చిట్టి న్యూస్

బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు

140 కోట్ల భారతీయుల కల చంద్రయాన్ 3 ద్వారా నెరవేరబోతుందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని కోరుకుంటు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్‌లోని శ్రీ భద్రకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖగోళంలోని చరిత్రను కనుక్కున్న గొప్పదేశం మన భారత దేశమన్నారు. ఆనాడు వాజ్‌పేయి ప్రభుత్వ హాయంలో చంద్రయాన్‌కు అంకురార్పణ జరిగిందని తెలిపారు. నేడు ప్రధాని మోదీ హాయంలో చంద్రయాన్ 3 విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్ధించామని రాకేష్‌ రెడ్డి తెలిపారు.

గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ యార్లగడ్డ వెంకట్రావు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు యార్లగడ్డ వెంకట్రావుని గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో ఉన్న పిల్ల సైకోని గుడివాడలో ఉన్న సన్న బియ్యం సన్నాసిని ఓడిస్తామని శపథం చేశారు. ఇదే కోవలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున కీలక వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఇందులో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్ లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గ నేతలు ఉన్నారు. 

తర్లువాడ కొండను పరిశీలించిన జనసేన బృందం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంస్థకి తర్లువాడ భూ కేటాయింపులపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే తర్లువాడ కొండను జనసేన బృందం పరిశీలించింది. వైసీపీ ప్రభు త్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖలో కొండలన్నీ కబ్జాకు గురవుతున్నాయంటూ ఆందోళన చేపట్టారు. అక్రమార్కులు కొండల్ని బోడిగుండు చేస్తున్నారం టూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్లువాడ లక్ష్మీనరసింహస్వామి తిరగాడిన కొండని, అలాంటి ఆధ్యాత్మిక కొండను కొట్టేయాలని అనుకోవడం దారుణమన్నారు

మహిళా రిజర్వేషన్లు వ్యక్తిగత ఎజెండా కాదు- ఎమ్మెల్సీ కవిత

దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ఎమ్మెల్యీ కవిత అన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని తెలిపారు. మణిపూర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

వైసీపీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. టీడీపీ సిద్దాంతాల పట్ల ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, స్థానిక నాయకత్వం ఎవరిని అంగీకరిస్తుందో వాళ్ళనే చంద్రబాబు పార్టీలోకి చేర్చుకుంటారని తెలిపారు. జగన్ చర్యలతో వైసీపీ కార్యక్తలు సిగ్గుపడుతున్నారని, సర్పంచ్‌లు చెప్పుతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్‌కు చిప్పకూడు తప్పదని తప్పదని జోస్యం చెప్పారు.   

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

జీహెచ్ఎంసీ కౌన్సిల్ కీలక సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షత ఈ భేటీ కొనసాగుతోంది. బల్దియా కార్మికుల సమ్మెకు దిగిన నేపథ్యంలో.. కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అటు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అటు జీహెచ్ఎంసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లను ఆమోదించాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

చేతిలోని గన్ మిస్ ఫైర్ కావడంతో గార్డ్ ఇంచార్జ్, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేటకు చెందిన భూపతి శ్రీకాంత్ తెల్లవారుజామున విధులు ముగించుకొని నిద్రకు ఉపక్రమించే తరుణంలో చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అతని తలలోకి బుల్లెట్ దూసుకు పోయింది. అలికిడికి లేచిన పోలీసులు తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో శ్రీకాంత్ మృతి చెందాడు.  

Chandrayan 3: దేశవ్యాప్తంగా సర్వమత ప్రార్ధనలు

చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాధువులు యాగం చేపట్టారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు వారణాసిలోనూ చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒడిషా సముద్ర తీరంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ విక్రం ల్యాండర్‌ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్‌ కావాలని ఇసుకతో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ కావాలని కోరుకుందాం.   

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో సినీఫక్కీలో చోరీ

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో సినీఫక్కీలో చోరీ జరిగింది. కారును వెంబడించి పోలీసుల పేరుతో రెండు కోట్ల నగదును తీసుకెళ్లారు దుండగులు. ఎస్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ సంస్థకు చెందిన 2కోట్ల రూపాయల్ని సంస్థ మేనేజర్ శ్రీపతి అనుపకుమార్‌ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కారును ఆపి లాఠీలను చూపించి నగదు తీసుకెళ్లినట్లు చెప్పారు. అసలు విషయం తెలియడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదును బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Secretariat: నల్లపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపన వేడుకలు

తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యహవాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం చేయనున్నారు. 24న ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి కార్యక్రమాలను చేపడుతారు. 25న ఉదయం చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.

