- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను నిలదీశారు మహిళలు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్త రెడ్డి పాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను నాలుగేళ్లలో ఏంచేశారని నిలదీశారు స్థానికులు.రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించకుండా..తమ ఊరికి ఎందుకొచ్చారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టిన ఇంటింటికి రేషన్ బియ్యం కూడా తమకు అందడం లేదంటూ కొత్తరెడ్డి పాలెం గ్రామస్తులు నిరసన తెలిపారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో మహిళలు రోడ్డెక్కారు. 13వ వార్డులో రెండు నెలల నుంచి రేషన్ అందడం లేదని తోపుమఠం మహిళలు ముంబై హైవే పై ధర్నా నిర్వహించారు. రేషన్ సరఫరా ఎందుకు చేయడం లేదని నిలదీస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నాడని మహిళలు ఆరోపిస్తున్నారు.

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు, సాహసాలు చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ 373 వ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని కిషన్ రెడ్డి కొనియాడారు. అనంతరం ఖమ్మం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

కర్నూలు మార్గదర్శి లో రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాలు ధిక్కరించి నిన్న ఆర్ధరాత్రి ఒంటి గంట వరకు సోదాలు చేశారు. ఇవాళ ఉదయం మూకుమ్మడిగా సోదాలు ప్రారంభించారు. నిన్న అర్ధరాత్రి మార్గదర్శి కార్యాలయం బయట నోటీసులు అంటించి ఫోటోలు తీసుకుని వెంటనే చించేశారు. ఇదే విషయాన్ని అధికారుల దగ్గర మార్గదర్శి మేనేజర్ ప్రస్తావించగా చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున దాటవేశారు. ఈ సోదాల్లో సీఐడీ సీఐ డేగల ప్రభాకర్, చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున, డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిందంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్‌లో కేంద్రమంత్రి కిషన్‌కు రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. దళితుల భూముల్ని కూడా బీఆర్‌ఎస్ నేతలు ఆక్రమించారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు కిషన్ రెడ్డి. అంతకు ముందు చౌటుప్పలో సర్దార్ సర్వాయి పాపన్న 373 జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

సోమశిల జలాశయంలో 20 టీఎంసీల నీటిని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. చెరువుల్లో మట్టి తవ్వేసి కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రైతులను నష్టపరిచి వైసీపీ నేతలు మట్టి అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. సిలికాలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆ డబ్బంతా లోటస్‌పాండ్‌కు వెళుతుందని ఆరోపించారు. అసైన్డ్ భూముల్ని కాజేసే కుట్ర జరుగుతోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రి అక్రమ సంపాదనతో విదేశాల నుంచి తెచ్చిన సామాగ్రితో ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు.

సింహాద్రి రమేష్ అనవసర ప్రేలాపనలు, గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సముద్రపు కరకట్ట అభివృద్ధిని డిమాండ్ చేస్తూ.. అవనిగడ్డ నియోజకవర్గంలోని సొర్లగొంది నుంచి గుల్లలమోద వరకు ఆయన పాదయాత్ర చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా డెల్టా వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా చేయించుకోవాలని సవాల్ విసిరారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని బుద్ధప్రసాద్ నిలదీశారు. మత్స్యకారులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు

గంగవరం పోర్టు రణరంగాన్ని తలపించింది. సమస్యల పరిష్కారంపై కార్మికులు పోర్టును ముట్టడించడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా నిర్వాసితులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు చేస్తున్నా.. పోర్టు యాజమాన్యం స్పందించకపోవడంతో పోరుబాట పట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను చేధించుకుని కార్మికులు.. ఒక్కసారిగా ముందుకు రావడంతో ఆ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తింది. ఇనుప కంచెలను దాటి పోర్ట్ గేట్‌ను ముట్టడించారు. తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు పోలీసులకు, కార్మికులకు గాయాలయ్యాయి.

