైపు చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి మీర్‌ జుల్ఫికర్‌ అలీ గెలిచారు. ఈ గెలుపుతో ఎంఐఎం బోణీ కొట్టింది.

TS RESULT: ఖమ్మంలో కాంగ్రెస్‌ జోరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా హస్తం జోరు కొనసాగుతోంది. మొత్తం పది నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పినపాకలో -పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు - కోరం కనకయ్య, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు -పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధిర- భట్టి విక్రమార్క ఆధిక్యంలో ఉన్నారు. వైరా - మాలోతు రామ్ దాస్ , సత్తుపల్లి - మట్టా రాగమయి, అశ్వారావుపేట – ఆదినారాయణ ముందంజలో ఉన్నారు. కొత్తగూడెంలో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భారాస నుంచి భద్రాచలంలో తెల్లం వెంకట్రావు ముందంజలో ఉన్నారు.

TS RESULT: నల్గొండలోనూ కాంగ్రెస్‌ హవా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 49 ప్రాంతాల్లో ఉన్న ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం దూసుకెళ్తోంది. దేవరకొండలో - బాలు నాయక్ నేనావత్ , నాగార్జునసాగర్ - కుందూర్ జయవీర్ , మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి, హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ - ఉత్తమ్ పద్మావతి ముందంజలో కొనసాగుతున్నారు. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి -కుంభం అనిల్ కుమార్ రెడ్డి దూసుకెళ్తున్నారు. నకిరేకల్ - వేముల వీరేశం, తుంగతుర్తి- మందుల శ్యామ్యూల్ , ఆలేరు - బీర్ల ఐలయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భారాస నుంచి సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి ముందంజలో ఉన్నారు..

TS RESULT: తొలి విజయం కాంగ్రెస్‌దే.. ఆశ్వారావుపేటలో విజయకేతనం

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో మొదటి విజయం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20వేలకు పైగా ఆధిక్యంతో ఆదినారాయణ జయకేతనం ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు అక్కడ విజయం సాధించారు. అనంతరం మెచ్చా నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ విజయం సాధించారు. 

YS Sharmila: కేసీఆర్‌కు గిఫ్ట్ పంపిన ష‌ర్మిల‌

తెలంగాణలో ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు  వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి  వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్‌ కేసును గిఫ్ట్‌గా పంపించారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని... ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి.. తాము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని.. కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని అన్నారు. ఇన్నాళ్లు బీజేపీ , బీఆర్ఎస్  కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదని విమర్శించారు. వీళ్లిద్దరు తోడుదొంగలు అయి కలిసే ఉన్నారని ఆరోపించారు.

Nara Lokesh:  కొనసాగుతున్న  నారాలోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పాదయాత్ర యువగళం పాదయాత్ర  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరిన లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. తెదేపా-జనసేన నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి లోకేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చినరాజప్ప, వర్మ, నవీన్,  లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. సామర్లకోట మండలం పవర మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో ఈ సాయంత్రం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతారు. అనంతరం కొండెవరం, కొత్త ఇసుకపల్లి మీదుగా యండపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.

Ugandan:  70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ..

ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించారు. కంపాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఆమె సిజేరియన్ ద్వారా ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు. వృద్ధురాలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇన్‌విట్రో ఫలదీకరణ చికిత్స ద్వారా ఆమె సంతానభాగ్యం పొందినట్టు పేర్కొన్నారు. 2020లో కూడా సఫీనా ఈ చికిత్స ద్వారానే ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. కాగా, 2019లో భారత్‌లో దక్షిణాదిన ఓ వృద్ధురాలు 73 ఏళ్ల వయసులో పిల్లల్ని కన్నట్టు అప్పట్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

CBN: పూర్తిస్థాయిలో రంగంలోకి చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తి చేసుకున్న అనంతరం పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను జగన్‌ నిర్వీర్యం చేయడంపై ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించారు. ఈనెల 10న శ్రీకాకుళం,11న కాకినాడ, 14న నరసరావుపేట,15న కడపలో నిర్వహించే సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఏపీలో వ్యవస్థలు గాడి తప్పిన తీరును పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కరవు, పేదరికం, నిరుద్యోగం, మహిళలకు భద్రత లేకపోవడం, అక్రమ కేసులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి 13 అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు.

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్..

సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రదాడుల సమాచారం నేపథ్యంలో భద్రతా దళాలు జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లా అరిహాల్ ప్రాంతంలోని న్యూకాలనీలో గురువారం భద్రతా దళ అధికారులు మిలిటెన్సీ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని గుర్తించి అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉగ్రవాది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాది ఏ సమూహానికి చెందినవాడో ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు.

