చిట్టి న్యూస్

ఖమ్మంలో బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీసీ బంధు పథకంలో భాగంగా ఖమ్మంలో 290మంది లబ్దిదారులకు చెక్కులు అందజేసిన పువ్వాడ... గతంలో ఏ స్కీమ్ పెట్టినా కంటితుడుపుగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని పారదర్శకంగా అమలు అవుతున్నాయని చెప్పారు.

Vijayawada: కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్‌

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని ఫౌండేషన్ సేవలు కొనసాగుతున్నాయి. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కేశినేని ఫౌండేషన్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. మెడికల్ క్యాంపును టీడీపీ నాయకులు, కేశినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తో కలిసి ప్రారంభించారు. పేద ప్రజలకు సేవలు అందించడంలో కేశినేని ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుందని అంటున్న కేశినేని చిన్ని అన్నారు. 

మూడో విడత వారాహి యాత్రకు పవన్‌ సిద్ధం

మూడో విడత వారాహి యాత్రకు పవన్‌ సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి విశాఖలో ఆయన పర్యటించనున్నారు. మూడోవిడత వారాహి యాత్రకు సంబంధించి మాడుగుల నియోజకవర్గం జనసేన నేతలు పోస్టర్లను విడుదల చేశారు. పవన్‌ యాత్రకు భారీగా అభిమానులు, జనసైనికులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. చలో విశాఖను జయప్రదం చేయాలన్నారు. వారాహియాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పవన్‌ ఆర్జీలను స్వీకరిస్తారని జనసేన నేత రాయపురెడ్డి వెల్లడించారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో ఇసుక దోపిడీ, భూ కబ్జాలను పవన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. 

సీఎం జగన్‌పై సీపీఐ  రామకృష్ణ ఫైర్

ఏపీ సీఎం జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైరయ్యారు. జగన్‌ సీఎంగా ఉండగా పోలవరం పూర్తి కాదని విమర్శించారు. ఒక్కొక్క బాధితుడికి 10 లక్షలు ఇస్తానన్నారు కానీ.. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. గతంలో తానే పూర్తి చేస్తానన్న జగన్‌.. ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారన్నారు. 2025 నాటికి పూర్తి చేస్తామంటూ గడువు పెంచారని.. అయితే 2025 నాటికి జగన్‌ సీఎంగా ఉండరన్నారు. నిర్వాసితుల్ని నీళ్లలో ముంచి మాట మారుస్తున్నారని మండిపడ్డారు. 

వ్యవసాయ యాంత్రికరణ కోసం రూ.75 కోట్లు

బీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా కేసీఆర్ అండగా నిలబడుతున్నారని చెప్పారు. వరంగల్‌ జిల్లాలో వ్యవసాయ యాంత్రికరణ కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. 50శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల అందజేస్తున్నామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జగన్ పర్యటనలో ప్రజల ఇబ్బందులు

సీఎం జగన్‌ పర్యటనతో కోనసీమ లంక గ్రామాల ప్రజల కష్టాలు పడుతున్నారు. సీఎం సభ నేపధ్యంలో ఉదయం నుంచే వారిని సభాస్థలికి తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంటి పిల్లలతో మహిళలు నానా అవస్థలు పడ్డారు. కనీసం మంచినీరు దొరక్క నీరసంతో సభా వేదిక వద్దే కూలబడ్డారు. ఆకలితో పిల్లలు ఏడుస్తున్నా.. ఆంక్షల పేరుతో వారిని పోలీసులు కదలనివ్వలేదు. ఆకలితో మరికొందరు పక్కనే కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసుకు తిన్నారు. 

మెహబూబాబాద్ లో రోడ్డు ప్రమాదం; ఒకరి మృతి

మహబూబాద్ జిల్లా మరిపెడలో.. రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్ కలక్వర్ట్‌కు ఢీకొనింది. ఈ ఘటనలో.. ఒకరు మృతి చెందగా... డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా..బయ్యారం మండలం ఇస్తాళ్లపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు.

విజయవాడ విద్యుత్ సౌధ వద్ద  పోలీసు బందోబస్తు

విజయవాడలో విద్యుత్ సౌధావద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగులు.. ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నా కూడా... పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు రోడ్లపై బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో రెండు వేల మంది పోలీసులతో మోహరించారు. 