తెలంగాణలో వైన్ షాపులకు టెండర్లు పోటెత్తుతున్నాయి.. నిజామాబాద్ జిల్లాలోనూ వ్యాపారులు పోటీ పడుతున్నారు. శ్రావణమాసం సెంటిమెంట్‌తో టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకపోయినా.. కలిసొస్తుందన్న ఆశతో వారిపై టెండర్లు వేస్తున్నారు. ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండటంతో వైన్ షాప్‌ల టెండర్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత ఏడాది నిజమాబాద్ జిల్లాలో 102మద్యం దుకాణాలకు 17 వందల దరఖాస్తులు వచ్చాయి. ఈఏడాది ఈ సంఖ్య 2వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జనగామ బీఆర్‌ఎస్‌లో టికెట్ రాజకీయం వేడుక్కుతోంది. బుధవారం ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న హరిత టూరిజం ప్లాజాలో జరిగిన హైడ్రామా దృష్ట్యా....ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గీయులు పల్లా తీరుపై సీరియస్ అయ్యారు. పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్దు అంటూ.... ఎమ్మెల్యే వర్గీయులు జనగామ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనగామలో గ్రూపు రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
మూడు జిల్లాల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ కార్యకర్తలను పిలవాల్సిన అవసరమేంటని ముత్తిరెడ్డి వర్గీయులు ప్రశ్నించారు. జీడిమెట్ల దగ్గర పేదలకు సంబంధించిన మూడు ఎకరాల స్థలాన్ని పల్లా ఆక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉండి జనగామకు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మూడోసారి టికెట్ వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నేత భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పారు. ముత్తిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని అన్న మండలాల కార్యకర్తలు హైదరాబాద్ మల్లాపూర్‌లోని నోమ ఫంక్షన్‌హాల్‌కు తరలివచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వారితో సమావేశం అయ్యారు. కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించారు. పల్లా వద్దు..ముత్తిరెడ్డి ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ కోసం అధికారులు వచ్చారు. అయితే.. ఉపాధి అవకతవకలు జరిగినట్లు ప్రజలు గళమెత్తారు. కొత్తపేటలో వేయని గ్రావెల్ రోడ్ వ్యవహారంలో.. 7 లక్షలు వైసీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. అధికారులకూ ప్రమేయం ఉందని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేయని పనులకు, పనికి హాజరుకాని వారి పేర్లు నమోదు చేసి.. ఉపాధి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రేపు అమలాపురంలో చంద్రబాబు పర్యటిస్తారు. అధినేత పర్యటన కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ అమలాపురంలో టీడీపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గడియారం స్తంభం సెంటర్ మొత్తం పసుపు మయంగా మారింది. చంద్రబాబు రాక కోసం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు..

సత్యసాయి జిల్లాలో పలువురు వాలంటీర్ల తీరు వివాదాస్పదం అవుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ సర్పంచ్.. వార్డ్ మెంబర్ స్థానాల భర్తీకి ఈనెల 19న పోలింగ్ జరగనుంది. మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మండలంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఐదుగురు వాలంటీర్లు పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రలోభాలకు చేశారు. అధికారులు ఏం చేస్తున్నారని విపక్షాలు నిలదీస్తున్నాయి.

