- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్‌లో ఓ నకిలీ మహిళా కానిస్టేబుల్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ ఐడీ కార్డ్ తో పోలీసుగా చెలామణి అవుతున్న అశ్విని అనే మహిళను ఆదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ వరకు చదివి జల్సాలకు అలవాటు పడ్డ ఆమె ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడీ కార్డ్ సృష్టించింది. ఇక ముగ్గురు యువకులను ప్రేమించిన అశ్విని వారిని చోరీలకు ఉసిగొల్పింది. అంతే కాదు పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేసింది. లేటెస్ట్ గా అభిషేక్ అనే యువకుడిని ట్రాప్ చేసిన అశ్విని తనను పెళ్లి చేసుకోవడం లేదని ఆసిఫ్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు ఫేక్ కానిస్టేబుల్ గుట్టు రట్టు చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని వారాహి జోరు కొనసాగుతోంది. రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పవన్ కళ్యాణ్ విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, ఎన్‌జీవో ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం జనవాణి కార్యక్రమంలో భాగంగా స్థానిక సమస్యలు, ఇబ్బందులపై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత వీర మహిళా విభాగంతో పవన్ సమావేశం కానున్నారు. సాయంత్రం చేబ్రోలు చేనేత కార్మికులతోనూ సమావేశం కానున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మృతిపై మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించారు. ట్రిపుల్ ఐటీలో వరుస ఘటనలు బాధాకరమన్నారు. మొన్న జరిగిన ఘటనపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదన్న మంత్రి పూర్తి సమాచారం వచ్చాక మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు. ఏది ఏమైనా విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు మంత్రి సబిత.

నేడు సిద్దిపేటలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. సిద్దిపేటలో 63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సీసీ, బీటీ రోడ్లతో పాటు మురికి కాల్వల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా ఐటీ టవర్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. దశాబ్ది కాలంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తారు.

నేడు సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాగపూర్‌కి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో తొలి కార్యాలయం ప్రారంభంకానుంది. కాగా.. ఇప్పటికే ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించింది. తాజాగా మహరాష్ట్రలోని నాగపూర్‌లో కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్‌తోపాటు నాందేడ్ నగరాల్లోనూ కార్యా లయాలను ఏర్పాటు చేయనున్నారు.

భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ సరికొత్త కార్యక్రమం చేపట్టింది. మహానాడులో ప్రకటించిన మిని మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 5 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు పర్యటించనున్నారు. ఐదు బస్సులపై మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను స్టిక్కర్‌ల రూపంలో అంటించనున్నారు. ఈ యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్ వాయిదా పడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండటంతో ఖమ్మం సభను వాయిదా వేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. భారీ వర్షాలపై అమిత్‌షా పర్యవేక్షించాల్సి ఉన్నందున.. ఆయన సభకు రాలేకపోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సభను వాయిదా వేశామని వెల్లడించారు. త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ప్రధాని బహిరంగ సభను కూడా ఖమ్మంలోనే నిర్వహించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఊరు చిన్నదే అయినా వారి ఆశయం మాత్రం చాలా పెద్దది. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిపై సమరభేరి మోగించారు ఆ గ్రామస్తులు. ఊరిలో మద్యం సేవించినా.. విక్రయించినా 50వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు సమాచారం ఇచ్చే వారికి 5వేల నజరానా ప్రకటించారు. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి వాసులు అమలు చేస్తున్న మద్యం ఆంక్షలు వారి జీవితాల్లో వెలుగును నింపాయంటున్నారు.ఈ చర్య వల్ల నర్సన్నపల్లి గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

చీకటి పడిందంటే చాలు అక్కడ జనసంచారం ఆగిపోతుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ భయం గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. డ్రగ్స్ మాఫియాతో అక్కడివాసులు వణికిపోతున్నారు. దారి దోపిడీలు, అడ్డు తగిలితే దాడులకు తెగబడుతున్నారు. దీంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటం ఉధృతం అవుతోంది. హర్యానాలోని కురుక్షేత్రలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. ఈసారి ఉద్యమంలో హర్యానా రైతులు ముందున్నారు. గత కొన్ని రోజుల నుంచి రైతులు వివిధ ప్రాంతాల నుంచి కురుక్షేత్రకు చేరుకుంటున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసుల బందోబస్తు పెంచారు. ఎక్కడికి అక్కడ రైతులను నిలువరించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముగ్గురు చనిపోగా.. దాదాపు 25 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్ మోగుతూనే ఉంది. ఇక క్రైవీ రిహ్‌పై రష్యా దాడులు చేయడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు.

