- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గంలో MROపై వైసీపీ నేత జులుం పదర్శించారు. కొండాపురం మండల MROని నలుగురి ముందు ఏకంగా అన్ ఫిట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఇన్‌ఛార్జి మేకపాటి రాజ్‌గోపాల్ రెడ్డి.మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా పిర్యాదులు రావడంతో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తహశీల్దారును పిలిపించి మీలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి.. జిల్లా కలెక్టర్ కు చెప్పి మరో ఎమ్మార్వోను తెచ్చుకోండి అంటూ సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ లో బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ ను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఓయూ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. వర్సిటీ వీసీ రవీందర్ కూడా ఓయూ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది.లోకేష్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు.దారిపొడవునా బారులు తీరుతున్నారు జనం.పసుపు మయంగా మారింది లగడపాడు గ్రామం.దారి పొడవునా పూల దారి ఏర్పాటు చేసి పూలపై లోకేష్ ను నడిపించి తమ అభిమానం చాటుకున్నారు

చిన్నారి లక్షిత పోస్టుమార్టం పూర్తి అయింది.రూయా ఆస్పత్రి మార్చురీలో పంచనామా చేసి..మృత దేహాన్ని లక్షిత స్వస్థలం పోతిరెడ్డిపాడుకి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు టీటీడీ అధికారులు.చిరుత దాడిలోనే లక్షిత మృతి చెందనట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు.చిరుత దాడిగానే చిన్నారి తండ్రి దినేష్ కుమార్ కూడా నిర్థారించారు. శుక్రవారం రాత్రి అలిపిరి నడక మార్గంలో రాత్రి తప్పిపోయిన లక్షిత.. ఇవాళ ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర విగత జీవిగా కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కరీంనగర్‌లో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి నడిరోడ్డుపై ప్రత్యక్షం కావడంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు అప్రమత్తమయ్యారు. అటవీఅధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఎలుగుబంటి వెళ్లిపోవడతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం రేకుర్తిలోని పలు కాలనీల్లోనూ ఎలుగుబంటి సంచరించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలుగు బంటికి మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.

హైదరాబాద్‌లో మరో ప్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది.ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, వీఎస్టీ మీదుగా అజామాబాద్ వరకు చేపట్టిన బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ అత్యంత పెద్ద కట్టడానికి దాదాపు రూ. 450 కోట్లు కేటాయించారు. స్ట్రాటజికల్ రోడ్స్ డెవలప్మెంట్ లో భాగంగా ఎస్ఆర్టీపీ వంతెన రూపొందించారు. ఈ వంతెన 26.54 మీటర్ల ఎత్తు లో నిర్మించారు. ఈనెల ఆఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామంలో ఎటువైపు చూసిన కోతులే దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో ఒకేసారి ఇళ్లపై దాడి చేస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోని ఆహారం కోసం కోతులు ఎగబడుతున్నాయని గ్రామస్ధులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దర్శకుడు ఆర్జీవీపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సినీ ప్రముఖులను చూశాము... కానీ బరితెగించిన మృగం లాంటి రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడిని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ మరో సినిమా తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ గొప్ప నీతి మంతుడులాగా సినిమా తీస్తారా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు.

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన..వృద్ధురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైసీపీ అరాచకాలను కేంద్రం దృస్టికి తీసుకువెళుతామన్నారు పవన్. ఉత్తరాంధ్రను జగన్ దోచేస్తున్నారని విశాఖలో ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు చట్టాలను కాపాడాల్సిన సీఎం అతిక్రమిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఇద్దరు మహిళల అదృశ్యం సంచలనం రేపుతోంది. ఆస్పత్రికి వెళ్తున్నానని రాళ్లగూడలోని ఇంటి నుంచి బయటకు వెళ్లిన వడ్ల మంజుల అదృశ్యమైంది. శంషాబాద్ మండలం మదనపల్లి నుండి డ్యూటీకని బయలుదేరి కృష్ణమోని అఖిల అదృశ్యమైంది. దీంతో.. ఇద్దరు మహిళల బంధువులు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్‌లో దారుణ హత్యకు గురైన మహిళ వడ్ల మంజుల అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అర్హులైన పేదలు, లబ్దిదారులకు డబుల్ బెడ్రూం కల నెరవేరడం లేదంటోంది బీజేపీ.డబుల్ బెడ్‌రూం ఇళ్లపై పోరుబాట సాగిస్తున్న బీజేపీ ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తోంది.పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించకపోవడంపై..ఆందోళనకు పిలుపునిచచ్చారు.కేంద్రం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నిధులను ఇస్తుంటే రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టింస్తోందని మండిపడుతున్నారు. వేల డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి అనుమతి పొందినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదంటున్నారు.