తిరుపతి జిల్లాలో తాటికోన గిరిజన విద్యార్థుల ఆందోళన

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తాటికోన గిరిజన విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని నిరసన చేపట్టారు. జగన్ అంకుల్ రోడ్డు వేయించండి ప్లీజ్ అంటూ వేడుకున్నారు. తాటికోన నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాల ఉందని స్కూల్‌కు వెళ్లాలంటే మోకాళ్ల లోతు గుంతలు, దుమ్ము ధూళితో ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. గత వారం ఆటో బోల్తా పడి తమ పిల్లలకు గాయాలయ్యాయని తల్లిదండ్రులు అన్నారు.  

కొడాలిని హైదరాబాద్ కు తరిమికొడతాం- జనసేన

మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ జనసేన నేతలు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ గురించి కొడాలి నాని అనుచితంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన్ను హైదరాబాద్ కు తరిమి కొడతామన్నారు. తమ దెబ్బతో కొడాలి హైదరాబాద్ లో శాశ్విత నివాసం ఏర్పాటు చేసుకుంటాడంటూ మండిపడ్డారు. తమ అధినేత నీతి నిజాయితీతో పార్టీ నడుతుంటే, క్యాసినోలు నిర్వహించే కొడాలి తమకు నీతులు చెప్పడమేంటేని విమర్శించారు. వంగవీటి రాధాకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నోరు విప్పలేదంటూ ఫైర్ అయ్యారు జనసేన నేతలు.  

రేషన్ డీలర్ల చర్చలు సఫలం; హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం

తెలంగాణ సర్కారుతో రేషన్ డీలర్ల చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్లతో మంత్రులు హరీష్, గంగుల కమలాకర్ చర్చలు జరిపారు. కమిషన్ 70 రూపాయల నుంచి 140 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు కరోనా టైంలో చనిపోయి డీలర్ల స్థానంలో కుటుంబసభ్యులకు డీలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించారు.

విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా?- నిషికాంత్ దూబే

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రసంగించారు. మోదీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టారు... ఇంతకీ విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా? అని ప్రశ్నించారు. ఇండియా ఫుల్‌ఫామ్‌ కూడా ఆ కూటమిలోని సభ్యులకు తెలియదని విమర్శించారు. నేను సావర్కర్‌ కాను.. క్షమాపణలు చెప్పనని రాహుల్‌ అంటున్నారు.. ఆయన ఎప్పటికీ సావర్కర్‌ కాలేరని నిషికాంత్ దూబే అన్నారు.

లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ప్రారంభ‌ం

లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ప్రారంభ‌మైంది. కాంగ్రెస్ పార్టీ నేత గౌర‌వ్ గ‌గోయ్ ఆ చ‌ర్చను ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చిందన్నారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు.  

ఏపీ మంత్రి అంబటిపై చిరంజీవి పరోక్ష విమర్శలు

ఏపీలో పరిస్థితులపై మెగాస్టార్‌ చిరంజీవి హాట్‌ కామెంట్‌ చేశారు.వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో పాల్గొన్న చిరు..ఏపీ మంత్రి అంబటిపై చిరంజీవి పరోక్షంగా సెటైర్లు వేశారు.నేతలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి,ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్నారు. పేదల కడుపు నింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిపెడితే అందరూ తలవంచి నమస్కరిస్తారని అన్నారు.అన్ని విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అంటూ కాస్త ఘాటుగానే అన్నారు.ఇదేదో పెద్ద సమస్యలా చూపించొద్దని విజ్ఞప్తి చేశారు.  

తెలంగాణ ప్రజల వికాసాన్ని కేంద్రం విస్మరించింది- నామా

తెలంగాణ అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల వికాసాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందు వల్లే ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు. సభలో చర్చ సందర్భంగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతామన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నేర్చకుండా అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. 

పల్నాడు జిల్లాలో జోరుగా లోకేష్‌ పాదయాత్ర

పల్నాడు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రస్తుతం గురజాల నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెయ్యిమంది మహిళలతో లోకేష్‌కు స్వాగతం పలుకుతున్నారు. కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో పాదయాత్ర ఓ పండుగలా కొనసాగుతోంది.  

పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వాలంటీర్

ఏపీలో వాలంటీర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటకు చెందిన శివప్రసాద్ అనే వాలంటీర్‌ ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను గర్భవతి చేశాడు. మూడేళ్లగా తన అవసరం తీర్చుకుని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ గొలుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు FIR కూడా నమోదు చేయలేదు.

నెల్లూరులో హై టెన్షన్‌

నెల్లూరులో హై టెన్షన్‌ నెలకొంది. ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సమి హుస్సేనిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేసినందుకే సయ్యద్ సమీ ని ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు మద్దతుగా నిలిచారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.సమీకి ఇంటికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

ఐఐటీ హైదరాబాద్లో ఆగని ఆత్మహత్యలు

ఐఐటీ హైదరాబాద్ లో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంటెక్ చదువుతున్న విద్యార్ధిని మమైత నాయక్... ఆత్మహత్య చేసుకుంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో తెలిపింది మమైత నాయక్. నెలలోనే ఇది రెండో ఆత్మహత్య!. ఇటివల కార్తీక్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఓ విద్యార్ధిని సైతం సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. 

Yuvagalam: 178వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుోతంది. ఇవాల్టితో పాదయాత్ర 178వ రోజుకు చేరింది. ఇప్పటివరకు లోకేష్ 2354 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ జూలకల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం పందిటివారిపాలెం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. భోజన విరామం అనంతరం జూనపాడు నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తారు. సాయంత్రం ఆరుగంటలకు పిడుగురాళ్ల కన్యాకపరమేశ్వరి గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మహబూబాబాద్  లో రోడ్డు ప్రమాదం.. ఒకరు  మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్ కలక్వర్ట్‌కు ఢీకొనింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా బయ్యారం మండలం ఇస్తాళ్లపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. 

విజయవాడలో 144 సెక్షన్ అమలు

ఇవాళ విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు విజయవాడలో 144 సెక్షన్‌ అమలు చేస్తోంది. అయితే మహాధర్నా విరమించుకున్నామని ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఇవాళ వర్క్ టు రూల్ పాటించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. అయినా విజయవాడలో భారీగా పోలీసులను మోహరించారు. అటు విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ సౌధ పూర్తిగా పోలీసులు నిఘా నీడలో ఉంది.  

Uppal: శిల్పారామంలో చేనేత భవన్‌ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

75 ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్ కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని అన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నేటి నుంచే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలవుతుందన్నారు. ఇక చేనేత మీద ప్రధాని మోదీ 5 శాతం జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

అక్రమాల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు- ఉండవల్లి అనూష

వైసీపీ అక్రమాల్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఐ-టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఫైరయ్యారు. మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. త్వరలో నగిరి ఓటర్లు ఆమెకు తగిన బుద్ది చెబుతారని అన్నారు. నాలుగేళ్లలో అక్రమంగా ఎంతో సంపాదించారని ఆరోపించారు. నగిరి నియోజవర్గం ఇసుక, మట్టి దందాలకు నిలయంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియా చెలరేగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం

ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఖమ్మం వెళ్లిన పువ్వాడకు ఘన స్వాగతం లభించింది. మున్నేరు కరకట్ట కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో పరివాహక ప్రాంత వాసులు మంత్రిని గజమాలతో సత్కరించారు. ఇక ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకుంటారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని బెన్‌ఫిట్స్‌ లభిస్తాయన్నారు. ఇక ఆర్టీసీ విలీన బిల్లుకు ఎంతో మంది అడ్డుపడాలని చూశారని పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుంగనూరు ఘటనపై మండిపడుతోన్న టీడీపీ నేతలు

పుంగనూరు ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు చంద్రగిరి టీడీపీ నేతలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. విధ్వంసానికి కారకులైన వైసీపీ నేతలపై ఒక్క కేసు పెట్టలేదని మండిపడ్డారు. టీడీపీకి చెందిన వంద మందిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు

ఏపీలో అంతకంతకు పెరుగుతున్న రైతు రుణ భారం

ఏపీలో రైతు రుణ భారం అంతకంతకు పెరిగిపోతుంది. రైతులపై రుణ భారంలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. లోక్‌ సభా వేదికగా ఈ విషయాలను కేంద్రం వెల్లడించింది. వాణిజ్య, సహకార, ప్రాతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి ఏపీ రైతుల రుణాల మొత్తం 2లక్షల 43వేల 73 కోట్లుగా తెలిపింది. ఈ జాబితాలతో తమిళనాడు 3లక్షల కోట్లకు అప్పుతో తొలిస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ రైతుల రుణ భారంలో లక్షా 12వేల 492 కోట్లతో ఎనిమిదో స్థానం దక్కించుకుంది. దేశంతో మొత్తం 9 రాష్ట్రాల్లో లక్ష కోట్లకు మించి రైతుల రుణ భారం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