తిరుపతిలోని సెలెక్ట్ మొబైల్స్ ఆధ్వర్యంలో మిషన్ ఈ-వేస్ట్ కలెక్షన్ సెంటర్‌ను TTD ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలతో పర్యావరణం కాలుష్యం అవుతుందని ఆయన తెలిపారు. వ్యర్ధాలను సేకరించి మానవాళికి నష్టం లేకుండా యాజమాన్యం చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. ఏపీలో మొదటిసారి మొబైల్ వ్యర్ధాలను సేకరిస్తున్నామని సెలెక్ట్ మొబైల్స్ ప్రతినిధి గురు తెలిపారు. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను తమకు అందిస్తే కొత్తగా కొనుగోలు చేసే వస్తువులకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను తమ షాపుల్లో డిపాజిట్ చేయాలని కోరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలు… ఇప్పుడు అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. ఇవాల్టి నుంచి నిజ శ్రావణ మాసం మొదలైంది. శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. రేపు శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి విశేషమైన రోజుగా ఎంచుకుంటారు. అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రచారం వంటివి శ్రావణమాసంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రావణమాసంలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉందటున్నారు రాజకీయ పరిశీలకులు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శ్రావణంలోనే ప్రకటించింది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగించే అవకాశం ఉంది. శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదంలో ప్రథమార్ధం వినాయక చవితి సందడితో ముగుస్తుంది. ద్వితీయా ర్ధం పితృపక్షాలను అంత శుభకరంగా భావించరు.
గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సెప్టెంబర్ 7, 2018 న శుక్రవారం రోజే ప్రకటించింది. ఇప్పటికే 80 నుంచి 87 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రావణమాసంలో ఏ క్షణంలో అయినా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోలేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు, ఈ నెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని విశేషమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో అదేరోజు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం లేకపోలేదు. అంతేకాదు, శ్రావణంలో శుక్ల దశమి, పౌర్ణమి, కృష్ణపక్షంలో విదియ, తదియ కూడా అభ్యర్థుల ప్రకటనకు, ఇతర రాజకీయ ఎత్తుగడలకు అనువైన రోజులుగా పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 2 లోపు తొలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆషాడం, అధికమాసం పూర్తి కావడంతో జాబితా రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్.
మరోవైపు శ్రావణం ముగిసేలోపు మ్యానిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. సెప్టెంబర్ 15న సోనియా గాంధీతో చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల చేయించాలన్నది టీపీసీసీ యోచన. అభ్యర్థుల దరఖాస్తులకు ఈ శ్రావణం లోనే శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఆ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం వల్ల నష్టం జరిగిందని, ఈసారి అలా జరగకుండా దశల వారీగా జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇక.. బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌లో ఒక సీటుకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండగా, కాంగ్రెస్‌కు ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగ్గ అభ్యర్థులు కనిపించడం లేదు. సిట్టింగ్ ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపాల్సిందిగా రాష్ట్ర బీజేపీని అమిత్ షా ఆదేశించారని సమాచారం. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారని, మిగతా సెగ్మెంట్ల కోసం అభ్యర్థులను వెతకాల్సిందిగా పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ రేస్ మొదలైంది. టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య సమన్వయం చేసే పనిలో అబ్జర్వర్స్ ఉన్నారు. రేపటి నుంచి గాంధీ భవన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు. దీంతో పాటు ఎవరికి టికెట్ వచ్చినా తాము పని చేస్తామనే హామీ పత్రాన్ని కూడా తీసుకోనున్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేయనుంది. సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగనుంది. ఈ నెల 24న చేవెళ్లలో భారీ బహిరంగ సభను పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి గులాబీ కండువా కప్పుకోనున్నారు. మంత్రుల సమక్షంలో బీఆర్‌ఎఎస్‌లో చేరనున్నారు. దీంతో పొంగులేటి శిబిరంలో గుబులు మొదలైంది. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయంటూ సంకేతాలు ఇస్తోంది. తెల్లం వెంకట్రావు 2018 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పొంగులేటితో పాటే కాంగ్రెస్‌లో చేరారు. భద్రాచలం టికెట్ పై మంత్రులు భరోసా ఇచ్చిన నేపధ్యంలో ఆయన తిరిగి తన మద్దతు దారులతో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

జిల్లా దేవనకొండలో దారుణంకర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కుమారుడికి పురుగుల మందు తాగించి తాను తాగి కొడవలితో హల్చల్ చేశాడు. పత్తికొండకు చెందిన ఎరుకల బసవరాజు దేవకొండకు చెందిన అనితను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుట్టాక భార్యపై అనుమానంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య అనిత దేవనకొండలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది.
అయితే ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు బసవరాజు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును కుమారుడికి తాగించాడు. ఆ తర్వాత తాను తాగాడు. అనంతరం వేటకొడలితో వీధిలో వీరంగం సృష్టించాడు. తన భార్య తనను మోసం చేసిందంటూ అరుస్తూ అందరిని భయాందోళనకు గురి చేశాడు. అనంతరం కిందపడిపోయి చనిపోయాడు. అటు పురుగుల మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏపీ విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ చేపట్టిన ఛలో విద్యుత్ సౌధ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. డాక్టర్ NTTTPS పాత గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంట్రాక్ట్ కార్మికుల తమ డిమాండ్ల పరిష్కరించాలంటూ చలో విద్యుత్ సౌధకు పిలుపు నిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంజినీర్ల సంఘం సంయుక్తంగా ఛలో విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