ఆర్థిక శాఖకు మాజీ ఆర్థికమంత్రి యనమల లేఖ

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వివరాలు తెలపాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌‌కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేశామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కాగ్‌కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలను ప్రశ్నించారు. కాగ్ 2022 ఆడిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

Vishakapatnam: పద్మనాభం మండలంలో వైసీపీ నాయకుల వీరంగం

విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవిడి సచివాలయం పరిధి రౌతులపాలెంలో వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మోపాడ ఆదినారాయణపై సర్పంచ్ అనుచరులు కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. 'స్పందన'లో సర్పంచ్‌ కుమారుడి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసినందుకు రెక్కీ నిర్వహించి దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు సర్పంచ్‌ కుమారుడి పేరిట నమోదు చేసుకున్నారని ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. దాడికి ప్రోత్సహించిన కోన రమణతో పాటు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యర్థులు ఎవరైనా బీఆర్‌ఎస్‌దే గెలుపు: మంత్రి పువ్వాడ

ప్రత్యర్థులు ఎవరైనా బీఆర్‌ఎస్‌దే గెలుపన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలు పోటీ చేయడానికి భయపడుతున్నాయని అన్నారు. జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించుకుంటామని చెప్పారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో పువ్వాడ సమావేశమయ్యారు. 

ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి..కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది

ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తెలిపారు. ముస్లింలను కేసీఆర్‌ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పోటీ తమపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. 14 శాతం ఓటర్లున్న ముస్లింలకు ముస్లిం బంధు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం దోస్తీతో ముస్లిం మైనార్టీలకే నష్టమన్నారు.

కనిగిరి బాలిక హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో సంచలనం సృష్టిస్తున్న బాలిక హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. నేలటూరు గొల్లపల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో బాలిక హత్యకు గురైంది. చెట్ల పొదల్లో బండరాయితో అతి కిరాతకంగా కొట్టిచంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 8న సాయంత్రం కనిగిరిలో గర్ల్స్‌ హైస్కూల్‌ నుంచి బాలికను తండ్రి తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. 

తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు

తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు.కాంగ్రెస్‌పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్సేనన్నారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఉచిత కరెంట్‌ను వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్ అని.. డబ్బుల కోసం మధ్యం టెండర్లు 3 నెలల ముందే వేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.  

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

కృష్ణా జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు టీడీపీ నేత వెనిగండ్ల రాము. అభిమానులతో కలిసి కేకును కట్ చేసిన వెనిగండ్ల రాము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇండియాకే మెగాస్టార్ చిరంజీవి అన్నారు.చిరంజీవి పవర్‌ఫుల్‌ వ్యక్తి అని ఈమధ్య కొంతమందికి జ్ఞానోదయం అయిందని, చిరంజీవిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఈరోజు లెంపలు వేసుకుంటున్నారని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శమని అన్నారు వెనిగండ్ల రాము.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి బిగ్‌ షాక్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. అమిత్‌ షా సభకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు సత్యనారాయణ రాజీనామా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌ పాలన అద్భుతంగా ఉందని.. సంక్షేమ పథకాలు బాగున్నాయని కోనేరు సత్యనారాయణ తెలిపారు. అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నానని.. ఈ నెలాఖరులో పార్టీలో చేరతానన్నారు. కొత్తగూడెంలో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను కూడా కలిశారు సత్యనారాయణ. 

గాంధీభవన్‌కు దరఖాస్తుల వెల్లువ

కాంగ్రెస్‌ ఆశావహులు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. ఐదు రోజుల్లో 280 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న ఒక్క రోజే 220 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండటంతో.. మరో 200 దరఖాస్తులు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న నేతలతో గాంధీభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. 

బోరున వీలపించిన ఎమ్మెల్యే రాజయ్య

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌ రాకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య బోరున వీలపించారు. సీఎం కేసీఆర్ లిస్ట్‌ ప్రకటించిన తరువాత తొలిసారి స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు వెళ్లిన రాజయ్యకు.. కార్యకర్తలు బాధాతప్త హృదయాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను చూసిన రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇక దళిత బంధు 1100మందికి వచ్చేలా సిఫారసు చేసినట్లు తెలిపారు. 

రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు చేస్తున్నారు- డీకే అరుణ

బీఆర్ఎస్​ప్రజాప్రతినిధులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని పబ్లిక్​ సమస్యలు పరిష్కరించడం చేతకావట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు చేస్తున్నా, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రశ్నించాల్సిన అధికారులు బీఆర్ఎస్​ నేతలకు వంత పడుతుండటం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్​ ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్టు కేటాయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. 