లోకేష్‌ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తోంది

పల్నాడు జిల్లాలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది.ప్రతి గ్రామాల్లో మహిళలు, యువత లోకేష్‌ను స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు టీడీపీ సీనియర్‌ నేత యరపతనేని శ్రీనివాస రావు. రేపు పిడుగురాళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, వేయి మంది మహిళలు బోనాలతో స్వాగతం పలకనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక లేజర్‌ షో ఏర్పాటు చేశామని తెలిపారు. 5వేల మంది యువకులు యువగళం టీ షర్టులతో లోకేష్‌కు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.  

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన జరిగింది. అల్తాఫ్‌ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అల్తాఫ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని దుండగులు. ఓ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అల్తాఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

శ్రీకాకుళం కలెక్టరేటు వద్ద వీఆర్ఏల నిరసన దీక్ష

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేటు వద్ద వీఆర్ఏలు నిరసన దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పేస్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పనిచేస్తూ మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. రికవరీ చేసిన డీఏలను తిరిగి చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. 

Chandrababu Naidu: గుండగోల దగ్గర  ఘన స్వాగతం పలికిన మహిళలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు బ్రహ్మరధం పట్టారు. ఉంగటూరు నియోజక వర్గం గుండగోల దగ్గర ఘన స్వాగతం పలికారు మహిళలు.టీడీపీ నేతలు గన్ని వీరాంజనేయులు, మాగంటి బాబు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధినేతకు స్వాగతం పలికారు.ఇవాళ గోపాల పురం, పోలవరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందుకు సంబందించి భారీ ఏర్పాట్లును చేసింది టీడీపీ. పోలవరం నిర్వాసితులతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం దేవర పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు.  

AIIMS FIRE: దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని రెండన అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఎండోస్కోపీ గది నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ గది ఎమర్జన్సీ వార్డుపైన ఉంది. మంటలు చెలరేగిన గది నుంచి రోగులను వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయటానికి ఆరు అగ్ని మాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.

కాంట్రాక్ట్ కార్మికులను చితకబాదిన పోలీసులు

తిరుపతిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను చితకబాదారు పోలీసులు. శాంతియుత ర్యాలీని కొనసాగిస్తున్న వారిపై లాఠీ ఝుళిపించారు. పద్మావతి కల్యాణ మండపం ముందు కార్మికులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులను తోసుకుంటునే భారీ ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పదివేల మందికిపైగా కార్మికులు ఎస్పీడీసీఎల్ కార్యాయాలన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.

ప్రమాదకర వంతెన పై ప్రయాణాలు సాగిస్తున్న ప్రజలు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామ ప్రజలు ప్రమాదకర వంతెనపై ప్రయాణాలు సాగిస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు చేయాలన్నా కేబుల్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. తాళ్లు తెగిపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. 2003లో బకింగ్ హమ్ కాలువపై 20 లక్షల వ్యయంతో టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. 2021లో వచ్చిన వరదలతో కేబుల్‌ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో తాళ్లు తెగిపోయాయి.అప్పటి నుంచి తిరిగి కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న గ్రామస్తులు మండిపడుతున్నారు. 

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మురుగు కాలువలోని బురద తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు వేశారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఈ నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. నెలరోజులుగా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు మున్సిపల్ ఆఫీస్ కు గేట్లు వేశారు. దీంతో ఆ గేట్లు ముందు బురద జల్లి నిరసన తెలిపారు టీడీపీ నేతలు. 

పార్లమెంట్‌ కు రాహుల్ రీ - ఎంట్రీ

పార్లమెంట్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ. వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు సభకు హాజరు కానున్నారు. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేసింది లోక్‌సభ కార్యాలయం. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.గతంలో పరువునష్టం కేసులో సురత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం రాహుల్‌కు భారీ ఊరట లభించింది. దీంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశం లభించింది.