తిరుమలలో మెట్ల మార్గంలో లక్షితను చంపిన చిరుతను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. బాలిక లక్షితను చంపింది మొదట పట్టుకొన్ని చిరుతేనని తెలుస్తోంది. ఆ చిరుత సెలైవాలో లక్షిత వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 13 అర్థార్తిరి తర్వాత. బోనులో చిక్కిన మొదటి చిరుతే బాలిక లక్షితను చంపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక మరో పది రోజుల్లో రానుంది. ప్రస్తుతం రెండు చిరుతల్ని జూ క్వారంటైన్‌లో ఉంచారు అటవీ అధికారులు

గంగవరం రణరంగంగా మారింది. కార్మికుల గంగవరం పోర్టు ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను చేధించుకుని ముందుకు దూసుకు రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇనుప కంచెలను దాటి పోర్ట్ గేట్‌ను ముట్టడించారు. తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు పోలీసులకు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్ట్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని గేట్ ముందు బైఠాయించారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో బావిలో పడి బన్నీ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం కిరాణ కొట్టుకు వెళ్లారు బన్నీ. అయితే రాత్రైనా రాకపోవడంతో... నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. చివరికి పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు బాలుడి మృతదేహాన్ని బావి నుంచి బయటికి తీశాయి.

శ్రీసత్యసాయి జిల్లాలో రెండేళ్ల చిన్నారి గొంతులో వేరుశనగ విత్తనం ఇరుక్కొని మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతం వసంతపూర్ గ్రామానికి చెందిన హనుమంతు తన భార్య పిల్లలతో కలిసి నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. హనుమంతు కూతురు నయనశ్రీ ఆడుకుంటూ వేరుశనగలు దగ్గరికి వెళ్లింది. వేరుశనగను గొంతులో పెట్టుకోవడంతో ఊపిరాడక కిందపడిపోయింది. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందిందని తెలిపారు.

శ్రీకాకుళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెల్లివీధి సమీపంలో నాగావళి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. అరుగు వర్షిత్ అనే బాలుడిని స్ధానికులు రక్షించారు. గల్లంతైన వారిలో కోనా కార్తికేయ, కోనా గణేష్ గౌతం అనే ఇద్దరు బాలురు మృతి చెందారు. ఘటనాస్ధలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెల్లివీధిలో జరిగే పుట్టినరోజు వేడుకల కోసం విశాఖపట్నం ఎన్‌ఏడీ నుంచి వచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయుష్ కాలేజీల వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. గత 22 రోజులుగా వీరు ఆందోళనాపథంలో ఉన్నారు. ప్రతి రెండేళ్లకు ఓసారి ఉపకార వేతనం 15 శాతం పెంచాలని 2014లో ఇచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోన సమయంలో మౌలిక వసతులు లేకున్నా వైద్య సేవలు అందించామని.. గత ఏడాది డిసెంబర్ నుంచి స్టైఫండ్ రావడం లేదని వాపోతున్నారు. స్టైఫండ్ పెంచకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే ఆయుష్ శాఖను తొలగించాలన్నారు.

విజయవాడలో మహాత్మగాంధీజీ భారీ కాంస్య విగ్రహం మాయమైంది. దీంతో వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. కాంస్య విగ్రహాన్ని కరిగించి అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంస్య విగ్రహాం మాయం వెనుక దుర్గగుడి దొంగలున్నారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దుర్గగుడిలో వెండి సింహాలు మాయం చేసిన వారే... కాంస్య విగ్రహాన్ని మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్ళైన సందర్భంగా నగరపాలక సంస్ధ ఎదుట గాంధీ కాంస్య విగ్రహాం ఏర్పాటు చేశారు అధికారులు. అన్నాహజారే చేతుల మీదుగా 30 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ప్లైఓవర్ నిర్మాణం సందర్భంగా విగ్రహాన్ని రాజీవీ గాంధీ పార్క్‌లో భద్రపరచారు అధికారులు. ప్లైఓవర్ పూర్తైనా విగ్రహాన్ని పున:ప్రతిష్టించకపోవడంతో విగ్రహాంపై ఆరా తీయడంతో విగ్రహం మాయమైందని నిర్ధారణకొచ్చారు. ఈ విగ్రహం ఏమైందన్న ప్రశ్నకు నీళ్ళు నములుతున్నారు నగరపాలక సంస్ధ అధికారులు. విగ్రహాం ఎక్కడుందో తెలియదంటున్న అధికారులు విగ్రహాన్ని మాత్రం కరిగించలేదంటున్నారు. ఈ గాంధీ విగ్రహాన్ని అపహరించిందెవరో చెప్పాలంటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