అనంతపురం జిల్లాలో రైతుల అనధికారిక క్రాప్ హాలిడేని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా దాదాపు 25 లక్షల హెక్టార్లకు పైగా సాగు అయ్యేది. కానీ ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 లక్షల హెక్టార్లు కూడా పంటలు సాగు అయినట్టు నమోదు కాలేదు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు... మరొకవైపు ప్రభుత్వ సహాయ నిరాకరణే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణంగా రైతులు చెపుతున్నారు.

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ అయిపోయారు.బెంగళూరు బెల్ కంపెనీ నుండి ఐదు భారీ వాహానాల్లో ఈవీఎంలు తిరుపతి చేరుకున్నాయి.2వేల212 పోలింగ్ కేంద్రాలకు సంబందించి దాదాపు 6వేల450 ఈవీఎంలను తరలించారు.రేణిగుంటలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ ల్లో ఈవీఎంలను భద్రపరిచారు.డీఆర్వో కోదండరామిరెడ్డి సమక్షంలో భారీ భద్రత నడుమ ఈవీఎంలను పర్యవేక్షించారు. ఈవీఎంలను వైసీపీ నేత ప్రభాకర రెడ్డి, టీడీపీ నేత నర్సింహా యాదవ్ పరిశీలించారు.

ఔటర్ రింగ్ రోడ్డు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ చేతిలోకి వెళ్లిపోయంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఔటర్‌ను 30 ఏళ్లపాటు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, టెండర్లు కూడా పిలిచింది. టెండర్ ప్రక్రియలో నాలుగు సంస్థలు పాల్గొనగా.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7,380 కోట్లకు దక్కించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఔటర్‌పై టోల్ వసూళ్లతో పాటు నిర్వహణ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఔటర్‌ను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు హెచ్‌ఎండీఏ అధికారులు అప్పగించేశారు.
ఔటర్‌పై శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ ఈగిల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్ పేరిట టోల్ రసీదు రాగా.. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వచ్చింది. ఇక 30 ఏళ్లపాటు ఔటర్‌పై వచ్చే ఆదాయమంతా ఇక ఐఆర్‌బీదే. టెండరు మొత్తం రూ.7,380 కోట్లను చెల్లించిందని, దాంతో, ఔటర్‌ను ఐఆర్‌బీకి అప్పగించే ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి లాంఛనంగా పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

విశాఖలో జనసేనాని 3వ రోజు పర్యటన కొనసాగుంది. కాసేపట్లో పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్‌లో పవన్‌కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన..వృద్ధురాలి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఇక సాయంత్రం విశాఖలోని సీఎస్‌బీసీ ల్యాండ్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మరోవైపుహైటెన్షన్ మధ్య పవన్‌కళ్యాణ్ విశాఖ పర్యటన సాగుతుంది. పవన్‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిన్న రిషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పవన్ కాన్వాయ్ లోని కేవలం 5 వాహనాలకు మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పవన్ వెంట వచ్చిన నాయకుల వాహనాలను జోడుగులపాలెం వద్ద నిలిపివేశారు. రుషికొండ వద్ద కాలినడకనే రోడ్డు మీద నుంచి నిర్మాణాలను పరిశీలించారు పవన్. రుషికొండ వెళ్లే మార్గంలో జనసేన కార్యకర్తలు ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారంటూ పవన్ విరుచుకుపడ్డారు. వైసీపీ పాలకులు విపత్తుల నుంచి కాపాడే కొండనూ వదలడం లేదన్నారు. రుషికొండను అడ్డగోలుగా తవ్వుకుంటూ వెళ్తున్నారంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఒక్క రాజధానికే దిక్కులేదు... మూడు రాజధానులు అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే అతిక్రమిస్తున్నారని విమర్శించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ భీకర శపథం చేశారు. ఏకంగా గుండు కొట్టించుకుంటానంటూ.. వైసీపీ శిబిరంలో కలకలం రేపారు. అడపాదడపా విపక్షాలపై విరుచుకుపడే బొత్స.. ఈసారి ఏకంగా గుండు కొట్టించుకుంటానంటూ ఊగిపోవడంపై జనం రకరకాలుగా చర్చింకుంటున్నారు. ఇంతకీ మినిస్టర్ బొత్స ఇంత తీవ్ర ప్రతిజ్ఞ ఎందుకు చేశారనేగా మీ డౌట్. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా… ఉగాది తరువాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవట.. ఒకవేళ ఉంటే.. గుండు కొట్టించుకుంటానని బొత్స సత్యనారాయణ శపథం చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం జరిగింది. మహిళా వలంటీర్ చంద్రలీలపై మరో వలంటీర్ నాగేంద్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నంచాడు. నాగేంద్రకు సచివాలయ ఎడ్యుకేషన్ కార్యదర్శి వంత పాడాడు. మనస్థాపం చెందిన మహిళా వలంటీర్ ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