నీట్‌లో మొదటి ర్యాంక్ సాధించాడు శ్రీకాకుళానికి చెందిన వరుణ్ చక్రవర్తి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన వరణ్ చక్రవర్తి ప్రాధమిక స్థాయినుంచి మంచి ఫలితాలు సాధించాడు. ఇంటర్‌లో 987 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో వరుణ్ చక్రవర్తికి మొదటి నుంచి ప్రోత్సాహం లభించింది.

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సింప్లిసిటీని చాటుకున్నారు. సామాన్యుడి వలే సాధారణ ట్రక్కులో ప్రయాణించారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు సాగిన ట్రక్కు యాత్రలో.. డ్రైవర్ల పనితీరు, జీవన విధానం వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు

విశాఖ అనకాపల్లి మధ్య తాడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గూడ్స్‌లో బొగ్గు ఉన్న కారణంతో, హైడ్రాలిక్ జాకీల సహాయంతో వేగన్స్‌ని పట్టాలపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీంతో అటు వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

కుప్పం టీడీపీలో కొత్తరక్తం ఉరకలు వేస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రతో మొదలైన ఉత్సాహం.. చంద్రబాబు కోసం ఎదురు చూస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి మూడ్రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు కుప్పంకు చేరుకుంటారు. సాయంత్రం 7గంటల 30నిమిషాల వరకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఆర్టీఏ అధికారులు, ప్రైవేట్ బస్సుల మీద కొరడా ఝలిపించారు. ఎలాంటి ఫిట్‌నెస్ అనుమతులు లేని బస్సులను సీజ్ చేసారు. ఇరవైకి పైగా బస్సులను చెక్ చేయగా అందులో నాలుగు బస్సులకు ఎలాంటి అనుమతుల లేనట్లు గుర్తించారు అధికారులు. భువనగిరి, చౌటుప్పల్‌లో పద్దెనిమిది బస్సులను సీజ్ చేసామన్నారు భువనగిరి ఆర్‌టీఏ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు.

సీఎం కేసీఆర్ బుధవారం నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల్లో 1571 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించనున్నారు. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎర్రమంజిల్ క్వాటర్స్ స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం 32.16 ఎకరాల్లో నిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే మరో 2వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం నాలుగు వేల పడకలతో నిమ్స్ దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రికి అవతరించనుంది.

నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభంకానుంది. అన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్,.సత్యదేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసైనికులు భారీగా ఏర్పాట్లు చేశారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు కారును ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

జమ్ముకశ్మీర్‌లోని దోడా కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానాతో పాటు పంజాబ్, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూకంప తాకిడికి జమ్ముకశ్మీర్‌లో పలు ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. దోడాలోని ఓ సబ్ డిస్ట్రిక్ హాస్పిటల్‌లో రోగులకు గాయాలయ్యాయి.

రేపట్నుంచి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల 84 వేల మంది గర్భిణులు లబ్ధి పొందనున్నారు.గత ఏడాది డిసెంబరులో కామారెడ్డిలో మంత్రి హరీష్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గతంలో 9 జిల్లాల్లో ఇవ్వగా.రేపట్నుంచి మరో 24 జిల్లాల్లో పథకం అమలు చేయబోతున్నారు.

వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ఫైరయ్యారు. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు వైసీపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. విశాఖ వేదికగా వైసీపీ సర్కార్‌పై అమిత్ షా చెప్పిన మాటలన్నీ వాస్తవమేనన్నారు. ఇక వైసీపీ నేతల భూ కబ్జాలు పెరిగిపోయాయని బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.ఎన్నికల్లో వైసీపీ నేతల భూకబ్జాల అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తామన్నారు.

తిరుపతి గంగమ్మ తల్లి లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. 20 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు భక్తులు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరస్వామి చెల్లెలుగా విరాజిల్లుతున్న తిరుపతి గంగమ్మతల్లి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతర ముగిసిన తర్వాత నాలుగో మంగళవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వివిధ వేషధారణలతో గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారి సేవలో తరిస్తున్నారు.

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎర్రమంజిల్ క్వాటర్స్ స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రేపు భూమి పూజ చేయనున్నారు. మొత్తం 32.16 ఎకరాల్లో నిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే మరో 2వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం నాలుగు వేల పడకలతో నిమ్స్ దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రికి అవతరించనుంది.

నెల్లూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల వచ్చినా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించినా ఆ ప్రభావం నెల్లూరు జిల్లాలో కనిపించడం లేదు.