హైదరాబాద్ లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడికి యత్నించారు.పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. మద్దతుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, ఉద్యోగులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు GSN కన్వెన్షన్ హాల్‌లో స్వాతంత్ర సమయోధుడు.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్థార్ గౌతులచ్చన్న 115వ జయంతి నిర్వహించారు. గౌతు లచ్చన్న విగ్రహానికి, ఎన్‌టీఆర్ చిత్ర పటానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. చిన్నారులను ఎత్తుకుని ఆశీర్వదించారు. చంద్రబాబుతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహం చూపించారు.

జగన్ ప్రభుత్వానికి గౌతు లచ్చన్న లాంటి వ్యక్తిని గౌరవించుకునే కనీస సంస్కృతి లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాంమోహన్ నాయుడు అన్నారు. గౌతు లచ్చన్న విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. శ్రీకాకుళంలో సర్ధార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రైతుల కోసం ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు సర్దార్ పాదయాత్ర చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నిర్వీర్యం చేస్తోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నేతలు నిరసనకు దిగారు. శ్రీవారి భక్తులపై టీటీడీ కఠిన ఆంక్షలు విధించిందంటూ ఆందోళన చేపట్టారు. నడకదారి భక్తులపై పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. టీటీడీ నిబంధనల వల్ల భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. టీటీడీ నిర్ణయాలు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. శ్రీవారి భక్తులకు ఊతకర్రలు పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మెన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.

అమరావతి టు నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాలంటూ అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రైతులు పోరుబాట్టారు.కలెక్టరేటే గేట్ ముందు ధర్నాకు దిగిన రైతులు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నేషనల్ హైవే పేరుతో పచ్చని పంట పొలాలను తీసుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. చింతకాని, రఘునాథపాలెం మండలాలలో సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ రైతులు మండిపడ్డారు. ఎకరానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

టిడిపి నేత వంగవీటి రాధాకృష్ణకు వివాహాం నిశ్చయమైంది. నరసాపురానికి చెందిన రాజకీయకుటుంబానికి చెందిన యువతితో రాధాకృష్ణ వివాహాం జరగనున్నట్లు తెలుస్తుంది. నరసాపురం మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీల కుమార్తె పుష్పవల్లితో సెప్టెంబరు 6న వివాహా ముహుర్తాన్ని ఖారారు చేసినట్లుగా సమాచారం. ఇటీవల వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ నరాసాపురం వెళ్ళినప్పుడు జక్కం బాబ్జి ఇంటిలోనే బసచేశారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చొరవతో ఈ వివాహాం నిశ్చయమైందనే ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ సర్కార్ పకడ్బందీగా డబుల్ స్కెచ్ వేసింది. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీయే టార్గెట్‌గా పెట్టుకుంది. హైదరాబాద్ మంత్రులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, పురోగతిపై చర్చించారు. నిర్మాణం పూర్తయిన 70 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఐదు విడతల్లో మొత్తం లక్ష ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్‌కు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ హాజరయ్యారు.

హనుమకొండ శ్రీనివాస కిడ్ని సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పేషంట్లు, వారి బంధువులు బయటికి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 12 మంది పేషంట్లు ఉన్నారు. ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన పేషంట్లను బయటికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆపరేషన్ థియేటర్ సామాగ్రి మొత్తం కాలి బూడిద అయ్యింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

చంద్రునిపై పరిశోధన కోసం భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. ఇవాళ జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇవాళ మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుని చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వీటీపీఎస్ ప్రధాన గేటు వద్ద... నిరసన తెలిపారు రేపటి చలో విజయవాడ జరిపి తీరుతామన్నారు. ఎంతమంది పోలీసుల్ని పెట్టినా తమ పోరాటం ఆగదంటున్నారు ఉద్యోగులు. 45 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలతో పాటు విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్‌ఎం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రమోషన్ డిక్లేర్ చేయాలన్నారు. EPF ఉద్యోగులందరినీ GPF కు మార్చాలంటూ నినాదాలు చేశారు. కార్మికులకు జగన్ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