Group 2 పరీక్ష వాయిదా కోసం పోరాటం కొనసాగుతోంది. గన్ పార్క్ వద్ద మౌన దీక్ష చేయాలని అఖిల పక్షం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్ పార్క్ వద్ద 144 సెక్షన్ విధించారు. గన్ పార్కు దగ్గరకు ఎవర్నీ రానివ్వకుండా బ్యారికేడ్లు పెట్టారు. గన్ పార్కు, అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

సత్యసాయి జిల్లా తాడిమర్రిలో రోడ్డు విస్తరణ వివాదాస్పదమైంది. పరిహారం ఇవ్వకుండా.. ఇళ్ల కూల్చివేతపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా.. లెక్కచేయకుండా రోడ్డుకిరువైపులా ఐదు అడుగుల వరకు కూల్చివేశారు. 60 అడుగుల మార్కింగ్ వేసిన ఇళ్లు పడగొట్టాలనీ, లేదంటే తామే కూల్చేస్తామని అధికారులు సూచించారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారిని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటానని శ్రీరామ్ అన్నారు.

దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా దిగుబడి పెరగడంతో మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో టమాటా 300 వరకు చేరుతుందని బెంబెళెత్తిపోతున్న పరిస్థితుల్లో సామాన్యులు, పేదలను కరుణించింది. కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతుంది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

హైదరాబాద్ చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గంగారం జేపీ సినిమాస్ మాల్‌లో మంటలు చెలరేగాయి. ఐదో ఫ్లోర్‌లో ఉన్న కిచెన్‌లో మంటలు అంటుకున్నాయి. హుటాహుటినా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో జేపీ సినిమాస్ మాల్‌లోని ఐదు స్క్రీన్లు దగ్ధమయ్యాయి. అటు సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

దేశంలో ఏం జరుగుతుందో ప్రధాని మోదీకి తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైరయ్యారు. మణిపూర్‌లో హింస జరుగుతుంటే ప్రధాని మోదీ నవ్వుతూ గడపడం దుర్మార్గమన్నారు. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని స్పీచ్ చాలా అమాయకంగా ఉందన్నారు. సైన్యానికి సమయం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దుతారని... అయితే కేంద్రం ఆ పని చేయడం లేదన్నారు. అందుకే భారతమాతను చంపేశారని చెప్పా అన్నారు. ఇక మణిపూర్ ఘటనలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విశాఖ వారాహి యాత్రలో భాగంగా.. జగదాంబ జంక్షన్ మీటింగ్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్‌ను అవమానించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పవన్ ప్రసంగం ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉందని.. నిరాధారమైన ఆరోపణలు చేశారని.. విశాఖ ఈస్ట్ డివిజన్ పోలీసులు నోటీస్‌లో ప్రస్తావించారు. ఇకపై అదే విధంగా మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖ ఈస్ట్ డివిజన్ ఏసీపీ పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరులో అర్ధరాత్రి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కారణంగా నష్టపోయే భవన యజమానులకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు పనులు చేయించాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. దుకాణాల యజమానులను బెదిరించి పనులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అరాచకాలు శృతి మించుతున్నాయని టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ భగ్గుమన్నారు. అక్రమ రవాణా ఇసుక టిప్పర్ల కోసమే తాడిమర్రిలో రోడ్డు వేస్తున్నారని.. రహదారి విస్తరణ కోసం ఇళ్లు తొలగించడం దారుణమన్నారు. బాధితుల గోడు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులే జేసీబీలతో కూల్చివేయించడం సరికాదన్నారు. బాధితులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్ష కూటమి అడ్డుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ గొడవకు వత్తాసు పలికిన బీఆర్‌ఎస్.. చివరకు అవిశ్వాసంలో కలిసివెళ్లారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో విపక్షాలు సభలో లేవని.. మరి అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం దేనికని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోక పార్టీలుగా బీఆర్‌ఎస్, మజ్లిస్ కూడా వాకౌట్ చేయడం చూశామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందన్నారు.