జోగులంబ గద్వాల జడ్పీ ఛైర్మన్ కార్యాలయం ముందు మహిళల ఆందోళనకు దిగారు. జడ్పీ ఛైర్మన్ పీఏ పరమేష్ తమను మోసం చేశాడని ఓ మహిళ ఆరోపించారు. తనతో పాటు మరో మహిళలను శారీకంగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జడ్పీ ఛైర్మన్ కార్యాలయం ముందు మహిళా సంఘాలతో కలిసి బాధితులు ధర్నాకు దిగారు. పరమేష్ తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... బాధితులకు నచ్చజెప్పి స్టేషన్‌కు తరలించారు.

ఆటోలో ఉన్న ప్రయాణికుల నుండి బంగారం దోపిడీ చేసిన ఘటన, కాకినాడ జిల్లాలో కలకలం సృష్టించింది. సామర్లకోట నుండి పిఠాపురం వైపు వెళ్తున్న ఆటోను దారి దోపిడి చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దొంగలు ఆటో డ్రైవర్‌పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ప్రయాణిలను గన్‌లతో బెదిరించి మహిళల వద్ద నుండి బంగారు ఆభరణాలు అపహరించారు బీహర్ కు చెందిన దొంగలు.

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో చల్మేడ లక్ష్మీ నరసింహరావు, ఎమ్మెల్యే రమేష్ మధ్య వివాదంతో రాజకీయాలు వేడెక్కాయి. వీరిద్దరూ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సొంత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు చల్మేడ నరసింహారావు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు, అభిమానులు హాజరయ్యారు. అయితే.. పార్టీ కార్యాలయం ప్రారంభించడమనేది తన వ్యక్తిగతమని, పార్టీ ఆదేశిస్తే..ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానన్నారు.

కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ : వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు,డీఎస్పీలు తో జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్ లో ఉన్నారు,పవన్ పర్యటనకు ఎటువంటి అభ్యంతరం లేదు, చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చు,భద్రత కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రం ఆడిగాము: కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరంలో ఓ అల్లుడు వీరంగం సృష్టించాడు. కుటుంబ కలహాలతో భార్య, అత్త, మామపై కత్తితో దాడి చేశాడు అల్లుడు చక్రపాణి. ముగ్గురిని చేతులపై నరికాడు. బాధితుల కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకునే లోపే చక్రపాణి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని స్థానికులు అంబులెన్స్‌లో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. భార్య, అత్త, మామపై దాడి చేసిన చక్రపాణి కోసం గాలిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ దళారి రైతులకు టోకరా వేశాడు. శంకర్‌రావు అనే దళారి మూడు కోట్ల రూపాయలతో ఉడాయించాడు. రైతుల నుంచి మిర్చి, పత్తి, మొక్కజొన్నలు కొన్న శంకర్‌రావు వారికి డబ్బులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారయ్యాడు. శంకర్‌రావు జంప్ కావడంతో లబో దిబోమంటున్నారు రైతులు. నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. కొన్నిరోజులుగా కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. దీంతో కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. డయల్ 100కి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆదాయపన్ను కార్యాలయంలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. చివరికి బాంబు లేదని గుర్తించిన పోలీసులు.. అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఫోన్‌కాల్ ఎక్కడ్నుంచి వచ్చిందో కనుక్కునే పనిలో పడ్డారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు గంజాయి ముఠాలను అరెస్ట్ చేశారు ఎస్‌వోటి పోలీసులు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. గాజుల బాక్స్ మధ్యలో గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మూడు అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాలకు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 910 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

అన్నమయ్య జిల్లా గౌడ సానివారిపల్లిలో రైతుల నిరసన దీక్షకు దిగారు. సొంత నిధులతో రైతులు వేయించుకున్న రహదారిని వైసీపీ నేతలు జేసీబీలతో తవ్వించడంపై మండిపడుతున్నారు. వైసీపీ నేతల దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన దీక్షకు దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత నిధులతో పొలాలకు వెళ్లేదుకు వేసిన రహదారిని ధ్వంసం చేశారని మండిపడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో వాహనదారులకు యోగి ప్రభుత్వం గొప్ప శుభవార్త తెలిపింది. గత ఐదేళ్లగా ఉన్న పెండింగ్ చలానలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలం నుంచి చలానాలను కట్టకుండా ఉన్న లక్షల మంది వాహన దారులకు ఈ నిర్ణయంతో ఉపశమనం పొందినట్లైంది. జనవరి, 1, 2017 సంవత్సరం నుంచి 30,01,2021 వరకు ఉన్న చలానాలను రద్దు చేసింది. కోర్టులో ఉన్న కేసుల వారికి కూడా ఈ ఆఫర్ లభిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