కేసీఆర్‌ మమ్మల్ని దూరం పెట్టారు: కూనంనేని

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు.బీజేపీతో ఒప్పందంలో భాగంగానే..కేసీఆర్‌ వామపక్షాలను దూరం పెట్టారని ఫైర్‌ అయ్యారు. మునుగోడులో ఉప ఎన్నిక గెలుపు కోసం తమను వాడుకొని,తర్వాత దూరం పెట్టారని కూనంనేని అన్నారు.సీపీఎంతో కలిసి ఎన్నికలకు వెళ్తామని,ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే కాంగ్రెస్‌తో కలసి వెళ్లాలన్న చర్చలు జరగలేదని అన్నారు.  

మాల్‌ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర ప్రపంచంగా పేరుగాంచిన CMR షాపింగ్ మాల్.. తన 23వ నూతన షోరూంను సూర్యాపేటలో ప్రారంభించింది. మంత్రి జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, స్థానిక కౌన్సిలర్లతో కలిసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ప్రపంచస్ధాయి షాపింగ్ అనుభూతిని కలిగిస్తోందని మంత్రి జగదీశ్ అన్నారు. జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతోందని అన్నారు. ప్రారంభోత్సవంలో సినీ నటి సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 

విశాఖ జిల్లా భూబాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన టీవీ5

విశాఖ జిల్లా తర్లువాడ భూబాగోతాన్ని టీవీ5 వెలుగులోకి తెచ్చింది.వరస కథనాలతో వాస్తవాలను బయట పెట్టింది.టీవీ5 కథనాలతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు చెలరేగాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భూ కేటాయింపు ప్రతిపాదనలపై స్థానికులు ప్రజాసంఘాలు,ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.ఈ వ్యవహారం పై ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపధ్యంలో తర్లవాడ కొండపై టీడీపీ నేతల ఆందోళన చేపట్టారు.తర్లువాడ భూములు కాపాడాలంటూ నినాదాలు చేశారు భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్‌ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ నిర్విరామంగా సాగుతోంది. అధికార పార్టీ అండతో ఇప్పటికే అడ్డూ అదుపు లేకుండా మట్టి, ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. తాజాగా చెట్లపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది వరుసగా చెట్ల నరికివేత కొనసాగుతోంది. అవనిగడ్డ గుర్రపు చెరువు, బందలాయి చెరువుల్లో భారీ వృక్షాలు ఇటీవల నరికి అమ్మేశారు. అవనిగడ్డలోని తంగిరాల వీర రాఘవయ్య గ్రామ పంచాయతీ పార్కులో భారీ వృక్షాలు అక్రమ నరికివేతకు గురయ్యాయి. అవనిగడ్డలో వాల్టా చట్టం పూర్తిగా ఉల్లంఘనకు గురవుతోంది.

KCR: K అంటే కాలువలు,C అంటే చెరువులు,R అంటే రిజర్వాయర్లు

KCRకి కొత్త భాష్యం చెప్పారు మంత్రి హరీష్‌ రావు.K అంటే కాలువలు,C అంటే చెరువులు,R అంటే రిజర్వాయర్లు అన్నారు. BRSకి కూడా కొత్త అర్ధం చెప్పారు. B అంటే భారత,R అంటే రైతు,S అంటే సమితి అని అన్నారు. రేపు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి హరీష్‌రావు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో 10కి 10 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ ఇంతస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదని,బీజేపీకి క్యాడర్, కాంగ్రెస్‌కు లీడర్ లేరని సెటైర్లు వేశారు. 

తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో అనుచరుల అసంతృప్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క వైరా మినహా మిగిలిన తొమ్మిది స్ధానాల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు దక్కాయి. వైరాతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు విషయంలో మార్పు ఉంటుందని భావించినా అంచనాలకు భిన్నంగా వైరా మినహా మిగిలిన స్ధానాలకు పాతవారినే ఖరారు చేశారు. పాలేరు టికెట్ కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. చివరికి సీఎం కేసీఆర్ కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

Telangana BRS: బీఆర్ఎస్‌లో పెరిగిన అసంతృప్తి జ్వాలలు


బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. బీఆర్ఎస్‌ టికెట్‌ దక్కని నేతలు అధిష్టానాన్ని టార్గెట్ చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వేముల విరేశం, భేతి సుభాష్ రెడ్డి తోపాటు బొంతు రామ్మోహన్‌ బీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంటోన్మెంట్‌ టిక్కెట్ ఆశించిన క్రిశాంక్‌ కూడా సందిగ్ధంలో ఉన్నారు. మెదక్‌ నుంచి టికెట్‌ ఆశించిన మైనంపల్లి రోహిత్‌ కూడా బంగపడ్డారు. ఇక మల్కాజ్‌గిరి టికెట్‌ ఇచ్చినా మైనంపల్లి హనుమంతురావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Bandi Sanjay: దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర

దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ఆయన.. అవినీతిలో, అప్పుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్నారు. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ అన్నారు.