తిరుమల ఎస్వీ మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈవో ధర్మారెడ్డితో కలిసి ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. శ్రీవారి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు భక్తులకు చూపిస్తామన్నారు. ఇక తిరుమల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

బ్రిటీష్ చట్టాలకు గుడ్ బై చెప్పిన కేంద్రం ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. CRPCకి బదులుగా భారతీయ న్యాయ సంహిత చట్టం, IPCకి బదులుకు భారతీయ నాగరిక్ సురక్షత సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ కు బదులుగా భారతీయ సాక్ష్య బిల్లును తీసుకొచ్చారు. ఈ మూడు బిల్లులకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు హోంమంత్రి అమిత్ షా. బిల్లుపై అధ్యయనానికి స్టాండింగ్ కమిటీకి సిఫార్స్ చేశారు. గ్యాంగ్ రేప్‌కు 20 ఏళ్లు లేదా జీవితకాల శిక్ష విధిస్తున్నట్లు బిల్లుకు తీసుకొచ్చారు. మైనర్‌పై అత్యాచారం కేసులో ఊరిశిక్ష విధించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు పంచుకోవడానికి సరిపోతుందని, ప్రజలకు ఉల్లిపొట్టు కూడా మిగలదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలను రెండు కళ్ళుగా సీఎం కేసీఆర్ భావించి ముందుకు సాగుతున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగవని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ ఎమ్మెల్యే ప్లెక్సీలను చించివేశారు.టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు బర్త్‌డే సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.ప్రజల్లో ఎమ్మెల్యేకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే..దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.సిక్కోలులో పులివెందుల సంప్రదాయం తేవద్దని హెచ్చరించారు.దుండగులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పార్లమెంట్‌లో పట్టపగలు ప్రతిపక్ష పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. కాంగ్రెస్ హయంలో రైతుల కళ్ళలో కన్నీరు వస్తే తెలంగాణ ప్రభుత్వంలో త్రాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు.

సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లెలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను హిందూపురం ఆస్పత్రిలో ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సవితమ్మ, నాయకులు వడ్డే వెంకట్ పరామర్శించారు. వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సవితమ్మ తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచక పాలన కొనసాగుతుంటే జగన్ ఏం చేస్తున్నట్లు అని విరుచుకుపడ్డారు. గ్రామంలోకి వాహనాల్లో వచ్చి మారణాధాయులతో దాడి చేసి గాయపరుస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆమె తెలిపారు.

తెలంగాణలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. మొబిలిటీ రంగంలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. గిగా కారిడార్‌లో భాగంగా హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి భూమి పూజ చేశారు. భారీ పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ గల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు కొత్తదనం ఉండేలా అమరరాజా కృషి చేస్తుందన్నారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు దేశంలోనే తయారవుతాయన్నారు.

గ్రూప్ -2 అభ్యర్ధుల TSPSC ముట్టడి కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అశోక్ గౌడ్ అనే కోచింగ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. అశోక్ ఆన్‌లైన్ ఇన్సిట్యూట్ పేరుతో అశోక్ గౌడ్ గ్రూప్స్ అభ్యర్ధులకు కోచింగ్ ఇస్తున్నాడు. అభ్యర్ధుల్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అశోక్ గౌడ్‌కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అశోక్ గౌడ్‌ను చంచల్ గూడా జైలుకు తరలించారు పోలీసులు.

హైదరాబాద్‌లోని కొంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికకు ఫోన్ ఆశచూపి అత్యాచారం చేశారు తండ్రికొడుకులు. కడుపు నొప్పితో బాధపడుతూ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది బాధతురాలు. బాలిక ఇంటి పక్కనే నిందితులు శివకుమార్, సామిల్ నివసిస్తున్నారు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో బాధతురాలు చికిత్స పొందుతుంది. కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

యువత క్రీడా స్పూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి.విద్యలో ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే యువతకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా వస్తువులు పంపిణి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