Supreme Court: ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీలో ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు గురువారం సుప్రీం కోర్టులో విచారణ రాగా జస్టిస్‌ అనిరుద్‌ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును డిసెంబర్‌ 12కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గత నెల 12న చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసులు నమోదు చేయడాన్ని కొట్టేయాలంటూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు.

Celebrities Vote Cast :  ఓటు హక్కు ఉపయోగించుకుంటున్న సెలబ్రిటీస్..

తెలంగాణలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  నటుడు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేశారు. సినీనటుడు అల్లు అర్జున్..జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అందరితో పాటూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. షాద్‌ నగర్‌లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్.. ఇలా ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ కి చేరుకొని తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు.

Gas Cylinder Explosion: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. కుప్పకూలిన ఇళ్లు , 11 మందిని రక్షించిన అధికారులు

మహారాష్ట్ర ముంబై లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెంబూర్‌లోని గోల్ఫ్‌ క్లబ్‌ ప్రాంతానికి సమీపంలో గల ఓల్డ్‌ బ్యారక్‌  వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్యాస్‌ సిలిండ్‌ పేలడంతో పక్కపక్కనే ఉన్న ఐదు ఇళ్లు కూలిపోయినట్లు చెప్పారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను 50 ఏళ్ల వికాస్‌ ఆంబోర్‌, 27 ఏళ్ల అశోక్‌ ఆంబోర్‌, 47 ఏళ్ల సవితా ఆంబోర్‌, 29 ఏళ్ల రోహిత్‌ ఆంబోర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

BIG BREAKING: రైతుబంధు అనుమతి ఉపసంహరించుకున్న ఈసీ

తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల ముందు ఇలా అనుమతి ఇవ్వడంపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇలా చేయడం ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం లాంటిదేనని ధ్వజమెత్తాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనమంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతించింది. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు అయిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.


YCP: వైసీపీ నేతల భూదాహంతో యువకుడి బలి

కాకినాడలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. వైసీపీ నేతల భూదాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అశోక్‌ నగర్‌లోని నేతాజీ వీధికి చెందిన 32 ఏళ్ల నున్న శ్రీకిరణ్‌ రష్యాలో నాలుగేళ్ల పాటు వైద్య విద్య అభ్యసించారు. చదువు మధ్యలో ఆపేసి స్వస్థలం వచ్చారు. వీరికి కాకినాడ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వివాదంలో మనస్తాపానికి గురైన శ్రీకిరణ్‌ పురుగుల మందు తాగారు. కాకినాడ G.G.Hకు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకిరణ్‌ మృతిచెందారు. భూమి విషయంలో స్థానిక వైసీపీ M.L.A. కన్నబాబు సోదరుడు, అనుచరుడు పెదబాబు తన కుమారుడిని మోసం చేశారని మృతుడి తల్లి ఆరోపించారు. వివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతలను ఆశ్రయిస్తే భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారని తెలిపారు. MLA కన్నబాబు సోదరుడి దౌర్జన్యాలు భరించలేకే శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. భూ ధ్రువపత్రాలు తన వద్దే ఉంచుకుని MLA సోదరుడు శ్రీకిరణ్‌ని వేధించారని మండిపడ్డారు. శ్రీకిరణ్‌ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులంతా కలిసి.. వైసీపీ నేతల దందాలు, కబ్జాలను ఎదిరించాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.

LOKESH: ఇదీ యువగళం విజయ ప్రస్థానం

నారా లోకేశ్‌ ప్రారంభించిన కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 208రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగి 2852.4 కిలో మీటర్ల మేర పూర్తయింది. ఇప్పటివరకు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. 208రోజుల పాదయాత్రలో యువనేత లోకేష్‌కు 4 వేలకు పైగా వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగళం పాదయాత్రలో కోటిమంది ప్రజలు యువనేతతో వివిధ మార్గాల్లో అనుసంధానమయ్యారు. ప్రతిజిల్లాలోనూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న స్పందన తట్టుకోలేక అధికార పక్షం పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగింది. లోకేష్‌తో పాటు స్థానిక నేతలపైనా పోలీసులు అనేక కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లు జెలుకెళ్లారు. వాటన్నింటిని అధిగమించిన లోకేష్‌ యాత్రను విజయవంతంగా కొనసాగించారు. ఇప్పుడు విరామం తర్వాత సైతం మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి... వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టనున్నారు.