AP TDP: కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి బంధువులు..

విశాఖలో భూముల వ్యవహారంపై ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. తర్లువాడ కొండకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇక్కడి ప్రజలు పవిత్రమైన కొండగా భావిస్తారని అన్నారు. అలాంటి తర్లువాడ కొండ కబ్జాకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి బంధువులు..ప్రభుత్వానికి దరఖాస్తు చేశారని 300 కోట్ల విలువైన భూమిని 20 కోట్లకు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తర్లువాడ కొండపై భూమిని ఏ2 విజయసాయిరెడ్డికి. ఏ1 జగన్ అప్పనంగా అప్పగించే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపించారు. 

Srikakulam: మందస మండలంలో ఎలుగుబంట్ల హల్‌చల్

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. మల్లెనవారిపేట వాసులను భయపెడుతున్నాయి. ఉదయం గ్రామశివారుల్లోని కొండల్లో ఉంటూ.. రాత్రి వేళ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. దొరికిన ఆహారం తింటూ రోడ్లపై తిరుగుతున్నాయి. వాటిని చూసి గ్రామస్తులు హడలిపోతున్నారు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు మల్లెనవారి పేట వాసులు భపడుతున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఎలుగుబంట్లను బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో కలకలం రేపిన బీజేపీ నేత మిస్సింగ్

హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్సింగ్ కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి శరణ్ చౌదరి బయటకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శరణ్ చౌదరి ఫోన్ స్వీచ్ఛాఫ్ అయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. ఆందోళ చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా శరణ్ చౌదరి కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్న సీపీఐ

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటనతో ఆ పార్టీలోని ఆశావహులతో పాటు వామపక్షాలకు కేసీఆర్‌ షాకిచ్చారు. కేసీఆర్‌పై సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నమ్మించి ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు ఇవాళ సమావేశం కావాలని నిర్ణయించారు.కాసేపట్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత రెండు పార్టీల నేతలు భేటీ అవుతారు. సమావేశంలో అందరితో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటికే నిర్ణయించారు.  

ఖానాపూర్ ఎమ్మెల్యే బరిలో ఉంటా- రేఖానాయక్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే బరిలో తాను ఉంటానని ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటాననేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా ఇంకా 49 రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. తన భర్త మనోవేదనతోనే కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి చూపిస్తా అని రేఖానాయక్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా; ఉమ్మడి మెదక్ జిల్లాలో అసమ్మతి

బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్ధుల ప్రకటనతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అభ్యర్ధుల పేర్లు ఖరారు కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్కసారిగా అసమ్మతి రాజుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాలు ఉండగా.. నర్సాపూర్ మినహా 9 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. జహీరాబాద్, మెదక్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో ఆశావాహులు నిరసన గళం వినిపిస్తున్నాయి. 

కేసీఆర్ పోటీపైనే ఆసక్తికర చర్చ;  గజ్వేల్‌, కామారెడ్డి స్ధానాల్లో బరిలోకి దిగే అవకాశం

ప్రత్యర్థులకు అంచనాలకు అందకుండా అభ్యర్థుల అనూహ్య మార్పులు చేర్పుల ప్రయోగాలు కూడా చేస్తుంటారు గులాబీ బాస్. ఇందులో భాగంగానే ఈ సారి ఆయన కామారెడ్డి పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ పోటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.కామారెడ్డి నియోజకవర్గంతో కేసీఆర్ కు చాలా అనుబంధం ఉంది.ఈ జిల్లాలోని బీబీ పేట్ మండలం కొనాపూర్ లో జన్మించారు కేసీఆర్.కామారెడ్డి నియోజక వర్గంలో కేసీఆర్ పూర్వీకుల మూలాలు ఉన్నాయి.పైగా గంప గోవర్ధన్‌ పై కామారెడ్డిలో వ్యతిరేకత రావడంతో స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారని సమాచారం.